సాక్షి, చెన్నై/న్యూఢిల్లీ: జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు బుధవారం శ్రీలంక ఆత్మాహుతి బాంబర్ జహ్రాన్ హషీంకు ఫేస్‌బుక్ స్నేహితుడైన ఐసిస్ తమిళనాడు మాడ్యూల్ సూత్రధారి మొహమ్మద్ అజారుద్దీన్‌ను అరెస్టు చేశారు. తమిళనాడులోని కోయంబత్తూరులో ఏడు ప్రాంతాల్లో సోదాల సందర్భంగా అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 14 మొబైల్ ఫోన్లు, 29 సిమ్‌కార్డులు, 10 పెన్‌డ్రైవ్‌లు, మూడు ల్యాప్‌టాప్‌లు, ఆరు మెమొరీ కార్డులు, నాలుగు హార్డ్ డిస్క్ డ్రైవ్‌లు, సీడీలు, డీవీడీలు, ఒక కత్తి ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఈస్టర్ పర్వదినం సందర్భంగా శ్రీలంకలో సాగిన వరుస బాంబు పేలుళ్లలో రెండు వందల మందికి పైగా మృతిచెందిన విషయం తెలిసిందే.
ఈ పేలుళ్ల అనంతరం తమిళనాడుపై ఎన్‌ఐఏ ప్రత్యేక దృష్టి పెట్టింది. గత నెల కోయంబత్తూరులో ముగ్గురి ఇళ్లలో సోదాలు జరిపి, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఈనేపథ్యంలో బుధవారం 35మందితో కూడిన అధికారుల బృందం కోయంబత్తూరుకు చేరుకుంది. స్థానిక పోలీసులతో కలసి ఏడు చోట్ల తనిఖీలు చేపట్టారు. ఉక్కడం అన్భునగర్‌లోని అజారుద్దీన్, పోతనూరులోని సదాం, అక్బర్, అక్రమ్ తిల్లా, కునియ ముత్తురులోని అబూబక్కర్ సలీం, అల్లమిన్ కాలనీలోని ఇదయతుల్లా, కరీంషా ఇళ్లలో సోదాలు జరిపారు. కోయంబత్తూర్‌కు చెందిన అజారుద్దీన్‌తో పాటు మరో ఐదుగురు నాయకత్వంలో నడుస్తున్నట్టుగా అనుమానిస్తున్న తమిళనాడు మాడ్యూల్‌పై మే 30వ తేదీన కేసు నమోదు అయ్యింది. తమిళనాడు, కేరళలో ఉగ్రదాడులు నిర్వహించేందుకు యువతను ఆకర్షించడం వారి లక్ష్యమని ఎన్‌ఐఏ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment