యూసుఫ్ ఇబ్రహీం ఇల్లు
కొలంబో: శ్రీలంకలో ఈస్టర్ రోజున వరుస బాంబు పేలుళ్ల వ్యవహారంలో కొత్త అంశాలు తెరమీదకొచ్చాయి. ఆత్మాహుతి దాడులకు శ్రీలంకలోని ప్రముఖ సుగంధద్రవ్యాల వ్యాపారవేత్త ఇల్లు కేంద్రంగా పనిచేసిందని అధికారులు గుర్తించారు. కొలంబో కేంద్రంగా వ్యాపారం నిర్వహిస్తున్న వ్యాపారవేత్త మొహమ్మద్ యూసుఫ్ ఇబ్రహీం ఇద్దరు కుమారులు ఈ దాడిలో పాల్గొన్నారు. వీరిలో ఒకరు షాంగ్రీలా హోటల్‌ను లక్ష్యంగా చేసుకోగా, మరొకరు సినమన్ హోటల్ వద్ద తనను తాను పేల్చేసుకున్నాడని పోలీసులు చెప్పారు.
దాడులకు అవసరమైన పేలుడు పదార్థాలను ఇక్కడే భద్రపరిచారన్నారు. ఈ ఉగ్రమూకకు జహ్రన్ హషీమ్(40) అనే ఉగ్రవాది నేతృత్వం వహించాడని చెప్పారు. ఉగ్రదాడులు జరిగిన అనంతరం ఇబ్రహీం ఇంట్లో తనిఖీల కోసం పోలీసులు రాగానే ఇబ్రహీం కోడలు పేలుడు పదార్థాలను పేల్చేసింది. దీంతో ఆమెతో పాటు పోలీస్ అధికారులు చనిపోయారు. ఈ నేపథ్యంలో వ్యాపారవేత్త యూసుఫ్ ఇబ్రహీంను అరెస్ట్ చేసి, ప్రశ్నిస్తున్నారు.
అందరూ విద్యావంతులే..
ఈ ఉగ్రదాడిలో మొత్తం 9 మంది ఆత్మాహుతి బాంబర్లు పాల్గొన్నారని శ్రీలంక రక్షణశాఖ సహాయ మంత్రి విజేవర్ధనే తెలిపారు. అంతేకాకుండా వీరంతా బాగా చదువుకున్నవారేనని వ్యాఖ్యానించారు. ‘ఆత్మాహుతిదాడికి పాల్పడ్డవారిలో ఒకరు బ్రిటన్‌లో చదువుకున్నారు. అలాగే ఆస్ట్రేలియాలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఈ దారుణానికి తెగబడ్డ తొమ్మిది మందిలో 8 మందిని ఇప్పటికే గుర్తించాం. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో వీరి వివరాలను ఇప్పుడే బయటపెట్టలేం’ అని వెల్లడించారు.
శాంతిభద్రతలు అదుపులోకివచ్చేవరకూ రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుందని విజేవర్ధనే పేర్కొన్నారు. కాగా, షాంగ్రీలా హోటల్‌పై ఏప్రిల్ 21న అబ్దుల్ లతీఫ్ అనే వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు స్థానిక పోలీసులను ఉటంకిస్తూ బీబీసీ తెలిపింది. లతీఫ్ 2006–07 మధ్యకాలంలో బ్రిటన్‌లోని కింగ్స్‌టన్ విశ్వవిద్యాయలంలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదువును మధ్యలోనే వదిలేశాడని వెల్లడించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లిన ఇతను, అక్కడ మాస్టర్స్ పూర్తిచేసినట్లు పేర్కొంది.
శ్రీలంక పేలుళ్లకు తమిళనాడులో కుట్ర?
సాక్షి ప్రతినిధి, చెన్నై: పేలుళ్లకు సంబంధించిన కీలక సూత్రధారి ఒకరు కోయంబత్తూర్ వచ్చిరనే సమాచారంతో ఎన్‌ఐఏ, ఎస్‌ఐసీ పోలీసులు రహస్యంగా విచారించారు. కోయంబత్తూరులో హిందూ సంస్థల నేతలను హతమార్చేందుకు కుట్రపన్నిన స్థానికులు ఇద్దరు, చెన్నైకి చెందిన నలుగురిని గత ఏడాది పోలీసులు అరెస్టు చేశారు. వీరు ఐసిస్ సానుభూతి పరులుగా తేలడంతో ఈ కేసును ఎన్‌ఐఏ విచారణకు అప్పగించారు. దీంతో ఎన్‌ఐఏ అధికారులు అరెస్టైన వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు చేపట్టి పెన్ డ్రైవ్‌లను, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కోయంబత్తూరుకు చెందిన ఐసిస్ సానుభూతి పరులైన ఆ ఆరుగురిని శుక్రవారం మరోసారి ఎన్‌ఐఏ అధికారులు విచారించి కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment