అల్లాహు అక్బర్ .. అల్లాహు అక్బర్ .. లాయిలాహ ఇల్లల్లాహు
వల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హంద్ ..!
ఈ రోజు ఎటువిన్నా ఈ స్తోత్ర గానమే, ఆ దయామయుని కీర్తిగానమే వినిపిస్తూ హృదయాలను పులకింపజేస్తూ ఉంటుంది. ఊరు, వాడ, పల్లె, పట్నం, చిన్నా పెద్దా, ఆడా మగా, ముసలీ ముతకా అనే తేడా లేకుండా ఎవరి నోట విన్నా ఈ అమృత వచనాలే జాలువారుతూ ఉంటాయి.
కొత్తబట్టలు, కొత్తహంగులు, తెల్లని టోపీలు మల్లెపూలలా మెరిసిపోతుంటాయి. అత్తరు పన్నీరు పరిమళాలు, అస్సలాము అలైకుం, ఈద్ ముబారక్‌లు, చిరునవ్వుల కరచాలనాలు, ఆలింగనాల ఆనంద తరంగాలు, అలయ్ బలయ్ లతో విశ్వాసుల హృదయాలు సంతోషసాగరంలో ఓలలాడుతూ ఉంటాయి.
సేమ్యాలు, షీర్ ఖుర్మాలు, బగారా, బిర్యానీల ఘుమఘుమలతో, ఉల్లాస పరవళ్ళ హడావిడితో ముస్లిముల లోగిళ్ళు కిలకిల నవ్వుతూ, కళకళలాడుతూ ఉంటాయి. ఇళ్ళలో ఆడాళ్ళ హడావిడికి, పిల్లల సందడికి హద్దులే ఉండవు. ఎందుకంటే ఇది ఒక్కనాటి పండుగ కాదుగదా! నెల్లాళ్ళపాటు భక్తిప్రపత్తులతో జరుపుకున్న పండుగకు అల్విదా చెబుతున్న ముగింపు ఉత్సవం.
రమజాన్ నెలరోజులూ ముస్లింల వీధులు ‘సహెరీ’,‘ఇఫ్తార్’ ల సందడితో నిత్యనూతనంగా కొత్తశోభతో అలరారుతుంటాయి. మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడుతూ, ప్రేమామృతాన్ని చిలకరిస్తూ వింత అనుభూతుల్ని పంచుతుంటాయి. భక్తులు పవిత్ర గ్రంథ పారాయణా మధురిమను గ్రోలుతూ వినూత్న అనుభూతులతో పరవశించి పోతుంటారు. అవును.., ఇలాంటి అనుభూతులు, ఆనందాలు, ఆహ్లాదాలు, అనుభవాలు, అనుభూతుల సమ్మేళనమే పండుగ.
ఇలాంటి ఓ అద్భుతమైన, అపురూప సందర్భమే ‘ఈదుల్ ఫిత్ర్ ’. దీన్నే రమజాన్ పండుగ అంటారు. ముస్లిం సమాజం జరుపుకునే రెండు ముఖ్యమైన పండుగల్లో ఇది మొదటిదీ, అతి పవిత్రమైనదీను. ఈ నెలలో ముస్లింలు అత్యంత నియమనిష్టలతో రోజావ్రతం పాటిస్తారు. భక్తిశ్రద్ధలతో రోజూ ఐదుసార్లు నమాజ్ చేస్తారు. పవిత్రఖురాన్ గ్రంథాన్ని భక్తితో పారాయణం చేస్తూ, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ముహమ్మద్ ప్రవక్త(స)వారిపై సలాములు పంపుతూ ఉంటారు.
దైవనామస్మరణలో అనునిత్యం వారి నాలుకలు నర్తిస్తూ ఉంటాయి. ప్రతిరోజూ తరావీహ్ నమాజులో పాల్గొని తన్మయులవుతుంటారు. దానధర్మాలు చేస్తారు, ఫిత్రాలు చెల్లిస్తారు. ఈ విధంగా రమజాన్ చంద్రవంక దర్శనంతో ప్రారంభమైన ఉపవాసదీక్షలు నెలరోజుల తరువాత షవ్వాల్ మాసం నెలవంక దర్శనంతో సమాప్తమవుతాయి. షవ్వాల్ మొదటితేదీన జరుపుకునే ‘ఈదుల్ ఫిత్ర్’ పర్వదినాన్నే మనం రమజాన్ పండుగ అంటున్నాము. ఈ పండుగ సంబంధం రమజాన్ నెలతో ముడివడి ఉన్న కారణంగా ఇది రమజాన్ పండుగగా ప్రసిద్ధి చెందింది. రమజాన్ ఉపవాస దీక్షలు, పవిత్ర ఖురాన్ అవతరణతో దీని సంబంధం పెనవేసుకు పోయి ఉంది.
మానవుల్లో దైవభక్తిని, దైవభీతిని, సదాచారాన్ని, మానవీయ విలువల్ని జనింపజేయడానికి సృష్టికర్త ఉపవాస వ్రతాన్ని విధిగా నిర్ణయించాడు. దైవాదేశ పాలనకు మనిషిని బద్దునిగా చేయడమే ఉపవాస దీక్షల అసలు లక్ష్యం.
ఒక నిర్ణీత సమయానికి మేల్కొనడం, సూర్యోదయం కాకముందే భుజించడం(సహెరి), సూర్యాస్తమయం వరకూ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా, రోజూ ఐదుసార్లు దైవారాధనచేస్తూ సూర్యాస్తమయం తరువాత రోజా విరమించడం(ఇఫ్తార్), మితాహారం తీసుకోవడం, మళ్ళీ అదనపు ఆరాధనలు అంటే తరావీహ్ నమాజులు చేయడం, మళ్ళీ తెల్లవారు ఝామున లేవడం – ఈవిధంగా రమజాన్ ఉపవాస వ్రతం మనిషిని ఒక క్రమశిక్షణాయుతమైన, బాధ్యతాయుతమైన, దైవభక్తి పరాయణతతో కూడుకున్న జీవనవిధానానికి అలవాటు చేస్తుంది.
మానవుల్లో ఇంతటి మహోన్నత విలువలను, సుగుణాలను జనింపజేసే వ్రతాన్ని పరాత్పరుడైన అల్లాహ్ వారికి అనుగ్రహించినందుకు, వాటిని వారు నెలరోజులూ త్రికరణ శుద్ధిగా పాటించ గలిగినందుకు సంతోష సంబరాల్లో తేలిపోతూ కృతజ్ఞతాపూర్వకంగా భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంటారు.
మరో ముఖ్య విషయం ఏమిటంటే, పవిత్ర రమజాన్ నెలలోనే సమస్త మానవాళి సన్మార్గ దీపిక అయిన మహత్తర గ్రంథరాజం ఖురాన్‌ను దేవుడు మానవాళికి ప్రసాదించాడు. సమస్త మానవజాతికీ మార్గదర్శక జ్యోతి పవిత్ర ఖురాన్. సన్మార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. ఈ గ్రంథరాజం మానవులందరికీ సన్మార్గ బోధన చెయ్యడానికి అవతరించిన ప్రబోధనా జ్యోతి.
దైవ ప్రసన్నతను చూరగొనడానికి రోజా పాటించడం,‘తరావీహ్ ’లు ఆచరించడం, దానధర్మాలు చేయడంతో పాటు, ఈ నెల చివరిలో‘లైలతుల్ ఖద్ర్’ అన్వేషణలో అధికంగా ఆరాధనలు చేస్తారు. లైలతుల్ ఖద్ర్ అంటే అత్యంత అమూల్యమైన రాత్రి అని అర్థం.
ఉపవాసం పాటించడంవల్ల పేదవాళ్ళ ఆకలి బాధలు అర్థమవుతాయన్నారు. సంపన్నులకు, ముప్పూటలా సుష్టుగా తినేవారికి నిరుపేదల ఆకలికేకలు వినబడవు. అలాంటివారు గనక ఉపవాసం పాటించినట్లయితే ఆకలి బాధ ఎలా ఉంటుందో వారికీ తెలుస్తుంది. తద్వారా పేదసాదలను ఆదుకోవడం, వారికి పట్టెడన్నం పెట్టడం ఎంతగొప్ప పుణ్యకార్యమో వారు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు.
ఈ విధంగా రమజాన్ నెల ఆరంభంనుండి అంతం వరకు ఒక క్రమపద్ధతిలో ధర్మం చూపిన బాటలో నడుస్తూ, దైవప్రసన్నత, పుణ్యఫలాపేక్షతో ఈనెలను గడిపినవారు ధన్యులు. నిజానికి ఇలాంటివారే పండుగ శుభకామనలకు అర్హులు. అందుకే ’ఈద్ ’(పండుగ)ను శ్రామికుని వేతనం(ప్రతిఫలం)లభించే రోజు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా రమజాన్ పర్వదినం మనిషిని ఒక ఉన్నతమానవీయ విలువలుకలవాడుగా తీర్చిదిద్ది, సమాజంలో శాంతి, సమానత్వం, సామరస్యం, సోదర భావాలకు పునాదివేస్తుంది. ప్రేమ తత్వాన్ని ప్రోదిచేస్తుంది. ఇదే ఈదుల్ ఫిత్ర్ – రమజాన్ పర్వదిన పరమార్ధం.
సదాచరణల సంపూర్ణప్రతిఫలం లభించిన సంతోషంలో అంబరాన్నంటేలా సంబురాలు జరుపుకొని ఆనంద తరంగాల్లో తేలియాడే రోజు ఈదుల్ ఫిత్ర్ . – ఆరోజు ముస్లిములందరూ ఈద్ నమాజ్ ముగించుకొని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పండుగకు ప్రత్యేకంగా తయారు చేసిన సేమియా పాయసాన్ని తమ హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిఖ్ఖు సోదరులందరికీ ఆప్యాయంగా రుచి చూపించి తమ ఆనందాన్ని వారితో పంచుకుంటారు.‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకుంటారు.
పవిత్ర ఖురాన్ రూపంలో అవతరించిన సృష్టికర్త మహదనుగ్రహం దానవుడి లాంటి మానవుణ్ణి దైవదూతగా మలిచింది. అజ్ఞానం అంధకారాల కారు చీకట్లనుండి వెలికి తీసి, విజ్ఞానపు వెలుగుబాటకు తీసుకు వచ్చింది. నైచ్యపు అగాథాలనుండి పైకిలాగి పవిత్రతా శిఖరాలపై నిలిపింది. మానవుల్లోని పశుప్రవృత్తిని మానవీయ పరిమళంతో పారద్రోలింది. ఆటవికతను నాగరికతతో, అజ్ఞాన తిమిరాన్ని జ్ఞానదీపికతో, అవివేకాన్ని వివేకంతో పారద్రోలి మనుషుల్ని మానవోత్తములుగా సర్వతోముఖంగా తీర్చిదిద్దింది. మానవాళికి ఇంతటి మహదానుగ్రహాలు ప్రసాదించి, వారి ఇహపరలోకాల సఫలతకు పూబాటలు పరిచిన నిఖిల జగన్నాయకునికి కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకోవడమే ఈ పండుగ ఉద్దేశ్యం.
ఈదుల్ ఫిత్ర్ పర్వదిన శుభాకాంక్షలు
– మదీహా అర్జుమంద్
Comments
Please login to add a commentAdd a comment