రోమా ప్రభుత్వం వారు దుర్మార్గులను, నరహంతకులను దేశద్రోహులను కిరాతకంగా శిక్షించేవారు. వారుపయోగించే అత్యంత క్రూరమైన శిక్షాదండమేమంటే ‘‘నేనే’’! ఫోనీషియన్లచే ప్రవేశపెట్టబడిన అత్యంత కిరాతకమైన అస్త్రమును నేను. నా విూదనే ఈ దుష్టులను వేలాడదీసేవారు. ఇలాంటి క్రూరులకు, నేరస్తులకు చివరి మజిలీగా మిగిలిపోయి, వారి మృతదేహాల దుర్గంధంతో నా జీవితం చాలా దుర్భరంగా గడిచేది!!!
నా బతుకింతేనా? నా దుస్థితిని మార్చేవారే లేరాంటూ నేను ఆక్రోశించడం నిత్యకృత్యమైపోయింది. జీవచ్ఛవంలా మిగిలిన నేను రోమా అధికారుల చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయాను. ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదూ.. నన్ను ‘‘సిలువ’’ అని పిలుస్తారు. ఓ అడ్డుకర్ర, ఓ నిలువ కర్రను తీసుకొని వాటిని జతచేసి నన్ను తయారు చేస్తారు. అమానుషానికి, అవమానానికి చిరునామాను నేను. రోమా సైనికుల పైశాచికాలకు కేంద్రబిందువును నేను. నాకీ స్థితి వద్దంటూ నేను పెడ్తున్న నా మొరను విని నన్ను కనికరించే దాతల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూనే వున్నాను గాని, నా ఆశలన్నీ అడియాసలయ్యాయి.
అయితే ఇంతలో ఓ అద్భుతమైన రోజు నా జీవితంలోకి వస్తుందని కలలోకూడ ఊహించలేదు. సర్వలోకనాథుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు పాపులైన మానవులందరినీరక్షించడానికి పాపిగా మార్చబడి సిలువనైన నన్ను ప్రాణ బలియాగమునకై అర్పించుకున్న మధుర క్షణం... నా శరీరంలోని ప్రతి కణాన్ని ఉత్తేజింపజేసింది. ఆయన స్పర్శ నాకు తగలగానే పవిత్ర పావనమయ్యాను. అప్పటికే అన్యాయపు తీర్పు నొంది భయంకర హింసలతో, కొరడా దెబ్బలతో, చీల్చబడిన దేహముతో రక్తమోడుతున్నకరుణామయుడు, బరువైన నన్ను తన భుజము మీద పెట్టుకోగా ఆ బాధను చూడలేక ఎంత మూల్గులినానో తెలుసా!
‘‘అయ్యో! దేవా ఏ పాపము చేయని నీకెందుకు ఇంత శ్రమ’’ అంటూ అడగాలన్పించింది. ఆ భయంకర బాధలో నేనే ఆయనకు అత్యంత సమీపముగా ఉన్న దాననని సంతోషించాలో లేక ఏమీ చేయలేని నిస్సహాయురాలిగా వున్నానని దుఃఖించాలో అర్థం కాలేదు. వికృత చర్యలు చేసి క్రూరాతిక్రూరంగా ప్రవర్తించిన ఒక వన్యమృగాన్ని కూడా మనుషులు ఇలా హింసించరేమో! తమ సృష్టికి, తమ ఉనికికి, తమ ప్రాణానికి, నిత్య జీవానికి మూలాధారమైన ప్రభువుని గాయపరుస్తుంటే ఒక్క దెబ్బతో వారందరి మీద విరుచుకుపడాలనిపించింది. రాణువవారు కొడుతున్న కొరడా దెబ్బలు అడపాదడపా నాక్కూడా తగులుతుంటే కళ్ళు తిరిగి క్రింద పడేదాన్ని. రాళ్ళదెబ్బలే కాకుండా, పిడిగుద్దులతో ఇష్టానుసారంగా ఎవడుపడితే వాడు నా ప్రభువును కొడుతుంటే చూడలేక నా కళ్ళు గుడ్డివైతే బాగుండన్పించింది. ధవళవర్ణుడు పదివేలలో సుందరుడైన నా ప్రభువు విూద దురంహకారులు, అయోగ్యులైన మూర్ఖులు ఉమ్ములు వేస్తే సురూపిౖయెన నా ప్రేమమూర్తి ఎవరూ చూడనొల్లనివానిగా, అసహ్యకరముగా మారిపోయాడు! అపహాస్యపు నవ్వులతో ఇంతవరకు ఎరుగని దూషణలతో నా ప్రభువును దూషిస్తుంటే నా చెవులకు గళ్ళుపడినట్లు అయింది.
ఒకటా రెండా నా కరుణామయుని శ్రమలు చూస్తుంటే నా ఆవేదన కట్టలు తెంచుకొనేది. నన్ను మోయలేక నిస్సహయంగా కిందపడిపోతున్న ప్రతిసారి ఆయనను గట్టిగా హత్తుకొని తనివితీర ఆయనకు సేవచేసి ఆదరించాలన్పించేది. కర్కశమైన సూదంటి రాళ్ళు, ఆ గొల్గతా ముండ్లు, మిట్ట మధ్యాన్నపు ఎండ వేడిమి ఒక్క పక్కనైతే ఒక్క చుక్క నీటి కోసం దాహముతో ఆయన విలవిలలాడుతుండడం చూసి ఇన్ని నదులను సృష్టించిన సృష్టికర్తకు దాహము తీర్చేవారు లేరాంటూ కుమిలిపోయాను. తాను నమ్మినవారే తనకు చేసిన ద్రోహాన్ని తలచుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే ఆ నిస్సహాయతను తట్టుకోలేక అహా! నాకు రెక్కలుండినా ఎంత బాగుండును నా కరుణామయుని ఎత్తుకొని ఎగిరిపోయేదానిని కదా, ఈ క్రూరులకు దొరకకుండా దాచిపెట్టేదానను కదాని ఎంత ఆశపడ్డానో! అతికష్టం మీద నన్ను మోసుకుంటూ కల్వరి కొండ శిఖరం మీదకు చేరిన ఈ త్యాగశీలుని చూచి హమ్మయ్యా ఇక నా ప్రభువుని ఇక్కడితో వదిలేస్తారేమోనని చూస్తున్న నాకు ఓ పిడుగులాంటి సంఘటన ఎదురైంది! ఏ పాపమెరుగని ఆ పావన మూర్తిని పట్టుకొని కరుకైన మేకులు తెచ్చి నిర్దయగా నా విూద పడుకోబెట్టి ఎందరికో స్వస్థతనిచ్చి ఆదరించిన ఆ మహానుభావుని చేతులలో, కాళ్ళలో గుచ్చి నాతో బంధించారు. తట్టుకోలేక... దుఃఖంతో నేను అరచిన అరుపులు అరణ్యరోదనగా మిగిలాయి! చేసేది లేక ధైర్యం తెచ్చుకొని భూమికి ఆకాశానికి మధ్యలో నా ప్రభువును చూపుతూ నిలువబడ్డాను.
నా చుట్టూ మూగిన మనుషులలో మానవత్వం మచ్చుకైనా కనిపించలేదు. అంత మిక్కుటమైన శ్రమలో కూడా పల్లెత్తుమాట అనకుండా ప్రభువు మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారని పించింది. ఇంతలో సృష్టంతటిని దద్దరిల్లింప చేసిన మహోన్నతుని స్వరం... ఒక్కసారిగా నా చెవులజొచ్చింది. ఆ స్వరాభిషేకంతో కొద్దిసేపటిలోనే అవివేకియైన నాకళ్ళు తెరవబడ్డాయి. మహోన్నతుడైన దేవుని అపారమైన శక్తిని తేరిచూచాను. ఘోరమైన ఉగ్రత నుండి మానవాళిని రక్షించడానికే ఈ పరమాత్ముడు ఈ నరక యాతననుభవిస్తున్నాడని అర్థమైపోయింది. ఎందుకు ఈ మనుషులపై ఈయనకింత ప్రేమ అనుకుంటూండగా నా మీద ఆనుకొని ఊపిరి సలపని స్థితిలో కూడా తాను పలికిన ఏడు మాటలు నాలో పెను మార్పును తీసుకొచ్చాయి. ఈ మహోన్నతుని ప్రేమ వాక్కులు చీకటినలుముకున్న నా జీవితాన్ని తేజోవంతంగా మార్చేశాయి. అహా! నా బ్రతుకు ఎంత ధన్యమైంది. కలువరి యాత్రలో కడవరకు ఆయనతో కొనసాగే ధన్యత దొరికిందని ఇక నా హృదయం ఉబ్బితబ్బిబ్బైంది.
‘‘సిలువ లేని సందేశం విలువ లేని సందేశం’’ అని ఈనాడు మీరందరూ గుర్తించేలా ప్రభువు నన్ను చేశారు. సిలువకే విలువనిచ్చిన శ్రీమంతుడైన క్రీస్తు ప్రభువే పూజార్హుడు కాని, నేను కానేకాదు. ఈరోజు సిలువనైన నన్ను చూచినవారంతా క్రీస్తు ప్రభువును చూడక తప్పదు. ఆయన పక్కనే వేళ్ళాడబడిన రెండవ దొంగ ప్రభువును వేడగా క్షమాపణ పొందుకొనుటే కాక తక్షణమే పరదైసులో స్థానమును పొందుకున్న విధానమును చూస్తే పాపికి నిజమైన ఆశ్రయదుర్గం యేసుక్రీస్తేనని ఏ జ్ఞానములేని నాకే అర్థమైపోతే జ్ఞానులైన మీకందరికి ఇంకెంత అర్థమవ్వాలి? ఒక్కప్పుడు హీనమైన బతుకు నీడ్చిన నేను ఈ రోజు విశ్వవ్యాప్తంగా ఇంత విలువను పొందుకున్నానంటే నా ప్రభువైన యేసుక్రీస్తును బట్టియే కదా! సిలువ శ్రమ ద్వారా సమస్త మానవులు చేసిన పాపానికి పరిహారం కలిగింది. దుష్టసంహారం జరిగింది. మానవులకు విరోధియైన సాతాను తల చితుకదొక్కబడింది. ఎంత ఘోరపాపికైనా ఎంత భయంకర రోగికైనా సిలువధారియైన యేసుక్రీస్తు యొద్ద రక్షణ, విడుదల, స్వస్థత కలుగుతుందని విదితమైంది.
కొన్ని గంటలు ఆయనతో గడిపిన నాకే ఇంత భాగ్యం దొరికితే విూ కోసమే దిగివచ్చిన విూ రక్షకుణ్ణి విూరంగీకరిస్తే విూ బ్రతుకులెంత ధన్యమవుతాయో తెలుసా? ఈ పునరుత్థానుడైన ప్రభువు తన సిలువ శక్తిని విూకందరికీ అందించాలని కోరుతూ, మీరంతా పాపపు శక్తుల నుండి విడుదల పొంది, సుఖసంతోషాలతో జీవించి మరణం తర్వాత కలుగబోయే నిత్యజీవాన్ని అనుభవించాలని మనసారా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.
ఎప్పటికీ మీ ప్రియ నేస్తం... సిలువ
-షెకీనా గ్లోరి కాలేబ్
బెరాకా మినిస్ట్రీస్, హైద్రాబాద్
Comments
Please login to add a commentAdd a comment