సాక్షి, చెన్నై: ప్రత్యేక రాష్ట్రం కోరుతూ శ్రీలంకలో పోరాటాలు సాగించిన విడుదలై పులులు (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ) తమిళనాడులో మళ్లీ బలం పుంజుకునే ప్రయత్నాలు సాగిస్తున్నాయా? కొత్తగా సభ్యత్వాలు చేర్చుకోవడం ద్వారా ఎల్‌టీటీఈని పునరుద్ధరించేందుకు పావులు కదుపుతున్నాయా? అందరిలోనూ ఆందోళన కలిగించే ఈ ప్రశ్నలకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఎల్‌టీటీకి మద్దతుగా నిలిచే ముగ్గురు ముఖ్య రాజకీయనేతలపై ఎన్‌ఐఏ అధికారులు నిఘా పెట్టడం, నిధుల సమీకరణ అనుమానంపై ఐదుగురిపై కేసులు నమోదుచేయడం ఇందుకు తార్కాణంగా భావించవచ్చు.
తమిళనాడులోని సానుభూతిపరుల సహకారంతో ఎల్‌టీటీఈ శ్రీలంకలో సుదీర్ఘకాలం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ శ్రీలంకతో శాంతి ఒప్పందం చేసుకుంటారనే అనుమానంతో చెన్నై సమీపం శ్రీపెరంబుదూరులో మానవబాంబు ద్వారా ఆయనను హతమార్చింది. మరికొద్ది కాలానికి ఎల్‌టీటీఈ ఉద్యమసారధి ప్రభాకరన్‌ను 2009లో అక్కడి ప్రభుత్వం మట్టుబెట్టడంతో ఆందోళనలు చల్లారాయి. తమిళం పోరాటం ముగిసినట్లుగా శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తమిళనాడులో సైతం ఎల్‌టీటీఈ కనుమరుగైంది. అయితే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ఎల్‌టీటీఈ ఉద్యమం చాపకింది నీరులా మళ్లీ రాజుకుంటోందని ఎన్‌ఐఏలో అనుమానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా తమిళనాడు కేంద్రంగా ఎల్‌టీటీఈ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఎన్‌ఐఏ భావిస్తోంది.
చదవండి: (నటుడు విజయ్‌కి హైకోర్టులో ఊరట)
ఇందుకు రాష్ట్రంలోని ముగ్గురు ప్రముఖ రాజకీయనేతలు దన్నుగా నిలుస్తున్నట్లు ఎన్‌ఐఏ అధికారులకు పక్కా సమాచారం అందింది. అనధికారికంగా తమిళనాడులో తలదాచుకుంటున్న లక్ష్మణన్ మేరీ బిరాన్‌సింఘే అనే 50 సంవత్సరాల శ్రీలంక మహిళను గత ఏడాది అక్టోబరులో తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ యువతికి ఎల్‌టీటీఈతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు ప్రకటించారు. 2019లో శ్రీలంక పాస్‌పోర్టు ద్వారా పర్యాటక వీసాతో ఆమె ఇండియాకు చేరుకోగా 2020 డిసెంబరులో వీసా గడువు ముగిసింది. చెన్నై అన్నానగర్‌లో ఒక ఇంటిని లీజుకు తీసుకుని ఆ పత్రాల ద్వారా వంటగ్యాస్ పొందింది. గ్యాస్ బిల్లు ఆధారంగా ఇండియా పాస్‌పోర్టు సంపాదించింది. బెంగళూరు మీదుగా ముంబయికి ప్రయాణం అవుతుండగా చెన్నై విమానాశ్రయంలో గత ఏడాది ఆమెను అరెస్ట్ చేశారు.
ఇండియా పాస్‌పోర్టు పొందేందుకు ఆమెకు సహకరించిన వారెవరని అధికారులు ఆరాతీస్తున్నారు. ఆమె సెల్‌ఫోన్ సంభాషణలను పరిశీలించారు. ఈ సమయంలో ఇండియాలోని లక్షదీవుల సమీపంలో ఎల్‌టీటీఈలో ఇంటెలిజెన్స్ అధికారిగా ఉండిన సద్గుణం అలియాస్ సెబాస్టియన్‌ను గత ఏడాది మార్చిలో అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఏకే 47 రకం తుపాకీలు, తూటాలు, 300 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఎల్‌టీటీఈని పునరుద్ధరించేందుకు ధనార్జన కోసం హెరాయిన్ మాదకద్రవ్యాలను అక్రమరవాణా చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఇదిలాఉండగా కెన్నిసన్ పొర్‌మాండో, భాస్కరన్, జాన్సన్ సామువేల్, సెల్లముదన్ అనే శ్రీలంకకు చెందిన నలుగురు వ్యక్తులు ముంబయి హార్బర్‌లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏటీఎం ద్వారా నగదు డ్రా చేసినట్లు ఎన్‌ఐఏ కనుగొంది. చెన్నైలో పట్టుబడిన మహిళతోపాటు ఈ నలుగురిపైనే ఎన్‌ఐఏ కేసులు నమోదు చేసింది. ఈ సంఘటనలతో అప్రమత్తమైన ఎన్‌ఐఏ అధికారులు తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబుతో సమాలోచనలు జరపడం ప్రారంభించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి ఎన్‌ఐఏ అధికారులు మూడు పేజీల నివేదికను కూడా అందజేశారు. శ్రీలంకకు సరిహద్దు రాష్ట్రం కావడంతో ఎల్‌టీటీఈని పునరుద్ధరించేందుకు తమిళనాడులో ప్రయత్నాలు సాగుతున్నాయని ఆ నివేదికలో ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. అంతేగాక కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి విచారణ జరిపి 15 రోజుల్లోగా బదులివ్వాలని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఎన్‌ఐఏ కోరింది. ఎల్‌టీటీఈ పునరుద్ధరణకు సహకరిస్తున్న తమిళనాడుకు చెందిన ముగ్గురు రాజకీయనేతలపై కూడా గట్టి నిఘా పెట్టాలని సైతం సూచించింది. తమిళనాడు ప్రభుత్వం 15 రోజుల్లో సమర్పించే నివేదిక అనంతరం ఎన్‌ఐఏ అధికారులు రాష్ట్రంలో విచారణ చేపట్టవచ్చని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment