మందమర్రి రూరల్: మంచిర్యాల జిల్లా మందమర్రిలో దారుణం చోటు చేసుకుంది. మేకలు దొంగతనం చేశారని ఇద్దరు యువకులను కట్టేసి చిత్రహింసలు పెట్టారు. తలకిందులుగా వేలాడదీసి, కింద మంటపెట్టి నరకం చూపించారు. అవమానం భరించలేక ఓ యువకుడు కనిపించకుండా పోయాడు. అతని చిన్నమ్మ శనివారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా విషయం వెలుగులోకి వచ్చింది.
మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని యాపల్ ఏరియా సమీపంలోని అబ్రహం నగర్‌కు చెందిన చాకలి రాములుకు కొన్ని మేకలు ఉన్నాయి. ఆ మేకలను కాసేందుకు తేజ అనే యువకుడిని కూలీగా పెట్టుకున్నాడు. అయితే మేకల షెడ్డు వద్ద ఉన్న ఓ పైపు, ఒక మేక ఇటీవల చోరీ అయ్యాయి. అదే ఏరియాకు చెందిన కిరణ్ ఈ పని చేసి ఉంటాడన్న అనుమానంతో రాములు పిలిచి ప్రశ్నించాడు. దీంతో తడబడిన కిరణ్ పైపు దాచిన చోటు చూపించాడు. తర్వాత చోరీ అయిన మేక గురించి కూడా ఆరా తీయగా స్థానికులు మేకను కూడా కిరణే ఎత్తుకెళ్లి అమ్ముకున్నాడని ఆరోపించారు.
దీంతో ఆగ్రహించిన రాములు నిందితుడిని తాళ్లతో కట్టేసి తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు పెట్టాడు. అంతటితో ఆగకుండా కింద మంట పెట్టాడు. చిత్రహింస భరించలేక కిరణ్, తనకు మేకల కాపరి తేజ సహకరించాడని చెప్పాడు. దీంతో అతడిని కూడా తీసుకువచ్చి షెడ్డులో కట్టేసి రాములు, అతని కుటుంబ సభ్యులు చిత్రహింసలు పెట్టారు. తర్వాత పెద్దమనుషుల వద్ద పంచాయితీ పెట్టగా మేకకు రూ.6 వేలు ఇవ్వాలని తీర్మానం చేశారు. ఇందుకు నిందితులు అంగీకరించారు.
కిరణ్ చిన్నమ్మ ఫిర్యాదుతో..
ఘటన అనంతరం అవమాన భారంతో కిరణ్ కనిపించకుండాపోయాడు. దీంతో రాములు, అతని కొడుకు శ్రీనివాస్, భార్య స్వరూప, అతని వద్ద పనిచేసే నరేశ్ రెండు రోజుల క్రితం తన అక్క కొడుకు కిరణ్‌ను తీవ్రంగా హింసించారని కిరణ్ చిన్నమ్మ నిట్టూరి సరిత శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అవమానం భరించలేక తన అక్క కొడుకు కిరణ్ కనిపించకుండా పోయాడని తెలిపింది. కిరణ్ దళితుడు కావడంతో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రకుమార్ పేర్కొన్నారు. ఘటన స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య శనివారం పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment