
సుమారు వేయిన్నర సంవత్సరాల క్రితం.. ముహమ్మద్ ప్రవక్త(స)ప్రభవనకు పూర్వం.. ఆనాటి సమాజం ఎంతో ఆటవికంగా ఉండేది. అనేక మూఢనమ్మకాలు, అమానుషాలు రాజ్యమేలుతుండేవి. ఆ ఆటవిక దురాచారాల్లో ఆడపిల్లల్ని నిర్దాక్షిణ్యంగా చంపివేయడం లేదా ముక్కుపచ్చలారని ఆడశిశువును సజీవంగా సమాధి చేయడం వంటివి కూడా ఉండేవి. ఆడపిల్లల పట్ల నాటి ప్రజలు దుర్మార్గమైన, క్రూరమైన, పాశవికమైన, ఆటవికమైన, అమానవీయమైన దుస్సంప్రదాయాన్ని అవలంబించేవారు.
ముహమ్మద్ ప్రవక్త(స)ఈ అమానవీయ, అమానుష దుర్మార్గాన్ని శాశ్వతంగా నిర్మూలించారు. స్త్రీ జాతికి జరుగుతున్న అన్యాయాన్ని సమూలంగా తుడిచిపెట్టారు. సీ ్త్రకూడా పురుషుని లాగానే దేవుని సృష్టి అని, తనకూ సమస్త హక్కులున్నాయని ఎలుగెత్తి చాటారు. స్త్రీజాతిని గౌరవించని సమాజం అధోగతి పాలవుతుందని హెచ్చరించారు. తల్లి పాదాల చెంత స్వర్గముందన్నారు. చెల్లెళ్ళను సాకిన అన్నదమ్ములకు స్వర్గ శుభవార్త వినిపించారు. ఆడపిల్లలను పోషించి పెద్దచేసిన తండ్రికి నరక జ్వాలలనుండి విముక్తి అని చాటారు. ఒక వ్యక్తికి ఒక కుమార్తె ఉండి, అతనామెకు ఎలాంటి లోటు రానివ్వకుండా, చూస్తే, అలాంటి వారు స్వర్గంలో తనతో కలిసి ఉంటారని చెప్పారు.
ఎంతో అభివృద్ధిని సాధించామని, శాస్త్రసాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్నామని గొప్పలు చెప్పుకుంటున్న నేటి సమాజంలో మహిళల విషయంలో ప్రవక్త ప్రభవనకు ముందున్నపరిస్థితులే నేటికీ రాజ్యమేలుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఆనాడు మాతృగర్భంలో ఉన్నది ఆడ, మగ అని తెలుసుకునే తెలివితేటలు, విజ్ఞానం లేక ప్రసవం తరువాత చంపేసేవారు. ఈనాడు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో లింగనిర్ధారణ పరీక్షలు చేసి ఆడపిల్ల అని తేలగానే మాతృగర్భంలోనే చిదిమేస్తు న్నారంటే మన పయనం పురోగమనం వైపా.. తిరోగమనంవైపా..!
ఈనాటికీ ఆడవాళ్ళంటే చులకనభావం ఉంది. ఆడ– మగ అసమానతలున్నాయి. మహిళను మనిషిగా కూడా చూడని కుసంస్కారం ఉంది. వారి హక్కుల నిరాకరణ ఉంది. లైంగిక వేధింపులున్నాయి. గృహ హింస ఉంది. అత్తింటి వేధింపులున్నాయి, వరకట్న హత్యలున్నాయి. అదీ ఇదీ అని లేకుండా అన్ని రంగాల్లో మహిళలకు రక్షణ లేని పరిస్థితి సర్వత్రా నెలకొంది. ఇటువంటి పరిస్థితుల్లో, మహిళా సాధికారత అని గొంతుచించుకుంటున్న మనం, వేయిన్నర సంవత్సరాల క్రితమే మహిళలకు అన్నిరకాల హక్కులు ప్రసాదించిన ముహమ్మద్ ప్రవక్త బోధనల పట్ల దృష్టి సారించాల్సిన అవసరం లేదంటారా..?
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్