Muhammad Usman Khan
-
పరలోక సాఫల్యం దిశగా...
సృష్టిలోని ప్రతి జీవికీ మరణం తప్పదు. ఇది సృష్టిధర్మం, ఎవరూ తిరస్కరించలేని సత్యం. నాస్తికులూ, ఆస్తికులూ అందరూ మరణాన్ని నమ్ముతారు. దేవుడున్నాడా అనే విషయంలో భేదాభి్రపాయాలున్నాయి గాని, మరణం ఉందా.. లేదా..? అనే విషయంలో ఎటువంటి భిన్నాభిప్రాయమూ లేదు. కాని,‘మరణం తథ్యం’ అని తెలిసినా మనం దాన్ని పట్టించుకోం. బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు,స్నేహితులు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఎంతోమంది ప్రతిరోజు ఎక్కడో ఒకచోట పోతూనే ఉన్నారు. మనం వారి అంత్యక్రియల్లో పాల్గొని, స్వయానా మన భుజాలపై మోసి, సమాధిలో దించి, స్వహస్తాలతో వారిపై మట్టికప్పి వస్తున్నాం. వారు సంపాదించిన ఆస్తిపాస్తులు, ఆభరణాలు, హోదా, అధికారం ఏదీ వారు తమవెంట తీసుకు వెళ్ళడం లేదు. రిక్తహస్తాలతో వచ్చారు. అలానే వెళ్ళిపోతున్నారు. పవిత్ర ఖురాన్ ఇలా అంటోంది: ‘ఈ ్రపాపంచిక జీవితం ఒక ఆట, వినోదం తప్ప మరేమీ కాదు. అసలు జీవితం పరలోక జీవితమే. ఈ యథార్థాన్ని వారు అర్థం చేసుకుంటే ఎంత బాగుండు’ (29–64) అందుకని ప్రపంచమే సర్వస్వంగా బతక్కూడదు. ధర్మాధర్మాల విచక్షణ పాటించాలి. మంచి పనులు చేయాలి. రేపు మనల్ని కాపాడేవి ఇవే. ఎందుకంటే, మనం సంపాదించిన డబ్బూదస్కం, ఆభరణాలు, ఆస్తిపాస్తులు సమస్తం ఊపిరి ఆగిన మరుక్షణమే మనతో సంబంధాన్ని తెంచుకుంటాయి. భార్యాబిడ్డలు, బంధుగణం, మిత్రబృందం... వీరంతా మనల్ని సమాధి వరకు మాత్రమే సాగనంపుతారు. సమాధిలో దించి, మట్టిలో కలిపేసి వెళ్ళిపోతారు. మన వెంట వచ్చేది, కాపాడేది కేవలం మనం చేసుకున్న మంచి పనులు మాత్రమే. అడ్డదారులు తొక్కి, వారినీ వీరినీ వంచించి సంపాదించేదంతా సుఖమయ జీవితం కోసమేగదా.. రేపటి మన సంతోషం, మన పిల్లల భవిష్యత్తు కోసమేగదా? అక్రమ సంపాదనలో నిజమైన సంతోషం ఉండకపోగా, అది ఎప్పుడూ మనసులో కెలుకుతూనే ఉంటుంది. అయినా అంతరాత్మను అణగదొక్కి అడ్డదారికే ్రపాధాన్యతనిస్తాం. కేవలం కొన్ని సంవత్సరాల ్రపాపంచిక జీవితం కోసమే ఇంతగా ఆలోచించే మనం, మరి శాశ్వతమైన రేపటి (పరలోకం) కోసం ఏం సంపాదిస్తున్నామన్నది కూడా ఆలోచించాలి. ఈ ‘రేపు’ మూన్నాళ్ళ ముచ్చట. కాని ఆ ‘రేపు ‘శాశ్వతం. దానికోసం ఏం చేస్తున్నాం.. ఏం దాస్తున్నాం? ఇదికదా అసలు ప్రశ్న. ఇహలోక జీవితం ఎలా గడిచినా పరలోక సాఫల్యం లభిస్తే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది. దానికోసం ఆలోచించాలి. దానికోసం శ్రమించాలి. మంచీ చెడుల విచక్షణతో, ధర్మబద్ధంగా ముందుకు సాగితే, ఆ క్రమంలో ఎంత లభిస్తే అంతతో సంతృప్తి చెందితే అదే అసలు విజయం, అసలు సాఫల్యం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ధర్మబద్ధమైన జీవనం
పూర్వం బాగ్దాద్ నగరంలో బహెలూల్ అనే పేరుగల ఒక దైవభక్తుడు ఉండేవాడు. ఒకసారి ఆయన బాగ్దాద్ వీధుల్లో నడుస్తూ వెళుతున్నారు. అలా వెళుతూ ఒకచోట విశ్రాంతి కోసం ఆగాడు. అంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అతను చాలా బాధగా, ఆందోళనగా ఉన్నాడు. అది గమనించిన బహెలూల్ ‘ఏమిటి చాలా ఆందోళనగా కనిపిస్తున్నావు, విషయం ఏమిటి?’ అని ఆరా తీశారు. ‘అయ్యా.. ఏం చెప్పమంటారు? కొన్నిరోజుల క్రితం ఒక వ్యక్తి దగ్గర కొంత పైకం అమానతుగా ఉంచాను. ఇప్పుడు వెళ్ళి అడిగితే, అసలు నువ్వెవరివి..? నాకు పైకం ఎప్పుడిచ్చావు?’ అని బుకాయిస్తున్నాడు. ఎంత ప్రాధేయపడినా కనికరించకుండా, అనరాని మాటలన్నాడు. కాని నా అమానత్తును మాత్రం తిరిగి ఇవ్వలేదు. రిక్తహస్తాలతో మిగిలాను. ఏ మార్గమూ కానరావడం లేదు’ అంటూ బోరుమన్నాడు. బహెలూల్ అతణ్ణి ఊరడిస్తూ.. ‘నువ్వేమీ బాధపడకు..దైవ చిత్తమైతే ఆ పైకం నేను ఇప్పిస్తాను’ అన్నారు ప్రశాంతంగా.. ‘అవునా..! నా పైకం ఇప్పిస్తారా..? కాని ఎలా సాధ్యం? ఆ వ్యక్తి పరమ దుర్మార్గుడు... నాకైతే ఏమాత్రం నమ్మకం కుదరడంలేదు.’ అన్నాడు అతనే నిరాశతో.. ‘అలా అనకు.. నిరాశ తిరస్కారం (కుఫ్ర్) తో సమానం.. ఇన్షా అల్లాహ్ నీ పైకం నీకు తప్పకుండా లభిస్తుంది.’ అన్నారు బహెలూల్. ‘నిజమే.. ఆశ లేకపోతే మనిషి బతకలేడు. కాని.. ఎలా సాధ్యమో కూడా అర్ధం కావడంలేదు.’ ‘నువ్వు ఆందోళన చెందకు. నేను చెప్పినట్లు చెయ్. నీ పైకం ఇప్పించే పూచీనాది’ అన్నారు బహెలూల్ ధీమాగా.. ‘సరే ఏం చేయమంటారో చెప్పండి. ’అన్నాడతను. ఆశగా.. ‘రేపు ఉదయం ఫలానా సమయానికి నువ్వు ఆ వ్యక్తి దుకాణం దగ్గరికిరా.. నేనూ ఆ సమయానికి అక్కడికి వస్తాను. నేను ఆవ్యక్తితో మాట్లాడుతున్న క్రమంలో నువ్వొచ్చి నీ అమానత్తును అడుగు’ అన్నారు బహెలూల్. సరేనంటూ ఆ వ్యక్తి బహెలూల్ దగ్గర సెలవు తీసుకొని వెళ్ళి పోయాడు. తెల్లవారి ఉదయం బహెలూల్ ఆ వ్యక్తి దగ్గరికెళ్ళి తనను తాను పరిచయం చేసుకున్నారు. కాసేపు అవీ ఇవీ మాట్లాడిన తరువాత, తాను కొన్నాళ్ళపాటు పని మీద ఎటో వెళుతున్నానని, తన దగ్గర ఉన్న సంచిలో వంద బంగారునాణాలు, కొంతనగదు ఉన్నాయని, కాస్త ఈ సంచి దగ్గర ఉంచితే తిరిగొచ్చిన తరువాత తీసుకుంటానన్నారు. ఆ వ్యక్తి లోలోన సంతోషపడుతూ, సరేనని సంచీ అందుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి మోసపోయిన వ్యక్తి వచ్చి తను అమానతుగా ఉంచిన పైకం ఇమ్మని అడిగాడు. ఆ వ్యాపారి ఒక్కక్షణం ఆలోచించి, ఇప్పుడు గనక ఇతని తో పేచీ పెట్టుకుంటే, విలువైన బంగారు నాణాల సంచి చేజారే అవకాశముందని గ్రహించాడు. వెంటనే అతని పైకం అతనికిచ్చేశాడు. అతను సంతోషంగా పైకం తీసుకొని కృతజ్ఞత లు చెప్పి వెళ్ళిపోయాడు. బహెలూల్ తన సంచిని వ్యాపారి దగ్గర అమానత్తుగా ఉంచి తన దారిన తను వెళ్ళిపోయారు. కొంతసేపటి తరువాత, అతడు సంబరపడుతూ, బహెలూల్ దాచిన నాణాల సంచి విప్పిచూసి, నోరెళ్ళబెట్టాడు. అందులో గాజు పెంకులు, గులక రాళ్ళు తప్ప మరేమీ లేవు. తను చేసిన మోసానికి తగిన శాస్తే జరిగిందని భావించాడు. ఇకనుండి ఎవరినీ మోసం చేయకూడదని నిర్ణయించుకొని ధర్మబద్ధమైన జీవనం ప్రారంభించాడు. మోసపోయినప్పుడు నిరాశ పడకూడదు. తెలిసిన వాళ్లు, తెలివైన వాళ్లను ఆశ్రయించాలి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
Eid al-Adha: మనోవాంఛల త్యాగోత్సవం బక్రీద్
హజ్రత్ ఇబ్రాహీమ్, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిముస్సలాంల త్యాగాలను స్మరించుకునే త్యాగోత్సవం... ప్రపంచ విశ్వాసుల పర్వదినం బక్రీద్. జిల్ హజ్ మాసం పదవ తేదీన జరుపుకొనే బక్రీద్ ఒక అపూర్వమైన పండుగ. ఇదేదో షరా మామూలుగా జరిగే ఆచారం కాదు. మహత్తర సందేశం కలిగిన శుభదినం. క్రియారూపంలో దైవధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అద్భుత ప్రక్రియ. మనిషి తనను తాను తగ్గించుకొని, వినమ్ర పూర్వకంగా అల్లాహ్ ఔన్నత్యాన్ని, ఆయన ఘనతను కీర్తించే గొప్పరోజు. మనందరి ధర్మం ఒక్కటే. మనమంతా ఒక్కటే. సమస్త మానవజాతీ ఒక్కటే.. అని ఎలుగెత్తి చాటే రోజు. మానవ సహజ దౌర్బల్యాల వల్ల చిన్నా చితకా పాక్షిక విభేదాలు ఉన్నప్పటికీ అందరి విశ్వాసం ఒక్కటే అనడానికి ప్రబల తార్కాణం ఈ పండుగ. మౌలిక విశ్వాసం పరంగా ఒక్కటిగానే ఉన్న మనం పొరపొచ్చాలను విస్మరించి తోటి సోదరుల్ని గుండెలకు హత్తుకోవాల్సిన రోజు. పరోపకారమే పండుగ సందేశం ఈ పర్వదినం మనకిచ్చే సందేశం ఏమిటంటే, సమాజాన్ని కలుపుకుని పోకుండా, నలుగురితో మమేకం కాకుండా, సాటి ప్రజల పట్ల ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోకుండా ఏ సంతోషమయినా, ఎంతటి ఆనందమైనా పరిపూర్ణం కాజాలదు. ఏ సంతోష కార్యమైనా నలుగురితో పంచుకోవాలని, కేవలం మన గురించి మాత్రమే కాకుండా సంఘం గురించి, సమాజం గురించి ఆలోచించాలని చెబుతుందీ పండుగ. ప్రతి ఒక్కరూ తమ స్థాయి, స్తోమతకు తగినట్లు ఈద్ జరుపుకుంటారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు జిల్ హజ్జ్ నెలలో ‘హజ్’యాత్రకు వెళతారు. అంతటి స్థోమత లేనివారు ఇళ్ళవద్దనే ఖుర్బానీలు ఇస్తారు. ఆ స్థోమత కూడా లేకపోతే రెండు రకతుల నమాజ్ ఆచరించినా దయామయుడైన అల్లాహ్ హజ్, ఖుర్బానీలు ఆచరించిన వారితో సమానంగా పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. ఆయన తన దాసుల చిత్తశుద్ధిని, సంకల్పాన్ని మాత్రమే చూస్తాడు. ఆయనకు ధనరాశులు, రక్తమాంసాల అవసరం ఎంతమాత్రం లేదు. కనుక సర్వకాల సర్వావస్థల్లో చిత్తశుద్ధితో కూడిన సత్కర్మలు ఆచరించాలి. పేదసాదల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. పండుగల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో వారిని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఆనందంలో వారినీ భాగస్వాములను చేయాలి. అప్పుడే నిజమైన పండుగ. తన అవసరాలను త్యజించి దైవ ప్రసన్నత కోసం ఇతరుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వమని చెప్పేదే ఈ త్యాగాల పండుగ మనకిచ్చే సందేశం. మంచికోసం మానవ సంక్షేమం కోసం, ధర్మం కోసం, ధర్మ సంస్థాపన కోసం ఎంతో కొంత త్యాగం చెయ్యాలన్న సందేశం ఇందులో ఉంది. ఈనాడు ముస్లిం సమాజం జరుపుకుంటున్న త్యాగోత్సవానికి ఇదే అసలు ప్రేరణ. అందుకని, పండుగ సందర్భంగా చేసే ప్రతి ఆచరణలో త్యాగ ధనులైన హజ్రత్ ఇబ్రాహీం, ఇస్మాయీల్ గార్ల స్ఫూర్తి తొణికిసలాడాలి. దైవప్రసన్నత కోసం, ఇహ పర సాఫల్యం కోసం వారు ఎలాంటి పరీక్షలు ఎదుర్కొన్నారో, ఎంతటి సహన స్థయిర్యాలు కనబరిచారో ఇతరులు కూడా అలాంటి ప్రయత్నం చెయ్యాలి. సచ్ఛీలత, సదాచారం, త్యాగం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోవాలి. మనోవాంఛల త్యాగం అన్నిటికన్నా ముఖ్యమైనది. ఈ సందర్భంగా ఖుర్బానీలు ఇచ్చుకోవడం, నమాజులు చేయడం, ఇతరత్రా ఇంకా ఏవో పుణ్యకార్యాలు ఆచరించడం ఒక్కటే కాదు... మనోవాంఛల త్యాగం అన్నిటికన్నా ముఖ్యమన్న విషయాన్ని విస్మరించకూడదు. ఇది నిస్సందేహంగా కష్టంతో కూడుకున్న కార్యమే. కాని, హజ్రత్ ఇబ్రాహీం, ఇస్మాయీల్ త్యాగాలను స్మరించుకుంటే అది ఏమాత్రం కష్టం కాదు. మనం కూడా పరీక్షలు, కష్టాలు, త్యాగాల కఠినమయిన దశలను దాట వలసి ఉంది. ఈ మార్గంలో చేసే ఏ కృషి అయినా, ఏ త్యాగమయినా వృథా పోదు. చరిత్రే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. దైవం మనందరిలో త్యాగభావం, పరోపకార గుణాలను పెంపొందించాలని ప్రార్థిద్దాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఇస్లామ్ ధర్మంలో జిల్ హజ్ నెల ప్రాముఖ్యం..
ఇస్లామ్ ధర్మంలో జిల్ హజ్ నెలకు చాలా ప్రాముఖ్యం ఉంది. మొదటి పదిరోజులు ఇంకా ప్రాముఖ్యం కలవి. వారంలోని ఏడురోజుల్లో శుక్రవారానికి, సంవత్సరంలోని పన్నెండు నెలల్లో రమజాన్ నెలకు, రమజాన్ లోని 30 రోజుల్లో చివరి పదిరోజులకు ఏవిధంగా ప్రత్యేక ప్రాముఖ్యత ఉందో అదే విధంగా దైవం జిల్ హజ్ నెలలోని మొదటి దశకానికి.. అంటే, మొదటి పది రోజులకూ అలాంటి ప్రత్యేకతనే ప్రసాదించాడు. దైవ కారుణ్యం అపారంగా వర్షించే ఈ రోజులలో చేసే ప్రతి సత్కార్యమూ ఎనలేని ప్రాముఖ్యత కలిగి దైవ కృపకు పాత్రమవుతుంది. మనిషి ఈ దశకంలో చేసిన ఆరాధనలు ప్రీతికరమైనంతగా, మరే ఇతర దినాల్లో చేసిన ఆరాధనలు కూడా దైవానికి అంతగా ప్రీతికరం కావు. అంటే, జిల్ హజ్ నెల మొదటి పది రోజుల్లో చేసే ఆరాధనలు, సత్కార్యాలు దైవానికి మిగతా మొత్తం రోజులూ చేసిన ఆరాధనలు, సత్కార్యాలకంటే ఎక్కువ ప్రీతికరం అన్నమాట. ఈరోజుల్లో పాటించే ఒక్కొక్క రోజా (ఉపవాసం) సంవత్సరం మొత్తం పాటించే రోజాలకు సమానం. ‘అరఫా’ నాటి ఒక్క రోజా రెండు సంవత్సరాల పాపాలను ప్రక్షాళన చేస్తుంది. ఇందులోని ప్రతిరాత్రి ఆచరించే నఫిల్ లు షబేఖద్ర్ లో ఆచరించే నఫిల్లతో సమానం. అందుకని ఈ రోజుల్లో సత్కార్యాలు ఎక్కువగా ఆచరించే ప్రయత్నం చెయ్యాలి. ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’, ‘అల్లాహుఅక్బర్ ’, ‘అల్ హందులిల్లాహ్ ’ వచనాలు ఎక్కువగా పఠిస్తూ ఉండాలి. నిజానికి ఇవి హజ్ ఆరాధన కోసం ప్రత్యేకించబడిన రోజులు. ఆర్థిక స్థోమత కలిగినవారు తప్ప అందరూ హజ్ చేయలేరు. కాని అల్లాహ్ తన అపారమైన దయతో ఆ మహత్తరమైన పుణ్యఫలం పొందగలిగే అవకాశాన్ని అందరికీ ప్రసాదించాడు. జిల్ హజ్ నెల ప్రారంభమవుతూనే, తమ తమ ప్రాంతాల్లో, తమ తమ ఇళ్ళవద్దనే ఉంటూ హాజీలతో ఆత్మీయ సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. వారి ఆచరణలను అనుకరించే ప్రయత్నం చెయ్యాలి. ఇదే ఈద్ ఖుర్బానీలోని రహస్యం. హజ్ యాత్రకోసం మక్కాకు వెళ్ళిన హాజీలు జిల్ హజ్ మాసం పదవ తేదీన మినాలో ఖుర్బానీలు సమర్పిస్తారు. స్థోమత లేని కారణంగా హజ్ యాత్రకోసం మక్కా వెళ్ళలేకపోయిన ముస్లిములంతా తమ తమ స్వస్థలాల్లో ఇళ్ళవద్దనే ఖుర్బానీలు సమర్పిస్తారు. ఏ విధంగానైతే హాజీలు ‘ఇహ్రామ్’ ధరించిన తరువాత క్షవరం చేయించుకోరో, గోళ్ళు కత్తిరించుకోరో.. అలాగే ఖుర్బానీ ఇవ్వాలని సంకల్పించుకున్న ముస్లింలు కూడా గోళ్ళు కత్తిరించుకోరు, క్షవరం చేయించుకోరు. అంటే మక్కాకు వెళ్ళిన హాజీలను అనుకరించాలన్నమాట. ఈ విధంగా జిల్ హజ్ నెల మొదటి దశలో సాధ్యమైనంత అధికంగా సత్కార్యాలు ఆచరించి దైవానుగ్రహాన్ని, అపారమైన కారుణ్యాన్ని పొందడానికి శక్తివంచనలేని కృషి చేయాలి. మక్కావెళ్ళి హజ్ ఆచరించే అంతటి స్థోమత లేకపోయినా, కనీసం ఈదుల్ అజ్ హా పండుగ వరకు ఈ పదిరోజులను సద్వినియోగం చేసుకుంటే దైవం తన అపార కరుణతో హాజీలతో సమానంగా పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. కనుక హజ్ పరమార్ధాన్ని అర్థం చేసుకొని, దానికనుగుణంగా కర్మలు ఆచరిస్తూ, ‘ఈదుల్ అజ్ హా’ పర్వదినాన్ని జరుపుకుంటే ఇహ పరలోకాలలో సాఫల్యం పొందవచ్చు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఈదుల్ ఫిత్ర్ శుభాకాంక్షలతో... శుభాల పరిమళం..
మానవ జీవితంలో ఆనంద సమయాలు చాలా ఉంటాయి. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యక్తిగతంగానో, సామూహికంగానో ఏదైనా మేలు జరిగినప్పుడు మానవ అంతరంగం ఆనందంతో పులకించడం సహజం. అలాంటి వాటిలో పండుగలు ముఖ్యమైనవి. వాటిలో రంజాన్ ఇంకా ముఖ్యమైనది. ముస్లిం సోదరులు జరుపుకునే ‘ఈద్’కి రంజాన్ మాసంతో సంబంధం ఉండటం వల్ల ఈ పండుగ అదే పేరుతో ప్రసిద్ధికెక్కింది. నిజానికి రమజాన్ అన్నది సంవత్సరంలోని పన్నెండు నెలల్లో తొమ్మిదవ నెల పేరు. దీనికింతటి ప్రత్యేకత రావడానికి కొన్ని కారణాలున్నాయి. సర్వ మానవాళికి మార్గదర్శక గ్రంథమైన పవిత్ర ఖురాన్ రమజాన్ మాసంలోనే అవతరించింది. మానవజాతికి జ్ఞానకాంతిని ప్రసాదించే దివ్యజ్యోతి రమజాన్ మాసంలో అవతరించిన కారణంగానే ఈ మాసానికి ఇంతటి గౌరవం, ఘనత, పవిత్రత ప్రాప్తమయ్యాయి. మానవుల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి అద్భుతంగా ఉపకరించే ‘రోజా’ అనే ఉపవాస వ్రతాన్ని కూడా దైవం ఈ నెలలోనే విధిగా చేశాడు. ఇది జనహృదయాల్లో భయభక్తులు జనింపజేసి, మానవీయ విలువలను, సుగుణాలను పెంపొందిస్తుంది. పాపకార్యాలు, దుర్మార్గాల వైపుకు మనసు పోకుండా కాపాడుతుంది. ఉపవాసం వల్ల సహనశక్తి పెరుగుతుంది. జాలి, దయ, కరుణ, త్యాగం, పరోపకారం లాంటి సద్గుణాలు అలవడతాయి. స్థితిపరులు ఉపవాసం పాటిస్తే, పేదసాదల ఆకలి బాధను వారు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఇలా మరెన్నో మానవీయ, నైతిక సుగుణాలను మానవుల్లో పెంపొందింపజేసే ఏర్పాటును చేసిన విశ్వప్రభువుకు కృతజ్ఞతగా నెల రోజుల ఉపవాసాలను ముగించి షవ్వాల్ మొదటి తేదీన ఈద్ జరుపుకుంటారు. దేవుని మన్నింపు లభించే మహత్తర శుభదినం ఈద్. తప్పులు, పొరపాట్లకు క్షమాపణ కోరుకునే రోజు ఈద్. జరిగిన తప్పుల పట్ల సిగ్గుపడుతూ, ఇకముందు తప్పులు చేయం అని, దైవమార్గంపై స్థిరంగా ఉంటామని సంకల్పం చెప్పుకునే రోజు ఈద్. కనుక దేహంలో ప్రాణం ఉండగానే దైవం ఇచ్చిన సదవకాశాన్ని వినియోగించుకొని సన్మార్గం వైపు మరలాలి. ఒక విషయం సత్యమని తెలిసినా దానికనుగుణంగా తమ జీవితాలను మలచుకోడానికి చాలామంది ముందుకు రారు. ఇదే మానవుల బలహీనత. దీన్ని అధిగమించడంలోనే విజ్ఞత, వివేకం దాగి ఉన్నాయి. పుట్టిన ప్రతి మనిషీ గిట్టక తప్పదన్న విషయం ఎంత సత్యమో, ఈ అశాశ్విత దేహం నుండి ఆత్మ ఎప్పుడు వీడిపోతుందో ఎవరికీ తెలియదన్నదికూడా అంతే సత్యం. అందుకే ఈ ఆత్మజ్యోతి ఆరిపోకముందే జాగృతమై దైవం వైపు మరలాలి. జరిగిపోయిన తప్పుల్ని సవరించుకొని రుజుమార్గం పైకిరావాలి. మనం తెలిసీ తెలియక చేసిన పాపాలను క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. పవిత్ర రమజాన్ దీనికి చక్కని అవకాశం కల్పించింది. ఈ నెల్లాళ్ళూ ఎంతటి నియమ నిష్టలతో గడిపారో ఇకముందు కూడా ఇదే స్ఫూర్తి కొనసాగిస్తామని ప్రతిన బూనాలి. ఈద్ పర్వదినం సందర్భంగా ఇలాంటి దృఢ సంకల్పం చెప్పుకుంటే అది నిజమైన పండుగ రోజు అవుతుంది. జీవితాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసే శుభదినం అవుతుంది. ఒకవేళ ఈవిషయాలపట్ల శ్రద్ధ వహించక పోతే ఈద్ సౌభాగ్యానికి దూరమయ్యే ప్రమాదం కూడా ఉంది. కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దైవానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ పవిత్ర జీవితం గడిపే ప్రయత్నం చెయ్యాలి. పండుగ రోజు వేకువ ఝామునే నిద్రలేచి స్నానపానాదులు ముగించుకొని ప్రాతః కాల ఫజర్ నమాజు చేయాలి. ఉన్నంతలో మంచి దుస్తులు ధరించి, అత్తరు లాంటి సువాసన ద్రవ్యాలను వినియోగించాలి. ఈద్గాలో సమావేశమై సామూహికంగా దైవానికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తూ ఈద్ నమాజ్ చేయాలి. కరోనా కారణంగా ఈసారి ఈద్ గాహ్‌లలో కాకుండా మసీదులలోనే మాస్క్ ధరించి, భౌతికదూరం పాటిస్తూ నమాజు ఆచరించవలసి ఉంది. తమ అపరాధాలను మన్నించమని, సన్మార్గాన నడపమని దుఆ చేయాలి. సమస్త మానవాళి సుఖసంతోషాలను కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేయాలి. వ్యాధుల బారినుండి, అప్పుల బారినుండి, శత్రువుల బారినుండి,కరువుకాటకాల నుండి, దారిద్య్రం నుండి తమను, దేశాన్ని, యావత్ భూప్రపంచాన్ని రక్షించమని, ముఖ్యంగా కరోనా మహమ్మారి నుండి మానవాళినంతటినీ కాపాడమని విశ్వప్రభువును వేడుకోవాలి. స్నేహితులు, బంధువులు, ఇరుగు పొరుగు, పరిచితులు, అపరిచితులందరితో సంతోషాన్ని పంచుకోవాలి. ‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకోవాలి. అన్ని సందర్భాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలి. పండుగ పరమార్థాన్ని అవగాహన చేసుకుంటే రమజాన్ ఆరాధనల ఆశయం నెరవేరుతుంది. భావి జీవితాలు సుఖసంతోషాలతో గడిచిపోతాయి. సమాజంలో శాంతి, సామరస్యాలు వెల్లివిరుస్తాయి. ఒక చక్కని సుందర సమాజం ఆవిష్కృతమవుతుంది. పండుగ పంచిన మంచి మానవ జీవితాల్లో చివరి శ్వాస వరకూ గుబాళించాలని మనసారా కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
బలమైన కుటుంబంతో బలమైన సమాజం
మానవజాతి మనుగడకు కుటుంబం పునాది. భార్యాభర్తల అనుబంధం ద్వారా కుటుంబం ఉనికిలోకొస్తుంది. ఈ అనుబంధమే కౌటుంబిక వ్యవస్థ పునాదులను పటిష్ట పరుస్తుంది. దానిద్వారా సమాజం ఏర్పడుతుంది. కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే భార్యాభర్తల మధ్య బంధం పటిష్టంగా ఉండాలి. ఆ బంధం పటిష్టంగా లేకపోతే సంసార నావ ముందుకు సాగదు. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాల బంధమే దీన్ని సురక్షితంగా కాపాడగలుగుతుంది. సంసార జీవితంలో ఒడిదుడుకులు వస్తుంటాయి, పోతుంటాయి. సర్దుకు పోవడమే సంసార రహస్యం. అలకలు, గిల్లికజ్జాలు, బతిమాల్పులు సహజం. ఐక్యత, ప్రేమ, అనురాగం, సహనం, త్యాగం తదితర సుగుణాల మేళవింపే కుటుంబం, సంసారం. కాని, నేడు అన్ని రంగాలూ కలుషితమైనట్లుగానే కుటుంబ వ్యవస్థ కూడా పాడైపోయింది. తద్వారా సమాజం ప్రభావితమై, సామాజిక అసమానతలకు, విచ్చిన్నతకు దారితీస్తోంది. బంధాలు అనుబంధాలు అపహాస్యం పాలవుతున్నాయి. ఈ విధంగా కుటుంబంలో, సమాజంలో ఆత్మీయత, మానవీయ విలువలు మృగ్యమైపోతున్నాయి. ‘తల్లిదండ్రుల పట్ల సత్ ప్రవర్తనతో మెలగమని, వారి సేవచేయాలని మేము మానవుణ్ణి ఆదేశించాము. అతని తల్లి బాధపై బాధను భరిస్తూ అతణ్ణి కడుపులో పెట్టుకొని మోసింది. అతణ్ణి పాలు మరిపించడానికి ఆమెకు రెండు సంవత్సరాలు పట్టింది. కనుక నాపట్ల కృతజ్ఞుడవై ఉండు. నీ తల్లిదండ్రుల పట్ల కూడా కృతజ్ఞతగా మసలుకో. చివరికి నువ్వు నావద్దకే మరలి రావలసి ఉంది.’ (దివ్యఖురాన్ 31 – 14) హజ్రత్ ఆయిషా (రజి) ఉల్లేఖనం ప్రకారం: ‘మీలో ఎవరైతే మీ కుటుంబంతో మంచిగా మసలుకుంటారో వారే ఉత్తములు.’ అన్నారు ప్రవక్త మహనీయులు. కుటుంబ సభ్యులు, బంధుగణంతో సత్సంబంధాలు కొనసాగిస్తేనే బంధాలు బలపడతాయి. కుటుంబ వ్యవస్థ, తద్వారా సమాజం బలోపేతమవుతుంది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
వెంట వచ్చేది పాప పుణ్యాలు మాత్రమే!
దేవుడున్నాడా అనే విషయంలో భేదాభిప్రాయాలున్నాయి గాని, మరణం ఉందా.. లేదా? అనే విషయంలో ఎవరికీ ఎటువంటి భిన్నాభిప్రాయమూ లేదు. కాని, ‘మరణం తథ్యం’ అని తెలిసినా మనం పట్టించుకోం. ముహమ్మద్ ప్రవక్త (స)వారు ఒక మాట చెప్పారు. ‘ధర్మాధర్మాల విచక్షణ పాటించండి. మంచి పనులు విరివిగా చేయండి. రేపు మిమ్మల్ని కాపాడేవి ఇవే. ‘ఎందుకంటే, మీరు సంపాదించిన డబ్బూ దస్కం, ఆభరణాలు, ఆస్తిపాస్తులు సమస్తం మీ ఊపిరి ఆగిన మరుక్షణమే మీతో సంబంధాన్ని తెంచుకుంటాయి. మీరు తినీ తినకా, ధర్మం అధర్మం అని ఆలోచించక, రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదించినదంతా మీది కాకుండా పోతుంది. భార్యాబిడ్డలు, బంధుగణం, మిత్రబృందం మిమ్మల్ని సమాధి వరకు మాత్రమే సాగనంపుతారు. సమాధిలో దించి, మిమ్మల్ని మట్టిలో కలిపేసి వెళ్ళిపోతారు. మీ వెంట వచ్చేది, మిమ్మల్ని కాపాడేది కేవలం మీరు చేసుకున్న మంచి పనులు మాత్రమే.’ కనుక ధర్మాధర్మాలను విడిచిపెట్టి, ఇతరులను మోసం చేసి, అక్రమ దారిలో సంపాదించి చివరికి బావుకునేదేమిటో ఎవరికివారు ఆలోచించుకోవాలి. ఎన్నో అడ్డదారులు తొక్కి, వారినీ వీరినీ వంచించి సంపాదించేదంతా సుఖమయ జీవితం కోసమేగదా.. రేపటి మన సంతోషం, మన పిల్లల భవిష్యత్తు కోసమేగదా? అక్రమ సంపాదనలో నిజమైన సంతోషం ఉండకపోగా, అది ఎప్పుడూ మనసులో కెలుకుతూనే ఉంటుంది. అయినా అంతరాత్మను అణగదొక్కి అడ్డదారికే ప్రాధాన్యతనిస్తాం. కేవలం కొన్ని సంవత్సరాల ప్రాపంచిక జీవితం కోసమే ఇంతగా ఆలోచించే మనం, మరి శాశ్వతమైన రేపటి కోసం ఏం సంపాదిస్తున్నామన్నది కూడా ఆలోచించాలి. ఈ ‘రేపు’ మూన్నాళ్ళ ముచ్చట. కాని ఆ ‘రేపు’ శాశ్వతం. దానికోసం ఏం చేస్తున్నాం.. ఏం దాచుకుంటున్నాం? ఇదికదా అసలు ప్రశ్న. ఇహలోక జీవితం ఎలా గడిచినా పరలోక సాఫల్యం లభిస్తే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది. దానికోసం ఆలోచించాలి. దానికోసం శ్రమించాలి. మంచీ చెడుల విచక్షణతో, ధర్మబద్ధంగా ముందుకు సాగితే, ఆ క్రమంలో ఎంత లభిస్తే అంతతో సంతృప్తి చెందితే అదే అసలు విజయం. అసలు సాఫల్యం. కేవలం మన లాభం కోసం ఇతరులను వంచించడం మానవీయత కే వ్యతిరేకం. కాబట్టి, ఇహలోక జీవితం ప్రశాంతంగా, సంతోషంగా, గౌరవప్రదంగా సాగిపోవాలన్నా, రేపటి పరలోక జీవితం జయప్రదం కావాలన్నా మరణాన్ని మరువకూడదు. దైవానికి భయపడుతూ, మంచీచెడుల విచక్షణ పాటిస్తూ, ధర్మబద్ధమైన జీవితం గడపాలి. దైవం మంచి బుద్ధిని, విచక్షణా జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
దేవుడు ఎలా ఉంటాడు?
ఒకసారి బాగ్దాదు నగరంలో గొప్ప ధార్మిక సభ జరుగుతోంది. వేలాది మంది ప్రజలు ఆ సభలో పాల్గొన్నారు. అనేకమంది పండితులు ప్రజలను ఉద్దేశించి ప్రవచనం చేస్తున్నారు. అంతలో ఒక వ్యక్తి సభలోకి ప్రవేశించి, పండితులకు ఒక సవాలు విసిరాడు. ‘మీరు చెబుతున్న ప్రకారం, ఈ సృష్టి మొత్తానికి ఒక కర్త ఉన్నాడు. అయన అల్లాహ్, అంటే సృష్టికర్త. మరి ఆయనే సమస్తాన్ని సృష్టించినప్పుడు ‘ఆయన్ని’ ఎవరు సృష్టించారు? ఆయనకు ముందు ఎవరున్నారు? ’అని ప్రశ్నించాడు. సభలో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. పండితులు అతని ప్రశ్నకు సమాధానం చెప్పారు. కాని అతను సంతృప్తి చెందలేదు. పండితులు తల పట్టుకున్నారు. అతనికి అర్థమయ్యేలా సంతృప్తికరమైన సమాధానం ఎలా చెప్పాలో వారికి అర్థం కాలేదు. ఆ వ్యక్తి గర్వంగా సభికుల వైపు చూశాడు. అంతలో సభికుల్లోంచి ఓ పదకొండేళ్ళ బాలుడు సమాధానం చెబుతానని ముందుకొచ్చాడు. ఆ వ్యక్తి బాలుణ్ణి చూసి, ‘నువ్వు సమాధానం చెబుతావా?’ అంటూ వెటకారంగా నవ్వాడు. ఆ బాలుడు ఏమాత్రం తొణక్కుండా, ‘అవును నేనే.. మీప్రశ్న మరోసారి వినిపించండి’ అన్నాడు.‘అన్నిటికీ అల్లాయే అంటున్నారు గదా.. మరి అల్లా‹ß కు ముందు ఎవరున్నారు?’ అని ప్రశ్నించాడు.అప్పుడా బాలుడు, ‘మీకు ఒకటి, రెండు ఒంట్లు వచ్చుగదా..? ఒకటి నుండి పది వరకు లెక్కించండి’. అన్నాడు.‘ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ‘ఇదేమి పిచ్చి ప్రశ్న’ అంటూనే ఒకటి నుండి పది వరకు లెక్కించాడు.‘పది తరువాత..?’ అన్నాడా బాలుడు.‘పదకొండు..పన్నెండు..’ఇలా ఎంతవరకైనా వెళ్ళవచ్చు.’ అన్నాడా వ్యక్తి. ‘అవును కదా..! అలాగే పది నుండి వెనక్కి లెక్కించండి. ’అన్నాడా బాలుడు. ‘పది..తొమ్మిది..ఎనిమిది..ఇలా .. ఒకటి వరకు వచ్చి ఆగి పొయ్యాడు.‘తరువాత..? లెక్కించండి..’ అన్నాడు బాలుడు.‘తరువాత ఇంకేముంటుంది. ఏమీలేదు.. సున్నా.. శూన్యం.’ అన్నాడా వ్యక్తి.‘..కదా..? అల్లాహ్ కు ముందు కూడా ఏమీ లేదు.. అంతా శూన్యం. అన్నిటికీ కర్త ఆయనే..’ అన్నాడు బాలుడు.సభలో కరతాళ ధ్వనులు మిన్నంటాయి. ప్రశ్నించిన వ్యక్తి ముఖం వాడిపోయింది. వెంటనే రెండో ప్రశ్న సంధించాడు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
మనసులు గెలిచే మంచితనం
అది ముహమ్మద్ ప్రవక్త (స) ధర్మ ప్రచారం చేస్తున్న తొలి దినాల మాట. ఒకసారి ఆయన మక్కా వీధిగుండా వెళుతున్నారు. కూడలిలో ఒక వృద్ధురాలు కొంత సామగ్రితో నిలబడి ఉంది. మూటలు బరువుగా ఉండడంతో దారిన వెళ్ళేవారిని బతిమాలుతోంది కాస్త సాయం చేయమని. కాని, ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. అంతలో ముహమ్మద్ ప్రవక్త అటుగా వెళుతూ, వృద్ధురాలిని ఎవరూ పట్టించుకోక పోవడం చూసి, ఆమెను సమీపించారు. ‘అమ్మా నేను మీకు సహాయం చేస్తాను’ అన్నారు. ‘బాబ్బాబూ.. నీకు పుణ్యముంటుంది. ఈ మూట చాలా బరువుగా ఉంది. మోయలేక పోతున్నాను. కాస్త అందాకా సాయం చేస్తే నేను వెళ్ళిపోతాను’ అన్నదామె. ‘అయ్యో! దీనికేం భాగ్యం’ అంటూ మూట భుజానికెత్తుకొని, ఆమె కోరిన చోటుకు చేర్చారు ప్రవక్త మహనీయులు. ‘బాబూ! దేవుడు నిన్ను చల్లగా చూడాలి. ఏ తల్లి కన్నబిడ్డవో గాని ముక్కూమొహం తెలియని నాలాంటి ముసలిదానికి ఇంత సహాయం చేశావు. బాబూ! ఒక్కమాట వింటావా. ఎవరో ముహమ్మద్ అట, ఏదో కొత్తమతాన్ని ప్రచారం చేస్తున్నాడట. అతని మాటల్లో ఏముందో గాని చాలామంది అతని ప్రభావంలో పడిపోతున్నారు. జాగ్రత్త నాయనా! అతని మాటల్లో పడకు. నేను కూడా అందుకే ఊరే విడిచి వెళ్ళిపోతున్నాను’. అని హితవు పలికింది. ‘సరేనమ్మా’ అంటూ ఆమె చెప్పిందంతా ఓపిగ్గా విని, వినయపూర్వకంగా అవ్వకు అభివాదం చేసి సెలవు తీసుకున్నారు ముహమ్మద్ ప్రవక్త(స). ఆ మహనీయుని మంచితనానికి, వినయ పూర్వకమైన ఆ వీడ్కోలుకు ఆనంద భరితురాలైన వృద్ధురాలు ఒక్కసారిగా భావోద్రేకానికి లోనై, ‘బాబూ !’ అని పిలిచింది ఆప్యాయంగా. ‘అమ్మా!’ అంటూ దగ్గరికి వచ్చిన ప్రవక్త తలపై చేయి వేసి నుదుటిని ముద్దాడుతూ, ‘బాబూ !’ నీ పేరేమిటి నాయనా?’ అని అడిగింది ప్రేమగా. ప్రవక్త ఏమీ మాట్లాడకుండా తలవంచుకొని మౌనం వహించారు. ‘బాబూ! పేరైనా చెప్పు నాయనా కలకాలం గుర్తుంచుకుంటాను’ అంటూ అభ్యర్ధించిందామె. అప్పుడు ప్రవక్త మహనీయులు, ‘అమ్మా! నా పేరు ఏమని చెప్పను? ఏ ముహమ్మద్‌కు భయపడి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నావో ఆ ముహమ్మద్‌ను నేనేనమ్మా!’ అన్నారు తలదించుకొని. దీంతో ఒక్కసారిగా వృద్ధురాలు అవాక్కయి పోయింది. కాసేపటి వరకు ఆమెకేమీ అర్థ కాలేదు. ఏమిటీ.. నేను వింటున్నది ముహమ్మద్ మాటలనా..! నేను చూస్తున్నది స్వయంగా ముహమ్మద్నేనా..? నాకళ్ళు, చెవులు నన్ను మోసం చేయడం లేదు కదా..!’ ఆమె మనసు పరిపరి విధాలా ఆలోచిస్తోంది. ఎవరి మాటలూ వినకూడదని, ఎవరి ముఖం కూడా చూడకూడదని పుట్టి పెరిగిన ఊరినే వదిలేసిందో, అతనే తనకు సహాయం చేశాడు. ఎవరూ పట్టించుకోని నిస్సహాయ స్థితిలో ఆప్యాయత కురిపించాడు. సహాయం కంటే ఎక్కువగా ఆయన మాట, మంచితనం, వినమ్రత, మానవీయ సుగుణం ఆమెను మంత్రముగ్ధురాల్ని చేసింది. కళ్ళనుండి ఆనంద బాష్పాలు జలజలా రాలుతుండగా, ‘బాబూ ముహమ్మద్ ! నువ్వు నిజంగా ముహమ్మద్వే అయితే, నీనుండి పారిపోవాలనుకోవడం నా దురదృష్టం. ఇక నేను ఎక్కడికీ వెళ్ళను. నీ కారుణ్య ఛాయలోనే సేద దీరుతాను.’ అంటూ అదే క్షణాన ప్రవక్తవారి ప్రియ శిష్యురాలిగా మారిపోయింది. ఇదీ ప్రవక్తమహనీయుని ఆచరణా విధానం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
పహిల్వాన్ గర్వభంగం
పూర్వం ఒక ఊరిలో పెద్ద పహిల్వాను ఉండేవాడు. గొప్ప బలశాలి. ఎంతటి మల్లయోధుడినైనా క్షణాల్లో మట్టికరిపించగల కండబలం, నైపుణ్యం అతని సొంతం. కొన్నాళ్ళపాటు అతను కుస్తీ ప్రపంచానికి రారాజుగా వెలిగిపొయ్యాడు. తనతో పోటీకి దిగిన ప్రతి ఒక్కరినీ ఓడించి విజేతగా నిలిచేవాడు. అతని పేరు వింటేనే పెద్దపెద్ద యోధులు వణికిపొయ్యేవారు. దూరతీరాల వరకూ అతని ఖ్యాతి మారుమోగి పోయింది. దీంతో అతడికి ఎక్కడలేని గర్వం తలకెక్కింది. ఎవరినీ ఖాతరు చేసేవాడుకాదు. ఒకసారి అతడు అహంకారపు అంచులు తాకుతూ, ప్రపంచంలోని బలవంతులనందరినీ ఓడించిన తనకు ఎదురే లేదన్న అహంకారంతో దైవం పట్లకూడా తలబిరుసు తనం ప్రదర్శించాడు. ‘నన్ను ఎదిరించేవాడు, నాతో తలపడి గెలిచి నిలిచే వాడు ప్రపంచంలో ఎవడూ లేడు. నాతో తలపడడానికి ఇక నీ దూతలను పంపు నేను వారిని కూడా ఓడించి భూమ్యాకాశాల విజేతగా నిలుస్తాను.’ అంటూ పొగరుగా వికటాట్టహాసం చేశాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. సర్వశక్తిమంతుడైన దైవం అతని పొగరును, అహంకారాన్ని అణచాలని అనుకున్నాడు. తను ప్రసాదించిన శక్తిసామర్థ్యాలను చూసుకొని అతడు ఆ విధంగా విర్రవీగడం దైవానికి నచ్చలేదు. దాంతో దైవం అతని శక్తిని క్షీణింపజేశాడు. అతణ్ణి నిస్సహాయుడుగా మార్చాడు. ఒకరోజు అతడు ఓ ఎత్తైన కొండ ఎక్కి తన కళలన్నీ ప్రదర్శిస్తూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించడం ప్రారంభించాడు. తనను ఢీ కొట్టగల శక్తి ఈ భూమండలం పైనే కాదు, గగన తలంపై కూడా లేదని విర్రవీగాడు. అలా కొద్ది సేపటి తరువాత అదే బండరాతిపై ఠీవిగా కూర్చున్నాడు. అంతలో అతనికేదో మైకం ఆవరించినట్లు అనిపించిది. తలాపున ఇటుకలాంటి ఓరాతి ముక్కను పెట్టుకొని అలానే ఓపక్కకు ఒరిగి పొయ్యాడు. అంతలో ఒక ఎలుక ఎటునుండి వచ్చిందో, అతని కాలి వేలును పట్టుకొని కొరక సాగింది. అతను దాన్ని విదిలించుకోడానికి ప్రయత్నించాడు. కాని కాలు కుడా కదిలే పరిస్థితిలో లేదు. శరీరమంతా నిస్సత్తువ ఆవరించింది. కొద్దిసేపటి క్రితం వరకూ కొండల్ని సైతం పిండి చేయగల శక్తిసామర్థ్యాలు ప్రదర్శించి సత్తా చాటిన పర్వతమంత బలశాలి పహిల్వాన్ నిస్సహాయ స్ధితిలో పడి ఉన్నాడు. కొద్ది దూరంలో నిలబడి ఇదంతా గమనిస్తున్న కొందరు ఆ పహిల్వానుతో, ‘చూశావా.. అల్లాహ్ తన సైన్యంలో అత్యంత అల్పమైన ఒక సైనికుడిని నీ దగ్గరికి పంపాడు. ఎందుకంటే ఆయన నీకు నీ స్థాయినీ, నీ అసలు బలాన్ని చూపించ దలచాడు. అహంకారం నుండి నిన్ను మేల్కొలిపి, కళ్ళు తెరిపించాలనుకున్నాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. కళ్ళు తెరువు. అందరికంటే బలవంతుడు, భూమ్యాకాశాల సృష్టికర్త అహంకారాన్ని ఎంతమాత్రం సహించడు. ఆయన ముందు సాగిలపడు.. ఆయన సన్నిధిలో పశ్చాత్తాప పడు, క్షమాపణ కోరుకో.. ఇప్పటికైనా తప్పు తెలుసుకొని అహంకారం వీడితే సర్వశక్తివంతుడు, దయామయుడు అయిన అల్లాహ్ నిన్ను క్షమిస్తాడు. ఆయన అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు’. అని హితవు పలికారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
అల్లాహ్ మాసం మొహర్రం
సత్యం కోసం, న్యాయం కోసం, ధర్మంకోసం, విలువల కోసం, హక్కులకోసం, ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరగతి పొందిన చారిత్రక రోజది. ఇస్లాం ధర్మం ప్రకారం సంవత్సరంలోని పన్నెండు మాసాలూ శుభప్రదమైనవే. పన్నెండులో నాలుగు మాసాలు అత్యంత గౌరవప్రదమైనవి. అందులో ‘మొహర్రం’ ఒకటి. ప్రవక్త(స) ప్రవచనం ప్రకారం ‘పన్నెండు మాసాలు ఒక సంవత్సరం. అందులో నాలుగు మాసాలు గౌరవప్రదమైనవి. జీఖాద, జిల్ హజ్జ, ముహర్రమ్, రజబ్. (బుఖారి 3197). కనుక ఈ మాసంలో ఇతర మాసాలకంటే ఎక్కువగా సత్కార్యాలు ఆచరిస్తూ పాపాలకు దూరంగా ఉండాలి. సమాజంలో సత్యం, న్యాయం, ధర్మం, మానవీయ విలువల పరిరక్షణకు కృషి చేయాలి. సమాజంలో ప్రబలిన అన్ని రకాల చెడులను రూపుమాపడానికి ప్రయత్నం చేయాలి. సతతం దైవభీతి (తఖ్వా) తో గడపాలి. అప్పుడే దైవ సహాయం లభిస్తుంది. ఈ మాసం ఘనతకు సంబంధించి ముహమ్మద్ ప్రవక్త(స) ఇలా అన్నారు. ‘ముహర్రం అల్లాహ్ మాసం. రమజాన్ ఉపవాసాల తరువాత శ్రేష్టమైన ఉపవాసాలు ముహర్రం ఉపవాసాలే.’ (సహీహ్ ముస్లిం: 2755) రమజాను ఉపవాసాలు ఫర్జ్ కాక ముందు ఆషూర (ముహర్రం పదవ తేది) ఉపవాసం విధిగా ఉండేది. అదే రోజు కాబాపై కొత్త వస్త్రం కప్పబడేది. (బుఖారి 1592). ప్రవక్త మహనీయులు మదీనాకు వలస వెళ్ళిన తరువాత, అక్కడి యూదులు రోజా (ఉపవాసం) పాటించడం గమనించారు. అది ముహర్రం పదవ తేదీ. (యౌమె ఆషూరా) అప్పుడు ప్రవక్త వారు, ‘ఏమిటి ఈరోజు విశేషం?’ అని వారిని అడిగారు. దానికి వారు, ‘ఇది చాలా గొప్పరోజు. ఈ రోజే దైవం మూసా ప్రవక్త(అ)ను, ఆయన జాతిని ఫిరౌన్ బారినుండి రక్షించాడు. ఫిరౌన్‌ను, అతడి సైన్యాన్ని సముద్రంలో ముంచేశాడు. అప్పుడు మూసా ప్రవక్త, దైవానికి కృతజ్ఞతగా రోజా పాటించారు. కనుక మేము కూడా ఆయన అనుసరణలో ఈరోజు ఉపవాసం పాటిస్తాము’. అని చెప్పారు. అప్పుడు ప్రవక్త మహనీయులు, మూసా ప్రవక్త అనుసరణలో రోజా పాటించడానికి మీకంటే మేమే ఎక్కువ హక్కుదారులం. అని చెప్పి, తమ అనుచరులకు రోజా పాటించమని ఉపదేశించారు. ఆషూరా ఉపవాసం కేవలం యూదులే కాదు, క్రైస్తవులు కూడా పాటించేవారు. ఈ ఇరువర్గాలూ ముహర్రం పదవ తేదీన మాత్రమే రోజా పాటించేవి. కాని ప్రవక్తవారు, మీరు రెండురోజులు పాటించమని తన సహచరులకు బోధించారు. అంటే ముహర్రం మాసం 9, 10 కాని, లేక 10,11 కాని రెండురోజులు రోజా (ఉపవాసం) పాటించాలి. ఆషూరా ఉపవాసం పాటించడం వల్ల గత సంవత్సరకాలం పాపాలు మన్నించబడతాయని కూడా ఆయన సెలవిచ్చారు. (ముస్లిం 1162). కాకతాళీయంగా ‘కర్బలా’ సంఘటన కూడా ఇదే రోజున జరగడం వల్ల దీని ప్రాముఖ్యత మరింతగా పెరిగిపోయింది. అంతమాత్రాన ముహర్రం మాసమంతా విషాద దినాలుగా పరిగణించడం సరికాదు. ఎందుకంటే సత్యం కోసం, న్యాయం కోసం, ధర్మంకోసం, విలువల కోసం, హక్కులకోసం, ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హజ్రత్ ఇమామె హుసైన్ (ర) అమరగతి పొందిన చారిత్రక రోజది. అమరత్వం అనేది మానవ సహజ భావోద్రేకాల పరంగా బాధాకరం కావచ్చునేమో గాని, విషాదం ఎంతమాత్రం కాదు. ‘కర్బలా’ సాక్షిగా ఒకవిశ్వాసి పోషించవలసిన పాత్రను ఆయన ఆచరణాత్మకంగా నిరూపించారు. అందుకే ఆ మహనీయుడు అమరుడై దాదాపు వేయిన్నర సంవత్సరాలు కావస్తున్నా, నేటికీ కోట్లాదిమంది ప్రజలకు, ప్రజాస్వామ్య ప్రియులకు ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలిచారు. అందుకే ప్రతియేటా ‘మొహర్రం’ మాసంలో ఆయనగారి త్యాగాన్ని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు స్మరించుకుంటారు. సమాజంలో దుర్మార్గం ప్రబలినప్పుడు, ఉన్మాదం జడలు విప్పినప్పుడు, విలువల హననం జరుగుతున్నప్పుడు, ప్రజాస్వామ్య వ్యవస్థ బీటలు వారుతున్నప్పుడు సమాజ శ్రేయోభిలాషులు, ప్రజాస్వామ్య ప్రియులు, న్యాయ ప్రేమికులు, పౌరసమాజం తక్షణం స్పందించాలి. న్యాయం కోసం, ధర్మం కోసం, మానవీయ విలువల కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పరిధిలో శక్తివంచన లేకుండా పోరాడాలి. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన ప్రస్తుత తరుణంలో దాన్ని కాపాడుకోడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి. ఇదే ఇమామె హుసైన్ అమరత్వం మనకిస్తున్న సందేశం. (30న ఇమామె హుసైన్ (ర) వర్ధంతి యౌమె ఆషూరా సందర్భంగా..) – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఇస్లాం వెలుగువ్యాపార ధర్మం
‘మీ సామగ్రి అమ్ముకోడానికి ప్రజలకు అబద్ధాలు చెప్పకండి, అసత్య ప్రమాణాలు చెయ్యకండి. అలా చేయడం వల్ల మీ వ్యాపారం అభివృద్ధి చెందినట్లు తాత్కాలికంగా అనిపించినా, చివరికి మీ వ్యాపారం లో శుభాలు అంతరించి పోతాయి. వ్యాపారంలో ఎప్పుడూ నమ్మకం, విశ్వసనీయత కలిగి ఉండాలి. పనికిరాని, నాసిరకం వస్తువుల్ని మాయమాటలు చెప్పి అమ్మడం గాని, సాధారణ లాభం కంటే చాలా ఎక్కువ లాభం గడించడంగాని చేసి, ధర్మబద్ధమైన మీ వ్యాపారాన్ని అధర్మమైనదిగా చేసుకోకండి. సత్యవంతుడైన వ్యాపారి ప్రళయ దినాన ప్రవక్తలు, సత్య సంధులు, షహీదుల సహచర్యంలో ఉంటాడు.’ అని ప్రవక్త మహనీయులవారు ఉపదేశించారు. అంతేకాదు, మీరు చేస్తున్న పనిలో శుభం (బర్కత్ ) కలగాలంటే ప్రాతః కాలాన్నే నిద్రలేవాలని చెప్పారు. ఉపాథి అన్వేషణలో, ధర్మసమ్మతమైన సంపాదన కోసం ప్రాతః కాలాన్నే ఎంచుకోండి. ఎందుకంటే ఉదయకాల ప్రార్ధన(నమాజ్ ) తరువాత చేసే పనుల్లో శుభాలు, లాభాలు సమృద్ధిగా ఉంటాయి. ధర్మసంపాదనతో జీవితం గడిపినవారు నా సంప్రదాయాన్ని పాటించినవారవుతారు. నా సున్నత్ ను పాటించినవారు తప్పకుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారు. ప్రవక్త మహనీయులవారి ఈ ఉపదేశాల ద్వారా మనకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. కనుక ప్రవక్తవారి సుభాషితాలను దృష్టిలో ఉంచుకొని, వ్యాపారంలో విలువలు పాటించాలి. సాధ్యమైనంతవరకు వినియోగదారునికి మంచి సరుకు, మంచి వస్తువు సమకూర్చే ప్రయత్నం చెయ్యాలి. మీకు నమ్మకంలేని సామగ్రిని మీరసలు అమ్మనే కూడదు. నిజాయితీగా, పట్టుదలతో వ్యాపారం చేసి బాగా సంపాదించుకోవడంలో ఎలాంటి తప్పూలేదు. కాని అబద్ధాలు చెప్పి, కల్తీచేసి, మాయచేసి, మోసంచేసి అడ్డదారులు తొక్కి సంపాదించాలన్న దుర్బుద్ధి ఉండకూడదు. వ్యాపారంలో నమ్మకం, నిజాయితీ, ఖచ్చితత్వం ఉండాలి. సరుకును కల్తీచేయడం, తూనికలు, కొలతల్లో మోసం చేయడం, అబద్ధం చెప్పడం లాంటి చేష్టలకు పాల్పడితే అలాంటి వ్యాపారికి వినాశం తప్పదని ప్రవక్త హెచ్చరించారు. ఒకసారి ప్రజలు, ‘అన్నిటికన్నా శ్రేష్టమైన సంపాదన ఏది?’ అని ప్రవక్తవారిని అడిగారు. దానికాయన, ‘స్వహస్తాలతో ఆర్జించిన సంపాదన..అబధ్ధం, నమ్మక ద్రోహం లేని వ్యాపారం’ అని సమాధానం చెప్పారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
అపార క్షమాగుణ సంపన్నుడు
పూర్వం సుఫ్యాన్ సూరి అనే ఒక గొప్ప ధార్మిక పండితుడు ఉండేవారు. అతని పొరుగున ఓ కుటుంబం ఉండేది. ఆ కుటుంబ యజమాని పెద్ద తాగుబోతు. ఎప్పుడూ నిషాలోనే ఉండేవాడు. ఇస్లామ్‌లో మద్యపాన సేవనం నిషిధ్ధం. కాని ఆవ్యక్తి అదేమీ పట్టించుకునేవాడు కాదు. కొన్నాళ్ళకు ఆవ్యక్తి చని పోయాడు. అందుకని అతని జనాజా నమాజు చేయించడానికి ఎవరూ ముందుకు రాలేదు. సుఫ్యాన్ సూరీ కూడా వెళ్ళలేదు. ఒక విశ్వాసికి ఇలాంటి దుర్గతి పట్టిందే అని బాధ పడ్డారు. అదే విషయాన్ని గురించి ఆలోచిస్తూ అలానే నిద్రలోకి జారుకున్నారు. అప్పుడాయనకు ఒక కల వచ్చింది. పొరుగు వ్యక్తి జనాజా నమాజు చేయించాలన్నది కల సారాంశం. మెలకువ వచ్చిన వెంటనే సుఫ్యాన్ సూరీ ఆలోచనలో పడ్డారు. చివరికి ఈ కలలో ఏదో పరమార్ధం ఉండి ఉంటుందని భావిస్తూ, పొరుగింటికి వెళ్ళారు. కుటుంబ సభ్యుల్ని విచారించారు. ఈ మనిషి ఎప్పుడూ తాగుతూ..తిరుగుతూ.. ఎప్పుడూ మత్తులోనే ఉండేవాడు కదా.. అసలు ఇతని ఆచరణ ఏమిటి.. మరణ సమయాన ఇతని పరిస్థితి ఏమిటి..? అని ఆరాతీశారు. అప్పుడు కుటుంబ సభ్యులు, ‘అవునండీ.. ఇతనెప్పుడూ తాగుతూనే ఉండేవాడు. ఎంత వారించినా వినేవాడుకాదు. పైగా, ఎదురు తిరిగి మమ్మల్నే తిట్టిపోసేవాడు. కాని చివరి రోజుల్లో తప్పు తెలుసుకున్నాడు. తాగుడు మానేసి పశ్చాత్తాప పడేవాడు. చేసిన పాపాల పట్ల సిగ్గు పడుతూ లోలోన కుమిలిపోయేవాడు. అంతిమ సమయం లో బాగా ఏడ్చాడు. తన ప్రభువు ముందు సాగిలపడి క్షమించమని మొర పెట్టుకున్నాడు. పరివర్తిత హృదయంతో కడుదీనంగా దైవాన్ని వేడుకున్నాడు. అదే స్థితిలో అతను అంతిమశ్వాస విడిచాడు’. అని చెప్పారు కుటుంబ సభ్యులు. ఈ సంఘటనను ఉటంకిస్తూ సుఫ్యాన్ సూరీ ఇలా అన్నారు. దైవ కారుణ్యం అనంతం. దానికి పరిమితులు లేవు. మానవుడు ఎప్పుడు, ఏ సమయంలో తన వైపుకు మరలినా అక్కున చేర్చుకోడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఆయన కారుణ్యం సంకుచితమైనదికాదు. బహు విశాలమైనది. దానికి ఎల్లలు, పరిధులు లేవు. ఇన్నాళ్ళుగా తప్పులు చేశామే.. పాప కార్యాలకు ఒడిగట్టామే.. జీవితమంతా తప్పుడు మార్గంలో గడిపి, ఇప్పుడు చివరిరోజుల్లో మంచి మార్గంలో నడిచినా ప్రయోజనమేమిటి? అని చాలామంది అనుకుంటారు. కాని ఈ భావన పూర్తిగా తప్పు. కేవలం ఈ కారణంగానే సన్మార్గానికి దూరంగా ఉండిపోయేవారు ఎంతోమంది. కాని ఇది సరైన విధానం కాదు. తెలిసో, తెలియకో జరిగిన తప్పులు, పాపాల పట్ల పశ్చాత్తాపం చెంది, ఇకనుండి అలాంటి దుర్నడతకు దూరంగా ఉంటామని ప్రతిన బూనాలి. దేవుని ముందు తప్పుల్ని అంగీకరించి, ఇకనుండి పరిశుధ్ధ జీవితం గడుపుతాము క్షమించమని వేడుకోవాలి. చిత్తశుధ్ధితో క్షమాపణ వేడుకునే వారి గత పాపాలన్నిటినీ దైవం క్షమిస్తాడు. పర్వతమంత ఎత్తు పేరుకు పోయిన పాపాలైనా, సముద్ర నురగకు సమానమైన పాపాలైనా సరే.. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన కారుణ్య ద్వారాలు అనునిత్యం తెరుచుకునే ఉంటాయి. తన దాసుల్ని శిక్షించాలన్నది ఆయన ఉద్దేశ్యం కానే కాదు. నిజానికి ఆయన కరుణ తన దాసులను క్షమించడానికి సాకులు వెదుకుతుంది. ఎందుకంటే ఆయన అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
సత్యమేవ జయతే!
ఒకసారి అబ్దుల్ ఖాదర్ అనే యువకుడు స్నేహితులతో కలసి ఉన్నత విద్యాభ్యాసం కొరకు సుదూర నగరానికి ప్రయాణమయ్యాడు. ఆ రోజుల్లో ఎలాంటి వాహన సదుపాయాలూ ఉండేవి కావు. ఎంతదూరమైనా కాలినడకనే ప్రయాణం. బందిపోట్ల బెడద కూడా ఎక్కువే. మార్గమధ్యంలో అబ్దుల్ ఖాదర్‌ను దొంగలు అడ్డుకున్నారు. నిలువెల్లా సోదా చేశారు. సంచులన్నీ వెదికారు. ఖాదర్ వద్ద ఏమీ దొరకలేదు. అబద్ధాలాడకుండా ఇంకా ఎవరెవరి దగ్గర ఏమేమున్నాయో అప్పగించండి. అని హుకుం జారీ చేశారు దొంగలు. అందరిదగ్గర ముందే దోచుకోవడం మూలాన ఎవరి దగ్గరా ఏమీ మిగల్లేదు. కాని అబ్దుల్ ఖాదర్ మాత్రం ఎవరికీ కనబడకుండా రహస్యంగా దాచిన పైకాన్ని తీసి దొంగలకు ఇచ్చేశాడు. ఇప్పుడు ఆశ్చర్యపోవడం దొంగల వంతయింది. ఆలోచనలో పడిన దొంగల నాయకుడు అబ్దుల్ ఖాదర్ ను దగ్గరికి పిలిచాడు. ‘నిజం చెప్పు, ఎంత వెదికినా దొరక్కుండా ఈ పైకాన్ని ఎక్కడ దాచావు?’. అని గట్టిగా ప్రశ్నించాడు. ‘అబద్ధం చెప్పేవాణ్ణయితే రహస్యంగా దాచుకున్నది మీకెందుకు చూపిస్తాను? ఇదిగో ఇక్కడ దాచింది మా అమ్మ, ’ అంటూ, నడుము బెల్టుకు లోపలిభాగంలో వస్త్రానికి అతుకేసి కుట్టిన వైనాన్ని వివరించాడు ఖాదర్. ఈసారి మరింత ఆశ్చర్యానికి లోనైన నాయకుడు, ‘మేమెలాగూ దాన్ని కనిపెట్టలేదు, మరి అంత రహస్యాన్ని మాకు తెలియజేసి ఎందుకు నష్టపోవాలనుకున్నావు?’ అన్నాడు. ‘ఇది నష్టపోవడం ఎలా అవుతుంది, ఎట్టి పరిస్థితిలోనూ అబద్ధం చెప్పకూడదని, సత్యమే మాట్లాడాలని, దీనివల్ల మేలే తప్ప కీడు జరగదని చెప్పింది మా అమ్మ. నేను అమ్మ మాటను ఎలా జవదాటగలను? అసత్యం ఎలా పలకగలను? అమ్మ మాట వినకుండా అబద్ధాలాడితే అల్లాహ్ శిక్షించడా?’ అని ఎదురు ప్రశ్నించాడు అబ్దుల్ ఖాదర్ అమాయకంగా, నిర్భయంగా. ఈ మాటలు దొంగల నాయకుడిపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఆలోచనలో పడిపొయ్యాడతడు. తన పాపాల చిట్టా రీలులా కళ్ళముందు కదలాడుతుండగా, కరుడు గట్టిన భయంకర నేరస్థుని కళ్ళు ధారాప్రవాహంగా వర్షిస్తున్నాయి. పరివర్తిత హృదయంతో దొంగల నాయకుడు ఒక్కసారిగా అబ్దుల్ ఖాదర్ ను గుండెలకు హత్తుకున్నాడు. తన సత్యసంధత, సత్యవాక్పరిపాలనతో కరుడుగట్టిన దొంగల్లో సైతం పరివర్తన తీసుకు రాగలిగిన ఆ చిన్నారి అబ్దుల్ ఖాదర్ ఎవరో కాదు, ఆయనే హజ్రత్ షేఖ్ అబ్దుల్ ఖాదర్ జీలానీ (ర) దైవం మనందరికీ సదా సత్యమే పలికే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
అర్ధమైంది గురువర్యా...
ఓ ధార్మిక గురువుకు ఇద్దరు శిష్యులు. ఒకసారి ఆ శిష్యులు నమాజుకు బయలుదేరారు. మార్గమధ్యంలో వారు చూస్తుండగానే ఓ వ్యక్తికి ప్రమాదం జరిగింది. అక్కడ ఆగిపోతే నమాజు సమయం మించిపోతుంది. వదిలేసి వెళ్ళిపోతే అతని ప్రాణాలు పొయ్యే పరిస్థితి. ఇద్దరిలో ఒక యువకుడు దైవకార్యాన్ని ఎట్టిపరిస్థితిలోనూ విడిచిపెట్టకూడదని, తరువాత ఆలోచిద్దామన్నాడు. కాని రెండవ యువకుడు, నమాజును తరువాత చేసుకుందాం... ముందు ఇతడిని వైద్యుడి దగ్గరికి తీసుకు వెళదామన్నాడు. కాని అతను, ‘దైవప్రార్థన తరువాతనే ఏదైనా’ అంటూ స్నేహితుడి స్పందన కోసం కూడా చూడకుండా వెళ్ళిపోయాడు. రెండో యువకుడు ఆ క్షతగాత్రుణ్ణి దగ్గరిలోని వైద్యుని వద్దకు తీసుకు వెళ్ళాడు. ప్రథమ చికిత్స అందించిన వైద్యుడు, సకాలంలో తీసుకొని రావడం వల్ల ఇతని ప్రాణాలు నిలిచాయని, ఆలస్యమైతే ఇతను ప్రాణాలతో మిగిలేవాడు కాదనీ అన్నాడు. తరువాత ఆ యువకుడు కూడా మసీదుకు చేరుకొని, దైవానికి కృతజ్ఞతాస్తోత్రాలు చెల్లిస్తూ రెండు రకతులు నఫిల్ నమాజు, తరువాత ఫర్జ్ నమాజు ఆచరించాడు. కాసేపటికి విషయం గురువుకు తెలిసింది. అంతా సావధానంగా విన్న గురువు, మొదటి శిష్యుణ్ణి మందలించాడు. ధర్మాన్ని నువ్వు సరిగ్గా అర్థం చేసుకున్నావని రెండవ శిష్యుణ్ణి ప్రశంసించారు. దీంతో, ‘అదేమిటి గురువర్యా.. జమాత్‌తో నమాజ్ ఆచరిస్తే ఎక్కువ పుణ్యం లభిస్తుంది కదా. జమాత్ వదలడం పాపం కదా’ అన్నాడు శిష్యుడు. ‘నువ్వన్నది నిజమే.. కాని, ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే, అతణ్ని గాలికి వదిలేసి ప్రార్థనలో లీనమైపోతే దేవుడు ఆ ప్రార్థనను స్వీకరిస్తాడా? ఈనాడు చాలామంది చేస్తున్న తప్పు ఇదే. సామాజిక విషయాలను పట్టించుకోకుండా ఆధ్యాత్మికతలో లీనమైపోతున్నారు. మరికొందరు ప్రాపంచిక విషయాల్లో పడి ధర్మాన్ని పట్టించుకోవడం లేదు. తోటి మానవుల్ని నిర్లక్ష్యం చేసి ఆధ్యాత్మికతలో ఎంతగా మునిగి తేలినా దేవుడు హర్షించడు. తన ఆరాధనలను నెరవేర్చక పోయినా దైవం క్షమిస్తాడు కాని మానవ హక్కుల విషయంలో మాత్రం మన్నించడు. దైవ ప్రసన్నత ద్వారానే ఇహ పరలోకాల్లో సాఫల్యం’ అని చెప్పాడు గురువు. అర్ధమైందన్నట్లు తల పంకించాడు శిష్యుడు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
చీకట్లను చీల్చిన దివ్యజ్యోతి
మానవజాతి సంస్కరణ కోసం ప్రపంచంలో అనేకమంది సమాజోద్ధారకులు ప్రభవించారు. వారిలో చివరిగా వచ్చినవారు ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం. మనందరి ప్రవక్త ఒక్కరే, మనందరి గ్రంథం ఒక్కటే. మనందరి ధర్మం ఒక్కటే. మనమంతా ఒక్కటే. సమస్త మానవజాతీ ఒక్కటే.. అనిఎలుగెత్తి చాటేరోజు మిలాదున్నబీ. ప్రవక్త జననానికి ముందు నాటి సమాజంలో ‘కర్రగలవాడిదే బర్రె’ అన్నట్లుగా బలవంతుడు బలహీనుణ్ణి పీక్కు తినేవాడు. స్త్రీల హక్కుల విషయం కాదుగదా అసలు వారికంటూ ఓ వ్యక్తిత్వం ఉన్న విషయాన్నే వారు అంగీకరించేవారు కాదు. స్త్రీని విలాస వస్తువుగా, అంగడి సరుకుగా భావించేవారు. అలాంటి జాతిని అన్ని విధాలా సంస్కరించి, వారిని మంచి మనుషులుగా తీర్చిదిద్దిన ఘనత ముహమ్మద్ ప్రవక్తదే. నాటిసమాజంలో లేని దుర్మార్గమంటూ లేదు. అలాంటి ఆటవిక సమాజాన్ని నిరక్షరాస్యులైన ముహమ్మద్ ప్రవక్త సమూలంగా సంస్కరించి, ఒక సత్సమాజంగా ఆవిష్కరించారు. దురదృష్టవశాత్తూ ఈనాటి మన నాగరిక, విజ్ఞాన సమాజ స్థితిగతుల్ని విశ్లేషిస్తే మనకు నిరాశే మిగులుతుంది. నైతికంగా, సామాజికంగా, ఆధ్యాత్మికంగా, రాజకీయంగా మనం పతనం అంచుల్లో ఉన్నాం. సమాజంలో నైతిక విలువలు అడుగంటి, పాశ్చాత్య పోకడలు, పబ్ క్లబ్ సంస్కృతి వెర్రితలలు వేస్తున్నది. తత్ఫలితంగా అశ్లీలత, అనైతికత, అమానవీయత, ప్రబలి సాంస్కృతిక విధ్వంసానికి దారితీస్తున్నాయి. చివరికి ఆధ్యాత్మిక రంగంలోనూ అతివాదం ముదిరి మతోన్మాదంగా రూపాంతరం చెందింది. మతం మనిషిని మంచివైపుకు మార్గదర్శకం చేసే బదులు అసహనం, హింసవైపు తీసుకుపోతోంది. సమాజంలో సామాజిక, ఆర్థిక అసమానతలు కొంతమందిని తీవ్రవాదం, ఉగ్రవాదం వైపుకు తీసుకువెళుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో నేటి మన సమాజానికి కూడా ముహమ్మద్ ప్రవక్తవారి బోధనల అవసరం ఉంది. ఆయన బోధనల ప్రకారం... మానవులు తమ సృష్టికర్తను మాత్రమే ఆరాధించాలి. తోటిమానవుల్ని, సమాజాన్ని ప్రేమించాలి. స్త్రీలను గౌరవించాలి. ఎలాంటి స్థితిలోనూ నీతినీ, న్యాయాన్ని విస్మరించకూడదు. అనాథలను, వృద్ధులను ఆదరించాలి. తల్లిదండ్రులను సేవించాలి. వారిపట్ల విధేయత కలిగి ఉండాలి. బంధువులు, బాటసారులు, వితంతువులు, నిస్సహాయుల పట్ల తారసిల్లే బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి. సంఘంలో ఒక మనిషికి మరో మనిషిపై పడే విధ్యుక్త ధర్మాల పట్ల ఉపేక్ష వహించకూడదు. అన్యాయం, అధర్మ సంపాదనకు ఒడికట్టవద్దు. ధనాన్ని దుబారా చేయవద్దు. వ్యభిచారం దరిదాపులకు కాదుగదా.. దానికై పురిగొలిపే అన్నిరకాల ప్రసార ప్రచార సాధనాలను రూపుమాపాలి. నిష్కారణంగా ఏ ప్రాణినీ చంపవద్దు. ప్రజల ధన, మాన, ప్రాణాలు సురక్షితంగా లేని సమాజం ప్రగతిని సాధించలేదు. సదా సత్యమే మాట్లాడాలి. చేసిన వాగ్దానాలు నెరవేర్చాలి. వాగ్దాన భంగానికి పాల్పడకూడదు. పలికే ప్రతి మాటకూ, చేసే ప్రతి పనికీ సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. వ్యాపార లావాదేవీల్లో, ఇచ్చి పుచ్చుకోవడాల్లో లెక్కా పత్రాలు, కొలతలు, తూనికలు ఖచ్చితంగా, నికార్సుగా ఉండాలి. స్వార్థాన్ని, అహాన్ని త్యజించాలి. తోటివారిని తమకన్నా తక్కువగా చూడకూడదు. స్త్రీ జాతిని గౌరవించాలి. వితంతువుల్ని చిన్నచూపు చూడకూడదు. సమాజంలో వారికి గౌరవప్రదమైన స్థానం దక్కాలి. ప్రతి తల్లీదండ్రి తమ సంతానానికి విద్య నేర్పాలి. భావితరాల సంక్షేమానికి ఇది చాలా అవసరం. అధికార దుర్వినియోగం చేయకూడదు. పరిపాలన అంటే కేవలం ప్రజాసేవ మాత్రమే.. పాలకుడు అంటే ప్రజలకు సేవకుడు అని భావించాలి. ప్రతినిత్యం ప్రజలకు జవాబుదారుగా దైవానికి భయపడుతూ జీవించాలి. ఇక్కడ మనం పలికే ప్రతి మాటకు, చేసే ప్రతి పనికీ రేపు దైవం ముందు సమాధానం చెప్పుకోవాలన్న భావన కలిగి ఉండాలి. ఇలాంటి భావనలే మానవులను మంచివారుగా, నిజాయితీ పరులుగా, సౌశీల్యవంతులుగా తీర్చిదిద్దుతాయి. . మానవ సహజ దౌర్బల్యాల వల్ల చిన్నా చితకా పాక్షిక విభేదాలు ఉన్నప్పటికీ మనందరి విశ్వాసం కూడా ఒక్కటే అనడానికి ప్రబల తార్కాణం ఈ పండుగ. మౌలిక విశ్వాసం పరంగా ఒక్కటిగానే ఉన్న మనం పాక్షిక పొరపొచ్చాలను విస్మరించి తోటి సోదరుల్ని గుండెలకు హత్తుకోవాలి. ఈ పర్వదినం మన కిచ్చే మరో సందేశం ఏమిటంటే, సమాజాన్ని కలుపుకు పోకుండా, సాటి ప్రజల పట్ల ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచు కోకుండా ఏ సంతోషమయినా, ఎంతటి ఆనంద మైనా పరిపూర్ణం కాజాలదు. ఏ సంతోష కార్యమైనా సమాజంతో పంచుకోవాలని, కేవలం మన గురించి మాత్రమే కాకుండా సంఘం గురించి, సమాజం గురించి ఆలోచించాలని చెబుతుంది ప్రవక్త పుట్టినరోజైన మిలాదున్నబీ. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ అజ్ఞానాంధకార విషవలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్న మానవ జాతిని మహోన్నతంగా తీర్చిదిద్దారాయన. దాదాపు 1450 సంవత్సరాల క్రితం అరేబియాదేశంలోని మక్కానగరంలో ఆయన జన్మించారు. ఆమినా, అబ్దుల్లా తల్లిదండ్రులు. పుట్టకముందే తండ్రినీ, ఆరేళ్ళ ప్రాయంలో అమ్మనూ కోల్పోయారు. తాతయ్య ఆయన్ని పెంచి పెద్దచేశారు. చిన్నతనం నుంచే అనేక సుగుణాలను పుణికిపుచ్చుకున్న ముహమ్మద్ ప్రవక్త, ‘అమీన్’ గా, షసాదిఖ్’గా వినుతికెక్కారు. ఆయన గొప్ప మానవతావాది. సంస్కరణాశీలి.ఉద్యమనేత. అతి సాధారణ జీవితం గడిపిన సామ్రాజ్యాధినేత. జ్ఞానకిరణాలు ప్రసరింపజేసిన విప్లవజ్యోతి. ప్రాణశత్రువును సైతం క్షమించిన కారుణ్య కెరటం. ఇటువంటి బాధ్యతాభావాన్ని, జవాబుదారీతనాన్ని ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం ప్రజల మనసుల్లో నూరిపోసి, మానవీయ విలువలతో తులతూగే ఓ చక్కని సత్సమాజాన్ని ఆవిష్కరించారు. అందుకే ఆయన మానవాళికి ఆదర్శమయ్యారు. -
పఠనంతో మాలిన్యం దూరమౌతుంది
ఒక ఊరిలో ఓ ధార్మిక గురువు ఓ పురాతన మస్జిదులో ప్రవచనం చేస్తూ ఉండేవారు. ఒకరోజు ఒక యువకుడు గురువుగారి దగ్గరికి వెళ్ళి,‘అయ్యా..! ఖురాన్ పారాయణం వల్ల హృదయానికి పట్టిన తుప్పు వదిలి పోతుంది. అని చెబుతారు గదా..! అది ఎలా సాధ్యం?’ అని సందేహం వెలిబుచ్చాడు. దానికి ఆ గురువుగారు, ‘అదిగో అక్కడొక బిందె ఉంది. అది తీసుకెళ్ళి, కోనేటిలో నీళ్ళు ముంచుకురా..’ అన్నాడు.‘నేనేదో ధార్మిక సందేహం తీర్చుకుందామని వస్తే.. పని చెప్పాడేమిటి.. ఈ గురువుగారు...’ అనుకుంటూనే, బయటికి వెళ్ళాడు. తీరా చూస్తే అందులో బొగ్గులున్నాయి. అదే విషయం గురువుగారికి చెప్పాడు. ‘అవి పారబోసి నీళ్ళు తీసుకురా...’ అన్నారు గురువుగారు. ఆ యువకుడు బిందె తీసుకువెళ్ళి, నీళ్ళు ముంచుకొని వచ్చాడు. కాని దానికి చిల్లి ఉండడం వల్ల నీళ్ళన్నీ దారిలోనే కారిపొయ్యాయి. గురువుగారి దగ్గరికొచ్చేసరికి ఖాళీ బిందె మిగిలింది. గురువుగారు మళ్ళీ నింపుకు రమ్మన్నారు. మళ్ళీ అదే పరిస్థితి. ఈ విధంగా నాలుగైదు సార్లు తిరిగిన తరువాత, గురువుగారు ఇలా చేయడంలో ఏదో మర్మం ఉండి ఉంటుందని గ్రహించిన యువకుడు, ఇక లాభం లేదనుకుని.. ‘గురువు గారూ అసలు విషయం ఏమిటో చెప్పండి.’ అని వినయంగా ముందు కూర్చున్నాడు. గురువుగారు చిన్నగా నవ్వి, ‘బాబూ.. గమనించావా..? నువ్వు బిందె తీసుకు వెళ్ళినప్పుడు, అది మసి కొట్టుకొని ఉంది. అవునా..?’ అన్నారు. ‘అవును’ అన్నాడు యువకుడు. ‘మరి ఇప్పుడెలా ఉందో చూడు.’ అన్నారు.గురువుగారు. ‘బొగ్గుల మసంతా పోయి శుభ్రంగా తయారైంది.’అన్నాడు యువకుడు. ‘ఆ శుభ్రత అన్నది నీటిలో ఉన్నటువంటి గుణ ప్రభావం. నీరు అందులో ఆగకపోయినా, అది మసిని శుభ్రం చేసింది. ఒకటికి నాలుగుసార్లు నువ్వు అలా చేయడం వల్ల మసి కొద్ది కొద్దిగా శుభ్రమవుతూ, చివరికి పూర్తిగా లేకుండానే పోయింది. అలాగే ఖురాన్ కూడా మాటిమాటికీ పఠిస్తూ ఉంటే, దాని గుణ ప్రభావం కారణంగా మనసులోని మాలిన్యమంతా కొద్దికొద్దిగా కొట్టుకుపోయి శుభ్రమైపోతుంది. హృదయం స్వచ్ఛంగా, నిర్మలంగా తయారవుతుంది. అందుకే పవిత్ర గ్రంథాన్ని ఒకటికి రెండుసార్లు చదవడం వల్ల అందులోని విషయం అవగతమవుతుంది. మంచి అనేది మనసును హత్తుకొని మనసులోని మాలిన్యం దూరమవుతుంది’’ అని వివరించారు గురువుగారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
అల్లాహ్ అన్నీ చూస్తూనే ఉన్నాడు!
పూర్వకాలంలో దైవ విశ్వాసి, దైవభీతి పరుడు అయిన ఒక రాజు ఉండేవాడు. ఎప్పుడూ ప్రజా సంక్షేమం గురించి ఆలోచించే ఆ రాజు అప్పుడప్పుడూ మారువేషంలో తిరుగుతూ ప్రజల బాగోగులను స్వయంగా తెలుసుకుంటూ ఉండేవాడు. యధాప్రకారం ఒకరోజు మారువేషంలో తిరుగుతూ, చెరసాల వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో ఇద్దరు సిపాయీలు దొంగతనం చేసిన నేరంపై ఒక వ్యక్తిని పట్టుకొని చెరసాలకు తీసుకు వెళుతున్నారు. తను కూడా లోపలికి వెళ్ళి ఏం జరుగుతోందో చూడాలనుకున్నాడు. చెరసాల ప్రధానద్వారం దగ్గరకు చేరుకోగానే, ద్వారపాలకుడు రాజును గుర్తుపట్టి గౌరవంగా లోపలికి తోడ్కొని వెళ్ళాడు. రాజు జైలు పరిసరాలన్నీ నిశితంగా పరిశీలించాడు. అధికారులతో చెరసాల విషయాలను చర్చించాడు. ఒక్కొక్క ఖైదీని పిలిపించి, ఏ కారణంగా జైలుకు రావలసి వచ్చిందని ప్రశ్నించాడు. దానికి, ప్రతి ఒక్కరూ తాము ఏ నేరం చేయలేదని, అనవసరంగా తమపై అభియోగాలు మోపి జైలు పాలు చేశారని వాపోయారు. అలా ఎవరికి వారు ప్రతి ఒక్కరూ తాము ఏ పాపమూ చేయలేదనే చెప్పారు. కాని అందులో ఒకడు మాత్రం ఉదాసీనంగా ఒక మూలన కూర్చొని ఉన్నాడు. మిగతా ఖైదీలంతా పోటీలు పడి రాజు గారికి తమ నిర్దోషిత్వాన్ని గురించి చెప్పుకుంటుంటే, అతను మాత్రం కూర్చున్న చోటునుండి కదలకుండా పశ్చాత్తాపంతో కుమిలి పోతున్నాడు. ఇది గమనించిన రాజు అతన్ని దగ్గరికి పిలిచి, ‘‘నువ్వేమైనా నేరం చేశావా.. లేక నిన్ను కూడా అనవసరంగా జైల్లో వేశారా?’’ అని అడిగాడు.దానికతను, ‘లేదు రాజా.. నేను నేరం చేశాను. ఒకానొక బలహీన స్థితిలో, గత్యంతరం లేక చిన్న దొంగతనం చేశాను. నా తప్పును దేవుడు క్షమిస్తాడా.. లేదా.. అని పశ్చాత్తాప పడుతున్నాను. అలాంటిది, దొంగతనం చేసి, చెయ్యలేదని నేను మీతో అబద్ధం ఎలా చెప్పగలను?.’ అంటూ సిగ్గుతో తల దించుకున్నాడు. ‘‘అవునా..? సరే.. ఇంతమందిలో తప్పు చేసిన వాడివి నువ్వొక్కడివే కనబడుతున్నావు. ఇంత మంది నిరపరాధుల మధ్య ఒక అపరాధి, ఇంతమంది మంచి వాళ్ళలో ఒక చెడ్డవాడు ఉండడం మంచిది కాదు, సమంజసమూ కాదు. అందుకని నిన్ను విడుదల చేస్తున్నాను’’ అని ప్రకటించి, తన దారిన తను వెళ్ళిపోయాడు రాజు. మళ్ళీ కొన్నాళ్ళకు రాజు చెరసాల సందర్శనకు వచ్చాడు. ఈ సారి ఖైదీలందరూ రాజు గారిచుట్టూ గుమిగూడారు. ఒక్కొక్కరూ రాజును సమీపించి తాము నేరం చేశామని విన్నవించుకున్నారు. అందరి మాటలూ సావధానంగా విన్న రాజు ‘వీరందరికీ మరో రెండు నెలలు అదనంగా జైలు శిక్షను పొడిగించండి.’అని ఆదేశించి వెళ్ళిపొయ్యాడు. దీంతో లబో దిబో మన్న ఖైదీలు ‘ఏమిటీ ఇలా జరిగిందీ గతంలో రాజు గారు వచ్చినప్పుడు తప్పును అంగీకరించిన ఫలానా వ్యక్తిని విడుదల చేశారు కదా... మరి మేమంతా ఈ రోజు తప్పును అంగీకరిస్తే మా శిక్షను రెట్టింపు చేశారేమిటీ?’అని కారాగారాధికారి వద్ద వాపోయారు. రాజుగారి అంతరంగం బాగా తెలిసిన ఆ అధికారి, వారికి సమాధానమిస్తూ..‘ఆ రోజు మీరంతా రాజుగారికి అబద్ధం చెప్పి, బయట పడాలని అనుకున్నారు. రాజుగారు మీ మాటలు నమ్మి మిమ్మల్ని విడిచి పెడతాడని ఆశించారు. కాని ఆ వ్యక్తి అలా చేయలేదు. చేసిన తప్పుకు పశ్చాత్తాప పడుతూ, నేరాన్ని నిజాయితీగా అంగీకరించాడు. నేరాంగీకారానికి కారణం ఏదో ఒక విధంగా బయట పడదామని కాదు. తనవల్ల తప్పు జరిగినందుకు సిగ్గుపడ్డాడు, పశ్చాత్తాపంతో కుమిలి పొయ్యాడు... భవిష్యత్తులో తప్పు చేయకూడదన్న బలమైన సంకల్పం అతనిలో కనిపించింది. కాని మీరు ఆరోజు అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూశారు. మీమాటలు నమ్మి రాజుగారు విడుదల చేస్తారని ఆశించారు. ఈ రోజు కూడా అంతే.. చేసిన తప్పుల పట్ల ఏమాత్రం పశ్చాత్తాపం లేకపోగా, పోటీలు పడి చేసిన ఘనకార్యాలను గర్వంగా చెప్పుకున్నారు. ఇలా నిజం చెప్పినందుకు అతణ్ణి విడిచి పెట్టారు కదా.. మమ్మల్ని కూడా అలాగే విడుదల చేస్తారని భావించి అలా చెప్పారు. అంతే తప్ప, నిజమైన పశ్చాత్తాప భావన మీలో ఏకోశానా కనిపించలేదు. అందుకే రాజు మిమ్మల్ని వదిలిపెట్టకపోగా శిక్షను పెంచాడు’’అనిఆ వివరించాడు. ఖైదీలు సిగ్గుతో తల దించుకున్నారు. అల్లాహ్ వ్యవహారం కూడా ఇలాగే ఉంటుంది. నిజమైన పశ్చాత్తాపాన్ని మాత్రమే ఆయన అంగీకరిస్తాడు. తప్పు చేసిన మనిషి తన తప్పు తెలుసుకొని, అంగీకరించి, మరలా మరలా అలాంటి తప్పులకు, పాపాలకు పాల్పడనన్న పశ్చాత్తాప భావనతో అల్లాహ్‌ను వేడుకుంటే, ఆయన తప్పకుండా మన్నిస్తాడు. తప్పులు చేస్తూ కూడా, పశ్చాత్తాప భావన లేకుండా ఏదో ఒకవిధంగా తప్పించుకోవాలని చూస్తే మాత్రం రెట్టింపు శిక్ష అనుభవించవలసి ఉంటుంది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
సమాజం స్వర్గధామం కాదా?
ఎవరైనా మనకు ఉపకారం చేస్తే మనం ప్రత్యుపకారం చేస్తాం. ఎవరైనా మనకు హాని తలపెడితే మనమూ వారిపట్ల అలానే వ్యవహరించాలని అనుకుంటాం. ఇది లోకం పోకడ. కాని అలా చేయవద్దని, ఇతరులెవరైనా మీకు అపకారం తలపెట్టినా మీరు మాత్రం వారికి ఉపకారమే చేయాలని ముహమ్మద్ ప్రవక్త(స)బోధించారు. ఒకసారి ఒక వ్యక్తి ప్రవక్త వారివద్దకు వచ్చి..‘దైవప్రవక్తా..! నేను నా బంధువుల పట్ల ఎంత క్షమాశీలిగా వ్యవహరించినా వారు నాపట్ల దౌర్జన్యంగానే ప్రవర్తిస్తున్నారు. నేనెంతగా కలుపుకుని పోవాలని ప్రయత్నించినా వారు తెగదెంపులకే ప్రయత్నిస్తున్నారు. నేను ఉపకారం చేస్తే, వారు నాకు అపకారం తలపెడుతున్నారు. మరి నేను కూడా వారితో అలానే వ్యవహరించనా?’ అని ప్రశ్నించాడు. అప్పుడు ప్రవక్త మహనీయులు, ‘వద్దు..వారిని వారి మానాన వదిలేయి, వారు దౌర్జన్యం చేసినా, నువ్వు మాత్రం వారికి ఉపకారం చేస్తూనే ఉండు. నువ్వు గనక ఇలా చేస్తే అల్లాహ్ తరఫున నీకు సహా యం లభిస్తూనే ఉం టుంది.’ అన్నారు. అంటే చెడుకు చెడు సమాధానం కాదు. బంధువులైనా, కాకపోయినా.. అందరికీ ఇదేసూత్రం వర్తిస్తుంది. కాకపోతే బంధువులకు కాస్త అధిక ప్రాముఖ్యం ఉంటుంది. మన ఉపకారానికి, మన సత్ ప్రవర్తనకు మొట్టమొదటి హక్కుదారులు తల్లిదండ్రులు. తరువాతనే భార్యాబిడ్డలు. తరువాత అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు. ఆ తరువాత సమీప బంధువులు, ఆ తరువాత ఇతర బంధువర్గం. ఈ విధంగా క్రమం విస్తరిస్తుంది. ఎవరికి వారు ఇదేవిధంగా ఆలోచిస్తే, దీన్ని ఒక బాధ్యతగా గుర్తించి ఆచరించగలిగితే ఆ బంధుత్వాలు, ఆ కుటుంబాలు, ఆ సమాజంలో ఎంతటి సంతోషం వెల్లివిరుస్తుందో..! ఆర్థికంగా కలిగిన వారు, వారి బంధువుల్లో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే, వారిని ఆదుకోవడం ఆ సమీప బంధువుల విధి. కాని చాలామంది ఈ బాధ్యత పట్ల ఏమరుపాటుగా ఉన్నారంటే తప్పు కాదు. ఎంతోమంది తిండి, బట్ట, నివాసం లాంటి కనీస అవసరాలకు కూడా నోచుకోకుండా ఉన్నవారు సమాజంలో ఉన్నారు. వారివారి బంధువులు తలా ఒక చెయ్యేసి వారిని ఆదుకోగలిగితే, వారు కూడా ఆర్థికంగా నిలదొక్కుకుని ఇతరులకు సహాయకారులుగా నిలిచే అవకాశం ఉంటుంది. బంధువుల పట్ల బాధ్యత తీరిపోతే, అప్పుడు సమాజంలోని ఇతర అభాగ్యులను అక్కున చేర్చుకోవాలి. వారికీ సహాయ సహకారాలు అందించాలి. వారి కష్టసుఖాల్లో పాలు పంచుకోవాలి. ముఖ్యంగా ఇరుగు పొరుగుపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎందుకంటే,‘మీ పొరుగు వారు ఆకలితో ఉండగా, మీరు కడుపునిండా తింటే మీలో రవ్వంత విశ్వాసంగాని, మానవత్వంగాని లేనట్టే’ అన్నారు ముహమ్మద్ ప్రవక్త(స). ఎవరి దుష్ప్రవర్తన కారణంగా వారి పొరుగువారు భద్రంగా, సురక్షితంగా ఉండరో అలాంటివారికి అల్లాహ్ పట్ల విశ్వాసమేలేద’ ని ఆయన బోధించారు. కనుక దైవాదేశాలూ, ప్రవక్త హితవచనాల వెలుగులో ప్రతి ఒక్కరూ తమ జీవితాలను సమీక్షించుకుంటూ, బంధుమిత్రులు, ఇరుగు పొరుగు, మన సహాయానికి అర్హులైన ఇతర వర్గాల పట్ల తమబాధ్యతను చిత్తశుధ్ధితో నెరవేర్చాల్సిన అవసరం ఉంది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ ధర్మ జిజ్ఞాస శ్రీ గోవింద రాజస్వామి వారి సన్నిధిలో కుంచం ఉంటుందెందుకు? తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి వారి సన్నిధిలో కుంచెం ఉండటం నిజమే. దీనికి కారణం ఏమంటే, తిరుమలేశుడు కుబేరుని వద్ద అప్పు చేశాడట. దానిని తీర్చడం కోసం ద్రవ్యాన్ని కుంచెంతో కొలిచి ఇచ్చేవాడట శ్రీనివాసుడు. స్వామివారి పక్షాన గోవింద రాజస్వామి ఈ కార్యాన్ని సాగించారట. ఈ క్రమంలో ఆయన స్వామివారికి వచ్చిన కానుకలను కొలిచీ కొలిచీ అలసి సొలసి తలకింద కుంచె పెట్టుకుని అలాగే నిద్రలోకి ఒరిగిపోయారనీ, అందుకే ఆయన తల వద్ద కుంచెం ఉంటుందనీ చెబుతారు. -
శత్రువును క్షమించిన శాంతిదూత జన్మదినం
ద్వేషించినవారిని ప్రేమించడం... తిట్టినవారిని దీవించడం... శత్రువును క్షమించడం... ప్రేమించడం మాత్రమే తప్ప మరొకటి తెలియకపోవడం... మానవజాతిని సాఫల్య శిఖరాలకు చేర్చడానికి అహర్నిశలూ శ్రమించడం... ఇవి కేవలం ప్రవక్తల్లో మాత్రమే కనిపించే లక్షణాలు. అలాంటి ప్రవక్తల పరంపరలో చివరివారు, మానవ మహోపకారి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివసల్లం. ఈయన మక్కా నగరంలో జన్మించారు. ఆమినా, అబ్దుల్లాహ్ తల్లిదండ్రులు. జననానికి రెండునెలల ముందే తండ్రినీ, ఆరేళ్ళప్రాయంలో అమ్మనూ కోల్పోయారు. అనాథ అయిన ఆరేళ్ళ బాబును తాతయ్య పెంచారు. ముహమ్మద్ ప్రవక్త చదవడం, రాయడం రాని నిరక్షరాస్యులు. అయినా ఆయన బోధనలు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. మానవ సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు, సవాళ్ళకు ఆయన పరిష్కారం చూపారు. ఒక కులానికో, మతానికో ఆయన బోధనలు పరిమితం కాలేదు. సమాజంలోని సమస్త అసమానతలు, అమాన వీయతలతో పాటు, అన్ని రకాల దుర్మార్గాలు, దౌర్జన్యాలను రూపుమాపారు. మానవులంతా ఒక్కటేనని, మనిషీ మనిషికి మధ్య ఎలాంటి వ్యత్యాసంగాని, ఆధిక్యత లేదని చాటి చెప్పారు. ఆధిక్యతకు, గౌరవానికి అసలైన కొలమానం నీతి నిజాయితీ, సత్ ప్రవర్తనే అన్నది ఆ మహనీయుని నిర్వచనం. మానవ సమానత్వానికి, సామరస్యం, సోదరభావాలకు ఇది నిలువెత్తు నిదర్శనం. సాటి మానవుల ధన, ప్రాణాలను హరించడం, వారి గౌరవ మర్యాదలకు భంగం కలిగించడం, వారి మనోభావాలను గాయపరచడం, ఒకరిపై నిందలు వేయడం, చాడీలు చెప్పడం, వారి హక్కులను కాల రాయాలనుకోవడం ఆయన దృష్టిలో మహా పాతకం. క్షంతవ్యం కాని నేరం. ఆ మహాత్ముని హితోపదేశాలు మానవ హక్కుల పరిరక్షణకు అద్భుతమైన కవచాలు. శ్రామికుల స్వేద బిందువుల తడి ఆరకముందే వారి వేతనం చెల్లించి వేయాలన్న కారుణ్య బోధ కష్టజీవుల పట్ల ఆ మమతల మూర్తికున్న కరుణకు తిరుగులేని నిదర్శనం. మానవాళి కారుణ్య కెరటం మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం బోధనలు నేటి మన సమాజానికి జీవధార. నేడు సమాజంలో రాజ్యమేలుతున్న ఈ చెడులన్నీ సమసి పోయి ఓ మానవీయ సమాజం ఆవిష్కృతం కావాలంటే ప్రవక్త మహనీయులవారి బోధనల వైపు దృష్టి సారించడం తప్ప మరో మార్గం లేదు. ఈనాడు మనం అనేక రంగాల్లో అద్భుతాలు సాధించామనడంలో ఏమాత్రం సందేహం లేదు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మన ప్రగతి అంబ రాన్ని చుంబి స్తోంది. కాని నైతికంగా, ధార్మికంగా, విలువల పరంగా మనం ఏ దిశగా పయ నిస్తున్నా మన్నది ప్రశ్నగానే మిగిలి ఉంది. కనుక, ఇకనైనా మనం మరిచిపోయిన పాఠాన్ని మననం చేసుకోవాలి. ముహమ్మద్ ప్రవక్త (స) బోధనలు, ఉపదేశాలవైపు మరలాలి. ఎందుకంటే, ఆ మహనీయులు గొప్ప దైవప్రవక్త అయి ఉండి కూడా ఒక సామాన్యుడిలా, సామాజిక కార్యకర్తలా సమాజానికి సేవ చేస్తూ, ప్రజల్ని సన్మార్గపథాన నడిపించారు. ఇహపర వైఫల్యాల నుండి రక్షించారు. (21, బుధవారం ముహమ్మద్ ప్రవక్త జయంతి – మిలాదున్నబీ – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
అమ్మ ప్రేమను మించిన అల్లాహ్ ప్రేమ
పూర్వకాలంలో ఒక మనిషి ఏదో ఊరుకు వెళుతున్నాడు. సుదూరప్రయాణం. ప్రయాణానికి అవసరమైన సరంజామా అంతా సర్దుకున్నాడు. ఆహారం, నీళ్ళు, దుస్తులు, పైకం అంతా వాహనం పైనే సర్దేశాడు. కొండలు, కోనలు, అడవి మార్గాన ప్రయాణం సాగుతోంది. మార్గమధ్యంలో అనూహ్యంగా ఒంటె తప్పిపోయింది. చుట్టూ దట్టమైన అడవి. అంతా కీకారణ్యం. కనుచూపుమేర ఎక్కడా జనసంచారమే లేదు. ఒంటరిగా, సాధ్యమైనంతమేర అడవి అంతా గాలించాడు. కాని ఒంటె ఆచూకీ దొరకలేదు. ఆహారం, తాగునీరు, దుస్తులు, పైకం అన్నీ దానిపైనే ఉన్నాయి. కనీసం గొంతుతడుపుకుందామన్నా చుక్కనీరులేదు. ఆకలి..దాహం.. అలసట.. భయం.. ఒంట్లో ఏమాత్రం సత్తువ లేదు. నీరసం ఆవహించింది. ఏం చేయాలో అర్ధంకావడం లేదు. వెదికే ఓపిక లేదు. కాళ్ళు తడబడుతుండగా ఆ వ్యక్తి ఓ చెట్టు కింద కూలబడ్డాడు. బాగా అలసిపోయి ఉండ డం వల్ల కళ్ళు మూతలుపడ్డాయి. నిద్రముంచుకొచ్చేసింది. క్షణాల్లో గాఢనిద్రలోకి జారుకున్నాడు. తరువాత కళ్ళు తెరిచేసరికి ఎదురుగా తప్పిపోయిన తన ఒంటె దర్శనమిచ్చింది. నీరు, ఆహారం, దుస్తులు, పైకం అన్నీ పదిలంగా ఉన్నాయి. ఆశ్చర్యం.. ఆనందం.. తన కళ్ళను తానే నమ్మలేకపోతున్నాడు.. ఇదికలా.. నిజమా..? అన్నసంశయంలో పడిపొయ్యాడు. కొన్ని క్షణాలపాటు అతనికేమీ అర్ధం కాలేదు. చివరికి కలకాదు నిజమే అని నిర్ధారించుకున్నాడు. ముహమ్మద్ ప్రవక్త వారు ఈసంఘటనను సహచరులకు వినిపించి ‘ఆవ్యక్తి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది?’ అని ప్రశ్నించారు. ‘దైవప్రవక్తా.! ఆవ్యక్తి ఆనందానికి అవధులే ఉండవు. జీవితంపై ఆశలు వదులుకున్న అతను ఎంతగా సంతోషిస్తాడో మేము మాటల్లో చెప్పలేము. అతని మానసిక ఆనందాన్ని వర్ణించడం ఎవరితరమూ కాదు. అమితమైన సంతోషంతో అతని హృదయం ఉప్పొంగి, ఆనంద తాండవం చేస్తుంది.’ అని విన్నవించారు సహచరులు. అప్పుడు ప్రవక్తమహనీయులు, ‘‘దారితప్పిన ఒకవ్యక్తి నిజం తెలుసుకొని, సన్మార్గం అవలంబించి తన వైపుకు మరలినప్పుడు దైవం కూడా అలాగే సంతోషిస్తాడు. తన దాసుల్లో ఏ ఒక్కరూ నరకంలోకి పోవడాన్ని అల్లాహ్ సుతరామూ ఇష్టపడడు. అందుకే ఆయన మానవుల మార్గదర్శకం కోసం అనేక ఏర్పాట్లు చేశాడు. కనుక మానవులు తమ తప్పు తెలుసుకొని, మంచిమార్గం వైపు మరలితే అల్లాహ్ ప్రేమకు, ఆయన కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రులై ఇహ, పరలోకాల్లో సాఫల్యం పొందవచ్చు’’ అని బోధించారు. పరాత్పరుడైన దైవం మనందరికీ రుజుమార్గంపై నడిచే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం.! – ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ -
సేవ – స్వార్ధం
ఈ సమాజంలో ప్రతినిత్యం మనకు రకరకాల మనుషులు తారస పడుతూ ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కో అవసరం. ఒకరిది చిన్న అవసరం కావచ్చు, ఒకరిది చాలా పెద్ద అవసరమే కావచ్చు. కాని అందరికీ అందరితో అవసరాలు ఉంటాయి. ఎవరికీ ఎవరితో అవసరా ల్లేకుండా మానవ మనుగడ అసాధ్యం. మనుషులంతా కలిసీ మేలిసీ ఒకచోట సహజీవనం చేస్తున్నప్పుడు పరస్పరం ఒకరి అవసరాలు ఒకరు తెలుసుకోవడం, తీర్చుకోవడం, ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలుపంచుకోవడం తప్పనిసరి. అయితే ఈ పరస్పర సహకార భావనలో సేవా భావమే తప్ప, స్వార్థభావన ఉండకూడదు. కాని, ఈనాడు ప్రతిదీ వ్యాపారమే అయి పోయింది. నేటి మానవులు ప్రతి విషయంలోనూ స్వలాభమే తప్ప, ఎదుటి వారి ప్రయోజనాలను పట్టించు కోవడం లేదు.’సేవ’అన్న పదానికి అర్థాన్నే మార్చేసి ఆ ముసుగులో స్వప్రయోజనాలను కాపాడుకుంటూ ప్రజల్ని వంచిస్తున్నారు. ఆత్మవంచనకు పాల్పడు తున్నారు. త్యాగం,పరోపకారం లాంటి భావనలు అడుగంటి పొయ్యాయి. ఈ సుగుణాలులేని సేవాభావం స్వార్థ ప్రయోజనాలకే తప్ప మరి దేనికీ కాదు. ఈ రుగ్మత దూరం కావాలంటే మానవుల హృదయాల్లో ఆధ్యాత్మిక కుసుమాలు, మానవీయ విలువల పరిమళాలు విరబూయాలి. ప్రతి ఒక్కరూ తాము ఎవరికి ఏరూపంలో సహాయం అందించినా కేవలం దైవ ప్రసన్నత కోసమే అని భావించాలి. ఎలాంటి స్వార్ధం,స్వలాభం ఆశించని నిస్వార్ధ, నిష్కల్మష సేవను మాత్రమే దైవం స్వీకరిస్తాడు. మనసులో ఏమాత్రం మలినమున్నా దాన్ని అంగీకరించడు.దైవం మానవుల బాహ్య ఆచరణలతోపాటు, ప్రధానంగా అంతరంగాన్ని చూస్తాడు. అందుకే, ముహమ్మద్ ప్రవక్త ‘అల్లాహ్ మీ రూపు రేఖల్ని చూడడు. మీ అంతర్యాలను చూస్తాడు. ఎవరు ఏ ఉద్దేశ్యంతో ఏపని చేస్తారో ఆ ప్రకారమే దైవం వారికి పుణ్యఫలం ప్రసాదిస్తాడు.’ అని ప్రవచించారు. అంతేకాదు. ‘మీరు ఆచరించే కర్మల ప్రతిఫలం మీ సంకల్పాలపై ఆధార పడి ఉంద’ ని కూడా ఆయన సెలవిచ్చారు. అందుకని మనం చేసే ప్రతి పనిలో దైవ ప్రసన్నత ప్రధాన ప్రేరణగా ఉండాలి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఇఖ్ లాస్ అంటే..?
ఒక ప్రవచనం ప్రకారం– ప్రళయ దినాన మొట్టమొదట ముగ్గురు వ్యక్తుల విషయంలో అల్లాహ్ తన తీర్పును వెలువరించారు. దైవమార్గంలో, ధర్మం కోసం పోరాడి ప్రాణాలర్పించిన షహీదును అందరికంటే ముందు న్యాయస్థానంలో హాజరుపరిచారు. దైవం అతణ్ణి ‘‘నీవు నీ బాధ్యతలను ఎంతవరకు నెరవేర్చావు? ఎటువంటి కర్మలు ఆచరించావు?’’ అని ప్రశ్నించాడు. ‘ప్రభూ! నేను నీ మార్గంలో పోరాడాను. నీ ప్రసన్నత కోసం ప్రాణాలను ధారపోశాను.’ అని సమాధానం చెప్పాడతను. ‘‘నువ్వు చెప్పేది పచ్చి అబద్ధం. నువ్వు కేవలం గొప్ప వీరుడవనిపించుకోవాలని జిహాద్లో పాల్గొన్నావు. ప్రజలంతా నిన్ను వీరుడవని, శూరుడవని పొగిడారు కదా! ఆ మేరకు దానికి తగిన ప్రతిఫలం నీకు అక్కడే లభించింది. ఇక్కడేమీ లేదు.’ అని అతణ్ణి నరకంలో పడవేయించాడు దైవం. తర్వాత ఒక విద్వాంసుడిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. దైవం అతన్ని ‘‘ఒక పండితుడవైన నువ్వు ఏ మేరకు సత్కార్యాచరణ చేశావు? ప్రజలకు ఏమి బోధించావు?’’ అని ప్రశ్నించాడు. అప్పుడతను, ‘‘ప్రభూ! నేను నువ్వు పంపిన గ్రంథాన్ని అధ్యయనం చేశాను. ఆచరించాను. దాన్ని ఇతరులకు బోధించాను.’’ అని చెప్పాడు. అప్పుడు దైవం, ‘‘అదంతా అబద్ధం. నువ్వు కేవలం ప్రజల మెప్పు పొందడానికి, ప్రజల చేత గొప్ప పండితుడిగా, విద్వాంసుడిగా కీర్తించబడాలనే ఉద్దేశ్యంతోనే అలా చేశావు. నువ్వు ఆశించిన పేరు ప్రతిష్టలు నీకు అక్కడే లభించాయి. కనుక నీకిక్కడ ఏమీ లేదు’’ అని చెప్పి, అతణి ్ణకూడా నరకంలో పడవేయించాడు. తరువాత, ఒక గొప్ప ధనవంతుడి వంతు వచ్చింది. అతన్ని కూడా దైవం ‘‘ఇంత సంపద, ఇన్ని వరాలను పొందిన నువ్వు ఎలాంటి కర్మలు ఆచరించావు? సంపదను ఏ పనుల్లో వినియోగించావూ?’’ అని ప్రశ్నిస్తాడు. అప్పుడా ధనవంతుడు, ‘దేవా! నీ ప్రసన్నత ఇమిడి ఉన్న ఏ సత్కార్యాన్నీ నేను విడిచిపెట్టలేదు. నీ సంతోషం కోసం, నీ మెప్పుకోసం నా సంపదను నీ మార్గంలో ఖర్చుపెట్టాను.’ అని సమాధానమిస్తాడు ఆ ధనవంతుడు. అప్పుడు దైవం, ‘‘నువ్వు కేవలం ప్రజల మెప్పుకోసం, ప్రజలంతా నిన్నొక గొప్పదాత అనుకోవాలని, త్యాగమయుడవని కీర్తించాలని, పొగడాలని నీ ధనాన్ని ఖర్చుపెట్టావు. నువ్వు ఆశించినట్లుగా ప్రజలంతా నిన్నొక గొప్పదాతగా, సత్కార్యాలు చేసేవాడిగా, పేదలను ఆదుకొనేవాడిగా గుర్తించి కొనియాడారు కూడా! ఇక్కడ నీకెలాంటి ప్రతిఫలమూ లేదు.’ అంటాడు దైవం.తరువాత అతణ్ణి కూడా ఈడ్చుకెళ్ళి నరకంలో పడవేయడం జరిగింది. మానవులు ఆచరించే కర్మల ప్రతిఫలం వారి వారి సంకల్పాలపై ఆధారపడి ఉంటుంది. ఎవరు ఏ సంకల్పంతో కర్మలు ఆచరిస్తే, ఆ మేరకు వారికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. దుష్టసంకల్పంతో సత్కర్మలు ఆచరిస్తే సత్ఫలితం లభించదు. అందుకని ప్రతి విషయంలోనూ సంకల్పం అన్నది మనిషికి అవసరం, అనివార్యం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
జవాబుదారీ భావన లేకనే ఈ అనర్థాలు
శాస్త్రవిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా, ఎందుకోగానీ రోజురోజుకూ సమాజంలో చెడులు, దుర్మార్గాలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఎక్కడో ఒకచోట ఏదో ఒక అకృత్యం వెలుగు చూస్తూనే ఉంది. ఒకమనిషి మరోమనిషిపై ఏదో ఒకరూపంలో చేస్తున్న దాడి మానవత్వానికే సవాలుగా నిలుస్తోంది. మహిళలు, వృద్ధులు, పసిపిల్లలు అన్న విచక్షణ లేకుండా మనిషి మనిషిపై సాగిస్తున్న రాక్షసత్వం మానవేతర జీవజాలంలో కూడా కనిపించదు. చివరికి క్రూరమృగాల్లో సైతం కారణ రహిత ఘర్షణ ఉండదు. కాని బుద్ధిజీవి అయిన మానవుల్లో మృగలక్షణాలు గోచరిస్తున్నాయి. పంతాలు, పట్టింపులు, కక్షలు, కార్పణ్యాలు సాధారణమయ్యాయి. నేను, నా కులం, నా మతం, నా ప్రాంతం అన్న సంకుచిత భావనలు మానవ మస్తిష్కంలో వేళ్ళూనుకుంటున్నాయి. నా కులం కానివాళ్ళు, నా మతం కాని వాళ్ళు, నేను చెప్పినట్లు విననివాళ్ళు శతృవులు అన్న భయంకర భావజాలం మానవ సమాజాన్ని ముక్కలు చేస్తోంది. ఆధునిక విజ్ఞానం దూరాలను దగ్గర చేసింది. కాని మనుషులను, మనసులను దగ్గర చేయలేక పోయింది. విజ్ఞానం విస్తరించినకొద్దీ అజ్ఞానం పటాపంచలు కావలసింది పోయి వెర్రితలలు వేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం.నిజానికి దేవుడు మనిషిని బుద్ధిజీవిగా, విజ్ఞాన స్రష్టగా, మంచీ చెడుల విచక్షణ తెలిసినవాడుగా సృష్టించాడు. మానవజాతి మూలాల రహస్యాన్నీ విడమరచి చెప్పాడు. మానవులంతా ఒకేజంట సంతానమన్న యదార్ధాన్ని ఎరుక పరిచాడు. సచ్ఛీలత, నైతిక విలువలు, దైవభక్తి విషయాల్లో తప్ప ఎవరికీ ఎవరిపై ఎలాంటి ఆధిక్యతా లేదని స్పష్టంచేశాడు. కనుక కులం, మతం, జాతి, ప్రాంతం, భాషల ఆధారంగా అడ్డుగోడలు నిర్మించుకోడానికి, సరిహద్దులు గీసుకోడానికి లవలేశమైనా అవకాశం లేదు. కాని కులం, మతం, జాతి, భాష, ప్రాంతీయతలను ప్రాతిపదికగా చేసుకొని, మనిషి మరోమనిషిపై దాడికి దిగుతున్నాడు. ఇతరుల ధనమాన ప్రాణాలను హరిస్తున్నాడు. వారి గౌరవ మర్యాదలతో చెలగాటమాడుతున్నాడు. స్త్రీలపై దౌర్జన్యాలకు తెగబడుతున్నాడు. సృష్టిమొత్తంలో శ్రేష్టజీవి అయిన మానవుడు తనస్థాయిని, శ్రేష్టతను, ఔన్నత్యాన్ని మరిచి విలువలకు తిలోదకాలిచ్చి, మానవుడిగా చేయకూడని పనులన్నీ చేస్తూ మానవత్వానికి కళంకం తెచ్చిపెడుతున్నాడు. ఎందుకిలా జరుగుతోంది. దీనికి కారణమేమిటి? అజ్ఞానమా..మూర్ఖత్వమా..అహంకారమా..? వాస్తవమేమిటంటే, మానవుడు జీవన సత్యాన్ని గుర్తించడం లేదు. పుట్టుక, చావుకు మధ్యనున్న జీవన్నాటకమే సర్వస్వమని భ్రమిస్తున్నాడు. నేటి తరువాత రేపు ఎంత నిజమో, మరణం తరువాత మరణానంతర జీవితమూ అంతే నిజమన్న సత్యాన్ని విస్మరిస్తున్నాడు. ఇక్కడ చేసిన ప్రతిపనికీ, పలికిన ప్రతిమాటకు రేపు ఆ జీవితంలో పరమ ప్రభువైన అల్లాహ్ సన్నిధిలో సమాధానం చెప్పుకోవాలన్న విషయాన్నే మరిచి పొయ్యాడు. అందుకే ఈ బరితెగింపు. దైవానికి సమాధానం చెప్పుకోవలసి ఉందన్న విషయం మనసా, వాచా, కర్మణా విశ్వసించినట్లయితే మనసులో ఎటువంటి దుర్మార్గపు ఆలోచనలూ తలెత్తవు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఇస్లాం నూతన సంవత్సరం మొహర్రమ్
‘మొహర్రమ్ ’ ఒక ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినటువంటి మాసం. ఇస్లామ్ ధర్మంలో దీనికొక ప్రత్యేకత ఉంది. ఇస్లామీ క్యాలండరు ప్రకారం ఇది ముస్లిమ్ జగత్తుకు నూతన సంవత్సరం. ముహర్రం మాసంతోనే ఇస్లామీయ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. పూర్వచరిత్రలో కూడా దీనికి ప్రత్యేక ప్రాముఖ్యం ఉండింది. ఇస్లామ్‌కు పూర్వం అప్పటి సమాజంలో కూడా ‘ముహర్రం’ నుండే కొత్తసంవత్సరం ప్రారంభమయ్యేది. ముహమ్మద్ ప్రవక్త(స) ముహర్రం మాసాన్ని అల్లాహ్ నెల అని అభివర్ణించారు. రమజాన్ రోజాల తరువాత అత్యంత శుభప్రదమైన రోజా ఆషూరా రోజానే. అంటే ముహర్రం పదవ తేదీన పాటించబడే రోజా అన్నమాట. రమజాన్ రోజాలు విధిగా (ఫర్జ్ గా) నిర్ణయించబడక పూర్వం ఆషూరా రోజాయే ఫర్జ్ రోజాగా ఉండేది. కాని రమజాన్ రోజాలు విధిగా నిర్ణయించబడిన తరువాత ఆషూరా రోజా నఫిల్‌గా మారిపోయింది. హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (ర) ప్రకారం, ఒకసారి ప్రవక్త మహనీయులు మదీనాకు వెళ్ళారు. ఆరోజు అక్కడి యూదులు రోజా పాటిస్తున్నారు. అది ముహర్రం పదవ తేదీ. వారిని ప్రవక్త అడిగారు ఏమిటి ఈరోజు విశేషం? అని. దానికి వారు, ‘ఇదిచాలా గొప్పరోజు.ఈరోజే అల్లాహ్ మూసాను, ఆయన జాతిని ఫిరౌన్ బారినుండి రక్షించాడు. ఫిరౌన్‌ను, అతడి సైన్యాన్ని సముద్రంలో ముంచేశాడు. అప్పుడు మూసా ప్రవక్త, దేవునికి కృతజ్ఞతగా రోజా పాటించారు. కనుక మేము కూడా ఆయన అనుసరణలో ఈ రోజు రోజా పాటిస్తాము’. అని చెప్పారు. అప్పుడు ప్రవక్తమహనీయులు, ‘మూసా ప్రవక్త అనుసరణలో రోజా పాటించడానికి మీకంటే మేమే ఎక్కువ హక్కుదారులం’ అని చెప్పి, తమ అనుచరులకు రోజా పాటించమని ఉపదేశించారు. ఆషూరా రోజా కేవలం యూదులే కాదు క్రైస్తవులు కూడా పాటించేవారు. ఈ ఇరువర్గాలూ ముహర్రం పదవ తేదీన మాత్రమే రోజా పాటించేవి. కాని ప్రవక్తవారు, మీరు రెండురోజులు పాటించమని తన సహచరులకు బోధించారు.అంటే ముహర్రం మాసం 9,10 లేదా 10,11 కాని రెండురోజులు రోజా పాటించాలి. షహీదులు దైవానికి సన్నిహితులు కాకతాళీయంగా ‘కర్బలా’ సంఘటన కూడా ఇదే రోజున జరగడం వల్ల దీని ప్రాముఖ్యత మరింతగా పెరిగిపోయింది. అంతమాత్రాన ముహర్రం మాసమంతా విషాద దినాలుగా పరిగణించడం, ఎలాంటి శుభకార్యాలూ నిర్వహించక పోవడం సరికాదు. ఎందుకంటే సత్యం కోసం, న్యాయం కోసం, ధర్మంకోసం, హక్కులకోసం, ఇస్లామీయ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హజ్రత్ ఇమామె హుసైన్ (ర)అమరగతి పొందారు. ధర్మయుద్ధంలో అమరుడు కావడం మానవ సహజ భావోద్రేకాల పరంగా బాధాకరం కావచ్చునేమోగాని, విషాదం ఎంతమాత్రం కాదు. ఎందుకంటే, ‘ఎవరైతే అల్లాహ్ మార్గంలో అమరులయ్యారో వారిని మృతులు అనకండి. వారు సజీవంగా ఉన్నారు. తమ ప్రభువు వద్ద ఆహారం కూడా పొందుతున్నారు.’ అంటోంది పవిత్రఖురాన్ . (3–169) దీనివల్ల మనకు అర్ధమయ్యేదేమిటంటే, అమరులు అల్లాహ్‌కు సన్నిహితులేకాదు, ఆయన ద్వారా ఆహారం కూడా పొందుతున్నారు. కనుక వారుసజీవంగా ఉన్నారని నమ్మవలసి ఉంటుంది. అయితే, అమరులు సజీవంగా ఉండడం, ఆహారం పొందడం ఏమిటి? అన్నసందేహం కూడా ఇక్కడ తలెత్తే అవకాశం ఉంది. హజ్రత్ మస్రూఖ్ (ర) ఇలా అంటున్నారు. ‘మేము ఈ ఆయతుకు సంబంధించిన వివరణ హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్ ఊద్ (ర)గారిని అడిగాము. అప్పుడాయన, ‘మేము కూడా ఇదే విషయం దైవప్రవక్త ముహమ్మద్ (స)గారికి విన్నవించుకున్నాము. దానికి ఆయన ఇలా వివరణ ఇచ్చారు. ‘షహీదులు సజీవంగా ఉండడం, వారు ఆహారం పొందడం అంటే అర్ధమేమిటంటే, వారి ఆత్మలు పచ్చని పక్షుల రూపంలో ఉంటాయి. వాటికోసం అందమైన గోపురాలు దైవసింహాసనానికి వేలాడుతూ ఉంటాయి. ఆ పక్షులు స్వేచ్ఛగా, సంతోషంగా స్వర్గంలో, స్వర్గవనాల్లో విహరిస్తూ ఉంటాయి. మళ్ళీ తమ గోపురాలకు చేరుకుంటాయి. ఇదీ షహీదుల స్థాయి, వారి గౌరవం. వారి ఘనత. కనుక హజ్రత్ ఇమామె హుసైన్ (ర)అమరత్వం మరణం కాదు. ప్రజాస్వామ్య పరిరక్షణ, ధర్మసంస్థాపపనార్ధం, దైవప్రసన్నతే ధ్యేయంగా సాగిన సమరంలో పొందిన వీరమరణం. అందుకని ఆయన ఏ లక్ష్యం కోసం, ఏ ధ్యేయం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి అమరుడయ్యారో మనం దాన్నుండి స్ఫూర్తిని పొందాలి. సమాజంలో దుర్మార్గం ప్రబలినప్పుడు, ఉన్మాదం జడలు విప్పినప్పుడు, విలువల హననం జరుగుతున్నప్పుడు, ప్రజాస్వామ్య వ్యవస్థ బీటలు వారుతున్నప్పుడు సమాజ శ్రేయోభిలాషులు, ప్రజాస్వామ్య ప్రియులు, న్యాయ ప్రేమికులు, పౌరసమాజం తక్షణం స్పందించాలి. న్యాయంకోసం, ధర్మంకోసం, మానవీయ విలువలకోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తమ పరిధిలో శక్తివంచన లేకుండా పోరాడాలి. దానికి ఇమామ్ స్ఫూర్తి ప్రేరణ కావాలి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
అక్కరకు రాని సంపద
పూర్వం ఒకరాజు ఉండేవాడు. అతడు ప్రజలను పీడించి, పిప్పిచేసి చాలా సంపద కూడబెట్టాడు. దాన్ని ఊరికి దూరంగా ఒక రహస్య గుహలో దాచి పెట్టాడు. గుహ తాళం చెవులు ఒకటి తనదగ్గర, మరొకటి తనకు బాగా నమ్మకస్తుడైన ఒక మంత్రి దగ్గర ఉంచాడు. అప్పుడప్పుడూ ఆ గుహ దగ్గరకు వెళ్ళి సంపదను చూసుకొని వస్తుండేవాడు. ఒకరోజు రాజు సంపదను చూసుకోడానికి గుహకు వెళ్ళాడు. తాళం తీసుకొని లోపలికి ప్రవేశించాడు. వెండీ, బంగారం, వజ్రవైఢూర్యాలు రాసులు రాసులుగా గుహ లోపల ఉన్నాయి. రాజు వాటిని తనివితీరా చూసుకుంటున్నాడు. అంతలో మంత్రి అటుగా వెళుతూ, గుహ తెరిచి ఉండడం గమనించాడు. బహుశా నిన్న తాను గుహను పరిశీలించి వెళుతూ తాళం వేయడం మరిచి పోయానని భావించి, బయటినుండి తాళంవేసి వెళ్ళిపోయాడు. రాజు గుహలో చాలాసేపటివరకు తను సంపాదించిన సంపదనంతా చూసుకొని పరమానందభరితుడై వెనుదిరిగాడు. తీరా ద్వారం వద్దకు వచ్చేసరికి తలుపు వేసి ఉంది. ఎంతబాదినా తలుపులు తెరుచుకోలేదు. ఎంత అరిచి గీపెట్టినా ఫలితం లేకపోయింది. గుహంతా కలియతిరుగుతూ, రాసులుగా పేర్చిన వజ్రవైఢూర్యాలను, మరకత మాణిక్యాలను మరోసారి చూసుకొని మళ్ళీ తలుపు దగ్గరికొచ్చాడు. సమయం గడుస్తున్నకొద్దీ రాజుకు ఆకలివేయ వేయసాగింది. ఎంత సంపద పోగుపడి ఉన్నా రాజు అన్నం మెతుకుకోసం గింజుకులాడసాగాడు. దాహంతో నాలుక పిడచ కట్టుకుపోతోంది. గుక్కెడునీళ్ళ కోసం రాజు తన్నుకులాడసాగాడు. శరీరంలో సత్తువ సన్నగిల్లింది. కాళ్ళూచేతులు సహకరించడంలేదు. తను సంపాదించిన సంపదవైపు చూస్తూ, ఇంతసంపద కనీసం నాలుక తడుపుకోడానికి సైతం పనికి రావడం లేదని బాధపడసాగాడు. చివరికి శరీరంలోని శక్తినంతా కూడగట్టుకొని, వజ్రవైఢూర్యాలూ, మరకతమాణిక్యాలన్నిటినీ ద్వారం వద్దకుచేర్చి, వరుసగా పేర్చాడు. నిస్సహాయంగా వాటిపై వాలిపోయాడు. ఇంతటి అపారమైన సంపద ఉండికూడా ఎందుకూ కొరగాకుండా పోయింది. గుక్కెడు మంచినీళ్ళు కూడా ఇవ్వలేని ఈ సంపద దేనికీ? అని రెండు రక్తాక్షరాలు లిఖించి ప్రాణం వదిలాడు. అటు రాజు కనబడడం లేదని రాజ్యమంతా గాలించడం ప్రారంభించారు. మూడురోజులు గడిచి పోయాయి. నాలుగవరోజు మంత్రి గుహవద్దకు వెళ్ళివద్దామని బయలు దేరాడు. తాళంతెరిచి చూసి మంత్రి అవాక్కయ్యాడు. రాజు శవం పక్కన చిన్న కాగితం ముక్కదొరికింది.’ఇంతటి అపారమైన సంపద గుక్కెడు మంచినీళ్ళను కూడా ప్రసాదించలేక పోయింది’ అని రాసి ఉంది అందులో.. అందుకే ఇస్లామీ ధర్మశాస్త్రం, ధనవ్యామోహానికి దూరంగా ఉండాలని, ధనాశ మనిషిని నీచమైన స్థాయికి దిగజారుస్తుందని హితవు చెబుతుంది. అధర్మంగా సంపాదించిన ధనసంపదలు ఏవిధంగానూ ఉపకరించవని, ఇహలోకంలో, పరలోకంలో పరాభవం పాలు చేస్తాయని హెచ్చరిస్తుంది. అల్లాహ్ మనందరికీ ధర్మబద్దమైన జీవితం గడిపే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
విలువలతో కూడిన జీవితమే సాఫల్యానికి సోపానం
జీవితం విజయ పథంలో ముందుకు సాగాలంటే మానవులు కొన్ని విలువలు పాటించాలి. మంచీ చెడుల పట్ల విచక్షణ కనబరచాలి. నిజానికి ప్రతి ఒక్కరిలో ప్రాథమికంగా ఈ విలువలు నిక్షిప్తమై ఉంటాయి. కావలసిందల్లా వాటిని వెలికితీసి నిత్యజీవితంలో ఆచరణలో పెట్టగలగడమే. అంటే జీవితంలోని అన్ని రంగాల్లో విలువలు పాటించగలగాలి. ఉద్యోగ రంగమైనా, వ్యాపారరంగమైనా, విద్యారంగమైనా, సామాజిక రంగమైనా, సాంస్కృతిక రంగమైనా, ఆర్ధిక రంగమైనా, ఆధ్యాత్మిక రంగమైనా, రాజకీయ రంగమైనా ప్రతి విషయంలో వీటిని ఆచరించాలి. సాధ్యమైనంతవరకు, శక్తివంచన లేకుండా విలువలతో కూడిన జీవితం గడపడానికి ప్రయత్నించాలి. ఎట్టిపరిస్థితిలోనూ ఇతరుల్ని తక్కువగా భావించకూడదు. మనతో ఏకీభవించని వారిపట్ల కూడా సద్భావనతోనే మెలగాలి. ఎందుకంటే అభిప్రాయ భేదాలన్నవి మానవ సమాజంలో సహజం. దాన్ని భూతద్దంలో చూడడమే విలువలకు వ్యతిరేకం అవుతుంది. జీవితంలో ఏది సాధించాలన్నా ఈనాడు ధనమే ప్రధానమైపోయింది. మంచీ చెడు, న్యాయం అన్యాయం, విలువలు అని మడి కట్టుకుంటే ఈ ప్రాపంచిక పరుగు పందెంలో వెనుకబడి పోవడం ఖాయమన్నభావన బలపడింది. బాగా డబ్బు గడించి విలాసవంతమైన జీవితం గడుపుతున్నవారితో పోల్చుకొని నిరాశకు గురవుతూ ఉంటాం. ఇదే దురాశకు దారితీసి, జీవితంలో శాంతి లేకుండా చేస్తుంది. చట్టసమ్మతమైన, ధర్మబద్దమైనమార్గంలో ఎంత సంపాదించినా ఎవరికీ అభ్యంతరం ఉండదు.అది ఆమోదయోగ్యమే. అయితే సంపాదనే లక్ష్యంగా అడ్డమైన గడ్డికరుస్తూ దొడ్డిదారుల్లో సంపాదించాలనుకుంటే తరువాత చేదుఅనుభవాలను రుచి చూడవలసి ఉంటుంది. ఇలా సాధించిన సంపాదనా, సోపానాలు కేవలం తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదు. అంతేకాదు, అది జీవితంలో అశాంతికి, అభద్రతకు, అపజయాలకు కారణమవుతుంది. పేరు ప్రఖ్యాతుల కోసం, అధికారం హోదాలకోసం సంపాదనకు వక్రమార్గాలు అవలంబిస్తే ఖచ్చితంగా మనశ్శాంతి దూరమవుతుంది. విజయం దరిచేరినట్లనిపించినా అది నీటిబుడగతో సమానం. అసలు విజయం, నిజమైన శాంతి సంతృప్తి నైతిక విలువలతోనే సాధ్యం. ఇహలోక విజయమైనా, పరలోక సాఫల్యమైనా విలువలకు తిలోదకాలు ఇవ్వకుండా మంచీ చెడుల విచక్షణా జ్ఞానంతో, ధర్మబద్దమైన జీవితం గడిపితేనే. అందుకే ముహమ్మద్ ప్రవక్త మానవజీవితంలో నైతిక విలువలకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చారు. ‘నైతికత, మానవీయ విలువల పరంగా మీలో ఎవరు ఉత్తములో వారే అందరికన్నా శ్రేష్టులని, ప్రళయ దినాన విశ్వాసి కర్మల త్రాసులో ఉత్తమ నడవడి కన్నా బరువైన, విలువైన వస్తువు మరొకటి ఉండదని’ అన్నారాయన. ప్రజల్ని ఎక్కువగా స్వర్గానికి తీసుకుపోయే కర్మలు ‘దైవభీతి, నైతిక విలువలే’ అని ఉపదేశించారు. కనుక నిత్యజీవితంలో అనైతికతకు, అక్రమాలకు, అమానవీయతకు తావులేకుండా సాధ్యమైనంత వరకు, విలువలతో కూడిన జీవితం గడపడానికి ప్రయత్నించాలి. అప్పుడు మాత్రమే సమాజంలో ఆదరణ, గౌరవం లభిస్తాయి. దేవుడుకూడా మెచ్చుకుంటాడు.మంచి ప్రతి ఫలాన్ని ప్రసాదిస్తాడు. అల్లాహ్ మనందరికీ సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
అన్ని ఆరాధనలకూ ఆత్మ ‘హజ్జ్’
శక్తి కలిగిన ప్రతిముస్లిం విధిగా హజ్ చేయాలన్నది ఖురాన్ వాక్యం. ఈ ‘హజ్’ జిల్‌హజ్ మాసం పదవతేదీన అరేబియాదేశంలోని మక్కానగరంలో జరుగుతుంది. ఆరోజే ప్రపంచంలోని ముస్లింలంతా పండుగ జరుపుకుంటారు. అదే ‘ఈదుల్ అజ్ హా’. దీన్ని బక్రీద్ పండుగ అని, ఈదె ఖుర్బాన్ అని కూడా అంటారు. ‘హజ్జ్’ ఒక విశ్వజనీన, విశ్వవ్యాపిత ఆరాధన. ఇందులో శ్రీమంతులు, నిరుపేదలు, తెల్లవారు, నల్లవారు, అరబ్బులు, అరబ్బేతరులు అన్న భేదభావం మచ్చుకు కూడా కనిపించదు.‘మానవులంతా ఒక్కటే’ అన్న విశ్వమానవతా భావంతో అందరూ ముక్తకంఠంతో అల్లాహ్‌ను కీర్తిస్తూ, ఆయన ఘనతను, ఔన్నత్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో తాదాత్మ్యం చెందడమే హజ్ యాత్రలోని పరమార్థం. అందుకే సర్వం మరచి, ఆడంబరాలు త్యజించి, సాధు స్వభావంతో దైవధ్యానంలో కాలం గడపాలని ఉవ్విళ్ళూరుతూ హాజీలు యాత్రకు సన్నద్ధమవుతారు. ఎందుకంటే, సంకల్పశుద్ధితో హజ్ సాంప్రదాయాలను నియమబద్ధంగా పాటిస్తూ ఆరాధన జరిపేవారికి ఇహపరలోకాల్లో అనంతమైన శుభాలు ప్రసాదించబడతాయి. అపారమైన అల్లాహ్ కరుణాకటాక్షాలు, మన్నింపు వారికి ప్రాప్తమవుతాయి. సమస్త గుణదోషాలనుండి వారు పునీతులవుతారు. హజ్రత్ అబూహురైరా(ర)ప్రకారం, ముహమ్మద్ ప్రవక్త ఇలా చెప్పారు. ‘హజ్జ్, ఉమ్రాహ్ల కోసం మక్కాకు వెళ్ళేవారు అల్లాహ్ అతిథులు. వారు అల్లాహ్‌ను ఏది కోరుకుంటే ఆయన వారికది ప్రసాదిస్తాడు. వారు మన్నింపును కోరుకుంటే ఆయన వారిని మన్నించి వేస్తాడు. (ఇబ్నెమాజ)మక్కానగర ఆవిర్భావం దాదాపు ఐదువేల సంవత్సరాలకు పూర్వం జరిగింది. కొండలూ కోనల నడుమ, ఎలాంటి వనరులూ లేకుండా నిర్మానుష్యంగా పడి ఉన్న ఎడారి ప్రాంతంలో మహనీయ ఇబ్రాహీం దైవాజ్ఞ మేరకు తన ధర్మపత్ని హజ్రత్ హాజిరాను, తనయుడు ఇస్మాయీల్ను వదిలేసి వెళ్ళిపోతారు. కనీసం నాలుక తడుపుకోడానికి సైతం చుక్కనీరులేని ఆ ఎడారి ప్రదేశంలో చిన్నారి ఇబ్రాహీం దాహానికి తాళలేక గుక్కపట్టి ఏడుస్తున్న క్రమంలో ఆయన కాలి మడిమెలు రాసుకు పోయిన చోట అల్లాహ్ ఆజ్ఞతో అద్భుతమైన నీటి ఊట ఉబికింది.‘జమ్ జమ్’ అనే పేరుగల ఆ పవిత్రజలంతో తల్లీతనయులు తమ దాహం తీర్చుకున్నారు. ఆ నీరే ‘ఆబెజమ్ జమ్’ పేరుతో ప్రసిద్ధి గాంచింది. తరువాత కొంతకాలానికి అల్లాహ్ ఆదేశం మేరకు హజ్రత్ ఇబ్రాహీం మక్కాకు తిరిగొచ్చి కుటుంబాన్ని కలుసుకొని, తనయుడు ఇస్మాయీల్ సహాయంతో ‘కాబా’ను నిర్మించారు. చతురస్రాకారంలో ఉన్న ఆ రాతికట్టడాన్ని హజ్రత్ ఇబ్రాహీం, హజ్రత్ ఇస్మాయీల్‌లు అల్లాహ్‌కు సమర్పించుకున్నారు. పవిత్రఖురాన్‌లో ఇలా ఉంది: ‘మానవుల కోసం ప్రప్రథమంగా నిర్మించబడిన ఆరాధనా కేంద్రం నిస్సందేహంగా మక్కాలో ఉన్నదే. దానికి సకలశుభాలూ ప్రసాదించబడ్డాయి. ప్రపంచ ప్రజలందరికీ అది మార్గదర్శక కేంద్రంగా రూపొందించబడింది. దానిలో స్పష్టమైన సూచనలున్నాయి. ఇబ్రాహీం ప్రార్థనా స్థలమూ ఉంది. దానిలో ప్రవేశించినవారు రక్షణ పొందుతారు. ఈ గృహానికి వెళ్ళే శక్తి, స్థోమత కలవారు దాని హజ్ ను విధిగా నెరవేర్చాలి. ‘(3–96,97) అల్లాహ్ ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన హజ్జ్‌ను సకల ఉపాసనారీతులు ఇముడ్చుకున్న పరిపూర్ణ దైవారాధన అని కూడా చెప్పుకోవచ్చు. హజ్రత్ ఇబ్రాహీం తన కుమారుడు ఇస్మాయీల్ (అ)తో కలిసి నిర్మించిన కాబా గృహ సందర్శనలో ఉపాసనా, ఆరాధనారీతులన్నీ పరిపూర్ణతను సంతరించుకున్నాయి. యాత్ర, నిరాడంబర వస్త్రధారణ, దైవప్రార్థన, వ్రతనిష్ఠ, ఖుర్బానీ ఇవన్నీ సమన్వయం చెంది, ఒకేచోట కేంద్రీకృతమై, ఏకైక ప్రభువు సన్నిధిలో, హజ్ ఆరాధనలో ప్రదర్శితమవుతాయి. అందుకని కాబా గృహసందర్శనార్థం చేసే హజ్జ్ వల్ల ఉపాసనా రీతులన్నిటినీ ఆచరించి దైవానుగ్రహం పొందినట్లే అవుతుంది. ఈ కారణంగానే ముస్లిం స్త్రీపురుషులందరూ జీవితకాలంలో ఒక్కసారైనా హజ్ చేయాలని అభిలషిస్తారు. ఆ మహాభాగ్యం కోసం ఉవ్విళ్ళూరుతూ ఉంటారు. సాధారణంగా మక్కాను దర్శించుకున్న యాత్రికులు మదీనాను కూడా సందర్శిస్తారు. మదీనా మక్కాకు రెండువందల మైళ్ళ దూరంలో ఉంది. ముహమ్మద్ ప్రవక్త మక్కా నుండి మదీనాకు వలసవెళ్ళి అంతిమ దినాలు అక్కడే గడిపారు. మస్జిదెనబవి సందర్శనకు, హజ్జ్ కు ఎలాంటి సంబంధం లేకపోయినా అది ఇస్లామీయ జగత్తుకు జీవనాడిలాంటిది. ప్రవక్త మసీదు సందర్శన సున్నత్. కనుక దూరతీరాలనుండి వచ్చిన భక్తులు మస్జిదెనబవీని కూడా సందర్శించి, నమాజులు చేసి తమ యాత్ర సఫలమైందని భావిస్తారు. ఈ విధంగా ఒక హాజీ అన్ని నియమాలను పాటిస్తూ, అల్లాహ్ ఏకత్వానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర కాబా గృహాన్ని సందర్శిస్తాడు. యాత్రాక్రమంలో అతనికి అడుగడుగునా హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిస్సలాం గార ‡్లసహనశీలత, త్యాగనిరతి, పాపభీతి, వాగ్దానపాలన, దైవాదేశ పాలన లాంటి అనేక సుగుణాలను ఒంటబట్టించుకుంటాడు. అంతేకాదు, ఇంకా మరెన్నో సుగుణాలను మానవుల్లో జనింపజేసి మానవ సమానత్వానికి, విశ్వమానవ సౌభ్రాతృత్వానికి పూలబాటలు పరిచి, వారి ఇహపర సాఫల్యానికి హామీగా నిలుస్తుంది హజ్జ్. ఇదే కాబా గృహ సందర్శనాయాత్ర అసలు పరమార్ధం. అల్లాహ్ మనందరికీ ఈ విషయాలను అర్ధం చేసుకొని, ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
సంకల్పం బాగుంటే దైవ సహాయం మనవెంటే...
చాలా పాతకాలంనాటి మాట. ఒకవ్యక్తికి తన అవసరం నిమిత్తం కొంత సొమ్ము కావలసి వచ్చింది. అతను ఒకవ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. తన అవసరాన్ని వివరించి, వేయి వరహాలు అప్పుగా కావాలని అభ్యర్ధించాడు. ఆ వ్యక్తి జమానతుగాని, సాక్ష్యం గాని తీసుకురమ్మన్నాడు. అప్పుకోసం వెళ్ళిన వ్యక్తి ‘నేను అల్లాహ్‌ను సాక్షిగా, జమానతుగా పెడుతున్నాను. విశ్వాసంతో తనకు అప్పు ఇవ్వవలసిందిగా అభ్యర్ధించాడు. అవతలి వ్యక్తి కూడా చాలా దైవభకి ్తపరాయణుడే కనుక, ఇతని మాటను నమ్మి దైవసాక్షిగానే అతనికి కావలసిన వేయి వరహాలను పరస్పర అంగీకారంతో ఒక గడువు పెట్టుకొని అప్పుగా ఇచ్చాడు. అతడా వరహాలు తీసుకొని వెళ్ళిపోయాడు. తరువాత అతను వ్యాపారం చెయ్యాలనే ఉద్దేశ్యంతో ఇతర దేశానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం తరువాత, అప్పు తీర్చాల్చిన సమయం దగ్గరపడింది. సదరువ్యక్తి అప్పు కట్టాల్సిన మొత్తాన్ని తయారు చేసుకొని స్వదేశానికి ప్రయాణమయ్యాడు. కాని సమయానికి ఓడ అందుబాటులో లేకుండా పోయింది. చాలారోజులు గడిచినా ప్రయాణం ముందుకు సాగలేదు. అప్పు తీర్చాల్సిన గడువు ముగింపు దశకు చేరుకుంది. అనుకున్న సమయానికి ఇవ్వలేకపోతున్నానని, వాగ్దానాన్ని నిలబెట్టుకోలేక పోతున్నానన్న బాధ ఒకవైపు, ఏమీ చేయలేని నిస్సహాయత మరోవైపు. ఏం చేయాలో అర్ధం కాక తలపట్టుకున్నాడు. అప్పుడతనికి ఒక ఆలోచన తట్టింది. వెంటనే కలం, కాగితం తీసి తను అప్పుకట్టాల్సిన వ్యక్తిని ఉద్దేశించి ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరాన్ని, వేయి వరహాలను ఒక చిన్న చెక్కపెట్టెలో పెట్టి, దైవనామాన్ని స్మరించి సముద్రంలో వదిలేశాడు. ఇటు అప్పు ఇచ్చిన వ్యక్తి కూడా, తీసుకున్న వ్యక్తి చాలామంచివాడు, నిజాయితీపరుడు, వాగ్దానాన్ని నిలబెట్టుకునే వాడు కనుక తప్పకుండా అనుకున్న సమయానికి వచ్చేస్తాడని ఓడ రేవు దగ్గరికి చేరుకున్నాడు, ఆప్యాయంగా ఆహ్వానిద్దామని. కాని ఎంత ఎదురు చూసినా ఓడ మాత్రం జాడ లేదు. ఇక లాభం లేదు వెనుదిరిగి వెళ్ళిపోదామనుకున్నాడు. అంతలో ఏదో చెక్కపెట్టె తీరం వెంబడి కొట్టుకు రావడం కనిపించింది. దాంతో అతను ఆసక్తిగా దాన్నే గమనిస్తూ, దగ్గరికి రాగానే దాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తరువాత పెట్టెను తెరిచి చూశాడు. అందులో వెయ్యివరహాలతోపాటు, తన పేర రాసిన ఉత్తరం కూడా ఉంది. కొన్నాళ్ళ తరువాత అప్పు తీసుకున్న వ్యకి ్తకూడా వచ్చేశాడు. అనుకున్న సమయానికి అప్పు చెల్లించలేనందుకు సంజాయిషీ చెప్పుకుంటూ, వాగ్దానం నిలబెట్టుకోలేనందుకు పశ్చాత్తాప పడుతూ, వెయ్యివరహాల సంచిని సగౌరవంగా ముట్టజెప్పాడు. కాని అప్పు ఇచ్చిన వ్యక్తి తనకు చెక్కపెట్టెలో లభ్యమైన వరహాలను, తనపేర రాసిన ఉత్తరాన్నీ అతనికి చూపిస్తూ, అతని నిజాయితీని, వాగ్దానపాలన పట్ల అతనికున్న నిబధ్ధతను ఎంతగానో ప్రశంసించాడు. తన పైకం తనకు ముట్టిందని, తన బాకీ తీరిపోయిందని చెప్పాడు. మనసా, వాచా, కర్మణా దైవాన్ని విశ్వసించి, ఎవరి హక్కును వారికి నెరవేర్చాలన్న సత్సంకల్పం ఉన్నవారికి దైవసహాయం తోడుంటుంది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఫలితం దైవాధీనం
ఒకసారి టర్కీదేశపు రాజు మురాద్ మారువేషం ధరించి, తనరాజ్యంలో ప్రజల స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలన్న ఉద్దేశ్యంతో బయలుదేరాడు. అలా కొంతదూరం వెళ్ళిన తరువాత ఒకచోట ఓ మనిషి పడుకొని ఉన్నాడు. తీరా చూస్తే అతని శరీరం నిర్జీవంగా, అప్పుడే ప్రాణం పోయినట్లుగా ఉంది. అంతలో అటుగా ఇద్దరు వ్యక్తులు వెళుతున్నారు. మారువేషంలో ఉన్నరాజు వారిని పిలిచి, ఇతనెవరో మీకుతెలుసా? అని అడిగాడు. దానికి వారు, ఇతను మాకెందుకు తెలియదు. ఫలానా వాడు. ఇల్లు ఫలానా వీధిలో ఉంది. పచ్చితాగుబోతు, తిరుగుబోతు అని చెప్పారు. ‘‘అవునా.! సరే శవాన్ని ఇంటివరకు చేర్చి, జనాజా ఏర్పాట్లు చేద్దాం తలా ఒక చేయి వేయండి’’ అన్నాడు రాజు. ‘‘ఏమిటీ? ఈతాగుబోతు శవం దగ్గరికి రావడమే గొప్ప. పైగా జనాజా నమాజా..? మావల్ల కాదు’’ అని మొఖం చిట్లించారు వాళ్ళు. రాజు వారికెలాగో నచ్చజెప్పి, శవాన్ని ఇంటివరకూ చేర్చాడు. భర్త పార్ధివ దేహాన్ని చూసిన భార్య బోరున రోదించింది. కాస్త శాంతించిన తరువాత, మారువేషంలో ఉన్నరాజు, మృతుణ్ణి గురించి వివరాలడిగాడు. దానికామె, తన భర్త చాలా మంచివాడని, దైవానికి భయపడేవాడని, పరులను పాపాలనుండి రక్షించడానికి ఎంతగానో తాపత్రయ పడేవాడని తెలిపింది. రాజు ఆశ్చర్యపోతూ, అంతకు ముందు తాను విన్న విషయాలను ప్రస్తావించాడు. దానికామె, ‘అవునయ్యా! తన రోజువారీ సంపాదనలో రెండు మద్యం సీసాలను కొనుక్కొచ్చేవాడు. కాని తాగడానికి కాదు. పారబోయడానికి. వాటిని కసువు దిబ్బపై పారబోసేవాడు. అలాగే వేశ్య ఇంటికి వెళ్ళేవాడు. దైవానికి భయపడమని, తప్పు చెయ్యవద్దని హితబోధ చేసేవాడు. ఆమెకు కావలసిన పైకం ముట్టజెప్పి, దీంతో నీ కుటుంబ అవసరాలు తీర్చుకో.. నువ్వూ తప్పు చేయకు, ఇతరుల్నీ ఇందులోకి లాగకు. అని హితవు చేసేవాడు. ఈ విధంగా తన శక్తిమేర, కనీసం ఒకరిద్దరినైనా తప్పుచేయకుండా ఆపగలిగానని సర్దిచెప్పుకొని తృప్తిపడేవాడు. ప్రజల్ని పాపాలనుండి రక్షించమని దైవంతో మొరపెట్టుకొనేవాడు. నేను చాలాసార్లు చెప్పి చూశాను. చూసేవాళ్ళు తాగుబోతు, వ్యభిచారి అనుకుంటారు. చివరికి మరణించినప్పుడు కూడా నీ జనాజా ఎవరూ చదవరు అని నచ్చజెప్పినా వినేవాడుకాదు. ‘ప్రజలేమనుకున్నా నాకు సంబంధం లేదు. నా ప్రభువు చూస్తున్నాడు. నామనసులో ఏముందో ఆయనకు మాత్రమే తెలుసు. నా జనాజా నమాజు గొప్పగొప్ప పండితులు చేస్తారు. అంతేకాదు, రాజు స్వయంగా నా జనాజా నమాజులో పాల్గొంటాడు. నువ్వేమీ బెంగపడకు’ అనేవాడు. అని చెబుతూ బాధతో కళ్ళు తుడుచుకుంది. ఇది విన్న రాజు ఒక దీర్ఘనిట్టూర్పు విడిచాడు. దుఖంతో ఆయన గొంతుపూడుకుపోయింది. ‘‘అమ్మా..! నేనే రాజును. రేపు జొహర్ నమాజు లో నీభర్త జనాజా నమాజు స్వయంగా నేనే చదివిస్తాను. గొప్పగొప్ప పండితులు కూడా జనాజా లో పాల్గొంటారు.’’ అని చెప్పాడు ఇదంతా విని, ఆ ఇద్దరు వ్యక్తులతో పాటు అక్కడున్నవారంతా ఆశ్చర్యచకితులయ్యారు. ఆమె కళ్ళవెంట ఆనంద బాష్పాలు టపటపా రాలాయి. అందుకని, బాహ్య ఆచరణలు చూసి, పూర్తిగా తెలియకుండానే నిర్ణయాలు చేసేయకూడదు. ఇతరులపైమాట తూలకూడదు. ఎవరి ఆచరణలకు వారే బాధ్యులు. ఒకరి భారాన్ని ఒకరు మోయరు. మంచిపని చేస్తున్నప్పుడు ఎవరేమనుకుంటారో అని ఆలోచించాల్సిన అవసరంకూడాలేదు. శక్తిమేర సత్కార్యాలు ఆచరించడమే మనపని. ప్రజలు రకరకాలుగా స్పందిస్తారు. అది వారి విజ్ఞత, విచక్షణా స్థాయిని బట్టి ఉంటుంది. అది అంతగా పట్టించుకోవాల్సిన అవసరంలేదు. ఫలితం దైవాధీనం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
అందరి పోషకుడూ ఆయనే..!
పూర్వం ఒక రాజు ఉండేవాడు. అతనికి ఏడుగురు కుమార్తెలు. ఒకరోజు అందరినీ సమావేశపరిచి, ‘‘మీ అందరి పోషకుడెవరు, మీరు ఎవరి దయా దాక్షిణ్యాలపై బతుకుతున్నారు?’’ అని ప్రశ్నించాడు. అప్పుడు కూతుళ్లందరూ, ‘‘అదేమిటి నాన్నా, అలా అడుగుతారు. మీరే కదా మా అందరినీ పోషించేది, మీ చల్లని దయవల్లే మేము బతకగలుగుతున్నాం’’ అన్నారు ముక్తకంఠంతో. కాని చిన్నమ్మాయి మాత్రం, ‘‘మీరు మా తండ్రి. మీప్రేమ, వాత్సల్యాలు ఎప్పుడూ మాపై ఉన్నాయి. అందులో సందేహంలేదు. కాని, అసలు ప్రదాత అల్లాహ్ మాత్రమే. మేం ఆయన దయాదాక్షిణ్యాలపైనే బతుకుతున్నాం. ఆయన ప్రసాదించిందే తింటున్నాం, తొడుగుతున్నాం ’’అని చెప్పింది. రాజుకు చిన్నకూతురు మాటలు రుచించలేదు. కోపం వచ్చింది. వెంటనే సిపాయీలను పిలిచి, ఆమెను జనసంచారం లేని కీకారణ్యంలో వదిలేసి రమ్మని, అక్కడ క్రూరమృగాల బారి నుండి ఎవరు రక్షిస్తారో, అక్కడ పోషించేవారెవరుంటారో చూద్దామని ఆజ్ఞాపించాడు. ఆ అమ్మాయి ఏమాత్రం భయపడలేదు. కట్టుబట్టలతో అడవిదారి పట్టింది. సిపాయీలామెను ఒక పెద్ద కీకారణ్యంలో వదిలేసి వెళ్లిపోయారు. ఆ అమ్మాయి అల్లాహ్‌పై భారం వేసి, పగలంతా అడవిలో ఎక్కడైనా జనసంచారం కనిపిస్తుందేమోనని అటూ ఇటూ తిరిగింది. కాని ఆ కీకారణ్యంలో అడవి మృగాల అరుపులు తప్ప ఆమెకేమీ కనబడలేదు. వినబడలేదు. చీకటి పడితే క్రూరమృగాల నుండి తప్పించుకోవడమెలా అని ఆలోచిస్తూ ముందుకు నడుస్తున్న క్రమంలో అక్కడ చిన్న పాకలాంటిది కనిపించింది. ప్రాణాలరచేతిలో పెట్టుకొని పాక దగ్గరికి సమీపించింది. చిన్నగా దగ్గుతున్న శబ్దం వినిపించింది. ఒక వృద్ధుడు జ్వరంతో మూలుగుతూ దాహంతో అలమటిస్తున్నాడు. వెంటనే పాకలోకి ప్రవేశించిన ఆ అమ్మాయి నీళ్లకోసం చూసింది. ఒకమూలన నీళ్లకుండ కనిపించింది. వెంటనే నీళ్లు అందించి సపర్యలు చేసింది. కాస్త స్థిమితపడిన తరువాత, వృద్ధునికి వృత్తాంతమంతా వివరించింది. ‘‘సరే, నేను రేపు పట్నం వెళుతున్నాను. పది రోజుల తరువాత గానీ రాను. అంతవరకూ నువ్విక్కడే ఉండు. ఎలాంటి భయమూ లేదు’’ అని చెప్పి మరునాడు వృద్ధుడు వెళ్లిపోయాడు. వృద్ధుని వద్ద మేక ఉంది. ఆ అమ్మాయి రోజూ మేకపాలు పిండి, తను కొన్ని తాగి, కొన్ని బయటపెట్టేది... ఆకలితో ఉన్న అడవి జంతువులేవైనా కడుపు నింపుకుంటాయని. మొదటిరోజు బయట పెట్టిన పాలపాత్ర ఖాళీ అయింది. పక్కనే ఒక మణి కనిపించింది. అమ్మాయి ఆశ్చర్యపోయింది. ఇంత విలువైన మణి ఎలా వచ్చిందని చివరికి ఇది అల్లాహ్ అనుగ్రహమని గ్రహించింది. పది రోజులూ ఇలానే జరిగింది. అత్యంత విలువైన పది మణులు లభించాయి. వృద్ధుడు తిరిగి రాగానే విషయమంతా వివరించి, ఐదు మణులు అతని చేతిలో పెట్టి, ఇక్కడొక పెద్ద భవంతిని నిర్మించమని పురమాయించింది. చూస్తూ చూస్తూనే రాజభవనాన్ని తలదన్నే నిర్మాణం వెలిసిందక్కడ. కూలీలకు చేతినిండా పని దొరకడంతో అక్కడొక చిన్నగ్రామం ఏర్పడింది. చూస్తూ చూస్తూనే అదొక సామ్రాజ్యంగా విస్తరించింది. ఆమె మంచితనం, దయాగుణం ఆ నోటా ఈ నోటా పాకి విషయం రాజుగారివరకూ వెళ్లింది. దీంతో రాజు, ఆమె ఎవరో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఆమెను కలవాలనుకుంటున్నట్లు వర్తమానం పంపాడు. తన కూతుర్లందరినీ తీసుకురావాలన్న షరతుపై ఆమె రాజుగారి ఆహ్వానాన్ని ఆమోదించింది. ఒకరోజు రాజు తన కూతుర్లందరినీ వెంటబెట్టుకొని వచ్చాడు. యువరాణి అత్యంత ఖరీదైన వస్త్రాల్లో, వజ్ర వైఢూర్యాలు, మణి, మాణిక్యాలు ధరించి, ముఖానికి మేలిముసుగు కప్పుకొని వారిని సాదరంగా ఆహ్వానించింది. వారికి రకరకాల అత్యంత ఖరీదైన, రుచికరమైన వంటలు వడ్డించింది. ఆ డాబు దర్పం, అంత ఖరీదైన బంగళా, ఆమె ఒంటిపైని విలువైన సంపద చూసియువరాణులే కాదు, స్వయంగా రాజు కూడా ఆశ్చర్యచకితుడయ్యాడు. చివరికి, ‘‘అమ్మా..! నువ్వు నా బిడ్డ లాంటిదానివి. నీమాట ప్రకారం నేను నా బిడ్డలందరినీ తీసుకొని వచ్చాను. ఇంకా నా ముందు పరదా ఎందుకు?’’ అన్నాడు. ‘‘సరే నేనిప్పుడే వస్తాను. మీరిక్కడే కూర్చోండి’’ అంటూ లోపలికి వెళ్లిపోయింది. అలా ఆమె వెళ్లిన కొద్దిసేపటికి బంగళా మరో ద్వారం నుండి మాసిన బట్టలతో, చింపిరి జుట్టుతో తన కూతురు అక్కడికి వచ్చింది. అడవిలో విడిచిపెట్టినప్పుడే ఏ మృగాలో తిని చనిపోయిందనుకున్న కూతురు కళ్లముందు ప్రత్యక్షమయ్యేసరికి, పితృప్రేమ పొంగుకొచ్చింది. ‘‘అమ్మా! ఎంత సంపద అయినా పరవాలేదు, నేను నిన్ను ఇక్కడి నుండి విముక్తి కల్పించి తీసుకువెళతాను. రాజ్యాన్ని త్యాగం చేసైనా నిన్ను విడిపించుకుంటాను’’ అన్నాడు రాజు. ‘‘లేదు నాన్నా. నేనే యువరాణిని. ఇప్పటివరకూ మేలిముసుగుతో మీతో మాట్లాడింది నేనే. ఆరోజు నేను అల్లాహ్ నా పోషకుడు, ఆయన పెట్టిందే తింటున్నాను అని చెప్పాను గదా. అది నిజమని నిరూపించాడు నా దైవం. ఆయనే నన్ను కాపాడాడు. ఈ రోజు నేను మీకన్నా సంపన్నురాలిని. అందరి పోషకుడు, పాలకుడు, విధాత, ప్రదాత అన్నీ ఆయనే. అల్ హందులిల్లాహ్’’ అని చెప్పింది రాజుగారి చిన్నకూతురు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
రమజాన్ స్ఫూర్తి కొనసాగాలి
పండుగ నెలరోజులపాటు ఆరాధనలు, సత్కార్యాలు, సదాచారాల్లో మునిగి తేలిన ముస్లిం సమాజం, తమకంతటి పరమానందాన్ని పంచిన పవిత్ర రమజాన్ మాసానికి ఘనంగా వీడ్కోలు పలికినప్పటికీ, అది నెలరోజులపాటు ఇచ్చినటువంటి తర్ఫీదు అనంతర కాలంలోనూ అందిపుచ్చుకోవాలి. పవిత్ర రమజాన్‌లో పొందిన దైవభీతి శిక్షణ, దయాగుణం, సహనం, సోదరభావం, పరస్పర సహకార, సామరస్య భావన, ఒకరి కష్టసుఖాల్లో ఒకరు పాలుపంచుకునే గుణం, పరమత సహనం, మానవసమానత్వం లాంటి అనేక సదాచార సుగుణాలకు సంబంధించిన తర్ఫీదు ప్రభావం మిగతా పదకొండు నెలలకూ విస్తరించి తద్వారా భావి జీవితమంతా మానవీయ విలువలే ప్రతిబింబించాలి. సమస్త మానవాళికీ సన్మార్గభాగ్యం ప్రాప్తమై, ఎలాంటి వివక్ష, అసమానతలు లేని, దైవభీతి, మానవీయ విలువల పునాదులపై ఓ సుందర సమసమాజం, సత్సమాజ నిర్మాణం జరగాలి. ఇహపర లోకాల్లో అందరూ సాఫల్యం పొందాలి. ఇదే రమజాన్ ధ్యేయం. ప్రతియేటా రమజాన్ వస్తూనే ఉంది. పోతూనే ఉంది. మనమంతా రోజాలు పాటిస్తున్నాం, తరావీలు ఆచరిస్తున్నాం. ఖురాన్ పారాయణం చేస్తున్నాం. రాత్రి జాగారాలు చేస్తున్నాం. సదఖ, ఫిత్రా, జకాత్ తదితర రూపాల్లో అభాగ్యులు, అగత్యపరులు, పేదవర్గాలను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. నియమానుసారంగా, సాంప్రదాయ బద్ధంగా అన్ని విధులూ నెరవేరుస్తున్నాం. నియమనిష్టలతో నెల్లాళ్ళు తర్ఫీదును పొందుతున్నాం. అయితే రమజాన్ అనంతరం ఈ శిక్షణ ప్రభావం ఎంతవరకు కనబడుతోందన్నది ప్రశ్న. ఈద్ ముగియడంతోనే శుభాల పర్వానికి తెరపడకూడదు. రమజాన్ నెల్లాళ్ళూ మస్జిదులు ఏవిధంగా కళకళలాడాయో, అలాగే రమజాన్ తరువాత కూడా నమాజీలతో కళకళలాడేలా చూడాలి. రమజాన్‌లో కనిపించిన సేవాభావం, దాతృస్వభావం, న్యాయబద్ధత, ధర్మశీలత, వాగ్దాన పాలన, ప్రేమ, సోదరభావం, సహనశీలత, పరోపకారం, క్షమ, జాలి, దయ, త్యాగభావం రమజాన్ అనంతరమూ ఆచరణలో ఉండాలి. అసత్యం, అబద్ధం పలకకపోవడం, అశ్లీలానికి పాల్పడకపోవడం, చెడు వినకపోవడం, చూడకపోవడం, సహించక పోవడంతోపాటు, అన్ని రకాల దుర్గుణాలకు దూరంగా ఉండే సుగుణాలు నిరంతరం కొనసాగాలి.తొలకరి జల్లుతో బీడువారిన పుడమి పులకించినట్లు, రమజాన్ వసంతాగమనంతో నైతిక వర్తనంలో, ఆథ్యాత్మిక ప్రగతిలో గణనీయమైన వృద్ధీవికాసాలు జరిగాయి. అనూహ్యమైన మానవీయ పరివర్తనకు బీజం పడింది. ఇప్పుడది నిలబడాలి, నిరంతరం కొనసాగాలి. ఈ వృద్ధీవికాసాలు ఒక్క నెలకే పరిమితం కాకూడదు. మనిషిని మనీషిగా మార్చడానికే ఈ శిక్షణకు ఏర్పాటు చేసింది ఇస్లాం. మానవుల ప్రతి పనినీ ఆరాధనా స్థాయికి చేర్చిన ధర్మం ఇస్లాం. అందుకే పవిత్ర రమజాన్ నెలలో వారి శిక్షణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ధర్మం. ఇక దాన్ని సద్వినియోగం చేసుకోవడమైనా, దుర్వినియోగం చేసుకోవడమైనా మన చేతుల్లోనే ఉంది.అందుకని రమజాన్ స్ఫూర్తిని కొనసాగించాలి. అప్పుడే రోజాల ఉద్దేశ్యం నెరవేరుతుంది. పండుగ ఆనందానికి పరమార్ధం చేకూరుతుంది. భావిజీవితాలు సుఖ సంతోషాలతో గడిచిపోతాయి. సమాజంలో శాంతి, సామరస్యం వెల్లివిరుస్తుంది. దోపిడీ, పీడన, అణచివేత, అసమానతలు లేని చక్కని ప్రేమపూరిత సుందరసమాజం ఆవిష్కృతమవుతుంది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఫిత్రా పేదల పెన్నిధి
చూస్తుండగానే పవిత్ర రమజాన్ నెల గడిచిపోతోంది. ఇంకా కొన్నిరోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈనెలలో ముస్లిములు చేయాల్సిన విధి రోజాలు పాటిస్తూనే, సదఖ, ఖైరాత్, జకాత్, ఫిత్రాలు చెల్లించడం. రమజాన్‌లో ఆచరించే అనేక ఆరాధనల్లో ‘ఫిత్రా’ ఒకటి. ఫిత్రా అన్నపదం ఇఫ్తార్ నుండి వచ్చింది. ఫిత్ర్ అంటే ఉపవాస విరమణ అన్నమాట. ‘సదఖయే ఫిత్ర్’ అంటే రోజా విరమణకు సంబంధించిన దానం అని అర్థం. ధర్మశాస్త్ర పరిభాషలో ‘సదఖయే ఫిత్ర్’ అంటే ఉపవాస దీక్షలు పాటించేటప్పుడు జరిగిన లోపాలకు, పొరపాట్లకు పరిహారంగా రమజాన్ మాసాంతంలో విధిగా చెల్లించవలసిన దానం. రోజాలు విధిగా నిర్ణయించిన నాటినుండే ఫిత్రాలు కూడా తప్పనిసరిగా చెల్లించాలని ముహమ్మద్ ప్రవక్త (స ) ఆదేశించారు.ఆ కాలంలో ప్రజలు ముఖ్యాహారంగా వినియోగించే పదార్థాలనే పరిగణనలోకి తీసుకొని ఫిత్రాలు చెల్లించేవారు. హజ్రత్ అబూసయీద్ ఖుద్రీ (ర ) ఇలాచెప్పారు–: ‘ప్రవక్తవారి కాలంలో మేము ఈదుల్ ఫిత్ర్ (పండుగ) దానంగా ఒక ’సా’ పరిమాణమంత పదార్ధాలను ఇచ్చే వాళ్ళం. ఆ కాలంలో యవలు, ఎండుద్రాక్ష, ఖర్జూరం, జున్ను తదితరాలు ముఖ్య ఆహార పదార్థాలుగా ఉండేవి.‘ ’సా’ అంటే పావుతక్కువ రెండు శేర్లు.. మారిన కాలాన్ని, నేటి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఏ రూపంలో అయినా ఫిత్రాలు చెల్లించవచ్చు. ఫిత్రాలవల్ల రెండురకాల లాభాలున్నాయి. ఒకటి –రోజాలను ఎంత నిష్టగా పాటించినా, మానవ సహజ బలహీనత వల్ల ఏవో చిన్నచిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. వాటికి పరిహారమే ఈ ఫిత్రాలు. వీటివల్ల రోజాలు పవిత్రతను, పరిపూర్ణతను సంతరించుకొని స్వీకారభాగ్యానికి నోచుకుంటాయి. రెండు–, ఫిత్రాలవల్ల సమాజంలోని పేద , బలహీనవర్గాలకు కాస్తంత ఆర్ధిక వెసులుబాటు కలుగుతుంది. తద్వారా వారు కూడా పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోగలుగుతారు. ఈ కారణంగానే ప్రవక్త మహనీయులు ఫిత్రాదానాన్ని ’తూమతుల్లిల్ మసాకీన్ ’అన్నారు. అంటే ’దీనులు, నిరుపేదల భృతి’ అని అర్థం.అందుకే ప్రవక్తమహనీయులు ఫిత్రాదానాలను ఉపవాసులకే పరిమితంచేయకుండా, ఈపరిధిని విస్తరించారు. అంటే ఉపవాసం ఉన్నా లేకపోయినా అందరూ ఫిత్రా చెల్లించాలి. కుటుంబంలో ఎంతమంది ఉంటే, వారందరి తరఫున కుటుంబ యజమాని ఫిత్రా చెల్లించాలి. పండుగ నమాజు కంటే ముందు జన్మించిన శిశువు తరఫున కూడా తల్లిదండ్రులు ఫిత్రా చెల్లించాలి. పండుగ కంటే ముందే ఈ బాధ్యత నెరవేర్చుకోవాలి. కనీసం మూడు నాలుగు రోజులముందు చెల్లిస్తే లబ్ధిదారులు పండుగ సామగ్రి కొనుక్కోవడానికి వీలుగా ఉంటుంది. పండుగ సంతోషంలో అందరినీ భాగస్వాములను చేయడమే ఉద్దేశ్యం. ఆహార పదార్థాలు, వస్త్రాలు, నగదు ఏరూపంలో అయినా ఫిత్రా చెల్లించవచ్చు.కనుక పవిత్ర రమజాన్ మాసంలో చిత్త శుద్ధితో అన్నిరకాల ఆరాధనలు ఆచరిస్తూ, ఫిత్రాలను కూడా బాధ్యతాయుతంగా నెరవేర్చాలి. మానవీయ విలువల వికాసానికి కృషిచేయాలి. ఈ పవిత్ర మాసంలో ఏదో ఒక రకంగా, ఎంతోకొంత ప్రయోజనం చేకూర్చి, తమపరిధిలో కొందరి మోముపైనైనా చిరునవ్వులు చూడగలిగితే అంతకంటే మహాభాగ్యం మరేమీ ఉండదు. అల్లాహ్ అందరికీ సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. దివినుండి భువికి.. దెవప్రసన్నతను చూరగొనడానికి రోజా పాటించడం, ‘తరావీహ్ ’లు ఆచరించడం, దానధర్మాలు చేయడంతో పాటు, ఈ నెల చివరిలో ‘లైలతుల్ ఖద్ర్’ అన్వేషణలో అధికంగా ఆరాధనలు చేస్తారు. లైలతుల్ ఖద్ర్ అంటే అత్యంత అమూల్యమైన రాత్రి అని అర్ధం. ఈ రాత్రినే ఖురాన్ అవతరణ మొదటిసారిగా ప్రారంభమైంది. ఈ రాత్రి దైవదూతలు దివినుండి భువికి దిగివస్తారు. ఆరాధనలు చేసేవారికోసం వారు మన్నింపు ప్రార్ధనలు చేస్తారు. భక్తులు చేసే అర్ధింపులు, వేడుకోళ్ళకు తథాస్తు పలుకుతారు.ముస్లిములు, ముస్లిమేతరులు అన్న భేదభావం లేకుండా సమాజంలోని పేదసాదలపట్ల సంపన్నులు తమ బాధ్యతను గుర్తెరిగి మసలుకోవలసిన అవసరాన్ని రమజాన్ గుర్తుచేస్తుంది. అనవసర భోగవిలాసాలకు తమ ధనం వృధా చేయకుండా అగత్యపరులను ఆదుకోవాల్సిన అవసరాన్ని దివ్య ఖురాన్ నొక్కి చెబుతుంది. అందుకే ప్రవక్తవారు రమజాన్‌ను ‘సానుభూతుల నెల’ అన్నారు. ఉపవాసం పాటించడం వల్ల పేదవాళ్ళ ఆకలిబాధలు అర్ధమవుతాయన్నారు. సంపన్నులకు, ముప్పూటలా సుష్టుగా తినేవారికి నిరుపేదల ఆకలికేకలు వినబడవు. అలాంటివారు గనక ఉపవాసం పాటించినట్లయితే ఆకలిబాధ ఎలా ఉంటుందో వారికీ తెలుస్తుంది. తద్వారా పేదసాదలను ఆదుకోవడం, వారికి పట్టెడన్నం పెట్టడం ఎంతగొప్ప పుణ్యకార్యమో వారు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఘనమైన మాసం – విలువైన రాత్రి
సంవత్సరంలోని పన్నెండు నెలల్లో అత్యంత శోభాయమానమైన, విశిష్టమైన నెల రమజాన్. ఇందులోని ప్రారంభదశ– అంటే మొదటి పదిరోజులు కారుణ్యభరితమైనవి. ఈ దశలో దైవకారుణ్యం విశేషంగా వర్షిస్తుంది. రెండవదశ క్షమాపణ, మన్నింపునకు సంబంధించినది. ఈదశలో దేవుడు దాసుల తప్పుల్ని క్షమించి, తన కారుణ్య ఛాయలో చోటు కల్పిస్తాడు. ఇకమూడవది, నరకాగ్ని నుండి విముక్తిదశ. ఈ చివరిదశలో అల్లాహ్ అసంఖ్యాకమందిని నరకజ్వాలల భయం నుండి విముక్తి కల్పిస్తాడు. ఇది చాలా కీలకమైన దశ. దీని ప్రాశస్త్యం చాలా గొప్పది. సంవత్సరంలోని పన్నెండు నెలల్లో రమజానుకు ఎంతటి ప్రాముఖ్యం ఉంది. ఈ నెలలోని మూడుదశల్లో చివరి పదిరోజులకు అలాంటి ప్రాముఖ్యమే ఉంది. ఈ చివరి పదిరోజుల్లోని ఒకరాత్రిలో ‘షబెఖద్ర్’ ఉంది. దీన్ని ‘లైలతుల్ ఖద్ర్’ అని కూడా అంటారు. ఇది వెయ్యి నెలలకన్నా ఎక్కువ విలువైనది. ఈ రాత్రిలోనే పవిత్రఖురాన్ గ్రంథం అవతరించింది. ఈ విషయాన్ని అల్లాహ్ ఇలా ప్రకటించాడు: ‘మేము ఈ ఖురాన్ గ్రంథాన్ని ఘనమైన రాత్రియందు అవతరింపజేశాము. ఆ రాత్రి ఘనత ఏమిటో మీకు తెలుసా? ఆ ఘనమైన రాత్రి వెయ్యి నెలలకన్నా ఎంతో శ్రేష్ఠమైనది. ఆ రాత్రి ఆత్మ, దైవదూతలు తమప్రభువు అనుమతితో ప్రతి ఆజ్ఞను తీసుకొని అవతరిస్తారు. ఆ రాత్రి అంతా శుభోదయం వరకు పూరి ్తశాంతి శ్రేయాలే అవతరిస్తూ ఉంటాయి’. (పవిత్రఖురాన్ 97– 1,5) ఖురాన్లో మరొకచోట ఇలా ఉంది.: ‘ఖురాన్ అవతరించిన నెల రమజాన్. అది సమస్త మానవాళికీ మార్గదర్శక జ్యోతి. రుజుమార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన సూచనలు అందులో ఉన్నాయి.’(2–185) ఖురాన్ అవతరణే ఘనతకు మూలం మానవజాతికి సన్మార్గం చూపి, వారి ఇహ పర సాఫల్యానికి దిక్సూచిగా నిలిచే మహత్తర మార్గదర్శిని రమజాన్ నెలలో – ప్రత్యేకించి చివరిభాగంలోని ’లైలతుల్ ఖద్ర్’లో అవతరించింది కాబట్టే ఈరాత్రికి ఇంతటి ప్రాముఖ్యత, విశిష్టత ఏర్పడ్డాయి. ఈ ఒక్క రాత్రి చేసే ఆరాధన వెయ్యి నెలలకన్నా ఎక్కువగా చేసిన ఆరాధనతో సమానమంటే దీనిప్రాశస్త్యాన్ని అర్ధం చేసుకోవచ్చు. అందుకే రమజాన్ చివరి పదిరోజుల్లోని బేసిరాత్రుల్లోఆరాధనలు అధికంగా చెయ్యాలని ప్రవక్త ఉపదేశించారు. అంటే 21, 23, 25, 27, 29 రాత్రులన్న మాట. ఎవరైతే ఆత్మసంతోషంతో, పరలోక పుణ్యఫలాపేక్షతో ఈ రాత్రి ఆరాధనల్లో గడుపుతారో వారు నిజంగానే ధన్యులు. వారి గత అపరాధాలన్నీ మన్నించబyì పునీతులవుతారు. మరెవరైతే షబేఖద్ర్‌లో ఆరాధనలు చేయకుండా నిర్లక్ష్యం చేసి, ఆ శుభరాత్రిని పోగొట్టుకుంటారో అలాంటివారికి మించిన దౌర్భాగ్యులు, దురదృష్టవంతులు మరెవరూ ఉండరు. మహా ప్రవక్త వారి ప్రవచనాలద్వారా మనకు ఈవిషయాలు తెలుస్తున్నాయి. అందుకని ఈ పవిత్ర మాసంలో, ముఖ్యంగా చివరి పదిరోజుల్లోనైనా చిత్తశుధ్ధితో, ఆత్మసంతోషంతో ఆరాధనలు, సదాచారాలు అధికంగా చేసి దైవప్రసన్నత పొందడానికి ప్రయత్నించాలి.’ ‘ఏతెకాఫ్’ ’ఫిత్రా’ లకు కూడా ఇదే అనువైన కాలం. చివరిపదిరోజులు ఏతెకాఫ్ పాటించడానికి ప్రయత్నించాలి. అంటే మొత్తం పదిరోజులపాటు రేయింబవళ్ళుమసీదులోనే ఆరాధనలో గడపాలన్నమాట. అత్యవసరాలైన మానవసహజ అవసరాలకు మాత్రమే మసీదునుండి బయటికి వెళ్ళే అనుమతి ఉంది. అన్నపానీయాలు కూడా మసీదుకే తెప్పించుకోవాలి. ఈవిధంగా రమజాన్ చివరిదినాల్లో పండుగకు కొన్నిరోజుల ముందు ఫిత్రాలు కూడా చెల్లిస్తే, పేదసాదల పండుగ అవసరాలు తీరతాయి. వారు కూడా సంతోషంగా పండుగసంబురాల్లో పాలుపంచుకునే అవకాశాలు మెరుగుపడతాయి. కొందరిసంతోషం కాకుండా అందరి ఆనందమేకదా పండుగ. అల్లాహ్ అందరికీ ఇతోధికంగా పుణ్యకార్యాలు ఆచరించి, ఇహపర సాఫల్యాలకు అర్హతసాధించే విధంగా ఆశీర్వదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
పేదల హక్కు జకాత్
ఇస్లామీ ధర్మ శాస్త్రంలో ప్రధానమైన విధులు ఐదు. ఈమాన్, నమాజ్, రోజా, జకాత్ , హజ్జ్. ఈ ఐదు విధుల్లో ‘జకాత్’ కూడా ఒకటి. దీనికి అత్యంత ప్రాముఖ్యం ఉంది. ఈమాన్, నమాజుల తరువాత జకాత్దే ప్రముఖ స్థానం. జకాత్ అంటే పవిత్రత, పరిశుభ్రత అని శాబ్దిక అర్థాలున్నాయి. ధార్మిక పరిభాషలో మిగులు ధనం పరిశుద్ధత పొందాలన్న ఉద్దేశ్యంతో సంవత్సరానికొకసారి తమ సంపద నుండి రెండున్నర శాతం చొప్పున పేదసాదలకు, ధార్మిక కార్యకలాపాలకు దానం చేసే ధన, కనక వస్తువుల్ని ‘జకాత్’ అంటారు. పేదసాదలకు ఇస్తారు కాబట్టి సాధారణంగా మనం ‘దానం’ అని చెప్పుకుంటున్నాం కాని, నిజానికి అది వారి హక్కు. మరోరకంగా చెప్పాలంటే దేవుని హక్కు. దాన్ని విధిగా పేదసాదలకు చెల్లించాలి. పవిత్ర ఖురాన్ లో ‘నమాజును స్థాపించండి, జకాతు చెల్లించండి’ అన్న జంట పదాలు దాదాపు డెబ్భై కంటే ఎక్కువసార్లు ప్రస్తావించబడ్డాయి. అంటే ధర్మంలో నమాజు, జకాతు స్థానం దాదాపు సమానమేనన్నమాట. దైవం జకాత్ చెల్లింపును విశ్వాసులకు విధిగా చేశాడు. దైవం జకాతు వ్యవస్థ ద్వారా ప్రజల హృదయాల నుండి ధన వ్యామోహాన్ని దూరం చేసి, స్వచ్ఛమైన ప్రేమను, సహాయ సహకారాల గుణాన్ని జనింపజేయదలిచాడు. అందుకని ప్రజలు మనసా, వాచా, కర్మణా చిత్తశుద్ధితో జకాత్ చెల్లిస్తూ, దాని అసలు ఉద్దేశ్యాన్ని గ్రహించాలి. అప్పుడే జకాత్ లక్ష్యం నెరవేరుతుంది. నిజానికి మనదగ్గర ఉన్నదంతా మనది కాదు. దాన్నొక అమానతుగా దైవం మనకు ప్రసాదించాడు. మన, మన కుటుంబ అవసరాలతోపాటు, బంధుమిత్రులు, పేదసాదలు తదితర అన్ని వర్గాల హక్కులూ అందులో ఉన్నాయి. వీటిని గుర్తించి దైవాదేశాల మేరకు వినియోగించినప్పుడే, ఆయా హక్కులు నెరవేర్చిన వారమై, దైవ ప్రసన్నత పొందడానికి అర్హులు కాగలుగుతాము. వాస్తవానికి జకాత్ వ్యవస్థ సమాజంలో ప్రజలందరికీ ఆర్థిక న్యాయాన్ని అందించే ఒక బ్రహ్మాండమైన సాధనం. ఇది ప్రజల హృదయాలనుండి స్వార్థం, సంకుచితత్వం, లోభత్వం, పిసినారితనం, అసూయా ద్వేషాలు, కాఠిన్యం, కుళ్ళుబోతుతనం లాంటి దుష్టభావాలను రూపుమాపి, ప్రేమ, దయ, సానుభూతి, పరోపకారం, త్యాగం, ఔదార్యం, స్నేహశీలత లాంటి సద్గుణాలను పెంపొందింపజేస్తుంది. తద్వారా అసమానతలు అంతమై ఆర్థిక సమానత్వం నెలకొంటుంది. అందుకే అనాదిగా జకాత్ విధిగా పాటించబడుతూ వచ్చింది. జకాత్ విధి అని తెలిసీ, చెల్లించే స్తోమత ఉండీ, బుద్ధిపూర్వకంగా నిరాకరిస్తే, అంటే, పేదలకు చెందవలసిన ఆర్ధిక హక్కును ఎగ్గొడితే అలాంటి వ్యక్తి ఇక విశ్వాసిగా మిగలడు. పరమ దుర్మార్గుడిగా, పాపిగా పరిగణించబడి శిక్షకు పాత్రుడవుతాడు. ‘ఎవరికైతే దైవం సంపదను ప్రసాదించాడో అతను జాకాత్ చెల్లించకపోతే ప్రళయ దినాన ఆ సంపద ఓ అనకొండ రూపాన్ని సంతరించుకుంటుంది. దాని నెత్తిమీద రెండు చుక్కలుంటాయి. ఆ సర్పాన్ని కంఠపాశంగా చేసి అతని మెడలో వేయడం జరుగుతుంది. అప్పుడా సర్పం అతని రెండు దవడలను కరిచిపట్టి నేను నీసంపదను, (నువ్వు పేదలకు దానం చేయకుండా) నువ్వు కూడబెట్టిన నిధిని’ అంటుంది. అని ప్రవక్త మహనీయులు సెలవిచ్చారు. పవిత్ర ఖురాన్లో ఇలా ఉంది: ‘అల్లాహ్ తన అనుగ్రహంతో ప్రసాదించిన సంపద విషయంలో పిసినారితనం వహించేవారు, అది తమకు మేలు చేకూరుస్తుందని భావించకూడదు. ఆ పిసినారితనం వారికి హాని కలిగిస్తుంది. వారు ఏ ధనం విషయంలో పిసినారితనం వహిస్తున్నారో అది ప్రళయదినాన వారి మెడకు గుదిబండగా మారుతుంది.’(3–180) మరోచోట ఇలా ఉంది: ‘వెండి బంగారాలు కూడబెట్టి వాటిని దైవమార్గంలో వినియోగించని పిసినారులకు దుర్భరమైన యాతన కాచుకొని ఉంది. ఆ వెండి బంగారాలనే నరకాగ్నిలో బాగా కాల్చి వారి నుదుళ్ళపై, పక్కలపై, వీపులపై వాతలుపెట్టే రోజుకూడా సమీపంలోనే ఉంది. ఇవే మీరు కూడబెట్టుకున్న సిరిసంపదలు. వీటి రుచిని చవి చూడండి’ అని చెప్పడం జరుగుతుంది.(9–34,35) కాబట్టి దేవుని ఆగ్రహం నుండి, ఆయన శిక్షనుండి రక్షించబడి, ఆయన ప్రేమను, ప్రసన్నతను పొందాలంటే సమాజంలోని అభాగ్యులైన పేదసాదల ఆర్థిక హక్కు అయినటువంటి ’జాకాతు’ను తప్పనిసరిగా చెల్లించాలి. నమాజు, రోజాలతోపాటు జకాతు కూడా చెల్లించి అల్లాహ్ ప్రేమను, ప్రసన్నతను పొందే ప్రయత్నం చేద్దాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
వెలుగుబాట వరాల మూట
పవిత్ర రమజాన్ మరోసారి రానే వచ్చింది. వసంతమాసంలా వచ్చి, మనసులు దోచే మరుమల్లెల పరిమళ గుబాళింపులా శుభసుగంధాలు వెదజల్లుతోంది. మానవసహజ లోపాలను సరిదిద్దుకోవాలనుకునే వారు, పాపపంకిలమైన జీవితాలను పునీతం చేసుకోవాలనుకునేవారు, దుర్లక్షణాలకు దూరంగా మానవీయ సుగుణాలను పెంపొందించుకోవాలనుకునే సత్కార్యాభిలాషులైన సచ్ఛీలురు ఈ పవిత్రమాసపు విలువల పరీమళాన్ని తనివితీరా ఆఘ్రాణించవచ్చు. ఈ కారణంగానే శుభాలు కురిసే వరాల వసంతాన్ని అత్యంత శ్రద్ధాసక్తులతో స్వాగతం పలకాలని మమతలమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం ఉపదేశించారు. అల్లాహ్ ప్రత్యేక అనుగ్రహం పవిత్రరమజాన్లో ఆరాధనల పట్ల ప్రత్యేక శ్రద్ధను, ప్రేమను పెంపొందించుకొని ఫర్జ్, సున్నత్ , నఫిల్లతోపాటు, ప్రత్యేకంగా ‘తరావీహ్ ‘నమాజులు ఆచరిస్తూ, ఎక్కువగా సత్కార్యాలు చేయడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే, సమస్త మానవజాతికి మార్గదర్శక గ్రంథమైన ఖురాన్ రమజాన్‌లోనే అవతరించింది. మానవుల మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి మహత్తరంగా ఉపకరించే ఉపవాస వ్రతం ఈ మాసంలోనే విధిగా ప్రకటించబడింది. వెయ్యిమాసాలకన్నా విలువైన రాత్రి అని చెప్పబడిన ‘లైలతుల్ ఖద్ర్’ కూడా ఈ మాసంలోనే ఉంది. అందుకే దీనికి ఇంతటిపవిత్రత, ఘనత, గౌరవం. అల్లాహ్‌తో సంబంధాన్ని పటిష్టపరచుకోవాలి. ఈ మాసంలో ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఆరాధనలపట్ల శ్రద్ధవహించాలి. నమాజులను చిత్తశుద్ధితో నెరవేర్చాలి. ఆరాధనల ప్రభావం పూర్తి జీవితంపై పడేలా ఉండాలి. దానధర్మాలు అధికంగా చెయ్యాలి. పేదసాదలు, అనాథలు అభాగ్యులు, వితంతువులు, వికలాంగులు, అగత్యపరులను ఆదరించాలి. శక్తిమేర వారిని ఆదుకోవాలి. సమాజం పట్ల బాధ్యతను గుర్తెరగాలి. ప్రవక్తమహనీయులు రమజాన్‌ను ‘సానుభూతులమాసం’ అన్నారు. కనుక సాటిమానవులతోపాటు, సృష్టిలోని సమస్తజీవరాసులపట్ల ప్రేమ, దయ, జాలి, కరుణ, సానుభూతి కలిగి ఉండాలి. ఇతర రోజులు, ఇతరనెలలతో పోల్చుకుంటే రమజాన్ లో దానధర్మాలు, సత్కార్యాలు అధికంగా చెయ్యాలని మనకు దీనిద్వారా తెలుస్తోంది. రమజాన్ వచ్చిందంటే చాలు, ప్రవక్తవారి ముఖకవళికలు మారిపొయ్యేవి. ఆరాధనలు అధికమయ్యేవి. అభ్యర్ధన, వేడుకోలు, దుఆలలో వినయ వినమ్రతలు ఉట్టిపడేవి. హదీసులో ఇలా ఉంది: ’రమజాన్ నెలలో, దేవుడు సింహాసనం మోసే దైవదూతలతో, మీరు మీసేవలు, ఆరాధనలు అన్నీ ఆపేసి ఉపవాసం పాటిస్తున్న వారి దువాలకు ఆమీన్ పలకండి’ అని ఆదేశిస్తాడు. ఎవరికి మినహాయింపు? మానవుల బలహీనతలను, వారికష్టసుఖాలను బాగా తెలిసినటువంటి దేవుడు, రమజాన్ రోజాలను విధిగా నిర్ణయించినప్పటికీ, కొందరికి కొన్నిమినహాయింపులు కూడా ప్రసాదించాడు. చిన్నపిల్లలు, బాటసారులు, వ్యాధిగ్రస్తులు, వృద్ధులు, గర్భవతులు, బాలింతలు, మతిస్థిమితం లేనివాళ్ళు, రుతుచక్రంలో ఉన్న స్త్రీలు – ఇలాంటివారికి రోజానుండి మినహాయింపు ఉంది. మానవులపట్ల దేవుని ప్రేమకు ఇదికూడా ఒక నిదర్శనమే. ‘రోజా’ ఎలా ఉండాలి? ఇస్లామీ ధర్మశాస్త్రం ప్రకారం, రోజా పాటించాలనుకునేవారు ఉషోదయానికి ముందే, అంటే తెల్లవారుజామున అన్నపానీయాలు సేవించాలి. ఆకలిగా లేకపోయినా కొద్దిగానైనా తినాలి. లేదా కనీసం మంచినీళ్ళయినా తాగాలి. దీన్నే ‘సహెరి’ అంటారు. తరువాత సూర్యాస్తమయం వరకు పచ్చిమంచినీళ్ళు కూడా ముట్టకూడదు. సూర్యాస్తమయం కాగానే రోజా విరమించాలి. దీన్ని ‘ఇఫ్తార్ ’ అంటారు. అబద్ధాలు, చాడీలు, అపనిందలు, అసభ్య పదజాలప్రయోగం అన్ని వేళలా అధర్మమే, నిషిధ్ధమే. అయితే ఉపవాసకాలంలో మరీ అప్రమత్తంగా ఉండాలి. నిజానికి ఉపవాసం అబద్ధం, అసభ్యం, అశ్లీలతలనుండి, సమస్త దుర్వ్యసనాలనుండి కాపాడే రక్షణకవచం. కనుక ఎవరైనా అజ్ఞానంతోనో, అహంకారంతోనో తిట్టినా, కయ్యానికి కాలుదువ్వినా తాము మాత్రం వ్రతం పాటిస్తున్నామని, తమకిలాంటి చేష్టలు శోభించవని గుర్తించాలి. ఇతరులు రెచ్చగొట్టినా సహనం వహించాలి. పవిత్రఖురాన్ను వీలైనంత ఎక్కువగా పారాయణం చేయడానికి, అర్ధం చేసుకోడానికి ప్రయత్నించాలి. ‘అల్లాహ్’ పవిత్రనామాన్ని స్మరిస్తూ ఉండాలి. కబుర్లకు దూరంగా ఉంటూ, సత్కార్యాల్లో లీనమైపోవాలి. ‘కలిమా ‘వచనంతోపాటు, దురూదెషరీఫ్ పఠిస్తూ ఉండాలి. అల్లాహ్ అందరికీ రమజాన్ శుభాలను సమృద్ధిగా ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
చిన్నారి సుగుణం
అక్కడ అంతా కోలాహలంగా ఉంది. ఏదోవేడుక జరుగుతోంది. అది ఒక సంపన్నకుటుంబం తమ గారాలపట్టి చిన్నారి శాలినికి జరుపుకుంటున్న ఓణీలవేడుక అది. ఖరీదైనకార్లు ఫంక్షన్ హాల్ పార్కింగ్ లో బారులు తీరుతున్నాయి. వాటిల్లోంచి ఖరీదైన మనుషులు దిగుతున్నారు. నిర్వాహకులు వారిని ఎంతో గౌరవంతో స్వాగతం పలికి ఆహ్వానిస్తున్నారు. రకరకాల రుచికరమైన వంటకాలు. బ్రహ్మాండమైన విందుభోజనం. అక్కడ దేనికీ లోటులేదు. తిన్నవాళ్ళకు తిన్నంత. అతిథులంతా భోజనానికి కూర్చున్నారు. ఇదంతా అక్కడికి కొద్దిదూరంలో ముడుచుకొని కూర్చున్న ఓ యాచక వృద్ధురాలు గమనిస్తోంది. రెండురోజులనుండి తినడానికి ఏమీ దొరక్క ఆకలితో కడుపు నకనకలాడుతోంది. ఒకరిద్దరు తినేదాంట్లో మిగిలినంది తనకు పెట్టినా సరిపోతుంది. మంచి విందుభోజనం. పాపం ముసలి మనసు ఈ రోజు తన కడుపు నిండినట్లేనని ఆశపడింది. చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ, శక్తినంతా కూడదీసుకొని భోజనశాల ముఖద్వారం వద్దకు చేరుకుంది. నిర్వాహకులు ముసలమ్మను అడ్డుకున్నారు. ‘‘అయ్యా.. ఆకలవుతోంది ఒక్కముద్ద అన్నం పెడితే, తినిపోతా’’ అని వేడుకుంది ఆ వృద్ధురాలు. కాని వారు ఏమాత్రం కనికరం చూపకుండా నిర్దాక్షిణ్యంగా గెంటివేశారు. వేదికపైనుండి తన టీచర్ కోసం ఎదురుచూస్తున్న కథానాయకి శాలిని ఇది గమనించింది. శాలిని పట్టణంలోని అల్ కౌసర్ స్కూల్లో ఆరవ తరగతి చదువుతోంది. ఆ స్కూల్ టీచర్ నజ్మా అంటే ఆమెకు చాలా ఇష్టం. ఆమె తరగతి పాఠాలతో పాటు ఎన్నో నీతి కథలు కూడా చెప్పేది. అవన్నీ ఆ చిన్నారి మనసులో ముద్రించుకుపోయాయి. దాంతో తను అందుకుంటున్న అభినందనలను కాసేపు పక్కకు పెట్టి వేదిక దిగింది. అకస్మాత్తుగా అమ్మాయి వేదిక దిగడాన్ని గమనించిన తల్లిదండ్రులు, బంధువులు కంగారు పడ్డారు. కాని ఆ చిన్నారి నేరుగా వృద్ధురాలి దగ్గరకు వెళ్ళింది. ఆప్యాయంగా ఆమె చేయిపట్టుకొని భోజనశాలకు తీసుకెళ్ళింది. తనపక్కన కూర్చోబెట్టుకుని తృప్తిగా భోజనం చేయించింది. నేరుగా వేదిక వద్దకు తీసుకెళ్ళి కొన్నికానుకలు, కొంతనగదు ఇచ్చింది. ఇదంతా గమనిస్తున్న నిర్వాహక పెద్దలంతా సిగ్గుతో తలదించుకున్నారు. అనవసర ఆర్భాటాలకు వేలు, లక్షలు దుబారా చేస్తున్న మనం సమాజంలోని నిస్సహాయులకోసం ఏం చేస్తున్నామన్న అపరాధభావం వారిలో కలిగింది. ఇంత చిన్నవయసులోనే ఇంతటి సుగుణాలను పుణికి పుచ్చుకున్న చిన్నారి శాలినీని, దానికి కారణమైన నజ్మా టీచర్ ను అందరూ మనస్పూర్తిగా అభినందించారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
నిన్ను నీవు తెలుసుకో..!
పూర్వం ఒకవజ్రాల వ్యాపారి ఉండేవాడు. దూరతీర దేశాలు తిరిగి వ్యాపారం చేసేవాడు. అలా ఒకసారి ఒక ఊరికి వెళ్ళాడు. ఆ ఊరి వర్తకులు, సంపన్నులకు అవి చూపించాడు. ఎవరికి కావలసినవి వాళ్ళు కొనుక్కున్నారు. అతని దగ్గర విలువైన ఒక చిన్న వజ్రం ఉంది. అందరి చూపులూ దానిమీదే ఉన్నా, ధర ఎక్కువ ఉండడంతో దాన్ని ఎవరూ కొనలేకపోయారు. ఒకదొంగ చూపు దానిమీద పడింది. ఎలాగైనా దాన్ని కాజేయాలనుకున్నాడు. వ్యాపారి బేరం అయిపోయిన తరువాత మరో నగరానికి ప్రయాణం కట్టాడు. దొంగ వ్యాపారితో మాటలు కలిపాడు. స్నేహం కుదుర్చుకున్నాడు. వ్యాపారికి అతడిపై అనుమానం కలిగింది. కాని బయట పడలేదు. ఇద్దరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ ప్రయాణం ప్రారంభించారు. పగలంతా మాటా ముచ్చట్లతో గడిచిపోయింది. రాత్రి భోజనం తెప్పించుకొని తిని ఇద్దరూ పడుకున్నారు. వ్యాపారి ఆ విలువైన వజ్రాన్ని చిన్నగా సహ ప్రయాణికుడి ముసుగులో ఉన్న దొంగ సంచిలో పెట్టేసి హాయిగా నిద్రపోయాడు. అర్ధరాత్రి సమయాన లేచిన దొంగ చుట్టూ కలియజూశాడు. వ్యాపారి గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు. చుట్టుపక్కల ఎవరికి వారు మంచి నిద్రల్లో ఉన్నారు. ఇదే మంచి అదును అని భావించిన దొంగ వ్యాపారి సంచీ అంతా వెదికాడు. చివరికి చాకచక్యంగా చొక్కా జేబులు కూడా గాలించాడు. ఎక్కడా వజ్రం జాడ లేదు. తెల్లవారు ఝాము వరకూ ప్రయత్నించాడు. లాభం లేకపోయింది. ఇక చేసేదేమీ లేక నిరాశతో పడుకున్నాడు. వ్యాపారి పొద్దున్నే లేచి తాను దొంగ సంచిలో ఉంచిన వజ్రాన్ని తీసుకొని తన వద్ద భద్రంగా ఉంచుకున్నాడు. ఉదయమే కాలకృత్యాలు తీర్చుకొని అల్పాహారం తెప్పించుకున్నారు. ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ... ‘అవునూ.. నిన్న ఒక విలువైన వజ్రం చూపించావు గదా.. అది ఏమైంది..? ఉందా.. ఎవరైనా కొన్నారా..!’ అని ఆరా తీశాడు. వెంటనే వ్యాపారి తన సంచీలోంచి వజ్రాన్ని తీసి చూపించాడు.‘ఇదిగో ఇదే మిత్రమా ఆ విలువైన వజ్రం.’ అని. దొంగ దాన్ని చేతిలోకి తీసుకొని అటూ ఇటూ తిప్పి చూశాడు. బాగుంది.. చాలా బాగుంది.. అంటూ ప్రశంసించాడు. కాని లోలోపల చాలా బాధపడ్డాడు. రాత్రి ఎంతవెదికినా దొరకలేదని. సరే అయిందేదో అయింది. ఈ రోజు ఎలాగైనా దీన్ని కొట్టేయాలని తీర్మానించుకున్నాడు. రెండవరోజు యధాప్రకారం కబుర్లు చెప్పుకొని నిద్రకు ఉపక్రమించారు. మళ్ళీ దొంగ వ్యాపారి బ్యాగుల్ని అణువణువూ గాలించాడు. కాని మళ్ళీ నిరాశే ఎదురైంది. ఈ విధంగా మూడురాత్రులు గడిచి పోయినా దొంగ వజ్రం జాడ పసిగట్టలేక పోయాడు. చివరికి వ్యాపారి ముందు తప్పును ఒప్పుకొని అసలు విషయం చెప్పాడు. తానొక దొంగనని, వజ్రం కాజేయడానికే మీ వెంట ప్రయాణం చేస్తున్నానని, కాని విఫలమయ్యానని, తనను క్షమించమని ప్రాధేయపడ్డాడు. వ్యాపారి చిన్నగా నవ్వుతూ ఇలా చెప్పాడు... ‘వజ్రాన్ని నేను నీ చేతిసంచిలోనే పెట్టాను. కాని నువ్వు నీ సంచీ తప్ప అంతా వెదికావు. అందుకే అది దొరకలేదు.’ అన్నాడు చిద్విలాసంగా... నేడు మన పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మనం మనలోకి చూసుకోవడంలేదు. మన లోపాలపై, బలహీనతలపై, తప్పులపై దృష్టి పెట్టడం లేదు. మనలోకి మనం తొంగి చూసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇతరుల తప్పులు, లోపాలను వెదకడంలో సమయం వృథా చేస్తున్నాము. సర్వాంతర్యామిని కానకుండా, బయట ఎక్కడెక్కడో వెదుకుతున్నాం. ప్రాపంచిక వ్యామోహంలో పడి పరమ ప్రభువును విస్మరిస్తున్నాం. ఊటబావిని వాకిట ఉంచుకొని ఎండమావులవెంట పరుగులు పెడుతున్నాం. అందుకే ఎంత వెదికినా దేవుడు లభ్యం కావడంలేదు. పరమ దయామయుడైన అల్లాహ్ అందరికీ మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
మన సంపదలో ఇతరులకూ వాటా...!
పూర్వం ఒక వ్యక్తి ఉండేవాడు. చాలా మంచి మనిషి. అతనికి ఒక పండ్లతోట ఉండేది. అతను తోటలో పనిచేసే కూలీల పట్ల ఎంతో ప్రేమతో, దయతో మసలుకునే వాడు. పేదసాదలకు, బాటసారులకు పండ్లు పంచిపెట్టేవాడు. బీదాబిక్కిని ఆదుకునే వాడు. ఆ వ్యక్తికి ముగ్గురు కొడుకులు. పెద్దవాళ్ళిద్దరూ,‘నాన్నా.. మీరిలా చేతికి దానధర్మాలు చేస్తూ పోతే కొండలు కూడా కరిగిపోతాయి. ఆఖరుకు బిచ్చగాళ్ళమైపోతాం.’ అని నసుగుతూ ఉండేవారు. తండ్రి వారికి నచ్చజెబుతూ, ‘దానధర్మాలవల్ల, పరులకు సహాయం చేయడం వల్ల సంపద వృద్ధి చెందుతుందే తప్ప తరగదు. నిజానికి మన దగ్గర ఉన్నదంతా మనదికాదు. మనం కేవలం దాని పర్యవేక్షకులం, అమానత్తుదారులం మాత్రమే. ఈ సంపదకు అసలు యజమాని కేవలం అల్లాహ్ మాత్రమే. కాబట్టి ఆయన ఆదేశాలు, హితవుల ప్రకారమే మనమీ సంపదను వినియోగించాలి. నా తదనంతరం మీరు కూడా ఇదే విధానాన్ని అవలంబించండి. మీరొకవేళ నామాటల్ని పెడచెవినపెట్టి, మీ ఇష్టానుసారం నడుచుకుంటే అల్లాహ్ ఆగ్రహించే ప్రమాదం ఉంది.’ అంటూ హితోపదేశం చేశాడు. చిన్న కుమారుడు మాత్రం మొదటినుండీ పెద్దవాళ్ళిద్దరి వైఖరిని వ్యతిరేకిస్తూనే ఉన్నాడు. తండ్రి మరణానంతరం కొడుకుల ప్రాధమ్యాలు మారిపొయ్యాయి. పంట సమయంలో కూలీలకు చేదు అనుభవం ఎదురైంది. పేదసాదలెవరినీ చేను దరిదాపులక్కూడా రానివ్వలేదు. ‘ఇప్పుడు మనం ఇలా చేయడం సరైన పధ్ధతి కాదు. నాన్నగారు ఉన్నప్పుడు వీరందరితో ఎలా వ్యవహరించారో మనం కూడా వీళ్ళతో అలాగే వ్యవహరిద్దాం.. అందులోనే మన శ్రేయం ఇమిడి ఉంది.’ అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు చిన్నవాడు. మరునాడు, తోటలోని పంటనంతా తామే కోసి పంచుకోవాలనే ఉద్దేశ్యంతో చిన్నోడికి కూడా చెప్పకుండా తెల్లవారు ఝామున్నే తోటకు వెళ్ళారు. కాని అక్కడి దృశ్యాన్ని చూసి వారు నిర్ఘాంతపోయారు. నిండుపంటతో కళకళలాడుతూ ఉన్న ఆ తోట నామరూపాల్లేకుండా నాశనమైపోయి ఉంది. విషయం తెలుసుకున్న చిన్నవాడు ‘మీలోని స్వార్ధబుధ్ధి, దుర్మార్గపు ఆలోచనల వల్లనే దేవుని ఆగ్రహం విరుచుకుపడింది. ఇప్పటికైనా చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందండి. దైవం ముందు సాగిలపడి క్షమాభిక్ష వేడుకోండి.’అని వ్యాఖ్యానించాడు. అల్లాహ్ మనకు సంపదను, ఒక బాధ్యతగా అప్పగిస్తాడు. దాన్ని మనం ఏవిధంగా వినియోగిస్తామో పరీక్షిస్తాడు. అందుకని,పేదసాదలను, అవసరార్థులను ఆదుకుంటూ దాన్ని సద్వినియోగం చేస్తే ఆయన ఇంకా అనుగ్రహిస్తాడు. లేకపోతే ఏదో ఒకరోజు దాన్ని మననుండి దూరంచేసి కఠినంగా శిక్షిస్తాడు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
సుపరిపాలనకు సిసలైన చిరునామా
నేటికి దాదాపు వేయిన్నర సంవత్సరాలనాడు, ఇస్లామీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో నాల్గవ ఖలీఫాగా హజ్రత్ అలీ(ర)పాలన సాగించారు. హజ్రత్ అలీముర్తుజా(ర)చాలా నిరాడంబర పాలకుడు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన నాయకుడు. ముహమ్మద్ ప్రవక్త(స)వారి శిక్షణ, సహచర్యంలో పెరిగినవారు. అధికారం అంటే, స్వలాభం, స్వప్రయోజనం కోసం కాక, ప్రజల ప్రయోజనం కోసం, వారి సంక్షేమంకోసం వినియోగించే సాధనమని నమ్మిన ప్రజా పాలకుడు. తన పాలనలో ఏ ఒక్కరికి అణువంత అన్యాయం జరిగినా ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవడంతోపాటు, దైవానికీ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని భావించిన ప్రభువు. హజ్రత్ అలీ(ర)ఖలీఫా అయినప్పటికీ, అధికారం చేతిలో ఉన్నప్పటికీ అతి నిరాడంబరమైన జీవితం గడిపారు. అధికారాన్ని బాధ్యతగా భావించి ప్రజాసంక్షేమం కోసం వినియోగించారు. కుటుంబ పోషణ నిమిత్తం వ్యవసాయ పనులు చేసేవారు. ప్రభుత్వ ఖజానా నుండి రూపాయి కూడా తీసుకునేవారు కాదు. ఆయన నిరాడంబరతకు అద్దంపట్టే ఒక సంఘటన చూద్దాం. ఖలీఫా హజ్రత్ అలీ(ర)ఒకసారి రాత్రంతా కష్టపడి కొంతధాన్యం సంపాదించారు. సతీమణి హజ్రత్ ఫాతిమా(ర.అన్హా)వాటిని పిండిపట్టి రొట్టెలు కాల్చి వడ్డించారు. భోజనానికి కూర్చోగానే, ఒక నిరుపేద గుమ్మం ముందుకొచ్చి, ‘అమ్మా.. ఆకలితో ఉన్నాను. కాస్త తినడానికేమైనా పెట్టండమ్మా..’ అని యాచించాడు. వెంటనే హజ్రత్ అలీ దంపతులు తాము తిందామని వడ్డించుకున్న ఆహారాన్ని యాచకునికి దానంచేశారు. తరువాత మిగిలిన పిండిలో మరికొంత కలిపి మళ్ళీ రొట్టెలు తయారుచేశారు. తిందామని కూర్చొనేసరికి ఒక అనాథ వచ్చి యాచించాడు. మళ్ళీ ఆ ఆహారాన్ని అతనికి ఇచ్చివేశారు. మూడవసారి మిగిలిన కాస్తంత పిండితో జావ కాచారు. ఈసారి ఒక ఖైదీ వచ్చి తినడానికి ఏమైనా పెట్టమని అభ్యర్థించాడు. ఈసారి కూడా నోటిదగ్గరి ఆహారాన్ని ఆ నిరుపేద ఖైదీకి దానం చేశారు హజ్రత్ అలీదంపతులు. ఇక తినడానికి ఆఇంట్లో ఏమీమిగల్లేదుపచ్చిమంచినీళ్ళుతప్ప.అందరూఆరోజు మంచినీళ్ళతోనే కడుపు నింపుకొని పస్తులు పడుకున్నారు. ఒకసారి ప్రభుత్వ ధనాగారానికి కొన్ని పండ్లు వచ్చాయి. అందులోంచి ఒక పండును తన కొడుకు చిన్నారి హుసైన్ తీసుకున్నారు. కాని, అవి ప్రభుత్వ ఖజానాకు వచ్చాయి కాబట్టి అది ప్రజలసొమ్ము – అది ఎంత చిన్నదైనా సరే – వాడుకొనే అధికారం పాలకుడికి లేదని చెప్పి, కొడుకు చేతిలోని ఆ పండును ప్రభుత్వ ఖజానాలో వేసి ప్రజలకు పంచిపెట్టారు.ఈవిధంగా హజ్రత్ అలీ(ర)అధికారాన్ని ఒక అమానతుగా బృహత్తరబాధ్యతగా స్వీకరించారు. పాలకుడంటే కేవలం ప్రజాసంక్షేమం కోసం పని చేసే సేవకుడు మాత్రమేనని ఆచరణాత్మకంగా నిరూపించారు. పరిపాలన అంటే ప్రజలకు మాత్రమే కాకుండా, దైవానికి కూడా జవాబుదారీ అని ప్రగాఢంగా విశ్వసించిన ఈ ప్రజాపాలకుడు నాలుగుసంవత్సరాల, ఎనిమిదినెలల, ఇరవైనాలుగురోజులు సువర్ణాక్షరాలతో లిఖించదగిన సుపరిపాలన అందించి, అరవైమూడేళ్ళ వయసులో ఇహలోకం వీడి వెళ్ళిపోయారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ప్రజాధనాన్ని సొంతసొమ్ముగా యధేఛ్ఛగా అనుభవిస్తున్న ఈనాటి మనపాలకులు, నాయకులు ఆ మహనీయుని ఆదర్శాల్లో కనీసం కొన్నింటినైనా ఆచరించగలిగితే నేటి మన రాజకీయ, పాలనా వ్యవస్థ పునీతమైపోతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (నేడు హజ్రత్ అలీ(ర)జయంతి) -
రెండు ముఖాల మనిషి...
చిన్న చిన్న విషయాలకే అబద్ధాలు చెప్పడం, చాడీలు చెప్పడం,నిందలు వేయడం, ఆడినమాట తప్పడం ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాలనుకుంటాం. ‘విషం’ కొద్దిగా అయినా అది తన ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి చెడులను గురించే పవిత్రఖురాన్ ఇలా చెప్పింది. ‘మీరు చాలా చిన్నవిషయమని, మామూలు విషయమని భావించేదే దైవం దృష్టిలో గొప్పవిషయం, చాలాతీవ్రమైన విషయం’.ద్వంద్వ వైఖరి అన్న ఈ దురలవాటు కూడా ఆ కోవకు చెందినదే. చాలామంది దీన్ని చాలా చిన్నవిషయమని భావిస్తూ ఉంటారు. దీనికి దూరంగా ఉండాలని గాని, దీన్నుండి రక్షింపబడాలని గాని ధ్యాసే ఉండదు. కాని ఇది ఎంతటి భయంకరమైన తప్పిదమో, ప్రవక్త ప్రవచనాలను బట్టి మనకు అర్థమవుతోంది. ఇద్దరు వ్యక్తుల మధ్య మనస్పర్థలు తలెత్తినా, లేక ఇరుపక్షాల మధ్య ఏదైనా వైరంగాని, వైరుధ్యం గాని ఏర్పడినా, ఇరుపక్షాలకూ నచ్చజెప్పి పరిస్థితిని చక్కదిద్దడం వారిమధ్య సఖ్యత కుదర్చడం గొప్పసత్కార్యం. కాని కొంతమంది రెండువైపులా వ్యవహారం నడిపిస్తూ ఒకరికి వ్యతిరేకంగా ఒకరి దగ్గర మాట్లాడుతుంటారు. కొంతమందికి ఇది అలవాటు. మరికొంతమంది ఒకరితో కలిసిమెలిసి ఉంటూ, వారితో సత్సంబంధాలు కొనసాగిస్తూ, వారిపరోక్షంలో వారికి వ్యతిరేకంగా చెడు ప్రచారం చేస్తూ ఉంటారు. ఇలాంటి మనిషిని సహజంగా రెండుముఖాల మనిషి అని, ఏ ఎండకాగొడుగు పట్టేరకమని అంటూ ఉంటారు. ఇది చాలా ప్రమాదకరమైన దురలవాటు. అందుకే ముహమ్మద్ ప్రవక్త(స)ఇలాంటి ద్వంద్వవైఖరి మహాపాపమని, ఇలాంటి వైఖరి గలవారు ఘోరమైన నరక శిక్షను చవిచూడవలసి ఉంటుందని హెచ్చరించారు. ‘మీరు ప్రళయదినాన అందరికంటే నీచమైన స్థితిలో ఒక మనిషిని చూస్తారు. అతనుకొంతమంది దగ్గరకు వెళ్ళేటప్పుడు ఒక ముఖంతో, మరికొందరి దగ్గరకు వెళ్ళేటప్పుడు మరొక ముఖంతో వెళ్ళేవాడై ఉంటాడు.’ అంతేకాదు,’ఇహలోకంలో రెండునాలుకలు కలిగి ఉన్న మనిషి నోటిలో ప్రళయ దినాన రెండు అగ్ని నాలుకలు ఉంటాయి.’ మంచి పనులకు, సత్ ప్రవర్తనకు ఏవిధంగా బహుమానం లభిస్తుందో, దైవకారుణ్యం తోడుంటుందో అలాగే దుష్కార్యాలకు, ద్వంద్వవైఖరికి కూడా తగిన ప్రతిఫలం లభిస్తుంది. సత్కర్మలైనా, దుష్కర్మలైనా వాటి వాటి స్థాయీ భేదాన్ని బట్టి శిక్షలు, బహుమానాలు నిర్ణయించబడతాయి. అందుకే రెండు నాలుకలు కల ద్వంద్వస్వభావికి ప్రళయ దినాన అతడి నోట్లో రెండు అగ్ని నాలుకలు ఉండే శిక్ష నిర్ణయించబడింది. దైవం అందరినీ ఇలాంటి దుష్టవైఖరినుండి, దురలవాట్లనుండి సురక్షితంగా ఉంచాలని కోరుకుందాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
మనకు లేకున్నా ఇతరులకు పెట్టడమే త్యాగం
ఒకసారి ముహమ్మద్ ప్రవక్త మహనీయులు సహచరులతో కలసి కూర్చుని ఉన్నారు. అంతలో ఒక వ్యక్తి అక్కడికొచ్చాడు. ‘‘అయ్యా.. నేను చాలా బాధల్లో ఉన్నాను. ఆకలి దహించి వేస్తోంది. తినడానికి ఏమైనా పెట్టం ’’ అని అభ్యర్థించాడు. ప్రవక్తవారి ఇంట ఆ సమయాన ఏమీ లేకపోవడంవల్ల, సహచరుల్ని సంప్రదించారు. అప్పుడు వారిలో అబూతల్ హా అనే ఒక సహచరుడు అతన్ని వెంటబెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళాడు. ‘‘ఈరోజు మనం ఒక మనిషికి ఆతిథ్యం ఇవ్వాలి. తినడానికి ఏమైనా ఉందా?’’ అని భార్యను అడిగారు. ‘‘అయ్యో... పిల్లల కోసమని ఉంచిన కాస్తంత అన్నం తప్ప మరేమీ లేదు కదండీ’’ అని దిగులుగా చెప్పింది శ్రీమతి. ‘‘అయితే ఒకపని చేయి. పిల్లకు ఏదో ఒక వంక చెప్పి భోజనం పెట్టకుండా నిద్రపుచ్చు. పిల్లలు పడుకోగానే భోజనం వడ్డించు. ఆకలితో ఉన్న అతిథితో పాటు నేను కూడా భోజనానికి కూర్చుంటాను. తరువాత నువ్వు దీపం సరి చేస్తున్నట్లు చేసి దాన్ని ఆర్పేసెయ్. కాసేపటి దాకా నువ్వు ‘అయ్యయ్యో.. దీనికేమయిందీ..’ అనుకుంటూ దాన్ని సరి చేస్తునే ఉండు. ఆ సమయంలో నేను అతిథికి వడ్డిస్తూ, నేను కూడా తింటున్నట్లుగా నటిస్తాను. చీకట్లో మనం తిన్నదీ లేనిదీ అతనికి తెలియకుండా ఉంటుంది’’అన్నారు. శ్రీమతి అలాగే చేసింది. ఈ విధంగా భోజనానికి అందరూ కూర్చున్నారు. కాని అతిథి మాత్రమే భోంచేశాడు. పిల్లలతో సహా భార్యాభర్తలిద్దరూ ఆ రాత్రి పస్తులే ఉన్నారు. తెల్లవారి ఉదయం యధాప్రకారం అబూతల్ హా (ర)ముహమ్మద్ ప్రవక్త(స)వద్దకు వెళ్ళారు. అప్పుడు ప్రవక్త మహనీయులు ఆయన్ను అభినందిస్తూ ‘అల్లాహ్ కు తన భక్తుడు అబూతల్ హా అన్సారీ, ఆయన శ్రీమతి ప్రవర్తన ఎంతగానో నచ్చింది. అల్లాహ్ అమితంగా సంతోషించాడు’ అని శుభవార్త వినిపించారు. ముహమ్మద్ ప్రవక్తవారి బోధనలు, శిక్షణ, సహచర్యం ఆయనగారి అనుచరుల్లో ఎంతటి దయాగుణాన్ని, త్యాగనిరతిని జనింపజేశాయో ఈ సంఘటన ఒక సజీవసాక్ష్యంగా మనకు కనిపిస్తోంది. మనం, మన అవసరాలకంటే పరుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. దాన్ని మాత్రమే త్యాగం అనవచ్చు. మనకు పనికి రానిది, మిగిలిపోయింది, సద్దిలాంటివి ముష్టిగా పడేసి ఏదో చేసేశాం అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరేమీ ఉండదు. పేదసాదలను కసురుకోకూడదు. చులకనగా చూడకూడదు. చేతనైతే ఉన్నంతలోనే ఎంతో కొంత సాయం చేయాలి. లేదంటే మౌనంగా ఉండాలి.ౖ దెవాన్నిప్రార్థించాలి. యాచించే స్థితినుండి రక్షించి, అందరికీ మంచి స్థితిని ప్రసాదించమని దైవాన్ని వేడుకుంటూ ఉండాలి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఏమిటి నా తప్పు..??
సుమారు వేయిన్నర సంవత్సరాల క్రితం.. ముహమ్మద్ ప్రవక్త(స)ప్రభవనకు పూర్వం.. ఆనాటి సమాజం ఎంతో ఆటవికంగా ఉండేది. అనేక మూఢనమ్మకాలు, అమానుషాలు రాజ్యమేలుతుండేవి. ఆ ఆటవిక దురాచారాల్లో ఆడపిల్లల్ని నిర్దాక్షిణ్యంగా చంపివేయడం లేదా ముక్కుపచ్చలారని ఆడశిశువును సజీవంగా సమాధి చేయడం వంటివి కూడా ఉండేవి. ఆడపిల్లల పట్ల నాటి ప్రజలు దుర్మార్గమైన, క్రూరమైన, పాశవికమైన, ఆటవికమైన, అమానవీయమైన దుస్సంప్రదాయాన్ని అవలంబించేవారు. ముహమ్మద్ ప్రవక్త(స)ఈ అమానవీయ, అమానుష దుర్మార్గాన్ని శాశ్వతంగా నిర్మూలించారు. స్త్రీ జాతికి జరుగుతున్న అన్యాయాన్ని సమూలంగా తుడిచిపెట్టారు. సీ ్త్రకూడా పురుషుని లాగానే దేవుని సృష్టి అని, తనకూ సమస్త హక్కులున్నాయని ఎలుగెత్తి చాటారు. స్త్రీజాతిని గౌరవించని సమాజం అధోగతి పాలవుతుందని హెచ్చరించారు. తల్లి పాదాల చెంత స్వర్గముందన్నారు. చెల్లెళ్ళను సాకిన అన్నదమ్ములకు స్వర్గ శుభవార్త వినిపించారు. ఆడపిల్లలను పోషించి పెద్దచేసిన తండ్రికి నరక జ్వాలలనుండి విముక్తి అని చాటారు. ఒక వ్యక్తికి ఒక కుమార్తె ఉండి, అతనామెకు ఎలాంటి లోటు రానివ్వకుండా, చూస్తే, అలాంటి వారు స్వర్గంలో తనతో కలిసి ఉంటారని చెప్పారు. ఎంతో అభివృద్ధిని సాధించామని, శాస్త్రసాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న నేటి సమాజంలో మహిళల విషయంలో ప్రవక్త ప్రభవనకు ముందున్నపరిస్థితులే నేటికీ రాజ్యమేలుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఆనాడు మాతృగర్భంలో ఉన్నది ఆడ, మగ అని తెలుసుకునే తెలివితేటలు, విజ్ఞానం లేక ప్రసవం తరువాత చంపేసేవారు. ఈనాడు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో లింగనిర్ధారణ పరీక్షలు చేసి ఆడపిల్ల అని తేలగానే మాతృగర్భంలోనే చిదిమేస్తు న్నారంటే మన పయనం పురోగమనం వైపా.. తిరోగమనంవైపా..! ఈనాటికీ ఆడవాళ్ళంటే చులకనభావం ఉంది. ఆడ– మగ అసమానతలున్నాయి. మహిళను మనిషిగా కూడా చూడని కుసంస్కారం ఉంది. వారి హక్కుల నిరాకరణ ఉంది. లైంగిక వేధింపులున్నాయి. గృహ హింస ఉంది. అత్తింటి వేధింపులున్నాయి, వరకట్న హత్యలున్నాయి. అదీ ఇదీ అని లేకుండా అన్ని రంగాల్లో మహిళలకు రక్షణ లేని పరిస్థితి సర్వత్రా నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో, మహిళా సాధికారత అని గొంతుచించుకుంటున్న మనం, వేయిన్నర సంవత్సరాల క్రితమే మహిళలకు అన్నిరకాల హక్కులు ప్రసాదించిన ముహమ్మద్ ప్రవక్త బోధనల పట్ల దృష్టి సారించాల్సిన అవసరం లేదంటారా..? – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
బంధం అనుబంధం
సమాజం ఇంతగా అభివృద్ధి చెందినా ఈనాటికీ చాలామంది భార్య అంటే అన్నీ భరిస్తూ, సహిస్తూ పడి ఉండే ఒక వస్తువుగానే పరిగణిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. నిజానికి సమాజంలో భార్యాభర్తల బంధం అత్యంత పవిత్రమైనది. అసలు ఇదే సృష్టికి మూలం. ఈ బంధం ద్వారానే దైవం మానవజాతిని ఉనికిలోకి తీసుకువచ్చాడు. అందుకే దీనికి ఇంతటి పవిత్రత, ప్రత్యేకత. ఈ బంధం పటిష్టంగా, గౌరవప్రదంగా ఉంటేనే మానవజాతి విజయపథంలో సాగుతుంది.సమాజ నిర్మాణంలో భార్యాభర్తలిద్దరి పాత్రా కీలకమైనదే. భార్యాభర్తల మధ్య అవగాహన, ప్రేమానుబంధాల ద్వారానే మంచి కుటుంబాలు ఉనికిలోకి వస్తాయి. వారిద్దరి సాంసారిక జీవితం, దాని నియమాలు, బాధ్యతలు సరిగా అవగాహన చేసుకుంటేనే ఉత్తమఫలితాల్ని సాధించడానికి వీలవుతుంది. ఆలుమగల మధ్య అవగాహన, పరస్పర ప్రేమానురాగాలు లోపించడం వల్లనే ఈనాడు కుటుంబాల్లో శాంతి కరువైపోతోంది. కుటుంబ జీవితంలో శాంతి కొరవడితే, అది సత్సమాజ నిర్మాణానికి అవరోధంగా పరిణమిస్తుంది. అందుకని భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఎవరి పరిధుల్లో వారు తమతమ బాధ్యతల్ని నెరవేర్చాలి. స్వేచ్ఛ పేరుతో స్త్రీలు తమ పరిధుల్ని అతిక్రమించకూడదు. అలాగే పురుషులు భార్యలపై పెత్తనం చలాయించకూడదు. సహధర్మచారిణితో సత్ప్రవర్తనతో కూడిన జీవితం గడపాలి. ఆమె హక్కులను విశాల హృదయంతో గౌరవించాలి. ఎందుకంటే, ‘వారితో సత్ప్రవర్తనతో సంసారం చేయండి’ (నిసా) అని దైవం ప్రబోధించాడు. భార్య పట్ల సౌమనస్యంతో, ప్రేమాభిమానాలతో ప్రవర్తించాలి. ముహమ్మద్ ప్రవక్త ఇలా ప్రవచించారు: ‘తమ నడవడికలో అందరికంటే ఉత్తములైనవారే విశ్వాసంలో పరిపూర్ణులు. తమ భార్యల పట్ల అత్యంత మంచిగా మెలిగేవారే అందరిలో మంచి నడవడిక కలవారు’ (తిర్మిజీ). ఒక మనిషి నైతిక ప్రవర్తనను, అతని మంచితనాన్ని గ్రహించడానికి అసలైన గీటురాయి అతడి గృహస్థ జీవితమే. భార్యలో ఏదైనా చిన్నాచితకా లోపం, బలహీనత కానవస్తే – ఓర్పు వహించాలి. ఆమెలోని మరో మంచి గుణాన్ని గుర్తించి ఔదార్యం ప్రదర్శించాలి. చిన్నచిన్న విషయాలకే మనసు పాడుచేసుకుంటే కుటుంబాల్లో దాంపత్య సుఖసంతోషాలు కనుమరుగైపోతాయి. అందుకని ముఖ్యంగా స్త్రీల వ్యక్తిత్వాన్ని గుర్తించాలి. వారి అభిప్రాయాలను గౌరవించాలి. అన్ని విషయాల్లోనూ పరస్పర అవగాహన అత్యంత అవసరం. ఈ విధంగా భార్యాభర్తలు ఒకరి హక్కుల్ని ఒకరు గుర్తించి, గౌరవించుకుంటే ప్రాపంచిక జీవితం ఆనందమయ మయమవుతుంది. పరలోక జీవితమూ సాఫల్యమవుతుంది. ఏమంటారు? – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
అదే స్థితప్రజ్ఞత
జీవితం విభిన్న స్థితుల సంగమం. ఇక్కడ సుఖమూ ఉంది, దుఃఖమూ ఉంది. సంతోషమూ ఉంది, బాధా ఉంది. ఆనందమూ ఉంది, విచారమూ ఉంది. తీపీ ఉంది, చేదూ ఉంది. శీతలమూ ఉంది, ఉష్ణమూ ఉంది. సంతృప్తీ అసంతృప్తీ రెండూ ఉన్నాయి. శాంతి, అశాంతీ కూడా ఉన్నాయి. ఇదంతా దైవాభీష్టం, దేవుని ఆదేశానుసారం, ఆయన నిర్ణయం మేరకే. అందుకని కష్టాలొచ్చినప్పుడు కుంగిపోకూడదు, నిరాశా నిస్పృహలకు లోను కాకూడదు. ఇవన్నీ దేవుని తరఫునే అని భావిస్తూ, ఆ కరుణామయుడే వీటినుండి విముక్తి కలిగిస్తాడని నమ్మాలి. ఇదేవిధంగా కష్టాలు దూరమై, పరిస్థితులు మెరుగు పడి, అంతా సజావుగా జరిగిపోతూ, సుఖసంతోషాలు ప్రాప్తమైతే తమ గొప్పదనమేనని, తమ రెక్కల కష్టార్జిత ఫలితమేనని భావించి విర్రవీగకూడదు.ఇదంతా అల్లాహ్ అనుగ్రహమని, ఆ కరుణామయుని ప్రసాదితమన్న విశ్వాసం హృదయంలో జనించాలి. ఆయన ఎప్పుడు కోరితే అప్పుడు తాను ప్రసాదించిన అనుగ్రహాలను తిరిగి లాక్కోగలడు. కాబట్టి ప్రతి అనుగ్రహానికీ ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి. ముహమ్మద్ ప్రవక్త(స)ప్రవచనం ఇలా ఉంది: ‘ఎవరైతే ధన, ప్రాణ నష్టాల్లో కూరుకుపోయి, ఆ విషయం ఎవరి ముందూ బహిర్గతం చేయకుండా, ప్రజలతో ఫిర్యాదు చేయకుండా ఉంటాడో అతణ్ణి క్షమించడం అల్లాహ్ బాధ్యత.’ విశ్వాసుల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటుంది. ప్రతి వ్యవహారంలో, ప్రతిస్థితిలోనూ వారికి శుభాలే శుభాలు. వారికి శాంతి, సుఖ సంతోషాలు ప్రాప్తమైతే దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఇది వారి పాలిట శుభాలపంట. ఒకవేళ వారికి దుఖ విచారాలు కలిగితే, ఇదీదైవ నిర్ణయమేనని భావిస్తూ సహనం వహిస్తారు. ఈ సహనం వహించడం కూడా వారిపాలిట శుభాల పంటే అవుతుంది. ప్రాపంచిక జీవితంలో కష్టనష్టాలు, సుఖ సంతోషాలు చాలా సహజ విషయాలు. వీటిద్వారా దైవప్రసన్నత, ఆయన సామీప్యం పొందడానికి శక్తివంచనలేని ప్రయత్నం చేయాలి. సుఖ సంతోషాలు, శాంతి సంతృప్తులు ప్రాప్తమైనప్పుడు అల్లాహ్ కు కృతజ్ఞతలు సమర్పించుకోవాలి. కష్టాలు, కడగండ్లు ఎదురైతే, జరగరాని సంఘటనలు ఏమైనా జరిగి కష్టనష్టాలు, బాధలు సంభవిస్తే దాస్య ఔన్నత్యానికి ప్రతిరూపంగా అనన్యసామాన్యమైన సహనం వహించాలి. హృదయం కృతజ్ఞతతో నిండి ఉండాలి. అంటే, అన్ని స్థితులనూ సమానంగా ఆస్వాదించగలగాలి. దీన్నే ‘స్థితప్రజ్ఞత’ అంటారు. ఇలాంటి వారిని అల్లాహ్ ప్రేమిస్తాడు. తన కారుణ్య ఛాయలో చోటు కల్పిస్తాడు. స్వర్గసీమను అనుగ్రహిస్తాడు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఈ కష్టాలకు పరిష్కారం?
మానవ పుట్టుక ప్రారంభమైన నాటినుండి నేటివరకు ఎంతోమంది దైవప్రవక్తలు, రుషులు మానవ సమాజాన్ని ఉధ్ధరించడానికి వచ్చారు. మంచీ చెడుల విచక్షణా జ్ఞానాన్ని, దైవమార్గాన్ని మానవాళికి విడమరచి చెప్పారు. చెడులు చేస్తే, పాపపు పనులకు ఒడిగడితే దైవం వివిధ రూపాల్లో శిక్షను అవతరింపజేస్తాడని హెచ్చరించారు. అయినా ప్రజలు మంచి చెప్పినవారి మాటల్ని పట్టించుకోలేదు. దైవం వారిపై శిక్షను అవతరింజేశాడు. ఒకసారి మదీనాలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. భయంకరమైన కరువు వచ్చిపడింది. అప్పుడు, అప్పటి ఖలీఫా హజ్రత్ ఉమర్ (ర) వర్షం కోసం దైవాన్ని ప్రార్ధించే బదులు, పాప క్షమాపణకైదైవాన్ని వేడుకున్నారు. దీంతో ప్రజలు, ‘మీరసలు వర్షం కోసం దుఆ చేయనేలేదు’. అని నిందించారు, దానికాయన ‘నేను ఆకాశం నుండి వర్షం కురిసే తలుపులు తట్టాను. ఇంతకన్నా ఇంకేం కావాలి?’ అని సమాధానం చెప్పారు. ప్రఖ్యాత దైవ భక్తుడు హజ్రత్ హసన్ బస్రీ(రహ్మ) దగ్గరికి ఒకతను వచ్చి, తమప్రాంతంలో కరువొచ్చిందని చెప్పాడు. దానికాయన, పాప మన్నింపుకైదైవాన్ని వేడుకోండి. అని చెప్పారు. కాసేపటికి మరొకతను వచ్చి తమ ప్రాంతంలో దారిద్య్రం తాండవిస్తోందని చెప్పాడు. ఇలా మరి కొం దరు వచ్చి తలా ఒక సమస్య చెప్పుకున్నారు. హ.హసన్ బస్రీ (ర) అందరికీ ఒకటే పరిష్కారం చెబుతూ, ‘పాపాల మన్నింపుకైదైవాన్ని వేడుకోండి’ అని సలహా ఇచ్చారు. అంటే, మానవ జీవితంలో ఒడిదుడుకులు సహజం. కాని కొన్ని స్వయానా మనం కొని తెచ్చుకునేవీ ఉంటాయి. దైవం మానవుణ్ని సృష్టించి, ఈ పృష్టిలో మరే జీవరాసికీ లేనంత బుధ్ధిబలాన్ని, మంచీచెడుల విచక్షణా జ్ఞానాన్నీ, అపారమైన మేధో సంపత్తినీ ప్రసాదించాడు. మానవుడు దాన్ని దుర్వినియోగం చేస్తూ, దైవాదేశాలకు విరుధ్ధంగా మనోవాంఛా లోలుడై జీవనం సాగిస్తున్నాడు. ప్రకృతిని ఇష్టమొచ్చినట్లు వినాశనానికి గురిచేస్తున్నాడు. అందుకే ఈ ఆపదలూ, కష్టాలూ, ప్రకృతి వైపరీత్యాలు. అతివృష్టీ, అనావృష్టి పరిస్థితులు. ఇది దైవం మానవులకు చేసే ఒకహెచ్చరిక. మానవులకు నష్టం చేయాలన్నది దేవుని తలంపుకాదు. కానీ ఇదొక హెచ్చరిక..జాగ్రత్త.. మేలుకోండి. లేకపోతే అంతకంత అనుభవిస్తారు.. అన్న హెచ్చరిక. మానవుడు విషయాన్ని అర్థం చేసుకొని నడవడికను సరిదిద్దుకుంటే, దైవాదేశాల ప్రకారం నడుచుకుంటూ సమస్త సృష్టినీ ప్రేమించ గలిగితే దైవం వారితప్పుల్ని మన్నించి మంచి పరిస్థితుల్ని కల్పిస్తాడు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
నిజాయితీ విలువ
పూర్వం జీలాన్ అనే దేశంలో అబూసాలెహ్ జంగీదోస్త్ అనే యువ వ్యాపారి ఉండేవాడు. అతను ఎంతో నిజాయితీ పరుడు. దైవభక్తి గలవాడు. ఒకసారి అతను పనిమీద వేరే ఊరుకు వెళుతుండగా ఆకలి దప్పులతో బాధపడుతూ మార్గమధ్యంలో ఒకవాగు ప్రవహిస్తుంటే, అందులో నీళ్ళు తాగాడు. వాగులో ఒక యాపిల్ పండు కొట్టుకొని వస్తోంటే, దాన్ని ఒడిసిపట్టుకొని వెనకా ముందూ ఆలోచించకుండా తినేశాడు. ఆకలి చల్లారిన తరువాత అతనికో ఆలోచన వచ్చింది. ఎవరిదో పండుజారి వాగులో పడి ఉంటుంది. వాళ్ళ అనుమతి లేకుండా తినేశా గదా..! అన్న అపరాధ భావం ఏర్పడింది. ఇప్పుడేం చేయాలీ..? అని ఆలోచిస్తూ, వాగు వెంట నడవ సాగాడు. కొద్ది దూరం వెళ్ళిన తరువాత వాగొడ్డునే ఒక యాపిల్ తోట కనిపించింది. అందులో ఒక చెట్టు శాఖలు వాగువైపు విస్తరించి ఉన్నాయి. తాను తిన్న యాపిల్ పండు ఈ తోటదే అని నిర్ధారణకు వచ్చి, వెళ్ళి తోట యజమానిని కలిశాడు. ఆయనపేరు అబ్దుల్లాహ్ సౌమీ. అతనికి విషయం వివరించి, తనను క్షమించమని విన్నవించుకున్నాడు. తోట యజమానికి పండురాలిన సంగతి కానీ, దాన్ని అతడు తిన్న సంగతి కానీ తెలియనే తెలియదు. పైగా ఎందుకు తిన్నావని అడగనే లేదు. ఆ యువకుడి నిజాయితీకి ఎంతో ముచ్చట పడ్డాడు. సంతోషాన్ని బయటికి కనబడనీయకుండా, ‘నిన్ను క్షమించాను కాని ఒక షరతు’ అన్నాడు. యువకుడు భయపడిపోతూ, ‘అయ్యా !సెలవీయండి’. అన్నాడు. ‘నాకో కూతురుంది. ఆమె మూగది, కుంటిది, గుడ్డిది, చెవిటిది. నువ్వామెను పెళ్ళి చేసుకోవాలి.’ అన్నాడు సౌమీ. తాను నిరపరాధిగా బయట పడాలంటే ఒప్పుకోక తప్పదు కాబట్టి, ‘సరేనండీ’ అన్నాడు. వెంటనే పెళ్ళి ఏర్పాట్లు జరిగి పొయ్యాయి. పెళ్ళీ అయిపోయింది. మొదటి రాత్రి తన గదిలోకి వెళ్ళిన యువకుడు బంగారు బొమ్మలా ఉన్న అమ్మాయిని చూసి అదిరిపోయాడు.పరుగున మామ దగ్గరకు వెళ్ళాడు. తాను పొరపాటున వేరే గదికి వెళ్ళానని, అక్కడ ఎవరో అందమైన అమ్మాయి ఉందనీ చెప్పాడు. ఆయన నవ్వుతూ, ‘‘నువ్వేమీ పొరబడలేదు. మా అమ్మాయి మూగది, గుడ్డిది, కుంటిది, చెవిటిది అని ఎందుకన్నానంటే, ఆమె నోట ఎప్పుడూ అసత్యం కానీ, పరుష పదజాలం గానీ వెలువడలేదు. అందుకే మూగది అన్నాను. చెడు దృశ్యాలు చూసి ఎరుగదు. అందుకని గుడ్డిది అన్నాను. చెడుమాటలు వినలేదు కాబట్టి చెవిటిది అన్నాను. అనవసరంగా గడప దాటి ఎరుగదు. అందుకే కుంటిది అన్నాను. అంతే తప్ప అమ్మాయిలో ఎలాంటి దోషమూ, లోపమూ లేదు. కేవలం నిన్ను పరీక్షించడానికే ఇలా చేశాను.’’ అన్నారు. ఎలాంటి స్థితిలోనూ ఇతరుల సొమ్మును ముట్టకూడదన్న సందేశాన్ని విలువలతో, నిజాయితీతో ఆచరించి ప్రపంచానికి చాటిచెప్పిన ఆ మహనీయుడు అబూసాలెహ్ జంగీదోస్త్. ఆ దంపతులకు జన్మించిన మహాపురుషుడే షేఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహ్మతుల్లాహ్ అలైహ్. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
గుండెల నిండా ప్రేమను నింపుకోవాలి
మనం మన తల్లిదండ్రుల్ని, పెద్దల్ని, గురువుల్ని ప్రేమిస్తాం, గౌరవిస్తాం. ఎందుకూ? వారు మన మేలుకోరేవారు. బాగు కోరేవారు. మన ఉన్నతిని కాంక్షించేవారు. మన శ్రేయోభిలాషులు. వారి ప్రేమాభిమానాలు, కారుణ్య వాత్సల్యాలు అనునిత్యం మనపై ప్రసరిస్తున్నాయి. చేసిన మేలును గుర్తించడం, చే సిన వారిపట్ల కృతజ్ఞత చూపడం మానవ నైజంలో ఉండే సహజ గుణం. ఉపకారి ముందు వినయ వినమ్రతలు కలిగి ఉండడం, అతని అభీష్టానికి అనుగుణంగా నడుచుకోవడం, వారు చెప్పింది చేయడం, వారి ఇష్టానికి వ్యతిరేకంగా నోరు మెదపకపోవడం వారిపట్ల విధేయతకు, అంకితభావానికి నిదర్శనం. కాని ఇంతకన్నా ఎక్కువ, లెక్కకు మిక్కిలి మేళ్ళు, ఉపకారాలు,అనుగ్రహాలు, వరాలు దైవం మనపై కురిపించాడు. మనపైనే కాదు, అందరిపై కురిపించాడు. ధనిక, పేద అనే భేదం లేకుండా, పాలకుడు సేవకుడు అన్న తేడాలేకుండా, పల్లె పట్నం అన్న వ్యత్యాసం లేకుండా, ఆడా మగా అన్న తారతమ్యం లేకుండా, వృద్ధులు– పిల్లలన్న విభజన లేకుండా ఆ కరుణామయుని అనుగ్రహాలు, ఆ దయామయుని కారుణ్య ఛాయ సమస్తాన్నీ పరివేష్టించి ఉంది. గుడిసెవాసులపై అయినా, భవనవాసులపై అయినా, అడవుల్లో అయినా, మైదానాల్లో అయినా, ఎటుచూసినా, ఎక్కడ చూసినా రేయింబవళ్ళు, ప్రతినిత్యం, అనుక్షణం ఆయన కారుణ్యానుగ్రహాలు వర్షిస్తూనే ఉన్నాయి. ఆయన దాహార్తులకు దాహాన్ని, అన్నార్తుల క్షుద్బాధను తీరుస్తున్నాడు. వస్త్రవిహీనులకు ఆచ్ఛాదన ప్రసాదిస్తున్నాడు. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యాన్నిస్తున్నాడు. ప్రజల ఆందోళన దూరం చేస్తున్నాడు. కష్టాలు బాధల నుండి రక్షిస్తున్నాడు. నిస్సహాయులకు అండగా నిలుస్తున్నాడు. నీడ లేని వారికి గూడు కల్పిస్తున్నాడు. నిరాశ్రయులకు ఆశ్రయమిస్తున్నాడు. సమస్త ప్రాణుల సుఖమయ జీవనానికి సమతుల ప్రకృతిని సిద్ధంచేసి పెట్టాడు. ఏ వ్యక్తి, ఏ సమూహం, ఏ ప్రాణి కూడా ఏ ఒక్క క్షణమూ ఆయన అనుగ్రహానికి దూరంగా లేదు. అనుగ్రహం లేకుండా లేదు, మనజాలదు. మరి అలాంటి దయాసముద్రుని పట్ల, కరుణామయుని పట్ల మనకెలాంటి ప్రేమ ఉండాలి? ఆయనతో మనకెలాంటి అనుబంధం ఉండాలి? ఎవరైనా చెప్పగలరా.. అంచనా వేయగలరా..? లెక్కలు కట్టగలరా? ఆయన సకల లోకాలకు ప్రభువు. రాజాధిరాజు. ప్రభువులకు ప్రభువు. దయాళువు, కారుణ్య సముద్రుడు. క్షమానిధి. అన్నీ చూసేవాడు, అన్నీ వినేవాడు. నిదుర పోనివాడు. కునుకు రానివాడు. అలసిపోనివాడు. అలుపులేనివాడు. అన్నిటిపై అధికారం కలిగిన వాడు. పాలించేవాడు, పోషించేవాడు. అధికుడు, ఆధిక్యుడు. సర్వవ్యాపి. సర్వాంతర్యామి. జీవన్మరణాల విధాత. అలాంటి పరమ ప్రభువుపట్ల గుండెలనిండా ప్రేమ నింపుకోవాలి. – ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ -
ప్రేమకు గీటురాయి
దైవం పట్ల ప్రేమను వెల్లడి చేయడం కోసం మానవుడు అనేక మార్గాలను సృష్టించుకున్నాడు. తనకు తోచినరీతిలో, తనకు నచ్చిన రీతిలో దైవం పట్ల ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. అయితే, తనను ప్రేమిస్తున్నామని చెప్పుకునేవారికి దైవం ఒక స్పష్టమైన విధానాన్ని సూచిస్తున్నాడు చూడండి.‘ప్రవక్తా.. మీరు వారికి చెప్పండి. మీరు దైవాన్ని ప్రేమిస్తున్నట్లయితే నన్ను అనుసరించండి. దైవం మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ పాపాలను మన్నిస్తాడు. అల్లాహ్ అమితంగా క్షమించేవాడు, అనంతంగా కరుణించేవాడు.’ (ఆలి ఇమ్రాన్ 31) కాబట్టి మన విధానాలను, మన పద్ధతులను వదిలేసి, దైవప్రవక్తవారి విధానాన్ని స్వీకరించాలి. మన ఆలోచననలను త్యజించి ప్రవక్తవారి ఆలోచనా విధానాన్ని అనుసరించాలి. ప్రవక్తను అనుసరించడం, విధేయించడం అంటే అర్థం ఇదే. ప్రవక్తను అనుసరించినప్పుడే, ఆయన హితవులను విధేయించినప్పుడే దైవం పట్ల ప్రేమ హక్కు నెరవేరుతంది. ప్రపంచంలో ఉన్న యావన్మంది ప్రజలు ప్రవక్తను విధేయించవలసిందే. ఒక్కరైనా, సమూహమైనా, నాయకులైనా, సేవకులైనా, సైనికులైనా, సైన్యాధిపతులైనా, డాక్టర్లయినా, లాయర్లయినా, ఖాజీలైనా, జడ్జీలైనా, భక్తులైనా, యోధులైనా, తండ్రులైనా, తాతలైనా, భర్తలైనా, సోదరులైనా, కుటుంబంలో కాని, బయటకాని ఎటువంటి బంధుత్వాలున్నా, సంబంధాలున్నా ప్రవక్తను ఆదర్శంగా తీసుకోవాలి. యుద్ధమైనా, సంధి అయినా, విజేతలైనా, పరాజితులైనా ఆయన విధానాన్నే అవలంబించాలి. ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా ఆయన్నే అనుకరించాలి. అనుక్షణం, అనునిత్యం, బాధలైనా, కష్టాలైనా, సంబరమైనా, సంతోషమైనా మన రేయింబవళ్ళు ప్రవక్త ఆచరణకు ప్రతిరూపం కావాలి. జీవితంలోని అన్నిదశల్లో, అన్నిరంగాల్లో ప్రవక్త జీవన విధానమే అందరికీ ఆదర్శం. ఖురాన్ గ్రంథంలో ఈ విషయం స్పష్టంగా ఉంది: ‘దైవానికి, అంతిమ దినానికి భయపడే వారికి, దైవ నామస్మరణ చేసేవారికి ప్రవక్త జీవితంలో చక్కని ఆదర్శం ఉంది.’ (అహ్ జాబ్ 21) ఎందుకంటే, ఆయన జాతిమొత్తానికీ తండ్రిలాంటివారు. ‘సంతానానికి తమ తండ్రి ఎంతో, మీకు నేను కూడా అంతే’. అన్నారాయన. ఒక తండ్రి తన సంతానాన్ని ఎంతగానో ప్రేమిస్తాడు. వారి పట్ల అత్యంత దయార్ద్ర హృదయుడై ఉంటాడు. చిన్న చిన్న విషయాలు దగ్గరుండి జాగ్రత్తగా నేర్పిస్తాడు. తన సంతానం మంచి నడవడిక కలవారిగా, సుగుణాల రాసిగా వర్థిల్లాలని, జీవన సమరంలో సాఫల్య శిఖరాలు అందుకోవాలని కోరుకుంటాడు. ప్రవక్త ప్రేమ తండ్రి ప్రేమకు మించి ఉంటుంది. ప్రవక్త మానవ జాతి యావత్తూ ఇహ పరలోకాల్లో సాఫల్య శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటాడు. ఆయన్ను ప్రేమించడమంటే దైవాన్ని ప్రేమించడం, ఆయన్ని విధేయించడమంటే, దైవాన్ని విధేయించడం. కనుక అల్లాహ్ పట్ల మనకు నిజమైన ప్రేమ ఉంటే, ప్రవక్త మహనీయులని అనుసరించాలి, అనుకరించాలి. ప్రవక్తను విధేయించడమే అల్లాహ్ పట్ల మన ప్రేమకు గీటురాయి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
మహా వ్యక్తిత్వం
చెడుకు చెడు సమాధానం కాదు, కాకూడదు. మీరు చెడును మంచి ద్వారా నిర్మూలించండి. అన్న పవిత్ర ఖురాన్ బోధనకు దైవప్రవక్త ముహమ్మద్ ప్రవక్త(స)వారి జీవన విధానం అద్దం పట్టేది. ఒకసారి ముహమ్మద్ (స)ఇంటినుండి బయలుదేరి ఎటో వెళుతున్నారు. కొద్దిదూరం వెళ్ళిన తరువాత ఒక ఇంటిదగ్గర గోడపైనుండి ఊడ్చిన చెత్తాచెదారం పైన పడింది. ప్రవక్త మహనీయులు తల, వస్త్రాలు శుభ్రంగా దులుపుకొని తన దారిన తను వెళ్ళిపోయారు. రెండవరోజు కూడా అదేవిధంగా ఊడ్చిన చెత్తపైన బడింది. ప్రవక్త ఆ మలినమంతా మళ్ళీ శుభ్రం చేసుకొని ముందుకు సాగిపోయారు. ప్రతిరోజూ ఇలానే జరిగేది. ఎవరో కావాలనే ప్రతిరోజూ పైన చెత్తాచెదారం వేయడం, ప్రవక్త వారిని ఏమీ అనకుండానే ఓ చిరునవ్వు నవ్వి దులుపుకుని వెళ్ళిపోవడం. ప్రతిరోజూ ఇదేతంతు. ఏం జరిగిందో ఏమో గాని ఒకరోజు ప్రవక్త మహనీయులు యధాప్రకారం అదే దారిన వెళ్ళారు. కాని ఆరోజు కసువు పడలేదు. ఆ రోజే కాదు, తరువాత రెండురోజులు కూడా ఎలాంటి చెత్తాచెదారం పడక పోయేసరికి చుట్టుపక్కల వారిని ఆరా తీశారు. ఫలానా ఇంట్లో ఎవరూలేరా? ఏదైనా ఊరెళ్ళారా? అని. ఆ ఇంట్లో ఒక ముసలమ్మ మాత్రమే ఉంటుందని, కొన్నిరోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతోందని వారుచెప్పారు. వెంటనే ప్రవక్త తను వెళుతున్న పని వాయిదా వేసుకొని, ఆ ఇంటికి వెళ్ళారు. అక్కడ ఒక వృద్ధురాలు తీవ్రజ్వరంతో బాధపడుతూ కుక్కిమంచంలో మూలుగుతోంది. వైద్యం, తిండి తిప్పలు లేని కారణంగా ఆమె బాగా నీరసించి పోయింది. ‘‘అమ్మా! ఎలా ఉన్నారు?’’ అని ఆప్యాయంగా పరామర్శించారు. మంచినీళ్ళు తాగించారు. అత్యవసర సేవలు అందించి సపర్యలు చేశారు. ప్రతిరోజూ వచ్చి అవసరమైన ఏర్పాట్లుచేస్తూ, కోలుకునే వరకూ కనిపెట్టుకుని ఉన్నారు. తనపట్ల ప్రవక్త ప్రవర్తిస్తున్న తీరుకు ఆ వృద్ధురాలు ఆశ్చర్య చకితురాలైంది. తను ఆయనని ఛీత్కరించినా, థూత్కరించినా, చెత్తాచెదారం పైన పోసి అవమానించినా, ఆ మహనీయుడు తనపై చూపిన దయకు, చేసిన మేలుకు ముగ్దురాలైపోయింది. తను చేసిన తప్పుకు పశ్చాత్తాపం చెందుతూ, ప్రవక్తకు ప్రియ శిష్యురాలిగా మారిపోయింది. ఒకసారి మస్జిదె నబవి లోకి ఒక తుంటరి ప్రవేశించాడు. ఆ మనిషి చాలా వికారంగా, అనాగరికంగా ఉన్నాడు. వచ్చినోడు ఊరుకున్నాడా.. లేదు.. మస్జిదులో మూత్రం పోశాడు. మసీదుకు వచ్చినోళ్ళుఊరుకుంటారా? ఈ దుశ్చర్యను చూసి అగ్రహోదగ్రులయ్యారు. పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేస్తావా..అంటూ, తలా ఒక తిట్టు తిట్టారు. కొట్టేటంత పనిచేశారు. అంతలో ప్రవక్త మహనీయులు మస్జిదుకు వచ్చారు. విషయం తెలుసుకొని అనుచరుల్ని వారించారు. ఆ అపరిచితుడి పట్ల ప్రవర్తించిన తీరుకు మందలించారు. వెంటనే ఒక బిందెడు నీళ్ళు తెప్పించి ఆయన స్వయంగా శుభ్రపరిచారు. ‘బాబూ.. ఇది దైవారాధన చేసుకునే స్థలం కదా..!’ అని మాత్రమే అన్నారు ప్రేమగా. ఈ సంఘటన ఆ మూర్ఖుడిలో అనూహ్యమైన పరివర్తన తీసుకొచ్చింది. అతడు గబగబా బయటికి వెళ్ళిపోయాడు. తలారా స్నానం చేసివచ్చి, ప్రవక్త మహనీయుని ముందు సిగ్గుతో తలదించుకొని నిలబడ్డాడు. పరివర్తిత హృదయంతో ప్రవక్తవారి అనుంగుశిష్యుడిగా మారిపోయాడు. ఇదీ ప్రవక్త మహనీయుల వారి ప్రవర్తనా తీరు. ఆచరణ విధానం. సాఫల్యానికి పూబాట. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
మార్గం చూపిన మహాత్ముడు
మానవజాతి సంస్కరణకు, సముధ్ధరణకు ఎంతోమంది మహనీయులు, మహాత్ములు, సంస్కర్తలు ప్రపంచంలో జన్మించారు. అలాంటి మహనీయుల్లో ముహమ్మద్ ప్రవక్త ఒకగొప్ప సంస్కర్త, మార్గదర్శి. క్రీ.శ.571 ఏప్రిల్ నెల 20 వ తేదీన అరేబియా దేశంలోని మక్కా నగరంలో ఆయన జన్మించారు. ఆమినా, అబ్దుల్లాహ్ తల్లిదండ్రులు. జననానికి రెండునెలల ముందే తండ్రినీ, ఆరేళ్ళప్రాయంలో అమ్మనూ కోల్పోయారు. అనాథ అయిన ఆరేళ్ళ బాబును తాతయ్య అక్కున చేర్చుకున్నారు. ఆయన తరువాత ముహమ్మద్ ప్రవక్త సంరక్షణా బాధ్యతను బాబాయి స్వీకరించారు. ఈనాడు మనం అనేక రంగాల్లో అద్భుతాలు సాధించాము అనడంలో ఏమాత్రం సందేహం లేదు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మన ప్రగతి అంబరాన్ని చుంబిస్తోంది. కాని నైతికంగా, ధార్మికంగా, విలువల పరంగా ఏదిశగా పయనిస్తున్నామన్నది ప్రశ్నగానే మిగిలి ఉంది. కనుక, ఇకనైనా మనం మరిచిపోయిన పాఠాన్ని మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విస్మరించిన మార్గాన్ని అనుసరించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రవక్త బోధనలు, ఉపదేశాలవైపు మరలవలసిన అవసరం ఉంది. ఎందుకంటే, ఆ మహనీయులు గొప్పదైవప్రవక్త అయి ఉండి కూడా ఒక సామాన్యుడిలా, సామాజిక కార్యకర్తలా సమాజానికి సేవ చేస్తూ, ప్రజల్ని సన్మార్గపథాన నడిపించారు. ఇహపర వైఫల్యాలనుండి రక్షించారు.సమాజంలోని సమస్త అసమానతలు, అమానవీయతలతో పాటు, అన్నిరకాల దుర్మార్గాలు, దౌర్జన్యాలను రూపుమాపారు. మానవులంతా ఒక్కటేనని, మనిషీ మనిషికి మధ్య ఎలాంటి వ్యత్యాసంగాని, ఆధిక్యత గానీ లేదని చాటి చెప్పారు. అందరూ సమానమే, అంతా ఒక తల్లిదండ్రిబిడ్డలే అన్నది ఆయన సందేశం.ఆధిక్యతకు, గౌరవానికి అసలైన కొలమానం నీతి నిజాయితీ, సత్ ప్రవర్తనే అన్నది ఆ మహనీయుని నిర్వచనం. మానవ సమానత్వానికి, సామరస్యం, సోదరభావాలకు ఇది నిలువెత్తు నిదర్శనం. సాటి మానవుల ధన, ప్రాణాలను హరించడం, వారి గౌరవ మర్యాదలకు భంగం కలిగించడం, వారి మనోభావాలను గాయపరచడం, ఒకరిపై నిందలు వేయడం, చాడీలు చెప్పడం, వారి హక్కులను కాలరాయాలనుకోవడం మహా పాతకాలని, ,క్షంతవ్యం కాని నేరాలన్న ఆ మహాత్ముని హితోపదేశాలు మానవ హక్కుల పరిరక్షణకు అద్భుతమైన కవచాలు. శ్రామికుల స్వేదబిందువుల తడి ఆరకముందే వారి వేతనం చెల్లించివేయాలన్న కారుణ్య బోధ కష్టజీవుల పట్ల ఆ మమతలమూర్తికున్న కరుణకు తిరుగులేని నిదర్శనం. ముహమ్మద్ ప్రవక్త చదవడం, రాయడం రాని నిరక్షరాస్యులు. అయినా ఆయన బోధలు యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేశాయి. మానవ సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు, సవాళ్ళకు ఆయన పరిష్కారం చూపారు. ఒక కులానికో, మతానికో, ఒక వర్గానికో, ప్రాంతానికో, ఒక దేశానికో ఆయన బోధనలు పరిమితం కాలేదు. సమస్త మానవులూ ఆయన సంబోధితులే. మానవ జీవితంలోని ఏ రంగమూ ఏదశలోనూ ఆయన మార్గదర్శకానికి వెలుపల లేదు. కుటుంబం, సమాజం, ఉద్యోగం, వ్యాపారం, నైతికం, ఆర్థికం, ఆధ్యాత్మికం, రాజకీయం – ఇలా .. అదీ ఇదీ అని కాకుండా, మానవ జీవితంలోని సమస్త రంగాల్లో ఆయన మార్గదర్శకం చూపారు. మనిషి పుట్టింది మొదలు మరణించే వరకు వివిధ దశల్లో, వివిధ రంగాల్లో ఎలా నడుచుకోవాలో, ఏది హితమో, ఏది హితం కాదో ఆచరణాత్మకంగా విశద పరిచారు. మహిళలను గౌరవించాలని, వారిపట్ల చులకనభావం కూడదని ముహమ్మద్ ప్రవక్త విస్పష్టంగా ప్రకటించారు. తల్లిపాదాల కింద స్వర్గం ఉన్నదని చెప్పి స్త్రీజాతి ఔన్నత్యాన్ని శిఖరస్థాయికి చేర్చారు. పురుషులకు స్త్రీలపై ఎలాంటి హక్కులున్నాయో, ధర్మం ప్రకారం స్త్రీలకు కూడా పురుషులపై అలాంటి హక్కులే ఉన్నాయని స్త్రీ హక్కులను నిర్వచించారు. గుడ్డివారు, చూడగలిగేవారు సమానం కానట్లే, జ్ఞానులు, జ్ఞానవిహీనులు సమానం కాజాలరు అని చెప్పారు. తల్లిదండ్రులు తమ సంతానానికి మంచి విద్యాబుద్ధులు నేర్పించాలని, భావితరాల సంక్షేమానికి ఇది చాలా అవసరమని నొక్కి వక్కాణించారు. విద్యనేర్చుకోవడానికి అవసరమైతే చైనా దేశమైనా వెళ్ళమని విద్యావిజ్ఞానాల ప్రాముఖ్యతను తెలిపారు. పారేనది ఒడ్డున ఉన్నప్పటికీ నీటిని వృథా చేయరాదని, వృక్షసంపదను నాశనం చేయకూడదని, ప్రకృతి సమతుల్యతకు, మానవాళి మనుగడకు ఇవి అత్యంత అవసరమని ఉద్బోధించారు. ప్రళయం ముంచుకొస్తున్నప్పటికీ, మీ చేతులలో ఒక మొక్క ఉంటే ముందు దాన్ని నాటండని పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను చాటిచెప్పారు. మొక్కలు నాటడం సదఖా అని కూడా ప్రవక్త మహనీయులు ఉపదేశించారు. అందుకే, ధర్మబోధకులందరిలో అధికంగా సాఫల్యాన్ని పొందిన ప్రవక్త ‘ముహమ్మద్’ మాత్రమేనని ఎన్ సైక్లోపీడియా ఆఫ్ బ్రిటానికా కీర్తించింది. కనుక ఈనాటి పరిస్థితులు, పరిణామాల దృష్ట్యానైనా ముహమ్మద్ ప్రవక్త బోధనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కేవలం ఆధునికత, శాస్త్రవిజ్ఞానమొక్కటే సర్వరోగ నివారిణి కాదు. దాంతోపాటు నైతిక, మానవీయ విలువలను ప్రోదిచేసే దైవప్రవక్తల ఉపదేశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. శాస్త్రవిజ్ఞానానికి ఆధ్యాత్మిక దృక్పథం జోడించి విలువల పునర్నిర్మాణానికి పూనుకోవాలి. ఈ విషయంలో ముహమ్మద్ ప్రవక్త (స) తన 23 ఏళ్ళ దైవదౌత్యకాలంలో సాధించిన అపూర్వ విజయ సాఫల్యాలను, ఆయన నిర్మించిన సుందరమైన సత్ సమాజాన్ని గమనంలోకి తీసుకోవాలి. తద్వారా నేటి మన సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలను అధిగమించి, నైతిక, మానవీయ విలువలతో నిండిన సంక్షేమ రాజ్యాన్ని పునర్నిర్మించుకోవచ్చు. (ప్రవక్త జన్మదినం సందర్భంగా...) – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
భక్తి కన్నా జ్ఞానం మిన్న
ఒకసారి షైతాన్ ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. వివిధ కేటగిరీలకు చెందిన అనేకమంది శిష్యులు ఆ సమావేశంలో పాల్గొన్నారు. రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన నివేదికలు శిష్యుల నుండి స్వీకరిస్తున్నాడు. ఒక శిష్యుడు తన కార్యకలాపాలకు సంబంధించిన నివేదికను వినిపిస్తూ,‘తాను ఈరోజు ఒక మనిషితో దొంగతనం చేయించాను.’ అన్నాడు. షైతాన్ మంచిపని చేశావు అని వాణ్ణి ప్రశంసించాడు. మరొకడు,’ తాను ఈ రోజు ఒక వ్యక్తిని ప్రార్థనకు వెళ్ళకుండా ఆపాను.’అన్నాడు. దానికి నాయకుడు’ మంచిపని చేశావు.’ అన్నాడు. మరొకడు లేచి, తానీరోజు ఓ కుటుంబంలో కలతలు సృష్టించాను అని వివరించాడు. దానిక్కూడా షైతాన్ శహభాష్ అని మెచ్చుకున్నాడు. . మరొకడు తన నివేదికను సమర్పిస్తూ, ‘తాను భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టాను.’ అన్నాడు.‘భళా మంచిపని చేశావు’అన్నాడు. తాను ఒక మనిషిని చెడువైపునకు ఆకర్షించి అతడితో ఆ చెడుపని చేయించాను’ అన్నాడు మరొకడు. ‘‘నువ్వుకూడా మంచిపనే చేశావు’’ అన్నాడు షైతాన్ .ఈ విధంగా షైతాన్ శిష్యులు తాము చేసిన ఘనకార్యాలను ఒక్కొక్కరు వరుసగా ఏకరువు పెట్టారు. చివరిలో ఒక చిన్న షైతాన్ లేచి, ‘‘నాయకా..! నేను వీళ్ళందరి లాగా పెద్దపెద్ద దుష్కార్యాలు, పాపాలేవీ ఎవరితోనూ చేయించలేకపోయాను. కాని ఒక చిన్న పని మాత్రమే చేయగలిగాను.’’ అన్నాడు కాస్త చిన్నబుచ్చుకుంటూ.. ‘‘ఏమిటీ పెద్దపెద్ద పనులేమీ చెయ్యలేకపోయావా? చిన్నపని మాత్రమే చేశావా? చెప్పు ఆ చేసిన ఘనకార్యమేమిటో?’’ అన్నాడు షైతాన్.‘‘ఒక బాలుడు పాఠశాలకు వెళుతుంటే మాయమాటలు చెప్పి బడికిపోకుండా చేశాను.’’ అన్నాడు‘‘శభాష్ శిష్యా.. శభాష్ .. నువ్వు చేసిన పని చిన్నపని కాదు. అసలు పని చేసిందే నువ్వు. అసలు పని అదే. వీళ్ళందరూ చేసింది ఒకెత్తయితే నువ్వొక్కడివి చేసింది మరోఎత్తు. మనిషిని విద్యకు దూరం చేయడం అన్నిటికన్నా గొప్పపని. మనిషి విద్యావిజ్ఞానాలకు దూరమైతే, మనపని సులువవుతుంది. అంతకన్నా ఏం కావాలి? జ్ఞానానికి దూరమైతే మిగిలేది అజ్ఞానమే. ఇక తనంత తానే మనిషి పాపాల్లో, దుర్మార్గాల్లో కూరుకుపోతాడు. అంతకన్నా మనకు కావలసిందేముంది?’అంటూ షైతాన్ తన శిష్యుణ్ణి గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు.నిజానికి, వేయిమంది దైవభక్తుల్ని బురిడీ కొట్టించడం కన్నా ఒక్క ఆలిమ్‌ను, ఒక్కజ్ఞానిని, పండితుణ్ణి దారితప్పించడం షైతాన్కు కష్టమైన పని. అందుకే షైతాన్ ఒక ధార్మిక విద్యార్థిని దారి తప్పించడానికి తీవ్రంగా శ్రమిస్తాడు. ధ్యానం చేయకుండా, జిక్ర్ చేయకుండా, నమాజులు చేయకుండా, సత్కార్యాలు ఆచరించకుండా, ఎలాంటి మంచిపనులూ చేయకుండా, దుష్కార్యాల్లో, దుర్మార్గాల్లో, పాపాల్లో మానవుడు కూరుకుపోయేలా చెయ్యడానికి షైతాన్ ఎంతగా శ్రమిస్తాడో, అంతకంటే అనేక రెట్లు ఎక్కువగా మనుషుల్ని విద్యా విజ్ఞానాలకు దూరం చెయ్యడానికి అవిశ్రాంతంగా, అలుపెరుగని పోరాటం చేస్తాడు. కుట్రలు, కుతంత్రాలు, మాయోపాయాలు, మోసాలకు పాల్పడతాడు.షైతాన్ మానవరూపంలో వచ్చి కల్లబొల్లి కబుర్లు చెప్పి బురిడీ కొట్టిస్తాడు. అందుకే జిత్తులమారి షైతాన్ మాయల పట్ల అప్రమత్తంగా ఉండాలని ముహమ్మద్ ప్రవక్త(స)హెచ్చరించారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
దైవ నిర్ణయం
మూసా అలైహిస్సలాం గొప్ప దైవప్రవక్త. ఆయన నేరుగా అల్లాహ్‌తో సంభాషించేవారు. ఒకసారి అల్లాహ్ ఆదేశం మేరకు ఆయన జ్ఞానసముపార్జన కోసం హ.ఖిజర్ అనే ఆ పండితుని వద్దకు వెళ్లి, తాను జ్ఞాన సముపార్జనకోసం వచ్చానని, మీదగ్గర శిష్యరికం చేస్తానని, దైవం మీకు ప్రసాదించిన దివ్యజ్ఞానం నాక్కూడా నేర్పండని అభ్యర్థించారు. ‘మీరు నా శిష్యరికం చేయాలంటే, ఏ విషయమైనా స్వయంగా నేను చెప్పనంత వరకు నన్నడగవద్దు. నేనేం చేసినా చూస్తూ ఉండాలి తప్ప ప్రశ్నించకూడదు’. అన్నారు ఖిజర్ . మూసా ఈ షరతును అంగీకరించారు. తరువాత ఇద్దరూ కలిసి బయలుదేరారు. కొంతదూరం వెళ్ళి ఓ పడవ ఎక్కారు. అంతలో ఓ చిన్నపక్షి వచ్చి పడవ అంచున వాలి, నదిలో నీటిని ఒక చుక్క పీల్చుకుంది. అప్పుడు ఖిజర్, ‘నీకు, నాకు లభించిన జ్ఞానం దైవానికున్న జ్ఞానంతో పోల్చితే ఈ పక్షి సముద్రంలోంచి నీటిని తన ముక్కుతో పీల్చుకున్నంత కూడా లేదు’. అన్నారు. అలా కొంతదూరం వెళ్ళాక హ.ఖిజర్ పడవ అడుగున ఒక రంధ్రం వేశారు. అది చూసి హ.మూసా, ‘అయ్యయ్యో ఏమిటీ.. పడవకు కన్నం వేశారు. అందర్నీ ముంచేస్తారా ఏమిటీ.. ఈ పనేం బాగాలేదు.’ అన్నారు. ‘నేను ముందే చెప్పాను. మీరు సహనంగా ఉండలేరని.’ అన్నారు ఖిజర్ ‘సరే సరే, మరిచి పోయాను వదిలేయండి’ అన్నారు మూసా.మరికొంతదూరం వెళ్ళిన తరువాత, వారికి ఒక బాలుడు కనిపించాడు. ఖిజర్ ఆ బాలుణ్ణి చంపేశారు.‘అయ్యయ్యో.. నిష్కారణంగా ఒక అమాయకుణ్ణి చంపేశారే.. అతనేం పాపం చేశాడు?’ అన్నారు మూసా. ‘నేను ముందే చెప్పాను. నేనేం చేసినా చూసూ ్తఉండాలని’. ‘సరే సరే.. పొరపాటైంది. ఇకనుండి ఏమీ మాట్లాడను. ఈసారి అలా చేస్తే నన్ను వదిలేయండి.’ అన్నారు మూసా. అలా మరికొంత దూరం వెళ్ళి ఓ ఊరికి చేరుకున్నారు. అక్కడ పడిపోవడానికి సిద్ధంగా ఉన్న ఓ గోడను చూసి, హ.ఖిజర్ వెంటనే దాన్ని బాగుచేశారు. పడిపోకుండా పటిష్టంగా నిలబెట్టారు. అప్పుడు హ.మూసా(అ), ‘కావాలనుకుంటే, ఈ పని చేసినందుకు ప్రతిఫలం కూడా తీసుకోవచ్చుకదా..!’ అన్నారు. ‘ఇక చాలు. నావల్లకాదు. నీ శిష్యరికం ఇంతటితో ముగిసిపోయింది. ఇప్పటివరకూ నువ్వు సహనం వహించలేకపోయిన విషయాలను గురించి చెబుతా విను. ముందుగా పడవ సంగతి: అదికొందరు పేదవాళ్ళది. వాళ్ళు పొట్టకూటికోసం నదిలో పడవ నడుపుకుంటున్నారు. నది అవతల దౌర్జన్యంగా పడవలను స్వాధీనం చేసుకుంటున్న రాజొకడున్నాడు. అతడు మంచి మంచి పడవల్ని దోచుకుంటాడు. అందుకే నేను ఆ పడవకు లోపం కలిగించాను. ఇక ఆ బాలుడి విషయం: అతడి తల్లిదండ్రులు విశ్వాసులు, దైవభక్తిపరాయణులు. ఇతడేమో పెద్దవాడై, తిరస్కారం, దుర్మార్గం, తలబిరుసుతనంతో ప్రవర్తిస్తూ వారిని వేధించే రకం. అతనివల్ల మునుముందు సమాజానికి హాని కలిగే అవకాశం ఉంది. ఇక గోడ వ్యవహారం... అది ఇద్దరు అనాథ పిల్లలది. దానికింద వారికోసం ఒక నిధి దాచిపెట్టి ఉంది. వారి తండ్రి గొప్ప పుణ్యాత్ముడు. అందుకని పిల్లలిద్దరూ పెద్దయిన తరువాత ఆ నిధిని పొందాలని దైవం నిర్ణయించాడు. నువ్వు సహించలేకపోయిన విషయాల మర్మహేతువు ఇదే’. అన్నారు ఖిజర్. అందుకని, మనకు తెలియని విషయాల్లో తలదూర్చడం, అన్నీ తమకే తెలుసన్న భావన ఎంతమాత్రం సరికాదు. కొన్ని విషయాల మర్మం కేవలం దైవానికి మాత్రమే తెలుసు. తాడెక్కేవాడుంటే తలదన్నేవాడు కూడా ఉంటాడు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ఫిరౌన్ పీచమణిచిన మూసా ప్రవక్త
పూర్వం ఫిరౌన్ అని ఒక పరమ దుర్మార్గుడైన చక్రవర్తి ఉండేవాడు. ఒకసారి కొంతమంది ప్రఖ్యాత జ్యోతిష్కులు ఫిరౌన్ దగ్గరికొచ్చి, ఇశ్రాయేలు జాతిలో ఒక బాలుడు పుడతాడని, అతని ద్వారా మీ అధికారానికి, దైవత్వానికి ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. ఇది వింటూనే ఆ దుర్మార్గుడు, పుట్టిన మగ శిశువునల్లా చంపేయమని ఆజ్ఞ జారీచేశాడు. దీంతో ఎంతోమంది తల్లులకు కడుపుకోత మిగిలింది. కాని దైవ సంకల్పం మరోవిధంగా ఉంది. ఫిరౌన్ పీచమణిచే మొనగాడు స్వయంగా అతడి ఇంట్లోనే పోషించబడాలని, సంరక్షింపబడాలని రాసిపెట్టాడు. దీనికనుగుణంగానే ఒక తల్లి నెల కూడా నిండని తన పసిగుడ్డును ఓ చెక్కపెట్టెలో పెట్టి నీల్ సముద్రంలో పడవేసింది. ఆ పెట్టె సముద్రంలో కొట్టుకుపోతుండగా, వ్యాహ్యాళికి వెళ్ళిన ఫిరౌన్ భార్య, ఆమె చెలికత్తెలు చూసి ఆ పెట్టెను ఒడ్డుకు చేర్చారు. పెట్టె తెరిచి ముద్దులొలికే అందమైన బాబును చూసి వారు మురిసిపోయారు. కాని ఫిరౌన్ మాత్రం పిల్లవాణ్ణి చంపెయ్యాలని నిర్ణయించుకున్నాడు. కాని భార్య రకరకాలుగా నచ్చజెప్పి, ఆ ప్రయత్నాన్ని విరమింపజేసింది. మూసా అక్కడే పెరిగి పెద్దవాడయ్యాడు. తరువాత అల్లాహ్ మూసాకు జ్ఞానాన్ని, వివేకాన్ని ప్రసాదించాడు. ప్రవక్తగా మారిన తరువాత, మూసా దైవం ప్రసాదించిన మహిమలతో ఫిరౌన్ దగ్గరికొచ్చి దైవ సందేశాన్ని వినిపించారు. కాని తానే దేవుణ్నని ప్రకటించుకున్న ఫిరౌన్ మూసాను, ఆయన సందేశాన్ని తిరస్కరించడమేగాక దేశం నలుమూలల నుండి గొప్ప గొప్ప మంత్రగాళ్ళను పిలిపించాడు. మంత్రవిద్యలో ఆరితేరిన ఆ నిష్ణాతులు తమ చేతుల్లోని కర్రలను, తాళ్ళను నేలపై విసిరారు. అవి పాములుగా మారిపోయాయి. సమాధానంగా మూసా ప్రవక్త తన చేతి కర్రను నేలపై వేశారు. అది అనకొండ రూపాన్ని సంతరించుకొని వాటన్నిటినీ మింగేసింది. ఇది చూసిన మంత్రగాళ్ళు, ఇది దేవుని మహిమేనని ప్రకటిస్తూ మూసా సందేశాన్ని, వారి దైవాన్ని విశ్వసిస్తూ సజ్దాలో పడిపొయ్యారు. తరువాత మూసా దైవాదేశం మేరకు ప్రజలను వెంటబెట్టుకొని అక్కణ్ణించి బయలుదేరారు. ఫిరౌన్ కూడా సైన్యాన్ని తీసికొని సముద్రతీరానికి చేరుకున్నాడు. అప్పుడు మూసా తన చేతికర్రతో నీళ్ళపై కొట్టారు. దాంతో సముద్రం రెండుపాయలుగా చీలి. ఫిరౌన్ సైన్యం అంతా సముద్రంలో మునిగిపోయింది. తరాలుగా దౌర్జన్యాలు, బానిసత్వంలో మగ్గుతున్న ఇజ్రాయేలీయులకు విముక్తి లభించింది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
దైవాగ్రహానికి అతీతులు కారెవ్వరూ!
హజ్రత్ నూహ్ అలైహిస్సలాం గొప్ప దైవప్రవక్త. ఆయన 950 సంవత్సరాలు జీవించారు. అప్పటి జాతి సృష్టికర్తను విస్మరించి అనేక దేవుళ్ళను పూజించేది. నూహ్ జాతి ప్రజలు వద్, సువా, యగూస్, యఊఖ్, నస్ర్ అనే ఐదుగురు దేవుళ్ళను పూజించేవారు. ఈ ఐదుగురూ సత్పురుషులు, గొప్ప సంస్కర్తలు. వీరి మరణం తరువాత ప్రజలు వీరి జ్ఞాపకార్థం గౌరవ సూచకంగా విగ్రహాలను ప్రతిష్టించారు. తరువాత రెండవ తరం ప్రజలు ఆ విగ్రహాలకు మరికాస్త పవిత్రత ఆపాదించారు. వారి తరువాత మూడవ తరం ప్రజలు మరికాస్త ముందుకెళ్ళి ఆ విగ్రహాలను పూజించడం మొదలు పెట్టారు. ఈవిధంగా విగ్రహారాధన ప్రారంభమైంది. నిజానికి ప్రారంభ కాలంలో విగ్రహారాధనకాని, బహుదైవారాధనకాని లేదు. వలీలు, సంస్కర్తలు, దైవభక్తుల పట్ల గౌరవభావం మితిమీరి ఆరాధనా స్థాయికి చేరుకోవడంతోనే విగ్రహారాధన ప్రారంభమైంది. హజ్రత్ నూహ్ అలైహిస్సలాం ప్రజలను అల్లాహ్ వైపుకు పిలిచారు. ఈ అండపిండ బ్రహ్మాండాన్ని సృష్టించిన పరమ ప్రభువును మాత్రమే ఆరాధించాలని హితవు చెప్పారు. సత్కర్మలు ఆచరించాలని, సత్యం, ధర్మం, న్యాయాలను పాటించాలని సూచించారు. కాని అతి కొద్దిమంది మాత్రమే ఆయన్ని విశ్వసించారు. అత్యధిక శాతం ప్రజలు ఆయన మాటను తిరస్కరించారు. విశ్వసించిన వారు చాలా సామాన్య ప్రజలు. గొప్ప వారు, సంపన్నులు నూహ్ ప్రవక్తను, ఆయన సందేశాన్ని ఎగతాళి చేశారు. అయినప్పటికీ ఆయన ఏమాత్రం నిరాశ చెందకుండా, సుదీర్ఘకాలంపాటు ధర్మసందేశ ప్రచారం చేశారు. కాని కేవలం 80 మంది మాత్రమే ఆయన మాటవిని ఏకైక దైవాన్ని విశ్వసించారు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన నూహ్ ప్రవక్త, సకల ప్రయత్నాలూ విఫలమైన నేపథ్యంలో వీరికి తగిన బుద్ధి చెప్పవలసిందంటూ దైవాన్ని వేడుకున్నారు. ప్రవక్త ప్రార్థన దైవం ఆలకించకుండా ఉంటాడా? వెంటనే దైవాజ్ఞ అవతరించింది. దైవాదేశం మేరకు నూహ్ ప్రవక్త(అ) ఒక ఓడను తయారు చేయడం మొదలు పెట్టారు. ఇది చూసి ప్రజలు ఎగతాళి చేయసాగారు. కాని నూహ్ ప్రవక్త ఇవేమీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పొయ్యారు. కొన్నాళ్ళకు ఓడ తయారైంది. ఓడ నిర్మాణం పూర్తవ్వగానే దైవాజ్ఞ వచ్చేసింది. ఆకాశానికి చిల్లుపడ్డట్లు వర్షభీభత్సం మొదలైంది. అప్పుడు అల్లాహ్ నూహ్ ప్రవక్తను ఇలా ఆదేశించాడు. ‘ప్రతి జాతి నుండి ఒక్కొక్క జంటను పడవలో ఎక్కించు. – ఇదివరకే సూచించబడిన వ్యక్తులు తప్ప – మిగిలిన నీ కుటుంబ సభ్యుల్ని, ఇంకా విశ్వాసులను కూడా ఓడలో ఎక్కించుకో.. ఓడలో ఉన్నవాళ్ళు మాత్రమే దైవశిక్షనుండి తప్పించుకోగలుగుతారు.’ అన్నట్లుగానే భయంకర జలప్రళయం జనావాసాలను ముంచిపారేసింది. కాని నూహ్ ప్రవక్త ఓడమాత్రం నీటి ప్రవాహపు అలలలో చక్కగా తేలియాడుతూ జూదీ పర్వతశిఖరంపై సురక్షితంగా ఆగింది. ఆ భయంకర జల ప్రళయంలో కొడుకు ఎక్కడ మునిగి పోతాడోనని, పితృప్రేమ కొద్దీ తనయుణ్ని ఎలుగెత్తి పిలిచారు. ‘బాబూ..! మాతోపాటు ఓడను ఎక్కెయ్యి. అవిశ్వాసులతో ఉండకు అని.’ కాని, దురదృష్టవంతుడైన ఆ కొడుకు తండ్రి మాట వినలేదు. దేవుని ఆగ్రహపు చక్రబంధంలో చిక్కుకొని కూడా, ‘నేను ఇప్పుడే ఎత్తైన కొండను ఎక్కుతాను. అది నన్ను నీటి ప్రవాహం నుండి కాపాడుతుంది.’అని పలికాడు. ఇంతలోనే ఒక కెరటం వారిద్దరి మధ్య అడ్డుగా వచ్చింది. తన ఒడిలో లుంగచుట్టుకొని తిరిగిరాని తీరాలకు తీసుకు పోయింది. దైవాన్ని విశ్వసించి, సత్కర్మలు ఆచరించకపోతే ఎంతటివారైనా దైవశిక్షను ఎదుర్కోవలసిందే. సత్య సందేశాన్ని తిరస్కరించే జాతి ఎన్నటికీ సాఫల్యం పొందలేదు. నూహ్ ప్రవక్త జాతే దీనికి ప్రబల నిదర్శనం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
విశ్వాస సాఫల్యం
పూర్వం ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి భార్య, ఒక కూతురు. తల్లి జబ్బుపడడంతో ఇంటిపని, వంట పనులన్నీ కూతురే చక్కబెట్టేది. వారికి పాలు పోయడానికి ఓ వ్యకి ్తవచ్చేవాడు. ప్రతిరోజూ పాలు పోసే క్రమంలో అతను ‘బిస్మిల్లాహ్’అని పలికి పోసేవాడు. బిస్మిల్లాహ్ అంటే, ‘అల్లాహ్ పేర’, లేక ‘దైవ నామమున’ అని అర్థం. రోజూ వినీ వినీ ఆ అమ్మాయికి కూడా అలవాటైపోయింది. తరువాత అర్థం తెలుసుకొని నమ్మకం పెంచుకుంది. ఈ విషయం నాస్తికుడైన ఆమె తండ్రికి తెలిసి అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు. నయానా భయానా చెప్పి చూశాడు. కాని ఆ అమ్మాయి ప్రతి పనికీ ‘బిస్మిల్లాహ్’ అనడం మాత్రం మానలేదు. ఇక లాభం లేదనుకొని ఒక ఉపాయం ఆలోచించాడు. ఒకరోజు కూతురు అంట్లు తోముతున్నప్పుడు వచ్చి ఒక ఉంగరం ఇస్తూ, ‘దీన్ని జాగ్రత్తగా ఉంచు. తరువాత తీసుకుంటాను’ అన్నాడు.‘బిస్మిల్లాహ్’ అని ఉంగరం అందుకుంది అమ్మాయి. చేతులు శుభ్రంగా లేకపోవడంతో వేలికి పెట్టుకోకుండా అక్కడే పైన గూట్లో పెట్టింది. కాని మరచి పోయింది. ఈలోపు అతను చిన్నగా ఉంగరం తీసి జేబులో వేసుకున్నాడు. ‘అమ్మా.. నేనలా బజారు కెళ్ళొస్తా వంట తొందరగా కానియ్’. అని తండ్రి బయటికి వెళ్ళిపోయాడు. కూతురు వంటపనిలో పడి ఉంగరాన్ని మరిచి పోయింది. బజారుకు వెళ్ళినట్లు వెళ్ళిన తండ్రి ఉంగరాన్ని చెరువులో పడేసి వచ్చాడు. తండ్రి భోజనం చేసి వెళ్ళిన తరువాత ఎప్పటికో ఉంగరం గుర్తొచ్చింది. ఎంత వెదికినా ఎక్కడా దొరకలేదు. చాలా భయపడింది. కన్నీటితో దైవాన్ని వేడుకుంది. చివరికి చేసేదేమీ లేక దైవంపై భారంవేసి ఊరకుండి పోయింది. అలా ఒక రోజు గడిచింది. రెండవ రోజు తండ్రి ఉంగరం అడిగాడు. నేను అంట్లుతోముతూ ఫలానా చోట పెట్టాను. కాని తరువాత ఎంతవెదికినా దొరకలేదంటూ ఉన్నదున్నట్లు చెప్పింది కూతురు. దీంతో బాగా కోప్పడ్డాడు తండ్రి. ‘ప్రతి దానికీ ‘బిస్మిల్లాహ్’ అని జపిస్తావుగా.. ఇప్పుడేమైంది..? ఇప్పటికైనా ఆ పదం పలకడం మానుకో.. రెండురోజుల్లో ఉంగరం దొరక్కపోతే అప్పుడు చెబుతా..’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. తన పథకం ఫలించిందన్న ఆశతో లోలోన సంబర పడుతూ, పైకిమాత్రం కోపం నటిస్తూ ఆరోజంతా మాట్లాడలేదు. మరునాడు ఉదయం కూరగాయల కోసం బజారుకెళ్ళిన పెద్దమనిషి, అప్పుడే తాజాచేపలు అమ్మకానికి రావడంతో ఒక పెద్దచేపను కొనుగోలు చేశాడు. ఇంటికి తీసుకొచ్చి, త్వరగా వండమని పురమాయించాడు. కూతురు యధాప్రకారం ‘బిస్మిల్లాహ్’ అని పలికి చేప పొట్టను కోసింది. ఆశ్చర్యకరంగా అందులోంచి ఉంగరం బయట పడింది. అదే ఉంగరం. తండ్రి దాయమని ఇచ్చిన ఉంగరం. ఆనందం, ఆశ్చర్యాల భావోద్వేగాలతో దైవానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వేలికి తొడుక్కుంది. సంతోషంతో చేపల పులుసు తయారు చేసింది. తండ్రి బయటినుండి రాగానే భోజనం వడ్డించింది. భోజనం తరువాత ‘ఉంగరం దొరికిందా?’ అంటూ గర్జించాడు తండ్రి. ‘..ఆ..ఆ..దొరికింది నాన్నా..!’అంటూ సంతోషంగా తన చేతికున్న ఉంగరం తీసి తండ్రికిచ్చింది కూతురు. ఉంగరాన్ని చేతిలోకి తీసుకున్న తండ్రి తన కళ్ళను తానే నమ్మలేక పోయాడు. పదే పదే అటూ ఇటూ తిప్పితిప్పి, మార్చి మార్చిచూశాడు. సందేహం లేదు అదే ఉంగరం. తన ఉంగరమే. కాని ఎలా సాధ్యం? స్వయంగా తానే తన స్వహస్తాలతో చెరువులో పారేసి వచ్చాడు. తీవ్ర ఆలోచనలో, మానసిక సంఘర్షణలో పడిపోయాడు. అది దేవుడి పవిత్రనామంలో ఉన్న శుభం. ఆ శుభం వల్ల చెరువులో పడేసిన ఉంగరాన్ని చేప మింగడం, ఆ చేప జాలరి వలకు చిక్కడం, అదే చేపను ఈ వ్యక్తి కొనుగోలు చేయడం, ఇవన్నీ యాదృచ్ఛికంగానే జరిగినా, నిజంగా ఆ అమ్మాయి విశ్వాస పటిష్టతకు నిదర్శనం. మనసా, వాచా, కర్మణా సృష్టికర్తను నమ్మి, ఆ దేవుని పవిత్రనామంతో ప్రతి పనినీ ప్రారంభించే వారికి దైవం ఇలాగే సహాయం చేస్తాడు. ఇహ పర లోకాల సాఫల్యం ప్రసాదిస్తాడు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
రాజు ఫకీరు
పూర్వం హారూన్ రషీద్ అని ఒక రాజు ఉండేవాడు. మంచివాడు. కాని కాస్తంత అధికార గర్వం ఉండేది. ఒకరోజు రాజు వేటకు బయలు దేశాడు. వెంట చిన్నపాటి సైనిక పటాలంతో పాటు, ఇబ్రాహీం అనే మంత్రికూడా ఉన్నాడు. పరివారం ఒక దట్టమైన అడవిలోకి ప్రవేశించింది.అలా వెళుతూ వెళుతూ, ‘ఇబ్రాహీం! నాకు లభించని సంపద కాని, సంతోషం కాని ఇంకా ఏమన్నా ఉందంటావా?’ అని ప్రశ్నించాడురాజు. ‘అయ్యా.. సమస్త సంతోషాలు, అనంతమైన సిరిసంపదలు మీసొంతం. మీకు లేనిదంటూ ఏమీలేదు..’ బదులిచ్చాడుమంత్రి. అంతలో అడవిలోంచి ఓ కంఠం వినిపించింది. ‘మీరిద్దరూ బుద్ధిహీనులే. నిజమైన ఆనందం ఏమిటో మీకసలు తెలియనే తెలియదు.’ అని. ఈ శబ్దం విని వారు నిర్ఘాంతపోయి, అటువైపు దృష్టిసారించారు. ఒక బక్కపలచని, బలహీనవ్యక్తి అడవిలోంచి బయటికొచ్చాడు. అతణ్ణిచూసి, ‘ఎవర్నువ్వు?’ అంటూ ప్రశ్నించాడు రాజు. ‘నేను దేవుని దాసుణ్ణి’ ముక్తసరిగా సమాధానమిచ్చాడా వ్యక్తి. ‘నువ్వు నా పాలనలో ఉన్న ఈ దేశవాసివా? లేక ఇతరదేశస్థుడివా?’ ‘నువ్వూ నేనూ అందరూ దేవుని పాలనలోని వాళ్ళమే. మనందరి రాజు, ప్రభువు ఆయనే.’ అంతలో మంత్రి ఇబ్రాహీం కలగజేసుకొని, ‘నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?’ అన్నాడు కోపంగా. ‘తెలుసు. దైవాన్ని, పరలోకాన్ని మరచి, అంతా ప్రపంచమే అనుకొనే వ్యక్తితో మాట్లాడుతున్నాను’ అన్నాడా వ్యక్తి తనదైన శైలిలో.. ఈమాటలతో మంత్రికోపం తారాస్థాయికి చేరింది. ఇది గమనించిన రాజు కలగజేసుకొని, ‘ఇబ్రాహీం.. కాస్త ఆగు. కోపాన్ని దిగమింగు’’ అని గద్దించాడు. తరువాత భోజన ఏర్పాట్లు చేయమని పురమాయించాడు. రకరకాల రుచికరమైన వంటకాలు వడ్డించబడ్డాయి. భోజనానంతరం, ‘నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. సరైన సమాధానాలు చెబుతారా?’ అన్నాడు రాజు. ‘దైవచిత్తమైతే బుద్ధినుపయోగించి సరైన సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తాను.’ అన్నాడా వ్యక్తి. ‘ఫిరౌన్ ఎక్కువగా దైవానికి అవిధేయత చూపేవాడా? లేక నేనా?’ ’ఫిరౌన్ నేనే దేవుణ్నని ప్రకటించుకున్నాడు. అతడు దైవ తిరస్కారి. దేవుని దయవల్ల మీరలా కాదు. మీరు దైవ విశ్వాసి.’ అన్నాడా వ్యక్తి ‘హ.మూసా(అ)మీకన్నా ఉన్నతులా? లేక మీరు ఆయనకంటే ఉన్నతులా?’ ‘హ.మూసా అలైహిస్సలాం దేవుని ప్రవక్త. నేను కేవలం దాసుణ్ణి. నాకూ ఆయనకు పోలికా?’ ‘మరి దేవుడు మూసాను ఫిరౌన్ వద్దకు పంపినప్పుడు, ఆయన సౌమ్యంగా హితబోధ చేశారు. మీరు నాపట్ల అలా సౌమ్యంగా ప్రవర్తించలేదు.?’ ’నిజమే. నేను మీ పట్ల కాస్త కటువుగానే ప్రవర్తించాను. అల్లాహ్ నన్ను మన్నించుగాక.. నేను మిమ్మల్ని కూడా క్షమించమని కోరుతున్నాను.’ ‘నేను మిమ్మల్ని మన్నించాను. నాప్రశ్నలన్నింటికీ మీరు సరైన సమాధానాలు చెప్పారు.’ అంటూ..’ ఇతనికి పదివేల నాణాలు కానుకగా ఇవ్వండి’ అని ఆదేశించాడు. రాజాజ్ఞను ఆచరణలో పెట్టారు సేవకులు. ‘ఈ సంచులు నేనేమి చేసుకుంటాను? పేద సాదలకు పంచిపెట్టండి.’అన్నాడా వ్యక్తి. ఒక అధికారి కల్పించుకొని, ‘నీకసలు బుధ్ధుందా? రాజావారి కానుకల్నే వద్దంటున్నావు.’ అన్నాడు ఆగ్రహంగా! ఆ వ్యక్తి అతని వైపు చూస్తూ, ‘ఈ సంపద మీలాంటివారికోసం.. నాకవసరంలేదు.’ అంటూ లేచి నిలుచున్నాడు వెళ్ళిపోడానికి సిద్ధమవుతూ... దీంతో రాజు ఆ అధికారిని తీవ్రంగా మందలిస్తూ... ‘నాదగ్గరికి వచ్చిన వారినెవరినీ నేను రిక్తహస్తాలతో పంపను. వారికి ఏదో ఒకటి ఇచ్చి పంపడం నా అలవాటు’ అన్నాడు అనునయంగా. ‘మీరంతగా అంటున్నారు కాబట్టి, సరే’ అంటూ రెండుచేతులతో రెండుసంచులు పట్టుకొని, రాజువద్ద సెలవు తీసుకొని వెళ్ళిపొయ్యాడు. వెంటనే రాజు మంత్రి ఇబ్రాహీంను పిలిచి, ‘ఈవ్యక్తిసంచులు తీసుకెళతాడా..ఎక్కడైనా పారేసివెళతాడా చూడమని చెప్పి, తను కూడా మేడపైకెక్కాడు. ఆ వ్యక్తి రెండు చేతులూ పైకెత్తి, ‘ప్రపంచం నన్ను మోసం చెయ్యాలని చూసింది. కాని నాప్రభువు నన్ను రక్షించాడు’ అనుకుంటూ వెళ్ళిపోయాడు. హారూన్ రషీద్ మేడదిగి వచ్చి తన స్థానంలో కూర్చున్నాడు. అంతలో ఇబ్రాహీం కూడా వచ్చాడు. ‘రాజా... అతను రెండుసంచులనూ ద్వారం దగ్గర గుమ్మరించి, ఇదిరాజుగారి సొమ్ము. దీనికి హక్కుదారులు మీరు మాత్రమే. అని మనద్వారపాలకులకే దానం చేసి ఖాళీ చేతులతో వెళ్ళి పోయాడు’ అని చెప్పాడు. ఇది విని హారూన్ రషీద్, ‘ఇబ్రాహీం..! ఎవరైతే ప్రాపంచిక వ్యామోహాన్ని దరి చేరనీయరో వారు రాజదర్పాన్ని సుతరామూ అంగీకరించరు. అంటూ, ‘దేవా..! నాపాలనలో ఎల్లప్పుడూ ఇలాంటి సచ్ఛీలురు, సత్పురుషుల్ని ఉండేలా ఆశీర్వదించు’ అని చేతులెత్తి అల్లాహ్‌ను వినమ్రంగా వేడుకున్నాడు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
ప్రవక్త నేర్పిన పాఠం
దేవుడు మానవులకు సంపదను ఇచ్చీ పరీక్షిస్తాడు. ఒక్కోసారి లేమికి గురిచేసీ పరీక్షిస్తాడు. ఇలా పరీక్షించే నిమిత్తం ఓ ముగ్గురు వ్యక్తుల దగ్గరకు దైవం తన దూతను పంపాడు. వారిలో ఒకడు కుష్టురోగి. మరొకడు పుట్టుగుడ్డి. మూడవవాడు వికారమైన రూపం కలిగిన వాడు. ముగ్గురూ నిరుపేదలే. దైవదూత మానవాకారంలో కురూపిగా ఉన్నవాడి దగ్గరికొచ్చి, అతని కోరికను చెప్పమన్నాడు. తాను అందవిహీనంగా ఉన్న నిరుపేదను కాబట్టి. తనకు రూపం కావాలని కోరుకున్నాడు. అప్పుడా దూత అతనికి మంచిరూపాన్ని తెప్పించి, ఒక చూడి మేకను బహూకరించి, దీనిద్వారా నీకు శుభం కలుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. తరువాత గుడ్డివాడి దగ్గరికెళ్ళి ఏం కావాలో చెప్పమన్నాడు. అప్పుడా గుడ్డివాడు చూపు కావాలని కోరుకున్నాడు. దూత అతడికి చూపును ప్రసాదించి ఒక చూడి ఆవును బహూకరించాడు. దీనిద్వారా నీకు శుభం కలుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కుష్టురోగి వద్దకు వెళ్ళాడు. అతణ్ణి కూడా నీకేం కావాలో కోరుకోమన్నాడు. ఆ కుష్టురోగి తన జబ్బు నయం కావాలని కోరుకున్నాడు. దూత దైవాన్ని ప్రార్థించి అతని కుష్టురోగాన్ని పూర్తిగా దూరం చేశాడు. తరువాత అతనికొక చూడి ఒంటెను బహూకరించి, దీనిద్వారా నీకు శుభం కలుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. దైవదూత చెప్పినట్లే, ముగ్గురూ ధనవంతులుగా మారి, హాయిగా జీవించసాగారు. తరువాత కొంతకాలానికి దేవదూత, పూర్వం కురూపిగా ఉండి, ఇప్పుడు అందంగా ఉన్న సంపన్నుడి దగ్గరికి వెళ్ళాడు. తన పరిస్థితిని వివరిస్తూ ఒకమేకను దానం చేస్తే దాని ద్వారా బతుకుతానని అర్ధించాడు. కాని పూర్వపు కురూపి, తన గతాన్నంతా మర్చిపోయి ఏమాత్రం జాలి చూపకుండా కసురుకున్నాడు. అప్పుడా దూత, ‘దేవుడు నిన్ను కరుణించి, నీ కురూపితనాన్ని పోగొట్టి మంచి రూపాన్ని ప్రసాదించాడు. దాంతోపాటు సంపదనూ అనుగ్రహించాడు. కాని నువ్వు అన్నీ మరిచిపొయ్యావు. దైవం మళ్ళీ నిన్ను పూర్వ స్థితికే తెస్తాడు.’ అని శపించి, అక్కణ్ణించి వెళ్ళిపోయాడు. తరువాత, పూర్వం గుడ్డివాడిగా ఉన్నతని దగ్గరికి వెళ్ళి ‘అయ్యా! నేను నిస్సహాయస్థితిలో ఉన్న గుడ్డివాణ్ణి. నాకో ఆవును దానం చెయ్యి..’ అని వేడుకున్నాడు. అతనూ గతాన్నంతా మరచి మొదటి వాడికి లాగానే ఛీత్కరించాడు. దూత అతణ్ణి కూడా ‘దైవం నిన్ను మళ్ళీ పూర్వస్థితికే తెచ్చుగాక..!’అని శపించి వెళ్ళిపోయాడు. తరువాత కుష్టురోగిగా మారి, పూర్వం కుష్టురోగంతో బాధపడి, స్వస్థత పొందిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ‘అయ్యా. .నేను దిక్కూమొక్కూ లేని కుష్టురోగిని. నాకేదైనా సాయం చేసి పుణ్యం కట్టుకో’ అని అభ్యర్ధించాడు. పూర్వ కుష్టురోగి,’అయ్యో..ఎంత కష్టం వచ్చింది! గతంలో నేను కూడా ఇదే వ్యాధితో బాధపడ్డాను. అనేక కష్టాలు అనుభవించాను. దైవం నన్ను అనుగ్రహించి, స్వస్థతను ప్రసాదించి, ఇంత సంపదను ఇచ్చాడు. నీకేం కావాలన్నా తీసుకెళ్ళు. దేవుని పేరుమీద నీకు దానం చేస్తున్నాను.’అన్నాడు. అప్పుడు దేవదూత, ‘నాకేమీ అక్కర లేదు నాయనా. కేవలం పరీక్ష నిమిత్తం దేవుడు నన్ను మీ దగ్గరికి పంపాడు. ఆయన మీ ముగ్గురినీ పరీక్షించాడు. కాని నువ్వు మాత్రమే సఫలమయ్యావు. అంతా హాయిగా, సంతోషంగా అనుభవించు. నీకు శుభం కలుగుగాక..!’ అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. ప్రవక్త చెప్పిన ఈ వృత్తాంతం అందరికీ చక్కని గుణపాఠం. మనిషి ఎప్పుడూ తన గతాన్ని మరువకూడదు. ఏ ఆధారంలేని నిరుపేదలను, వికలాంగులను సంపన్నుల్ని పరీక్షించడానికే సృష్టించి ఉంటాడు.అందుకని, నిలకడలేని ఆరోగ్యాన్ని, ఈరోజు ఉంటే రేపు ఉంటుందన్న నమ్మకంలేని సంపదను, సౌందర్యాన్ని చూసుకొని విర్రవీగకూడదు. – ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ -
త్యాగమయుడు
పూర్వం ఇరాక్ దేశంలో నమ్రూద్ అనే రాజు ఉండేవాడు. చాలా దుర్మార్గుడు. తాను దైవాంశ సంభూతుడినని ప్రకటించుకొని నిరంకుశంగా పరిపాలన చేస్తుండేవాడు. రాజు మాట వేదవాక్కుగా పరిగణించబడేది. దౌర్జన్యాలకు వ్యతిరేకంగా మాట్లాడడం కాదుగదా, కనీసం అలా ఊహించడానికే ప్రజలు గడగడలాడిపొయ్యేవారు. అలాంటి పరిస్థితుల్లో రాజు దైవత్వానికి, రాచరికపు దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఇబ్రాహీం అలైహిస్సలాం అనే దైవప్రవక్తగళం విప్పారు. ఆనాడు సమాజంలో పాతుకుపోయి ఉన్న వివిధరకాల దురాచారాలకు, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. విగ్రహారాధనను ఖండించారు. విషయం తెలుసుకున్న నమ్రూద్ ఇబ్రాహీంగారిని తన దర్బారుకు పిలిపించాడు. ‘నేనుకాక మరొక దేవుడెవరో ఉన్నాడని మాట్లాడుతు న్నావట, ఎవరు నీ దేవుడు చెప్పు?’ అని గర్జించాడు. ప్రశాంత చిత్తంతో ఉన్న ఇబ్రాహీం ఏమీ మాట్లాడలేదు. ‘మాట్లాడవేం. చెప్పు?’ మళ్ళీ గాండ్రించాడు. ‘రాజా! ఎవరి ఆధీనంలో జీవన్మరణాలున్నాయో ఆయనే మన ప్రభువు, మనదేవుడు.’ అన్నారు ఇబ్రాహీం. ‘అలాగా..! అయితే చూడు..’ అంటూ ఉరిశిక్ష పడిన ఖైదీని, నిరపరాధి అయిన యువకుడిని పిలిపించాడు. మరణ శిక్ష విధించబోయే ఖైదీని విడుదల చేస్తూ, అమాయక యువకుణ్ణి చంపేశాడు.’ తరువాత... ‘ఇప్పుడు చెప్పు. చావబోయేవాడికి జీవితం ప్రసాదించాను, బతక వలసినవాణ్ణి చంపేశాను. అంటే జీవన్మరణాలు నాచేతిలో ఉన్నాయి. మరి నేను దేవుణ్ణికానా?’ అన్నట్లు చూశాడు గర్వంగా. ఓహో! జీవన్మరణాల అర్థాన్ని ఇలా అన్వయించు కున్నాడా? అని మనసులో అనుకున్న ఇబ్రాహీం, ‘సరే అయితే, దేవుడు సూర్యుణ్ని తూర్పున ఉదయింపజేసి, పశ్చిమాన అస్తమింపజేస్తాడు. నువ్వు, పశ్చిమాన ఉదయింప జేసి, తూర్పున అస్తమించేలా చేయి’ అని సవాలు విసిరారు. నమ్రూద్ ఆగ్రహంతో ఊగిపోతూ, ‘ఇతణ్ణి భగభగమండే అగ్నిగుండంలో వేసి కాల్చిచంపండి’అని ఆదేశించాడు. క్షణాల్లో రాజాజ్ఞ కార్యరూపం దాల్చింది. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అగ్నికీలల్లో ఆయన్ని విసిరేశారు. కాని దేవుని ఆజ్ఞతో అగ్ని తన కాల్చే గుణాన్ని కోల్పోయి, పూల పానుపుగా మారింది. ఇబ్రాహీం ప్రవక్త సురక్షితంగా బయట పడ్డారు. తరువాత ఇబ్రాహీం ప్రవక్త స్వదేశాన్ని విడిచి పెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. సత్య ధర్మాన్ని, దేవుని ఏకత్వాన్ని బోధిస్తూ, మూఢనమ్మకాలు, సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ వివిధ ప్రాంతాలు పర్యటించారు. ఈక్రమంలో ఆయన అనేక కష్టనష్టాలు, పరీక్షలు ఎదుర్కొన్నారు. దైవాజ్ఞ మేరకు భార్యాబిడ్డల్ని నిర్జన ఎడారి ప్రాంతంలో వదిలేయడం, కన్నకొడుకును దైవమార్గంలో త్యాగం చేయడం మానవ జాతి చరిత్రలో చిరస్మరణీయ పరిణామాలు. దైవాదేశ పాలనలో తన సమస్తాన్నీ సమర్పించిన త్యాగధనుడు కనుకనే ఐదువేల సంవత్సరాలు గడిచినా చరిత్ర ఆయన్ని స్మరించు కుంటోంది.ఆయన నిలిచిన ప్రదేశం, నిర్మించిన దైవగహం, జమ్ జమ్ జలం, సఫా, మర్వాల సయీ, ఆయన, ఆయన కుటుంబం నడయాడిన నేల, వారి ఒక్కోఆచరణ ప్రళయకాలం వరకూ, సందర్శనీయ, స్మరణీయ ఆచరణలుగా దేవుడు నిర్ధారించాడు. ఈ అన్నిటికీ అసలు ప్రేరణ దైవ సంతోషం, శాశ్వత సాఫల్యం. ఎవరికైనా అంతకన్నా కావలసింది ఇంకేముంటుంది? సత్యంకోసం, ధర్మంకోసం, ధర్మసంస్థాపనకోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ప్రకటించిన ఆమహనీయుల జీవితం మనకూ ఆదర్శం కావాలి. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
త్యాగాలపండుగ బక్రీద్
అల్లాహ్ విశ్వాసులకు రెండు పర్వదినాలు ప్రసాదించాడు. ఒకటి ఈదుల్ ఫిత్ర్, మరొకటి ఈదుల్ అజ్ హా. వీటినే రమజాన్, బక్రీద్ లని వ్యవహరిస్తారు. రమజాన్ తర్వాత వచ్చేదే బక్రీద్. ఇది జిల్ హజ్జ్ మాసంలో వస్తుంది. ఈ నెలలోని మొదటి పదిరోజులు విశ్వవ్యాప్త విశ్వాసులు ఆయన ఘనతను, గొప్పతనాన్ని కీర్తించడానికి, సముచితరీతిలో ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకోవడానికి బక్రీద్ రోజున ఈద్గాహ్కు చేరుకుని వేనోళ్ళా స్తుతిస్తారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. పుణ్యకార్యాలు ఆచరించి అత్యంత శ్రేష్ఠ సామగ్రి అయిన ‘తఖ్వా’(దైవభీతి)ను హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి. జీవితం సార్థకం కావాలంటే పరమ ప్రభువు ఆదేశాలను తు.చ. తప్పక పాటించాలి. అందుకే పరమ దయాళువైన అల్లాహ్ మనకోసం కొన్ని వసంత రుతువుల్ని ప్రసాదించాడు.అందులో ఒకటి రమజాన్ కాగా, రెండవది బక్రీద్. బక్రీద్ పండుగ జరుపుకునే నెల పేరు ‘జిల్ హజ్జ్’. ఈ నెలలోని మొదటి పది రోజులకు ఒక ప్రత్యేకత, విశిష్ఠత ఉంది. ఈ రోజుల్లో చేసే పుణ్య కార్యాలు అల్లాహ్‌కు అన్నిటికన్నా ఎక్కువ ప్రీతికరమైనవి. అందుకని ఈ మొదటి పది రోజులు కరుణామయుని దయను పొందే నిమిత్తం కష్టపడాలి. వీలయినన్ని ఆరాధనలు చేసి, నఫిల్ ఉపవాసాలు పాటించి, దానధర్మాలు చేసి, పవిత్రఖురాన్ పారాయణం చేసి అల్లాహ్ ప్రీతిని, ప్రసన్నతను పొందే ప్రయత్నం చేయాలి. జిల్ హజ్ పదవ తేదీన జరుపుకొనే బక్రీద్ ఒక అపూర్వమైన పండుగ. హజ్రత్ ఇబ్రాహీమ్, హ.ఇస్మాయీల్ అలైహిముస్సలాంల త్యాగాలను స్మరించుకునే త్యాగోత్సవం. ప్రపంచ విశ్వాసుల పర్వదినం. ఇదొక మహత్తర సందేశం కలిగిన శుభదినం. మనందరి ప్రభువు ఒక్కడే, మనందరి ప్రవక్త ఒక్కరే, మనందరి గ్రంథం ఒక్కటే. మనందరి ధర్మం ఒక్కటే. మనమంతా ఒక్కటే. సమస్త మానవజాతీ ఒక్కటే... అనిఎలుగెత్తి చాటే రోజు. మానవ సహజ దౌర్బల్యాల వల్ల చిన్నా చితకా పాక్షిక విభేదాలు ఉన్నప్పటికీ మనందరి విశ్వాసం కూడా ఒక్కటే అనడానికి ప్రబల తార్కాణం ఈ పండుగ. మౌలిక విశ్వాసం పరంగా ఒక్కటిగానే ఉన్న మనం పాక్షిక పొరపొచ్చాలను విస్మరించి తోటి సోదరుల్ని గుండెలకు హత్తుకోవాల్సిన రోజు. ఈ పర్వదినం మనకిచ్చే మరో సందేశం ఏమిటంటే, సమాజాన్ని కలుపుకుని పోకుండా, సాటి ప్రజల పట్ల ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోకుండా ఏ సంతోషమయినా, ఎంతటి ఆనందమైనా పరిపూర్ణం కాజాలదని. ఏ సంతోష కార్యమైనా సమాజంతో పంచుకోవాలని, కేవలం మన గురించి మాత్రమే కాకుండా సంఘం గురించి, సమాజం గురించి ఆలోచించాలని చెబుతుంది పండుగ. ప్రతి ఒక్కరూ తమస్థాయి, స్తోమతకు తగినట్లు ఈద్ జరుపుకుంటారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు జిల్ హజ్జ్ నెలలో ’హజ్ ’యాత్రకు వెళతారు. అంతటి స్థోమతలేనివారు ఇళ్ళవద్దనే ఖుర్బానీలు ఇస్తారు. అదికూడా లేనివారు రెండు రకతుల నమాజ్ ఆచరించినా దయామయుడైన అల్లాహ్ హజ్, ఖుర్బానీలు ఆచరించిన వారితో సమానంగా పుణ్యఫలం ప్రసాదిస్తాడు. ఆయన తనదాసుల చిత్తశుధ్ధిని, సంకల్పాన్ని మాత్రమే చూస్తాడు. ఆయనకు ధనరాశులు, రక్తమాంసాల అవసరం ఎంతమాత్రంలేదు. కనుక సర్వకాలసర్వావస్థల్లో చిత్తశుద్ధితోకూడిన సత్కర్మలు ఆచరించాలి. పేదసాదల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. పండుగల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో వారిని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఆనందంలో వారినీ భాగస్వాములను చేయాలి. అప్పుడే నిజమైన పండుగ. తన అవసరాలను త్యజించి దైవప్రసన్నతకోసం ఇతరుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వమని చెప్పేదే ఈ త్యాగాల పండుగ. ఈ సందర్భంగా మనం ఖుర్బానీలు ఇస్తాం, నమాజులు చేస్తాం. ఇతరత్రా ఇంకా ఏవో పుణ్యకార్యాలు ఆచరిస్తాం. కాని మనోవాంఛలత్యాగం అన్నిటికన్నా ముఖ్యమన్న విషయాన్ని విస్మరించకూడదు. ఇది నిస్సందేహంగా కష్టంతో కూడుకున్న కార్యమే. కాని, హజ్రత్ ఇబ్రాహీం, ఇస్మాయీల్ గార్ల త్యాగాలను స్మరించుకుంటే ఏమాత్రం కష్టంకాదు. మనం కూడా పరీక్షలు, కష్టాలు, త్యాగాల కఠినమయిన దశలను దాటవలసి ఉంది. ఈ మార్గంలో చేసే ఏ కృషి అయినా, ఏ త్యాగమయినా వృథా పోదు. చరిత్రే దీనికి సాక్ష్యం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
దైవ సహాయం తోడుంటే...
ఒకరైతు తన పొలంలో గోధుమ పంట వేశాడు. పంట ఏపుగా పెరిగింది. ఒక పక్షి ఆ చేలో గూడుకట్టుకొని గుడ్లు పెట్టింది. కొన్నాళ్ళకు పిల్లల్ని పొదిగింది. తల్లిపక్షి పొద్దంతా ఆహారాన్వేషణకు వెళ్ళి సాయంత్రానికి గూటికి చేరేది. తల్లిరాగానే పిల్లలన్నీ దాని రెక్కల కిందికి దూరి ఉదయం నుంచీ జరిగిన విషయాలన్నీ పూసగుచ్చేవి. ఒకరోజు రైతు తన భార్యతో కలసి చేనువద్దకు వచ్చాడు. దంపతులిద్దరూ చేనుచుట్టూ కలియ తిరిగి ‘చేను చక్కగా పెరిగి కోతకొచ్చింది. రేపు కూలీలను తీసుకొచ్చి పంట కోసేద్దాం’ అనుకుంటూ వెళ్ళిపోయారు. ఈ మాటలు విన్న పిల్ల పక్షులకు భయం పట్టుకుంది. రైతు రేపు చేను కోసేస్తే తమ గూడు చెదిరిపోతుందని భీతి చెందాయి. తల్లి రాగానే రెక్కల కిందికి దూరి, ‘అమ్మా.. రైతు రేపు చేను కోసేస్తాడట’ అని తాము విన్న విషయాన్ని తల్లికి చెప్పాయి. తల్లిపక్షి పిల్లలకు ధైర్యం చెబుతూ.. ‘మీరేమీ భయపడకండి. రేపు రైతు ఈ చేను కోయలేడు. నిశ్చింతగా ఉండండి’ అని చెప్పింది. తెల్లవారి రైతు దంపతులు రావడం చూసి పిల్ల పక్షులు గూట్లో నక్కి ఏంచెప్పుకుంటారో అని చెవులు రిక్కించాయి. ‘‘ఈరోజు కూలీలు దొరకలేదు. కాసిన్ని డబ్బులు ఎక్కువైనా రేపు ఎట్టిపరిస్థితుల్లోనూ కోయించాల్సిందే’ అని చెప్పుకొని వెళ్ళిపోయారు. పిల్లపక్షులకు మళ్ళీ భయం పట్టుకుంది. తల్లి రాగానే, ‘రేపు ఎలాగైనా సరే కోయించేస్తాడట. ఎంత ఖర్చయినా పరవాలేదంటున్నాడు’ అని రైతుమాటలు తల్లికి చెప్పాయి పిల్లపక్షులు. తల్లిపక్షి యధాప్రకారం ధైర్యం చెబుతూ, ‘రేపు కూడా కోయలేడు. నిశ్చింతగా ఉండండి’ అన్నది. దీంతో పిల్లపక్షులు స్థిమితపడ్డాయి. మళ్ళీ తెల్లవారి చేనువద్దకొచ్చిన రైతు దంపతులు చుట్టూ కలియ తిరిగి,‘కూలీల కొరత బాగా ఉంది. వాళ్ళతో పెట్టుకుంటే పని జరిగేలా లేదు. ‘ఇన్షా అల్లాహ్’ రేపు మనమే మొదలు పెడదాం.’ అని నిర్ణయించుకొని వెళ్ళిపొయ్యారు.పిల్ల పక్షులు తల్లిరాగానే సంతోషంగా ఎదురేగి రెక్కలకింద దూరి గిలిగింతలు పెడుతూ నవ్వుకోసాగాయి. ‘ఏంటమ్మా ఈరోజు విశేషం’ అని అడిగింది తల్లి. ‘అమ్మా.. ఈరోజు రైతు మళ్ళీ వచ్చి, ‘కూలీలు దొరకడం లేదు, ఇనా ్షఅల్లాహ్ రేపు మనమే మొదలు పెడదాం.’ అనుకుంటూ వెళ్ళిపోయాడు. బీరాలు కాకపోతే ఇంత చేను ఒకరిద్దరే ఎలా కోస్తారమ్మా..’ అన్నాయి పిల్లపక్షులు. ఈ మాటలు విన్న తల్లిపక్షి ‘ఇకమనం మరోగూడు చూసుకోవాల్సిందేనమ్మా’ ఈ చేను రేపు ఉండదిక’అన్నది. పిల్లపక్షులు ఆశ్చర్యపొయ్యాయి. ‘అదేంటమ్మా.. నిన్నటివరకూ అతను కూలీలను పెట్టిచేనుకోయించాలంటే కోయలేడన్నావు. మరి ఈరోజేమిటీ ఒక్కడే కోసేస్తానన్నా బేలగా మాట్లాడుతున్నావు’అని ప్రశ్నించాయి. ‘‘అవును, మీరు గమనించారో లేదో, ఈరోజు అతను ‘ఇన్షా అల్లాహ్ రేపు చేను మనమే కోద్దాం’ అన్నాడని మీరేగా చెబుతున్నారు. ‘ఇన్షా అల్లాహ్’ అనడం వల్ల అతనికి దైవ సహాయం తోడవుతుంది. దైవంపై భరోసాతో ఏపనైనా ప్రారంభిస్తే అది తప్పక నెరవేరుతుంది’ అని చెప్పి పిల్లలతో సహా పక్షి మరో చేనుదిక్కుకు ఎగిరి పోయింది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
శుభాల సంరంభం షురూ!
పవిత్ర రమజాన్ అత్యంత శుభప్రదమైన నెల. శుభాల సిరులు వర్షించే వరాల వసంతం. మానవుల మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి, జీవనసాఫల్యానికి అవసరమైన అనేక విషయాలు దీనితో ముడిపడి ఉన్నాయి. ఈనెలలోనే పవిత్రఖురాన్ అవతరించింది. ఇది మొత్తం మానవాళికీ మార్గదర్శకజ్యోతి. ఈనెలలోనే ‘రోజా’ వ్రతం విధిగా నిర్ణయించబడింది. ఈనెలలోనే వెయ్యినెలలకన్నా విలువైన రాత్రి అనిచెప్పబడిన ‘లైలతుల్ ఖద్ర్/షబెఖద్ర్’ ఉంది. ఈ నెలలోచేసే ఒక్కోమంచిపనికి అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుంది. ఒకవిధిని ఆచరిస్తే 70 విధులు ఆచరించినదానికి సమానంగా పుణ్యం లభిస్తుంది. విధికానటువంటి ఒక చిన్న సత్కార్యం చేస్తే, విధిగా చేసే సత్కార్యాలతోసమానమైన పుణ్యఫలం దొరుకుతుంది. సహజంగా ఈనెలలో అందరూ సత్కార్యాలవైపు అధికంగా మొగ్గుచూపుతారు. దుష్కార్యాలు గణనీయంగా తగ్గుముఖం పడతాయి. సమాజంలో ఒక మంచిమార్పు కనబడుతుంది. ఫిత్రా ఆదేశాలు కూడా ఈనెలలోనే అవతరించాయి.’ఫిత్రా’ అన్నది పేదసాదల హక్కు. దీనివల్ల వారికి కాస్తంత ఊరటలభిస్తుంది. ఎక్కువశాతం మంది జకాత్ కూడా ఈనెలలోనే చెల్లిస్తారు. ఇది కూడా పేదసాదల ఆర్థిక అవసరాలు తీర్చడంలో గణనీయంగా తోడ్పడుతుంది. తరావీహ్ నమాజులు కూడా ఈనెలలోనే ఆచరించబడతాయి. అదనపు పుణ్యం మూటకట్టుకోడానికి ఇదొక సువర్ణ అవకాశం. ఈ నెలలో చిత్తశుధ్ధితో రోజా (ఉపవాసదీక్ష) పాటించేవారి గత అపరాధాలన్నీ మన్నించబడతాయి. ఉపవాసులు ‘రయ్యాన్’ అనే ప్రత్యేక ద్వారం గుండా స్వర్గప్రవేశం చేస్తారు. ఈవిధమైన అనేక ప్రత్యేకతలు ఉండబట్టే దేవుడు ఈ నెలను బహుళ ప్రయోజనకారిగా తీర్చిదిద్దాడు. మానవుల ఇహపర ప్రయోజనాలకు, సాఫల్యానికి ఇతోధికంగా దోహదపడే నెల ఈ రమజాన్ నెల.కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోడానికి శక్తివంచనలేని కృషిచెయ్యాలి. అలుపెరుగని ప్రయత్నం ఆరంభించాలి.నిజానికి రోజా వ్రతమన్నది కేవలం ముహమ్మద్ ప్రవక్త (స) వారి అనుచర సముదాయానికి మాత్రమే పరిమితమైన ఆరాధనకాదు. సార్వజనీనమైన, సార్వకాలికమైన ఆరాధన ఇది. దీనికి చాలా ఘనమైన ప్రాచీన, సామాజిక నేపథ్యముంది. అనాదిగా ఇది అన్ని కాలాల్లో, అన్ని సమాజాల్లో చెలామణిలో ఉన్నట్లు దైవగ్రంథం ద్వారా మనకు తెలుస్తోంది. ఖురాన్ (2–183) – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
బీదరాలికి పురుడుపోసిన మహారాణి
ఇస్లాం వెలుగు రేయింబవళ్ళు ప్రజాసంక్షేమం కోసమే పరితపించిన పాలకుల్లో ఖలీఫా హజ్రత్ ఉమర్ (ర) అగ్రగణ్యులు. చక్రవర్తిగా రాజ్యంలో ఏమూల ఏం జరుగుతోందో ఇంట్లోనే కూర్చొని తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ ఖలీఫా ఉమర్ ఒకరిమీద ఆధారపడలేదు. మారువేషంలో రాజ్యంలోని వివిధ ప్రాంతాలను సందర్శించడం, ప్రజల కష్టసుఖాలు స్వయంగా తెలుసుకోవడం ఆయనకు అలవాటు. ఒకసారి ఖలీఫా హ.ఉమర్ మారువేషం ధరించి వివిధప్రాంతాలను సందర్శిస్తూ ఓ మారుమూల పల్లెకు చేరుకున్నారు. అప్పుడు దాదాపు అర్ధరాత్రి కావస్తోంది. ఊరి చివరన విసిరేసినట్లున్న ఓ ఇంట్లో గుడ్డిదీపం మిణుకుమిణుకుమంటోంది. ఖలీఫా ఉమర్ ఆ ఇంటివద్దకు చేరుకున్నారు. ఇంట్లోంచి బాధాతప్త మూలుగులు వినిపిస్తున్నాయి. ఇంటిముందు ఓవ్యక్తి దిక్కుతోచనివాడిలా నిస్సహాయంగా అటుఇటూ పచార్లుచేస్తున్నాడు. ఖలీఫా ఉమర్ కాసేపు అక్కడే నిలబడి ఇదంతా గమనించారు. అంతకంతకూ స్త్రీ మూలుగులు అధికమవుతున్నాయి. హ..ఉమర్ ఇక ఉండబట్టలేక ఆవ్యక్తిని సమీపించారు. విషయం ఏమిటని ఆరాతీశారు. అప్పుడావ్యక్తి, తన భార్య నిండునెలల గర్భిణి అని, పురుటి నొప్పులతో బాధపడుతోందని, ఇంట్లో తనూ తనభార్య తప్ప మరెవరూలేరని, ఈ అర్ధరాత్రివేళ ఏంచెయ్యాలో, ఎటువెళ్ళాలో దిక్కుతోచడం లేదని ఆవేదన, ఆందోళన చెందాడు. అంతా సావధానంగా విన్నఖలీఫా, ‘‘సరే నువ్వేమీ కంగారుపడకు, నేనిప్పుడే వచ్చేస్తాను’’ అంటూ ఆఘమేఘాలపై ఇంటికి చేరుకున్నారు. శ్రీమతికి విషయమంతా వివరించారు. వెంటనే మహారాణి కాన్పుకు కావలసిన అన్ని వస్తువులూ సర్దుకొని భర్తవెంట బయలుదేరారు. కొద్దిసేపట్లోనే భార్యాభర్తలు ఆ ఇంటికి చేరుకున్నారు. ఖలీఫా సతీమణి తానొక చక్రవర్తి భార్యనన్న ఆలోచనే లేకుండా, కేవలం సాటి మహిళగా ఆమెకు అన్నివిధాలా సపర్యలూ చేశారు. మంత్రసాని అవతారమెత్తి ఆ బీదరాలికి పురుడు పోశారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా సుఖప్రసవం జరిగింది. మహారాణి పురుడుపోసే పనిలో ఉంటే, ఖలీఫా పొయ్యి రాజెయ్యడం, నీళ్ళు వేడిచేయడం లాంటి సహాయక పనుల్లో పాలుపంచుకున్నారు. అంతలో లోపలినుండి, ‘మహారాజా! మీ మిత్రుడికి పండంటి మగబిడ్డ కలిగాడు’ అంటూ శుభవార్త అందజేశారు మహారాణి. కొడుకు పుట్టాడన్న సంతోషంతోపాటు, ‘మహరాజా’ అని తమకు సహాయం చేస్తున్న వ్యక్తిని సంబోధించడంతో అతడు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాడు. ఆవ్యక్తి తన చెవుల్ని తానేlనమ్మలేకపొయ్యాడు. అంటే ఇప్పటివరకూ తమకు సపర్యలు చేసింది, తనభార్యకు పురుడుపోసింది స్వయంగా ఖలీఫా దంపతులని తెలియడంతో వారి ఆనందానికి హద్దుల్లేకుండా పొయ్యాయి. కృతజ్ఞతాభావంతో హృదయం పులకించిపోయింది.ఈ విధంగా ఆనాటి పాలకులు ఇలాంటి ఆదర్శాలను నెలకొల్పి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపొయ్యారు. ఇలాంటి అనేక సుగుణాలరీత్యానే జాతిపిత మహాత్మాగాంధీ ఖలీఫా ఉమర్‌ని ‘ఉమర్ ది గ్రేట్’ అని సంబోధించారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
మూగజీవులకూ హక్కులుంటాయి!
సృష్టిలోని అన్ని జీవరాసులకు సమాన హక్కులు ఉన్నాయన్న యథార్థాన్ని గ్రహించి, దానికనుగుణంగా నడుచుకుంటేనే సమాజ మనుగడ శాంతియుతంగా, ధర్మబధ్ధంగా ఉంటుంది. ఈ హక్కుల ఉల్లంఘన జరిగితే అశాంతి, అరాచకం, ఇహలోక పరాభవం, పరలోక వైఫల్యం తప్పవు. ముహమ్మద్ ప్రవక్త (స) ఇస్లామ్ వెలుగులో జీవరాసుల హక్కులను గురించి దేవునికి భయపడాలని హితవు చెప్పారు. ఒకసారి ముహమ్మద్ ప్రవక్త(స) ఒక ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటి పెరట్లో ఒక ఒంటె గుంజకు కట్టేసి ఉంది. ప్రవక్తవారిని చూడగానే అది బోరుబోరున అరిచింది. దాని కళ్ళవెంట అశృవులు ధారగా కారుతున్నాయి. ఆ బాధను చూసి కారుణ్యమూర్తి దాని దగ్గరికి వెళ్ళి, ప్రేమగా దాని దేహాన్ని నిమిరారు. ఆత్మీయమైన ఆ కరస్పర్శతో ఆ ఒంటె శాంతించింది. వెంటనే దాని యజమానిని పిలిచి, ‘‘ఈ మూగజీవిని గురించి నువ్వు దేవుడికి భయపడవా? దీన్ని నీసంరక్షణలో ఇచ్చిన దేవుడంటే నీకు లెక్కలేదా? కడుపునిండా మేత, నీరు, తగినంత విశ్రాంతి ఈ మూగజీవుల హక్కు. నువ్వు ఆ హక్కును కాలరాసి సరైన మేత పెట్టకుండా, విశ్రాంతి కూడా లేకుండా, దానితో శక్తికి మించిన పని చేయించుకుంటున్నావు. ఈ విధంగా నువ్వు దీని హక్కును హరిస్తున్నందుకు దైవానికి సమాధానం చెప్పుకోవాలి జాగ్రత్త!’’ అని తీవ్రస్వరంతో మందలించారు ప్రవక్త. నోరులేని జీవుల మేత, నీరు, విశ్రాంతి విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకూడదు. వాటి శక్తికి మించిన బరువులు లాగించడం, దుక్కులు దున్నడం చేయకూడదు. దున్నేటప్పుడు మేత, నీరు, విశ్రాంతి లాంటి ప్రాథమిక అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఒకసారి ప్రవక్త తన సహచరులతో కలిసి ప్రయాణిస్తున్నారు. మార్గమధ్యంలో పొదల మాటున ఓ చిన్నపక్షి ఆహారాన్వేషణలో తనపిల్లలతో సంచరిస్తోంది. సహచరులు ఆపిల్లల్ని పట్టుకున్నారు. అప్పుడా తల్లిపక్షి తన పిల్లలకోసం పదేపదే వారి తలలపైన్నే చక్కర్లు కొట్టసాగింది. ఇది చూసిన ప్రవక్త మహనీయులు, పాపం ఆ పసిపిల్లల్ని పట్టుకొని ఆ తల్లినెందుకు బాధపెడుతున్నారు. ముందు వాటిని వదిలేయండి. అని తీవ్రస్వరంతో మందలించారు. మానవ హక్కులతో పాటు విశ్వంలోని సమస్తజీవుల హక్కులను గుర్తించి నెరవేరిస్తేనే సృష్టిలో మానవ మనుగడ ప్రశాంతంగా సాగిపోతుంది. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
దాహం తీర్చడమూ పుణ్యకార్యమే
ఏ ప్రాణికైనా గాలి తరువాత వెంటనే కావలసింది నీరు. అందుకే దప్పిగొన్నవారి దాహం తీర్చడం ఎంతోగొప్ప పుణ్యకార్యమని ధర్మగ్రంథాలు చెబుతున్నాయి. మనుషులే కాదు మూగప్రాణులు సైతం దాహంతో అలమటిస్తుంటాయి. దప్పిగొన్నప్రాణుల దాహం తీర్చడం ఎంతగొప్ప పుణ్యకార్యమో ప్రవక్త మహనీయులు చెప్పిన ఓ సంఘటనను మననం చేసుకుందాం. ఒకవ్యక్తి ఒక ఊరినుండి మరోఊరికి ప్రయాణం కట్టాడు. అది మండు వేసవికాలం. కాస్త దూరప్రయాణం, అదీ కాలినడకన కావడంతో బాగా అలసిపొయ్యాడు. ఆకలి ఏమోగాని, ముందు దాహంతో నాలుక పిడచ కట్టుకుపోతోంది. ఏం చేయాలీ అని ఆలోచిస్తూ భారంగా ప్రయాణం కొనసాగిస్తున్నాడు. అడుగు ముందుకు సాగడంలేదు, దప్పిక తీరే దారీ కానరావడంలేదు. ప్రాణం గొంతులోకొస్తున్నపరిస్థితి. అంతలో అదృష్టం బాగుండి అతనికో బావి కనిపించింది. దాంతో అతనికి పోయినప్రాణం తిరిగొచ్చినంత ఆనందం కలిగింది. కాని అది ఎంతో సేపు నిలవలేదు. ఎందుకంటే ఆ బావి దగ్గర నీళ్ళు చేదడానికి ఎటువంటి సాధనమూ లేదు. నీళ్ళు చూస్తే ఎక్కడో పాతాళంలో ఉన్నాయి. ప్రాణం దక్కాలంటే గొంతుతడవాలి. లాభం లేదనుకొని ధైర్యం చేసి బావిలోకి దిగాడు. కడుపారా నీళ్ళుతాగి బతుకు జీవుడా అనుకుంటూ ఎలాగో బయట పడ్డాడు. పైకి రాగానే బావి అంచున ఓ కుక్క దాహంతో అల్లాడిపోతోంది. మూరెడుపొడవు నాలుక బయటికి చాపి భయంకరంగా వగరుస్తోంది. కనీసం బావి అంచున బురదైనా ఉందేమోనని నాకడానికి ప్రయత్నిస్తోంది. ఒడ్డుకు చేరిన మనిషి, దీనత్వం నిండిన దాని చూపులు చూసి చలించిపొయ్యాడు. కొన్ని నిమిషాల ముందు తన పరిస్థితి ఎలా ఉందో బహుశా ఇప్పుడు ఈ శునకం పరిస్థితి కూడా అలాగే ఉండి ఉంటుందన్న ఊహ అతని మనసులోకి రాగానే ఒక్కసారిగా ఆమూగజీవి పట్ల ప్రేమ, సానుభూతి పెల్లుబికాయి. ఎలాగైనా దాని దాహం తీర్చాలని నిశ్చయించుకొని, మళ్ళీ శక్తినంతా కూడదీసుకొని బావిలోకి దిగాడు. కాని నీళ్ళుపైకి తెచ్చేదెలా? మెరుపులాంటి ఆలోచనతో తన కాలి మేజోళ్ళను తడిపి నోటితో కరిచి పట్టుకొని పైకెక్కాడు. ఆనీటితో శునకానికి దాహం తీర్చాడు. ఒకవైపు ప్రయాణ బడలిక, మరోవైపు గమ్యంచేరుకోవాలన్న ఆతృత, ఇంకోవైపు దాహాకారంతో ఓపికలేని పరిస్థితి. ఇంతటి మానసిక గందరగోళంలోనూ ఓ శునకానికి దాహం తీర్చాలనుకోవడం ఆ మనిషి లోని ప్రేమ, కరుణ, మానవీయ సుగుణాలకు నిదర్శనం. ఈ కారుణ్య సుగుణమే దైవానికి అమితంగా నచ్చింది. దైవకారుణ్యానికి చేరువచేసింది. ఫలితంగా ఆవ్యక్తి దేవుని మన్నింపుకు, ఆయన ప్రేమకు పాత్రుడు కాగలిగాడు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
భూతదయ
దైవం దయామయుడు, కారుణ్య నిధి. నిజానికి కారుణ్యమన్నది దేవుని ప్రత్యేక గుణం.ఏ మనిషిలో ఏ మేరకు ఈసుగుణాలు ఉంటాయో ఆమేరకు వారు శుభకరులు, దైవకారుణ్యానికి అర్హులు. ఇలాంటి సుగుణాలలో కొంతభాగాన్ని పుణికిపుచ్చుకున్న ఓ వ్యక్తి జీవితం ఎలా సఫలమైందో చూద్దాం. పూర్వం గజని అనే గ్రామంలో ఒక వ్వక్తి ఉండేవాడు. అతని పేరు సుబుక్తగీన్. మంచివాడు. పేదవాడైనప్పటికీ ఆత్మాభిమానం కలిగిన అభిమానధనుడు. ఆ కారణంగానే జాతి అతన్ని తమ నాయకుడిగా ఎన్నుకుంది. వేట , విహార యాత్రలంటే అతనికి చాలా ఇష్టం. అలవాటు ప్రకారం ఒకనాటి సాయంత్రం అతడు వేటకు బయలు దేరాడు. అడవిలో చాలా దూరం వెళ్ళిన తరువాత ఒక జింక కనిపించింది. దాని వెంట దాని పిల్లకూడా ఉంది. జింకను చూడగానే సుబుక్తగీన్ కళ్ళుమెరిశాయి. ఉత్సాహంగా దానివెంట పడ్డాడు. తల్లీ పిల్ల అడవిలో అడ్డదిడ్డంగా ప్రాణ భయంతో పరుగులంకించుకున్నాయి. అతను కూడా వాటివెంట పడి తరమడం మొదలు పెట్టాడు. పాపం! కొద్దిసేపు ఉరుకులు పరుగుల తరువాత పిల్లజింక బాగా అలసిపోయి వేటగాడి చేతికి చిక్కింది. సుబుక్తగీన్ దాన్ని పట్టుకొని వెనుదిరిగాడు. మాతృ ప్రేమకు జాతి బేధాలేముంటాయి. తల్లి తల్లే కదా..! ఎంత జంతువైతే మాత్రం మాతహదయం ఊరుకుంటుందా..? బిడ్డకోసం రోదిస్తూసుబుక్తగీన్ వెనకాలే వస్తోందా తల్లి జింక. అతను వెనుదిరిగి చూశాడు. కొద్దిదూరంలోనే ఆగిపోయింది జింక. కాని దీనత్వం నిండినదాని చూపులు బిడ్డపైనే కేంద్రీకతమయ్యాయి. తన కూనకోసం ఆ మాతృహృదయం తల్లడిల్లిపోతోంది. భయం, తెగింపు, ప్రేమ మమకారం కలగలిసిన మానసిక ఆందోళనతో ఆ తల్లి జింక మాతృహృదయం ఎంతటి వేదన అనుభవిస్తుందో మాతృహృదయంతో ఆలోచిస్తేతప్ప అర్ధం కాదు. స్వతహాగా మంచి మనసు కల వాడైన సుబుక్తగీన్ క్షణ కాలం ఆగి ఆ తల్లి జింక మూగవేదనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. మనసులో జాలి పెల్లుబికింది. కరుణ కట్టలు తెంచుకుంది. కళ్ళు చెమర్చాయి. వెంటనే తన వద్దనున్న జింక పిల్లను వదిలిపెట్టాడు. అంతులేని ఆనందంతో జింక పిల్ల గెంతుతూ తల్లిఒడి చేరింది. తల్లిజింక కళ్ళనుండి ఆనంద బాష్పాలు రాలుతుండగా ప్రేమగా పసికూనను నాకుతూ బిడ్డతో కలిసి అడవిలో అదృశ్యమైపోయింది. సుబుక్తగీన్ అవి వెళ్ళినవైపే తదేకంగా చూస్తూ, తప్తిగా ఓ నిట్టూర్పు విడిచి ఇంటిదారి పట్టాడు. ఆరోజు రాత్రి సుబుక్తగీన్ ఒక కల గన్నాడు. ముహమ్మద్ ప్రవక్త(స) కలలో కనిపించి, ‘పసికూనపై ఆశలు వదులుకొని నిస్సహాయంగా, దీనంగా, మూగగా విలపిస్తున్న మూగజీవిపై నువ్వు చూపిన దయా దాక్షిణ్యాలు దైవానికి ఎంతగానో నచ్చాయి. ముందు ముందు నీకు రాజయోగం లభించనుంది. ఎప్పుడూ ఇదే వైఖరి కలిగి ఉండు. సాటి మానవుల పట్ల, మూగప్రాణుల పట్ల కరుణతో వ్యవహరించు’. అని చెప్పారు. తరువాత కొన్నాళ్ళకు సుబుక్తగీన్ కల ఫలించింది. అనుకున్నట్లుగానే అతను రాజయ్యాడు. తనజీవితంలో జరిగిన ఈ సంఘటనను జీవితాంతం గుర్తుంచుకొని, జనసంక్షేమమే ధ్యేయంగా మంచి పరిపాలన అందించి గొప్ప పేరుప్రఖ్యాతులు గడించాడు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
కాలమే సాక్షి... దేవుడు ప్రేమిస్తాడు!
నయా ఔర్ నేక్ కాలం అమూల్యమైనది. అది ఎవరి కోసమూ ఆగదు. పరుగు దాని నైజం. నిరంతరం అది పరుగెడుతూనే ఉంటుంది. దాని వెనుక పరుగెత్తలేని వారు మరుగున పడిపోతారు. అనంతమైన ఈ కాల ప్రవాహంలో మలుపులే తప్ప మజిలీలు లేవు. కాలగతిలో కేలండర్లు మారుతుంటాయి. కొత్త వత్సరాలు వస్తూ ఉంటాయి. వివిధ దేశాల్లో, వివిధ మతాల్లో రకరకాల పేర్లతో ఇవి ప్రాచుర్యం పొందాయి. తెలుగునాట ‘ఉగాది’తో కొత్తసంవత్సరం ప్రారంభమైనట్లుగానే, ఇస్లామీయ కేలండరు ప్రకారం, హి. శ. మొదటి మాసం ‘ముహర్రమ్’తో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగే క్రీస్తుశకంలో ఆంగ్ల సంవత్సరం జనవరితో ఆరంభమవుతుంది. గతానికి వీడ్కోలు పలికి, కొత్త వత్సరానికి స్వాగతం పలికే సమయంలో ఎవరైనా ఆనందానుభూతులకు లోను కావడం సహజం. సంతోషం మానవ నైజంలో ఉన్న సహజ గుణం. అయితే, ఆనంద పారవశ్యంలో హద్దుల్ని అతిక్రమించి, నిషిద్ధకార్యాలకు పాల్పడడం ధార్మికంగానే కాక సామాజికంగా, నైతికంగానూ నేరమే. దీనికి దేవుని ముందు జవాబు చెప్పుకోవాలి. అందుకే కాలాన్ని సాక్షిగా పెట్టి అనేక యథార్థాలు చెప్పాడు దైవం. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే, కాలం చెప్పిన అనేక వాస్తవాలు కళ్ళకు కనిపిస్తాయి. కాలం విలువను గుర్తించినవారు మాత్రమే వాటినుండి గుణపాఠం నేర్చుకుంటారు. అలాకాకుండా గడించిన కాలాన్ని గాలి కొదిలేసి, కొత్త సంవత్సరంలో చైతన్యరహిత చర్యలతో, అర్థంపర్థం లేని కార్యకలాపాలతో కొత్త కాలాన్ని ప్రారంభిస్తే, ప్రయోజనం శూన్యం. రాజులు, రారాజులు, మాన్యులు, సామాన్యులు, పండితులు, పామరులు – అంతా కాలగర్భంలో కలిసిపోయినవారే, కలిసిపోవలసినవారే. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేటప్పుడు ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. గతం నుండి గుణపాఠం గ్రహిస్తూ, భవిష్యత్ కాలానికి స్వాగతం పలకాలి. నిస్సందేహంగా కొత్త సంవత్సరాన్ని సంతోషంగా స్వాగతించాల్సిందే. కానీ మందు, చిందు – ఇతరత్రా అసభ్య, నిషిద్ధకార్యాలతో నూతన సంవత్సరాన్ని ఆహ్వానించడం ఎంతవరకు సమంజసం అన్న స్పృహ జాగృతం కావాలి. లక్ష్యరహితంగా భవిష్యత్తును ప్రారంభిస్తే మిగిలేది నిరాశే. అందుకని గడచిన కాలంలో ఏం చేశామన్నది కొత్త సంవత్సర ప్రారంభాన ఆత్మపరిశీలన చేసుకోవాలి. మంచిపనులు చేసి ఉంటే ఈ కొత్త సంవత్సరంలో అవి ఇంకా ఇంకా ఎక్కువగా చెయ్యాలన్న దృఢసంకల్పం చేసుకోవాలి. ఏమైనా తప్పులు, పొరపాట్లు, పాపాలు జరిగి ఉంటే చిత్తశుద్ధితో పశ్చాత్తాపం చెందుతూ, ఇక ముందు వాటన్నిటినీ కచ్చితంగా విసర్జిస్తామని ప్రతిన బూనాలి. ఇక నుండి ఓ నూతన, మంచి (నయా ఔర్ నేక్) శకానికి నాంది అన్న ఆత్మవిశ్వాసం తొణికిసలాడాలి. చేసిన పాపాల పట్ల సిగ్గుపడి, పశ్చాత్తాపం చెంది, భవిష్యత్తులో వాటి జోలికి పోనని ప్రతిన బూనినవారిని దేవుడు ప్రేమిస్తాడు. వారి పాపాల్ని క్షమిస్తాడు. జీవితం చాలా చిన్నది. ఎవరి జీవితం ఎప్పుడు సమాప్తమో ఎవరికీ తెలియదు. కనుక హద్దుల్ని అతిక్రమించకుండా, విలువలతో కూడిన జీవితం గడపడానికి శాయశక్తులా ప్రయత్నించాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలతో.. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
వివేకాన్ని ఉపయోగించాలి
వెలుగు బాట మంచిని, మానవత్వాన్ని బోధించడమే అన్ని మతాలు చేయవలసిన పని. ద్వేషభావాన్ని నూరిపోసే మతాలు అసలు మతాలేకావు. ఇతరులను, ఇతర మతధర్మాలను ద్వేషించేవి, దూషించేవి, మతం అనిపించుకునే అర్హతను కలిగి ఉండవు. నాస్తికుల మాటల్లో చెప్పాలంటే, అలాంటి మతాలు నిజంగా మత్తుమందుతో సమానం. కాదు ఇంకా అంతకన్నా ఎక్కువే. నిన్ను వలె నీపొరుగు వారిని ప్రేమించమన్నారు ఏసుక్రీస్తు. సర్వేజనా సుఖినోభవంతు అంటుంది హిందూ మతం. ‘నువ్వు నీకోసం ఏ స్థితిని కోరుకుంటావో, నీతోటి వారి కోసం కూడా అలాంటి స్థితినే కోరుకో’మన్నారు మహమ్మద్ ప్రవక్త (స). సమస్త మానవాళీ పరస్పరం సోదరులే. అందరినీ ప్రేమించండి. పరుల ధన, మాన, ప్రాణాలకు హాని తలపెట్టకండి. అది నిషిద్ధం, అది పాపం, అది నరకం అంటోంది ఇస్లాం ధర్మం. కనుక పరస్పర అవగాహన చాలా ముఖ్యం. అందరూ నిష్పక్షపాతంగా ఒకరి మత ధర్మాలను ఒకరు అధ్యయనం చెయ్యాలి. అవగాహన పంచుకోవాలి. మత ధర్మాల్లో చెడుకు అవకాశమే ఉండదు కాబట్టి అందులోని మంచిని గ్రహించాలి. దాన్ని స్వీకరించాలి. ఒకవేళ ఎందులోనైనా వైర, విద్వేష బోధనాలున్నట్లయితే అది మతం కాదని గ్రహించాలి. వెంటనే దాన్ని విసర్జించాలి. అంతేగాని దాన్ని అనుసరించకూడదు. స్వార్థ, మత ఛాందస బోధకుల మాయమాటలకు లొంగకుండా ఉండేందుకు సైతం అధ్యయనం అవసరమవుతుంది. గుడ్డిగా ఎవరి మాటలూ వినకూడదు. దైవం మనకు ప్రసాదించిన వివేకం, విచక్షణా జ్ఞానాన్ని వినియోగించి ఆలోచించాలి. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు రగల్చడానికి, సామరస్య వాతావరణాన్ని ఛిన్నాభిన్నం చేయడానికి, సమాజాన్ని అల్లకల్లోలానికి గురిచేసి, అశాంతిని సృష్టించడానికి కొన్ని శక్తులు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాయి. అలాంటి శక్తుల ఉచ్చులో పడకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. అన్ని సత్కార్యాల్లో అన్ని వర్గాల ప్రజలు పరస్పరం సహకరించుకోవాలి. ఈ విషయాన్ని పవిత్ర ఖురాన్ కూడా ఇలా చెబుతుంది. ‘మంచికి, దైవభక్తికి సంబంధించిన పనుల్లో అందరితోనూ సహకరించండి. పాపకార్యాల్లో అత్యాచారాల్లో ఎవ్వరితో సహకరించకండి, దైవానికి భయపడండి, దైవభక్తి పరాయణతకు ఇది నిదర్శనం’ (పవిత్ర ఖురాన్) - మహమ్మద్ ఉస్మాన్ ఖాన్