ఈదుల్‌ ఫిత్ర్‌ శుభాకాంక్షలతో... శుభాల పరిమళం.. | Sakshi Special Story About Eid-al-Fitr | Sakshi
Sakshi News home page

ఈదుల్‌ ఫిత్ర్‌ శుభాకాంక్షలతో... శుభాల పరిమళం..

Published Fri, May 14 2021 5:36 AM | Last Updated on Wed, Mar 2 2022 7:05 PM

Sakshi Special Story About Eid-al-Fitr

మానవ జీవితంలో ఆనంద సమయాలు చాలా ఉంటాయి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యక్తిగతంగానో, సామూహికంగానో ఏదైనా మేలు జరిగినప్పుడు మానవ అంతరంగం ఆనందంతో పులకించడం సహజం. అలాంటి వాటిలో పండుగలు ముఖ్యమైనవి. వాటిలో రంజాన్‌ ఇంకా ముఖ్యమైనది.

ముస్లిం సోదరులు జరుపుకునే ‘ఈద్‌’కి రంజాన్‌ మాసంతో సంబంధం ఉండటం వల్ల ఈ పండుగ అదే పేరుతో ప్రసిద్ధికెక్కింది. నిజానికి రమజాన్‌ అన్నది సంవత్సరంలోని పన్నెండు నెలల్లో తొమ్మిదవ నెల పేరు. దీనికింతటి ప్రత్యేకత రావడానికి కొన్ని కారణాలున్నాయి. సర్వ మానవాళికి మార్గదర్శక గ్రంథమైన పవిత్ర ఖురాన్‌ రమజాన్‌ మాసంలోనే అవతరించింది. మానవజాతికి జ్ఞానకాంతిని ప్రసాదించే దివ్యజ్యోతి రమజాన్‌ మాసంలో అవతరించిన కారణంగానే ఈ మాసానికి ఇంతటి గౌరవం, ఘనత, పవిత్రత ప్రాప్తమయ్యాయి. మానవుల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి అద్భుతంగా ఉపకరించే ‘రోజా’ అనే ఉపవాస వ్రతాన్ని కూడా దైవం ఈ నెలలోనే విధిగా చేశాడు.

ఇది జనహృదయాల్లో భయభక్తులు జనింపజేసి, మానవీయ విలువలను, సుగుణాలను పెంపొందిస్తుంది. పాపకార్యాలు, దుర్మార్గాల వైపుకు మనసు పోకుండా కాపాడుతుంది. ఉపవాసం వల్ల సహనశక్తి పెరుగుతుంది. జాలి, దయ, కరుణ, త్యాగం, పరోపకారం లాంటి సద్గుణాలు అలవడతాయి. స్థితిపరులు ఉపవాసం పాటిస్తే, పేదసాదల ఆకలి బాధను వారు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఇలా మరెన్నో మానవీయ, నైతిక సుగుణాలను మానవుల్లో పెంపొందింపజేసే ఏర్పాటును చేసిన విశ్వప్రభువుకు కృతజ్ఞతగా నెల రోజుల ఉపవాసాలను ముగించి షవ్వాల్‌ మొదటి తేదీన ఈద్‌ జరుపుకుంటారు.

దేవుని మన్నింపు లభించే మహత్తర శుభదినం ఈద్‌. తప్పులు, పొరపాట్లకు క్షమాపణ కోరుకునే రోజు ఈద్‌. జరిగిన తప్పుల పట్ల సిగ్గుపడుతూ, ఇకముందు తప్పులు చేయం అని, దైవమార్గంపై స్థిరంగా ఉంటామని సంకల్పం చెప్పుకునే రోజు ఈద్‌. కనుక దేహంలో ప్రాణం ఉండగానే దైవం ఇచ్చిన సదవకాశాన్ని వినియోగించుకొని సన్మార్గం వైపు మరలాలి. ఒక విషయం సత్యమని తెలిసినా దానికనుగుణంగా తమ జీవితాలను మలచుకోడానికి చాలామంది ముందుకు రారు.

ఇదే మానవుల బలహీనత. దీన్ని అధిగమించడంలోనే విజ్ఞత, వివేకం దాగి ఉన్నాయి. పుట్టిన ప్రతి మనిషీ గిట్టక తప్పదన్న విషయం ఎంత సత్యమో, ఈ అశాశ్విత దేహం నుండి ఆత్మ ఎప్పుడు వీడిపోతుందో ఎవరికీ తెలియదన్నదికూడా అంతే సత్యం. అందుకే ఈ ఆత్మజ్యోతి ఆరిపోకముందే జాగృతమై దైవం వైపు మరలాలి. జరిగిపోయిన తప్పుల్ని సవరించుకొని రుజుమార్గం పైకిరావాలి. మనం తెలిసీ తెలియక చేసిన పాపాలను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు.

పవిత్ర రమజాన్‌ దీనికి చక్కని అవకాశం కల్పించింది. ఈ నెల్లాళ్ళూ ఎంతటి నియమ నిష్టలతో గడిపారో ఇకముందు కూడా ఇదే స్ఫూర్తి కొనసాగిస్తామని ప్రతిన బూనాలి. ఈద్‌ పర్వదినం సందర్భంగా ఇలాంటి దృఢ సంకల్పం చెప్పుకుంటే అది నిజమైన పండుగ రోజు అవుతుంది. జీవితాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసే శుభదినం అవుతుంది. ఒకవేళ ఈవిషయాలపట్ల శ్రద్ధ వహించక పోతే ఈద్‌ సౌభాగ్యానికి దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దైవానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ పవిత్ర జీవితం గడిపే ప్రయత్నం చెయ్యాలి.

పండుగ రోజు వేకువ ఝామునే నిద్రలేచి స్నానపానాదులు ముగించుకొని ప్రాతః కాల ఫజర్‌ నమాజు చేయాలి. ఉన్నంతలో మంచి దుస్తులు ధరించి, అత్తరు లాంటి సువాసన ద్రవ్యాలను వినియోగించాలి. ఈద్గాలో సమావేశమై సామూహికంగా దైవానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఈద్‌ నమాజ్‌ చేయాలి. కరోనా కారణంగా ఈసారి ఈద్‌ గాహ్‌లలో కాకుండా మసీదులలోనే మాస్క్‌ ధరించి, భౌతికదూరం పాటిస్తూ నమాజు ఆచరించవలసి ఉంది. తమ అపరాధాలను మన్నించమని, సన్మార్గాన నడపమని దుఆ చేయాలి. సమస్త మానవాళి సుఖసంతోషాలను కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేయాలి.

వ్యాధుల బారినుండి, అప్పుల బారినుండి, శత్రువుల బారినుండి,కరువుకాటకాల నుండి, దారిద్య్రం నుండి తమను,  దేశాన్ని, యావత్‌ భూప్రపంచాన్ని రక్షించమని, ముఖ్యంగా కరోనా మహమ్మారి నుండి మానవాళినంతటినీ కాపాడమని విశ్వప్రభువును వేడుకోవాలి. స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు, పరిచితులు, అపరిచితులందరితో సంతోషాన్ని పంచుకోవాలి. ‘ఈద్‌ ముబారక్‌’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకోవాలి. అన్ని సందర్భాల్లో కోవిడ్‌ నిబంధనలు పాటించాలి. పండుగ పరమార్థాన్ని అవగాహన చేసుకుంటే రమజాన్‌ ఆరాధనల ఆశయం నెరవేరుతుంది. భావి జీవితాలు సుఖసంతోషాలతో గడిచిపోతాయి. సమాజంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరుస్తాయి. ఒక చక్కని సుందర సమాజం ఆవిష్కృతమవుతుంది. పండుగ పంచిన మంచి మానవ జీవితాల్లో చివరి శ్వాస వరకూ గుబాళించాలని మనసారా కోరుకుందాం.

– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌   
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement