కంభం : ఇస్లాం ధర్మం 5 మూల స్తంభాలపై ఆధారపడి ఉంది. వీటిలో నాలుగో అంశం జకాత్.. ఇది ధనానికి సంబందించిన ఆరాధన. దీనిని నెరవేర్చడానికి రంజాన్ మాసం ఎంతో అనువైనది. ఏడాది పొడవునా తమవద్ద నిల్వ ఉన్న ధనంలో నుంచి నిర్ణీత ధనాన్ని నిరుపేదల కోసం వెచ్చించి, ఆ ధనాన్ని శుద్ధి పరుచుకోవడమే ‘జకాత్’ ఉద్దేశం. దీనివలన కనికరం, త్యాగం, సానుభూతి జనిస్తాయి.
‘నమాజ్‌ను స్థాపించండి, జకాత్‌ను ఇవ్వండి, ఇంకా రుకూ చేసే వారితో రుకూ చేయండి’ అని దివ్య ఖురాన్‌లో పేర్కొనబడింది. ‘మేము మీలో కొంత మందికి మీ అవసరాల కంటే ఎక్కువ ధనాన్ని ప్రాప్తం చేసినప్పుడు ఆ ధనం నుంచి కొంత భాగాన్ని ‘జకాత్’ రూపంలో నిరుపేదలకు ఇవ్వండి. మీరు అలా చెయ్యకపోతే ముస్లింలు కాజాలరు. జకాత్ చెల్లించే ఆర్థిక స్థోమత కలవారు ప్రతి సంవత్సరం నూటికి రెండున్నర శాతం ప్రకారం క్రమం తప్పకుండా తమ ధనమునుండి జకాత్ చెల్లించాలి. జకాత్ ధనాన్ని నిరుపేదలు, అనాధలు, లేమికి గురైన బందు మిత్రులు, వితంతువులు, ఆపదలో ఉన్న ఇరుగుపొరుగు వారికి విశాల హృదయంతో సాయం అందించాలి. అనాథ బాలలకు కూడు, గుడ్డ, విద్య సౌకర్యాలు కల్పించాలి. వికలాంగులు, నిరుపేద యువతుల వివాహాలకు ఆర్థిక సాయం అందించడం సంపన్నుల బాధ్యత. ఇలాంటి వారికి అల్లాహ్ పరలోక స్వర్గవనాల్లో ప్రవేశం కల్పిస్తాడు’ అని మహమ్మద్ ప్రవక్త సందేశం అందజేశారు.
ఏ సంపదలో నుంచైతే జకాత్ తీయబడక, ఆ ధనంలోనే కలిసి ఉంటుందో.. అది ఆ ధనాన్ని సర్వనాశనం చేస్తుంది. ప్రళయ దినాన ఆ సంపద విషసర్పంగా మారి అతని కంఠాన్ని చుట్టుకుని ‘నేను నీవు కూడబెట్టిన నిధిని’ అంటూ అతని దవడల్ని గట్టిగా కరుచుకుంటుంది అని ప్రవక్త మహమ్మద్ పేర్కొన్నారు.
ఫిత్ర్
రంజాన్ మాసంలో ఉపవాసాలను పూర్తిచేసిన శుభ సందర్భంగా తమ ఉపవాసాలలో పొరపాటుగా దొర్లిన లోటుపాట్లను తొలగించడానికి ‘ఫిత్ర్ దానం’ విధించబడుతుంది. దీనివల్ల ఎంతో మంది నిరుపేదలు, అభాగ్యులకు ఆహార పదార్థాల ఏర్పాటు జరుగుతుంది. ఫిత్ర్ అనేది ‘ఇఫ్తార్’ అనే పదం నుంచి వచ్చింది. ఉపవాసాన్ని విరమించడాన్ని ఇఫ్తార్ అంటాము. ఫిత్ర్ అనేది పేదల హక్కు దీనిని ప్రతి ఒక్కరి తరఫున చిన్నాపెద్ద అనే తారతమ్యం లేకుండా చెల్లించాలి. ‘ఫిత్ర్ దానం’ ఒక వ్యక్తి తరఫున దాదాపు రెండున్నర కిలోల గోధుమలు గానీ దానికి సరిపడేంత ధాన్యం గానీ, దుస్తులు గానీ, డబ్బు గాని ఇవ్వవచ్చు. దీనిని రంజాన్ పండుగకు కనీసం ఒకవారం ముందుగా చెల్లిస్తే ఆర్థిక స్థోమత లేని నిరుపేదలు కూడా అందరితోపాటు కలిసి సంతోషంగా పండుగ చేసుకోవడానికి వీలవుతుంది.
జకాత్ ఎవరు చెల్లించాలి
మతి స్థిమితం కలిగి యుక్తవయసు గల ముస్లింలు రుణగ్రస్తుడు కాకుండా ఉండి, తన జీవిత అవసరాలకు మించిన ధనం ఒక సంవత్సర కాలం ఆధీనం కలిగి ఉంటే అతను జకాత్ చెల్లించాలి.
జకాత్ ఎవరికి చెల్లించాలి
అగత్యపరులకు, నిరుపేదలకు, జకాత్‌లు చేసేవారికి, ఇస్లాం స్వీకరించి ఆర్థిక ఇబ్బందులకు గురైన వారికి, బానిసలను విముక్తులుగా చేసేందుకు, రుణగ్రస్తుల్ని రుణ విముక్తులుగా చేయడానికి, దైవ ధర్మోన్నతి మార్గంలో కృషి కోసం, అలాగే బాటసారులకు జకాత్ డబ్బును ఖర్చు చేయాలని దివ్య ఖురాన్ ఆదేశిస్తోంది.
జకాత్ ఎవరికి చెల్లించకూడదు
తల్లిదండ్రులకు, తాత, ముత్తాతలకు, సంతానానికి, మనవళ్లకు, మనవరాళ్లకు, ముస్లిమేతరులకు, భర్తకు, భార్యకు, జకాత్ చెల్లించే శక్తి గల వారికి, సాదాత్ వంశీయులకు(ఫాతిమా(రజి) గారికి పుట్టిన సంతానానికి) జకాత్ డబ్బు ఇవ్వకూడదు.
జకాత్ ఎంత చెల్లించాలి
1.యాభై రెండున్నర తులాల వెండి లేదా ఏడున్నర తులాల బంగారం గల వ్యక్తి సంవత్సరాంతం ఆ సొమ్ముపై రెండున్నర శాతం లేదా 40వ వంతు నగదు లేదా వస్తు రూపంలో చెల్లించాలి. 2. చలామణిలో ఉన్న కరెన్సీ ధనంపై నూటికి రెండున్నర రుపాయలు జకాత్ చెల్లించాలి. 3.పైన తెలిపిన బంగారం లేదా వెండికి సమానమైన ధనం ఉన్నా జకాత్ చెల్లించాలి. 4.వ్యాపారంలో ఉన్న నిల్వ, రొక్కంపై కూడా జకాత్ చెల్లించాలి. 5.వర్షం వల్ల పండే ఫలాలు, ధాన్యాల్లో 10వ వంతు, నీరు తోడి పండించే వాటిల్లో 20వ వంతు ‘ఉష్ర్’గా చెల్లించాలి.
Comments
Please login to add a commentAdd a comment