
‘మీ సామగ్రి అమ్ముకోడానికి ప్రజలకు అబద్ధాలు చెప్పకండి, అసత్య ప్రమాణాలు చెయ్యకండి. అలా చేయడం వల్ల మీ వ్యాపారం అభివృద్ధి చెందినట్లు తాత్కాలికంగా అనిపించినా, చివరికి మీ వ్యాపారం లో శుభాలు అంతరించి పోతాయి. వ్యాపారంలో ఎప్పుడూ నమ్మకం, విశ్వసనీయత కలిగి ఉండాలి. పనికిరాని, నాసిరకం వస్తువుల్ని మాయమాటలు చెప్పి అమ్మడం గాని, సాధారణ లాభం కంటే చాలా ఎక్కువ లాభం గడించడంగాని చేసి, ధర్మబద్ధమైన మీ వ్యాపారాన్ని అధర్మమైనదిగా చేసుకోకండి. సత్యవంతుడైన వ్యాపారి ప్రళయ దినాన ప్రవక్తలు, సత్య సంధులు, షహీదుల సహచర్యంలో ఉంటాడు.’ అని ప్రవక్త మహనీయులవారు ఉపదేశించారు.
అంతేకాదు, మీరు చేస్తున్న పనిలో శుభం (బర్కత్ ) కలగాలంటే ప్రాతః కాలాన్నే నిద్రలేవాలని చెప్పారు. ఉపాథి అన్వేషణలో, ధర్మసమ్మతమైన సంపాదన కోసం ప్రాతః కాలాన్నే ఎంచుకోండి. ఎందుకంటే ఉదయకాల ప్రార్ధన(నమాజ్ ) తరువాత చేసే పనుల్లో శుభాలు, లాభాలు సమృద్ధిగా ఉంటాయి. ధర్మసంపాదనతో జీవితం గడిపినవారు నా సంప్రదాయాన్ని పాటించినవారవుతారు. నా సున్నత్ ను పాటించినవారు తప్పకుండా స్వర్గంలోకి ప్రవేశిస్తారు.
ప్రవక్త మహనీయులవారి ఈ ఉపదేశాల ద్వారా మనకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. కనుక ప్రవక్తవారి సుభాషితాలను దృష్టిలో ఉంచుకొని, వ్యాపారంలో విలువలు పాటించాలి. సాధ్యమైనంతవరకు వినియోగదారునికి మంచి సరుకు, మంచి వస్తువు సమకూర్చే ప్రయత్నం చెయ్యాలి. మీకు నమ్మకంలేని సామగ్రిని మీరసలు అమ్మనే కూడదు. నిజాయితీగా, పట్టుదలతో వ్యాపారం చేసి బాగా సంపాదించుకోవడంలో ఎలాంటి తప్పూలేదు. కాని అబద్ధాలు చెప్పి, కల్తీచేసి, మాయచేసి, మోసంచేసి అడ్డదారులు తొక్కి సంపాదించాలన్న దుర్బుద్ధి ఉండకూడదు.
వ్యాపారంలో నమ్మకం, నిజాయితీ, ఖచ్చితత్వం ఉండాలి. సరుకును కల్తీచేయడం, తూనికలు, కొలతల్లో మోసం చేయడం, అబద్ధం చెప్పడం లాంటి చేష్టలకు పాల్పడితే అలాంటి వ్యాపారికి వినాశం తప్పదని ప్రవక్త హెచ్చరించారు. ఒకసారి ప్రజలు, ‘అన్నిటికన్నా శ్రేష్టమైన సంపాదన ఏది?’ అని ప్రవక్తవారిని అడిగారు. దానికాయన, ‘స్వహస్తాలతో ఆర్జించిన సంపాదన..అబధ్ధం, నమ్మక ద్రోహం లేని వ్యాపారం’ అని సమాధానం చెప్పారు.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్