కాలం దేవుని అపార శక్తి సామర్థ్యాలకు, అసాధారణ కార్యదక్షతకు నిదర్శనం. అందుకే కాలాన్ని సాక్షిగా పెట్టి అనేక యదార్ధాలు చెప్పాడు దైవం. ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే కాలం చెప్పిన అనేక వాస్తవాలు కళ్ళకు కనిపిస్తాయి. ఈ సత్యాన్ని విశ్వసించి తదనుగుణంగా మంచిపనులు చెయ్యాలి. ధర్మబద్ధ కార్యాలు ఆచరించాలి. సమస్త పాపకార్యాలకు. అన్యాయం, అధర్మాలకు దూరంగా ఉండాలి. సత్యంపై స్ధిరంగా ఉన్న కారణంగా కష్టనష్టాలు ఎదురు కావచ్చు. మనోవాంఛలను త్యాగం చేయాల్సి రావచ్చు. అవినీతి, అణచివేత, దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, సత్యమార్గాన పయనిస్తున్న క్రమంలో కష్టాలు, కడగండ్లు సంభవించొచ్చు.
ఇలాంటి అన్నిసందర్భాల్లో మనిషి విశ్వాసానికి నీళ్ళొదలకుండా, సత్యంపై, న్యాయంపై, ధర్మంపై స్ధిరంగా ఉంటూ సహనం వహించాలి. పరస్పరం సత్యాన్ని, సహనాన్ని బోధించుకుంటూ, దేవునిపై భారం వేసి ముందుకు సాగాలి. ఇలాంటి వారు మాత్రమే ఇహపర లోకాల్లో సాఫల్యం పొందుతారని, మిగతావారు నష్టపోతారని మనకు అర్ధమవుతోంది. కాలం విలువను గుర్తించినవారు మాత్రమే వాటినుండి గుణపాఠం నేర్చుకుంటారు. అలా కాకుండా గతకాలాన్ని గాలికొదిలేసి, కొత్త సంవత్సరంలో చైతన్య రహిత చర్యలతో, అర్ధం పర్థం లేని కార్యకలాపాలతో కొత్తకాలాన్ని ప్రారంభిస్తే ప్రయోజనం శూన్యం. కాలం ఎవరి కోసమూ ఆగదు. రాజులు రారాజులు, మాన్యులు, సామాన్యులు, పండితులు, పామరులు అంతా కాలగర్భంలో కలిసి పోయినవారే, కలిసి పోవలసినవారే.
కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేటప్పుడు ఈ వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి. గతం నుండి గుణపాఠం గ్రహిస్తూ భవిష్యత్తును ప్రారంభించాలి. నిస్సందేహంగా కొత్త సంవత్సరాన్ని సంతోషంగా స్వాగతించాల్సిందే. కాని ఆ సంతోషంలో హద్దుల్ని అతిక్రమించ కూడదు. నిషిద్ధ కార్యాలకు నూతన సంవత్సరంలో తావు లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా అందరూ కాలం విలువను గుర్తించి, విశ్వాస బలిమితో సత్యంపై స్థిరంగా ఉంటూ, మంచి పనులు చేస్తూ, ప్రజలకు మంచిని, సత్యాన్ని, సహనాన్ని గురించి బోధిస్తూ, స్వయంగా ఆచరిస్తూ సాఫల్యం పొందడానికి ప్రయత్నించాలి. దైవం మనందరికీ భవిష్యత్ కాలాన్ని దివ్యంగా మలచుకునే సద్బుద్ధిని ప్రసాదించాలని, సమస్త మానవాళికీ సన్మార్గ భాగ్యం ప్రాప్తం కావాలని కోరుకుందాం.
– ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment