వాషింగ్టన్: హమాస్-ఇజ్రాయెల్ యుద్ధంతో నిత్యనరకం చూస్తున్న ఇస్లాం పౌరులు.. ఇకనైనా ప్రశాంతంగా జీవించాల్సిన అవసరం ఉంది. యుద్ధం ముగిస్తేనే అది సాధ్యపడుతుంది. అందుకు అమెరికా ప్రతిపాదించిన కాల్పుల ఉల్లంఘన ఒప్పందం ఒక్కటే అత్యుత్తమ మార్గమని పేర్కొన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదివారం బక్రీద్(Eid ul Adha) సందేశం విడుదల చేశారు. ‘‘గాజా యుద్ధంతో ఎందరో అమాయకులు చనిపోయారు. అందులో వేల మంది చిన్నారులు ఉన్నారు. తమ కళ్ల ముందే తమ వాళ్లను పొగొట్టుకుని.. సొంత ప్రాంతాల నుంచి పారిపోయిన ముస్లింలు ఇంకెందరో. వాళ్ల బాధ అపారమైంది..
.. ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఈ మూడు దశల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదించింది. గాజాలో హింసకు ముగింపు పలకాలన్నా.. అంతిమంగా యుద్దం ముగిసిపోవాలన్నా ఇదే అత్యుత్తమ మార్గం అని బైడెన్ తన సందేశంలో స్పష్టం చేశారు.
అంతేకాదు.. మయన్మార్‌లో రోహింగ్యాలు, చైనాలో ఉయిగర్లు.. ఇలా ఇతర ముస్లిం తెగల హక్కుల పరిరక్షణ కోసం అమెరికా ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. అలాగే.. సూడాన్‌లో కొనసాగుతున్న అంతర్యుద్ధం ముగింపునకు శాంతిపూర్వకం తీర్మానం రూపకల్పన దిశగా అమెరికా అడుగులు వేస్తున్నట్లు తెలిపారాయన. తన పరిపాలన ఇస్లామోఫోబోబియా, ఇతరత్ర రూపాల్లో ఉన్న పక్షపాత ధోరణిని ఎదుర్కొనేందుకు జాతీయ వ్యూహాన్ని అనుసరిస్తోందని.. ఇది ముస్లింలకు మాత్రమే కాకుండా అరబ్, సిక్కు, దక్షిణాసియా అమెరికన్లపై కూడా ప్రభావం చూపెడుతుందని తన బక్రీద్ సందేశంలో బైడెన్ పేర్కొన్నారు.
బైడెన్ ప్రతిపాదించిన ఒప్పందం ఇదే..
మొదటి దశ.. ఇది ఆరు వారాలు కొనసాగుతుంది. ఇందులో ఇజ్రాయెల్-హామాస్ బలగాలు పూర్తిస్థాయిలో కాల్పుల విరమణను పాటించాలి. గాజాలోని జనాలు ఉండే ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనుదిరగాలి. వందల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ప్రతిగా మహిళలు, వృద్ధులు సహా పలువురు బందీలను హమాస్ అప్పగించాలి.
రెండో దశలో.. సైనికులు సహా సజీవ ఇజ్రాయెలీ బందీలందరినీ హమాస్ విడిచిపెట్టాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా వెనక్కి వచ్చేయాలి.
మూడో దశలో.. గాజాలో పునర్నిర్మాణ పనులు భారీస్థాయిలో ప్రారంభమవుతాయి. బందీలుగా ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయినవారి అవశేషాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలి.
Comments
Please login to add a commentAdd a comment