మానవ జీవితంలో ఆనంద సమయాలు చాలా ఉంటాయి. వాటిలో పండుగలు ప్రధానమైనవి. అనాదిగా ఇవి చలామణిలో ఉన్నవే. ముస్లిం సోదరులు జరుపుకునే ఈ పండుగ (ఈద్ ) అలాంటిదే. రమజాన్ నెలతో దీనికి సంబంధం ఉండడంతో అదే పేరుతో ప్రసిధ్ధి గాంచింది. నిజానికి రమజాన్ అన్నది సంవత్సరంలోని పన్నెండు నెలల్లో తొమ్మిదవ నెల పేరు. దీనికింతటి ప్రత్యేకత ప్రాప్తం కావడానికి కొన్ని కారణాలున్నాయి. సర్వ మానవాళకి మార్గదర్శక గ్రంథమైన పవిత్ర ఖురాన్ రమజాన్ మాసంలోనే అవతరించింది. మానవజాతికి వెలుగును, జ్ఞానకాంతిని ప్రసాదించే దివ్యజ్యోతి రమజాన్ మాసంలో అవతరించిన కారణంగా దీనికింతటి గౌరవం, ఘనత, పవిత్రత ప్రాప్తమయ్యాయి.
మానవుల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి అద్భుతంగా ఉపకరించే ‘రోజా’ (ఉపవాసవ్రతం) అనే గొప్ప ఆరాధనను కూడా దైవం ఈ నెలలోనే విధిగా చేశాడు. ఇది జనహృదయాల్లో భయభక్తులు జనింపజేసి, మానవీయ విలువలను, సుగుణాలను పెంపొందిస్తుంది. పాపకార్యాలు, దుర్మార్గాల వైపు మనసు పోకుండా కాపాడుతుంది. ఉపవాసం వల్ల సహనశక్తి పెరుగుతుంది.
జాలి, దయ, కరుణ, త్యాగం, పరోపకారం లాంటి సుగుణాలు అలవడతాయి. స్థితిపరులు ఉపవాసం పాటిస్తే, పేదసాదల ఆకలి బాధను వారు అనుభవ పూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఇలా మరెన్నో మానవీయ, నైతిక సుగుణాలను మానవుల్లో పెంపొందింపజేసే ఏర్పాటు చేసిన విశ్వప్రభువుకు కృతజ్ఞతగా నెల రోజుల ఉపవాసాలను ముగించి షవ్వాల్ నెల మొదటి తేదీన ఈద్ జరుపుకుంటారు.
ఇకపోతే, వెయ్యి నెలలకంటే విలువైన రాత్రి అని చెప్పబడిన ‘లైలతుల్ ఖద్ర్’ కూడా రమజాన్‌లోనే ఉంది. అందుకని శక్తివంచన లేకుండా ఆరాధనలు, సత్కార్యాలు ఆచరిస్తారు. దానధర్మాలు చేస్తారు. రమజాన్ మాసాంతంలో ఫిత్రాలు చెల్లించి ఈద్ నమాజుకు వెళతారు. ఆ రోజు దైవం తన భక్తులకు నెలరోజుల సత్కార్యాలకు అనంతమైన ప్రతిఫలం ప్రసాదిస్తాడు. ‘ఈద్ ’ దేవుని మన్నింపు లభించే మహత్తర శుభదినం.
మనిషి ఎలాంటి స్థితిలోనైనా పశ్చాత్తాప హృదయంతో దైవం వైపు మరలితే, అలాంటి వారిని దైవం తన కారుణ్య ఛాయలోకి తీసుకుంటాడు. ఆయన కరుణామయుడు, కృపాశీలుడు. ఈద్ తప్పులు, పొరపాట్లకు క్షమాపణ కోరుకునే రోజు. జరిగిన తప్పుల పట్ల సిగ్గుపడుతూ, ఇకముందు తప్పులు చేయబోమని, దైవమార్గంపై స్థిరంగా ఉంటామని సంకల్పం చెప్పుకునే రోజు.
కనుక దేహంలో ప్రాణం ఉండగానే దైవం ఇచ్చిన సదవకాశాన్ని వినియోగించుకొని, సన్మార్గం వైపుకు మరలాలి. ఒక విషయం సత్యమని తెలిసినా, దానికి అనుగుణంగా తమ జీవితాలను మలచుకోడానికి చాలామంది ముందుకు రారు. ఇదే మానవుల బలహీనత. దీన్ని అధిగమించడంలోనే విజ్ఞత, వివేకం దాగి ఉన్నాయి.ఈ నెల్లాళ్ళూ ఎంతటి నియమ నిష్ఠలతో గడిపారో ఇకముందు కూడా ఇదే çస్ఫూర్తి కొనసాగిస్తామని ప్రతిన బూనాలి.
ఈద్ పర్వదినం సందర్భంగా ఇలాంటి దృఢ సంకల్పం చెప్పుకుంటే అది నిజమైన పండుగ రోజు అవుతుంది. జీవితాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసే శుభదినం అవుతుంది. ఒకవేళ ఈ విషయాల పట్ల శ్రధ్ధ వహించకపోతే ఈద్ సౌభాగ్యానికి దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, దైవానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ పవిత్ర జీవితం గడిపే ప్రయత్నం చెయ్యాలి.
ఈ విధంగా నెల్లాళ్ళ పాటు అన్ని నియమ నిబంధనలు పాటిస్తూ, రమజాన్ శుభాలతో పునీతమయ్యే మహాభాగ్యాన్ని కలిగించినందుకు ఈద్ రోజున దైవానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించుకుంటారు. పండుగ రోజు వేకువ ఝామునే నిద్రలేచి, స్నానపానాదులు ముగించుకొని ప్రాతఃకాల ఫజర్ నమాజు చేస్తారు. ఉన్నంతలోనే మంచి దుస్తులు ధరించి, అత్తరులాంటి సువాసనలు వినియోగిస్తారు.
ఈద్ గాలో సమావేశమై సామూహికంగా దైవానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఈద్ నమాజ్ చేస్తారు. తమ అపరాధాలను మన్నించమని, సన్మార్గాన నడపమని దుఆ (వేడుకోలు) చేస్తారు. సమస్త మానవాళి సుఖసంతోషాలను కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు ఆచరిస్తారు. వ్యాధుల బారినుండి, అప్పుల బారినుండి, శత్రువు బారినుంచి, దుష్టపాలకుల బారినుంచి, కరవుకాటకాల నుంచి, దారిద్య్రం నుంచి తమను, తమ దేశాన్ని, యావత్ భూప్రపంచాన్ని రక్షించమని, విశ్వమానవాళినంతటినీ కాపాడమని కడు దీనంగా విశ్వప్రభువును వేడుకుంటారు.
స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగు, పరిచితులు, అపరిచితులందరితోనూ సంతోషాన్ని పంచుకుంటారు. ‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈవిధంగా ఈదుల్ ఫిత్ర్ పండుగ సమాజంలో ఒక చక్కని సుహృద్భావపూర్వకమైన, ప్రేమపూరితమైన, సామరస్య కుసుమాలను వికసింపజేస్తుంది. మానవీయ విలువల పరిమళాన్ని వెదజల్లుతుంది. దైవభక్తిని, దైవభీతిని, బాధ్యతాభావాన్ని, జవాబుదారీతనాన్ని, ఇంకా అనేక సుగుణాలను జనింపజేస్తుంది.
ఈదుల్ ఫిత్ర్ శుభాకాంక్షలతో...
– యండి. ఉస్మాన్ ఖాన్
ఈద్ నమాజ్ ఇలా...
అందరూ ఈద్ గాహ్‌కు చేరుకున్న తరువాత వరుస క్రమంలో బారులు తీరి నిలబడతారు. ఇమాం అగ్రభాగంలో నిలబడి ఆరు, లేక పన్నెండు అదనపు తక్బీర్‌లతో రెండు రకతులు నమాజ్ చేయిస్తాడు. ప్రారంభంలో రెండు రకతుల ఈద్ నమాజ్ సంకల్పం చేసుకున్న తరువాత, ‘అల్లాహు అక్బర్’ అని రెండు చేతులూ పైకెత్తి నాభిపై, లేక గుండెలపై కట్టుకోవాలి. తరువాత ‘సనా’ పఠించి, మళ్ళీ ‘అల్లాహు అక్బర్’ అని పలికి చేతులు పైకెత్తి కిందికి వదిలెయ్యాలి. ఇలా రెండుసార్లు చేసి మూడవసారి చేతులు కట్టుకోవాలి. ఇప్పుడు ఇమాం సూరె ఫాతిహా తరువాత, మరొక చిన్న సూరానో, లేక కొన్ని వాక్యాలో పఠించి రుకూ, సజ్దాలు చేస్తాడు.
తరువాత రెండవ రకతు కోసం నిలబడి మళ్ళీ సూరె ఫాతిహా, మరికొన్ని వాక్యాలు పఠించి, మూడుసార్లు ‘అల్లాహు అక్బర్’ అంటూ మూడుసార్లూ చేతులు పైకెత్తి కిందికి వదిలేస్తారు. నాలుగోసారి ‘అల్లాహు అక్బర్’ అంటూ రుకూ చేస్తారు. తరువాత సజ్దాలు చేసి, అత్తహియ్యాత్, దురూద్‌లు పఠించి ముందు కుడి వైపుకు, తరువాత ఎడమ వైపుకు సలాం చెప్పడంతో, ఆరు అదనపు తక్బీర్‌లతో రెండు రకతుల ఈద్ నమాజ్ ప్రక్రియ ముగుస్తుంది. ఈ అన్ని సందర్భాల్లో వెనుక బారులు తీరిన భక్తులంతా ఇమాంను అనుసరిస్తారు. ఈద్ నమాజులో అజాన్ , అఖామత్‌లు ఉండవు. తరువాత ఇమాం మింబర్ (వేదిక) ఎక్కి ఖురాన్, హదీసుల వెలుగులో ప్రస్తుత పరిస్థిలను అన్వయిస్తూ సమాజానికి మార్గదర్శక సందేశం ఇస్తాడు. తరువాత దుఆతో ఈద్ ప్రక్రియ సంపూర్ణమవుతుంది.
‘ఫిత్రా’ పరమార్థం
పవిత్ర రమజాన్ మాసంలో ఆచరించబడే అనేక సత్కార్యాల్లో ‘ఫిత్రా’ ఒకటి. ఫిత్రా అన్న పదం ఇఫ్తార్ నుండి వచ్చింది. ఫిత్ర్ అంటే ఉపవాస విరమణ అన్నమాట. ‘సదఖయే ఫిత్ర్’ అంటే రోజా విరమణకు సంబంధించిన దానం అని అర్థం. ధర్మశాస్త్ర పరిభాషలో ‘సదఖయే ఫిత్ర్ ’ అంటే ఉపవాస దీక్షలు పాటించేటప్పుడు జరిగిన లోపాలకు, పొరపాట్లకు పరిహారంగా రమజాన్ నెలలో విధిగా చెల్లించవలసిన దానం అన్నమాట.
రోజాలు విధిగా నిర్ణయించిన నాటినుంచే ఫిత్రాలు కూడా తప్పనిసరిగా చెల్లించాలని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ఆదేశించారు.మారిన కాలాన్ని, నేటి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఆహార పదార్థాలు, వస్త్రాలు, నగదు ఏ రూపంలో అయినా ఫిత్రా చెల్లించవచ్చు. కనుక పవిత్ర రమజాన్ మాసంలో చిత్తశుద్ధితో అన్నిరకాల ఆరాధనలు ఆచరిస్తూ , ఫిత్రాలను కూడా బాధ్యతాయుతంగా నెరవేర్చాలి. ఈ పవిత్ర మాసంలో ఏదో ఒక రకంగా, ఎంతో కొంత ప్రయోజనం చేకూర్చి, తమ పరిధిలో కొందరి మోముపైనైనా చిరునవ్వులు చూడగలిగితే అంతకంటే మహాభాగ్యం ఇంకేముంటుంది! అల్లాహ్ అందరికీ రమజాన్‌ను సద్వినియోగం చేసుకునే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం.
Comments
Please login to add a commentAdd a comment