అల్లా అన్నందుకు ఫ్లైట్ దించేశారు!
పారిస్: పారిస్, ఇతర ఉగ్రదాడుల నేపథ్యంలో ఇటీవల 'ఇస్లామోఫోబియా' పెరిగిపోయింది. ముఖ్యంగా విమానప్రయాణాల్లో ఇది ఒకింత ఎక్కువైందనే చెప్పాలి. తాజాగా పారిస్ నుంచి అమెరికాలోని సిన్సినాటీకి వెళ్తున్న ఓ పాకిస్తానీ-అమెరికన్ జంటకు ఇదే తరహాలో చేదు అనుభవం ఎదురైంది. తమ పదో పెళ్లిరోజు సందర్భంగా పారిస్లో సంతోషంగా గడిపి తిరిగి అమెరికా వెళ్తుండగా.. అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్లైన్స్ సిబ్బంది వారిని ఫ్లైట్ దించేశారు.
బాధితులు నజియా మీడియాతో తెలిపిన వివరాల ప్రకారం.. తన భర్త ఫైజల్లో ఆమె పారిస్ నుంచి సిన్సినాటీ వెళ్లే విమానంలో ప్రయాణానికి సిద్ధంగా ఉంది. ఫ్లైట్ మరికాసేపట్లో బయలుదేరుతుందనగా.. హిజాబ్ ధరించిన ఆమెపై విమాన సిబ్బంది అనుమానం వ్యక్తం చేశారు. దీనికి తోడు ఫైజల్కు చెమట రావడం గమనించిన విమానసిబ్బంది వారిపై మరింత అనుమానంతో పైలట్కు ఈ విషయాన్ని తెలిపినట్లు ఆమె వెల్లడించింది. దీంతో.. మీరు లగేజీతో పాటు విమానం నుంచి బయటకు వెళ్లాలని సిబ్బంది కోరారని ఆమె వెల్లడించింది. తాము 'అల్లా' అనడం వల్లనే విమానసిబ్బంది ఫ్లైట్ నుంచి దించేశారని ఆమె ఆరోపించింది.
ఈ చర్యను కేవలం ఇస్లమోఫోబియాగా నజియా వెల్లడించింది. అనంతరం వారిని ఫ్రెంచ్ పోలీస్ అధికారి విచారించాడని, వారి పారిస్ టూర్ గురించి ప్రశ్నించిన అధికారి.. ఎలాంటి సమస్యా లేదని తెలిపినట్లు నజియా పేర్కొంది. ఈ చర్యపై ముస్లిం సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. డెల్టా ఎయిర్లైన్స్ సిబ్బందిపై కౌన్సిల్ ఆన్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్(సీఏఐఆర్) సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది. అయితే.. దీనిపై డెల్టా ఎయిర్లైన్స్ సమాధానమిస్తూ.. 'తమ సంస్థలో ప్రయాణికులపట్ల ఎలాంటి వివక్షతకు తావు లేదు' అని ప్రకటించింది.