రాష్ట్రంలో భారీగా తగ్గిన గొర్రెలు, మేకల సంఖ్య
2019లో 2,39,88,070 గొర్రెలు, మేకలు
2024కు వచ్చేసరికి 1.62 కోట్లకు తగ్గిన వైనం
మేడ్చల్, వరంగల్ జిల్లాల్లో 60% తగ్గిన జీవాలు
సామాజిక, ఆర్థిక సర్వే–2024 గణాంకాల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గొర్రెలు, మేకల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 2019తో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 32 శాతం జీవాలు తగ్గినట్టు సామాజిక, ఆర్థిక సర్వే–2024 గణాంకాలు చెబుతున్నాయి. ఈ గణాంకాల ప్రకారం.. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా 1,90,81,605 గొర్రెలు, 49,06,465 మేకలు కలిపి మొత్తం 2,39,88,070 జీవాలుండేవి. కానీ ఐదేళ్ల తర్వాత గణన చేపడితే ఆ సంఖ్య 1.62 కోట్లకు తగ్గిపోయిందని (32.40%) సర్వే వెల్లడించింది. రాష్ట్రంలోని 1,75,115 కుటుంబాల వద్ద ప్రస్తుతం 1,24,14,299 గొర్రెలు, 38,02,609 మేకలు కలిపి 1,62,16,908 జీవాలున్నాయని తెలిపింది.
వరంగల్‌లో 5 లక్షలు గాయబ్
జిల్లాల వారీగా పరిశీలిస్తే మేడ్చల్ జిల్లాలో అత్యధిక శాతం జీవాలు తగ్గాయని ఆర్థిక సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక్కడ గొర్రెలు, మేకలు కలిపి 2019లో 1.89 లక్షలు ఉంటే 2014కు వచ్చేసరికి ఆ సంఖ్య 74 వేలకు తగ్గిపోయింది. వరంగల్‌లో అత్యధికంగా ఐదేళ్లలో ఐదు లక్షల వరకు జీవాలు మాయమయ్యాయి. 2019లో వరంగల్ జిల్లాలో 8.3 లక్షలున్న జీవాలు 2024కు వచ్చేసరికి 3.33 లక్షలకు తగ్గిపోయాయి.
అదే విధంగా సంగారెడ్డిలో 3.50 లక్షలు, మెదక్‌లో 3.9 లక్షలు, నిజామాబాద్‌లో 4.2 లక్షలు, సిద్దిపేటలో 4.5 లక్షలు.. ఇలా పెద్ద సంఖ్యలో జీవాలు తగ్గిపోయా యని గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకు కారణాలేవైనా ఇంత పెద్ద సంఖ్యలో జీవాల తగ్గుదల మంచిది కాదని, ఆయా జిల్లాల్లో త్వరలోనే మాంసం సంక్షోభం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పశుసంవర్ధక అధికారులు చెబుతున్నారు. గత ఐదేళ్లలో వనపర్తి, గద్వాల, మంచిర్యాల, నల్లగొండ జిల్లాల్లో కొంతమేర జీవాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది.
గొర్రెలు కావాలి మహాప్రభో
వాస్తవానికి 2017లో సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. దాదాపు రూ.5వేల కోట్లకు పైగా వెచ్చించి 3.5 లక్షల మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేసింది. దీంతో అటు జీవాల సంఖ్యలోనూ, మాంసం ఉత్పత్తిలోనూ తెలంగాణలో భారీ వృద్ధి కనిపించింది. ఆ గొర్రెలు ఇప్పుడు ఏమయ్యాయన్నది ఆసక్తి కలిగిస్తోంది.
బీఆర్‌ఎస్ హయాంలో ప్రారంభించిన ఈ గొర్రెల పథకంలో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఇలావుండగా రెండోవిడత గొర్రెల పంపిణీ కోసం రాష్ట్రంలోని సుమారు 3 లక్షల మంది గొర్రెల కాపరులు ఎదురుచూస్తున్నారు. 85 వేలకు పైగా లబ్ధిదారులు ఇప్పటికే డీడీలు తీశారు. వారికి సంబంధించిన రూ.430 కోట్లు ఇంకా కలెక్టర్ల ఖాతాల్లోనే మూలుగుతున్నాయి. మరో 2.20 లక్షలకు పైగా లబ్ధిదారులు డీడీలు తీయాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment