నాడు ఒక్క ఒంటె...నేడు ముప్ఫై ఒంటెలు | Zakat Collected from Wealthy Muslims | Sakshi
Sakshi News home page

నాడు ఒక్క ఒంటె...నేడు ముప్ఫై ఒంటెలు

May 17 2019 12:10 AM | Updated on May 17 2019 12:10 AM

Zakat Collected from Wealthy Muslims - Sakshi

ఒకసారి ప్రవక్త మహనీయులు (స) తన శిష్యుడైన  ఉబై బిన్‌ కాబ్‌ (రజి) ను సంపన్న ముస్లిముల నుంచి జకాత్‌ వసూలు చేసే పని అప్పజెప్పారు. ఆయన మదీనా పరిసర ప్రాంతాలు తిరిగి సంపన్న ముస్లిముల నుంచి జకాత్‌ వసూలు చేసేవారు. ఇలా సేకరించిన సామూహిక జకాత్‌ ను పేద ప్రజలకు పంపిణీ చేసేవారు. ఒకసారి ఆయన జకాత్‌ సేకరించేందుకు వెళ్లారు. అక్కడ ఒక వ్యక్తి దగ్గర కొన్ని ఒంటెలు  ఉన్నాయి. అన్నింటినీ లెక్కవేసి చూడగా ఏడాది వయస్సున్న ఒక చిన్న ఒంటె పిల్లను జకాత్‌ గా నిర్ణయించారు. ‘‘ఈ ఒంటె ప్రయాణానికీ పనికి రాదు, పాలుకూడా ఇవ్వదు. మొదటిసారి దేనికీ పనికిరాని ఈ చిన్న ఒంటె పిల్లను అల్లాహ్‌ మార్గంలో దానం చేయడం నాకు ఇష్టం లేదు. శ్రేష్టమైన దానిని జకాత్‌గా ఇవ్వదలుచుకున్నాను; పాలిచ్చే ఈ బలిసిన ఈ ఒంటెను తీసుకెళ్లండి.

’ అని ఆ ఒంటెల యజమాని ఉబై (రజి) ను ప్రాధేయపడ్డాడు. ‘‘ఎక్కువ ఇవ్వదలుచుకుంటే మదీనాలో ప్రవక్త (స) మహనీయుల వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.‘ అని అతనికి చెప్పి వెళ్లిపోయారాయన. ‘‘దైవ ప్రవక్తా; నా జీవితంలో ఇంతవరకూ నేను జకాత్‌ చెల్లించలేదు. ఇప్పుడు జకాత్‌ చెల్లించేంతటి స్థోమతకు చేరుకున్నాను. నా ఒంటెలన్నీ లెక్కగట్టగా ఏడాది వయస్సున్న చిన్న ఒంటె పిల్ల జకాత్‌ గా నిర్ణయమైంది. దానికి బదులుగా బలిష్టమైన ఈ ఒంటెను స్వీకరించండి’’ అని ప్రవక్త (స)కు మొరపెట్టుకున్నాడు. ‘‘ఇష్ట పూర్వకంగా ఎక్కువ మొత్తంలో జకాత్‌ ఇవ్వాలనుకుంటే ఎలాంటి సంకోచం లేకుండా స్వీకరిస్తాను. దీనికి తగ్గ ప్రతిఫలం అల్లాహ్‌ తప్పకుండా ఇస్తాడు.

‘‘ అని ప్రవక్త (స) అతని వ్యాపారాభివృద్ధికోసం అల్లాహ్‌ను ప్రార్థించారు. కొన్ని సంవత్సరాల తరువాత ఉబై బిన్‌ కాబ్‌ (రజి) ఆ జాతి వద్దనుంచి వెళుతుండగా ఆ వ్యక్తి వృద్ధాప్యంలో కనపడ్డాడు. పదుల సంఖ్యలో ఉండే అతని ఒంటెలు వందల సంఖ్యలో పెరిగిపోయాయి. ఏటా ఒక్క ఒంటెతో జకాత్‌ ప్రారంభించిన అతను దానిని పెంచుకుంటూ పోయి 30 బలిష్టమైన ఒంటెలను ఇప్పుడు జకాత్‌ రూపంలో దానం చేస్తున్నాడు. దాన ధర్మాల వల్ల సంపద వృద్ధి చెందుతుందన్నది ఖుర్‌ ఆన్‌ బోధన. దైవమార్గంలో ఖర్చుపెట్టే ఒక్కో రూపాయికి ఎన్నో వందలు లెక్కకట్టి తిరిగి మనకు అందుతుందన్నది ఈ గాథ తెలియజేస్తుంది. 
 – అబ్దుల్‌ మాజిద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement