Zakat
-
కరోనా సమయంలో పేదలను ఆదుకునే జకాత్
రమజాన్ మాసం ఈ సారి కరోనా సంక్షోభసమయంలో వచ్చింది. సాధారణంగా ముస్లిములు జకాత్‌ను పవిత్రమైన రమజాన్ మాసంలో చెల్లిస్తుంటారు. కానీ, కరోనా విపత్తు వచ్చి పడిన తర్వాత, వేలాది వలస కార్మికులు రోడ్లపై తమ సొంతూళ్ళకు పిల్లాపాపలతో కాలినడకన బయలుదేరిన విషాద దృశ్యాలు ముందుకు వచ్చిన తర్వాత, అనేకమంది లాక్డౌన్ వల్ల తినడానికి తిండి లేక అలమటిస్తున్నారని తెలిసిన తర్వాత చాలా మంది ముస్లిములు పేదలకు అన్నదానాలు ప్రారంభించారు. పేదల కోసం ఖర్చు పెట్టడానికి రమజాన్ వచ్చే వరకు ఆగవలసిన పనిలేదని, కరోనా విపత్తు ముంచుకు వచ్చింది కాబట్టి వెంటనే జకాత్ చెల్లించాలని ధర్మవేత్తలు ప్రకటించారు. ఈ ప్రకటనల ప్రభావంతో అనేకమంది తమ తమ జకాత్ ఎంత ఉందో లెక్కించి దానధర్మాలకు ఖర్చు చేయడం ప్రారంభమయ్యింది. నిజం చెప్పాలంటే రమజాన్ మాసం ఆర్థికవ్యవస్థకు గొప్ప వేగాన్నిస్తుంది. భారీగా క్రయవిక్రయాలు జరుగుతాయి. ముస్లిములు ఈ మాసంలో దానధర్మాలకే కాదు, షాపింగ్ కోసం కూడా ఖర్చుపెడతారు. తక్కిన పదకొండు నెలల్లో జరిగే వ్యాపారం కన్నా ఈ ఒక్క నెలలో జరిగే వ్యాపారం చాలా ప్రాంతాల్లో చాలా ఎక్కువ. ద్రవ్యం మార్కెటులో చలామణీలోకి వెళుతుంది కాబట్టి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఆర్ధికవ్యవస్థ బలం పుంజుకుంటుంది. కాని ఈ సారి రమజాన్ మాసం కోవిద్ 19 లాక్ డౌన్లో వచ్చింది. ఈ లాక్డౌన్, భౌతిక దూరాల నియమాలను పాటించడం చాలా అవసరం. అంటు వ్యాధుల విషయంలో ప్రవక్త ముహమ్మద్ (స) ప్రవచనాలు, సంప్రదాయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అంటువ్యాధి ప్రబలిన ప్రాంతం నుంచి ప్రజలు బయటకు వెళ్ళరాదని, ఆ ప్రాంతానికి బయటి వారు రాకూడదని ప్రవక్త స్పష్టంగా చెప్పారు. లాక్ డౌనంటే ఇదే కదా. కాబట్టి కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌కు కట్టుబడి, భౌతికదూరం పాటిస్తూ రమజాన్ మాసాన్ని దైవారాధనలో గడపవలసి ఉంది. ఆ విధంగా కరోనా మహమ్మారిని నిరోధించాలి. సాధారణ పరిస్థితుల్లో మాదిరిగా ఇఫ్తార్ పార్టీలు, సామూహిక ప్రార్థనలు చేయరాదు. ఎవరి ఇంట్లో వారు నమాజులు చదువుకోవాలి. ఇలా ఇంటికి పరిమితం కావడమే ధర్మాన్ని పాటించడం. ఒకçప్పటి కాలంలో ప్రజలు తమ చేయి గుండెలపై పెట్టుకుని ఒకరికొకరు అభివాదం తెలిపేవారు. ఆ పద్ధతి పాటించడం శ్రేయస్కరం. ఇక జకాత్ విషయానికి వస్తే, ఇప్పుడు జకాత్ 60 వేల కోట్ల రూపాయలకు పైబడి పంపిణీ అవుతుందని పలువురి అంచనా. జకాత్ మాత్రమే కాకుండా ఇతర దానధర్మాలు, అన్నదానాలు, ఆహారపంపిణీ వంటివి కలుపుకుంటే దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఈ విధంగా ఖర్చవుతాయని అంచనా. కోవిద్ 19 సంక్షోభ సమయంలో ఈ జకాత్ నిధులను సరయిన విధంగా ఖర్చు పెడితే పేదవారికి ఎంతైనా ఉపయోగపడతాయి. ముఖ్యంగా కరోనా కారణంగా, లాక్ డౌన్లో ఉపాధి కోల్పోయి, నగరాల్లో ఇరుక్కుపోయిన వలస కూలీలు, తమ తమ ఊళ్ళకు కాలినడకన బయలుదేరిన అనేకమంది కూలీల దీనావస్థను చాలా మంది చూశారు. ఇలాంటి ఎంతో మంది నిరుపేదలను ఈ నిధులతో ఆదుకోవచ్చు. అలాగే ఈ సారి ఇఫ్తార్ పార్టీలు ఇచ్చే అవకాశాలు లేవు, కాబట్టి ముస్లిములు ఏదైనా స్వచ్ఛంద సంస్థల ద్వారా ఆహారపొట్లాలు అన్నార్తులకు పంపిణీ చేసే కార్యక్రమానికి ఈ సొమ్ము ఇవ్వడం ద్వారా రమజాన్ శుభాలను పొందవచ్చు. జకాత్ అంటే..? ఇస్లాంకు మూలస్తంభాలుగా పరిగణించే ఐదు మౌలికవిధుల్లో జకాత్ ఒకటి. జకాత్ అనేది ఆర్థిక ఆరాధన. కాబట్టి స్తోమత ఉన్న ముస్లిములకు మాత్రమే విధి. స్తోమత ఉన్న ముస్లిములంటే ఎవరనే ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానముంది. ఏడున్నర తులాల బంగారం లేదా యాభైరెండున్నర తులాల వెండికి సమానమైన సంపద ఒక సంవత్సరం పాటు తన వద్ద ఉన్న వ్యక్తి ఆ సంపదపై రెండున్నర శాతం జకాత్ చెల్లించాలి. అంటే ఏడున్నర తులాల బంగారం వెల లేదా యాభై రెండున్నర తులాల వెండి వెల ఈ రెండింటిలో ఏది తక్కువగా ఉంటుందో అది జకాత్ చెల్లించడానికి నిసాబ్ గా భావించాలి. ఇప్పుడు మార్కెటు ధరల ప్రకారం ఏడున్నర తులాల బంగారం కన్నా యాభై రెండున్నర తులాల వెండి ధర తక్కువగా ఉంది. కాబట్టి యాభై రెండున్నర తులాల వెండి విలువ కన్నా ఎక్కువ సంపద తన వద్ద ఉన్న వ్యక్తి జకాత్ చెల్లించవలసి ఉంటుంది. ఈ రోజు వెండి విలువను బట్టి లెక్కేస్తే 23 వేల రూపాయల సంపద తన వద్ద ఉన్న వ్యక్తి జకాత్ చెల్లించవలసి ఉంటుంది. – అబ్దుల్ వాహెద్ -
జకాత్ .. జరూర్!
రంజాన్ మాసంలో జకాత్‌తోపాటు ఫిత్రాను విధిగా చెల్లించాల్సి ఉంటుంది. కుటుంబం యోగక్షేమం కోసం ప్రతి వ్యక్తి పేరు మీద కిలో 250 గ్రాముల గోదుమలు లేదా దానికి సమాన విలువ గల నగదును ఫిత్రాగా పేదలకు పంచుతారు. ఇవన్నీ రంజాన్ ముగింపు సందర్భంగా జరుపుకొనే ‘ఈదుల్ ఫితర్’ నమాజు కంటే ముందుగానే చెల్లించడం ఆనవాయితీ. స్టేషన్ మహబూబ్‌నగర్: రంజాన్ మాసం పుణ్యకార్యాలకు మారుపేరు. ఇస్లాం ఐదు మూల సిద్ధాంతాల్లో ‘జకాత్’ కూడా ఒకటి. జకాత్.. ఈ పేరు వింటే యాచకులు, గరీబుల (పేదల) ఆనందానికి హద్దులు ఉండవు.. జకాత్ ఎక్కడ.. అంటూ ఆరా తీసి వెంటనే అక్కడికి చేరుకుంటారు. ఓ స్థాయి దాటి డబ్బున్న ప్రతి ముస్లిం జకాత్ చెల్లించాలి. అదీ ఎవరికైతే డబ్బు అవసరమో వారికి ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఆదుకోవడమే. మహ్మద్ ప్రవక్త (స.అస) కాలం నుంచే ఈ జకాత్ పద్ధతి కొనసాగుతోంది. ఇదీ నిబంధన.. జకాత్ ఇవ్వడానికి ఒక ముస్లిం దగ్గర 60.755 గ్రాముల బంగారం, 425.285 గ్రాముల వెండి లేదా దీనికి సమాన విలువ గల నగదు (ఇళ్లు, భూమి, వాహనాలు, ఇతర వస్తువులు) ఏ రూపంలో ఉన్నా వారు జకాత్ ఇవ్వడానికి అర్హులు. ఉదాహరణకు ఒక్క ముస్లిం వద్ద రూ.16,200 కంటే ఎక్కువగా నగదు ఉండి ఏడాది దాటితే 40వ భాగం జకాత్‌గా చెల్లించాలి. జకాత్ ఫిత్రాల వల్ల పుణ్యం లభిస్తుందని పలువురు మతపెద్దలు పేర్కొంటున్నారు. పవిత్ర ఖురాన్ గ్రంథం కూడా పలుమార్లు ఈ విషయాన్ని ప్రబోధించింది. మనుషుల్లోని పేద, ధనిక అసమానతలను పోగొట్టడానికి, ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు, కృతజ్ఞతభావం పెరగడానికి ఇవి ఎంతగానో దోహదపడతాయి. పేదలకు దానం చేయడం వల్ల వారు కూడా ఈ మాసాన్ని సంతోషంగా జరుపుకొనే అవకాశం లభిస్తుంది. నిరుపేదలకు మాత్రమే.. జకాత్ ప్రధానంగా పేదవారైన తమ బంధువులకు ఇస్తారు. అనాథలకు, వితంతువులు, వికలాంగులు, కడు పేదవారికి ఇస్తారు. సయ్యద్ వంశస్థులకు జకాత్ ఇవ్వరాదు. సయ్యద్‌లు మహ్మద్ ప్రవక్త (స.అస) సంతతికి (అహ్లెబైతె అతహార్) చెందిన వారు కావడంతో వారికి చెల్లించరాదు. సయ్యద్‌లను ఆపదలో ఆదుకోవచ్చు. కానీ జకాత్ పేరిటకాదు. సేవా నిరతితో.. ఇస్లాం మతంలో జకాత్ డబ్బుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొంతమంది డబ్బున్న వారు ‘జకాత్ అండ్ చారిటబుల్ ట్రస్టు’ పేరుతో ప్రతి ఏడాది రూ.కోట్లతో ఉచిత వివాహాలు, విద్యార్థులకు స్కాలర్షిప్లు, దుస్తులతోపాటు పేదలను అన్ని రకాలుగా ఆదుకుంటున్నారు. విధిగా చెల్లించాల్సిందే.. ఇస్లాం ఫర్జులలో జకాత్ ఒకటి. జకాత్‌ను అర్హత ఉన్న ప్రతి ఒక్క ముస్లిం చెల్లించాలి. జకాత్‌ను చెల్లిస్తే అల్లా వారిని నరకం అగ్ని నుంచి కాపాడుతాడు. జకాత్‌ను చెల్లిస్తే మన ఆస్తిలో బర్కత్ లభిస్తుంది. – మౌలానా మొహ్సిన్పాషా ఖాద్రీ,మహబూబ్‌నగర్ -
నాడు ఒక్క ఒంటె...నేడు ముప్ఫై ఒంటెలు
ఒకసారి ప్రవక్త మహనీయులు (స) తన శిష్యుడైన ఉబై బిన్ కాబ్ (రజి) ను సంపన్న ముస్లిముల నుంచి జకాత్ వసూలు చేసే పని అప్పజెప్పారు. ఆయన మదీనా పరిసర ప్రాంతాలు తిరిగి సంపన్న ముస్లిముల నుంచి జకాత్ వసూలు చేసేవారు. ఇలా సేకరించిన సామూహిక జకాత్ ను పేద ప్రజలకు పంపిణీ చేసేవారు. ఒకసారి ఆయన జకాత్ సేకరించేందుకు వెళ్లారు. అక్కడ ఒక వ్యక్తి దగ్గర కొన్ని ఒంటెలు ఉన్నాయి. అన్నింటినీ లెక్కవేసి చూడగా ఏడాది వయస్సున్న ఒక చిన్న ఒంటె పిల్లను జకాత్ గా నిర్ణయించారు. ‘‘ఈ ఒంటె ప్రయాణానికీ పనికి రాదు, పాలుకూడా ఇవ్వదు. మొదటిసారి దేనికీ పనికిరాని ఈ చిన్న ఒంటె పిల్లను అల్లాహ్ మార్గంలో దానం చేయడం నాకు ఇష్టం లేదు. శ్రేష్టమైన దానిని జకాత్‌గా ఇవ్వదలుచుకున్నాను; పాలిచ్చే ఈ బలిసిన ఈ ఒంటెను తీసుకెళ్లండి. ’ అని ఆ ఒంటెల యజమాని ఉబై (రజి) ను ప్రాధేయపడ్డాడు. ‘‘ఎక్కువ ఇవ్వదలుచుకుంటే మదీనాలో ప్రవక్త (స) మహనీయుల వారి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.‘ అని అతనికి చెప్పి వెళ్లిపోయారాయన. ‘‘దైవ ప్రవక్తా; నా జీవితంలో ఇంతవరకూ నేను జకాత్ చెల్లించలేదు. ఇప్పుడు జకాత్ చెల్లించేంతటి స్థోమతకు చేరుకున్నాను. నా ఒంటెలన్నీ లెక్కగట్టగా ఏడాది వయస్సున్న చిన్న ఒంటె పిల్ల జకాత్ గా నిర్ణయమైంది. దానికి బదులుగా బలిష్టమైన ఈ ఒంటెను స్వీకరించండి’’ అని ప్రవక్త (స)కు మొరపెట్టుకున్నాడు. ‘‘ఇష్ట పూర్వకంగా ఎక్కువ మొత్తంలో జకాత్ ఇవ్వాలనుకుంటే ఎలాంటి సంకోచం లేకుండా స్వీకరిస్తాను. దీనికి తగ్గ ప్రతిఫలం అల్లాహ్ తప్పకుండా ఇస్తాడు. ‘‘ అని ప్రవక్త (స) అతని వ్యాపారాభివృద్ధికోసం అల్లాహ్‌ను ప్రార్థించారు. కొన్ని సంవత్సరాల తరువాత ఉబై బిన్ కాబ్ (రజి) ఆ జాతి వద్దనుంచి వెళుతుండగా ఆ వ్యక్తి వృద్ధాప్యంలో కనపడ్డాడు. పదుల సంఖ్యలో ఉండే అతని ఒంటెలు వందల సంఖ్యలో పెరిగిపోయాయి. ఏటా ఒక్క ఒంటెతో జకాత్ ప్రారంభించిన అతను దానిని పెంచుకుంటూ పోయి 30 బలిష్టమైన ఒంటెలను ఇప్పుడు జకాత్ రూపంలో దానం చేస్తున్నాడు. దాన ధర్మాల వల్ల సంపద వృద్ధి చెందుతుందన్నది ఖుర్ ఆన్ బోధన. దైవమార్గంలో ఖర్చుపెట్టే ఒక్కో రూపాయికి ఎన్నో వందలు లెక్కకట్టి తిరిగి మనకు అందుతుందన్నది ఈ గాథ తెలియజేస్తుంది. – అబ్దుల్ మాజిద్ -
జకాత్, ఫిత్ర్.. పేదల హక్కు
కంభం : ఇస్లాం ధర్మం 5 మూల స్తంభాలపై ఆధారపడి ఉంది. వీటిలో నాలుగో అంశం జకాత్.. ఇది ధనానికి సంబందించిన ఆరాధన. దీనిని నెరవేర్చడానికి రంజాన్ మాసం ఎంతో అనువైనది. ఏడాది పొడవునా తమవద్ద నిల్వ ఉన్న ధనంలో నుంచి నిర్ణీత ధనాన్ని నిరుపేదల కోసం వెచ్చించి, ఆ ధనాన్ని శుద్ధి పరుచుకోవడమే ‘జకాత్’ ఉద్దేశం. దీనివలన కనికరం, త్యాగం, సానుభూతి జనిస్తాయి. ‘నమాజ్‌ను స్థాపించండి, జకాత్‌ను ఇవ్వండి, ఇంకా రుకూ చేసే వారితో రుకూ చేయండి’ అని దివ్య ఖురాన్లో పేర్కొనబడింది. ‘మేము మీలో కొంత మందికి మీ అవసరాల కంటే ఎక్కువ ధనాన్ని ప్రాప్తం చేసినప్పుడు ఆ ధనం నుంచి కొంత భాగాన్ని ‘జకాత్’ రూపంలో నిరుపేదలకు ఇవ్వండి. మీరు అలా చెయ్యకపోతే ముస్లింలు కాజాలరు. జకాత్ చెల్లించే ఆర్థిక స్థోమత కలవారు ప్రతి సంవత్సరం నూటికి రెండున్నర శాతం ప్రకారం క్రమం తప్పకుండా తమ ధనమునుండి జకాత్ చెల్లించాలి. జకాత్ ధనాన్ని నిరుపేదలు, అనాధలు, లేమికి గురైన బందు మిత్రులు, వితంతువులు, ఆపదలో ఉన్న ఇరుగుపొరుగు వారికి విశాల హృదయంతో సాయం అందించాలి. అనాథ బాలలకు కూడు, గుడ్డ, విద్య సౌకర్యాలు కల్పించాలి. వికలాంగులు, నిరుపేద యువతుల వివాహాలకు ఆర్థిక సాయం అందించడం సంపన్నుల బాధ్యత. ఇలాంటి వారికి అల్లాహ్ పరలోక స్వర్గవనాల్లో ప్రవేశం కల్పిస్తాడు’ అని మహమ్మద్ ప్రవక్త సందేశం అందజేశారు. ఏ సంపదలో నుంచైతే జకాత్ తీయబడక, ఆ ధనంలోనే కలిసి ఉంటుందో.. అది ఆ ధనాన్ని సర్వనాశనం చేస్తుంది. ప్రళయ దినాన ఆ సంపద విషసర్పంగా మారి అతని కంఠాన్ని చుట్టుకుని ‘నేను నీవు కూడబెట్టిన నిధిని’ అంటూ అతని దవడల్ని గట్టిగా కరుచుకుంటుంది అని ప్రవక్త మహమ్మద్ పేర్కొన్నారు. ఫిత్ర్ రంజాన్ మాసంలో ఉపవాసాలను పూర్తిచేసిన శుభ సందర్భంగా తమ ఉపవాసాలలో పొరపాటుగా దొర్లిన లోటుపాట్లను తొలగించడానికి ‘ఫిత్ర్ దానం’ విధించబడుతుంది. దీనివల్ల ఎంతో మంది నిరుపేదలు, అభాగ్యులకు ఆహార పదార్థాల ఏర్పాటు జరుగుతుంది. ఫిత్ర్ అనేది ‘ఇఫ్తార్’ అనే పదం నుంచి వచ్చింది. ఉపవాసాన్ని విరమించడాన్ని ఇఫ్తార్ అంటాము. ఫిత్ర్ అనేది పేదల హక్కు దీనిని ప్రతి ఒక్కరి తరఫున చిన్నాపెద్ద అనే తారతమ్యం లేకుండా చెల్లించాలి. ‘ఫిత్ర్ దానం’ ఒక వ్యక్తి తరఫున దాదాపు రెండున్నర కిలోల గోధుమలు గానీ దానికి సరిపడేంత ధాన్యం గానీ, దుస్తులు గానీ, డబ్బు గాని ఇవ్వవచ్చు. దీనిని రంజాన్ పండుగకు కనీసం ఒకవారం ముందుగా చెల్లిస్తే ఆర్థిక స్థోమత లేని నిరుపేదలు కూడా అందరితోపాటు కలిసి సంతోషంగా పండుగ చేసుకోవడానికి వీలవుతుంది. జకాత్ ఎవరు చెల్లించాలి మతి స్థిమితం కలిగి యుక్తవయసు గల ముస్లింలు రుణగ్రస్తుడు కాకుండా ఉండి, తన జీవిత అవసరాలకు మించిన ధనం ఒక సంవత్సర కాలం ఆధీనం కలిగి ఉంటే అతను జకాత్ చెల్లించాలి. జకాత్ ఎవరికి చెల్లించాలి అగత్యపరులకు, నిరుపేదలకు, జకాత్లు చేసేవారికి, ఇస్లాం స్వీకరించి ఆర్థిక ఇబ్బందులకు గురైన వారికి, బానిసలను విముక్తులుగా చేసేందుకు, రుణగ్రస్తుల్ని రుణ విముక్తులుగా చేయడానికి, దైవ ధర్మోన్నతి మార్గంలో కృషి కోసం, అలాగే బాటసారులకు జకాత్ డబ్బును ఖర్చు చేయాలని దివ్య ఖురాన్ ఆదేశిస్తోంది. జకాత్ ఎవరికి చెల్లించకూడదు తల్లిదండ్రులకు, తాత, ముత్తాతలకు, సంతానానికి, మనవళ్లకు, మనవరాళ్లకు, ముస్లిమేతరులకు, భర్తకు, భార్యకు, జకాత్ చెల్లించే శక్తి గల వారికి, సాదాత్ వంశీయులకు(ఫాతిమా(రజి) గారికి పుట్టిన సంతానానికి) జకాత్ డబ్బు ఇవ్వకూడదు. జకాత్ ఎంత చెల్లించాలి 1.యాభై రెండున్నర తులాల వెండి లేదా ఏడున్నర తులాల బంగారం గల వ్యక్తి సంవత్సరాంతం ఆ సొమ్ముపై రెండున్నర శాతం లేదా 40వ వంతు నగదు లేదా వస్తు రూపంలో చెల్లించాలి. 2. చలామణిలో ఉన్న కరెన్సీ ధనంపై నూటికి రెండున్నర రుపాయలు జకాత్ చెల్లించాలి. 3.పైన తెలిపిన బంగారం లేదా వెండికి సమానమైన ధనం ఉన్నా జకాత్ చెల్లించాలి. 4.వ్యాపారంలో ఉన్న నిల్వ, రొక్కంపై కూడా జకాత్ చెల్లించాలి. 5.వర్షం వల్ల పండే ఫలాలు, ధాన్యాల్లో 10వ వంతు, నీరు తోడి పండించే వాటిల్లో 20వ వంతు ‘ఉష్ర్’గా చెల్లించాలి. -
ఆకలి తీర్చే ఆకలి
ఇంకొకరి ఆకలి తీర్చాలంటే మనకు ఆకలి తెలియాలి. మహ్మదీయులు ఈ మాసంలోఆకలితో ఉండేది.. ప్రేమను తీర్చేందుకే.ఇతరులకు మంచి చేసే సంకల్పంలోవారికి ఆకలి బాధే తెలియదు. అంత గొప్ప నియమం ఈ మాసం.అంత గొప్ప పుణ్యం ఈ ఆకలి.మహమ్మదీయుల దగ్గర ప్రపంచంనేర్చుకోవాల్సిన ధర్మం.. ఆకలి తీర్చే ఆకలి. రమజాను మాసం అనగానే ఉపవాసాలు గుర్తొస్తాయి. దేవుడిని ఆరాధించే మార్గాల్లో ఉపవాసం కూడా ఒకటి. ముస్లింలు ఉపవాసం ఎందుకు చేస్తారు? దేవుని వాక్కు అయిన దివ్య ఖుర్ఆన్ ఈ మాసంలోనేప్రవక్త ముహమ్మద్ ద్వారా మానవాళికి లభించింది. దానికి కృతజ్ఞతగా ఈ మాసంలో ముస్లిములు ఉపవాసాలు పాటిస్తారు. అదొక్కటే కాదు ఈ మాసం అంతా శిక్షణాకాలం లాంటిది. ఇస్లామీయ బోధనలు, ప్రమాణాల ప్రకారం ఈ నేల అంతా ముస్లింలు జీవించడానికి నిబద్ధులవుతారు. ఈ నెల రోజుల శిక్షణ తర్వాత మిగిలిన పదకొండు నెలల జీవితాన్ని క్రమబద్ధం చేస్తుందని ముస్లింల విశ్వాసం. ‘రమజాను నెలను పొందే వ్యక్తి ఆ నెల అంతా విధిగా ఉపవాసం ఉండాలి. వ్యాధిగ్రస్తులైన వారు లేదా ప్రయాణంలో ఉన్నవారు, ఆ ఉపవాస దినాలను వేరే దినాలలో పూర్తిచెయ్యాలి’ అని ఖురానులో ఉంది. అందుకే ముస్లింలు దేవుని పట్ల భయభక్తులతో ఉపవాసాలు ఉంటారు. ఎవరు చూడని ఏకాంతంలో ఉన్నప్పటికీ పచ్చి మంచినీరు కూడా తాగకుండా నిగ్రహాన్ని పాటిస్తారు. దేవుడు చూస్తున్నాడన్న స్పృహæ దీనికి కారణం. భారతదేశంలో అయితే దాదాపు పధ్నాలుగు గంటల పాటు, ఇంగ్ల్లండు వంటి దేశాల్లో అయితే దాదాపు పద్ధెనిమిది గంటల పాటు అన్నపానీయాలకు దూరంగా ఉండడం వల్ల ఎంత సంపన్నుడైనా ఆకలి బాధ, దప్పిక బాధేమిటో అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. పేదల కష్టాలను అర్థం చేసుకుని ఆదుకుంటాడు. అందుకే మనిషి కడుపు నిండా తినరాదని మూడింట ఒక వంతు కడుపు ఖాళీగా ఉండాలని ప్రవక్త బోధించారు. పంచుకునే మాసం రంజాను మాసంలో అన్నపానీయాలకు దూరంగా ఉండడమే కాదు, తమ వద్ద ఉన్న ఆహారాన్ని