
నేటికి దాదాపు వేయిన్నర సంవత్సరాలనాడు, ఇస్లామీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో నాల్గవ ఖలీఫాగా హజ్రత్ అలీ(ర)పాలన సాగించారు. హజ్రత్ అలీముర్తుజా(ర)చాలా నిరాడంబర పాలకుడు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన నాయకుడు. ముహమ్మద్ ప్రవక్త(స)వారి శిక్షణ, సహచర్యంలో పెరిగినవారు. అధికారం అంటే, స్వలాభం, స్వప్రయోజనం కోసం కాక, ప్రజల ప్రయోజనం కోసం, వారి సంక్షేమంకోసం వినియోగించే సాధనమని నమ్మిన ప్రజా పాలకుడు. తన పాలనలో ఏ ఒక్కరికి అణువంత అన్యాయం జరిగినా ప్రజలకు సంజాయిషీ ఇచ్చుకోవడంతోపాటు, దైవానికీ సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని భావించిన ప్రభువు.
హజ్రత్ అలీ(ర)ఖలీఫా అయినప్పటికీ, అధికారం చేతిలో ఉన్నప్పటికీ అతి నిరాడంబరమైన జీవితం గడిపారు. అధికారాన్ని బాధ్యతగా భావించి ప్రజాసంక్షేమం కోసం వినియోగించారు. కుటుంబ పోషణ నిమిత్తం వ్యవసాయ పనులు చేసేవారు. ప్రభుత్వ ఖజానా నుండి రూపాయి కూడా తీసుకునేవారు కాదు. ఆయన నిరాడంబరతకు అద్దంపట్టే ఒక సంఘటన చూద్దాం.
ఖలీఫా హజ్రత్ అలీ(ర)ఒకసారి రాత్రంతా కష్టపడి కొంతధాన్యం సంపాదించారు. సతీమణి హజ్రత్ ఫాతిమా(ర.అన్‌హా)వాటిని పిండిపట్టి రొట్టెలు కాల్చి వడ్డించారు.
భోజనానికి కూర్చోగానే, ఒక నిరుపేద గుమ్మం ముందుకొచ్చి, ‘అమ్మా.. ఆకలితో ఉన్నాను. కాస్త తినడానికేమైనా పెట్టండమ్మా..’ అని యాచించాడు. వెంటనే హజ్రత్ అలీ దంపతులు తాము తిందామని వడ్డించుకున్న ఆహారాన్ని యాచకునికి దానంచేశారు. తరువాత మిగిలిన పిండిలో మరికొంత కలిపి మళ్ళీ రొట్టెలు తయారుచేశారు. తిందామని కూర్చొనేసరికి ఒక అనాథ వచ్చి యాచించాడు. మళ్ళీ ఆ ఆహారాన్ని అతనికి ఇచ్చివేశారు. మూడవసారి మిగిలిన కాస్తంత పిండితో జావ కాచారు. ఈసారి ఒక ఖైదీ వచ్చి తినడానికి ఏమైనా పెట్టమని అభ్యర్థించాడు. ఈసారి కూడా నోటిదగ్గరి ఆహారాన్ని ఆ నిరుపేద ఖైదీకి దానం చేశారు హజ్రత్ అలీదంపతులు.
ఇక తినడానికి ఆఇంట్లో ఏమీమిగల్లేదుపచ్చిమంచినీళ్ళుతప్ప.అందరూఆరోజు మంచినీళ్ళతోనే కడుపు నింపుకొని పస్తులు పడుకున్నారు. ఒకసారి ప్రభుత్వ ధనాగారానికి కొన్ని పండ్లు వచ్చాయి. అందులోంచి ఒక పండును తన కొడుకు చిన్నారి హుసైన్ తీసుకున్నారు. కాని, అవి ప్రభుత్వ ఖజానాకు వచ్చాయి కాబట్టి అది ప్రజలసొమ్ము – అది ఎంత చిన్నదైనా సరే – వాడుకొనే అధికారం పాలకుడికి లేదని చెప్పి, కొడుకు చేతిలోని ఆ పండును ప్రభుత్వ ఖజానాలో వేసి ప్రజలకు పంచిపెట్టారు.ఈవిధంగా హజ్రత్ అలీ(ర)అధికారాన్ని ఒక అమానతుగా బృహత్తరబాధ్యతగా స్వీకరించారు. పాలకుడంటే కేవలం ప్రజాసంక్షేమం కోసం పని చేసే సేవకుడు మాత్రమేనని ఆచరణాత్మకంగా నిరూపించారు.
పరిపాలన అంటే ప్రజలకు మాత్రమే కాకుండా, దైవానికి కూడా జవాబుదారీ అని ప్రగాఢంగా విశ్వసించిన ఈ ప్రజాపాలకుడు నాలుగుసంవత్సరాల, ఎనిమిదినెలల, ఇరవైనాలుగురోజులు సువర్ణాక్షరాలతో లిఖించదగిన సుపరిపాలన అందించి, అరవైమూడేళ్ళ వయసులో ఇహలోకం వీడి వెళ్ళిపోయారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ప్రజాధనాన్ని సొంతసొమ్ముగా యధేఛ్ఛగా అనుభవిస్తున్న ఈనాటి మనపాలకులు, నాయకులు ఆ మహనీయుని ఆదర్శాల్లో కనీసం కొన్నింటినైనా ఆచరించగలిగితే నేటి మన రాజకీయ, పాలనా వ్యవస్థ పునీతమైపోతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
(నేడు హజ్రత్ అలీ(ర)జయంతి)
Comments
Please login to add a commentAdd a comment