ప్రవక్త మూసా (అస) అల్లాహ్ తో ‘‘ఓ అల్లాహ్.. స్వర్గంలో నాతోపాటు ఎవరుంటారు?’’ అని అడిగారు. ‘‘ఫలానా కసాయి స్వర్గంలో నీతోపాటు ఉంటాడు’’ అని అల్లాహ్ బదులిచ్చాడు. ప్రవక్త ముహమ్మద్ (స)కు పూర్వపు ప్రవక్తలలో మూసా ఒకరు. ప్రవక్త మూసా (అలై) ఆ కసాయి ఎలా ఉంటాడో అని చూసేందుకు వెళ్లారు. కసాయి అప్పుడే మాంసాన్ని అమ్మి మిగిలిన మాంసపు ముద్దను సంచిలో వేసుకుంటున్నాడు. అతన్ని చూసి మూసా ‘ఈ కసాయి నాతో స్వర్గంలో ఉంటాడా’ అని ఆశ్చర్యపోయారు. మూసా (అలై) ఆ కసాయిని వెంబడించారు. కసాయి ఇంటికి చేరుకోగానే ప్రవక్త మూసా కసాయి అనుమతి తీసుకుని ఇంట్లోకి వెళ్లారు.
ఆ కసాయి స్వర్గానికి అర్హత సాధించేంత గొప్ప పనులేమి చేశాడో చూద్దామనే ఆత్రుతతో ఉన్నారు. అంతలోనే కసాయి తన సంచిలో నుంచి మాంసం ముద్ద తీశాడు. ముక్కలుగా కోసి కూర తయారు చేశాడు. గోధుమపిండిని బాగా కలిపి వేడి వేడి రొట్టెలు సిద్ధం చేశాడు. రొట్టెలను పళ్లెంలో వేసుకుని కూరను గిన్నెలో వేసుకున్నాడు. పక్కనే మంచంలో మూలుగుతున్న వృద్ధురాలిని ఎంతో ఆప్యాయంగా లేపి కూర్చోబెట్టాడు. తన ఒళ్లో కూర్చోబెట్టుకుని రొట్టెను ముక్కలు చేసి ఆమెకు తినిపించసాగాడు. కడుపారా తినిపించి మూతిని శుభ్రం చేసి నీళ్లు తాగించి తిరిగి నిద్రపుచ్చబోయేసరికి ఆ ముసలామె ఏవో మాటలు చెప్పింది.
ఆ వృద్ధురాలు చెప్పిన మాటలు ప్రవక్త మూసా (అలై)కు వినిపించలేదు. మూసా ఎంతో ఆత్రుతతో ‘‘ఈమె ఎవరు, ఏదో చెబుతుంది ఏమిటి?’’ అని అడిగారు. ‘‘నేను ఒక కసాయిని. ఈమె నా కన్నతల్లి. రోజూ బయటికెళ్లేముందు అమ్మకు అన్నిసేవలు చేసి వెళతాను. తిరిగి ఇంటికి వచ్చాక అమ్మ అవసరాలన్నీ తీరాకే నా పిల్లల, నా అవసరాలు తీర్చుకుంటాను.‘‘ అని కసాయి చెప్పాడు. ‘‘మీ అమ్మ నీ చెవిలో ఏమి చెప్పింది?’’ అనడిగారు. ‘‘రోజూ చెప్పేదే అది. ‘‘అల్లాహ్ నిన్ను స్వర్గంలో మూసా (అలై) వెంట ఉంచుగాక‘‘ అని రోజూ దీవిస్తుంటుంది. అయినా నేనొక చిన్న కసాయిని. నేనెక్కడా, ప్రవక్త మూసా (అలై) ఎక్కడా! ఇది అయ్యే పనేనా’’ అని నవ్వుకున్నాడు. ‘‘నీ తల్లి దీవెనను అల్లాహ్ నిజం చేశాడు’’. అంటూ ప్రవక్త మూసా (అలై) కళ్లలో నీళ్లు తుడుచుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment