
ఒకసారి ముహమ్మద్ ప్రవక్త మహనీయులు సహచరులతో కలసి కూర్చుని ఉన్నారు. అంతలో ఒక వ్యక్తి అక్కడికొచ్చాడు. ‘‘అయ్యా.. నేను చాలా బాధల్లో ఉన్నాను. ఆకలి దహించి వేస్తోంది. తినడానికి ఏమైనా పెట్టం ’’ అని అభ్యర్థించాడు. ప్రవక్తవారి ఇంట ఆ సమయాన ఏమీ లేకపోవడంవల్ల, సహచరుల్ని సంప్రదించారు. అప్పుడు వారిలో అబూతల్ హా అనే ఒక సహచరుడు అతన్ని వెంటబెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళాడు. ‘‘ఈరోజు మనం ఒక మనిషికి ఆతిథ్యం ఇవ్వాలి. తినడానికి ఏమైనా ఉందా?’’ అని భార్యను అడిగారు. ‘‘అయ్యో... పిల్లల కోసమని ఉంచిన కాస్తంత అన్నం తప్ప మరేమీ లేదు కదండీ’’ అని దిగులుగా చెప్పింది శ్రీమతి.
‘‘అయితే ఒకపని చేయి. పిల్లకు ఏదో ఒక వంక చెప్పి భోజనం పెట్టకుండా నిద్రపుచ్చు. పిల్లలు పడుకోగానే భోజనం వడ్డించు. ఆకలితో ఉన్న అతిథితో పాటు నేను కూడా భోజనానికి కూర్చుంటాను. తరువాత నువ్వు దీపం సరి చేస్తున్నట్లు చేసి దాన్ని ఆర్పేసెయ్. కాసేపటి దాకా నువ్వు ‘అయ్యయ్యో.. దీనికేమయిందీ..’ అనుకుంటూ దాన్ని సరి చేస్తునే ఉండు. ఆ సమయంలో నేను అతిథికి వడ్డిస్తూ, నేను కూడా తింటున్నట్లుగా నటిస్తాను. చీకట్లో మనం తిన్నదీ లేనిదీ అతనికి తెలియకుండా ఉంటుంది’’అన్నారు.
శ్రీమతి అలాగే చేసింది. ఈ విధంగా భోజనానికి అందరూ కూర్చున్నారు. కాని అతిథి మాత్రమే భోంచేశాడు. పిల్లలతో సహా భార్యాభర్తలిద్దరూ ఆ రాత్రి పస్తులే ఉన్నారు. తెల్లవారి ఉదయం యధాప్రకారం అబూతల్ హా (ర)ముహమ్మద్ ప్రవక్త(స)వద్దకు వెళ్ళారు. అప్పుడు ప్రవక్త మహనీయులు ఆయన్ను అభినందిస్తూ ‘అల్లాహ్ కు తన భక్తుడు అబూతల్ హా అన్సారీ, ఆయన శ్రీమతి ప్రవర్తన ఎంతగానో నచ్చింది. అల్లాహ్ అమితంగా సంతోషించాడు’ అని శుభవార్త వినిపించారు.
ముహమ్మద్ ప్రవక్తవారి బోధనలు, శిక్షణ, సహచర్యం ఆయనగారి అనుచరుల్లో ఎంతటి దయాగుణాన్ని, త్యాగనిరతిని జనింపజేశాయో ఈ సంఘటన ఒక సజీవసాక్ష్యంగా మనకు కనిపిస్తోంది. మనం, మన అవసరాలకంటే పరుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. దాన్ని మాత్రమే త్యాగం అనవచ్చు. మనకు పనికి రానిది, మిగిలిపోయింది, సద్దిలాంటివి ముష్టిగా పడేసి ఏదో చేసేశాం అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరేమీ ఉండదు.
పేదసాదలను కసురుకోకూడదు. చులకనగా చూడకూడదు. చేతనైతే ఉన్నంతలోనే ఎంతో కొంత సాయం చేయాలి. లేదంటే మౌనంగా ఉండాలి.ౖ దెవాన్నిప్రార్థించాలి. యాచించే స్థితినుండి రక్షించి, అందరికీ మంచి స్థితిని ప్రసాదించమని దైవాన్ని వేడుకుంటూ ఉండాలి.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment