చట్టం ముందు మనుషులైనా, మేకలైనా సమానమే అనుకున్నారు అమెరికన్ పోలీసులు. పాదచారులను వెంబడించే ఆకతాయిల మాదిరి వాషింగ్టన్ నగర వీధుల్లో ఓ రెండు మేకలు హల్‌చల్ చేశాయి. స్థానికుల ఇళ్ల ముంగిళ్లలో పెంచుకున్న తోటల్లోకి చొరబడి చెట్ల ఆకులు, గడ్డి తినటం, పాదచారులను వెంబడించటమే కాకుండా, అడ్డు వచ్చిన వారిని కుమ్మేస్తూ నానా బీభత్సం సృష్టించాయి. ఈ మేకల ధాటికి బెంబేలెత్తిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రజలను ఇబ్బంది పెడుతున్న కారణంగా పోలీసులు ఆ రెండు మేకలనూ అదుపులోకి తీసుకుని, కటకటాల్లోకి నెట్టారు. అధికారులు వాటిని కింగ్ కౌంటీ యానిమల్ షెల్టర్‌కు తీసుకెళ్లి, వాటి యజమానిని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. వాటి యజమాని ఎవరో తెలియలేదు కాని, ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మేకల అరెస్టు వార్తపై ఎంతోమంది ఫన్నీ కామెంట్స్ పెడుతుంటే, మరెంతోమంది జంతుప్రేమికులు మాత్రం ‘ఎవరైనా మూగ జీవులను జైల్లో పెడతారా?’ అంటూ మండిపడుతున్నారు. చెరలో ఉన్న ఆ రెండు మేకలనూ విడిపించుకునేందుకు పలు విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఆ మేకలకు ఏం జరుగుతుందో చూడాలి మరి! ఆ రెండు మేకలకు చేసిన తప్పుకు జైలు శిక్ష పడుతుందో? లేక పోలీసులు సానుకూలంగా స్పందించి మేకలను విడుదల చేస్తారో?
Comments
Please login to add a commentAdd a comment