ఎన్నో త్యాగాలు.. ఎన్నోబలి దానాలు... ఒక మానవ మాత్రుని సహనానికి పరాకాష్ట అనదగిన అనేక పరీక్షలు... అన్నిటినీ తట్టుకొని మేరుపర్వతంలా నిలిచిన అపూర్వవ్వక్తిత్వం.. ఎన్నో ఉలిదెబ్బల తరువాత శిల శిల్పంగా మారుతుంది. కొలిమిలో కాలిన తరువాతనే నగ అద్భుత సౌందర్యాన్ని సంతరించుకుంటుంది. ఇది మానవ జీవితానికీ వర్తిస్తుంది. సయ్యిదినా హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితమే దీనికి చక్కని చారిత్రక ఉదాహరణ. ఆయన ఎన్నోపరీక్షలు ఎదుర్కొన్నారు. ఎన్నో త్యాగాలు చేశారు. విగ్రహారాధన, అధర్మవ్యాపారం వద్దన్నందుకు తండ్రి ఆయన్ని ఇంట్లోంచి గెంటేశాడు. సామాజిక రుగ్మతలు, సాంఘిక దురాచారాలను వ్యతిరేకించినందుకు సమాజం కన్నెర్రజేసింది.
అధికార దుర్వినియోగాన్ని, అవినీతిని, మిథ్యాదైవత్వాన్ని ప్రశ్నించినందుకు పాలకుల ఆగ్రహాన్ని చవిచూడవలసి వచ్చింది. కళ్ళముందే అగ్గిరాజేసి, ఉవ్వెత్తున ఎగసిపడే మంటల్లో పడవేసినా ప్రాణత్యాగానికే సిద్ధమయ్యారు కాని, రాజును దైవాంశ సంభూతునిగా అంగీకరించడానికి ఒప్పుకోలేదు. చివరికి దేశంనుండి బహిష్కరించినా సంతోషంతో సంచారజీవనం సాగించారాయన. అయినా పరీక్షల పరంపర అంతం కాలేదు. అదనంగా మరో పరీక్ష ఎదురైంది. మానవ ఇతిహాసం కనీవిని ఎరుగని పరీక్ష అది. దైవాదేశపాలనలో ప్రేమానురాగాలకు, వాత్సల్యానికి అణుమాత్రమైనా చోటులేదని రుజువు చేసిన పరీక్ష అది. సుదీర్ఘ ఎడబాటు తరువాత భార్యా బిడ్డలను కలుసుకున్న ఆనందం కూడా తీరక ముందే, ప్రాణసమానమైన పుత్రరత్నాన్ని దేవుని మార్గంలో త్యాగం చేయాల్సి రావడం మామూలు పరీక్షకాదు. హజ్రత్ ఇబ్రాహీం (అ) దానికీ సిద్ధమయ్యారు. బాబును సంప్రదించారు.
’దైవాజ్ఞ పాలనలో ఆలస్యం చేయకండినాన్నా! దైవచిత్తమైతే నన్నుమీరు సహనవంతునిగా చూస్తారు. ’ అన్నారు చిన్నారి ఇస్మాయీల్. ఆ సమయాన తండ్రీకొడుకుల మధ్య జరిగే సంభాషణ వినడానికి సృష్టిలోని అణువణువూ అవాక్కయి పోయింది. ఈ అచంచల, అద్వితీయ విశ్వాస బలాన్ని నివ్వెరపోయి చూస్తున్న ప్రకృతి ఒక్కసారిగా స్తంభించి పోయింది. అంతటా నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, అల్లాహ్ పవిత్ర నామాన్ని స్మరిస్తూ తనయుని మెడపై కత్తిపెట్టి జుబహ్ చెయ్యడానికి ఉద్యుక్తులయ్యారు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. దీంతో తన ప్రియ ప్రవక్త ఇబ్రాహీం పట్ల దేవుని ప్రసన్నత పతాక స్థాయిన ప్రసరించింది. తన ఆజ్ఞాపాలనకు వారు మానసికం గా సిద్ధమైన క్షణంలోనే ఆయన వారి పట్ల అమిత ప్రసన్నుడై, వారి త్యాగాన్ని స్వీకరించాడు. చిన్నారి ఇస్మాయీల్ స్థానంలో జుబహ్ చెయ్యడానికి ఓ స్వర్గ పొట్టేలును ప్రత్యక్షపరిచాడు.
ఇదీ నేటి త్యాగోత్సవానికి(ఈదుల్ అజ్ హా/ బక్రీద్ సంబంధించిన సంక్షిప్త గాథ. ఇందులో మనందరికీ చక్కని ఆదర్శం ఉంది. మంచికోసం, మానవ సంక్షేమం కోసం, ధర్మం కోసం, ధర్మసంస్థాపన కోసం ఎంతోకొంత త్యాగం చెయ్యాలన్న సందేశం ఉంది. ఈనాడు ముస్లిం సమాజం జరుపుకుంటున్న త్యాగోత్సవానికి ఇదే అసలు ప్రేరణ. మనోవాంఛల త్యాగం అన్నిటికన్నా ముఖ్యమైనది. ఈదుల్ అజ్ హా పర్వం మానవాళికిస్తున్న సందేశం ఇదే. (నేడు బక్రీద్ పర్వదినం సందర్భంగా..) – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment