
మూగజీవులకూ హక్కులుంటాయి!
సృష్టిలోని అన్ని జీవరాసులకు సమాన హక్కులు ఉన్నాయన్న యథార్థాన్ని గ్రహించి, దానికనుగుణంగా నడుచుకుంటేనే సమాజ మనుగడ శాంతియుతంగా, ధర్మబధ్ధంగా ఉంటుంది. ఈ హక్కుల ఉల్లంఘన జరిగితే అశాంతి, అరాచకం, ఇహలోక పరాభవం, పరలోక వైఫల్యం తప్పవు. ముహమ్మద్ ప్రవక్త (స) ఇస్లామ్ వెలుగులో జీవరాసుల హక్కులను గురించి దేవునికి భయపడాలని హితవు చెప్పారు.
ఒకసారి ముహమ్మద్ ప్రవక్త(స) ఒక ఇంటికి వెళ్ళారు. ఆ ఇంటి పెరట్లో ఒక ఒంటె గుంజకు కట్టేసి ఉంది. ప్రవక్తవారిని చూడగానే అది బోరుబోరున అరిచింది. దాని కళ్ళవెంట అశృవులు ధారగా కారుతున్నాయి. ఆ బాధను చూసి కారుణ్యమూర్తి దాని దగ్గరికి వెళ్ళి, ప్రేమగా దాని దేహాన్ని నిమిరారు. ఆత్మీయమైన ఆ కరస్పర్శతో ఆ ఒంటె శాంతించింది.
వెంటనే దాని యజమానిని పిలిచి, ‘‘ఈ మూగజీవిని గురించి నువ్వు దేవుడికి భయపడవా? దీన్ని నీసంరక్షణలో ఇచ్చిన దేవుడంటే నీకు లెక్కలేదా? కడుపునిండా మేత, నీరు, తగినంత విశ్రాంతి ఈ మూగజీవుల హక్కు. నువ్వు ఆ హక్కును కాలరాసి సరైన మేత పెట్టకుండా, విశ్రాంతి కూడా లేకుండా, దానితో శక్తికి మించిన పని చేయించుకుంటున్నావు. ఈ విధంగా నువ్వు దీని హక్కును హరిస్తున్నందుకు దైవానికి సమాధానం చెప్పుకోవాలి జాగ్రత్త!’’ అని తీవ్రస్వరంతో మందలించారు ప్రవక్త.
నోరులేని జీవుల మేత, నీరు, విశ్రాంతి విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చెయ్యకూడదు. వాటి శక్తికి మించిన బరువులు లాగించడం, దుక్కులు దున్నడం చేయకూడదు. దున్నేటప్పుడు మేత, నీరు, విశ్రాంతి లాంటి ప్రాథమిక అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఒకసారి ప్రవక్త తన సహచరులతో కలిసి ప్రయాణిస్తున్నారు.
మార్గమధ్యంలో పొదల మాటున ఓ చిన్నపక్షి ఆహారాన్వేషణలో తనపిల్లలతో సంచరిస్తోంది. సహచరులు ఆపిల్లల్ని పట్టుకున్నారు. అప్పుడా తల్లిపక్షి తన పిల్లలకోసం పదేపదే వారి తలలపైన్నే చక్కర్లు కొట్టసాగింది. ఇది చూసిన ప్రవక్త మహనీయులు, పాపం ఆ పసిపిల్లల్ని పట్టుకొని ఆ తల్లినెందుకు బాధపెడుతున్నారు. ముందు వాటిని వదిలేయండి. అని తీవ్రస్వరంతో మందలించారు. మానవ హక్కులతో పాటు విశ్వంలోని సమస్తజీవుల హక్కులను గుర్తించి నెరవేరిస్తేనే సృష్టిలో మానవ మనుగడ ప్రశాంతంగా సాగిపోతుంది.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్