Bakrid Special
-
త్యాగ నిరతికి చిహ్నం బక్రీద్
ఎన్నో త్యాగాలు.. ఎన్నోబలి దానాలు... ఒక మానవ మాత్రుని సహనానికి పరాకాష్ట అనదగిన అనేక పరీక్షలు... అన్నిటినీ తట్టుకొని మేరుపర్వతంలా నిలిచిన అపూర్వవ్వక్తిత్వం.. ఎన్నో ఉలిదెబ్బల తరువాత శిల శిల్పంగా మారుతుంది. కొలిమిలో కాలిన తరువాతనే నగ అద్భుత సౌందర్యాన్ని సంతరించుకుంటుంది. ఇది మానవ జీవితానికీ వర్తిస్తుంది. సయ్యిదినా హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం జీవితమే దీనికి చక్కని చారిత్రక ఉదాహరణ. ఆయన ఎన్నోపరీక్షలు ఎదుర్కొన్నారు. ఎన్నో త్యాగాలు చేశారు. విగ్రహారాధన, అధర్మవ్యాపారం వద్దన్నందుకు తండ్రి ఆయన్ని ఇంట్లోంచి గెంటేశాడు. సామాజిక రుగ్మతలు, సాంఘిక దురాచారాలను వ్యతిరేకించినందుకు సమాజం కన్నెర్రజేసింది. అధికార దుర్వినియోగాన్ని, అవినీతిని, మిథ్యాదైవత్వాన్ని ప్రశ్నించినందుకు పాలకుల ఆగ్రహాన్ని చవిచూడవలసి వచ్చింది. కళ్ళముందే అగ్గిరాజేసి, ఉవ్వెత్తున ఎగసిపడే మంటల్లో పడవేసినా ప్రాణత్యాగానికే సిద్ధమయ్యారు కాని, రాజును దైవాంశ సంభూతునిగా అంగీకరించడానికి ఒప్పుకోలేదు. చివరికి దేశంనుండి బహిష్కరించినా సంతోషంతో సంచారజీవనం సాగించారాయన. అయినా పరీక్షల పరంపర అంతం కాలేదు. అదనంగా మరో పరీక్ష ఎదురైంది. మానవ ఇతిహాసం కనీవిని ఎరుగని పరీక్ష అది. దైవాదేశపాలనలో ప్రేమానురాగాలకు, వాత్సల్యానికి అణుమాత్రమైనా చోటులేదని రుజువు చేసిన పరీక్ష అది. సుదీర్ఘ ఎడబాటు తరువాత భార్యా బిడ్డలను కలుసుకున్న ఆనందం కూడా తీరక ముందే, ప్రాణసమానమైన పుత్రరత్నాన్ని దేవుని మార్గంలో త్యాగం చేయాల్సి రావడం మామూలు పరీక్షకాదు. హజ్రత్ ఇబ్రాహీం (అ) దానికీ సిద్ధమయ్యారు. బాబును సంప్రదించారు. ’దైవాజ్ఞ పాలనలో ఆలస్యం చేయకండినాన్నా! దైవచిత్తమైతే నన్నుమీరు సహనవంతునిగా చూస్తారు. ’ అన్నారు చిన్నారి ఇస్మాయీల్. ఆ సమయాన తండ్రీకొడుకుల మధ్య జరిగే సంభాషణ వినడానికి సృష్టిలోని అణువణువూ అవాక్కయి పోయింది. ఈ అచంచల, అద్వితీయ విశ్వాస బలాన్ని నివ్వెరపోయి చూస్తున్న ప్రకృతి ఒక్కసారిగా స్తంభించి పోయింది. అంతటా నిశ్శబ్దం ఆవరించింది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ, అల్లాహ్ పవిత్ర నామాన్ని స్మరిస్తూ తనయుని మెడపై కత్తిపెట్టి జుబహ్ చెయ్యడానికి ఉద్యుక్తులయ్యారు హజ్రత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. దీంతో తన ప్రియ ప్రవక్త ఇబ్రాహీం పట్ల దేవుని ప్రసన్నత పతాక స్థాయిన ప్రసరించింది. తన ఆజ్ఞాపాలనకు వారు మానసికం గా సిద్ధమైన క్షణంలోనే ఆయన వారి పట్ల అమిత ప్రసన్నుడై, వారి త్యాగాన్ని స్వీకరించాడు. చిన్నారి ఇస్మాయీల్ స్థానంలో జుబహ్ చెయ్యడానికి ఓ స్వర్గ పొట్టేలును ప్రత్యక్షపరిచాడు. ఇదీ నేటి త్యాగోత్సవానికి(ఈదుల్ అజ్ హా/ బక్రీద్ సంబంధించిన సంక్షిప్త గాథ. ఇందులో మనందరికీ చక్కని ఆదర్శం ఉంది. మంచికోసం, మానవ సంక్షేమం కోసం, ధర్మం కోసం, ధర్మసంస్థాపన కోసం ఎంతోకొంత త్యాగం చెయ్యాలన్న సందేశం ఉంది. ఈనాడు ముస్లిం సమాజం జరుపుకుంటున్న త్యాగోత్సవానికి ఇదే అసలు ప్రేరణ. మనోవాంఛల త్యాగం అన్నిటికన్నా ముఖ్యమైనది. ఈదుల్ అజ్ హా పర్వం మానవాళికిస్తున్న సందేశం ఇదే. (నేడు బక్రీద్ పర్వదినం సందర్భంగా..) – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
Eid al-Adha: మనోవాంఛల త్యాగోత్సవం బక్రీద్
హజ్రత్ ఇబ్రాహీమ్, హజ్రత్ ఇస్మాయీల్ అలైహిముస్సలాంల త్యాగాలను స్మరించుకునే త్యాగోత్సవం... ప్రపంచ విశ్వాసుల పర్వదినం బక్రీద్. జిల్ హజ్ మాసం పదవ తేదీన జరుపుకొనే బక్రీద్ ఒక అపూర్వమైన పండుగ. ఇదేదో షరా మామూలుగా జరిగే ఆచారం కాదు. మహత్తర సందేశం కలిగిన శుభదినం. క్రియారూపంలో దైవధర్మాన్ని ప్రపంచానికి పరిచయం చేసే అద్భుత ప్రక్రియ. మనిషి తనను తాను తగ్గించుకొని, వినమ్ర పూర్వకంగా అల్లాహ్ ఔన్నత్యాన్ని, ఆయన ఘనతను కీర్తించే గొప్పరోజు. మనందరి ధర్మం ఒక్కటే. మనమంతా ఒక్కటే. సమస్త మానవజాతీ ఒక్కటే.. అని ఎలుగెత్తి చాటే రోజు. మానవ సహజ దౌర్బల్యాల వల్ల చిన్నా చితకా పాక్షిక విభేదాలు ఉన్నప్పటికీ అందరి విశ్వాసం ఒక్కటే అనడానికి ప్రబల తార్కాణం ఈ పండుగ. మౌలిక విశ్వాసం పరంగా ఒక్కటిగానే ఉన్న మనం పొరపొచ్చాలను విస్మరించి తోటి సోదరుల్ని గుండెలకు హత్తుకోవాల్సిన రోజు. పరోపకారమే పండుగ సందేశం ఈ పర్వదినం మనకిచ్చే సందేశం ఏమిటంటే, సమాజాన్ని కలుపుకుని పోకుండా, నలుగురితో మమేకం కాకుండా, సాటి ప్రజల పట్ల ప్రేమ, త్యాగం, సహనం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోకుండా ఏ సంతోషమయినా, ఎంతటి ఆనందమైనా పరిపూర్ణం కాజాలదు. ఏ సంతోష కార్యమైనా నలుగురితో పంచుకోవాలని, కేవలం మన గురించి మాత్రమే కాకుండా సంఘం గురించి, సమాజం గురించి ఆలోచించాలని చెబుతుందీ పండుగ. ప్రతి ఒక్కరూ తమ స్థాయి, స్తోమతకు తగినట్లు ఈద్ జరుపుకుంటారు. ఆర్థిక స్థోమత ఉన్నవారు జిల్ హజ్జ్ నెలలో ‘హజ్’యాత్రకు వెళతారు. అంతటి స్థోమత లేనివారు ఇళ్ళవద్దనే ఖుర్బానీలు ఇస్తారు. ఆ స్థోమత కూడా లేకపోతే రెండు రకతుల నమాజ్ ఆచరించినా దయామయుడైన అల్లాహ్ హజ్, ఖుర్బానీలు ఆచరించిన వారితో సమానంగా పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. ఆయన తన దాసుల చిత్తశుద్ధిని, సంకల్పాన్ని మాత్రమే చూస్తాడు. ఆయనకు ధనరాశులు, రక్తమాంసాల అవసరం ఎంతమాత్రం లేదు. కనుక సర్వకాల సర్వావస్థల్లో చిత్తశుద్ధితో కూడిన సత్కర్మలు ఆచరించాలి. పేదసాదల అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలి. పండుగల్లాంటి ప్రత్యేక సందర్భాల్లో వారిని ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. ఆనందంలో వారినీ భాగస్వాములను చేయాలి. అప్పుడే నిజమైన పండుగ. తన అవసరాలను త్యజించి దైవ ప్రసన్నత కోసం ఇతరుల అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వమని చెప్పేదే ఈ త్యాగాల పండుగ మనకిచ్చే సందేశం. మంచికోసం మానవ సంక్షేమం కోసం, ధర్మం కోసం, ధర్మ సంస్థాపన కోసం ఎంతో కొంత త్యాగం చెయ్యాలన్న సందేశం ఇందులో ఉంది. ఈనాడు ముస్లిం సమాజం జరుపుకుంటున్న త్యాగోత్సవానికి ఇదే అసలు ప్రేరణ. అందుకని, పండుగ సందర్భంగా చేసే ప్రతి ఆచరణలో త్యాగ ధనులైన హజ్రత్ ఇబ్రాహీం, ఇస్మాయీల్ గార్ల స్ఫూర్తి తొణికిసలాడాలి. దైవప్రసన్నత కోసం, ఇహ పర సాఫల్యం కోసం వారు ఎలాంటి పరీక్షలు ఎదుర్కొన్నారో, ఎంతటి సహన స్థయిర్యాలు కనబరిచారో ఇతరులు కూడా అలాంటి ప్రయత్నం చెయ్యాలి. సచ్ఛీలత, సదాచారం, త్యాగం, పరోపకారం లాంటి సుగుణాలను అలవరచుకోవాలి. మనోవాంఛల త్యాగం అన్నిటికన్నా ముఖ్యమైనది. ఈ సందర్భంగా ఖుర్బానీలు ఇచ్చుకోవడం, నమాజులు చేయడం, ఇతరత్రా ఇంకా ఏవో పుణ్యకార్యాలు ఆచరించడం ఒక్కటే కాదు... మనోవాంఛల త్యాగం అన్నిటికన్నా ముఖ్యమన్న విషయాన్ని విస్మరించకూడదు. ఇది నిస్సందేహంగా కష్టంతో కూడుకున్న కార్యమే. కాని, హజ్రత్ ఇబ్రాహీం, ఇస్మాయీల్ త్యాగాలను స్మరించుకుంటే అది ఏమాత్రం కష్టం కాదు. మనం కూడా పరీక్షలు, కష్టాలు, త్యాగాల కఠినమయిన దశలను దాట వలసి ఉంది. ఈ మార్గంలో చేసే ఏ కృషి అయినా, ఏ త్యాగమయినా వృథా పోదు. చరిత్రే దీనికి ప్రత్యక్ష సాక్ష్యం. దైవం మనందరిలో త్యాగభావం, పరోపకార గుణాలను పెంపొందించాలని ప్రార్థిద్దాం. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ -
నేడు ఈదుల్ జుహా
సాక్షి, పశ్చిమగోదావరి : ముస్లింల ప్రముఖ పండుగల్లో బక్రీద్ ఒకటి. ధనిక, పేద తారతమ్యం లేకుండా ప్రతి ముస్లిం బక్రీద్‌ను జరుపుకుంటారు. పవిత్ర త్యాగానికి ప్రతిరూపమైన దైవ ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం అల్లాహ్ ప్రసన్నం కోసం చేసిన మహోన్నత త్యాగాన్ని బక్రీద్ సందర్భంగా ముస్లింలు స్మరించుకుంటారు. ఇస్లాం మతంలో రం జాన్ తర్వాత అంత ప్రాముఖ్యత ఉన్న పండుగ ఈదుల్ జుహా (బక్రీద్). దీనినే త్యాగాల పండుగ అని కూడా పిలుస్తారు. ఈదుల్ ఫితర్ జరిగిన రెండు నెలలకు ఇస్లాం కేలండర్ ప్రకారం 12వ నెల (జుల్ హజ్జా) 10వ రోజున బక్రీద్‌ను జరుపుకుంటారు. సోమవారం దేశవ్యాప్తంగా ముస్లింలు బక్రీద్‌ను జరుపుకోనున్నారు. బక్రీద్ నిర్వచనం సమాజంలో పేరుకుపోతున్న రుగ్మతల నుంచి జనావళిని జాగృత పరుస్తూ సన్మార్గంలో నడిపించేందుకు అ ల్లాహ్ భూమండలానికి 80 వేల మంది ప్రవక్తల్ని పంపినట్టు ముస్లింల ఆరాధ్య గ్రంధం దివ్యఖురాన్ చెబు తోంది. వారిలో ఒకరు ప్రవక్త హజరత్ ఇబ్రహీం. ప్రవక్తల్లోని విశ్వాసాన్ని కూడ గ్రహించేందుకు అల్లాహ్ పలు పరీక్షలు పెట్టేవారు. ఈ క్రమంలో హజ్రత్ ఇబ్రహీం అనే ప్రవక్త నిద్రిస్తున్న సమయంలో ఆయన కలలో అల్లాహ్ కనిపించి నీ కుమారుడిని తనకు బలి ఇవ్వమ ని ఆదేశిస్తాడు. ఇబ్రహీం తనకు వచ్చిన కల గురించి ఒక్కగానొక్క కుమారుడైన ఇస్మాయిల్‌కు తెలియజేస్తా డు. దైవ భక్తుడైన ఇస్మాయిల్ అందుకు అంగీకరించి బ లికి సిద్ధవమవుతాడు. కుమారుడిని బలి ఇస్తున్న సమయంలో అల్లాహ్ అతని త్యాగనిరతిని మెచ్చుకుని, బలి ఇవ్వడానికి ఆకాశవాణి ద్వారా ఒక గొర్రెను సృష్టించి ఇస్తాడు. గొర్రెను (బక్రా ) అంటారు. ఆనాటి నుంచి ఈ పండుగకు బక్రీద్ అని పిలుస్తారు. ఖుర్బానీ బక్రీద్ సందర్భంగా ముస్లింలు ఖుర్బానీ ఇవ్వడం అత్యంత పవిత్రమైందిగా భావిస్తారు. ఒక గొర్రె పొట్టేలు మాంసాన్ని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని పేదలకు పంచి పెడతారు. మిగిలిన భాగాల్లో రెండో దానిని బంధువులకు, మూడో భాగాన్ని తమ కోసం ఉంచుకుంటారు. దీనినే ఖుర్బానీ అంటారు. హజ్ యాత్ర ముస్లింలు ఈ మాసంలోనే హజ్ యాత్ర చేపడతారు. పవిత్ర స్థలం మక్కాను సందర్శించడానికి ఇష్టపడతారు. సౌదీ అరేబియాలోని మక్కా నగరానికి వెళ్లి మస్జిద్–అల్–హరామ్‌లోని కాబా చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణాలు చేస్తారు. బక్రీద్ పండుగ రోజు ముస్లింలు అందరూ ఈద్గాహ్కు చేరుకుని సామూహిక ప్రార్థనలు చేస్తారు. ప్రార్థనల అనంతరం ఈద్ ముబారక్ అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఖుర్బానీ ఇవ్వడం ఆనవాయితీ బక్రీద్ సందర్భంగా ప్రతి ముస్లిం విధిగా పొట్టేలు మాంసాన్ని ఖుర్బానీ ఇచ్చి పేదలకు పంచడం ఆనవాయితీ. ఈ పండుగ సందర్భంగా ముస్లింలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా అతి పవిత్రమైన మక్కాను సందర్శించి ముక్తిని పొందాలి. –సయ్యద్ రియాజ్ పాష, జామియ మస్జిద్ కమిటీ అధ్యక్షుడు, చింతలపూడి త్యాగనిరతికి నిదర్శనం బక్రీద్ పండుగ మనిషిలోని దైవభీతిని, త్యాగనిరతిని తెలియ చేస్తుంది. అందుకే ఈ పండుగను త్యాగాల పండుగ అంటారు. చనిపోయిన కుటుంబ సభ్యులను గుర్తుచేసుకుని వారి పేరున ఖుర్బానీ ఇవ్వడం ఈ పండుగ ప్రత్యేకత. –ఎండీ అక్బర్ ఆలీ, జమాఅతే ఇస్లామీహింద్, చింతలపూడి -
బక్రీద్ స్పెషల్
అనంతపురంలోని మార్కెట్ యార్డు శుక్రవారం కిటకిటలాడింది. శనివారం బక్రిద్ పండుగ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పొట్టేళ్లను పెద్ద ఎత్తున ఇక్కడి తీసుకొచ్చారు. దీంతో ఎంతో మంది ముస్లిం సోదరులు ఇక్కడికి తరలివచ్చి పెద్ద ఎత్తున పొట్టేళ్లను కొనుగోలు చేశారు. కొన్ని పొట్టేళ్లు కొమ్ములు తిరిగి ఎద్దుల్లాగ ఉండటంతో వాటిని కొనేందుకు ఆసక్తి చూపించారు. -
జీవాలకు భలే గిరాకీ
=బక్రీద్ స్పెషల్ =2 లక్షలకు పైగా జీవాల అమ్మకం =బుధవారం రూ.50 కోట్ల మేర వ్యాపారం =కళ్లు బైర్లు కమ్మించిన ధరలు సాక్షి, సిటీబ్యూరో: ముస్లింలకు పవిత్ర దినమైన బక్రీద్ సందర్భంగా నగరంలో మేకలు, పొట్టేళ్లకు గిరాకీ ఏర్పడింది. ఈ ఏడాది జీవాల కొరత ఏర్పడటంతో ధరలు భగ్గుమన్నాయి. బుధవారం ఉదయం రెండు పొట్టేళ్లు (జత) రూ.14 వేలకు లభించగా సాయంత్రమయ్యే సరికి రూ.24వేలు ధర పలికాయి. సామాన్య, పేద ముస్లిం లను ఈ ధరలు బెంబేలెత్తించాయి. అనుమతి లేదంటూ ఇతర జిల్లాల నుంచి జీవాలను నగరానికి రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో 30 శాతం మేర కొరత ఏర్పడింది. ఫలితంగానే రేట్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మతపరమైన విశ్వాసాల రీత్యా బక్రీద్ నాడు ఁకుర్బానీరూ. తప్పనిసరి కావడంతో ముస్లింలు తమ స్థోమతను బట్టి జీవాల కొనుగోలుకు ఆసక్తి చూపారు. మండీలు, కూడళ్ల వద్ద మేకలు, గొర్రెలు, పొట్టేళ్ల విక్రయాలు బుధవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు జోరుగా సాగాయి. ఈ పర్వదినానికి ఉండే గిరాకీని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ జిల్లాలు, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ నుంచి గొర్రెలు, మేకలు, పొట్టేళ్లు తీసుకురాగా, రాజస్థాన్ నుంచి 2 వేల వరకు ఒంటెలు తరలించారు. ఒక్కో ఒంటె పరిమాణాన్ని బట్టి రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు ధర పలికాయి. జంటనగరాలు, శివార్లలో కలిపి ముస్లిం జనాభా సుమారు 30 లక్షల వరకు ఉంది. నాణ్యత , పరిమాణాన్ని బట్టి ఒక్కో మేక, పొట్టేలు రూ.5 వేల నుంచి రూ.2 లక్షల వరకు ధర పలికాయి. రూ.7వేలు- రూ.12వేల మధ్య ధరకు కొనుగోళ్లు ఎక్కువగా సాగాయి. గోల్నాక, చంచల్‌గూడ, దారుషిఫా, టోలిచౌకి, బార్కాస్, ముషీరాబాద్, జియాగూడ, చెంగిచెర్ల, మెహిదీపట్నం, కవాడిగూడ, ఎర్రగడ్డ, ఫస్ట్‌లాన్సర్, మల్లేపల్లి, రెడ్‌హిల్స్, మలక్‌పేట తదితర ప్రాంతాలతో పాటు శివార్లలో తారస్థాయిలో విక్రయాలు జరిగాయి. దాదాపు 2 లక్షలకుపైగా జీవాల అమ్మకాలు జరిగాయని, బుధవారం ఒక్కరోజే రూ.50 కోట్లకుపైగా వ్యాపారం జరిగి ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ధరలు కళ్లు బైర్లు కమ్మించాయని, తప్పనిసరి కావడంతో కొనక తప్పలేదని కొందరు ముస్లింలు చెప్పారు. దళారుల హోల్‌సేల్ దోపిడీ ఛిబక్రీద్ గిరాకీని సొమ్ము చేసుకునేందుకు దళారులు ఇష్టానుసారం ధరలు పెంచి యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. పల్లెల నుంచి మందలుగా తెచ్చిన జీవాలను విడివిడిగా అమ్ముకునేందుకు వాటి యజమానులు ఆసక్తి చూపారు. అయితే, దళారులంతా సిండికేట్‌గా మారి విడివిడిగా కాక హోల్‌సేల్‌గా విక్రయించాలని వారిపై వత్తిడి తెచ్చారు. వాస్తవానికి నూటికి రూ.5-10 కమీషన్ మాత్రమే తీసుకోవాల్సిన దళారులు సొంతంగా కొనుగోళ్లు జరిపి మార్కెట్‌ను చేతుల్లోకి తీసుకున్నారు. దీనివల్ల మేకల పెంపకందారులకు లాభం రాకపోగా కొనుగోలుదారులు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వచ్చింది. 15 కేజీల పరిమాణం గల మేక రూ.7-12 వేల వరకు ధర పలకడం దళారుల దోపిడీకి ప్రత్యక్ష నిదర్శనం.