ఇతరులతో పంచుకోవడం ఈ నెలలో చాలా సాధారణంగా కనబడే దృశ్యం. మసీదుల్లో లేదా ఇతర ప్రదేశాల్లో ఉపవాస విరమణ (ఇఫ్తార్) జరుగుతున్నప్పుడు చాలా మంది తమతో పాటు ఆహారపదార్థాలు తీసుకుని వస్తారు. కొందరు ఏమీ లేకుండానే వచ్చేస్తారు. తమ పక్కన ఉన్న వ్యక్తి పరిచయస్తుడా కాదా అన్నది ఎవరు పట్టించుకోరు. తన వద్ద ఆహారం ఉన్న వ్యక్తి ఎదుటి వ్యక్తి ముందు పెడతాడు. అవతలి వ్యక్తి కూడా నిస్సంకోచంగా తీసుకుని తింటాడు. తినే ప్రతి వ్యక్తి మిగిలిన వారికి సరిపోతుందో లేదో అన్న ధ్యాసతోనే తింటాడు. ఇలా పంచుకుని తినే అందమైన వాతావరణం రమజానులో చాలా సాధారణంగా కనబడుతుంది. ఇదే పద్ధతి సంవత్సరమంతా ఉంటే ఆకలితో బాధపడే వారెవ్వరు సమాజంలో ఉండరు. రమజాను మాసంలో అన్నదానాలు, ఇఫ్తార్ విందులు జరుగుతూనే ఉంటాయి. అందులో పేదలు, మధ్యతరగతి, సంపన్నులు అనే తేడా లేకుండా అందరూ పాల్గొనడం కూడా చూడవచ్చు. సామాజికంగా అందరం ఒక్కటే అనే అద్భుతమైన అందమైన భావన ఆచరణాత్మకంగా కనిపిస్తుంది. పేదరికానికి జవాబు పేదరిక నిర్మూలనకు ఇస్లామ్ ప్రతిపాదించే సూత్రం పంపిణీ. సమాజం వద్ద వ్యక్తుల వద్ద ఉన్న సంపదలో పేదసాదలకు కూడా హక్కు ఉందని ఇస్లాం చెబుతుంది. ఈ సంపద పంపిణీకి ఇస్లామ్ ప్రతిపాదించే గొప్ప నియమం జకాత్. ఆ మాటకు అర్థం ‘తప్పనిసరిగా చేయవలసిన దానం’. ‘తల్లిదండ్రులను, బంధువులను, అనాథలను, నిరుపేదలను ఆదరించాలి. ప్రజలను సహృదయంతో పలుకరించాలి. జకాత్ ఇవ్వాలి’ అని ఖురానులో ఉంది. ఆ జకాత్ ఎలా ఇవ్వాలి? ‘కేవలం పరుల మెప్పును పొందటానికి ఇవ్వకండి. దెప్పిపొడిచి, గ్రహీత మనస్సును గాయపరచి ఇవ్వకండి. అలా చేస్తే మీ దానం మట్టిలో కలిసినట్టే‘ అని ఖురాన్లో ఉంది. రమజాను మాసంలో అందువల్లనే ముస్లిములు ఇతోధికంగా దానధర్మాలు చేస్తుంటారు. ఖర్చుకు ఏమాత్రం వెనుకాడరు. దేవుని ప్రసన్నతతో పాటు ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని కూడా అనుభవిస్తారు. జకాత్ అంటే శుభ్రం చేయడం జకాత్ అంటే అసలు అర్థం శుభ్రం చేయడం. మనిషి తన సంపద నుంచి తాను శుభ్రపడాలి. ఉన్నసంపదలో రెండున్నర శాతం జకాత్‌గా చెల్లించాలి. ఎవరికి చెల్లించాలన్నది కూడా నిర్ధిష్టంగా ఉంది. రమజాను మాసంలో తప్పనిసరిగా చేసే మరో దానం ఫిత్ర్. ఇది పండుగ ముందు రోజు చేస్తారు. ఒక కుటుంబంలో ఎంత మంది ఉంటే, తల ఒక్కింటికి రెండున్నర కిలోల ధాన్యం లేదా దాని సమాన వెల పేదలకు ఇవ్వాలి. పండుగ రోజున ఏ పేదసాదలు ఖాళీ కడుపుతో ఉండరాదని చేసిన ఏర్పాటిది. ఇవి కాకుండా ‘సదఖా’ రూపంలో స్వచ్ఛందంగా చేయవలసిన దానాలను కూడా ఇస్లాం ప్రోత్సహించింది. అందుకే రమజాను మాసంలో విస్తృతంగా దానధర్మాలు చేయడం మనకు కనబడుతుంది. ఇండోనేషియా, మలేషియా, ఖతర్, సౌదీ అరేబియా, ఎమన్ దేశాల్లో ఏటా 38,088 కోట్ల రూపాయలు జకాత్ పేరుతో సమీకరణం అవుతున్నాయి. ఇవి ప్రపంచ దేశాలలో అవసరమైన మానవీయ సహాయానికి తోడ్పడుతున్నాయి. మతాలతో సంబంధం లేకుండా సంవత్సరానికి ఒకసారి ప్రపంచంలోని ప్రతి ఒక్కరు తమ సంపదలో రెండున్నర శాతం దానం చేయగలిగితే అసలు పేదరికం అనేదే ఉండదు. జకాత్లో గొప్ప ఆర్థిక సూత్రం ఇది. దానం వల్ల కలిగే మేలు ప్రపంచవ్యాప్తంగా మానవీయ సహకారానికి జకాత్, సదకా నిధులను ఉపయోగిస్తున్నారు. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ దేశాలు 2013లో అంతర్జాతీయ మానవీయ సహకారానికి అందించిన మొత్తం 14,700 కోట్ల రూపాయలు. ముస్లిం దేశాల్లో జకాత్ వసూలు ప్రభుత్వ పరంగా జరుగుతుంది. ముస్లిమేతర దేశాల్లో స్వచ్ఛంద సంస్థలు జకాత్ వసూలు చేసి సేవాకార్యక్రమాలకు, విద్య, వైద్యం తదితర కార్యక్రమాలకు వినియోగించడం జరుగుతోంది. జకాత్ ఫౌండేషన్ భారతదేశంలో సివిల్ సర్వీసు కోచింగ్ వంటి సేవలు కూడా అందిస్తోంది. సిరియాలో అంతర్యుద్ధంలో దాదాపు రెండున్నర లక్షల మంది మరణించారు. టర్కీ తదితర దేశాలు అక్కడ భారీస్థాయిలో మానవీయ సహకారం జకాత్ నిధుల నుంచే అందిస్తున్నాయి. అనేక దేశాల్లో ప్రకృతి విపత్తులు, ఎబోలా వంటి వ్యాధులు ఇలా ఎన్నెన్నో కడగండ్లు. అంతర్జాతీయ మానవ సహకారానికి నిధులు సరిపోని పరిస్థితి. దానం చేయడం అంటే ఎదుటి వాడికి ఉపకారం చేయడం కాదు. అది పుచ్చుకునేవాడి హక్కు, ఇచ్చేవాడి బాధ్యత అన్న భావన ఇస్లామ్‌లో ముఖ్యమైనది. – వాహెద్ -
జకాత్ ఎవరు చెల్లించాలి?
రమజాన్ కాంతులు ఆర్ధిక స్థోమత కలిగిన ప్రతి ఒక్కరూ జకాత్ చెల్లించాలి. హజ్రత్ అబూసయీద్ ఖుద్రీ(ర)ప్రకారం ముహమ్మద్ ప్రవక్త(స) ఇలా ఉపదేశించారు:‘ఐదు ఉఖియాల కంటే వెండి తక్కువగా ఉంటే దానిపై జకాత్ లేదు. అలాగే వెండి ఐదు ‘ఉఖియా’ లకంటే ఎక్కువ ఉంటే జకాత్ తప్పనిసరి అవుతుంది. ఐదు ఉఖియాలంటే తూకం ప్రకారం చూస్తే యాభైరెండున్నర (52 1/2)తులాలు. ఇదేవిధంగా జకాత్ చెల్లింపుకు బంగారం పరిమితి ఐదున్నర (5 1/2)తులాలు. అంటే అటూ ఇటుగా 65 గ్రాములు. కనీసం ఐదున్నర తులాల బంగారం లేక దానికి సరిపడా నగదు ఎవరిదగ్గరైనా ఉండి, ఒకసంవత్సరం గడిచిపోతే వారిపై జకాత్ చెల్లింపు వాజిబ్ అయిపోతుంది. ఇంతకంటే తక్కువ పరిణామంపై జకాత్ లేదు. ఈ పరిమితికి మించిన సంపద ఏ రూపంలోనైనా (కొన్నిరకాల స్థిరాస్తులు మినహాయించి) ఒక సంవత్సరకాలం నిల్వ ఉన్నట్లయితే ఆ మొత్తానికి రెండున్నరశాతం చొప్పున లెక్కకట్టి జకాత్ చెల్లించాలి. – ఎండీ ఉబైద్ ఖాన్