ఫిత్రా పేదల పెన్నిధి | Holy Ramazan month is passing | Sakshi
Sakshi News home page

ఫిత్రా పేదల పెన్నిధి

Published Sun, Jun 10 2018 12:32 AM | Last Updated on Sun, Jun 10 2018 12:32 AM

Holy Ramazan month is passing - Sakshi

చూస్తుండగానే పవిత్ర రమజాన్‌ నెల గడిచిపోతోంది. ఇంకా కొన్నిరోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈనెలలో ముస్లిములు చేయాల్సిన విధి రోజాలు పాటిస్తూనే, సదఖ, ఖైరాత్, జకాత్, ఫిత్రాలు చెల్లించడం. రమజాన్‌లో ఆచరించే అనేక ఆరాధనల్లో ‘ఫిత్రా’ ఒకటి. ఫిత్రా అన్నపదం ఇఫ్తార్‌ నుండి వచ్చింది. ఫిత్ర్‌ అంటే  ఉపవాస విరమణ అన్నమాట. ‘సదఖయే ఫిత్ర్‌’ అంటే రోజా విరమణకు సంబంధించిన దానం అని అర్థం. ధర్మశాస్త్ర పరిభాషలో ‘సదఖయే ఫిత్ర్‌’ అంటే ఉపవాస దీక్షలు పాటించేటప్పుడు జరిగిన లోపాలకు, పొరపాట్లకు పరిహారంగా రమజాన్‌ మాసాంతంలో విధిగా చెల్లించవలసిన  దానం. రోజాలు విధిగా నిర్ణయించిన నాటినుండే ఫిత్రాలు కూడా తప్పనిసరిగా చెల్లించాలని ముహమ్మద్‌ ప్రవక్త (స ) ఆదేశించారు.ఆ కాలంలో ప్రజలు ముఖ్యాహారంగా వినియోగించే పదార్థాలనే పరిగణనలోకి తీసుకొని ఫిత్రాలు చెల్లించేవారు. హజ్రత్‌ అబూసయీద్‌ ఖుద్రీ (ర ) ఇలాచెప్పారు–: ‘ప్రవక్తవారి కాలంలో మేము ఈదుల్‌ ఫిత్ర్‌ (పండుగ) దానంగా ఒక ’సా’ పరిమాణమంత పదార్ధాలను ఇచ్చే వాళ్ళం. ఆ కాలంలో యవలు, ఎండుద్రాక్ష, ఖర్జూరం, జున్ను తదితరాలు ముఖ్య ఆహార పదార్థాలుగా ఉండేవి.‘

సా’ అంటే పావుతక్కువ రెండు శేర్లు..
మారిన కాలాన్ని, నేటి పరిస్థితుల్ని దృష్టిలో ఉంచుకొని ఏ రూపంలో అయినా ఫిత్రాలు చెల్లించవచ్చు. ఫిత్రాలవల్ల రెండురకాల లాభాలున్నాయి. ఒకటి –రోజాలను ఎంత నిష్టగా పాటించినా, మానవ సహజ బలహీనత వల్ల ఏవో చిన్నచిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. వాటికి పరిహారమే ఈ ఫిత్రాలు. వీటివల్ల రోజాలు పవిత్రతను, పరిపూర్ణతను సంతరించుకొని స్వీకారభాగ్యానికి నోచుకుంటాయి. రెండు–, ఫిత్రాలవల్ల సమాజంలోని పేద , బలహీనవర్గాలకు కాస్తంత ఆర్ధిక వెసులుబాటు కలుగుతుంది. తద్వారా వారు కూడా పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోగలుగుతారు. ఈ కారణంగానే ప్రవక్త మహనీయులు ఫిత్రాదానాన్ని ’తూమతుల్లిల్‌ మసాకీన్‌ ’అన్నారు. అంటే ’దీనులు, నిరుపేదల భృతి’ అని అర్థం.అందుకే ప్రవక్తమహనీయులు ఫిత్రాదానాలను ఉపవాసులకే పరిమితంచేయకుండా, ఈపరిధిని విస్తరించారు. అంటే ఉపవాసం ఉన్నా లేకపోయినా అందరూ ఫిత్రా చెల్లించాలి. కుటుంబంలో ఎంతమంది ఉంటే, వారందరి తరఫున కుటుంబ యజమాని ఫిత్రా చెల్లించాలి. పండుగ నమాజు కంటే ముందు జన్మించిన శిశువు తరఫున కూడా తల్లిదండ్రులు ఫిత్రా చెల్లించాలి. పండుగ కంటే ముందే ఈ బాధ్యత నెరవేర్చుకోవాలి.

కనీసం మూడు నాలుగు రోజులముందు చెల్లిస్తే లబ్ధిదారులు పండుగ సామగ్రి కొనుక్కోవడానికి వీలుగా ఉంటుంది. పండుగ సంతోషంలో అందరినీ భాగస్వాములను చేయడమే ఉద్దేశ్యం. ఆహార పదార్థాలు, వస్త్రాలు, నగదు ఏరూపంలో అయినా ఫిత్రా చెల్లించవచ్చు.కనుక పవిత్ర రమజాన్‌ మాసంలో చిత్త శుద్ధితో అన్నిరకాల ఆరాధనలు ఆచరిస్తూ, ఫిత్రాలను కూడా బాధ్యతాయుతంగా నెరవేర్చాలి. మానవీయ విలువల వికాసానికి కృషిచేయాలి. ఈ పవిత్ర మాసంలో ఏదో ఒక రకంగా, ఎంతోకొంత ప్రయోజనం చేకూర్చి, తమపరిధిలో కొందరి మోముపైనైనా చిరునవ్వులు చూడగలిగితే అంతకంటే మహాభాగ్యం మరేమీ ఉండదు. అల్లాహ్‌ అందరికీ సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుకుందాం.

దివినుండి భువికి..
దెవప్రసన్నతను చూరగొనడానికి రోజా పాటించడం, ‘తరావీహ్‌ ’లు ఆచరించడం, దానధర్మాలు చేయడంతో పాటు, ఈ నెల చివరిలో ‘లైలతుల్‌ ఖద్ర్‌’ అన్వేషణలో అధికంగా ఆరాధనలు చేస్తారు. లైలతుల్‌ ఖద్ర్‌ అంటే అత్యంత అమూల్యమైన రాత్రి అని అర్ధం. ఈ రాత్రినే ఖురాన్‌ అవతరణ మొదటిసారిగా ప్రారంభమైంది. ఈ రాత్రి దైవదూతలు దివినుండి భువికి దిగివస్తారు. ఆరాధనలు చేసేవారికోసం వారు మన్నింపు ప్రార్ధనలు చేస్తారు. భక్తులు చేసే అర్ధింపులు, వేడుకోళ్ళకు తథాస్తు పలుకుతారు.ముస్లిములు, ముస్లిమేతరులు అన్న భేదభావం లేకుండా సమాజంలోని పేదసాదలపట్ల సంపన్నులు తమ బాధ్యతను గుర్తెరిగి మసలుకోవలసిన అవసరాన్ని రమజాన్‌ గుర్తుచేస్తుంది. అనవసర భోగవిలాసాలకు తమ ధనం వృధా చేయకుండా అగత్యపరులను ఆదుకోవాల్సిన అవసరాన్ని దివ్య ఖురాన్‌ నొక్కి చెబుతుంది. అందుకే ప్రవక్తవారు రమజాన్‌ను ‘సానుభూతుల నెల’ అన్నారు. ఉపవాసం పాటించడం వల్ల పేదవాళ్ళ ఆకలిబాధలు అర్ధమవుతాయన్నారు. సంపన్నులకు, ముప్పూటలా సుష్టుగా తినేవారికి నిరుపేదల ఆకలికేకలు వినబడవు. అలాంటివారు గనక ఉపవాసం పాటించినట్లయితే ఆకలిబాధ ఎలా ఉంటుందో వారికీ తెలుస్తుంది. తద్వారా పేదసాదలను ఆదుకోవడం, వారికి పట్టెడన్నం పెట్టడం ఎంతగొప్ప పుణ్యకార్యమో వారు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు.
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement