
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పులో కాలేశారు. ఈస్టర్ పండుగ సందర్భంగా ఆదివారం శ్రీలంకలో చోటుచేసుకున్న మారణకాండలో ఏకంగా 138 మిలియన్ల మంది(13.80 కోట్లు) చనిపోయారని, 600కుపైగా జనం గాయపడ్డారని ట్వీట్ చేశారు. అమెరికా ప్రజల తరపున శ్రీలంక ప్రజలకు సంఘీభావం ప్రకటిస్తున్నానన్నారు. మృతులకు సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో లంక పౌరులకు అండగా నిలిచేందుకు, ఎలాంటి సాయం కావాలన్నా అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు.
శ్రీలంకలో 13.80 కోట్ల మంది మృతి చెందారంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్‌ను సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు తీవ్రంగా తప్పుపట్టారు. అన్నింటినీ మిలియన్లలో లెక్కించలేమని, సానుభూతి సందేశంపై కూడా శ్రద్ధ చూపకపోతే అది నిజమైన సానుభూతి ఎలా అవుతుందని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. ‘‘మా దేశ జనాభా 2.17 కోట్లే, అలాంటప్పుడు 13.80 కోట్ల మంది మరణించడం అసాధ్యం, మీ సానుభూతి మాకేం అక్కర్లేదు’’అని శ్రీలంకకు చెందిన ఓ నెటిజన్ సోషల్ మీడియాలో తిప్పికొట్టారు. ట్రంప్ లెక్క ప్రకారం ఇప్పుడు మా దేశం ప్రజలెవరూ లేకుండా ఖాళీగా మారింది అని మరో నెటిజన్ పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ గతంలోనూ పలుమార్లు తప్పుడు ట్వీట్లు చేసి నవ్వుల పాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment