=బక్రీద్ స్పెషల్
=2 లక్షలకు పైగా జీవాల అమ్మకం
=బుధవారం రూ.50 కోట్ల మేర వ్యాపారం
=కళ్లు బైర్లు కమ్మించిన ధరలు
సాక్షి, సిటీబ్యూరో: ముస్లింలకు పవిత్ర దినమైన బక్రీద్ సందర్భంగా నగరంలో మేకలు, పొట్టేళ్లకు గిరాకీ ఏర్పడింది. ఈ ఏడాది జీవాల కొరత ఏర్పడటంతో ధరలు భగ్గుమన్నాయి. బుధవారం ఉదయం రెండు పొట్టేళ్లు (జత) రూ.14 వేలకు లభించగా సాయంత్రమయ్యే సరికి రూ.24వేలు ధర పలికాయి. సామాన్య, పేద ముస్లిం లను ఈ ధరలు బెంబేలెత్తించాయి. అనుమతి లేదంటూ ఇతర జిల్లాల నుంచి జీవాలను నగరానికి రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో 30 శాతం మేర కొరత ఏర్పడింది. ఫలితంగానే రేట్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
మతపరమైన విశ్వాసాల రీత్యా బక్రీద్ నాడు ఁకుర్బానీరూ. తప్పనిసరి కావడంతో ముస్లింలు తమ స్థోమతను బట్టి జీవాల కొనుగోలుకు ఆసక్తి చూపారు. మండీలు, కూడళ్ల వద్ద మేకలు, గొర్రెలు, పొట్టేళ్ల విక్రయాలు బుధవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు జోరుగా సాగాయి. ఈ పర్వదినానికి ఉండే గిరాకీని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ జిల్లాలు, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ నుంచి గొర్రెలు, మేకలు, పొట్టేళ్లు తీసుకురాగా, రాజస్థాన్ నుంచి 2 వేల వరకు ఒంటెలు తరలించారు.
ఒక్కో ఒంటె పరిమాణాన్ని బట్టి రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు ధర పలికాయి. జంటనగరాలు, శివార్లలో కలిపి ముస్లిం జనాభా సుమారు 30 లక్షల వరకు ఉంది. నాణ్యత , పరిమాణాన్ని బట్టి ఒక్కో మేక, పొట్టేలు రూ.5 వేల నుంచి రూ.2 లక్షల వరకు ధర పలికాయి. రూ.7వేలు- రూ.12వేల మధ్య ధరకు కొనుగోళ్లు ఎక్కువగా సాగాయి. గోల్నాక, చంచల్‌గూడ, దారుషిఫా, టోలిచౌకి, బార్కాస్, ముషీరాబాద్, జియాగూడ, చెంగిచెర్ల, మెహిదీపట్నం, కవాడిగూడ, ఎర్రగడ్డ, ఫస్ట్‌లాన్సర్, మల్లేపల్లి, రెడ్‌హిల్స్, మలక్‌పేట తదితర ప్రాంతాలతో పాటు శివార్లలో తారస్థాయిలో విక్రయాలు జరిగాయి.
దాదాపు 2 లక్షలకుపైగా జీవాల అమ్మకాలు జరిగాయని, బుధవారం ఒక్కరోజే రూ.50 కోట్లకుపైగా వ్యాపారం జరిగి ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. గతేడాదితో పోలిస్తే ధరలు కళ్లు బైర్లు కమ్మించాయని, తప్పనిసరి కావడంతో కొనక తప్పలేదని కొందరు ముస్లింలు చెప్పారు.
దళారుల హోల్‌సేల్ దోపిడీ
ఛిబక్రీద్ గిరాకీని సొమ్ము చేసుకునేందుకు దళారులు ఇష్టానుసారం ధరలు పెంచి యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. పల్లెల నుంచి మందలుగా తెచ్చిన జీవాలను విడివిడిగా అమ్ముకునేందుకు వాటి యజమానులు ఆసక్తి చూపారు. అయితే, దళారులంతా సిండికేట్‌గా మారి విడివిడిగా కాక హోల్‌సేల్‌గా విక్రయించాలని వారిపై వత్తిడి తెచ్చారు. వాస్తవానికి నూటికి రూ.5-10 కమీషన్ మాత్రమే తీసుకోవాల్సిన దళారులు సొంతంగా కొనుగోళ్లు జరిపి మార్కెట్‌ను చేతుల్లోకి తీసుకున్నారు. దీనివల్ల మేకల పెంపకందారులకు లాభం రాకపోగా కొనుగోలుదారులు పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించాల్సి వచ్చింది. 15 కేజీల పరిమాణం గల మేక రూ.7-12 వేల వరకు ధర పలకడం దళారుల దోపిడీకి ప్రత్యక్ష నిదర్శనం.