భూతదయ
దైవం దయామయుడు, కారుణ్య నిధి. నిజానికి కారుణ్యమన్నది దేవుని ప్రత్యేక గుణం.ఏ మనిషిలో ఏ మేరకు ఈసుగుణాలు ఉంటాయో ఆమేరకు వారు శుభకరులు, దైవకారుణ్యానికి అర్హులు. ఇలాంటి సుగుణాలలో కొంతభాగాన్ని పుణికిపుచ్చుకున్న ఓ వ్యక్తి జీవితం ఎలా సఫలమైందో చూద్దాం.
పూర్వం గజని అనే గ్రామంలో ఒక వ్వక్తి ఉండేవాడు. అతని పేరు సుబుక్తగీన్. మంచివాడు. పేదవాడైనప్పటికీ ఆత్మాభిమానం కలిగిన అభిమానధనుడు. ఆ కారణంగానే జాతి అతన్ని తమ నాయకుడిగా ఎన్నుకుంది. వేట , విహార యాత్రలంటే అతనికి చాలా ఇష్టం. అలవాటు ప్రకారం ఒకనాటి సాయంత్రం అతడు వేటకు బయలు దేరాడు. అడవిలో చాలా దూరం వెళ్ళిన తరువాత ఒక జింక కనిపించింది.
దాని వెంట దాని పిల్లకూడా ఉంది. జింకను చూడగానే సుబుక్తగీన్ కళ్ళుమెరిశాయి. ఉత్సాహంగా దానివెంట పడ్డాడు. తల్లీ పిల్ల అడవిలో అడ్డదిడ్డంగా ప్రాణ భయంతో పరుగులంకించుకున్నాయి. అతను కూడా వాటివెంట పడి తరమడం మొదలు పెట్టాడు. పాపం! కొద్దిసేపు ఉరుకులు పరుగుల తరువాత పిల్లజింక బాగా అలసిపోయి వేటగాడి చేతికి చిక్కింది. సుబుక్తగీన్ దాన్ని పట్టుకొని వెనుదిరిగాడు.
మాతృ ప్రేమకు జాతి బేధాలేముంటాయి. తల్లి తల్లే కదా..! ఎంత జంతువైతే మాత్రం మాతహదయం ఊరుకుంటుందా..? బిడ్డకోసం రోదిస్తూసుబుక్తగీన్ వెనకాలే వస్తోందా తల్లి జింక. అతను వెనుదిరిగి చూశాడు. కొద్దిదూరంలోనే ఆగిపోయింది జింక. కాని దీనత్వం నిండినదాని చూపులు బిడ్డపైనే కేంద్రీకతమయ్యాయి. తన కూనకోసం ఆ మాతృహృదయం తల్లడిల్లిపోతోంది. భయం, తెగింపు, ప్రేమ మమకారం కలగలిసిన మానసిక ఆందోళనతో ఆ తల్లి జింక మాతృహృదయం ఎంతటి వేదన అనుభవిస్తుందో మాతృహృదయంతో ఆలోచిస్తేతప్ప అర్ధం కాదు.
స్వతహాగా మంచి మనసు కల వాడైన సుబుక్తగీన్ క్షణ కాలం ఆగి ఆ తల్లి జింక మూగవేదనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాడు. మనసులో జాలి పెల్లుబికింది. కరుణ కట్టలు తెంచుకుంది. కళ్ళు చెమర్చాయి. వెంటనే తన వద్దనున్న జింక పిల్లను వదిలిపెట్టాడు. అంతులేని ఆనందంతో జింక పిల్ల గెంతుతూ తల్లిఒడి చేరింది. తల్లిజింక కళ్ళనుండి ఆనంద బాష్పాలు రాలుతుండగా ప్రేమగా పసికూనను నాకుతూ బిడ్డతో కలిసి అడవిలో అదృశ్యమైపోయింది. సుబుక్తగీన్ అవి వెళ్ళినవైపే తదేకంగా చూస్తూ, తప్తిగా ఓ నిట్టూర్పు విడిచి ఇంటిదారి పట్టాడు.
ఆరోజు రాత్రి సుబుక్తగీన్ ఒక కల గన్నాడు. ముహమ్మద్ ప్రవక్త(స) కలలో కనిపించి, ‘పసికూనపై ఆశలు వదులుకొని నిస్సహాయంగా, దీనంగా, మూగగా విలపిస్తున్న మూగజీవిపై నువ్వు చూపిన దయా దాక్షిణ్యాలు దైవానికి ఎంతగానో నచ్చాయి. ముందు ముందు నీకు రాజయోగం లభించనుంది. ఎప్పుడూ ఇదే వైఖరి కలిగి ఉండు. సాటి మానవుల పట్ల, మూగప్రాణుల పట్ల కరుణతో వ్యవహరించు’. అని చెప్పారు.
తరువాత కొన్నాళ్ళకు సుబుక్తగీన్ కల ఫలించింది. అనుకున్నట్లుగానే అతను రాజయ్యాడు. తనజీవితంలో జరిగిన ఈ సంఘటనను జీవితాంతం గుర్తుంచుకొని, జనసంక్షేమమే ధ్యేయంగా మంచి పరిపాలన అందించి గొప్ప పేరుప్రఖ్యాతులు గడించాడు.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్