కొలంబో: శ్రీలంకలో భారీ పేలుళ్లు జరిగిన ప్రాంతాల్లో కొలంబోలోని లగ్జరీ హోటల్ ‘సినమన్ గ్రాండ్ హోటల్’ఒకటి. ఈస్టర్ సండే అల్పాహారం కోసం అందరూ క్యూలో నిలబడ్డారు. వీరితోపాటే ఈ ఉన్మాద ఘటనకు కారణమైన ఉగ్రవాది కూడా మానవబాంబు రూపంలో అదే క్యూలో నిలుచున్నాడు. క్యూలో వచ్చిన ఆజం ప్లేట్‌లో అల్పాహారం వడ్డిస్తుండగానే.. ఒక్కసారిగా తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో క్షణాల్లోనే.. ఆ లాంజ్ అంతా రక్తపుమరకలు.. ‘ప్లీజ్ కాపాడండం’టూ ఆర్తనాదాలతో నిండిపోయింది. ‘ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఈస్టర్ బ్రేక్‌ఫాస్ట్ కోసం లాంజ్ బిజీగా ఉంది. ఇందులో కుటుంబాలతో వచ్చినవారే ఎక్కువగా ఉన్నారు.
అందరూ క్యూలో వస్తుండగా ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించింది. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే కళ్లముందు శవాలు పడి ఉన్నాయి. మిగిలినవారు ఓవైపు గాయాలై రక్తం కారుతుండగానే ప్రాణాలు కాపాడుకునేందుకు తలోదిక్కు పారిపోతున్నారు. క్షణాల్లోనే మనుషులంతా రక్తపు ముద్దలుగా మారిపోయిన భయానక వాతావరణంలోనూ.. మా సిబ్బంది తక్షణమే స్పందించి గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించాం. దాదాపు 20 మంది పరిస్థితి చాలా విషమంగా అనిపించింది. వీరిని నేషనల్ హాస్పిటల్ పంపించాం’అని ఆ హోటల్ మేనేజర్ ఒకరు పేర్కొన్నారు. బ్రేక్‌ఫాస్ట్‌కు అతిథులను ఆహ్వానిస్తున్న తమతోటి మేనేజర్ ఒకరు కూడా ఈ దుర్ఘటనలో మృతుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అక్కడ కుదరకపోవడంతోనే!
ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ ఉన్మాది శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. వీటిని పోలీసులు సేకరించారు. పోలీసులకు అందిన సమాచారం ప్రకారం శ్రీలంక జాతీయుడే అయిన ఉన్మాది ఆజం.. తప్పుడు ధ్రువీకరణ పత్రాలు చూపించి బిజినెస్ పనిమీద వచ్చానంటూ మరో రెండు హోటల్స్‌లో గదులకోసం ప్రయత్నించాడు. ఆయా హోటళ్ల మేనేజర్లు తిరస్కరించడంతో చివరకు శనివారం రాత్రి సినమన్ గ్రాండ్ హోటల్‌లో చేరి ఇంతమంది ప్రాణాలు తీశాడని వెల్లడైంది. సినమన్ గ్రాండ్‌తోపాటు షాంగ్రి–లా, కింగ్స్‌బరీ హోటళ్లతోపాటు ఈస్టర్ ప్రార్థనలకోసం వచ్చిన మరో మూడు చర్చిల్లోనూ ఉన్మాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. చారిత్రక సెయింట్ ఆంథోనీస్ కేథలిక్ చర్చ్‌లో అత్యంత తీవ్రతరమైన పేలుడు జరిగింది. చర్చ్ పైకప్పు ఊడి కిందపడడంతోపాటు.. అలంకరించిన లైట్లు, అద్దాలు విరిగిపోయాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ దాడులకు కారణం ఎవరనేదానిపై ఇంతవరకు అధికారులు ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ దుర్ఘటనలో 35 మంది విదేశీయులు మృతిచెందారు. వీరంతా ఆయా హోటళ్లలో జరిగిన పేలుళ్లలోనే చనిపోయారు.
ప్రధాని నివాసానికి సమీపంలోనే..
హోటల్ సినమోన్ గ్రాండ్‌కు సమీపంలోనే శ్రీలంక ప్రధాని అధికారిక నివాసం ఉండడంతో.. స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కమాండోలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. దీంతో సహాయక కార్యక్రమాలు వేగవంతమయ్యాయి. షాంగ్రి–లా హోటల్‌లోని టేబుల్ వన్ రెస్టారెంట్లో ఉదయం 9 గంటల ప్రాంతంలో రెండు బాంబు పేలుళ్లు వినిపించాయి. అయితే.. ఈ ఘటనలో ఎందరు మరణించారో ఇంకా స్పష్టత రావడం లేదు. ఆ హోటల్ రెండో అంతస్తులోని రెస్టారెంట్లో పేలుడు ధాటికి కిటికీలు ఎగిరిపోయాయి. పైకప్పులో ఉన్న విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ కనిపించాయని ఏఎఫ్‌పీ ఫొటోగ్రాఫర్ ఒకరు తెలిపారు. ‘హోటల్‌లో ఉన్న మిగిలిన వారి భద్రతే మా ప్రాధాన్యత. వారిని కాపాడేందుకు మా విపత్తు నిర్వహణ బృందం పనిచేస్తోంది’అని షాంగ్రి–లా హోటల్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది.
మృతుల దిబ్బగా కింగ్స్‌బరీ
కొలంబో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌కు సమీపంలోని కింగ్స్‌బరీ హోటల్.. నగరంలోని అత్యంత విలాసవంతమైన హోటళ్లలో ఒకటి. ఇక్కడ జరిగిన పేలుడులోనూ మృతుల సంఖ్య భారీగానే ఉంటుందని తెలుస్తోంది. అయితే ఎందరు చనిపోయారు.. వారి వివరాలేంటనేది మాత్రం తెలియరాలేదు. ‘ఈ ఘటన మమ్మల్ని షాక్‌కు గురిచేసింది. ఈ వరుస బాంబుపేలుళ్లపై యావత్ శ్రీలంక మౌనంగా రోదిస్తోంది. ఘటనలో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించాం. వారికి అవసరమైన వైద్యసేవలను అందించడంలో మా వంతు సాయంచేస్తున్నాం. హోటల్ మొత్తాన్ని వెంటనే ఖాళీ చేయించాం’అని కింగ్స్‌బరీ హోటల్ యాజమాన్యం ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొంది.
చర్చిలో మాంసం ముద్దలు
కొలంబో: ముష్కర మూకల రక్తదాహానికి అమాయక భక్తులు బలయ్యారు. ఈస్టర్ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనేందుకు వచ్చి, ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయారు. శ్రీలంకలో ఆదివారం బాంబు దాడులు జరిగిన సెయింట్ సెబాస్టియన్ చర్చి, సెయింట్ ఆంథోనీస్ చర్చిలో భీతావహ దృశ్యాలు కనిపించాయి. చర్చిల గోడలకు మనుషుల మాంసపు ముద్దలు అతుక్కుపోయాయంటే పేలుళ్ల తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఎటు చూసినా రక్తపు మడుగులే దర్శనమిచ్చాయి. పేలుళ్ల తీవ్రతకు అద్దాలు పగిలి చెల్లాచెదురుగా పడిపోయాయి. కుర్చీలు సైతం విరిగిపోయాయి. పైకప్పులు ధ్వంసమయ్యాయి. సెబాస్టియన్ చర్చి బయట కూడా మాంసపు ముద్దలు ఎగిరిపడ్డాయి. చర్చిల్లో ఈ దారుణ దృశ్యాలను చూసి పోలీసులు, సహాయక సిబ్బంది చలించిపోయారు. సెబాస్టియన్ చర్చి ప్రాంగణంలో 30 మృతదేహాలు లభించాయని ఆర్చిడయాసిస్ ఆఫ్ కొలంబో ప్రతినిధి ఫాదర్ ఎడ్మండ్ తిలకరత్నే చెప్పారు. ఈ చర్చిలో జరిగిన పేలుళ్లలో ముగ్గురు మతబోధకులు గాయపడ్డారని తెలిపారు. ఈస్టర్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల కోసం ఈ చర్చికి సమీప గ్రామాల నుంచి 1,000 మందికిపైగా భక్తులు వచ్చారని వెల్లడించారు. శ్రీలంకలో ప్రసిద్ధి చెందిన సెబాస్టియన్ చర్చిని నెగొంబో పట్టణంలో 1946లో నిర్మించారు. క్యాథలిక్ చర్చి చరిత్రలో అమరవీరుడిగా పేరుగాంచిన సెయింట్ సెబాస్టియన్‌కు దీన్ని అంకితం చేశారు. కొలంబోలోని సెయింట్ ఆంథోనీస్ చర్చికి కూడా ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ పేలుళ్లకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కొలంబో ఆర్చిబిషప్ కార్డినల్ మాల్కోమ్ రంజిత్ డిమాండ్ చేశారు.
ద్వీప దేశానికి నెత్తుటి గాయాలు
శ్రీమహాబోధి దాడి (1985): అనురాధాపురాలో ఎల్‌టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం) విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో క్రైస్తవ సన్యాసులు (నన్స్), బౌద్ధ భిక్షవులతో సహా 146 మంది పౌరులు మరణించారు.
► అలూత్ ఒయా నరమేధం (1987): సింహళీ జాతీయులపై ఎల్‌టీటీఈ చేసిన దాడిలో 127 మంది మరణించారు.
► శ్రీలంక పార్లమెంట్‌పై గ్రెనేడ్ దాడి (1987): శ్రీలంక పార్లమెంట్‌పై ఎల్‌టీటీఈ తీవ్ర వాద సంస్థ జరిపిన గ్రెనేడ్ బాంబు దాడిలో ఇద్దరు సాధారణ పౌరులు చనిపోయారు.
► కొలంబో బస్‌స్టేషన్‌లో బాంబుదాడి (1987): కొలంబో బస్‌స్టేషన్‌లో జరిగిన కారు బాంబు దాడిలో 113 మంది పౌరులు మరణించారు.
► కట్టంకూడి మసీదులో నరమేధం (1990): కట్టంకూడి మసీదులో ఎల్‌టీటీఈ చేసిన దాడిలో 147 మంది ముస్లింలు చనిపోయారు.
► పల్లుయగొదెల్లా నరమేధం (1992): సింహళ జాతీయులే లక్ష్యంగా పల్లుయగొదెల్లాలో ఎల్‌టీటీఈ తీవ్రవాదులు చేసిన దాడిలో 285 మంది దుర్మరణం పాలయ్యారు.
► కొలంబో సెంట్రల్ బ్యాంకుపై బాంబుదాడి (1996): కొలంబో సెంట్రల్ బ్యాంకు మెయిన్ గేటువద్ద ఎల్‌టీటీఈ అమర్చిన ట్రక్కు బాంబు దాడిలో 91 మంది మరణించారు.
► దిగంపతన బాంబుదాడి (2006): దిగంపతనలో 15 మిలిటరీ కాన్వాయ్ బస్సులపై ఎల్‌టీటీఈ ట్రక్కు బాంబు దాడిలో 120 మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు.
ఆదివారం కొలంబోలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ధ్వంసమైన సినమన్ హోటల్
సెబాస్టియన్స్ చర్చిలో చెల్లాచెదురుగా మృతదేహాలు
ఆదివారం కొలంబోలోని సెయింట్ సెబాస్టియన్స్ చర్చి వద్ద రోదిస్తున్న బాధితులు
సెబాస్టియన్స్ చర్చి వద్ద గాయపడిన వారిని ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యం
ఉగ్రవాదుల కోసం ఓ హోటల్ వద్ద హెలికాప్టర్‌తో గాలింపు చర్యలు
Comments
Please login to add a commentAdd a comment