
రంజాన్ వేళ గాజా సిటీలోని తల్ అల్ హవా జిల్లాలోని అల్ దహదున్ ప్రాంతంలో శిథిలాల మధ్యే ఆదివారం ఇఫ్తార్ విందులో పాల్గొన్న పాలస్తీనియన్లు
గాజావాసుల దైన్యం
ఖాన్ యూనిస్: ఏడాదికి పైగా సాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఎటు చూసినా శిథిలాల నడుమే గాజావాసులకు రంజాన్ పవిత్ర మాసం మొదలైంది. చాలామంది ఆత్మియులను కోల్పోయారు. ఇళ్లు లేవు. సరైన తిండి లేదు. బతకుపై భరోసాయే లేదు. అయినా వారిలో ఆశ మాత్రం ఉంది.
సగం కూలిన ఇళ్లలో, తాత్కాలిక గుడారాల్లోనే రంజాన్(Ramadan)ఉపవాసాలు పాటిస్తున్నారు. ఎన్నటికీ తిరిగిరాని తమ ఆత్మియులను పదేపదే తలచుకుంటూ ఇఫ్తార్(Iftar) టేబుళ్ల వద్ద కన్నీటి పర్యంతమవుతున్నారు. కూలగా మిగిలిన ఇళ్లకే దీపకాంతుల తోరణాలు కట్టి కోల్పోయిన వెలుగులను తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.గాజాలో చరిత్రాత్మక ప్రార్థనా స్థలం గ్రేట్ ఒమారీ మసీదు శిథిలావస్థకు చేరింది. దాంతో మతపరమైన ప్రార్థనలకు కేంద్ర స్థలమంటూ కూడా లేకుండా పోయింది.
చాలాచోట్ల ప్రార్థనా స్థలాలన్నీ విధ్వంసమయ్యాయి. అయినా కూలిన భవనాలు, శిథిలాల మధ్యే పాలస్తీనావాసులు ఎన్నో ఆశలతో జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పండుగ అంటే ప్రార్థనలు. రంజాన్ షాపింగ్. బంధువులతో వేడుక. ఈసారి అవన్నీ లేకపోయినా గతేడాదితో పోలిస్తే కాస్త మెరుగ్గా ఉందని గాజావాసులు అంటున్నారు! ‘‘తరువాత ఏం జరుగుతుందోనన్న భయం ఇంకా ఉంది. అయినా గతేడాది కంటే ఈసారి మెరుగే’’అని చెబుతున్నారు
కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు, వీధి వ్యాపారులు అడపాదడపా కనిపిస్తున్నా ఎవరిని చూసినా ఆర్థిక ఇబ్బందులే! నుసిరాత్‌లో హైపర్ మాల్ వంటి సూపర్ మార్కెట్లు తిరిగి తెరుచుకున్నాయి. కానీ దీర్ఘకాలంగా జీవనోపాధే కోల్పోయిన వారిలో కనీసం నిత్యావసర వస్తువులు కూడా కొనే సామర్థ్యం కూడా కన్పించడం లేదు!
రంజాన్ ఏకం చేస్తోంది
ధైర్యంగా మళ్లీ పాలస్తీనా గడ్డపై కాలు పెట్టగలిగినందుకే గర్వపడుతున్నామని గాజావాసులు చెబుతున్నారు. ప్రపంచంలోని అందరు పిల్లల్లాగే తమ చిన్నారులూ సగర్వంగా, ఆనందంగా జీవించాలని ఆశిస్తున్నారు. ‘‘ఈ రంజాన్ మాసం మా అందరినీ ఏకం చేసింది. ఇంతటి యుద్ధం మధ్య కూడా మాకు ఆనందాన్ని, ఆశను అందిస్తోంది. దాడుల్లేకుండా సురక్షితంగా జీవించడమే మా ఏకైక ఆకాంక్ష’’అని ఖాన్ యూనిస్‌కు చెందిన అబూ ముస్తఫా చెప్పుకొచ్చాడు.
కువైట్ సాయం...
దక్షిణ గాజా నగరం రఫాలో రంజాన్ ఉపవాసాలుంటున్న 5,000 మంది పాలస్తీనియన్లకు కువైట్ ఇఫ్తార్ భోజనాలు అందించింది. సూర్యాస్తమయం ప్రార్థన పిలుపుతో వారంతా మైళ్ల పొడవున శిధిలాల మధ్య ఏర్పాటు చేసిన బల్ల వద్ద గుమిగూడి అన్నం, చికెన్‌తో ఉపవాస దీక్షను విరమిస్తున్నారు. యుద్ధానికి ముందు ఆ వీధి రంజాన్ రోజుల్లో ఎంతగా కళకళలాడుతూ ఉండేదో ఇఫ్తార్ ఏర్పాట్లకు సహకరిస్తున్న మలక్ ఫదా భారంగా గుర్తు చేసుకున్నారు.
‘‘నాటి రోజులే నాకిప్పటికీ స్ఫూర్తి! ఈ వీధికి యుద్ధానికి ముందు మాదిరిగా మళ్లీ జీవం పోయడమే నా లక్ష్యం’’అన్నారామె. ఇటు వ్యక్తిగతంగా, అటు సామూహిక నష్టాల నుంచి, యుద్ధం చేసిన గాయాల నుంచి కోలుకునేందుకు పాలస్తీనియన్లు ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా గాజాను వీడేదే లేదని రఫా వాసి మమ్దౌ అరాబ్ అబూ ఒడే కుండబద్దలు కొట్టాడు. ఏం జరిగినా తామంతా ఐక్యంగా ఉన్నామని, ఉంటామని, తమ దేశాన్ని విడిచి వెళ్లబోమని స్పష్టం చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment