హజ్రత్ ఇబ్రాహీమ్, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిముస్సలాంల త్యాగాలను స్మరించుకునే త్యాగోత్సవం... ప్రపంచ విశ్వాసుల పర్వదినం బక్రీద్. జిల్ హజ్ మాసం పదవ తేదీన జరుపుకొనే బక్రీద్ ఒక అపూర్వమైన పండుగ. ఇదేదో షరా మామూలుగా జరిగే ఆచారం కాదు. మహత్తర సందేశం కలిగిన శుభదినం. క్రియారూపంలో దైవధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అద్భుత ప్రక్రియ. మనిషి తనను తాను తగ్గించుకొని, వినమ్ర పూర్వకంగా అల్లాహ్ ఔన్నత్యాన్ని, ఆయన ఘనతను కీర్తించే గొప్పరోజు. మనందరి ధర్మం ఒక్కటే. మనమంతా ఒక్కటే. సమస్త మానవజాతీ ఒక్కటే.. అని ఎలుగెత్తి చాటే రోజు. మానవ సహజ దౌర్బల్యాల వల్ల చిన్నా చితకా పాక్షిక విభేదాలు ఉన్నప్పటికీ అందరి విశ్వాసం ఒక్కటే అనడానికి ప్రబల తార్కాణం ఈ పండుగ. మౌలిక విశ్వాసం పరంగా ఒక్కటిగానే ఉన్న మనం పొరపొచ్చాలను విస్మరించి తోటి సోదరుల్ని గుండెలకు హత్తుకోవాల్సిన రోజు.
పరోపకారమే పండుగ సందేశం
ఈ పర్వదినం మనకిచ్చే సందేశం ఏమిటంటే, సమాజాన్ని కలుపుకుని పోకుండా, నలుగురితో మమేకం కాకుండా, సాటి ప్రజల పట్ల ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోకుండా ఏ సంతోషమయినా, ఎంతటి ఆనందమైనా పరిపూర్ణం కాజాలదు. ఏ సంతోష కార్యమైనా నలుగురితో పంచుకోవాలని, కేవలం మన గురించి మాత్రమే కాకుండా సంఘం గురించి, సమాజం గురించి ఆలోచించాలని చెబుతుందీ పండుగ.
ప్రతి ఒక్కరూ తమ స్థాయి, స్తోమతకు తగినట్లు ఈద్ జరుపుకుంటారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు జిల్ హజ్జ్ నెలలో ‘హజ్’యాత్రకు వెళతారు. అంతటి స్థోమత లేనివారు ఇళ్ళవద్దనే ఖుర్బానీలు ఇస్తారు. ఆ స్థోమత కూడా లేకపోతే రెండు రకతుల నమాజ్ ఆచరించినా దయామయుడైన అల్లాహ్ హజ్, ఖుర్బానీలు ఆచరించిన వారితో సమానంగా పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. ఆయన తన దాసుల చిత్తశుద్ధిని, సంకల్పాన్ని మాత్రమే చూస్తాడు. ఆయనకు ధనరాశులు, రక్తమాంసాల అవసరం ఎంతమాత్రం లేదు. కనుక సర్వకాల సర్వావస్థల్లో చిత్తశుద్ధితో కూడిన సత్కర్మలు ఆచరించాలి. పేదసాదల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. పండుగల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో వారిని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఆనందంలో వారినీ భాగస్వాములను చేయాలి. అప్పుడే నిజమైన పండుగ. తన అవసరాలను త్యజించి దైవ ప్రసన్నత కోసం ఇతరుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వమని చెప్పేదే ఈ త్యాగాల పండుగ మనకిచ్చే సందేశం. మంచికోసం మానవ సంక్షేమం కోసం, ధర్మం కోసం, ధర్మ సంస్థాపన కోసం ఎంతో కొంత త్యాగం చెయ్యాలన్న సందేశం ఇందులో ఉంది. ఈనాడు ముస్లిం సమాజం జరుపుకుంటున్న త్యాగోత్సవానికి ఇదే అసలు ప్రేరణ. అందుకని, పండుగ సందర్భంగా చేసే ప్రతి ఆచరణలో త్యాగ ధనులైన హజ్రత్ ఇబ్రాహీం, ఇస్మాయీల్ గార్ల స్ఫూర్తి తొణికిసలాడాలి.
దైవప్రసన్నత కోసం, ఇహ పర సాఫల్యం కోసం వారు ఎలాంటి పరీక్షలు ఎదుర్కొన్నారో, ఎంతటి సహన స్థయిర్యాలు కనబరిచారో ఇతరులు కూడా అలాంటి ప్రయత్నం చెయ్యాలి. సచ్ఛీలత, సదాచారం, త్యాగం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోవాలి. మనోవాంఛల త్యాగం అన్నిటికన్నా ముఖ్యమైనది. ఈ సందర్భంగా ఖుర్బానీలు ఇచ్చుకోవడం, నమాజులు చేయడం, ఇతరత్రా ఇంకా ఏవో పుణ్యకార్యాలు ఆచరించడం ఒక్కటే కాదు... మనోవాంఛల త్యాగం అన్నిటికన్నా ముఖ్యమన్న విషయాన్ని విస్మరించకూడదు. ఇది నిస్సందేహంగా కష్టంతో కూడుకున్న కార్యమే. కాని, హజ్రత్ ఇబ్రాహీం, ఇస్మాయీల్ త్యాగాలను స్మరించుకుంటే అది ఏమాత్రం కష్టం కాదు. మనం కూడా పరీక్షలు, కష్టాలు, త్యాగాల కఠినమయిన దశలను దాట వలసి ఉంది. ఈ మార్గంలో చేసే ఏ కృషి అయినా, ఏ త్యాగమయినా వృథా పోదు. చరిత్రే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. దైవం మనందరిలో త్యాగభావం, పరోపకార గుణాలను పెంపొందించాలని ప్రార్థిద్దాం.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment