
మనం మన తల్లిదండ్రుల్ని, పెద్దల్ని, గురువుల్ని ప్రేమిస్తాం, గౌరవిస్తాం. ఎందుకూ? వారు మన మేలుకోరేవారు. బాగు కోరేవారు. మన ఉన్నతిని కాంక్షించేవారు. మన శ్రేయోభిలాషులు. వారి ప్రేమాభిమానాలు, కారుణ్య వాత్సల్యాలు అనునిత్యం మనపై ప్రసరిస్తున్నాయి. చేసిన మేలును గుర్తించడం, చే సిన వారిపట్ల కృతజ్ఞత చూపడం మానవ నైజంలో ఉండే సహజ గుణం. ఉపకారి ముందు వినయ వినమ్రతలు కలిగి ఉండడం, అతని అభీష్టానికి అనుగుణంగా నడుచుకోవడం, వారు చెప్పింది చేయడం, వారి ఇష్టానికి వ్యతిరేకంగా నోరు మెదపకపోవడం వారిపట్ల విధేయతకు, అంకితభావానికి నిదర్శనం.
కాని ఇంతకన్నా ఎక్కువ, లెక్కకు మిక్కిలి మేళ్ళు, ఉపకారాలు,అనుగ్రహాలు, వరాలు దైవం మనపై కురిపించాడు. మనపైనే కాదు, అందరిపై కురిపించాడు. ధనిక, పేద అనే భేదం లేకుండా, పాలకుడు సేవకుడు అన్న తేడాలేకుండా, పల్లె పట్నం అన్న వ్యత్యాసం లేకుండా, ఆడా మగా అన్న తారతమ్యం లేకుండా, వృద్ధులు– పిల్లలన్న విభజన లేకుండా ఆ కరుణామయుని అనుగ్రహాలు, ఆ దయామయుని కారుణ్య ఛాయ సమస్తాన్నీ పరివేష్టించి ఉంది. గుడిసెవాసులపై అయినా, భవనవాసులపై అయినా, అడవుల్లో అయినా, మైదానాల్లో అయినా, ఎటుచూసినా, ఎక్కడ చూసినా రేయింబవళ్ళు, ప్రతినిత్యం, అనుక్షణం ఆయన కారుణ్యానుగ్రహాలు వర్షిస్తూనే ఉన్నాయి.
ఆయన దాహార్తులకు దాహాన్ని, అన్నార్తుల క్షుద్బాధను తీరుస్తున్నాడు. వస్త్రవిహీనులకు ఆచ్ఛాదన ప్రసాదిస్తున్నాడు. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యాన్నిస్తున్నాడు. ప్రజల ఆందోళన దూరం చేస్తున్నాడు. కష్టాలు బాధల నుండి రక్షిస్తున్నాడు. నిస్సహాయులకు అండగా నిలుస్తున్నాడు. నీడ లేని వారికి గూడు కల్పిస్తున్నాడు. నిరాశ్రయులకు ఆశ్రయమిస్తున్నాడు. సమస్త ప్రాణుల సుఖమయ జీవనానికి సమతుల ప్రకృతిని సిద్ధంచేసి పెట్టాడు. ఏ వ్యక్తి, ఏ సమూహం, ఏ ప్రాణి కూడా ఏ ఒక్క క్షణమూ ఆయన అనుగ్రహానికి దూరంగా లేదు. అనుగ్రహం లేకుండా లేదు, మనజాలదు.
మరి అలాంటి దయాసముద్రుని పట్ల, కరుణామయుని పట్ల మనకెలాంటి ప్రేమ ఉండాలి? ఆయనతో మనకెలాంటి అనుబంధం ఉండాలి? ఎవరైనా చెప్పగలరా.. అంచనా వేయగలరా..? లెక్కలు కట్టగలరా? ఆయన సకల లోకాలకు ప్రభువు. రాజాధిరాజు. ప్రభువులకు ప్రభువు. దయాళువు, కారుణ్య సముద్రుడు. క్షమానిధి. అన్నీ చూసేవాడు, అన్నీ వినేవాడు. నిదుర పోనివాడు. కునుకు రానివాడు. అలసిపోనివాడు. అలుపులేనివాడు. అన్నిటిపై అధికారం కలిగిన వాడు. పాలించేవాడు, పోషించేవాడు. అధికుడు, ఆధిక్యుడు. సర్వవ్యాపి. సర్వాంతర్యామి. జీవన్మరణాల విధాత. అలాంటి పరమ ప్రభువుపట్ల గుండెలనిండా ప్రేమ నింపుకోవాలి.
– ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్
Comments
Please login to add a commentAdd a comment