Easter Celebrations
-
కోలాహలంగా ఈస్టర్ వేడుకలు
కొరుక్కుపేట: రాష్ట్రంలో ఈస్టర్ పండగను క్రైస్తవులు ఆదివారం కోలాహలంగా జరుపుకున్నారు. ప్రదానంగా నాగపట్నం వేలాంగణి చర్చిలో ఈస్టర్ పండుగ సంబరాలు మిన్నంటాయి. చైన్నె అంతటా ఈస్టర్ పండుగను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. ముఖ్యంగా క్రైస్తవులు ఈస్టర్ను యేసుక్రీస్తు పునరుత్థానంగా భావించి జరుపుకుంటారు. వెస్లీ టెంపుల్, కేథడ్రల్ టెంపుల్, శాంతోమ్, బీసెంట్ నగర్ వెలాంగణి చర్చ్, పెరంబూర్ మేరీ మాత ఆలయం సహా పలు చర్చీలలో ఆదివారం వేకువజాము నుంచే ప్రత్యేక ప్రార్థనలు, భక్తి గీతాలాపనలు జరిగాయి. వెపేరిలో.... తెలుగు క్రైస్తవుల ప్రదానంగా చైన్నె వేప్పేరిలోని మద్రాసు సెంటినరీ తెలుగు బాప్టిస్టు సంఘంలో సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో ప్రత్యేక పార్థనలు చేపట్టారు. ఇందులో సంఘ అధ్యక్షులు జి రామయ్య, సెక్రటరీ పి.ప్రభుదాసు, ట్రెజరర్ ఏ బాబు లు ఏర్పాట్లును పర్యవేక్షించారు. విల్లివాక్కంలో... అలాగే చైన్నె విల్లివాక్కంలోని యేసు క్రీస్తు కృపా నీరీక్షణ ప్రార్థన ఫౌండేషన్ చర్చిలో ఈస్టర్ను ఘనంగా జరుపుకోగా ఫౌండేషన్ అధ్యక్షులు ఊటూకూరి దేవదానం , సెక్రటరీ సామ్యూల్, ట్రేజరర్ ఊటుకూరి మత్తయ్య, ఫాస్టర్ మాణిక్య రావు, అసిస్టెంట్ పాస్టర్ ఎస్ఆర్ మరియదాస్ పాల్గొని ఈస్టర్ సందేశాన్ని వినిపించారు .40 రోజులు పాటు ఉపవాస ప్రార్థనల్లో పాల్గొన్న మహిళలకు నిర్వాహకులు బహుమతులు అందించారు. యేసుక్రీస్తు సందేశం, దీపాలు ఆర్పివేసి ఏసుక్రీస్తు పునరుత్థానాన్ని ప్రజలకు కళ్లకట్టినట్టు చూపించారు. ఈ సందర్భంగా బాణాసంచా పేలుస్తూ కేక్‌లు కట్ చేశారు. అనంతరం అభిషేకం చేసిన పవిత్ర జలాన్ని క్రైస్తవులపై చల్లి ఆశీర్వదించారు. వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలలో క్రైస్తవ సోదరులు ఈస్టర్ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గత 40 రోజులుగా ఉపవాసం ఉంటూ ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మార్చి 30న మట్టల పండుగ జరిగింది. గత శుక్రవారం ఏసు ప్రభువును శిలువ వేసిన రోజు కావడంతో గుడ్‌ఫ్రైడేగా జరుపుకొని ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండి మధ్యాహ్నం 3 గంటల వరకు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శనివారం రాత్రి 12 గంటల సమయంలో ఏసు ప్రభువు సమాధి నుంచి తిరిగొచ్చిన దినంగా భావించి ప్రతి చర్చిలోనూ వేడుకలు నిర్వహించారు. అదేవిధంగా ఆదివారం ఉదయం ప్రతి చర్చిలోనూ పుష్పాలతో అలంకరించి ఉదయం నుంచి ఈస్టర్ పండు వేడుకలను జరుపుకొని ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకొని వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలోని ప్రతి చర్చిలోనూ క్రైస్తవ సోదరులతో కిటకిటలాడింది. వేలూరు సెంట్రల్ చర్చిలో సీఎస్ఐ బిషప్ శర్మా నిత్యానందం అధ్యక్షతన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. -
భక్తి శ్రద్దలతో ఈస్టర్ (ఫోటోలు)
-
ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘విశ్వాసం, ప్రేరణ గొప్ప శక్తిగా మారి నడిపించే శుభదినం ఇది.. నిర్మలమైన దైవకృప అందరిపై ప్రసరించాలని కోరుకుంటున్నాను. హ్యాపీ ఈస్టర్’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం జగన్ ట్వీటర్లో తెలియజేశారు. విశ్వాసం, ప్రేరణ గొప్ప శక్తిగా మారి నడిపించే శుభదినం ఇది. ఈ ప్రకాశవంతమైన రోజు నిర్మలమైన దైవకృప అందరిపై ప్రసరించాలని కోరుకుంటున్నాను. #HappyEaster — YS Jagan Mohan Reddy (@ysjagan) April 4, 2021 చదవండి: ప్రపంచ వాణిజ్యానికి కేరాఫ్‌గా విశాఖ పోర్టు -
కాంతి పుంజం ప్రభాత కిరణం
బాల్యం నుండి వృద్ధాప్యం వరకు మనిషి తాను చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని ఆకాంక్షిస్తాడు. ఆ విజయం ఇచ్చే సంతృప్తితో కాలాన్ని గడపాలని కోరుకుంటాడు. ఓటమి అంగీకరించడం మనిషికి మింగుడు పడని వ్యవహారం. ప్రపంచంలో చాలా రకాలైన గెలుపులున్నాయి. పరీక్షల్లో, పందెపురంగంలో, ఉద్యోగ బాధ్యతల్లో, అనుకున్నది సాధించడంలో... ఇంకా మరెన్నో. ఏదో ఒక పనిలో విజయాన్ని సాధిస్తేనే మనిషి ఇంత సంతోషంగా ఉంటే.. ప్రతి మనిషికీ ముల్లులా తయారైన మరణాన్నే జయిస్తే... ఇంకెంత ఆనందం! సరిగ్గా రెండువేల సంవత్సరాల క్రితం అదే జరిగింది. మనిషి మెడలు వంచిన మరణానికే మెడలు వంచబడ్డాయి. అంతవరకు ప్రతి ఒక్కరిని తన గుప్పిట్లో బంధించిన మరణం ‘మరణించింది’. అసలు ఈ పుట్టుకకు, మరణానికి దానిని గెలవడానికి ఉన్న సంబంధం ఏమిటి? మనుషులంతా పుడుతున్నారు. ఏదో ఒక రోజు ఏదో ఒకవిధంగా మరణిస్తున్నారు. శరీరం మట్టిలో కలిసిపోతుంది. చనిపోయిన తరువాత మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇలాంటి మదిని తొలిచే ప్రశ్నలన్నింటికీ అద్భుతమైన సమాధానాలు క్రీస్తు మరణ పునరుత్థానాల వలన ప్రపంచానికి లభించాయి. క్రీ.శ 1799లో కాన్రాడ్ రీడ్ అనే యువకుడు తన ఇంటికి దగ్గరలో ఉన్న చెరువుకు చేపలు పట్టడానికి వెళ్ళాడు. చాలాసేపు ప్రయత్నించినా ఒక్క చేపను కూడా పట్టలేకపోయాడు. నిరుత్సాహంతో తిరుగు ప్రయాణమైన అతనికి ఒక నల్లటి రాయి దొరికింది. బరువు సుమారుగా పది కేజీలు ఉంది. ఇంటికి తీసుకెళ్ళాలా వద్దా అని ఆలోచించి చివరకు ఇంటికి తీసుకువచ్చాడు. కొంచెం పాతగా ఉన్న తన ఇంటిలో ఒక తలుపు మాటిమాటికి పడిపోతూ ఉంది. తనకు దొరికిన నల్లటి రాయిని డోర్‌స్టాప్‌గా ఉపయోగించాడు. మూడు సంవత్సరాలు గతించిన తరువాత తన తండ్రి జాన్ రీడ్ ఆ నల్లరాయిని పరిశీలించి నగలను విక్రయించే షాపులో దానిని చూపించమని సలహా ఇచ్చాడు. పెద్దగా ఆసక్తి లేకుండానే తన తండ్రి మాట ప్రకారం షాపుకు వెళ్ళి చూపించగా ఆశ్చర్యపోయే విషయం బయటపడింది. అది ఒక నల్లరాయి కాదు... బంగారం. చాలాకాలం భూమిలో ఉండిపోయిన కారణంగా నల్లరాయిలా ఉంది. ఆ సమయంలో దాని విలువ మూడువేల ఆరువందల డాలర్లు. ఆ కాలంలో అది చాలా పెద్ద మొత్తం. దాని విలువ తెలియని కారణంగా దానిని ఒక డోర్‌స్టాప్‌గా మూడు సంవత్సరాలు ఉపయోగించారు. సరియైన చోటికి తీసుకెళ్ళినప్పుడు దాని విలువేంటో అర్థమయ్యింది. మనిషి దేవుని చేతిలో ఉంటేనే తన విలువేంటో స్పష్టంగా తెలుస్తుంది. ఈ అనంత విశ్వంలో మనిషికి సాటియైనదేదీ లేదు. దేవుడు మానవునికి అత్యంత విలువైన స్థానాన్ని ఇచ్చి ఘనపరిచాడు. అత్యంతాశ్చర్యకరమైన రీతిలో మానవుని తల్లి గర్భంలో రూపించి నిర్మించాడు. తన రూపంలో తన పోలికలో చేసుకొనినందు వలన వల్లమాలిన ప్రేమను మనిషిపై పెంచుకొని ఈ సృష్టి అంతటినీ ఏలుబడి చేసే అధికారమిచ్చాడు. తాను మహోన్నతుడైనప్పటికీ మనిషితో స్నేహం చేయాలని కోరుకున్నాడు. అయితే ఇంగితం కోల్పోయిన మానవుడు తనను సృజించిన దేవుని విూదే తిరుగుబాటు చేయగా తట్టుకోలేకపోయాడు. ప్రేమాస్వరూపి కావడంతో క్రోధంతో కాక కనికరంతో మరలా మనిషికి దగరవ్వాలనే కరుణామయునిగా శరీరాకారాన్ని ధరించి ఈ లోకానికి వచ్చాడు. ద్వేషించిన మానవుణ్ణి అపరిమితముగా ప్రేమించి ప్రాణత్యాగం చేసి రక్షించాలన్నది పరమదేవుని కోరిక. యేసుక్రీస్తు మానవాళిని తమ పాపముల నుండి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. ఆయన జన్మ చాలా ప్రత్యేకమైనది, పరిశుద్ధమైనది. పరమాత్ముని జీవనవిధానం శ్రేష్ఠమైనది, విలక్షణమైనది. ఆయన మరణం కూడా మరెవరితోను సాటికానిది. దయనీయమైనది. మూడవ రోజున జరిగిన ఆయన పునరుత్థానం అద్భుతమైనది. అత్యంతాశ్చర్యకరమైనది. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలు విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. మానవ జీవితాలకు పట్టిన పాపాంధకారాన్ని తొలగించి జీవపు వెలుగునందించాడు క్రీస్తు ప్రభువు. వాస్తవానికి క్రీస్తు మరణం, ఆ తర్వాత పునరుత్థానం సంభవించిన ఆ సమయంలో జరిగిన సంఘటనలు మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాయి. ‘‘నజరేయుడైన యేసు’’ పాపులను రక్షించుటకు సిలువపై ప్రాణమర్పించారు. రోమన్ సైనికులు, యూదా మతపెద్దలు నిర్దాక్షిణ్యంగా యేసుక్రీస్తును సిలువ వేశారు. న్యాయస్థానాల చుట్టూ తిప్పి, కొరడాలతో కొట్టి, ఝెరూషలేము వీధుల్లో సిలువను మోయించి, గొల్గతాపై మేకులు కొట్టి, సిలువలో వ్రేలాడదీసి, పక్కలో బల్లెపు పోటు పొడిచి చిత్రహింసలకు గురిచేశారు. ప్రేమ, సహనములకు కర్తయైన దేవుడు వాటినన్నిటిని సహించి, భరించి సిలువలో మరణించాడు. దేవుని లేఖనాలు యేసుక్రీస్తు సిలువపై మరణించాయని ధ్రువీకరిస్తున్నాయి. యేసుక్రీస్తు దేవుడు గనుక ఆయన రక్తం మాత్రమే మనిషిని పాపం నుండి విడిపిస్తుంది. కలువరి సిలువలో ఆయన కార్చిన రక్తం మాత్రమే మనిషి మనస్సాక్షిని శుద్ధిచేస్తుంది. క్రీస్తు మరణ, పునరుత్థానాలు క్రైస్తవ విశ్వాసానికి, నిరీక్షణకు పునాదిగా నిలిచాయి. ఆధునిక వైద్య శాస్త్రం కూడా యేసుక్రీస్తు మరణం సిలువపైనే జరిగిందని ఒప్పుకోక తప్పలేదు. అది ముమ్మాటికి నిజం కనుక! గెత్సెమనె తోటకు ప్రభువు రాకమునుపు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. శిష్యులను వెంట బెట్టుకొని గెత్సెమనేకు వచ్చిన తర్వాత ఆయన ప్రార్థించుట మొదలు పెట్టెను. శిష్యులు నిద్రించుట చూసిన ప్రభువు వారిని మేల్కొల్పెను. అతి వేదనతో ప్రార్థించుట వలన చెమట రక్తపుబిందువులుగా మారెను. వైద్య పరిభాషలో దానిని హెమాటిడ్రోసిస్ లేదా హెమటోహైడ్రోసిస్ అంటారు. ఒక వ్యక్తి అత్యంత తీవ్రమైన ఒత్తిడికి లోనైనపుడు అతని స్వేద రంధ్రాలనుండి రక్తం స్రవిస్తూ ఉంటుంది. యేసుక్రీస్తు దేహం నుండి కూడా రక్తం స్రవించడానికి కారణం ఇదే. పొందబోయే ఆ భయంకర శిక్ష తీవ్రత గ్రహించినవాడై వేదనతో ప్రార్థించెను. ప్రేతోర్యం అనే స్థలములో యేసుక్రీస్తు అతి తీవ్రంగా కొట్టబడెను. రోమన్లు ఉపయోగించే కొరడా అతి భయంకరమైనది. ఒక్కొక్క కొరడాలో నాలుగు శాఖలుంటాయి. చెక్కతో చేయబడిన పిడి దానికి ఉంటుంది. జంతువుల చర్మముతో చేయబడిన త్రాళ్ళకొనలకు పదునైన ఎండిన ఎముకలు, లోహపు గుళ్ళు ఉంటాయి. కొరడా తయారీని ఊహిస్తేనే భయమనిపిస్తుంది. అటువంటి కొరడాతో యేసుక్రీస్తు ప్రభువును అతి తీవ్రంగా గాయపరిచారు. ముందుగా కొరడా శిక్ష విధించబడిన వ్యక్తి వస్త్రములు లాగివేస్తారు. ఒక మానుకు ఆ వ్యక్తిని కదలకుండా కట్టివేస్తారు. ఆ తరువాత వెనుక భాగమున ఇద్దరు సైనికులు నిలువబడి ఒకరి తర్వాత మరియొకరు విపరీతంగా కొడతారు. దెబ్బలు కొట్టే సైనికులే అలిసిపోతారంటేనే పరిస్థితిని ఊహించుకోవచ్చు. దెబ్బలు కొట్టుచున్నప్పుడు లోహపు గుళ్ళు తీవ్రమైన నొప్పిని కలుగచేస్తాయి. పదునైన ఎముకలు, ముళ్ళు శరీరంలోకి దిగబడి మాంసాన్ని పెకిలిస్తాయి. ఈ ప్రక్రియలో చాలామంది తీవ్ర రక్తస్రావం జరిగి కుప్పకూలిపోతుంటారు. రక్షకుడైన యేసుక్రీస్తు ఆ దెబ్బల ద్వారా మనిషికి స్వస్థత చేకూర్చబడాలని వాటిని భరించెను. సిలువ మరణ శిక్ష మొదటిగా ఫోనీషియన్లు అమలు పరిచేవారు. వారి నుండి పర్షియన్లు, గ్రీసు దేశస్థులు, రోమన్లు ఈ శిక్షను అమలు పరిచేవారు. నేరస్థుడు వెంటనే చనిపోకుండా తీవ్రమైన బాధను అనుభవిస్తూ చచ్చిపోవాలి అనే ఉద్దేశంలో భాగంగా రోమన్లు ఈ శిక్షను విధించేవారు. సిలువ శిక్ష అనేది అవమానకరమైన కార్యంగా భావించేవారు. రోమన్ చట్ట ప్రకారం ఆ దేశస్థులకు సిలువ విధించకూడదు. కేవలం బానిసలకు, తిరుగుబాటుదారులకు, పరాయి దేశస్థులకు ఈ శిక్ష విధించేవారు. యేసుక్రీస్తుకు సిలువ మరణం ఖరారు చేయబడిన తర్వాత పదునైన ముళ్ళు కలిగిన కిరీటాన్ని ఆయన తలమీద పెట్టి... భుజాలపై సిలువను మోపి కల్వరి కొండపైకి నడిపించారు. సిలువ బరువు సుమారుగా 80 నుండి 120 కేజీలు బరువు ఉంటుందని అంచనా. ఆ సిలువను యేసు భుజాలపై మోపి గరుకైన ప్రాంతాల్లో నడిపించారు. కల్వరి అనగా కపాలమనబడిన స్థలము. మనిషి పుర్రె ఆకారంలో ఆ స్థలం ఉంటుంది గనుక దానికి ఆ పేరు వచ్చింది. రోమన్ సైనికులందరూ ఈ ప్రక్రియలో పాల్గొంటారు. వారికి శతాధిపతి నాయకుడుగా ఉండి నడిపిస్తాడు. సిలువ వేసే స్థలానికి తీసుకొని వచ్చిన తరువాత నేరస్థునికి బోళము కలిపిన ద్రాక్షరసం ఇస్తారు. యేసుక్రీస్తు ప్రభువు దానిని తీసుకోలేదు. వెంటనే నేరస్థుని సిలువపై పండబెట్టి చేతుల్లో కాళ్ళలో మేకులు కొడతారు. ఇశ్రాయేలు దేశంలో లభించిన భూగర్భ శాస్త్రవేత్తల నివేదికల ఆధారంగా ఇనుముతో చేయబడిన మేకులు సుమారు ఏడు అంగుళాల పొడవు, సుమారు ఒకటి నుండి రెండు సెంటిమీటర్ల మందం ఉండేవి. ఇటీవల ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ట్యురిన్ వస్త్రపు పరిశోధనల ఆధారంగా మేకులను మణికట్టులో కొట్టేవారని తేలింది. యేసుక్రీస్తు ప్రభువును సిలువ పై ఉంచి చేతులలో కాళ్ళల్లోను కఠినమైన మేకులను దించారు. తీవ్రమైన వేదన యేసు భరించాడు. మేకులతో సిలువకు దిగగొట్టిన తరువాత సుమారు ఆరు గంటలు యేసుక్రీస్తు సిలువపై వ్రేలాడారు. ఏడు మాటలు పలికిన తరువాత పెద్దకేక వేసి తన ప్రాణమర్పించారు. అయితే విశ్రాంతి దినమున దేహములు సిలువ మీద ఉండకూడదు. కాబట్టి కాళ్లు విరుగగొట్టడానికి సైనికులు సిద్ధపడ్డారు. వారు వచ్చి యేసుతో పాటు సిలువ వేయబడిన నేరస్థుల కాళ్ళు విరుగగొట్టారు. అయితే యేసు అంతకు ముందే మతినొందుట చూచి ఆయన కాళ్ళు విరుగగొట్టలేదు. సైనికులలో ఒకడు ఈటెతో ఆయన పక్కలో పొడిచాడు. వెంటనే రక్తం, నీళ్లు కారెను అని బైబిల్లో వ్రాయబడింది. రోమన్లు వాడే బల్లెం పొడవు సుమారు 1.8 మీటర్లు. క్లోరోఫామ్ ను కనిపెట్టిన శాస్త్రవేత్త సర్ జేవ్‌సు సింప్సన్, మరికొంతమంది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వైద్యనిపుణులు యోహాను వ్రాసిన ఈ మాటపై పరిశోధన చేశారు. యేసుక్రీస్తు మరణించిన కొద్దిసేపటికి ఆయన దేహములో పొడవబడిన ఈటె వలన రక్తమును నీళ్ళు బయటకు వచ్చాయి. యేసుక్రీస్తు దేహములో కుడి పక్కన పొడవబడిన బల్లెపు పోటు వలన రక్తం, నీళ్ళు బయటకు వచ్చాయి. ఇక్కడ బల్లెపు కొన లోతుగా గుచ్చుకొనుట ద్వారా గుండె వరకు చేరి అక్కడ ఉన్న కుడి కర్ణిక, కుడి జఠరిక నుండి రక్తం బయటకు వచ్చింది. ఆ తదుపరి నీళ్ళు అనగా దేహములో ఉన్న శ్లేష్మరసం, గుండె చుట్టూ ఉన్న పొర చీల్చబడుటను బట్టి వచ్చిన ద్రవం. వాస్తవాన్ని పరిశీలిస్తే యేసు గొప్ప శబ్ధముతో కేకవేసి అనే మాట లూకా సువార్త 23:46లో చూడగలము. ఒక వ్యక్తి చనిపోయే ముందు పెద్దకేక ఏ పరిస్థితుల్లో వేస్తాడు? ఈ విషయంపై తలపండిన వైద్య శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోనికి వచ్చాయి. సిలువ వేయబడడానికి ముందు సాయంత్రం నుండి తీవ్రవేదన అనుభవించారు. న్యాయస్థానాల యొద్దకు తిప్పడం వలన శరీరం బాగా అలసిపోయింది. కొరడా దెబ్బల ద్వారా చాలా రక్తం పోయింది. తలలో ముళ్ళకిరీటం, భారభరితమైన సిలువ మోయడం, చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టడం ద్వారా దాదాపుగా చాలా రక్తం యేసుక్రీస్తు దేహం నుండి బయటకు పోయింది. శరీరం రక్తం కోల్పోవుట వలన గుండె రక్తప్రసరణ చేయలేని పరిస్థితి, శ్వాసావరోధము, తీవ్రమైన గుండె వైఫల్యం. వైద్య శాస్త్ర ప్రకారం సిలువపై యేసుక్రీస్తు పెద్ద కేకవేసి చనిపోవడానికి కారణములు ఇవే. ఈ విషయంపై ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అనేక మంది వైద్య శాస్త్రవేత్తలు పరిశోధన జరిపి అనేక పుస్తకాలను కూడా వెలువరించారు. వాటిలో మెడికల్ అండ్ కార్డియోలాజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ప్యాషన్ అండ్ క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్, ఎ డాక్టర్ ఎట్ కల్వరి, ద లీగల్ అండ్ మెడికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ట్రయల్ అండ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్’ ముఖ్యమైనవి. ఎందుకాయనకు ఇన్ని కొరడాదెబ్బలు? ఎందుకన్ని అవమానాలు? ఎందుకాయనకన్ని రాళ్ళ దెబ్బలు, ఇన్ని అమానుష చర్యలు? ఎందుకు తలకు ముండ్ల కిరీటం? ఎందుకు పిడిగుద్దులు? ఎందుకు పరిశుద్ధ చేతులకు, కాళ్ళకు మేకులు గుచ్చడం? ఎందుకు పక్కలో బల్లెపు పోటు, సిలువ శిక్ష? పరిశుద్ధ గ్రంథము ఇలా సెలవిస్తుంది. ‘దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.’ అవును! క్రీస్తు సిలువలో మరణించుట ద్వారా ప్రేమ ఋజువుచేయబడింది. మనిషికి బదులుగా దేవుడు పాపములను తనమీద వేసుకొని వాటి శిక్షను భరించాడు. కామ క్రోధ లోభ మోహ మద మాత్స్యర్యాలను జయించిన పరిశుద్ధుడైన దేవుడు మానవాళిని పాపబంధకముల నుండి, పాపశిక్ష నుండి విడుదల చేయుటకు తన్నుతానే బలిగా అప్పగించుకున్నాడు. మానవునిగా ఈ భూమ్మీద క్రీస్తు జీవించిన కాలంలో ఆయన గడిపిన ప్రతీక్షణం పరిశుద్ధతతో, ప్రేమతత్వంతో జాలి కనికరాలతోనే జీవించారు కాని ఏనాడు ఎలాంటి విద్రోహ చర్యలకు పాల్పడలేదు. సమాజాన్నిగాని, తన అనుచరులను గాని ద్రోహకార్యాలకు పాల్పడమని బోధించ లేదు. నిన్నువలె నీ పొరుగువారిని ప్రేమించమని చెప్పడమే కాదు యేసు క్రీస్తు దాన్ని అక్షరాలా చేసి చూపించారు. క్రీస్తు ప్రేమతత్వాన్ని తమ నరనరాల్లో జీర్ణించుకున్న ఎందరో మహనీయులు ప్రపంచానికి దీవెనగా నిలిచారు. తన యవ్వన జీవితాన్ని త్యాగం చేసి దేశాన్ని, తన వారందరిని విడిచి అనేకమంది అనాథలను, అభాగ్యులను చేరదీసి... తల్లికంటే, తోబుట్టువు కంటే మిక్కుటమైన ప్రేమాభిమానాలందించి పురుగుకంటే హీనంగా మారిపోయిన వారి జీవితాలకు మరలా విలువనిచ్చిన మదర్ థెరిస్సా ఒక మంచి ఉదాహరణ. ఎవరి పాపఫలితం వారనుభవించాలి, ఎవరి కర్మకు వారే కర్తలు, తండ్రులు ద్రాక్షపండ్లు తింటే పిల్లల పళ్ళు పులియవు, పాపం చేసిన వారు శాపగ్రస్తులవ్వాల్సిందేనన్న నీతి సూక్తులు, వాక్యాలు మానవులపై గుదిబండలుగా మోపుతున్న తరుణంలో పాపప్రక్షాళనకు, పాపసంహారానికి, పాప పరిహారానికి మానవుడు ఏం చేయాలో తెలియక అవస్థలు పడుతూ ఆయా కార్యాలతో అలసిపోతూ సత్యాన్వేషణలో అలమటిస్తుండగా పాపులను రక్షించుటకు నేనీ లోకానికొచ్చానని, లోకమును ప్రేమిస్తున్నానని, ప్రతి మనిషి పాపపు శిక్షను భరించి నిత్యజీవాన్ని అందించు రక్షకునిగా దిగి వచ్చానని మాటలతో చెప్పడమే కాకుండా చేసి నిరూపించిన త్యాగమూర్తి క్రీస్తు. చేయకూడదనుకున్న వాటినే మాటిమాటికి చేస్తూ, చేయాలనుకున్నవాటిని చేయలేక చతికిలపడుతున్న మనిషిని రక్షించడమే దేవుని అభిలాష. పాప పిశాచితో మనిషి పోరాడలేక విఫలమై చిత్తుగా ఓడిపోయి పతానవస్థకు చేరిపోగా పాపానికి చేయాల్సిన పరిహారం చేసి రక్తమంతా కార్చి, ప్రేమనంతా కనుపరచి, పాపపు కోరలను విరిచి, పాపాన్ని ముక్క చెక్కలు చేసి సమాధి చేసిన ఘనుడు యేసు. ఎవరైనా ఒక మంచి వ్యక్తి చనిపోతే విచారవదనాలతో, బాధాతప్త హృదయాలతో, విలాపముతో, శోకముతో తల్లడిల్లుతారు గాని, యేసుక్రీస్తు మరణ దినాన్ని ‘గుడ్ ఫ్రైడే’గా ఘనపరుస్తున్నారంటే అందులో ఎంత అర్థముందో గమనించాలి. గుడ్ ఫ్రైడే విషాదాన్ని పంచేదికాదు పాపపిశాచితో నలిగిపోతున్న మానవాళికి శుభ ప్రారంభాన్నిచ్చేది. గుడ్‌ఫ్రైడే కేవలం యేసుక్రీస్తు మరణదినం కాదు. మానవుడు పరిశుద్ధతను పొందుకొని నూతనంగా జన్మించడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన రోజు. సిలువలో యేసుప్రభువు పలికిన సప్తస్వరాలు శిథిలమైపోయిన మానవుని జీవితాన్ని అద్భుత నవకాంతిమయ నిర్మాణముగా మార్చి వేశాయి. ప్రపంచానికి ఆయనందించిన వెలలేని ప్రేమ, శత్రువుని కూడా కరిగించగలిగిన క్షమాపణ, ఎంతటి దీనులనైనా అక్కున చేర్చుకోగలిగిన ఆదరణ, ఆప్యాయత చెక్కు చెదరనివని.. ఆ సిలువలో ఆయన ప్రకటించిన నిత్యజీవము చిరస్థాయిగా నిలిచేదని ఋజువు చేశాయి. ఆ పరమాత్ముడైన ప్రభువు అంతటి ఘోరమైన సిలువ శ్రమను అనుభవిస్తూ కూడా సిలువపై పలికిన సుమధుర స్వరాలు మానవాళి యెడల ఆయనకున్న ప్రేమ, శ్రద్ధ, బాధ్యతను తెలియ జేస్తున్నాయి. ఒక వ్యక్తి తన జీవిత చివరి క్షణంలో పలికే మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. యేసుక్రీస్తు తన చివరి క్షణాలు కూడా మానవుని పట్ల తనకున్న ఉద్దేశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు.యేసు ‘‘తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనకు వీరిని క్షమించుమ’’ని చెప్పెను (లూకా 23:34). యేసు సిలువలో పలికిన మాట క్షమాపణ గొప్పతనాన్ని తెలియచేస్తుంది. ఏళ్ళ తరబడి పగను, ప్రతీకారేచ్ఛను తమలో నాటుకున్నవారికి ఓ గుణపాఠాన్ని ఈ మాట నేర్పిస్తుంది. వాస్తవానికి క్రీస్తును హింసిస్తున్న వారంతా క్షమార్హతను కోల్పోయినప్పటికి వారిని మనసారా క్షమించడానికి ఇష్టపడ్డారు. పిల్లలను క్షమించలేని తల్లిదండ్రులు, పెద్దలను క్షమించలేని బిడ్డలు ఉన్న ఈ ప్రపంచంలో క్షమాపణ ఔన్నత్యాన్ని క్రీస్తు తెలియచేశారు. ఎవరైనా పొరపాటున తప్పు చేస్తే వారిని క్షమించడానికి చాలా ఆలోచించే ఈ రోజుల్లో...... తెలిసి తెలిసి తనకు అన్యాయపు తీర్పు తీర్చి సిలువ వేస్తున్నారని తెలిసినా క్షమించగలిగిన గొప్ప క్షమాగుణం ఆయనది. ‘‘నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు.’’ (లూకా 23:43) యేసుక్రీస్తును సిలువ వేసిన సమయంలోనే మరియొక ఇద్దరు వ్యక్తులను సిలువ వేశారు. వారు నేరస్థులు. ఒకతని పేరు గెట్సస్, మరొక వ్యక్తి పేరు డిస్మస్. వారు చేసిన పాపం పండిన రోజు రానే వచ్చింది. ఆ సమయంలో మొదటివాడు తన తప్పుకు తాను పశ్చాత్తాపపడకుండా ఆయనను దూషిస్తూ నీవు క్రీస్తువు గదా. నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించుమని హేళనతో మాట్లాడాడు. నేరానికి తగిన శిక్షను అనుభవిస్తున్నా పశ్చాత్తాపం అతనిలో కనబడుటలేదు. రెండవవాడు మాత్రం అతనిని వారించి యేసువైపు చూచి నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని హృదయపూర్వకంగా ప్రభువు శరణు కోరినపుడు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని దివ్య వాగ్దానం చేశారు. పాపం చేయడం మానవ నైజం కాని, ఆ పాపమునకు తగిన శిక్షనుండి తప్పించు ప్రభువు శరణు వేడుకొంటే తప్పక దేవుని రాజ్యాన్ని కానుకగా అందుకుంటాడు. దేవుని రాజ్యం కలతలు, కన్నీళ్ళు లేని రాజ్యం. ‘‘యేసుక్రీస్తు తన తల్లిని ఇదిగో నీ కుమారుడు అనియు శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని పలికెను’’ (యోహాను 19:26, 27)’’. యేసుక్రీస్తు ప్రభువు తనను నమ్ముకున్నవారిని ఏనాడు ఒంటరిగా విడువడు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏమి కావాలి? అంతవరకు తల్లి ఆలనాపాలనా కుమారునిగా చూసుకున్న ప్రభువు తన తర్వాత తన బాధ్యతను శిష్యునికి అప్పగించాడు. సంబంధ బాంధవ్యాల విలువలు, బాధ్యతలు అంతరించిపోతున్న నేటి దినాలలో యేసుక్రీస్తు పలికిన మాట ఎంత మంచి ఆదర్శాన్ని చూపించింది. వృద్ధాప్యంలోనికి వచ్చిన తల్లిదండ్రులను పెంటకుప్పల మీద, అనాథ శరణాలయాల్లో విడిచిపెట్టి వారిని ఇబ్బందిపెడుతున్న వారికి క్రీస్తు ఇచ్చిన సందేశం చాలా గొప్పది. అంతటి మరణ వేదనలో సయితం తన తల్లి గురించి ఆలోచించిన గొప్ప మనసు ఆయనది. తన శరణుజొచ్చిన ఎన్నడును విడిచిపెట్టేవాడు కాదు. ‘‘ఏలీ, ఏలీ లామా సబక్తానీ అని బిగ్గరగా కేక వేసెను.’’ (మత్తయి 27:46) ఈ మాట అరమేయిక్ అనే భాషలో క్రీస్తు మాట్లాడెను. ఆనాటి దినాలలో యూదులు హెబ్రీ భాషతో పాటుగా అరమేయిక్ భాషను వ్యవహారిక భాషగా మాట్లాడేవారు. యేసు ప్రభువు పలికిన ఈ మాటకు ‘‘నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడచితివి ’’అని అర్థం. నరావతారిగా మానవుని పాపములను తొలగించుటకు, శిక్షను భరించుటకు ఇలకు వచ్చిన ప్రభువు చేతిని తండ్రి వదిలివేసే పరిస్థితి ఎందుకొచ్చింది? పరిశుద్ధుడైన దేవుడు పాపమును ద్వేషించి పాపిని ప్రేమిస్తాడు. యేసుక్రీస్తు ఏ పాపము చేయలేదు అయినను ఎందుకు తండ్రి నుండి ఎడబాటు పొందాల్సి వచ్చింది? ఆయన మన పాపములను ఆయన మీద మోసుకుంటూ పాపముగా మారినందుకే కదా! పాపము మనిషిని దేవుని నుండి దూరం చేస్తుంది. పాపం పరిహరించబడినప్పుడు మాత్రమే మనిషి దేవునితో శ్రేష్ఠమైన సహవాసం కలిగియుండగలడు. దేవునితో సహవాసం ఓ అనిర్వచనీయ అనుభవం. ‘‘దప్పిగొనుచున్నాను (యోహాను 19:28)’’. యేసు క్రీస్తు సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు. మానవునిగా అందరికీ ఉండే అనుభవాలు అనుభవించారు. దేవుడు మాత్రమే చేయగలిగే అద్భుత కార్యములను ఆయన చేసెను. సంపూర్ణ దేవుడుగా ఉన్న ఆయన సంపూర్ణ మానవునిగా మారి దేవునితో తెగిపోయిన సంబంధాన్ని మరలా పునరుద్ధరించాలని ఇష్టపడినాడు. జీవజలమును కానుకగా ఇస్తానని వాగ్దానం చేసిన ప్రభువు దాహంలో అంత మండుటెండలో దప్పిక గొనడం ఎంత బాధాకరం. ఆ దప్పిక శారీరకమైనది కాదు, ఆధ్యాత్మికమైనది. మానవుల రక్షణ, విమోచన ఆ దప్పిక. నీవు రక్షణ పొందిన రోజు మాత్రమే ఆయన దప్పిక తీరుతుంది. ‘‘సమాప్తమైనది.’’ (యోహాను 19:28) ఇది విజయానందంతో వేసే విజయనాదం. ఒక వ్యక్తి తాను తలపెట్టిన కార్యమునంతా ముగించి సాధించాకా వేసే కేక. మరింతకూ ఆయన ఏమి సాధించారు? అంత బిగ్గరగా విజయానందంతో కేక వేసేంత ఏమి జరిగింది? యేసుక్రీస్తు ఈ లోకానికి అనుకోకుండానో, ఏ కారణం లేకుండానో, ఆకస్మికంగానో రాలేదు. ఒక పరమార్థం కలిగి దానిని పని నెరవేర్చుటకు ఆయన వచ్చెను. అంతవరకు ధర్మశాస్త్రమనే కాడి కింద మగ్గిపోతున్న వారిని విడిపించుటకు వచ్చెను. ఆయన ధర్మశాస్త్రమును కొట్టివేయలేదు కానీ దానిని నెరవేర్చి మనుష్యులకున్న తెరను తొలగించాడు. ఆయనకు అప్పగించబడిన దైవచిత్తమును సిలువ మరణం ద్వారా నెరవేర్చి సంతోషముతో కేకవేశారు. ‘‘తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంటున్నాను.’’ (లూకా 23:46) ఆయన సిలువలో ఎంతో తీవ్రమైన వేదనను అనుభవిస్తూ మానసికంగాను, శారీరకంగాను బాధను భరిస్తూ సిలువలో సర్వజనులను ఉద్దేశించి పలికిన మాటలలో చివరి మాట ‘‘అప్పగించుకొంటున్నాను.’’ మనలో ఉన్న ఆత్మ మనం చనిపోయాక దేవుని దగ్గరకు చేరాలి. ఈ లోకంలో ఎలా బతికినా చనిపోయాక దేవుడు అంగీకరించే యోగ్యమైన రీతిలో మన ఆత్మను మనం కాపాడుకోవాలి. మనిషి అంటే కేవలం పైకి కనబడే దేహం మాత్రమే కాదు, లోపల ఆత్మ కూడా ఉందని గ్రహించాలి. చనిపోయాక మట్టి నుండి తీయబడిన దేహం తిరిగి మట్టిలో కలుస్తుంది. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు చేరుకోవాలి. మనలో ఉన్న ఆత్మ దేవుడు అనుగ్రహించిన దానము. గనుక తిరిగి ఆయనకు అప్పగించాలి. యేసుక్రీస్తు ఈ మాటలు పలికిన తర్వాత తలవాల్చి మరణించారు. అంతటితో ఆయన శకం ముగిసిందని రోమన్లు, యూదులు అనుకున్నారు. ఇంక వారికి తిరుగులేదు. తాము చెప్పిందే శాసనం అనుకున్నారు. యేసు సిలువపై చనిపోయిన తరువాత యూదుల న్యాయసభలో ప్రముఖుడైన యోసేపు అనే వ్యక్తి యేసు దేహము తనకిమ్మని పిలాతును అడిగాడు. అరిమతయి యోసేపు అనే వ్యక్తి తనకొరకు తొలచుకున్న సమాధిలో ఉంచారు. ఎవరో అడిగారట!! నీ సమాధిని యేసుకెందుకు ఇస్తున్నావని. అందుకు అతడిచ్చిన సమాధానం ‘‘కేవలం మూడురోజులకు మాత్రమే. ఆ తరువాత ఆయన దానిలో ఉండడు గదా!!’’ ఆదివారం తెల్లవారుచుండగా ఆయన సమాధిని అలంకరించడానికి కొంతమంది వెళ్ళారు. ఆనాటి దినాలలో అనేకులు ప్రవక్తలు చనిపోయాక వారి సమాధులను అలంకరించేవారు. కాబట్టి యేసు సమాధిని కూడా అలంకరించడానికి వెళ్ళారు. వారు వెళ్ళి చూసే సమయానికి ఆశ్యర్యం... అద్భుతం. యేసు సమాధి తెరవబడియుంది. అక్కడ నిలబడియున్న దేవదూత వెళ్ళిన వారికి ఇచ్చిన సందేశం ‘‘క్రీస్తు ఇక్కడ లేడు. లేచి యున్నాడు.’’ ఉరికే ఉత్సాహంతో, ఊపిరాడనివ్వని సంతోషంతో, కట్లు తెంచుకునే హృదయానందంతో శిష్యులు, స్త్రీలు అందరూ ఆ వార్తను లోకానికి చాటాలనుకున్నారు. అప్పటికే ఆయన చెప్పినట్లు తిరిగి లేస్తాడేమోనని ఆనాటి యూదులు, రోమన్ సైనికులు అనేక కథనాలు రచించుకుని సిద్ధంగా ఉన్నారు. కాని ఆ కథలేవీ సత్యం ముందు నిలబడలేదు. విత్తనం నేలను పడి చనిపోయినట్లే ఉంటుంది కానీ అది మొలిచి మహావృక్షముగా మారుతుందని ఎవరు ఊహించగలరు? ఆయనను సిలువ మరణం ద్వారా చంపేశామని జబ్బలు కొట్టుకునే యూదులకు, రోమన్లకు మింగుడుపడని వార్త ‘‘ఆయన సజీవుడై పునరుత్థానుడుగా లేచెను’’. యేసు లేఖనాలు ప్రకారం మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేచెను. క్రీస్తు పునరుత్థానాన్ని ఈస్టర్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పునరుత్థాన పండుగను చాలా భక్తిశ్రద్ధలతో క్రైస్తవులు జరుపుకుంటారు. యేసుక్రీస్తు పునురుత్థానానికి ఆనాటి శిష్యులే సాక్షులు. ‘‘శిష్యులు భ్రమలో ఉన్నారు. అందుకే వారు ఎవరిని చూసినా యేసులాగే కనిపించారు అని తలంచేవారు’’ అని వాదిస్తారు. నిజంగా వారికున్నది భ్రమ అయితే అది కొంతకాలమే ఉంటుంది. క్రీస్తు శిష్యులలో చాలామంది హతసాక్షులయ్యారు. ఒక అబద్ధం కోసం అంతమంది ప్రాణాలర్పించరు కదా! ఉదాహరణకు క్రీస్తు శిష్యుడైన తోమా భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. క్రీస్తు సువార్త మొదటి శతాబ్దంలోనే భారతదేశంలోనికి వచ్చింది. తోమా అనేక సంఘాలను కట్టి చివరకు బల్లెము ద్వారా పొడువబడి చనిపోయాడు. క్రీస్తు మరణంతో పాపం ఓడిపోయింది. అయితే ఆయన పునరుత్థానంతో పాపానికి జీతమైన మరణం సమాధి చేయబడింది. చావు దాని రూపురేఖలను కోల్పోయింది. ఏండ్ల తరబడి పాపిగా ముద్రవేయబడిన మానవుడు హర్షాతిరేకంతో ఆనందించే భాగ్యం కలిగింది. సమస్యలమీద సమస్త మానవ ఉద్రేకాల ఫలితాల మీద చివరకు మరణం మీద విజయం కల్గింది. ఇంతవరకు మానవాళి మీద పురులు విప్పుకొని పంజాలు విసిరిన మరణం కనివిని ఎరుగని రీతిలో మచ్చుకైనా మిగలకుండా మరణించింది. సమాధికి, శ్మశానానికి చేరడమే మానవుని ముగింపనుకున్న వారందరికి పాపరహితుడైన యేసుక్రీస్తు పునరుత్థానం మరో గొప్ప సత్యంతో కళ్ళు తెరుచుకొనేలా చేసింది. మానవునికి ముగింపు లేదని ఒక అపూర్వమైన అనిర్వచనీయమైన నిత్యత్వమనేది వుందని గొంతు చించుకొని చాటి చెప్పింది. దుఃఖముతో, నిరాశా నిస్పృహలతో వేసారిపోతున్న వారందరికి ఆశా కిరణంగా క్రీస్తు వున్నాడన్న అద్భుత సత్యం వెల్లడయిపోయింది. ఎన్నో ఏండ్లుగా ఎన్నో కోట్లమంది సమైక్యంగా పోరాడినా, మన జీవితాల్లో శత్రువై నిలిచిన దుర్వ్యవసనాలు, దౌర్భాగ్యమైన శారీరక వాంఛలు, పాపపు యిచ్ఛలు, విచ్చలవిడి పాపకార్యాలు మరే నరశక్తి వలన పటాపంచలు చేయబడవు గాని పరమాత్ముడు కార్చిన అమూల్య రక్తం ద్వారా చేసిన త్యాగం ద్వారా అందించిన పునరుత్థాన శక్తిచేత మాత్రమే సాధ్యం. యేసు క్రీస్తు దైవత్వము మీద, ఆయన మరణ పునరుత్థానముల మీద సందేహాలు కలిగిన వ్యక్తులలో ఒకనిగా పేరుగాంచిన ఫ్రాంక్ మోరిసన్ యేసు క్రీస్తు మరణమును జయించి తిరిగి లేవ లేదని నిరూపించాలని పరిశీలన ప్రారంభించాడు. అనేక ప్రాంతాలను సందర్శించి, అనేక వివరాలు సేకరించిన తదుపరి ఆయనకు లభించిన చారిత్రక ఆధారాలు అన్నింటిని బట్టి యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించి ఓ అద్భుతమైన పుస్తకాన్ని వ్రాసాడు. దాని పేరు ‘‘ఈ రాతిని ఎవరు కదిలించారు?’’ ఆ పుస్తకంలో యేసుక్రీస్తు పునురుత్థానానికి సంబంధించి అనేక నిరూపణలతో క్రీస్తు పునరుత్థానం వాస్తవికమని తెలియజేశాడు. యేసు మరణాన్ని జయించి తిరిగిలేవలేదు అని చెప్పడానికి ఏవేవో సిద్ధాంతాలను చలామణిలోనికి తీసుకొచ్చారు గాని వాటిలో ఏవీ వాస్తవం ముందు నిలబడలేదు. శిష్యులు తప్పు సమాధినొద్దకు వెళ్ళారని, యేసు దేహం ఎత్తుకుపోయారని, అసలు యేసు సిలువలో చనిపోలేదు... స్పృహతప్పి పడిపోయారని, శక్తిమంతమైన సుగంధద్రవ్యాలు ఆయనకు పూసి బతికించేశారని, శిష్యులు భ్రమపడి యేసు కనబడ్డాడని చెప్పి ఉండవచ్చని ఎన్నో తప్పుడు సిద్ధాంతాలను తెరపైకి తీసుకొచ్చారు. సత్యం ఎప్పుడూ విజయం సాధిస్తుంది. ఖాళీ సమాధి నేర్పించిన పాఠం ఇదే కదా. సత్యాన్ని అందరూ మోసుకెళ్ళి సమాధిలో పెట్టవచ్చును గాని దానిని ఎక్కువ కాలం అక్కడ ఉంచలేరు. యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలు కుల మతాలకు అతీతమైనవి. ఇది మానవ హృదయా లకు సంబంధించినది తప్ప ఈ భౌతికానుభవాలకు చెందినదికాదని యేసుక్రీస్తును రక్షకునిగా రుచి చూచిన వారందరికి యిట్టే అవగతమౌతుంది. లోక వినాశనానికి మూలకారకుడైన అపవాది క్రియలను లయపరచుటకే యేసు క్రీస్తు ప్రత్యక్షమాయెనని సత్యగ్రంథమైన బైబిల్ గ్రంథం స్పష్టపరచింది. యేసుక్రీస్తు పునరుత్థానం వలన మానవ లోకానికి సమాధానం వచ్చింది. యేసుక్రీస్తు చనిపోయారని భయంతో నింపబడి గదిలో ఉన్న ఆయన శిష్యులకు ప్రత్యక్షమై ప్రభువు పలికిన వాగ్దానవచనం ‘‘సమాధానం కలుగును గాక !’’ పునరుత్థానుడైన క్రీస్తును ఎవరైతే హృదయంలోనికి చేర్చుకుంటారో వారి జీవితాలలో గొప్ప సమాధానము ఉంటుంది. ఈనాడు అనేకులు తమ పరిస్థితులనుబట్టి హృదయంలో, కుటుంబంలో సమాధానం లేనివారుగా ఉంటున్నారు. సమాధానం లేకనే ఆత్మహత్యలు, హత్యలు పెరిగిపోతున్నాయి. ఒకసారి సుప్రసిద్ధ సంగీత కళాకారుడు ఒకాయన ప్రపంచస్థాయి సంగీత కచేరి చేశాడు. అతడు వాయించిన సంగీత సమ్మేళనానికి అందరూ ఆశ్చర్యపోయారు. అతడు ఆలపించిన కొన్ని పాటలలో ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది. ‘‘దుఃఖం వలన ఒరిగేదేమిటి? విచారం వలన సాధించేదేమిటి? దుఃఖాన్ని విచారాన్ని దూరంగా విసిరేసి ఆనందంగా ప్రతిరోజు గడిపేయండి.’’ ఆ రాత్రి గడిచి ఉదయం లేచేసరికి అందరూ నివ్వెరపోయే వార్త... ఆ సంగీత స్వర మాంత్రికుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని. ఆనందంగా ప్రతిరోజు గడిపేయండి అని పాడిన వ్యక్తి ఆనందంగా ఉండలేకపోయాడు. శాంతి సమాధానాలు డబ్బు, పేరు ప్రఖ్యాతులతో వచ్చేవి కాదు. శాంతిదూతయైన దేవునికి æహృదయంలో చోటివ్వడం ద్వారా మాత్రమే లభించేవి. పునరుత్థాడైన క్రీస్తు ద్వారా మానవాళి పొందుకునే మరొక వాగ్దానం ‘‘భయపడకుడి’’. ప్రస్తుత ప్రపంచమంతా ఎన్నో భయాలతో నిండియుంది. వ్యాధులు, యుద్ధాలు, వైఫల్యములు, సమస్యలు... ఇంకా ఎన్నో కారణాలు మనిషి భయానికి కారణాలుగా ఉన్నాయి. సర్వశక్తుడైన దేవుని మీద విశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తే విజయం సొంతం అవుతుంది. ఇకముందు ఏమౌతుందో, పరిస్థితులు ఎలా ఉంటాయో అనే భయంతో ఏమీ సాధించలేని వాళ్లు దేవుని మీద విశ్వాసంతో గొప్ప కార్యాలు సాధిస్తున్నారు. క్రీస్తు పునరుత్థానం నిరీక్షణ ప్రసాదించింది. యేసుక్రీస్తు మొదటగా లోకపాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చారు. మానవులందరి రక్షణ కొరకు సిలువ శ్రమను, మరణమును అనుభవించారు. మూడవ దినమున తిరిగిలేచారు. రెండవసారి ఆయన తన ప్రజలను అనగా ఆయన రక్తములో కడుగబడి, పాపక్షమాపణ పొంది పవిత్రజీవితాన్ని, ఆయనయందలి విశ్వాసమును కొనసాగించువారికి నిత్యజీవమును అనుగ్రహించుటకు రాబోవుతున్నారు. ఆయన పునరుత్థానుడై యుండని యెడల ఆ నిరీక్షణకు అవకాశమే లేదు. లోకములో ఎన్నో విషయాల కొరకు ఎదురుచూసి నిరాశ పడతారు కానీ ప్రభువు కొరకు ఎదురుచూసేవారు ఎన్నడు సిగ్గుపడరు. ప్రభువునందు మనిషికున్న నిరీక్షణ ఎన్నడు అవమానమునకు, సిగ్గుకు కారణము కాదు. జోబ్ సుదర్శన్ అనే ఒక క్రైస్తవ రచయిత ఇలా అంటాడు. ‘‘చీకటీ, ప్రకృతిపై నీ గొంగళి కప్పు. గేత్సెమనే తోటలో నా ప్రభువు దురపిల్లుతున్నాడు. వెలుగు అలలారా అణగారండి! సిలువపై నా ప్రభువు వసివాడుతున్నాడు. గాలీ గోల చెయ్యకు...పక్షులారా కిలకిలరావాలు మానండి! సమాధిలో నా ప్రభువు నిద్రిస్తున్నాడు. ప్రాతకామా వేగిరపడు సమాధిలోనికి తొంగిచూడు! అక్కడ లేడు, నా ప్రభువు లేచాడు. దిగ్గజాల్లారా ఘీంకరించండి! మహిమ దేహధారి ఆరోహణమవుతున్నాడు’’. తనను వినమ్రతతో సేవించే ప్రతి హృదయం తో క్రీస్తు ఇలా సంబోధిస్తున్నాడు. ‘‘నా సమాధి దగ్గర నిలుచుండి విలపించవద్దు. నేనక్కడలేను. నేనిప్పుడు వేనవేల పవనాల జవాన్ని జీవాన్ని. కోటి ప్రభలు కలబోసిన కాంతిపుంజాన్ని. పండిన చేలపై వెచ్చగా ప్రసరించే ప్రభాత కిరణాన్ని. రాత్రివేళ అల్లన మిణుకుమనే కోట్లాది నక్షత్రాల వైభవాన్ని. మెల్లని తొలకరి వర్షాన్ని. గుండెల్లో హాయిని నింపే హర్షాన్ని. నా సమాధి దగ్గర నిలుచుండి విలపించవద్దు. నేనక్కడ లేను’’. సాక్షి పాఠకులకు గుడ్‌ఫ్రైడే మరియు ఈస్టర్ శుభాకాంక్షలు. -డా. జాన్ వెస్లీ ఆధ్యాత్మిక రచయిత, వక్త క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
సిలువ మాట్లాడితే... శిలలైనా కరగాల్సిందే!
రోమా ప్రభుత్వం వారు దుర్మార్గులను, నరహంతకులను దేశద్రోహులను కిరాతకంగా శిక్షించేవారు. వారుపయోగించే అత్యంత క్రూరమైన శిక్షాదండమేమంటే ‘‘నేనే’’! ఫోనీషియన్లచే ప్రవేశపెట్టబడిన అత్యంత కిరాతకమైన అస్త్రమును నేను. నా విూదనే ఈ దుష్టులను వేలాడదీసేవారు. ఇలాంటి క్రూరులకు, నేరస్తులకు చివరి మజిలీగా మిగిలిపోయి, వారి మృతదేహాల దుర్గంధంతో నా జీవితం చాలా దుర్భరంగా గడిచేది!!! నా బతుకింతేనా? నా దుస్థితిని మార్చేవారే లేరాంటూ నేను ఆక్రోశించడం నిత్యకృత్యమైపోయింది. జీవచ్ఛవంలా మిగిలిన నేను రోమా అధికారుల చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయాను. ఇంతకీ నేనెవరో చెప్పలేదు కదూ.. నన్ను ‘‘సిలువ’’ అని పిలుస్తారు. ఓ అడ్డుకర్ర, ఓ నిలువ కర్రను తీసుకొని వాటిని జతచేసి నన్ను తయారు చేస్తారు. అమానుషానికి, అవమానానికి చిరునామాను నేను. రోమా సైనికుల పైశాచికాలకు కేంద్రబిందువును నేను. నాకీ స్థితి వద్దంటూ నేను పెడ్తున్న నా మొరను విని నన్ను కనికరించే దాతల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూనే వున్నాను గాని, నా ఆశలన్నీ అడియాసలయ్యాయి. అయితే ఇంతలో ఓ అద్భుతమైన రోజు నా జీవితంలోకి వస్తుందని కలలోకూడ ఊహించలేదు. సర్వలోకనాథుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు పాపులైన మానవులందరినీరక్షించడానికి పాపిగా మార్చబడి సిలువనైన నన్ను ప్రాణ బలియాగమునకై అర్పించుకున్న మధుర క్షణం... నా శరీరంలోని ప్రతి కణాన్ని ఉత్తేజింపజేసింది. ఆయన స్పర్శ నాకు తగలగానే పవిత్ర పావనమయ్యాను. అప్పటికే అన్యాయపు తీర్పు నొంది భయంకర హింసలతో, కొరడా దెబ్బలతో, చీల్చబడిన దేహముతో రక్తమోడుతున్నకరుణామయుడు, బరువైన నన్ను తన భుజము మీద పెట్టుకోగా ఆ బాధను చూడలేక ఎంత మూల్గులినానో తెలుసా! ‘‘అయ్యో! దేవా ఏ పాపము చేయని నీకెందుకు ఇంత శ్రమ’’ అంటూ అడగాలన్పించింది. ఆ భయంకర బాధలో నేనే ఆయనకు అత్యంత సమీపముగా ఉన్న దాననని సంతోషించాలో లేక ఏమీ చేయలేని నిస్సహాయురాలిగా వున్నానని దుఃఖించాలో అర్థం కాలేదు. వికృత చర్యలు చేసి క్రూరాతిక్రూరంగా ప్రవర్తించిన ఒక వన్యమృగాన్ని కూడా మనుషులు ఇలా హింసించరేమో! తమ సృష్టికి, తమ ఉనికికి, తమ ప్రాణానికి, నిత్య జీవానికి మూలాధారమైన ప్రభువుని గాయపరుస్తుంటే ఒక్క దెబ్బతో వారందరి మీద విరుచుకుపడాలనిపించింది. రాణువవారు కొడుతున్న కొరడా దెబ్బలు అడపాదడపా నాక్కూడా తగులుతుంటే కళ్ళు తిరిగి క్రింద పడేదాన్ని. రాళ్ళదెబ్బలే కాకుండా, పిడిగుద్దులతో ఇష్టానుసారంగా ఎవడుపడితే వాడు నా ప్రభువును కొడుతుంటే చూడలేక నా కళ్ళు గుడ్డివైతే బాగుండన్పించింది. ధవళవర్ణుడు పదివేలలో సుందరుడైన నా ప్రభువు విూద దురంహకారులు, అయోగ్యులైన మూర్ఖులు ఉమ్ములు వేస్తే సురూపిౖయెన నా ప్రేమమూర్తి ఎవరూ చూడనొల్లనివానిగా, అసహ్యకరముగా మారిపోయాడు! అపహాస్యపు నవ్వులతో ఇంతవరకు ఎరుగని దూషణలతో నా ప్రభువును దూషిస్తుంటే నా చెవులకు గళ్ళుపడినట్లు అయింది. ఒకటా రెండా నా కరుణామయుని శ్రమలు చూస్తుంటే నా ఆవేదన కట్టలు తెంచుకొనేది. నన్ను మోయలేక నిస్సహయంగా కిందపడిపోతున్న ప్రతిసారి ఆయనను గట్టిగా హత్తుకొని తనివితీర ఆయనకు సేవచేసి ఆదరించాలన్పించేది. కర్కశమైన సూదంటి రాళ్ళు, ఆ గొల్గతా ముండ్లు, మిట్ట మధ్యాన్నపు ఎండ వేడిమి ఒక్క పక్కనైతే ఒక్క చుక్క నీటి కోసం దాహముతో ఆయన విలవిలలాడుతుండడం చూసి ఇన్ని నదులను సృష్టించిన సృష్టికర్తకు దాహము తీర్చేవారు లేరాంటూ కుమిలిపోయాను. తాను నమ్మినవారే తనకు చేసిన ద్రోహాన్ని తలచుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే ఆ నిస్సహాయతను తట్టుకోలేక అహా! నాకు రెక్కలుండినా ఎంత బాగుండును నా కరుణామయుని ఎత్తుకొని ఎగిరిపోయేదానిని కదా, ఈ క్రూరులకు దొరకకుండా దాచిపెట్టేదానను కదాని ఎంత ఆశపడ్డానో! అతికష్టం మీద నన్ను మోసుకుంటూ కల్వరి కొండ శిఖరం మీదకు చేరిన ఈ త్యాగశీలుని చూచి హమ్మయ్యా ఇక నా ప్రభువుని ఇక్కడితో వదిలేస్తారేమోనని చూస్తున్న నాకు ఓ పిడుగులాంటి సంఘటన ఎదురైంది! ఏ పాపమెరుగని ఆ పావన మూర్తిని పట్టుకొని కరుకైన మేకులు తెచ్చి నిర్దయగా నా విూద పడుకోబెట్టి ఎందరికో స్వస్థతనిచ్చి ఆదరించిన ఆ మహానుభావుని చేతులలో, కాళ్ళలో గుచ్చి నాతో బంధించారు. తట్టుకోలేక... దుఃఖంతో నేను అరచిన అరుపులు అరణ్యరోదనగా మిగిలాయి! చేసేది లేక ధైర్యం తెచ్చుకొని భూమికి ఆకాశానికి మధ్యలో నా ప్రభువును చూపుతూ నిలువబడ్డాను. నా చుట్టూ మూగిన మనుషులలో మానవత్వం మచ్చుకైనా కనిపించలేదు. అంత మిక్కుటమైన శ్రమలో కూడా పల్లెత్తుమాట అనకుండా ప్రభువు మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారని పించింది. ఇంతలో సృష్టంతటిని దద్దరిల్లింప చేసిన మహోన్నతుని స్వరం... ఒక్కసారిగా నా చెవులజొచ్చింది. ఆ స్వరాభిషేకంతో కొద్దిసేపటిలోనే అవివేకియైన నాకళ్ళు తెరవబడ్డాయి. మహోన్నతుడైన దేవుని అపారమైన శక్తిని తేరిచూచాను. ఘోరమైన ఉగ్రత నుండి మానవాళిని రక్షించడానికే ఈ పరమాత్ముడు ఈ నరక యాతననుభవిస్తున్నాడని అర్థమైపోయింది. ఎందుకు ఈ మనుషులపై ఈయనకింత ప్రేమ అనుకుంటూండగా నా మీద ఆనుకొని ఊపిరి సలపని స్థితిలో కూడా తాను పలికిన ఏడు మాటలు నాలో పెను మార్పును తీసుకొచ్చాయి. ఈ మహోన్నతుని ప్రేమ వాక్కులు చీకటినలుముకున్న నా జీవితాన్ని తేజోవంతంగా మార్చేశాయి. అహా! నా బ్రతుకు ఎంత ధన్యమైంది. కలువరి యాత్రలో కడవరకు ఆయనతో కొనసాగే ధన్యత దొరికిందని ఇక నా హృదయం ఉబ్బితబ్బిబ్బైంది. ‘‘సిలువ లేని సందేశం విలువ లేని సందేశం’’ అని ఈనాడు మీరందరూ గుర్తించేలా ప్రభువు నన్ను చేశారు. సిలువకే విలువనిచ్చిన శ్రీమంతుడైన క్రీస్తు ప్రభువే పూజార్హుడు కాని, నేను కానేకాదు. ఈరోజు సిలువనైన నన్ను చూచినవారంతా క్రీస్తు ప్రభువును చూడక తప్పదు. ఆయన పక్కనే వేళ్ళాడబడిన రెండవ దొంగ ప్రభువును వేడగా క్షమాపణ పొందుకొనుటే కాక తక్షణమే పరదైసులో స్థానమును పొందుకున్న విధానమును చూస్తే పాపికి నిజమైన ఆశ్రయదుర్గం యేసుక్రీస్తేనని ఏ జ్ఞానములేని నాకే అర్థమైపోతే జ్ఞానులైన మీకందరికి ఇంకెంత అర్థమవ్వాలి? ఒక్కప్పుడు హీనమైన బతుకు నీడ్చిన నేను ఈ రోజు విశ్వవ్యాప్తంగా ఇంత విలువను పొందుకున్నానంటే నా ప్రభువైన యేసుక్రీస్తును బట్టియే కదా! సిలువ శ్రమ ద్వారా సమస్త మానవులు చేసిన పాపానికి పరిహారం కలిగింది. దుష్టసంహారం జరిగింది. మానవులకు విరోధియైన సాతాను తల చితుకదొక్కబడింది. ఎంత ఘోరపాపికైనా ఎంత భయంకర రోగికైనా సిలువధారియైన యేసుక్రీస్తు యొద్ద రక్షణ, విడుదల, స్వస్థత కలుగుతుందని విదితమైంది. కొన్ని గంటలు ఆయనతో గడిపిన నాకే ఇంత భాగ్యం దొరికితే విూ కోసమే దిగివచ్చిన విూ రక్షకుణ్ణి విూరంగీకరిస్తే విూ బ్రతుకులెంత ధన్యమవుతాయో తెలుసా? ఈ పునరుత్థానుడైన ప్రభువు తన సిలువ శక్తిని విూకందరికీ అందించాలని కోరుతూ, మీరంతా పాపపు శక్తుల నుండి విడుదల పొంది, సుఖసంతోషాలతో జీవించి మరణం తర్వాత కలుగబోయే నిత్యజీవాన్ని అనుభవించాలని మనసారా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఎప్పటికీ మీ ప్రియ నేస్తం... సిలువ -షెకీనా గ్లోరి కాలేబ్ బెరాకా మినిస్ట్రీస్, హైద్రాబాద్ -
లైవ్ స్ట్రీమింగ్‌లో పోప్ ఈస్టర్ సందేశం
వాటికన్ సిటీ: కోవిడ్ మహమ్మారిపై పోరాటం చేస్తూ ప్రపంచమే లాక్డౌన్లో ఉన్న నేపథ్యంలో ఈస్టర్ వేడుకల సందడి ఎక్కడా కనిపించలేదు. ఇటలీ నుంచి పనామా వరకు చర్చిలన్నీ బోసిపోయి కనిపించాయి. ప్రజలందరూ ఇళ్లల్లో ఉండే ప్రార్థనలు చేసుకున్నారు. నిర్మానుష్యంగా ఉన్న సెయింట్ పీటర్ చర్చిలో పోప్ ఫ్రాన్సిస్ ప్రార్థనలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన లైవ్ స్ట్రీమింగ్ ద్వారా క్రైస్తవ సోదరుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రపంచ దేశాలన్నీ సోదరభావంతో ఒక్కటై కోవిడ్‌పై పోరాడాలని పిలుపునిచ్చారు. ‘‘ఇవాళ నా ఆలోచనలన్నీ కోవిడ్ వ్యాధితో బాధపడుతున్న వారిపైనే ఉన్నాయి. ఎందరో ఈ మహమ్మారికి బలైపోయారు. తమ ప్రియమైన వ్యక్తుల్ని కోల్పోయారు’’అని అన్నారు. -
మరణం మరణించిన వేళ...
నేడు ప్రపంచంలోని క్రైస్తవులంతా ఈస్టర్ పండుగను భక్తి పారవశ్యంతో జరుపు కొంటున్నారు. సమాధిని గెలిచి లేచిన క్రీస్తు శక్తిని తలపోసుకుంటూ ఆయన దివ్యనామాన్ని స్మరించుకొంటూ తరిస్తున్నారు. యేసును మదిలో నిలుపుకుంటే ఇక కొరతేదీ లేదు అంటూ ఆయన ఘననామాన్ని కీర్తిస్తున్నారు. యేసు ప్రభువును సమాధిచేసి ఎవరి గృహాలకు వారు వెళ్లిపోయారు. రోమన్ సైనికులంతా సమాధి ముందు కాపలాగా ఉన్నారు. శిష్యులు వచ్చి యేసు దేహాన్ని ఎత్తుకుపోయి మృతులలోనుండి యేసు లేచాడని ప్రచారం చేసే అవకాశానికి అడ్డుగా నిలుచున్నారు. ఆదివారం ఉదయాన్న ప్రపంచ మానవ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రభావవంతమైన ఉత్కృష్టమైన వైభవమైన కార్యం జరిగింది. అదే యేసు పునరుత్థానం. ఉత్థానము అంటే లేపబడుట. పునః అనగా తిరిగి. పునరుత్థానము అనగా మరణాన్ని జయించి తిరిగిలేచుట. యేసు పునరుత్థానము జరిగిన ఆ రోజు... ఎన్నో ఏళ్ళుగా తన కబంధ హస్తాలలో బంధించి, నిష్కర్షగా మనుషులను కబళిస్తున్న మరణం మరణించింది. మరణ మృదంగం మూగబోయింది. మనుష్యులను వారి కలలను, వారి ఆశయాలను మూసిపెడుతున్న సమాధి శాశ్వతంగా తెరవబడింది. తాండవమాడుతున్న దుష్టశక్తుల మీద ఖచ్చితంగా ఏనాటికైనా పైచేయి సాధించవచ్చని ఋజువుచేయబడింది. సకల చరాచర సృష్టిని చేసిన దేవునికి అసాధ్యమైనదేదీ ఉండదని తేలిపోయింది. సత్యాన్ని సమాధిలో పెట్టగలం కానీ దానిని ఎక్కువకాలం దానిలో ఉంచలేమన్న ద్విగుణీకృతమైన విషయం బట్టబయలైంది. నిరాశలోనుండి నిరీక్షణ యుగంలోనికి మానవజాతి అడుగుపెట్టింది. ఆవేదనాభరితమైన ప్రతి ప్రశ్నకు సర్వలోకనాథుని పునరుత్థానం అత్యున్నత సమాధానాలను అనుగ్రహించి తన భక్తులను ఆనంద పారవశ్యంతో నింపింది. అంతరంగంలో అద్వితీయమైన కాంతి వింతవింతగా నిండి బతుకంతా నిత్యనూతనమయ్యింది. మానవత్వం దైవత్వంతో నిర్విరామంగా సహవసించడానికి పునాది పడింది. నాలుగు సంవత్సరాలు చాలా కష్టపడి చదివి యూనివర్సిటీలోనే మొదటి స్థానంలో నిలిచి తన కష్టానికి ప్రతిఫలంగా తనచేతికి అందిన సర్టిఫికెట్‌ను చేతపట్టుకొని తన ఆనందాన్ని కడుపు కట్టుకొని ఈ స్థానానికి తీసుకొచ్చిన తల్లిదండ్రులతో పంచుకోవాలన్న ఆశతో గ్రామానికి ప్రయాణమయ్యాడు ఓ ఇంజనీరు. ఫోన్లు పెద్దగా అందుబాటులోనికి రాని ఆ రోజుల్లో ఎర్రబస్సెక్కి ప్రయాణం ప్రారంభించాడు. ఓ మంచి ఉద్యోగం, ఆ తర్వాత పెళ్లి, పిల్లలతో హాయిగా గడుపుతున్నట్టుగా ఊహించుకొంటూ మెల్లగా నిద్రలోనికి జారుకున్నాడు. కాసేపటికి కఠోరమైన బస్సు హారన్ శబ్దానికి ఉలిక్కిపడి లేచాడు. మామూలుగా కన్నా ఇంకొంచెం వేగంగా తన ఇంటివైపు అడుగులు వేయసాగాడు. తన తాత కట్టించిన చిన్న పెంకుటిల్లు ముందు జనాలు గుమిగూడి ఉన్నారు. చాలా కాలం తర్వాత నా కుమారుడు వస్తున్నాడని తల్లి చెప్పడం ద్వారా తనను చూడడానికి ప్రజలు వచ్చియుండొచ్చు అని అనుకుంటూ ఇల్లు సమీపించే సరికి తన ముద్దుల చెల్లి విగతజీవిలా పడివుంది. గుండెలవిసేలా తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ‘‘అన్నయ్యా త్వరగా వచ్చేయి. నిన్ను చూడాలని ఉంది’’ అని చెల్లి రాసిన ఉత్తరం మూడు రోజుల క్రితమే అందింది. బరువెక్కిన గుండెతో వెక్కి వెక్కి ఏడ్చాడు. దహన సంస్కారాలు పూర్తయ్యాయి. ఏదో తెలియని నిశ్శబ్దం ఇంటినంతా కమ్మేసింది. తమకు తోచినట్టుగా ఆదరించిన బంధువులు ఒక్కొక్కరిగా తమను విడచి వెళ్లిపోతున్నారు. తన మనసులో కొన్ని ప్రశ్నలు గిర్రున తిరుగుతున్నాయి. తాను ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదువుకున్న చదువులు తన ప్రశ్నలకు సమాధానాన్ని ఇవ్వలేకపోతున్నాయి. తల్లిదండ్రులను అడిగాడు. వారి దగ్గర కూడా సమాధానాలు లేవు. ‘‘మనిషిని ఎవరు పుట్టిస్తున్నారు? మనిషి ఈ భూమ్మీద ఎందుకు బతుకుతున్నాడు? చనిపోయిన తరువాత మనిషి ఎక్కడకు వెళ్తున్నాడు?’’ ఈ మూడు ప్రశ్నలు ఆ యువకుని తొలిచేస్తున్నాయి. కలవరంతో, భారమైన హృదయంతో, మానసిక సంఘర్షణతో ఇల్లు విడచి బయలుదేరాడు. జవాబులు తెలిస్తే తిరిగొస్తా లేకపోతే నన్ను శాశ్వతంగా మర్చిపోండి అని కన్నవారికి చెప్పి పయనమయ్యాడు. బహుశా చాలామంది ఎన్నో విషయాలను గూర్చి ఆలోచిస్తారు గాని ఈ మూడు విషయాలు గూర్చి ఆలోచించరేమో. వాటిని ఆలోచించేంత సమయం నేటి మనుష్యులకు ఉందా? వాటి సమాధానాలు తెలుసుకోవడమే పరమార్థమని గ్రహించిన యువకుడు మార్గంలో తనకు తారసపడిన ఉపాధ్యాయులను, ఆధ్యాత్మిక గురువులను నిర్మొహమాటంగా ప్రశ్నించాడు. ఒక్కొక్కరి దగ్గరనుండి ఒక్కో విధమైన సమాధానం. బుర్ర వేడెక్కిపోయే విషయాలను కూడా ఓపికతో విన్నాడు. చివరకు ‘‘వీటికి ఈ భూమ్మీద సమాధానం లేదు. అందుకే ప్రపంచమంతా మాయ అంటారు కొందరు’’ అని తనలో తాను గొణుక్కొంటూ మార్గాయాసంతో అటుగా వెళ్తున్న ఓ ఎద్దులబండిని ఆపి కొంతదూరం వెళ్లడానికి సహాయపడమని అడిగి బండెక్కి కూర్చుంటాడు. ఆ బండి నడుపుతున్న వ్యక్తి ముఖంలో ఏదో తెలియని ప్రకాశం, ప్రశాంతత. ఇతడు బహుశా భౌతికంగా ధనవంతుడు కాకపోవచ్చు గాని ఇతడు విశిష్టమైన ఆధ్యాత్మిక కుబేరుడుగా ఉన్నాడు. ‘‘మీ ముఖంలో అగుపిస్తున్న ఆనందానికి కారణం తెలుసుకోవచ్చా?’’ అని ప్రశ్నించాడు. ‘‘తాను ఒకొప్పుడు సప్త వ్యసనాలకు బానిసగా ఉంటూ కుటుంబాన్ని ఛిద్రం చేసుకొంటున్న వేళలో యేసు జీవితం మరియు ఆయన మధురమైన ప్రేమ తనను ఎలా రక్షించాయో సవివరంగా వివరించాడు’’. తాను వెదకుచున్న ప్రశ్నలకు సమాధానాలు లభించే చోటు దొరికిందన్న సంతోషంతో కొన్ని రోజులు మీ ఇంటిలో ఉండవచ్చా? అని అడిగాడు. తప్పకుండా ఉండవచ్చు అన్న సమాధానం ఆ యువకునికి ఊరటనిచ్చింది. ఇంటికి చేరగానే చాలాకాలం తరువాత కడుపునిండా తృప్తిగా అన్నం తిన్నాడు. తనకున్న ప్రశ్నలను వారితో పంచుకున్నాడు. ఏదీ దాచుకోకుండా వారు తమకు తెలిసినది యువకునికి వివరించిన పిదప పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌ను అతని చేతిలో ఉంచారు. నీ మదిలో మెదిలే ప్రతి ప్రశ్నకు దేవుని వాక్యములో సమాధానం ఖచ్చితంగా లభిస్తుంది అని వారు చెప్పడంతో రాత్రంతా దైవగ్రంథాన్ని భక్తితో ఆసక్తితో పఠించడం మొదలుపెట్టాడు. కృపకు రాజబాటలు వేసిన యేసు జనన మరణ పునరుత్థానములు తన మనసును హత్తుకున్నాయి. దేవుడు ఈ లోకానికి వచ్చి ఏవేవో చిన్న చిన్న బహుమానాలు కాదు ఇచ్చింది, తన విలువైన ప్రాణాన్నే బలిదానంగా సమర్పించి, మరణాన్ని జయించి తిరిగిలేచాడు. తాను చెప్పిన మాటలు మరియు తన బల్యర్పణ వాస్తవమైనవని ఆయన పునరుత్థానము ఋజువు చేసిందని విశ్వసించాడు. మానవుని సృష్టించినది ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానాన్ని కనుగొన్నాడు. ‘మానవుడు దేవుని సృష్టి. సర్వశక్తిగల దేవుడు తన రూపములో తన పోలికలో మనిషిని కలుగచేశాడు. ఆ కారణాన్ని బట్టి సృష్టిలో గ్రహాల కన్నా, నక్షత్రాల కన్నా, పాలపుంతల కన్నా మనిషే గొప్పవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే అవన్నియు మనిషి కోసమే సృష్టించబడ్డాయి. మానవుడు కలుగచేయబడిన విధానం చాలా విలక్షణమైనది. మహిమా ప్రభావములు అనే కిరీటాన్ని మనిషికి తొడిగి నీవు ఈ విశ్వాన్ని ఏలుబడి చేయాలని దేవుడు ఆదేశించాడు. క్రైస్తవ విశ్వాసం ప్రకారం మనిషి కోతి నుండి పరిణామం చెందినవాడు కాదు. లేదా ఏదో రసాయన చర్యల ద్వారా ఉద్భవించినవాడు కాదు. దేవుని రూపంలో ఆయన దివ్య ప్రణాళికలను నెరవేర్చడానికి çసృష్టించబడినవాడు. మనిషి ఈ భూమ్మీద ఎందుకు బతుకుతున్నాడు? అనే ప్రశ్నకు సయితం సమాధానం కనుగొన్నాడు. మానవుడు జీవించే డెబ్బయి లేదా ఎనభై సంవత్సరాలు తనకు తాను ఏదో కూడబెట్టేసుకొని సంపాదించుకొని ఏదో ఒకరోజు మరణించడం కానేకాదు. మనిషిగా పుట్టిన ప్రతి మనిషికి ఒక పరమార్థం ఉంటుంది. దానిని తెలుసుకొని మహోన్నతమైన దైవచిత్తానికి లోబడి పదిమందికి ఆశీర్వాదకరంగా, ఆదర్శంగా బతకడమే ఆ పరమార్థం. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే దైవాజ్ఞకు లోబడడంలోనే అమితమైన ఆనంద సంతోషాలు దాగియుంటాయి. చనిపోయిన తరువాత మనిషి ఎక్కడకు వెళ్తున్నాడు? మరణం అందరికి వస్తుంది. సామంతులైనా సామాన్యులైనా, రాజులైనా రోజువారి కూలీలైనా, స్వాములైనా, సోగ్గాళ్ళైనా, ధనికులైనా, దరిద్రులైనా, అక్షరాస్యులైనా నిరక్షరాస్యులైనా, స్త్రీలైనా పురుషులైనా, ఒంటిచేత్తో ప్రపంచాన్ని గడగడలాడించిన వారైనా మరణం ముందు తల వంచాల్సిందే. మరణం తర్వాత ఏం జరుగుతుంది? క్రైస్తవ విశ్వాసం ప్రకారం ఒక మనిషి మరణించిన తరువాత కూడా జీవిస్తాడు. ఈ భూమ్మీద తాను చేసిన పాపాలకు క్షమాపణ పొంది విశ్వాసం ద్వారా దేవుని నీతితో నింపబడితే మోక్షరాజ్యంలో ప్రవేశించి యుగ యుగాలు దేవుని రాజ్యములో అమరుడుగా జీవిస్తాడు. లేని పక్షంలో తన పాపాలకు శిక్షగా నరకములో వేదనను అనుభవిస్తాడు. మరణం తరువాత ఏమి జరుగుతుందో మనుష్యులకు తెలియకపోవచ్చు గాని ఆదిమధ్యాంతరహితుడైన పరమాత్ముడు ఆ విషయాలను తెలిపినప్పుడు మనిషి నమ్మాల్సిందే. ఎంతో కాలంగా చెప్పులరిగేలా ఈ ప్రశ్నలకు సమాధానాలను వెదకుచున్న ఆ యువకుని మనసు కుదుటపడింది. పరమాత్ముని గూర్చిన సత్యం బోధపడింది. సంతోషంతో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి తన సత్యాన్వేషణ ఏవిధంగా కొనసాగిందో, సత్యాన్ని ఏవిధంగా కనుగొన్నాడో చెప్పాడు. యేసు పునరుత్థానం చెందుట వలన తన భక్తులకు విజయానికి సంబంధించిన అనిర్వచనీయమైన భరోసా దొరికింది. ఏ దేవుడైతే తమ గుండెల్లో కొలువుతీరాడో ఆయన మరణాన్ని జయించినవాడు అని జ్ఞప్తికి తెచ్చుకొన్న ప్రతిసారి జీవితం పునీతమౌతుంది. జీవితకాలం ఆయన తమతో తోడుగా ఉంటాడన్న సత్యం వారిని ఆనంద పారవశ్యంలోనికి నడిపిస్తుంది. దుఃఖం నాట్యంగా మారుతుంది. ఓటమిలాగా కనిపించిన పరిస్థితులలో దేవుడు అసాధారణరీతిలో వారికి విజయమిస్తాడనే నమ్మకం స్థిరపడుతుంది. మరణాన్నే జయించగలిగిన దేవుడు కష్టపరిస్థితుల్లో స్మరించుకుంటే పట్టించుకోకుండా ఎందుకుంటాడు? దుష్టశక్తులు కొన్నిసార్లు ఊహించని రీతిలో స్థాయిలో చెలరేగిపోతుంటాయి. అందుబాటులో ఉన్న విజయాన్ని లాగేసుకొనే ప్రయతాన్ని కొందరు నిర్విరామంగా చేస్తూనే ఉంటారు. శారీరకంగా, మానసికంగా కృంగదీయడానికి ప్రయత్నిస్తుంటారు. జీవితం ముగింపు దశకు వచ్చేసిందని హేళన చేస్తారు. యేసుక్రీస్తు జీవితంలో కూడా సరిగ్గా అదే జరిగింది. అంతా తామనుకున్నట్టుగా జరిగించారు. అబద్ధ సాక్ష్యములు పెట్టి, న్యాయం యేసు వైపు ఉన్నప్పటికి పిలాతు మనసును తమవైపు తిప్పుకొని మరణ శాసనాన్ని లిఖించారు. ఆయన మరణాన్ని కన్నుల పండువగా వేడుకగా చూశారు. విపరీతమైన బాధను అనుభవిస్తుంటే ఏదో ఘనకార్యం చేస్తున్నామన్నట్టుగా ఉప్పొంగిపోయారు. సమాధిలో పెట్టబడినప్పుడు ఒకే ద్వారం కలిగిన సమాధిముందు బరువైన రాయిని అడ్డుగా ఉంచారు. వందలాదిమంది సైనికులను కాపలాగా ఉంచారు. అయితే చివరకు ఏమయ్యింది? వారి పన్నాగాలన్ని ఏమయ్యాయి? యేసు ప్రభంజనాన్ని సమాధిముందు ఉంచిన రాయిగాని, రాటుతేలిన రాణువవారుగాని ఆపగలిగారా? అరచేతులతో సూర్యకాంతిని అడ్డుకోవడం తేలికకాదు అనే విషయం ఆదివారం ఉదయాన్నే క్రీస్తు పునరుత్థానంతో ఋజువు చేయబడింది. పైశాచికంగా తమ నోళ్లవెంబడి వడిగా వెలువడిన మాటల పిడుగుల సవ్వడి సద్దుమణిగింది. ప్రగల్భాలు పలికిన నోళ్లు మూతలుపడ్డాయి. ఒంటరిగా మూడురోజులు సమాధిలో ఉన్న యేసు మరణ సంకెళ్ళను తెంచుకొని బయటకు వచ్చాడు. అంతవరకు విరుచుకుపడిన అల్లరిమూకలు మూర్ఛిల్లి పడిపోయారు. అఖండ విజయం ఆయన పాదాక్రాంతమయ్యింది. దుమ్మునిండిన మనిషి హృదయదారుల్లో విజయ ప్రవాహం పరవళ్లు తొక్కింది. బంధాలకు, అప్యాయతలకు, ప్రేమకు చోటులేని సమాజంలో మనిషి కలలు కూడా సమాధిచేయబడుతున్నాయి. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగిపోతున్న వారి ఆశయాలను సమాధిలో కుక్కేస్తున్నారు. యేసు పునరుత్థాన చరితను ఆకళింపు చేసుకోగలిగితే సమాధిలో కూరుకుపోయిన ఆశయాలు, ఉన్నత లక్ష్యాలు మరలా తిరిగి లేస్తాయనే భరోసా వస్తుంది. ఎంతమంది అదిమిపెట్టి పాతాళానికి తొక్కేసినా ఒకానొకరోజు అవి భూమిలోతులను చీల్చుకొని వచ్చే మహాబీజంగా శాఖోప శాఖలుగా పల్లవిస్తాయి. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోగలగడమే నిజమైన విజయానికి నిర్వచనం. నాగలితో జీవితమనే పొలాన్ని అందరూ దున్నేసారని బాధపడడం కంటే ఆ దున్నబడిన పొలంలో విత్తనాలు వేసుకొంటూ పోవడమే సహృదయుల విశిష్ట లక్షణం. సమయం వచ్చినప్పుడు పనలు కోసుకొంటూ ముందుకు సాగిపోవడమే విజయవీరులు ప్రపంచానికి నేర్పించే పాఠం. ‘‘భయపడకుడి, ఆయన ఇక్కడ లేరు. తాను చెప్పినట్లే లేచి యున్నారు.’’ ఇదే మాట నేటికి యెరూషలేములోని యేసుక్రీస్తు సమాధిలోపల చూడగలం. ఖాళీ సమాధి క్రైస్తవ విశ్వాసానికి బలమైన పునాది. ఆ ఖాళీ సమాధి కోట్లాదిమంది హృదయాలలో ఉన్న ఖాళీని పూరించింది. చీకటిని పారదోలింది. ప్రపంచ పోకడ పరుగులోనుండి పరిశుద్ధుని జాడలోనికి మానవాళిని నడిపింది. దౌర్భాగ్యపు కన్నీళ్ళు ఆనందబాష్పాలుగా పరిణామం చెందాయి. శుభప్రదమైన నిరీక్షణ విప్పారింది. డా.జాన్‌వెస్లీ (యువ రచయిత, వక్త) క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
కరోనా: ఇటలీని దాటేసిన అగ్రరాజ్యం
వాషింగ్టన్: కరోనా రక్కసి కోరల్లో చిక్కుకున్న అగ్రరాజ్యం అమెరికా మృతుల్లో మొదటి స్థానానికి చేరుకుంది. రోజూ రెండు వేలకు పైగా మరణాలు నమోదవుతున్న వేళ కోవిడ్ మృతుల్లో ఇటలీతో పోటీపడుతూ వస్తున్న యూఎస్ శనివారం రాత్రి అందిన లెక్కల మేరకు 20 వేల 506 మృతులతో తొలి స్థానంలో నిలిచింది. వైరస్ బారినపడ్డ లెక్కల్లోనూ అమెరికా 5,27,111 కేసులతో తొలిస్థానంలో ఉంది. ఇక యూరప్ దేశాల్లో కోవిడ్ దెబ్బకు ఎక్కువగా బలి అవుతున్న ఇటలీ 19,468 మరణాలతో రెండో స్థానంలో ఉంది. అయితే, జనాభా పరంగా యూఎస్‌తో పోల్చుకుంటే ఇటలీ ఐదు రెట్లు చిన్నది కావడం గమనార్హం. (చదవండి: కరోనా మిస్టరీలు) ఇక చైనాలోని వుహాన్ నగరంలో పుట్టుకొచ్చిన మహమ్మారి కరోనా ఆ దేశంలో తగ్గముఖం పట్టిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో అక్కడ విధించిన ఆంక్షల్ని ఎత్తివేస్తున్నారు. అయితే, యూరప్, యూఎస్‌లో మాత్రం కోవిడ్ విజృంభణ అంతకంతకూ పెరుగుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్ మతస్తులు శనివారం ఈస్టర్ హాలిడే వారాంతాన్ని లాక్డౌన్ పరిస్థితుల్లో ఇళ్లల్లోనే జరుపుకున్నారు. లాక్డౌన్ ఆంక్షలతో వాటికన్ సిటీలో హంగు ఆర్భాటాలు లేక వెలవెలబోయింది. ఈస్టర్ డే సందర్భంగా పీటర్స్ బ్రసీలియా ప్రాంగణం నుంచి పోప్ ఫ్రాన్సిస్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రపంచానికి సందేశం ఇచ్చారు. (చదవండి: నా జీవితంలో అతి పెద్ద నిర్ణయం) -
నిర్లక్ష్యంగా వ్యవహరించారు; పోలీస్‌బాస్ అరెస్టు..!
కొలంబో : శ్రీలంకలో ఈస్టర్ పండుగ రోజు జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహారించారనే కారణంగా పోలీస్ ఉన్నతాధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ముందుగానే నిఘా సమాచారం ఉన్నప్పటికీ సరైన భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని పేర్కొంటూ పోలీస్ చీఫ్ పుజీత్ జయసుందర, రక్షణశాఖ మాజీ చీఫ్ హేమసిరి ఫెర్నాండోను అరెస్టు చేయించింది. ఈస్టర్ సండే (ఏప్రిల్ 21) రోజు ఓ క్రిస్టియన్ చర్చిలో, మరికొన్ని చోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించడంతో 258కి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పోలీస్ అధికారుల అలక్ష్యం వల్లనే ఉగ్రదాడి జరిగిందని శ్రీలంక అటార్నీ జనరల్ డప్పుల డిలివెరా సోమవారం స్పష్టం చేశారు. నిఘావర్గాల హెచ్చరికలపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అటార్నీ జనరల్ సూచనల ప్రకారమే పుజీత్, ఫెర్నాండో అరెస్టుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. కాగా, అరెస్టు సమయంలో ఈ ఇద్దరూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండటం గమనార్హం. (చదవండి : శ్రీలంక పోలీస్ చీఫ్‌పై వేటు) అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం క్రిమినల్ నెగ్లిజన్స్ తీవ్రమైన హత్యానేరమని డిలివెరా అన్నారు. ఈ ఘటనల్లో మరో తొమ్మిదిమందిపై కూడా అభియోగాలున్నాయని, వారు కూడా విచారణ ఎదుర్కోవచ్చని చెప్పారు. ఇప్పటికే పార్లమెంటరీ విచారణ కమిటీ ముందు హాజరైన జయసుందర, ఫెర్నాండో తమ వాదనలు వినిపించారు. ప్రోటోకాల్స్‌ను పాటించడంలో విఫలమైన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన జాతీయ భద్రతకు ముప్పు ఉందన్న హెచ్చరికలను అంచనా వేయలేకపోయారని ఆరోపించారు. -
లంక ఉగ్రవాదులకు కశ్మీర్లో శిక్షణ!
కొలంబో/శ్రీనగర్: శ్రీలంకలోని విలాసవంతమైన హోటళ్లు, చర్చిలపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ 9 మంది బాంబర్లు భారత్‌లోని కశ్మీర్, కేరళ, బెంగళూరును సందర్శించారని శ్రీలంక ఆర్మీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహేశ్ సేనానాయకే వ్యాఖ్యానించారు. వీరంతా శిక్షణ కోసం లేదా ఇతర విదేశీ ఉగ్రసంస్థలతో సంబంధాలు పెంపొందించుకునేందుకు ఈ పర్యటనలు జరిపి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సేనానాయకే బీబీసీ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. దాడి వెనుక విదేశీ హస్తం.. ‘ఆత్మాహుతి బాంబర్లు అందరూ భారత్‌కు వెళ్లారు. కశ్మీర్, బెంగళూరు, కేరళ వెళ్లొచ్చారు. ఆత్మాహుతి దాడులు జరిగిన తీరును జాగ్రత్తగా గమనిస్తే దీని వెనుక బయటివారి హస్తం ఉన్నట్లు తెలుస్తోంది’ అని అన్నారు. భారత నిఘావర్గాల హెచ్చరికల్ని ఎందుకు పట్టించుకోలేదన్న ప్రశ్నకు స్పందిస్తూ..‘ఉగ్రవాదుల కదలికలపై మా దగ్గర కొంత సమాచారం ఉంది. అలాగే అప్పటి పరిస్థితిపై ఇంటెలిజెన్స్ నివేదికలు ఉన్నాయి. అయితే వీటి మధ్య వ్యత్యాసం ఉండటంతో అంత సీరియస్‌గా తీసుకోలేదుæ’ అని స్పష్టం చేశారు. స్వేచ్ఛ ఎక్కువై భద్రతను మరిచారు.. ‘గత పదేళ్లుగా దేశం చాలా ప్రశాంతంగా ఉంది. ప్రజలు చాలా ఎక్కువ స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. అంతర్యుద్ధం కారణంగా 30 ఏళ్లు దేశం ఎలా అట్టుడికిందో వాళ్లు మర్చిపోయారు. ప్రశాంతతకు అలవాటుపడి జాతీయభద్రతను నిర్లక్ష్యం చేశారు’ అని అభిప్రాయపడ్డారు. శ్రీలంకలో ప్రభాకరన్ నేతృత్వంలోని ఎల్టీటీఈకి, ప్రభుత్వానికి మధ్య 30 ఏళ్లపాటు జరిగిన అంతర్యుద్ధంలో దాదాపు లక్షమంది సమిధలయ్యారు. 2009లో శ్రీలంక బలగాలు ప్రభాకరన్‌ను హతమార్చడంతో అంతర్యుద్ధానికి తెరపడింది. ఎన్టీజే ఉగ్రవాదులు కశ్మీర్‌ను సందర్శించారన్న శ్రీలంక ఆర్మీ చీఫ్ సేనానాయకే వ్యాఖ్యలను భారత ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారి ఒకరు ఖండించారు. -
శ్రీలంక పోలీస్ చీఫ్‌పై వేటు
కొలంబో: శ్రీలంకలో ఈస్టర్ పండుగ రోజు జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి ముందుగానే నిఘా సమాచారం ఉన్నప్పటికీ సరైన భద్రతా చర్యలు తీసుకోలేకపోయినందుకు పోలీస్ చీఫ్ పూజిత్ జయసుందరను అధ్యక్షుడు సిరిసేన సోమవారం సస్పెండ్ చేశారు. జయసుందర రాజీనామా చేస్తానని ప్రకటించినప్పటికీ చేయలేదు. దీంతో సిరిసేన ఆయనను సస్పెండ్ చేశారు. సీనియర్ డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్‌గా ఉన్న విక్రమరత్నేను తాత్కాలికంగా పోలీస్ చీఫ్‌గా, మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఇళంగకూన్‌ను రక్షణ శాఖ కార్యదర్శిగా నియమిస్తున్నట్లు సిరిసేన ప్రకటించారు. బాంబు పేలుళ్లకు నేతృత్వం వహించినట్లుగా భావిస్తున్న జహ్రాన్ హషీమ్ కుటుంబంలో 18 మంది కనిపించకుడా పోయారనీ, వారంతా చనిపోయుంటారని తనకు భయంగా ఉందని జహ్రాన్ సోదరి మహ్మద్ హషీమ్ మథానియా చెప్పారు. బాంబు పేలుళ్లు జరిగిన రోజు రాత్రి నుంచి తమ కుటుంబంలో ఐదుగురు కనిపించకుండా పోయారనీ, వారిలో తన తండ్రి, ముగ్గురు తన సోదరులు, మరొకరు తన సోదరి భర్త ఉన్నారని ఆమె తెలిపారు. మళ్లీ శుక్రవారం రాత్రి సైందమరుదు పట్టణంలో పోలీసులు, అనుమానిత ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు చిన్నారులు సహా 10 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. ముసుగుపై నిషేధం అమల్లోకి ఈస్టర్ బాంబు పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంకలో ముస్లిం మహిళలెవరూ బహిరంగ ప్రదేశాల్లో మొహానికి ముసుగులు ధరించకుండా తీసుకొచ్చిన నిషేధం అమల్లోకి వచ్చింది. ముఖం కనిపించకుండా ఎలాంటి ముసుగులూ ధరించకూడదని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. -
శరణార్థులకు ‘ఉగ్ర’ సెగ
కొలంబో/కల్మునయ్: శ్రీలంకలో ఈస్టర్ రోజున ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. చర్చిలు, శ్రీలంకలో ఆశ్రయం పొందుతున్న విదేశీ శరణార్థులకు వేధింపులు ఎక్కువయ్యాయి. తమ దేశం వదిలి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ సహా 15 దేశాలకు చెందిన 1,600 మంది మైనారిటీ మతస్తులు శ్రీలంకలో ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో అత్యధికులు పాకిస్తాన్‌కు చెందిన క్రైస్తవులే ఉన్నారు. నెగంబో పట్టణంలో వీరికి ప్రభుత్వం తాత్కాలిక ఆశ్రయం కల్పించింది. అయితే ఇదే పట్టణంలోని సెయింట్ సెబాస్టియన్ చర్చిని ఉగ్రమూకలు లక్ష్యంగా చేసుకోవడంతో పరిస్థితి దిగజారిపోయింది. ఈ శరణార్థులను వేధింపులకు గురిచేయడంతో పాటు వీరికి ఇళ్లు అద్దెకు ఇచ్చిన యజమానులను కొందరు స్థానికులు బెదిరిస్తున్నారు. మరోవైపు కల్మునయ్, సమ్మంతురై, చావలకడే ప్రాంతాలు మినహా దేశమంతటా రాత్రిపూట కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. బుల్లెట్లు అయిపోవడంతోనే ఆత్మాహుతి కల్మునయ్ పట్టణంలో ఆత్మాహుతి దాడికి పాల్పడింది తమ సభ్యులేనని ఐసిస్ ప్రకటించుకుంది. అబూ హమ్మద్, అబూ సుఫియాన్, అబూ అల్క్వాలు భద్రతా బలగాలతో పోరులో బుల్లెట్లు అయిపోవడంతో తమనుతాము పేల్చేసుకున్నారని వెల్లడించింది. మరోవైపు ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించిన నేపథ్యంలో పోలీసులు, భద్రతాబలగాలు దేశమంతటా విస్తృతంగా సోదాలు జరుపుతున్నాయి. ఆదివారం నాటికి దేశవ్యాప్తంగా 106 మంది అనుమానితుల్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. షాంగ్రీలా హోటల్లో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఇద్దరు ఉగ్రవాదుల అన్న ఇర్ఫాన్ అహ్మద్‌ను అరెస్ట్ చేశామన్నారు. అలాగే తమిళ మాధ్యమంలో బోధించే ఓ స్కూల్ టీచర్(40)ను కూడా అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. సదరు టీచర్ నుంచి 50 సిమ్‌కార్డులు, నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. శుక్రవారం జరిగిన ఆపరేషన్‌లో వరుస బాంబు పేలుళ్ల ప్రధాన సూత్రధారి జహ్రన్ హషీమ్ భార్య ఫాతిమా, కుమార్తె రుసైనాను ఉగ్రవాదుల స్థావరం నుంచి కాపాడామన్నారు. అలాగే నేషనల్ తౌహీద్ జమాత్ నడుపుతున్న ఓ స్కూలులో ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మరో డాక్టర్‌ను అరెస్ట్ చేశామన్నారు. ఆ ముగ్గురిదీ ఒకే కుటుంబం శ్రీలంకలోని కల్మునయ్ శుక్రవారం ఎన్టీజే ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి గురించి ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. భద్రతాబలగాలతో కాల్పుల సందర్భంగా తమను తాము పేల్చేసుకున్న ముగ్గురు ఉగ్రవాదులు ఒకే కుటుంబానికి చెందినవారని తేలింది. దాదాపు 15 మందిని బలికొన్న ఈ ఘటనలో ఉగ్రవాది మొహమ్మద్ హషీమ్, ఆయన కుమారులు జైనీ హషీమ్, రిల్వాన్ హషీమ్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా విద్వేషాన్ని రెచ్చగొడుతూ మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
శ్రీలంక పోలీస్ చీఫ్‌పై వేటు
కొలంబో: శ్రీలంకలో ఈస్టర్ పర్వదినాన ఉగ్రవాదుల మారణకాండను నిలువరించడంలో విఫలమైనందుకు మరో అధికారిపై వేటు పడింది. ఉగ్రదాడిపై నిఘావర్గాలు ముందుగానే హెచ్చరించినప్పటికీ నిర్లక్ష్యంతో వ్యవహరించినందుకు శ్రీలంక ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ) పుజిత్ జయసుందర శుక్రవారం రాజీనామా సమర్పించారు. అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదేశాల నేపథ్యంలో రక్షణ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో ఇప్పటికే రాజీనామా చేయగా, తాజాగా ఐజీపీ జయసుందర బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇంటెలిజెన్స్ కమాండ్ ఏర్పాటు.. ‘ఈ ఉగ్రవాది చోటుచేసుకోవడానికి ప్రస్తుత ప్రభుత్వ వ్యవహారశైలీ కారణమే. దేశంలో జర్నలిస్టుల హత్యలు, కిడ్నాపులు, బలవంతపు వసూళ్లకు పాల్పడిన కొందరు మిలటరీ ఇంటలిజెన్స్ అధికారులను ఇటీవల అరెస్ట్ చేశాం. పరిస్థితిని చక్కదిద్దేందుకు సంయుక్త ఆపరేషన్స్ కమాండ్‌ను ఏర్పాటుచేస్తాం. ప్రజల భద్రత దృష్ట్యా ఇంటింటిని తనిఖీ చేస్తాం’ అని సిరిసేన తెలిపారు. సూత్రధారి.. జహ్రాన్ హషీమ్ నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే) చీఫ్ జహ్రాన్ హషీమ్(40) ఈ ఆత్మాహుతి దాడులకు నేతృత్వం వహించాడని సిరిసేన తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్)కు ఎన్టీజే విధేయత ప్రకటించిందని వెల్లడించారు. ‘ఈస్టర్ రోజున షాంగ్రీలా హోటల్‌పై ఇల్హమ్ అహ్మద్ ఇబ్రహీం అనే ఆత్మాహుతి బాంబర్‌తోపాటు జహ్రాన్ ఈ దాడిలో పాల్గొన్నాడు. ఈ ఆత్మాహుతి దాడిలో వీరిద్దరూ ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచారు’ అని సిరిసేన పేర్కొన్నారు. ముస్లింలపై ఉగ్రముద్ర వద్దు.. ఆత్మాహుతిదాడుల నేపథ్యంలో ముస్లిం సమాజంపై ఉగ్రవాదులుగా ముద్రవేయవద్దని అధ్యక్షుడు సిరిసేన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే)ను నిషేధించే అంశాన్ని మేం పరిశీలించాం. కానీ ఇప్పుడున్న చట్టాల ద్వారా అది సాధ్యం కాదు. ఇందుకోసం త్వరలోనే కొత్త చట్టాన్ని తీసుకువస్తాం’ అని సిరిసేన చెప్పారు. -
వ్యాపారవేత్త ఇంటి నుంచే ప్రణాళిక
కొలంబో: శ్రీలంకలో ఈస్టర్ రోజున వరుస బాంబు పేలుళ్ల వ్యవహారంలో కొత్త అంశాలు తెరమీదకొచ్చాయి. ఆత్మాహుతి దాడులకు శ్రీలంకలోని ప్రముఖ సుగంధద్రవ్యాల వ్యాపారవేత్త ఇల్లు కేంద్రంగా పనిచేసిందని అధికారులు గుర్తించారు. కొలంబో కేంద్రంగా వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారవేత్త మొహమ్మద్ యూసుఫ్ ఇబ్రహీం ఇద్దరు కుమారులు ఈ దాడిలో పాల్గొన్నారు. వీరిలో ఒకరు షాంగ్రీలా హోటల్‌ను లక్ష్యంగా చేసుకోగా, మరొకరు సినమన్ హోటల్ వద్ద తనను తాను పేల్చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. దాడులకు అవసరమైన పేలుడు పదార్థాలను ఇక్కడే భద్రపరిచారన్నారు. ఈ ఉగ్రమూకకు జహ్రన్ హషీమ్(40) అనే ఉగ్రవాది నేతృత్వం వహించాడని చెప్పారు. ఉగ్రదాడులు జరిగిన అనంతరం ఇబ్రహీం ఇంట్లో తనిఖీల కోసం పోలీసులు రాగానే ఇబ్రహీం కోడలు పేలుడు పదార్థాలను పేల్చేసింది. దీంతో ఆమెతో పాటు పోలీస్ అధికారులు చనిపోయారు. ఈ నేపథ్యంలో వ్యాపారవేత్త యూసుఫ్ ఇబ్రహీంను అరెస్ట్ చేసి, ప్రశ్నిస్తున్నారు. అందరూ విద్యావంతులే.. ఈ ఉగ్రదాడిలో మొత్తం 9 మంది ఆత్మాహుతి బాంబర్లు పాల్గొన్నారని శ్రీలంక రక్షణశాఖ సహాయ మంత్రి విజేవర్ధనే తెలిపారు. అంతేకాకుండా వీరంతా బాగా చదువుకున్నవారేనని వ్యాఖ్యానించారు. ‘ఆత్మాహుతిదాడికి పాల్పడ్డవారిలో ఒకరు బ్రిటన్‌లో చదువుకున్నారు. అలాగే ఆస్ట్రేలియాలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఈ దారుణానికి తెగబడ్డ తొమ్మిది మందిలో 8 మందిని ఇప్పటికే గుర్తించాం. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వీరి వివరాలను ఇప్పుడే బయటపెట్టలేం’ అని వెల్లడించారు. శాంతిభద్రతలు అదుపులోకివచ్చేవరకూ రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుందని విజేవర్ధనే పేర్కొన్నారు. కాగా, షాంగ్రీలా హోటల్‌పై ఏప్రిల్ 21న అబ్దుల్ లతీఫ్ అనే వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు స్థానిక పోలీసులను ఉటంకిస్తూ బీబీసీ తెలిపింది. లతీఫ్ 2006–07 మధ్యకాలంలో బ్రిటన్‌లోని కింగ్స్టన్ విశ్వవిద్యాయలంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే వదిలేశాడని వెల్లడించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లిన ఇతను, అక్కడ మాస్టర్స్ పూర్తిచేసినట్లు పేర్కొంది. శ్రీలంక పేలుళ్లకు తమిళనాడులో కుట్ర? సాక్షి ప్రతినిధి, చెన్నై: పేలుళ్లకు సంబంధించిన కీలక సూత్రధారి ఒకరు కోయంబత్తూర్ వచ్చిరనే సమాచారంతో ఎన్ఐఏ, ఎస్ఐసీ పోలీసులు రహస్యంగా విచారించారు. కోయంబత్తూరులో హిందూ సంస్థల నేతలను హతమార్చేందుకు కుట్రపన్నిన స్థానికులు ఇద్దరు, చెన్నైకి చెందిన నలుగురిని గత ఏడాది పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఐసిస్ సానుభూతి పరులుగా తేలడంతో ఈ కేసును ఎన్ఐఏ విచారణకు అప్పగించారు. దీంతో ఎన్ఐఏ అధికారులు అరెస్టైన వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు చేపట్టి పెన్ డ్రైవ్‌లను, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కోయంబత్తూరుకు చెందిన ఐసిస్ సానుభూతి పరులైన ఆ ఆరుగురిని శుక్రవారం మరోసారి ఎన్ఐఏ అధికారులు విచారించి కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం. -
క్షమించండి ఆ విషయంలో తప్పుచేశాం : శ్రీలంక
కొలంబో : ఈస్టర్ పండుగ సందర్భంగా గత ఆదివారం శ్రీలంకలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో 359 మంది అసువులు బాసిన విషయం తెలిసిందే. ఈ దాడులతో అప్రమత్తమైన శ్రీలంక ప్రభుత్వం భద్రతా చర్యలను ముమ్మరం చేసింది. నిందితులను పట్టుకునేందుకు సీఐడీని రంగంలోకి దింపింది. ఈనేపథ్యంలో పేలుళ్లతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఆరుగురు అనుమానితుల పేర్లు, ఫొటోలను శ్రీలంక ప్రభుత్వం గురువారం రాత్రి విడుదల చేసింది. ఇందులో ముగ్గురి మహిళల పాత్ర ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ ఫొటోల విషయంలో శ్రీలంక ప్రభుత్వం ఘోర తప్పిదం చేసింది. ఒకరి ఫొటోకు బదులు మరొకరి ఫొటో ప్రచురించి చేతులు కాల్చుకుంది. తీరా ఈ విషయంపై సదరు వ్యక్తి నిలదీయడంతో తప్పును గుర్తించి క్షమాణలు కోరింది. శ్రీలకం ప్రభుత్వం ప్రకటించిన అనుమానస్పదుల జాబితాలో ఫాతిమా ఖాదీయా ఉగ్రవాదికి బదులు అమెరికా సామాజిక కార్యకర్త అమరా మజీద్ ఫొటోను ప్రచురించింది. ఈ విషయాన్ని గుర్తించిన అమరా మజీద్ ట్విటర్ వేదికగా తనేలాంటి ఉగ్రదాడుల్లో పాలుపంచుకోలేదని, అనవసరంగా నా ఫొటోను ఎందుకు ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఈ ఉదయం శ్రీలంక ప్రభుత్వం ప్రకటించిన ఉగ్రవాదుల జాబితాల్లో నా ఫొటోను గుర్తించాను. ఈస్టర్ పండుగ నాడు శ్రీలంకలో జరిగిన దాడులతో నాకేమి సంబంధం లేదు. ఇప్పటికే మా ముస్లిం వర్గం నిఘా అధికారుల తప్పుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మరోసారి ఇలాంటి తప్పుడు నిందారోపణలు చేయవద్దు. ఒక సారి పున:సమీక్ష జరపండి. దయచేసి ఈ మారణహోమంతో నాకు అంటగడుతూ నిందలు మోపడం ఆపండి. ఇలాంటి సమాచారాన్ని అందించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే తప్పుల వల్ల అమయాకుల కుటుంబం, కమ్యూనిటీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది’ అని వరుస ట్వీట్లతో శ్రీలంక ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ ట్వీట్లతో మేల్కొన్న శ్రీలంక ప్రభుత్వం సామాజిక కార్యకర్తైనా అమరా మజీద్‌కు క్షమాపణలు కోరుతూ ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘ ఈ రోజు మీడియాకు విడుదల చేసిన ఆరుగురు అనుమానస్పద ఉగ్రవాదుల విషయంలో ఘోర తప్పిదం చోటుచేసుకుంది. సీఐడీ అందించిన సమాచారం మేరకు మేం ఫాతిమా ఖాదీయా అనే ఉగ్రవాది ఫొటోను ప్రచురించడం జరిగింది. అయితే ప్రస్తుతం సీఐడీ అందించిన సమాచారం ప్రకారం ఆ ఫొటో ఫాతిమా ఖాదీయాది కాదు. అమెరికాకు చెందిన సామాజిక కార్యకర్తది. ఈ పొరపాటుకు చింతిస్తున్నాం. ఆమె ఫొటోను వెంటనే తొలగిస్తున్నాం.’ అని పేర్కొంది. ఈ విషయాన్ని అమరా మజీదే ట్విటర్ వేదికగా తెలియజేసింది. తన ఫొటోను ఆ జాబితా నుంచి తొలిగించారని పేర్కొంది. ఏది ఏమైనప్పటికి దాడులకు ఏమాత్రం సంబంధం లేని ముస్లిం మహిళను ఉగ్రవాదుల జాబితాలో ప్రకటించడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ముస్లిం పేరు కనిపిస్తే ఉగ్రవాదులేనన్నట్లు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. UPDATE: Sri Lankan police issues apology for wrongly using my photographs in the WANTED list of terror suspects.#EasterSundayAttacksSL #SriLankaAttack #SriLanka #SriLankaBlasts pic.twitter.com/ClejPkh6OF — Amara Majeed (@AmaraMajeed1) 25 April 2019 -
లంకకు ఉగ్ర ముప్పు!
కొలంబో: శ్రీలంకకు ఇంకా ఉగ్రవాద దాడుల ముప్పు ఉండొచ్చని ప్రధాని రణిల్ విక్రమసింఘే అన్నారు. ప్రస్తుతం తాము స్లీపర్‌సెల్స్‌పై దృష్టి సారించామని తెలిపారు. తాజా పేలుళ్ల నిందితులతోపాటు స్లీపర్లుగా ఉన్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామనీ, ఇంకా పేలుళ్లు జరగొచ్చనే అనుమానంతో ఇలా చేస్తున్నామని తెలిపారు. అధ్యక్షుడి సూచనమేరకు రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో గురువారం రాజీనామా చేశారు. మరోవైపు ఈస్టర్ పేలుళ్లలో బుధవారం నాటికి 359 మంది మరణించారని శ్రీలంక ప్రకటించడం తెలిసిందే. మృతిచెందిన వారి సంఖ్య 253 మాత్రమేనని గురువారం ప్రకటించింది. పేలుళ్లతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఆరుగురు అనుమానితుల పేర్లు, ఫొటోలను శ్రీలంక గురువారం రాత్రి విడుదల చేసింది. పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంక వీసా ఆన్ అరైవల్ (ఆగమనాంతర వీసా) అవకాశాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ విధానం ప్రకారం 39 దేశాల ప్రజలకు శ్రీలంకకు చేరుకున్నాక అక్కడ వీసా పొందే అవకాశం గతంలో ఉండేది. పర్యాటకులను ఆకర్షించడం కోసం శ్రీలంక ఈ విధానాన్ని గతంలో తీసుకొచ్చింది. అయితే గత ఆదివారం శ్రీలంకలో జరిగిన పేలుళ్లకు విదేశాలతో సంబంధం ఉందన్న అనుమానాలు వ్యక్తం కావడంతో తాజాగా వీసా ఆన్ అరైవల్‌ను శ్రీలంక తాత్కాలికంగా నిలిపివేసింది. మరో 16 మంది అరెస్టు.. పేలుళ్లకు సంబంధించి తాజాగా మరో 16 మందిని శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 76కి పెరిగింది. శ్రీలంకలో అత్యంత విజయవంతమైన జనరల్‌గా పేరున్న, ఎల్టీటీఈ ప్రభాకరన్‌ను అంతమొందించిన సమయంలో ఆర్మీకి నేతృత్వం వహించిన ఫీల్డ్ మార్షల్ శరత్ ఫోన్సెకా మాట్లాడుతూ ఈ దాడులకు వ్యూహ రచన చేసిన వ్యక్తికి ప్రభాకరన్‌కు ఉన్నంతటి సమర్థత ఉండి ఉంటుందని అన్నారు. -
పేలుళ్లపై ముందే హెచ్చరించాం
న్యూఢిల్లీ: కోయంబత్తూరులో ఐసిస్ కేసు విచారణను ముగించిన వెంటనే, ఆ ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారం మేరకు, శ్రీలంకలో బాంబు దాడులు జరగొచ్చనే నిఘా హెచ్చరికలను శ్రీలంకకు ఈ నెల మొదట్లోనే పంపామని అధికారులు ఢిల్లీలో చెప్పారు. ఐసిస్‌ను స్ఫూర్తిగా తీసుకుని దక్షిణ భారతంలోని ప్రముఖ నేతలను చంపాలని కుట్రపన్నిన ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పట్టుకుని కోయంబత్తూరులో విచారించడం తెలిసిందే. ఆ హెచ్చరికలను రాయబార కార్యాయలం ద్వారా శ్రీలంకకు పంపామని అధికారులు తెలిపారు. కోయంబత్తూరులో విచారణ సమయంలో ఆ ఉగ్రవాదుల వద్ద నేషనల్ తౌహీద్ జమాత్ (ఎన్టీజే) నేత జహ్రాన్ హషీమ్ వీడియోలు లభించాయి. కొలంబోలోని భారత హై కమిషన్‌పై ఉగ్రవాద దాడికి ప్రణాళిక రచిస్తున్నట్లు జహ్రాన్ హషీమ్ ఓ వీడియోలో సూత్రప్రాయంగా చెప్పాడు. మరింత లోతుగా విచారణ జరపగా, ఐసిస్ సహకారంతో ఉగ్రవాదులు చర్చిలు లక్ష్యంగా పేలుళ్లు జరిపేందుకు అవకాశం ఉందని తెలిసింది.ఈ సమాచారాన్ని వెంటనే శ్రీలంకకు తెలియజేశామని అధికారులు చెప్పారు. ఇస్లాం రాజ్యస్థాపనకు ముందుకు రావాల్సిందిగా శ్రీలంక, తమిళనాడు, కేరళ యువతను హషీమ్ కోరుతున్నట్లు మరో వీడియోలో ఉంది. ఇద్దరు రాజీనామా చేయండి: అధ్యక్షుడు పేలుళ్లకు సంబంధించి ముందుగానే నిఘా సమాచారం ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకోకుండా ఉదాసీనంగా వ్యవహరించిన ఇద్దరు అధికారులను రాజీనామా చేయాల్సిందిగా శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన ఆదేశించినట్లు సండే టైమ్స్ అనే ప్రతిక బుధవారం తెలిపింది. రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో, దేశ పోలీస్ చీఫ్ పూజిత్ జయసుందరలను రాజీనామా చేయమని సిరిసేన కోరారంది. బాంబు పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య బుధవారం నాటికి 359కి చేరింది. పేలుళ్లకు సంబంధించి ఇప్పటివరకు 60 మందిని అరెస్టు చేశామని పోలీసు విభాగ అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర చెప్పారు. ఈ పేలుళ్లలో 500 మందికి పైగా ప్రజలు గాయపడటం తెలిసిందే. ఆత్మాహుతి దాడులకు పాల్పడిన ఉగ్రవాదులంతా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి చెందిన వారు. వారిలో ఒక మహిళ కూడా ఉంది. -
శ్రీలంకలో 13.8 కోట్ల మంది చనిపోయారు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పులో కాలేశారు. ఈస్టర్ పండుగ సందర్భంగా ఆదివారం శ్రీలంకలో చోటుచేసుకున్న మారణకాండలో ఏకంగా 138 మిలియన్ల మంది(13.80 కోట్లు) చనిపోయారని, 600కుపైగా జనం గాయపడ్డారని ట్వీట్ చేశారు. అమెరికా ప్రజల తరపున శ్రీలంక ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తున్నానన్నారు. మృతులకు సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో లంక పౌరులకు అండగా నిలిచేందుకు, ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. శ్రీలంకలో 13.80 కోట్ల మంది మృతి చెందారంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌ను సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు తీవ్రంగా తప్పుపట్టారు. అన్నింటినీ మిలియన్లలో లెక్కించలేమని, సానుభూతి సందేశంపై కూడా శ్రద్ధ చూపకపోతే అది నిజమైన సానుభూతి ఎలా అవుతుందని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. ‘‘మా దేశ జనాభా 2.17 కోట్లే, అలాంటప్పుడు 13.80 కోట్ల మంది మరణించడం అసాధ్యం, మీ సానుభూతి మాకేం అక్కర్లేదు’’అని శ్రీలంకకు చెందిన ఓ నెటిజన్ సోషల్ మీడియాలో తిప్పికొట్టారు. ట్రంప్ లెక్క ప్రకారం ఇప్పుడు మా దేశం ప్రజలెవరూ లేకుండా ఖాళీగా మారింది అని మరో నెటిజన్ పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ గతంలోనూ పలుమార్లు తప్పుడు ట్వీట్లు చేసి నవ్వుల పాలయ్యారు. -
లంక పర్యాటకంపై పెద్ద దెబ్బే
కొలంబో: పర్యాటకానికి మారుపేరు శ్రీలంక. ప్రముఖ బౌద్ధ, హిందూ పుణ్యక్షేత్రాలకు నెలవైన శ్రీలంకను ప్రతిఏటా లక్షలాది మంది విదేశీయులు సందర్శిస్తుంటారు. వీరిలో భారతీయులే అధికంగా ఉంటారు. తాజాగా జరిగిన ఉగ్రవాద దాడులు పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూసే అవకాశం ఉందని ఇక్కడి టూర్లు ఆపరేటర్లు, హోటళ్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లంకలో త్వరలో వేసవి సెలవులు ఆరంభం కానున్నాయి. ఈ సమయంలో విదేశీయులు అధిక సంఖ్యలో వస్తుంటారు. పర్యాటక ప్రాంతాలు జనంతో కిటకిటలాడుతుంటాయి. ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చని శ్రీలంక అధికారులు చెబుతున్నారు. సీజన్ ప్రారంభానికి ముందే ఈ దాడులు జరగడం దురదృష్టకరమని అంటున్నారు. ఉగ్రవాద దాడులు తమ దేశంలో పర్యాటక రంగంపై పెద్ద దెబ్బేనని, పర్యాటక ఆదాయం తగ్గుముఖం పట్టవచ్చని శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే పేర్కొన్నారు. నేరుగా హోటళ్లపైనే దాడులు జరగడం దేశంలో ఇదే తొలిసారి అని లంక టూర్ ఆపరేటర్ల సంఘం హరిత్ పెరేరా చెప్పారు. 30 ఏళ్ల ఎల్టీటీఈ యుద్ధంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని గుర్తుచేశారు. తాజాగా జరిగిన దాడులతో విదేశీ యాత్రికులకు తప్పుడు సందేశం పంపినట్లయిందని అభిప్రాయపడ్డారు. పదేళ్ల కిందటి దాకా శ్రీలంక పర్యాటక రంగం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. ఎల్టీటీఈ ఉద్యమంలో లక్ష మంది చనిపోయారు. ఎల్టీటీఈ పతనం అనంతరం లంకలో పర్యాటక రంగం అనూహ్యంగా పుంజుకుంది. ఆసియాలోనే అగ్రశ్రేణని పర్యాటక దేశంగా అవతరించింది. భారతీయులను ఆకర్షించడానికి లంక ప్రభుత్వం రామాయణ సర్క్యూట్‌ను అభివృద్ధి చేసింది. -
మేమున్నాం.. ఆందోళన వద్దు
న్యూఢిల్లీ: శ్రీలంకలో జరిగిన వరుస బాంబుపేలుళ్లపై భారత్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. శ్రీలంక రాష్ట్రపతి మైత్రిపాల సిరిసేన, ప్రధాని రణిల్ విక్రమసింఘేలతో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ఉగ్రవాదుల దుశ్చర్యను ‘అత్యంత క్రూరమైన, అనాగరిక చర్య’గా అభివర్ణించారు. ఈ షాక్‌నుంచి కోలుకోవడంతోపాటు, సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు శ్రీలంకకు అవసరమైన సాయం అందిస్తామని మోదీ భరోసా ఇచ్చారు. విశ్వ మానవాళికి ఉగ్రవాదం పెనుసవాలుగా మారిందనడానికి శ్రీలంకలో వరుసపేలుళ్లు మరో ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. ‘సీమాంతర ఉగ్రవాదంతోపాటు, ఇలాంటి ఉన్మాదపు దాడులకు పాల్పడుతున్న వారిని అణచివేసేందుకు అంతర్జాతీయ సమాజమంతా ఏకమవ్వాలి. దీన్ని సమర్థించుకునే ఏ చర్యనూ సహించకూడదు’అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఆదివారం శ్రీలంకలో జరిగిన ఎనిమిది వరుస ఆత్మాహుతిదాడుల్లో 200 మందికి పైగా చనిపోగా.. 500 మందికి పైగా గాయలయ్యాయి. ‘మృతుల కుటుంబాలకు, శ్రీలంక ప్రభుత్వానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇలాంటి దారుణమైన దాడులకు పాల్పడిన వారెంతవారైనా కఠినంగా శిక్షించాల్సిందే’అని విదేశాంగశాఖ ప్రకటన పేర్కొంది. ‘కొలంబోలోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం టచ్‌లో ఉన్నాను. పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం’అని విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్వీటర్లో పేర్కొన్నారు. ఖండించిన దేశాధినేతలు లండన్/కొలంబో/ముంబై: శ్రీలంకలో ఉగ్రదాడులను ప్రపంచ వ్యాప్తంగా నేతలు ఖండించారు. అమెరికా, బ్రిటన్, రష్యా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్ తదితర దేశాధినేతలతోపాటు పలువురు హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. శ్రీలంక ప్రజలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం కేసీఆర్ దిగ్బ్రాంతి సాక్షి, హైదరాబాద్: శ్రీలంకలో బాంబు పేలుళ్లు జరిగి చాలా మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల సీఎం కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల చర్యను అత్యంత హేయమైందిగా వర్ణించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేటీఆర్ దిగ్భ్రాంతి శ్రీలంకలోని చర్చిలు, హోటళ్లలో జరిగిన వరుస బాంబు పేలుళ్లపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవిత్రదినం రోజున అనాగరిక, క్రూరచర్యతో విలువైన ప్రాణాలను తీశారని అన్నారు. బాంబు పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆదివారం ట్విటర్లో ప్రగాఢ సానుభూతి తెలిపారు. మానవత్వానికే మచ్చ సాక్షి, అమరావతి: శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఖండించారు. ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీలంక మారణ హోమం మానవత్వానికే మాయనిమచ్చని, ప్రాణం పోసే శక్తి లేనివారికి ప్రాణం తీసే హక్కులేదని తెలిపారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. కిరాతక చర్య: జగన్ సాక్షి, అమరావతి: శ్రీలంకలోని కొలంబోలో జరిగిన మారణహోమాన్ని ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ కిరాతక చర్యలకు బలైన వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. నాగరిక సమాజంలో ఇలాంటి విచక్షణారహితమైన హింసకు తావే లేదని జగన్ అభిప్రాయపడ్డారు. అమాయకులను బలిగొన్న ఈ దుశ్చర్యను ఆయన తీవ్రంగా ఖండింస్తూ ఈ మేరకు ఆదివారం ట్వీట్ చేశారు. -
లంకలో వెల్లువెత్తిన రక్తదాతలు
కొలంబో: శ్రీలంకలో ఉగ్రవాదుల దుశ్చర్య వల్ల వందలాది మంది క్షతగాత్రులుగా మారారు. బాంబు దాడుల్లో గాయపడిన వారిలో చాలామందిని కొలంబో నేషనల్ హాస్పిటల్, బట్టికలోవా ఆసుపత్రులకు తరలించారు. ఆయా ఆసుపత్రుల్లో రక్తం నిల్వలు సరిపడా లేకపోవడంతో, బాధితులను రక్షించేందుకు వెంటనే రక్తదానం చేయాలంటూ శ్రీలంక నేషనల్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ సర్వీస్ సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది. దీనికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. రక్తదాన కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. తమ రక్తం ఇచ్చేందుకు పోటీ పడ్డారు. అంతేకాకుండా బాధితులకు రక్తం ఇచ్చేందుకు ముందుకు రావాలంటూ తమ మిత్రులకు కూడా సమాచారం చేరవేశారు. ఫలానా గ్రూప్ రక్తం అత్యవసరంగా కావాలని పేర్కొంటూ చాలామంది ట్విట్టర్లో ట్వీట్లు చేశారు. రక్తంఇచ్చేందుకు వచ్చిన వారి ఫొటోలను షేర్ చేశారు. రాజధాని కొలంబోలోని నేషనల్ బ్లడ్ బ్యాంకు రక్తదాతలతో కిక్కిరిసిపోయింది. సమీపంలోని ఆసుపత్రులు, రక్తదాన కేంద్రాల్లో రక్తదానం చేయాలంటూ ముస్లింలకు ముస్లిం కౌన్సిల్ ఆఫ్ శ్రీలంక పిలుపునిచ్చింది. ఉగ్రదాడులను కొలంబో ఆర్చిబిషప్ మాల్కోమ్ కార్డినల్ రంజిత్ తీవ్రంగా ఖండించారు. రక్తదానం చేసి, క్షతగాత్రులకు అండగా నిలవాలని ప్రజలకు సూచించారు. క్యాన్సిలేషన్ చార్జీలు రద్దు చేసిన ఎయిర్ ఇండియా న్యూఢిల్లీ: ఉగ్రవాద దాడుల నేపథ్యంలో శ్రీలంక రాజధాని కొలంబో నుంచి భారత్‌కు ఈ నెల 24వ తేదీ వరకూ రాకపోకలు సాగించే తమ విమానాల్లో టికెట్ల క్యాన్సిలేషన్ చార్జీలను ఎయిర్ ఇండియా యాజమాన్యం రద్దు చేసింది. అలాగే రీషెడ్యూలింగ్ చార్జీలను సైతం వసూలు చేయబోమని ట్విట్టర్లో ప్రకటించింది. ఎయిర్ ఇండియా నిత్యం ఢిల్లీ నుంచి రెండు, చెన్నై నుంచి ఒక విమానాన్ని కొలంబోకు నడుపుతోంది. -
క్షేమంగా తిరిగి వచ్చిన జగిత్యాలవాసులు
కోరుట్ల/మెట్పల్లి: శ్రీలంకలోని కొలంబోలో ఆదివారం జరిగిన ఉగ్రదాడి నుంచి జగిత్యాల జిల్లాకు చెందిన మెట్పల్లి, కోరుట్ల పట్టణాలకు చెందిన పలువురు త్రుటిలో తప్పించుకుని క్షేమంగా స్వదేశానికి చేరుకున్నారు. మెట్‌పల్లికి చెందిన ఏలేటి నరేందర్‌రెడ్డి, అల్లాడి శ్రీనివాస్, కోరుట్లకు చెందిన బాశెట్టి కిషన్ దంపతులు సహా మొత్తం 14 మంది వారం క్రితం శ్రీలంక పర్యటనకు వెళ్లారు. అక్కడ వివిధ ప్రాంతాలను సందర్శించిన అనంతరం వారు ఈనెల 19న కొలంబో నగరానికి చేరుకుని నార్లేమెరీన్ అనే హోటల్లో బసచేశారు. ఆదివారం ఉదయం 7 గంటలకు వీరంతా స్వదేశానికి బయలుదేరగా, 8 గంటల ప్రాంతంలో వారు బస చేసిన హోటల్ పక్కన ఉన్న మరో హోటల్లో ఉగ్రదాడి జరిగింది. దాడి జరగడానికి గంట ముందు అక్కడి నుంచి బయలుదేరి క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. సాయంత్రం ఇక్కడికి చేరుకున్న తర్వాత దాడి విషయం తెలుసుకున్న వారు ఉద్వేగానికి లోనయ్యారు. పర్యాటకులను ఎంతో ఆకర్షిస్తున్న శ్రీలంకలో ఉగ్రవాదులు దాడి చేసి అమాయకుల ప్రాణాలను బలి తీసుతీకోవడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ‘అనంత’వాసులకు గాయాలు సాక్షి ప్రతినిధి, అనంతపురం: శ్రీలంకలో బాంబుపేలుళ్ల ఘటనలో అనంతపురం వాసులు ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. టీడీపీ నేత, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ యజమాని అమిలినేని సురేంద్రబాబు, ఆయన స్నేహితుడు భక్తవత్సలం గాయపడగా, సురేంద్ర మరో స్నేహితుడు రాజగోపాల్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. వీరు ముగ్గురూ వ్యక్తిగత పనిమీద కొలంబో వెళ్లి షాంగ్రీ లా హోట్‌లో బసచేశారు. హోటల్లోని రెస్టారెంట్లో అల్పాహారం తింటుండగా ఒక్కసారిగా పెద్దపేలుడుతో రెస్టారెంట్ అద్దాలు ధ్వంసమై సురేంద్ర ముఖంపై పడడంతో స్వల్పగాయాలయ్యాయి. అలాగే భక్తవత్సలం కాలికి గాయాలయ్యాయి. వీరిని హోటల్ యాజమాన్యం ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం వీరు ముగ్గురూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం అందించారు. -
అల్పాహారం క్యూలో నిలుచునే!
కొలంబో: శ్రీలంకలో భారీ పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో కొలంబోలోని లగ్జరీ హోటల్ ‘సినమన్ గ్రాండ్ హోటల్’ఒకటి. ఈస్టర్ సండే అల్పాహారం కోసం అందరూ క్యూలో నిలబడ్డారు. వీరితోపాటే ఈ ఉన్మాద ఘటనకు కారణమైన ఉగ్రవాది కూడా మానవబాంబు రూపంలో అదే క్యూలో నిలుచున్నాడు. క్యూలో వచ్చిన ఆజం ప్లేట్లో అల్పాహారం వడ్డిస్తుండగానే.. ఒక్కసారిగా తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో క్షణాల్లోనే.. ఆ లాంజ్ అంతా రక్తపుమరకలు.. ‘ప్లీజ్ కాపాడండం’టూ ఆర్తనాదాలతో నిండిపోయింది. ‘ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈస్టర్ బ్రేక్‌ఫాస్ట్ కోసం లాంజ్ బిజీగా ఉంది. ఇందులో కుటుంబాలతో వచ్చినవారే ఎక్కువగా ఉన్నారు. అందరూ క్యూలో వస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించింది. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే కళ్లముందు శవాలు పడి ఉన్నాయి. మిగిలినవారు ఓవైపు గాయాలై రక్తం కారుతుండగానే ప్రాణాలు కాపాడుకునేందుకు తలోదిక్కు పారిపోతున్నారు. క్షణాల్లోనే మనుషులంతా రక్తపు ముద్దలుగా మారిపోయిన భయానక వాతావరణంలోనూ.. మా సిబ్బంది తక్షణమే స్పందించి గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించాం. దాదాపు 20 మంది పరిస్థితి చాలా విషమంగా అనిపించింది. వీరిని నేషనల్ హాస్పిటల్ పంపించాం’అని ఆ హోటల్ మేనేజర్ ఒకరు పేర్కొన్నారు. బ్రేక్‌ఫాస్ట్‌కు అతిథులను ఆహ్వానిస్తున్న తమతోటి మేనేజర్ ఒకరు కూడా ఈ దుర్ఘటనలో మృతుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ కుదరకపోవడంతోనే! ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉన్మాది శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. వీటిని పోలీసులు సేకరించారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం శ్రీలంక జాతీయుడే అయిన ఉన్మాది ఆజం.. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు చూపించి బిజినెస్ పనిమీద వచ్చానంటూ మరో రెండు హోటల్స్‌లో గదులకోసం ప్రయత్నించాడు. ఆయా హోటళ్ల మేనేజర్లు తిరస్కరించడంతో చివరకు శనివారం రాత్రి సినమన్ గ్రాండ్ హోటల్లో చేరి ఇంతమంది ప్రాణాలు తీశాడని వెల్లడైంది. సినమన్ గ్రాండ్తోపాటు షాంగ్రి–లా, కింగ్స్బరీ హోటళ్లతోపాటు ఈస్టర్ ప్రార్థనలకోసం వచ్చిన మరో మూడు చర్చిల్లోనూ ఉన్మాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. చారిత్రక సెయింట్ ఆంథోనీస్ కేథలిక్ చర్చ్‌లో అత్యంత తీవ్రతరమైన పేలుడు జరిగింది. చర్చ్ పైకప్పు ఊడి కిందపడడంతోపాటు.. అలంకరించిన లైట్లు, అద్దాలు విరిగిపోయాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ దాడులకు కారణం ఎవరనేదానిపై ఇంతవరకు అధికారులు ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ దుర్ఘటనలో 35 మంది విదేశీయులు మృతిచెందారు. వీరంతా ఆయా హోటళ్లలో జరిగిన పేలుళ్లలోనే చనిపోయారు. ప్రధాని నివాసానికి సమీపంలోనే.. హోటల్ సినమోన్ గ్రాండ్‌కు సమీపంలోనే శ్రీలంక ప్రధాని అధికారిక నివాసం ఉండడంతో.. స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కమాండోలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. దీంతో సహాయక కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. షాంగ్రి–లా హోటల్లోని టేబుల్ వన్ రెస్టారెంట్లో ఉదయం 9 గంటల ప్రాంతంలో రెండు బాంబు పేలుళ్లు వినిపించాయి. అయితే.. ఈ ఘటనలో ఎందరు మరణించారో ఇంకా స్పష్టత రావడం లేదు. ఆ హోటల్ రెండో అంతస్తులోని రెస్టారెంట్లో పేలుడు ధాటికి కిటికీలు ఎగిరిపోయాయి. పైకప్పులో ఉన్న విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ కనిపించాయని ఏఎఫ్‌పీ ఫొటోగ్రాఫర్ ఒకరు తెలిపారు. ‘హోటల్లో ఉన్న మిగిలిన వారి భద్రతే మా ప్రాధాన్యత. వారిని కాపాడేందుకు మా విపత్తు నిర్వహణ బృందం పనిచేస్తోంది’అని షాంగ్రి–లా హోటల్ మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. మృతుల దిబ్బగా కింగ్స్బరీ కొలంబో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు సమీపంలోని కింగ్స్బరీ హోటల్.. నగరంలోని అత్యంత విలాసవంతమైన హోటళ్లలో ఒకటి. ఇక్కడ జరిగిన పేలుడులోనూ మృతుల సంఖ్య భారీగానే ఉంటుందని తెలుస్తోంది. అయితే ఎందరు చనిపోయారు.. వారి వివరాలేంటనేది మాత్రం తెలియరాలేదు. ‘ఈ ఘటన మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. ఈ వరుస బాంబుపేలుళ్లపై యావత్ శ్రీలంక మౌనంగా రోదిస్తోంది. ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించాం. వారికి అవసరమైన వైద్యసేవలను అందించడంలో మా వంతు సాయంచేస్తున్నాం. హోటల్ మొత్తాన్ని వెంటనే ఖాళీ చేయించాం’అని కింగ్స్బరీ హోటల్ యాజమాన్యం ఫేస్బుక్ పోస్టులో పేర్కొంది. చర్చిలో మాంసం ముద్దలు కొలంబో: ముష్కర మూకల రక్తదాహానికి అమాయక భక్తులు బలయ్యారు. ఈస్టర్ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనేందుకు వచ్చి, ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. శ్రీలంకలో ఆదివారం బాంబు దాడులు జరిగిన సెయింట్ సెబాస్టియన్ చర్చి, సెయింట్ ఆంథోనీస్ చర్చిలో భీతావహ దృశ్యాలు కనిపించాయి. చర్చిల గోడలకు మనుషుల మాంసపు ముద్దలు అతుక్కుపోయాయంటే పేలుళ్ల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎటు చూసినా రక్తపు మడుగులే దర్శనమిచ్చాయి. పేలుళ్ల తీవ్రతకు అద్దాలు పగిలి చెల్లాచెదురుగా పడిపోయాయి. కుర్చీలు సైతం విరిగిపోయాయి. పైకప్పులు ధ్వంసమయ్యాయి. సెబాస్టియన్ చర్చి బయట కూడా మాంసపు ముద్దలు ఎగిరిపడ్డాయి. చర్చిల్లో ఈ దారుణ దృశ్యాలను చూసి పోలీసులు, సహాయక సిబ్బంది చలించిపోయారు. సెబాస్టియన్ చర్చి ప్రాంగణంలో 30 మృతదేహాలు లభించాయని ఆర్చిడయాసిస్ ఆఫ్ కొలంబో ప్రతినిధి ఫాదర్ ఎడ్మండ్ తిలకరత్నే చెప్పారు. ఈ చర్చిలో జరిగిన పేలుళ్లలో ముగ్గురు మతబోధకులు గాయపడ్డారని తెలిపారు. ఈస్టర్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల కోసం ఈ చర్చికి సమీప గ్రామాల నుంచి 1,000 మందికిపైగా భక్తులు వచ్చారని వెల్లడించారు. శ్రీలంకలో ప్రసిద్ధి చెందిన సెబాస్టియన్ చర్చిని నెగొంబో పట్టణంలో 1946లో నిర్మించారు. క్యాథలిక్ చర్చి చరిత్రలో అమరవీరుడిగా పేరుగాంచిన సెయింట్ సెబాస్టియన్‌కు దీన్ని అంకితం చేశారు. కొలంబోలోని సెయింట్ ఆంథోనీస్ చర్చికి కూడా ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ పేలుళ్లకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కొలంబో ఆర్చిబిషప్ కార్డినల్ మాల్కోమ్ రంజిత్ డిమాండ్ చేశారు. ద్వీప దేశానికి నెత్తుటి గాయాలు శ్రీమహాబోధి దాడి (1985): అనురాధాపురాలో ఎల్టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో క్రైస్తవ సన్యాసులు (నన్స్), బౌద్ధ భిక్షవులతో సహా 146 మంది పౌరులు మరణించారు. ► అలూత్ ఒయా నరమేధం (1987): సింహళీ జాతీయులపై ఎల్టీటీఈ చేసిన దాడిలో 127 మంది మరణించారు. ► శ్రీలంక పార్లమెంట్‌పై గ్రెనేడ్ దాడి (1987): శ్రీలంక పార్లమెంట్‌పై ఎల్టీటీఈ తీవ్ర వాద సంస్థ జరిపిన గ్రెనేడ్ బాంబు దాడిలో ఇద్దరు సాధారణ పౌరులు చనిపోయారు. ► కొలంబో బస్‌స్టేషన్‌లో బాంబుదాడి (1987): కొలంబో బస్‌స్టేషన్‌లో జరిగిన కారు బాంబు దాడిలో 113 మంది పౌరులు మరణించారు. ► కట్టంకూడి మసీదులో నరమేధం (1990): కట్టంకూడి మసీదులో ఎల్టీటీఈ చేసిన దాడిలో 147 మంది ముస్లింలు చనిపోయారు. ► పల్లుయగొదెల్లా నరమేధం (1992): సింహళ జాతీయులే లక్ష్యంగా పల్లుయగొదెల్లాలో ఎల్టీటీఈ తీవ్రవాదులు చేసిన దాడిలో 285 మంది దుర్మరణం పాలయ్యారు. ► కొలంబో సెంట్రల్ బ్యాంకుపై బాంబుదాడి (1996): కొలంబో సెంట్రల్ బ్యాంకు మెయిన్ గేటువద్ద ఎల్టీటీఈ అమర్చిన ట్రక్కు బాంబు దాడిలో 91 మంది మరణించారు. ► దిగంపతన బాంబుదాడి (2006): దిగంపతనలో 15 మిలిటరీ కాన్వాయ్ బస్సులపై ఎల్టీటీఈ ట్రక్కు బాంబు దాడిలో 120 మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు. ఆదివారం కొలంబోలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ధ్వంసమైన సినమన్ హోటల్ సెబాస్టియన్స్ చర్చిలో చెల్లాచెదురుగా మృతదేహాలు ఆదివారం కొలంబోలోని సెయింట్ సెబాస్టియన్స్ చర్చి వద్ద రోదిస్తున్న బాధితులు సెబాస్టియన్స్ చర్చి వద్ద గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం ఉగ్రవాదుల కోసం ఓ హోటల్ వద్ద హెలికాప్టర్‌తో గాలింపు చర్యలు -
బాంబు పేలుళ్లతో రక్తమోడుతున్న కొలంబో
కొలంబో : శ్రీలంక రాజధాని కొలంబో బాంబు దాడులతో దద్దరిల్లింది. ఆదివారం ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చ్‌లకు వచ్చేవారిని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు వరుస పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ దాడిలో 207 మంది మృతి చెందగా, 500మందికి పైగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దాడిలో గాయపడ్డ వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఉగ్రదాడితో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని విధించింది. ఈ రోజు ఉదయం నుంచి మూడు చర్చిలతో పాటు, మూడు హోటళ్లలో వరుసగా బాంబు పేలుళ్లు సంభవించాయి. కొలంబోలో కొచ్‌చికాడోలోని సెయింట్ ఆంథోనీ చర్చిలో, కథువాపితియాలోని కటానా చర్చిలో బాంబు పేలుడు చోటుచేసుకుంది. షాంగ్రి లా హోటల్, కింగ్స్ బరీ హోటల్లో కూడా బాంబుపేలుడు సంభవించినట్టు పోలీసులు గుర్తించారు. ఉగ్రదాడిపై భారత విదేశాంగ శాఖ అప్రమత్తమైంది. కొలంబోలోని భారత హైకమిషనర్‌తో సంప్రదింపులు జరుపుతున్నామని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తెలిపారు. బాంబు పేలుళ్లపై అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. -
వైఎస్ జగన్ ఈస్టర్ శుభాకాంక్షలు
సాక్షి, గుంటూరు: క్రైస్తవుల పర్వదినమైన ఈస్టర్ సందర్భంగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పునరుద్ధానుడైన క్రీస్తుఏసు ఆశీర్వాదాలు ప్రతికుంటుబానికి లభించాలని ఆకాంక్షించారు. ‘‘మీకు, మీ కుటుంబాలకు ప్రేమ, శాంతి చేకూరాలని కోరుతున్నా. అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు’’ అని వైఎస్ జగన్ ఆదివారం ఓ ట్వీట్ చేశారు. May the resurrected Christ bless your home and fill you and your loved ones with peace, love and joy. Happy Easter. — YS Jagan Mohan Reddy (@ysjagan) 1 April 2018