ప్రవక్త నేర్పిన పాఠం
దేవుడు మానవులకు సంపదను ఇచ్చీ పరీక్షిస్తాడు. ఒక్కోసారి లేమికి గురిచేసీ పరీక్షిస్తాడు. ఇలా పరీక్షించే నిమిత్తం ఓ ముగ్గురు వ్యక్తుల దగ్గరకు దైవం తన దూతను పంపాడు. వారిలో ఒకడు కుష్టురోగి. మరొకడు పుట్టుగుడ్డి. మూడవవాడు వికారమైన రూపం కలిగిన వాడు. ముగ్గురూ నిరుపేదలే.
దైవదూత మానవాకారంలో కురూపిగా ఉన్నవాడి దగ్గరికొచ్చి, అతని కోరికను చెప్పమన్నాడు. తాను అందవిహీనంగా ఉన్న నిరుపేదను కాబట్టి. తనకు రూపం కావాలని కోరుకున్నాడు. అప్పుడా దూత అతనికి మంచిరూపాన్ని తెప్పించి, ఒక చూడి మేకను బహూకరించి, దీనిద్వారా నీకు శుభం కలుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు. తరువాత గుడ్డివాడి దగ్గరికెళ్ళి ఏం కావాలో చెప్పమన్నాడు. అప్పుడా గుడ్డివాడు చూపు కావాలని కోరుకున్నాడు. దూత అతడికి చూపును ప్రసాదించి ఒక చూడి ఆవును బహూకరించాడు. దీనిద్వారా నీకు శుభం కలుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు.
ఆ తరువాత కుష్టురోగి వద్దకు వెళ్ళాడు. అతణ్ణి కూడా నీకేం కావాలో కోరుకోమన్నాడు. ఆ కుష్టురోగి తన జబ్బు నయం కావాలని కోరుకున్నాడు. దూత దైవాన్ని ప్రార్థించి అతని కుష్టురోగాన్ని పూర్తిగా దూరం చేశాడు. తరువాత అతనికొక చూడి ఒంటెను బహూకరించి, దీనిద్వారా నీకు శుభం కలుగుతుందని చెప్పి వెళ్ళిపోయాడు.
దైవదూత చెప్పినట్లే, ముగ్గురూ ధనవంతులుగా మారి, హాయిగా జీవించసాగారు. తరువాత కొంతకాలానికి దేవదూత, పూర్వం కురూపిగా ఉండి, ఇప్పుడు అందంగా ఉన్న సంపన్నుడి దగ్గరికి వెళ్ళాడు. తన పరిస్థితిని వివరిస్తూ ఒకమేకను దానం చేస్తే దాని ద్వారా బతుకుతానని అర్ధించాడు. కాని పూర్వపు కురూపి, తన గతాన్నంతా మర్చిపోయి ఏమాత్రం జాలి చూపకుండా కసురుకున్నాడు. అప్పుడా దూత, ‘దేవుడు నిన్ను కరుణించి, నీ కురూపితనాన్ని పోగొట్టి మంచి రూపాన్ని ప్రసాదించాడు.
దాంతోపాటు సంపదనూ అనుగ్రహించాడు. కాని నువ్వు అన్నీ మరిచిపొయ్యావు. దైవం మళ్ళీ నిన్ను పూర్వ స్థితికే తెస్తాడు.’ అని శపించి, అక్కణ్ణించి వెళ్ళిపోయాడు. తరువాత, పూర్వం గుడ్డివాడిగా ఉన్నతని దగ్గరికి వెళ్ళి ‘అయ్యా! నేను నిస్సహాయస్థితిలో ఉన్న గుడ్డివాణ్ణి. నాకో ఆవును దానం చెయ్యి..’ అని వేడుకున్నాడు. అతనూ గతాన్నంతా మరచి మొదటి వాడికి లాగానే ఛీత్కరించాడు. దూత అతణ్ణి కూడా ‘దైవం నిన్ను మళ్ళీ పూర్వస్థితికే తెచ్చుగాక..!’అని శపించి వెళ్ళిపోయాడు.
తరువాత కుష్టురోగిగా మారి, పూర్వం కుష్టురోగంతో బాధపడి, స్వస్థత పొందిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. ‘అయ్యా. .నేను దిక్కూమొక్కూ లేని కుష్టురోగిని. నాకేదైనా సాయం చేసి పుణ్యం కట్టుకో’ అని అభ్యర్ధించాడు. పూర్వ కుష్టురోగి,’అయ్యో..ఎంత కష్టం వచ్చింది! గతంలో నేను కూడా ఇదే వ్యాధితో బాధపడ్డాను. అనేక కష్టాలు అనుభవించాను. దైవం నన్ను అనుగ్రహించి, స్వస్థతను ప్రసాదించి, ఇంత సంపదను ఇచ్చాడు. నీకేం కావాలన్నా తీసుకెళ్ళు. దేవుని పేరుమీద నీకు దానం చేస్తున్నాను.’అన్నాడు. అప్పుడు దేవదూత, ‘నాకేమీ అక్కర లేదు నాయనా. కేవలం పరీక్ష నిమిత్తం దేవుడు నన్ను మీ దగ్గరికి పంపాడు. ఆయన మీ ముగ్గురినీ పరీక్షించాడు. కాని నువ్వు మాత్రమే సఫలమయ్యావు. అంతా హాయిగా, సంతోషంగా అనుభవించు. నీకు శుభం కలుగుగాక..!’ అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు.
ప్రవక్త చెప్పిన ఈ వృత్తాంతం అందరికీ చక్కని గుణపాఠం. మనిషి ఎప్పుడూ తన గతాన్ని మరువకూడదు. ఏ ఆధారంలేని నిరుపేదలను, వికలాంగులను సంపన్నుల్ని పరీక్షించడానికే సృష్టించి ఉంటాడు.అందుకని, నిలకడలేని ఆరోగ్యాన్ని, ఈరోజు ఉంటే రేపు ఉంటుందన్న నమ్మకంలేని సంపదను, సౌందర్యాన్ని చూసుకొని విర్రవీగకూడదు.
– ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్