ఈద్‌ ఉల్‌ ఫితర్‌ వేడుకల్లో సీఎం కేసీఆర్‌ | CM KCR at Eid ul Fitr celebrations | Sakshi
Sakshi News home page

ఈద్‌ ఉల్‌ ఫితర్‌ వేడుకల్లో సీఎం కేసీఆర్‌

Published Sun, Apr 23 2023 3:55 AM | Last Updated on Sun, Apr 23 2023 3:55 AM

CM KCR at Eid ul Fitr celebrations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో ముస్లింలు పవిత్ర మాసంగా పాటించే రంజాన్‌ నెల చివరి రోజైన ‘ఈద్‌ ఉల్‌ ఫితర్‌’పండుగ సందర్భంగా హోంమంత్రి మహమ్మద్‌ మహమూద్‌ అలీ నివాసంలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అక్కడ కేసీఆర్‌కు మహమూద్‌ అలీ, ఆయన కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అందరికీ కేసీఆర్‌ ఈద్‌ ఉల్‌ ఫితర్‌ శుభాకాంక్షలు తెలిపారు. మహమూద్‌ అలీ ఆతిథ్యాన్ని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధుల బృందంతో కలిసి కేసీఆర్‌ స్వీకరించారు.

రంజాన్‌ మాసంలో ఆచరించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలు, క్షమాగుణం, కరుణ తదితర ఆధ్యాతి్మక భావనలు తదితర అంశాలపై కేసీఆర్‌ తన వెంట వచ్చిన మంత్రులు ప్రజాప్రతినిధులు, ముస్లిం పెద్దలతో కాసేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తనను కలిసేందుకు వచ్చిన పలువురు మత పెద్దలు, ఇతరులను పేరుపేరునా పలకరించి అలాయ్‌ బలాయ్‌ తీసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యమకాలం నుంచీ నేటి వరకు తనతో కొనసాగుతున్న సీనియర్‌ కార్యకర్త సత్తార్‌ గుల్షనీనీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు.

కేసీఆర్‌ వెంట మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్‌ కుమార్, ఎంపీలు కె.కేశవరావు, జోగినపల్లి సంతోష్‌ కుమార్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, మధుసూదనాచారి, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, నగర మేయర్‌ విజయలక్ష్మీ, మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు మసీఉల్లాఖాన్, సలీం, రవీందర్‌ సింగ్, మేడె రాజీవ్‌ సాగర్, సీనియర్‌ నేతలు మొయిత్‌ ఖాన్, రాయిడన్‌ రోచ్‌ తదితరులు పాల్గొన్నారు. తమ ఆతిథ్యం స్వీకరించిన సీఎంకు మహమూద్‌ అలీ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలుపుతూ జ్ఞాపికను బహూకరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement