కొలంబో: పర్యాటకానికి మారుపేరు శ్రీలంక. ప్రముఖ బౌద్ధ, హిందూ పుణ్యక్షేత్రాలకు నెలవైన శ్రీలంకను ప్రతిఏటా లక్షలాది మంది విదేశీయులు సందర్శిస్తుంటారు. వీరిలో భారతీయులే అధికంగా ఉంటారు. తాజాగా జరిగిన ఉగ్రవాద దాడులు పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూసే అవకాశం ఉందని ఇక్కడి టూర్లు ఆపరేటర్లు, హోటళ్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లంకలో త్వరలో వేసవి సెలవులు ఆరంభం కానున్నాయి. ఈ సమయంలో విదేశీయులు అధిక సంఖ్యలో వస్తుంటారు. పర్యాటక ప్రాంతాలు జనంతో కిటకిటలాడుతుంటాయి. ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చని శ్రీలంక అధికారులు చెబుతున్నారు. సీజన్ ప్రారంభానికి ముందే ఈ దాడులు జరగడం దురదృష్టకరమని అంటున్నారు.
ఉగ్రవాద దాడులు తమ దేశంలో పర్యాటక రంగంపై పెద్ద దెబ్బేనని, పర్యాటక ఆదాయం తగ్గుముఖం పట్టవచ్చని శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే పేర్కొన్నారు. నేరుగా హోటళ్లపైనే దాడులు జరగడం దేశంలో ఇదే తొలిసారి అని లంక టూర్ ఆపరేటర్ల సంఘం హరిత్ పెరేరా చెప్పారు. 30 ఏళ్ల ఎల్టీటీఈ యుద్ధంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని గుర్తుచేశారు. తాజాగా జరిగిన దాడులతో విదేశీ యాత్రికులకు తప్పుడు సందేశం పంపినట్లయిందని అభిప్రాయపడ్డారు. పదేళ్ల కిందటి దాకా శ్రీలంక పర్యాటక రంగం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. ఎల్టీటీఈ ఉద్యమంలో లక్ష మంది చనిపోయారు. ఎల్టీటీఈ పతనం అనంతరం లంకలో పర్యాటక రంగం అనూహ్యంగా పుంజుకుంది. ఆసియాలోనే అగ్రశ్రేణని పర్యాటక దేశంగా అవతరించింది. భారతీయులను ఆకర్షించడానికి లంక ప్రభుత్వం రామాయణ సర్క్యూట్‌ను అభివృద్ధి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment