LTTE
-
నెడుమారన్ దుమారం
శ్రీలంకలో స్వతంత్ర తమిళ రాజ్యస్థాపన లక్ష్యంగా పోరాడి మరణించిన లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం(ఎల్టీటీఈ) చీఫ్ ప్రభాకరన్ చాన్నాళ్ల తర్వాత వార్తల్లోకెక్కారు. ఆయన బతికేవున్నాడని, త్వరలో జనం ముందుకొస్తాడని తమిళ జాతీయోద్యమ నేత నెడుమారన్ సోమవారం చేసిన ప్రకటన సహజంగానే సంచలనంగా మారింది. ఆయన ప్రకటనలోని నిజానిజాల గురించి కన్నా, ఆ ప్రకటన చేయటం వెనకున్న ఉద్దేశాలపైనే తమిళనాడులో ప్రధానంగా చర్చ జరుగుతోంది. శ్రీలంక తమిళుల కడగండ్లపై ఇప్పటికీ తమిళనాట సానుభూతి ఉంది. అక్కడ తమిళులకు ఏం జరిగినా తమిళనాడులో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతాయి. శ్రీలంకలో ఎల్టీటీఈని నామరూపాల్లేకుండా చేసి పద్నాలుగేళ్లవుతోంది. అంతర్యుద్ధం ముగిశాక తమిళుల అభ్యున్నతికి అన్ని చర్యలూ తీసుకుంటామని, తమిళులు అధికంగా ఉండే ఉత్తర, తూర్పు ప్రావిన్సులకు స్వతంత్ర ప్రతిపత్తి ఇస్తామని అప్పట్లో చేసిన వాగ్దానాలను లంక సర్కారు ఈనాటికీ నెరవేర్చలేదు. తమ సమస్యలపై శాంతి యుతంగా నిరసన వ్యక్తం చేసినా లంక సైన్యం విరుచుకుపడుతోంది. ఈ పరిస్థితుల్లో నెడుమారన్ చేసిన ప్రకటన అక్కడి సాధారణ తమిళులకు ఎంతో కొంత ఊరటనిస్తుంది. సౌకర్యవంతమైన జీవితాలను వదులుకుని తమ కోసం, తమ విముక్తి కోసం పోరాడటానికి అంకితమై ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోయినవారిని వీరులుగా ఆరాధించటం, వారి జ్ఞాపకాలను పదిలపరుచుకోవటం, స్మరించుకోవటం అన్నిచోట్లా కనబడుతుంది. పాలక వ్యవస్థకు తిరుగుబాటు నేతలపై ఎలాంటి అభిప్రాయాలున్నా సాధారణ ప్రజానీకం దృష్టిలో వారు ఎప్పటికీ వీరులే. అలాగే దీనికి సమాంతరంగా వారి మరణాన్ని విశ్వసించని ధోరణి కూడా కనబడుతుంది. తిరుగుబాటుదార్లపై ఉండే గాఢమైన ప్రేమాభిమానాలే ఇందుకు కారణం కావొచ్చు. చరిత్రలోకి తరచి చూస్తే ఇలాంటి ఉదాహరణలెన్నో కనబడతాయి. ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18న ఫార్మోజా(ఇప్పటి తైవాన్)లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు చెప్పినా అందుకు సంబంధించిన స్పష్టమైన ఆధారాలు దొరకలేదు. అందుకే కావొచ్చు... ఆయన పేరు మార్చుకుని అజ్ఞాతవాసం గడుపుతున్నారంటూ చాన్నాళ్లు వదంతులు ప్రచారంలో ఉండేవి. శ్రీలంక తమిళుల్లో ప్రభాకరన్‌పై ఇప్పటికీ ఆరాధనాభావం బలంగా ఉందన్నది కాదనలేని సత్యం. ఇప్పటికీ లంక తమిళులను ద్వితీయ శ్రేణి పౌరులుగానే పరిగణిస్తున్న అక్కడి ప్రభుత్వ విధానాలు ఇందుకు దోహదపడుతున్నాయి. ఎల్టీటీఈ దూకుడు, దాని సిద్ధాంతాలూ, విధానాలనూ ఇతర సంస్థలు తీవ్రంగా విమర్శించేవి. అవి అంతిమంగా తమిళ జాతికి కీడు కలిగిస్తాయన్నది వారి ప్రధాన విమర్శ. తమిళ ఈలం కోసమే పోరాడే ఇతర సంస్థల నేతల్ని ఎల్టీటీఈ మట్టుబెట్టిన తీరు అత్యంత దారుణమైనది. 1991లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని, 1993లో అప్పటి శ్రీలంక అధ్యక్షుడు ప్రేమదాసనూ, అనేకమంది ఇతర నేతలనూ, సైనికాధికారులనూ మానవబాంబులతో దాడిచేసి హతమార్చిన చరిత్ర ఎల్టీటీఈది. ఉత్తర శ్రీలంకలోని ముల్లైతీవు ప్రాంతంలోని ఒక రహస్య స్థావరంలో తలదాచుకున్న ప్రభాకరన్‌నూ, ఆయన అనుచరులనూ సుదీర్ఘంగా సాగిన పోరాటంలో అంతమొందించామని 2009 మే 18న లంక సైన్యం ప్రకటించింది. అదే నెల 24న ఎల్టీటీఈ అంత ర్జాతీయ వ్యవహారాల చీఫ్ సెల్వరాస పద్మనాథన్ కూడా దీన్ని ధ్రువీకరించారు. నిజానికి ప్రభాకరన్ సజీవంగా ఉన్నారంటూ నెడుమారన్ ప్రకటించటం ఇది మొదటిసారేమీ కాదు. 2018లో ఆయన ఈ తరహా ప్రకటనే చేశారు. సైనిక వలయాన్ని ఛేదించి ఆయన తప్పించుకున్నట్టు తన దగ్గర విశ్వస నీయ సమాచారం ఉన్నదని నెడుమారన్ అప్పట్లో చెప్పారు. మళ్లీ అయిదేళ్ల తర్వాత ఎలాంటి ఆధా రాలూ చూపకుండా మరోసారి ఆమాటే చెప్పటం సందేహాలకు తావిస్తోంది. తమిళనాడులో కాంగ్రెస్ హవా నడుస్తున్నప్పుడు కామరాజ్ అనుచరుడిగా ఓ వెలుగు వెలిగిన నెడుమారన్ ఆ తర్వాత రాజకీ యాలకు దూరమై శ్రీలంక తమిళుల హక్కుల కోసం పోరాడే నేతగా గుర్తింపు పొందారు. కన్నడ నటుడు రాజ్‌కుమార్‌ను వీరప్పన్ అపహరించినప్పుడు ఆయన విడుదలకు సంప్రదింపులు జరిపిన కీలక వ్యక్తుల్లో నెడుమారన్ ఒకరు. వర్తమాన తమిళ రాజకీయాల్లో శ్రీలంక తమిళుల అవస్థలు ప్రస్తా వనకు రాకపోవటం, కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన రాజకీయ పక్షాలు నిర్లిప్తంగా ఉండటం జీర్ణించు కోలేకే నెడుమారన్ ఈ సంచలన ప్రకటన చేశారన్న అభిప్రాయం చాలామందిలో ఉంది. ఒకప్పుడు ఎల్టీటీఈ బూచి చూపి సింహళ జాతిని ఏకం చేసిన రాజపక్సే సోదరులు నిరుడు ఉవ్వెత్తున ఎగిసిన ప్రజోద్యమంలో అధికారాన్ని కోల్పోయినప్పటి నుంచీ మళ్లీ సింహళీయుల్లో మద్దతు సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభాకరన్ గురించిన వదంతిని ప్రచారంలో పెడితే భయభ్రాంతులైన జనం మళ్లీ తమవైపు చూస్తారన్నదే వారి ఆశ అంటున్నారు. అందులో నెడుమారన్ అమాయకంగా చిక్కుకున్నారా, లేక రాష్ట్ర రాజకీయాల్లో తనకు ప్రాసంగిత పెరగటానికి తోడ్పడుతుందన్న భావనతో ఉద్దేశపూర్వకంగా ఈ మాటన్నారా అన్న సందేహమూ ఉంది. ఏదేమైనా లంక యుద్ధ నేరాలపై విచారణ జరిపి నేరగాళ్లను శిక్షించటం, దుర్భర జీవితం గడుపుతున్న తమిళుల సమస్యల పరిష్కారానికి కృషి చేయటం తక్షణావసరమని శ్రీలంక ప్రభుత్వం గుర్తించాలి. ఆ విషయంలో మన దేశంతో సహా ప్రపంచ దేశాలన్నీ ఒత్తిడి తీసుకురావాలి. నెడుమారన్ ప్రకటన ఇందుకు దోహదపడితే మంచిదే. -
ఎవరీ ప్రభాకరన్? నెడుమారన్ ప్రకటనతో కలకలం.. నిజంగా బతికే ఉన్నాడా?
వేలుపిళ్లై ప్రభాకరన్. తమిళులకు ఆరాధ్యుడు. శ్రీలంక ప్రభుత్వం దృష్టిలో రక్తపుటేర్లు పారించిన ఉగ్రవాది. భారత్ దృష్టిలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని పొట్టన పెట్టుకున్న హంతకుడు. 2009లో శ్రీలంక సైన్యం దాడిలో హతమైనట్టు ప్రపంచమంతా నమ్ముతుండగా, ఆయన బతికే ఉన్నారంటూ తమిళ నేత నెడుమారన్ తాజాగా చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది... పెద్దపులిగా పేరుబడ్డ ప్రభాకరన్‌ది ఆద్యంతం ఆసక్తికర ప్రస్థానం. శ్రీలంకలోని తమిళులకు ప్రత్యేక దేశం కావాలన్న ఆశయ సాధనకు మూడు దశాబ్దాలకు పైగా లంక సైన్యంపై సాయుధ పోరాటం సాగించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులకు ఆరాధ్య నాయకుడిగా కీర్తి పొందిన ప్రభాకరన్ 1954 నవంబర్ 26న శ్రీలంకలోని ఉత్తర తీర ప్రాంత పట్టణం వల్వెత్తితురైలో జన్మించారు. ఆయన తండ్రి ప్రభుత్వ అధికారిగా పనిచేశారు. స్థానిక సింహళీయులు, లంక సైనికుల అరాచకాలను కళ్లారా చూసిన ప్రభాకరన్ తట్టుకోలేకపోయారు. బడి మానేసి విప్లవోద్యమం వైపు అడుగులేశారు. ఎల్టీటీఈ... ‘త్రివిధ’ ఉగ్ర సంస్థ! ప్రభాకరన్ తొలుత తమిళుల ఆందోళన కార్యక్రమాలు, నిరసనల్లో పాల్గొన్నారు. నెమ్మదిగా తమిళ యువకులను చేరదీసి 1972లో ‘తమిళ్ న్యూ టైగర్స్’ పేరిట ఓ సంస్థను ఏర్పాటు చేశారు. 1975లో దాని పేరును లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ)గా మార్చారు. అప్పటినుంచి మూడు దశాబ్దాల పాటు ఎల్టీటీఈ పేరు ప్రపంచమంతటా మారుమోగింది. టైగర్స్, సీ టైగర్స్ (నావికాదళం), ఎయిర్ టైగర్స్ (వైమానిక దళం) పేరిట త్రివిధ దళాలున్న ఏకైక ఉగ్రవాద సంస్థగా ఎల్టీటీఈ చరిత్ర సృష్టించింది! అంతేగాక ఎల్టీటీఈలో ఆత్మాహుతి దళాలను, ‘సైనేడ్ మరణాల’ను ప్రవేశపెట్టి ప్రభాకరన్ సంచలనం సృష్టించారు. తమిళులకు ప్రత్యేక దేశం కోసం లంక సైన్యంతో ఎల్టీటీఈ దళాలు ఏళ్ల తరబడి హోరాహోరీ తలపడ్డాయి. ఈ యుద్ధంలో లక్ష మందికి పైగా బలయ్యారు. బాధితుల్లో సింహళ జాతీయులతో పాటు తమిళులు కూడా ఉన్నారు. తమిళులు ముద్దుగా ‘తంబి’ అని పిలుచుకొనే ప్రభాకరన్ ఆయుధాలతో పాటు కొన్నిసార్లు దౌత్య మార్గాన్ని కూడా ప్రయత్నించి విఫలమయ్యారు. 1985లో భారత చొరవతో, 2002లో నార్వే మధ్యవర్తిగా శ్రీలంక ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. ఇంటర్‌పోల్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దర్యాప్తు సంస్థలు ప్రభాకరన్‌ను మోస్ట్ వాంటెడ్‌గా ప్రకటించాయి. రాజీవ్ హత్య ప్రముఖ నేతలను పాశవికంగా పొట్టన పెట్టుకున్న తీరు ఎల్టీటీఈ రక్తచరిత్రలో ఓ ప్రత్యేక అధ్యాయం. భారత ప్రధాని రాజీవ్‌గాంధీ శాంతి పరిరక్షణ పేరిట లంకకు భారత సైన్యాన్ని పంపడంతో ప్రభాకరన్ తీవ్రంగా మండిపడ్డారు. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూరులో మానవ బాంబు దాడితో ఆయనను బలి తీసుకున్నారు. అనంతరం 1993లో శ్రీలంక అధ్యక్షుడు రణసింఘె ప్రేమదాస కూడా ఎల్టీటీఈ ఆత్మాహుతి బాంబు దాడికి బలయ్యారు. అంతేగాక చంద్రికా కుమారతుంగ, మైత్రిపాల సిరిసేన సహా పలువురు లంక అధ్యక్షులను, ప్రధానులను హతమార్చేందుకు ఎల్టీటీఈ విఫలయత్నం చేసింది. ఇక దాని దాడుల్లో బలైన శ్రీలంక మంత్రులు, రాజకీయ నాయకులు, సైనిక ఉన్నతాధికారుల జాబితాకైతే అంతు లేదు! వెంటాడి, వేటాడి... దశాబ్దాలపాటు నెత్తుటేర్లు పారించిన ఎల్టీటీఈపై మహింద రాజపక్సె హయాంలో లంక సైన్యం ఉక్కుపాదం మోపింది. ముప్పేట దాడితో సంస్థను నిర్వీర్యం చేసింది. మిగిలిన కొద్దిమందీ చెల్లాచెదురయ్యారు. ప్రభాకరన్ కూడా మారుమూల ప్రాంతాల్లో తలదాచుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది! ఆయన కోసం సైన్యం కనీవినీ ఎరగని రీతిలో వేటకు దిగింది. చివరికి 2009 మే 18న శ్రీలంకలోని ముల్లైతీవులో హోరాహోరీ పోరాటంలో ప్రభాకరన్‌ను మట్టుబెట్టినట్టు ప్రకటించింది. మృతదేహం ఫొటోలను కూడా విడుదల చేసింది. దాడిలో అతని కుమారుడు బాలచంద్రన్ కూడా చనిపోయినట్టు పేర్కొంది. కొడుకు, కూతురు సజీవమే? ప్రభాకరన్ వ్యక్తిగత జీవితం గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. 1984 అక్టోబర్ 1న చెన్నై సమీపంలోని తిరుపోరూర్‌లో మదివదనిని ఆయన పెళ్లి చేసుకున్నారు. వారికి కుమార్తె ద్వారక, కుమారులు చార్లెస్ ఆంథోనీ, బాలచంద్రన్ ఉన్నా రు. బాలచంద్రన్ లంక సైనికుల చేతిలో మరణించగా మిగతా వారి ఆచూకీ తెలియదు. వారు లంకలో లేరని, విదేశాల్లో తలదాచుకుంటున్నారని తమిళులు నమ్ముతుంటారు. ప్రభాకరన్ బతికే ఉన్నారు త్వరలోనే జనం ముందుకొస్తారు తమిళ జాతీయోద్యమ నేత నెడుమారన్ సాక్షి, చెన్నై/తంజావూర్: లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈళం(ఎల్టీటీఈ) అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నారని తమిళ జాతీయోద్యమ నేత పాళ నెడుమారన్ సంచలన ప్రకటన చేశారు. ‘‘ప్రభాకరన్ గురించి కొందరు పథకం ప్రకారం రేకెత్తించిన అనుమానాలకు నేను తెరదించుతున్నా. భార్యా కూతురితో సహా ప్రభాకరన్ క్షేమంగా ఉన్నారు. ఆయన జనం ముందుకు రావడానికి ఇప్పుడు పూర్తి అనుకూల వాతావరణముంది’’ అని నెడుమారన్ సోమవారం తమిళనాడులో మీడియాకు వెల్లడించారు. ‘‘శ్రీలంకలో ఈళం తమిళుల పునఃప్రవేశంపై ప్రభాకరన్ త్వరలోనే ప్రకటన చేయబోతున్నారు. నేను చెప్పిందంతా వంద శాతం నిజమే’’ అని ఉద్ఘాటించారు. ప్రభాకరన్ ఇప్పుడెక్కడ ఉన్నదీ మాత్రం ఇప్పుడే చెప్పనన్నారు. శ్రీలంకతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమిళులంతా ఒక్కతాటిపైకి వచ్చి ప్రభాకరన్‌కు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఎల్టీటీఈ ఏనాడూ భారత్‌కు వ్యతిరేకంగా వ్యవహరించలేదన్నారు. ప్రభాకరన్ బతికుంటే అంతకన్నా సంతోషకరమైన వార్త మరొకటి ఉండదని డీఎండీకే అధినేత వైగో, పలు పార్టీల నేతలన్నారు. పెద్ద జోక్: శ్రీలంక కొలంబో: ప్రభాకరన్ బతికే ఉన్నాడనడాన్ని పెద్ద జోక్‌గా శ్రీలంక రక్షణ శాఖ అధికార ప్రతినిధి నళిన్ హెరాత్ అభివర్ణించారు. ‘‘ప్రభాకరన్ 2009 మే 18న హతమయ్యాడు. ఇది డీఎన్ఏ పరీక్షలోనూ నిర్ధారణ అయింది’’ అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సంచలన ప్రకటన..! ప్రభాకరన్ బ్రతికే ఉన్నాడు
-
మమ్మల్ని క్షమించండి... ఆ దారుణానికి చింతిస్తున్నా!: నళిని శ్రీహరన్
మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషులుగా తేలిన నళిని తోపాటు మరో ఐదుగురు నిందితులను విడుదల చేస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాజీవ్ గాందీ హత్య కేసులో దోషులలో ఒకరైన నళిని శ్రీహరన్ మీడియాతో మాట్లాడుతూ...."ఆ దారుణం గురించి ఆలోచిస్తూ చాలా ఏళ్లు గడిపాం. మమ్మల్ని క్షమించండి. ఆ ఆత్మహుతి దాడి ఘటనలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారు ఆ విషాదం నుంచి సాధ్యమైనంత తొందరగా బయటపడాలని కోరుకుంటున్నాను." అని బాధితుల కుటుంబాలకు నళిని పశ్చాత్తాపంతో కూడిన సందేశం ఇచ్చింది. తాను తన భర్తతో కలిసి యూకే వెళ్లి స్థిరపడాలనుకున్నట్లు తెలిపారు. గాంధీ కుటుంబాన్ని కలుస్తారా అని మీడియా ప్రశ్నించగా...వారు కలుస్తారని అనుకోను, కలిసే సమయం అయిపోయిందని భావిస్తున్నాను అని నళిని అన్నారు. అయితే రాజీవ్‌గాంధీ హత్య కేసు దోషులను విడుదల చేస్తూ ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఐతే ఈ తీర్పుని తమిళనాడులో చాలా మంది స్వాగతించారు. ఖైదీల సత్ప్రవర్తన, ఈ కేసులో దోషిగా తేలిన మరో వ్యక్తి ఏజీ పెరరివాలన్ మేలో విడుదల కావడం, అతడు అరెస్టు అయ్యే సమయానికి 19 ఏళ్లు కావడం, అదీగాక దోషులంతా 30 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించడం తదితర అంశాలను పరిగణలోనికి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సుప్రీం కోర్టు పేర్కొంది. (చదవండి: రాజీవ్ హత్య కేసు: ఎట్టకేలకు నళినికి విడుదల.. జైలు జీవితం ఎన్ని రోజులో తెలుసా?) -
Rajiv Gandhi Case: ఆ ఫొటోగ్రాఫర్ ఇంట్లో దొరికిన రసీదే.. హంతకులను తెరపైకి తెచ్చిందా?!
లంక పరిణామాలు మన దేశంలో భారీ మార్పులు తీసుకువచ్చాయి. ప్రభాకరన్‌ను లంక సైన్యం మట్టుపెట్టడం, ఎల్టీటీఈ తన శ్రేణులన్నీ కోల్పోవడంతో జాఫ్నాతో పాటు ఉత్తర ప్రాంతమంతా లంక సైన్యం ఆధీనంలోకి వచ్చింది. అంతర్యుద్ధం ముగిసిందని అప్పటి అధ్యక్షుడు రాజపక్సే ప్రకటించారు. లంకలో తమిళుల ప్రాభవం వేగంగా కోల్పోవడంతో ఇక్కడ ఖైదీల మీద వీపరీతంగా సానుభూతి పెరిగింది. ఈలోగా జైల్లో ఉన్న ఏడుగురు ఖైదీలు తమను క్షమించమంటూ అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రతిభా పాటిల్ దీన్ని నిర్దంద్వంగా తోసిపుచ్చారు. ఈ లోగా మరో పిటిషన్ మద్రాస్ హైకోర్టు మెట్లెక్కింది. వాదోపవాదాలు, అప్పటి పరిస్థితుల దృష్ట్యా మద్రాస్ హైకోర్టు ఉరి శిక్షపై స్టే ఆర్డర్ ఇచ్చింది. ఇది ఎల్టీటీఈ ఖైదీలకు పెద్ద ఊరట. ఉరిశిక్ష స్థానంలో యావజ్జీవ శిక్షను సూచించింది సుప్రీంకోర్టు. ఈలోగా రాజీవ్ గాంధీ కుటుంబానికి తమిళుల వినతులు వెల్లువెత్తాయి. నేరుగా రాజీవ్ కూతురు ప్రియాంక, కొడుకు రాహుల్ గాంధీ నేరస్థులను జైల్లో కలిశారు. పరిస్థితి ఎందాక వెళ్లిందంటే మొత్తం సమాజం నేరస్థులను క్షమించారా అన్నంత చర్చకు దారి తీసింది. ఈలోగా తమిళనాడు సీఎం జయలలిత ఓ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. 23ఏళ్లకు పైగా జైల్లో ఉన్న అందరూ ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఇది ఢిల్లీలో సంచలనం సృష్టించింది. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. దేశానికి అత్యున్నత పదవుల్లో ఒకటయిన ప్రధానిగా పని చేసిన రాజీవ్‌గాంధీ హత్యకు గురయితే, దానికి కారకులను ఓ రాష్ట్రం ఎలా విడిచిపెడతారన్న చర్చ జరిగింది. ఇదే విషయం సుప్రీంకోర్టు ముందుకొచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలుత తమిళనాడు నిర్ణయంపై స్టే విధించిన సర్వోన్నత న్యాయస్థానం.. జయ సర్కారు నిర్ణయాన్ని తప్పుబట్టింది. రాజీవ్ హంతకుల విడుదలపై నిర్ణయం తీసుకునే హక్కు తమిళనాడు ప్రభుత్వానికి లేదని తేల్చిచెప్పింది. ముగ్గురు న్యాయమూర్తుల డివిజన్ బెంచ్ తుది నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. జైల్లో నుంచి బయటపడతామని కోటి ఆశలు పెట్టుకున్న ఎల్టీటీఈ ఖైదీలు సుప్రీం తీర్పుతో నిరాశకు గురయ్యారు. అయితే వారిలో ఆశ మాత్రం చావలేదు. దానికి కారణం తమిళులు, వారి రాజకీయాలు. చదవండి: (రాజీవ్ హత్య.. సినిమాను మించే ట్విస్ట్‌లు.. అసలు ఆనాడేం జరిగింది?) నాడు రాజీవ్ హంతకులను పట్టుకోవడానికి కార్తికేయన్ సారధ్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. విచిత్ర పరిస్థితుల మధ్య పలు రకాల అవాంతరాల నడుమ సిట్ పట్టువదలకుండా దర్యాప్తు కొనసాగించింది. విమర్శలు వచ్చినా, సమస్యలు ఎదురైనా ఢీలా పడకుండా విచారణ సాగించిన సిట్ ఈ దారుణానికి పాల్పడింది ఎల్టీటీఈ అని తేల్చింది. ఫోటోగ్రాఫర్ హరిబాబు ఇంట్లో దొరికిన రసీదును ఆధారంగా చేసుకొని తీగ లాగిన సిట్.. హంతకుల పేర్లను తెరపైకి తెచ్చింది. 1991.. దేశమంతటా అస్థిర వాతావరణం నెలకొన్న సమయం. కేంద్రంలో ప్రభుత్వాలు ఒకదాని వెంట ఒకటి కూలిపోయిన తరుణం. అలాంటి సమయంలో లోక్‌సభకు ఎన్నికలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రచార భారం రాజీవ్‌గాంధీపై పడింది. అప్పటికే దేశమంతా తిరుగుతున్న ఆయన ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో ప్రచారంపై దృష్టి పెట్టిన ఆయన అందుకు తగినట్లుగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 1991, మే 20 నుంచి 22 వరకు ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకల్లో ప్రచారం ముగించుకొని 22 సాయంత్రం వరకైనా రాజీవ్ ఢిల్లీకి చేరుకోవాలి. ఇదీ ప్లాన్. ఆంధ్రప్రదేశ్ పర్యటన వరకు అన్నీ అనుకున్న ప్రకారం జరిగాయి. కానీ 21న పరిస్థితి మొత్తం మారిపోయింది. -
ఇందిర చేసిన తప్పే రాజీవ్‌ను బలి తీసుకుందా?
రాజీవ్ హత్య కేసులో నిందితులను కోర్టులో ప్రవేశపెట్టడానికి సిట్ నానా తిప్పలు పడింది. 1991 జూన్ 11న మొదటి అరెస్టు జరిగింది. 1991 నవంబర్ నాటికి నిందితుల వేటను ముగించింది. దొరికిన అన్ని డాక్యుమెంట్లు, వీడియో క్యాసెట్లు, ఫోటోలు, ఫైళ్లు అన్నింటినీ పరిశీలించి LTTE చీఫ్ ప్రభాకరన్ సహా 41 మందిని నిందితులుగా చూపుతూ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. 1998 జనవరి 28న నిందితులందరికీ మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. శ్రీలంకలో ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో అధిక సంఖ్యలో తమిళులు ఉండేవారు. ఈలమ్ పేరుతో వేరే దేశాన్ని ఏర్పాటు చేయాలనేది వీరి డిమాండ్. వీరికి తమిళ రాజకీయ పార్టీలు సహా తమిళుల అండ దండలు కూడా ఉండేవి. శ్రీలంక తమిళుల్లో.. కొందరు మితవాదులు, మరికొంతమంది అతివాదులు ఉండేవారు. సింహళీయ తమిళులకు ప్రభుత్వం కొన్ని హక్కులిచ్చి, ప్రజలకు రక్షణ కల్పించాలని మిత వాదులు భావిస్తే ఈలమ్ ఏర్పడి తీరాల్సిందేనని అతివాదులు చెప్పేవారు. ఈలం కోసం హింసా మార్గాలు అనుసరించినా తప్పులేదని భావించేవారు. ఈ క్రమంలోనే.. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం LTTE పురుడుపోసుకుంది. 1954లో పుట్టిన వేలుపిళ్లై ప్రభాకరన్ 1976 మే 5న LTTEని ఏర్పాటు చేశాడు. తన 21వ ఏట.. జాఫ్నా మేయర్‌ను హత్య చేసి అలజడి సృష్టించిన ప్రభాకరన్.. తమిళ ఈలం ఏర్పాటు డిమాండ్‌తో లంకలో హింసాత్మక పద్దతులకు పాల్పడ్డాడు. శ్రీలంక నాయకులు కూడా తమిళుల ఓట్ల కోసం నానా రకాల ఎత్తులు వేశారు. ఆ ఆటలో నాటి భారత ప్రభుత్వం కూడా పాలు పంచుకుందనే ఆరోపణలున్నాయి. లంక సర్కార్‌ను ఇరుకునపెట్టడానికి ఇందిరాగాంధీ హయాంలో LTTEని ప్రోత్సహించారని చెబుతారు. టైగర్లకు ఆయుధాలు, నిధులు అందించారని అంటారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు DMK, అన్నాడీఎంకే సహా తమిళ పార్టీలన్నీ ఈ వ్యవహారంలో తలో చేయి వేశాయి. లంక సర్కార్‌పై పోరు ప్రకటించిన ప్రభాకరన్ 1983-86 మధ్య తమిళనాడులో తలదాచుకున్నాడు. ఆ సమయంలో తమిళనాడు సీఎం MGR కాగా ప్రధానిగా ఇందిరాగాంధీ ఉన్నారు. ఇందిర మరణం తర్వాత లంక విషయంలో భారత సర్కార్ వైఖరి మారింది. ప్రధాని బాధ్యతలు చేపట్టిన రాజీవ్‌గాంధీ టైగర్ల విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించారు. ఈ క్రమంలో 1986 నవంబర్‌లో తమిళ పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా గాలింపులు జరిపి LTTE ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభాకరన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్‌ను నిరసిస్తూ ప్రభాకరన్ నిరాహార దీక్ష చేపట్టాడు. అతనికి మద్ధతుగా DMK సహా తమిళ నేతలు ఆందోళనలు చేశారు. గత్యంతరం లేని పరిస్థితిలో ప్రభుత్వం టైగర్ల ఆయుధాలను తిరిగిచ్చేసింది. ఆ పరిణామం LTTE ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రెట్టించిన ఉత్సాహంతో శ్రీలంకతో పాటు భారత్‌లోనూ LTTE పలు హింసాత్మక చర్యలకు పాల్పడింది. LTTE దాడులను అరికట్టడానికి రాజీవ్‌గాంధీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంక ప్రభుత్వంతో రాజీ పడాలంటూ.. ప్రభాకరన్‌కు రాజీవ్ సూచించారు. అవసరమైతే ఈ సంధి వ్యవహారానికి తాను మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పారు. ఈ క్రమంలో రాజీవ్ గాంధీ, శ్రీలంక ప్రధాని జయవర్దనే మధ్య ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో శ్రీలంకలో శాంతిని నెలకొల్పడానికి భారత్ నుంచి శాంతి పరిరక్షక బృందాలు రంగంలోకి దిగాయి. ఆ బలగాలు.. LTTE మూకలను చీల్చి చెండాడాయి. ఇది LTTEకి ఊపిరిసలపనివ్వలేదు. 1991లో భారత్‌లో మళ్లీ ఎన్నికలొచ్చే సరికి LTTE భయపడిపోయింది. రాజీవ్‌గాంధీ మళ్లీ ప్రధాని ఐతే తమ ఆటలు సాగబోవని ఆందోళన చెందింది. రాజీవ్ ఉంటే తమకు ముప్పు తప్పదని భావించిన LTTE అతన్ని హతమార్చేందుకు కుట్ర పన్నింది. రాజీవ్‌గాంధీని చంపాలని ప్రభాకరన్ నిర్ణయం తీసుకోవడానికి ఇదొక్కటే కారణం కాదు. 1991 మార్చి ఐదో తేదీన జరిగిన ఓ మీటింగ్ ప్రభాకరన్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. 1991 మార్చి ఐదో తేదీన LTTE కేంద్ర కమిటీ సభ్యుడు కాశీ ఆనందన్.. శ్రీలంక సమస్య గురించి రాజీవ్‌గాంధీతో రహస్యంగా చర్చలు జరిపాడు. ఐతే కాశీ వచ్చింది రాజీవ్‌ను చంపడానికి. రాజీవ్‌ను ఢిల్లీలోనే హతమార్చే ప్లాన్‌తో LTTE.. కాశీని ఢిల్లీ పంపించింది. అయితే, రాజీవ్‌తో భేటీ తర్వాత కాశీ తన నిర్ణయం మార్చుకున్నాడు. లంక తమిళుల పట్ల రాజీవ్‌కు సానుభూతి ఉందని, అతనితో సత్సంబంధాలు పెట్టుకోవడం LTTEకి మంచిదంటూ ప్రభాకరన్‌కు కాశీ లేఖ రాశాడు. ఇది ప్రభాకరన్‌కు మంట పుట్టించింది. చంపి రమ్మని పంపితే హితోక్తులు చెబుతున్నాడంటూ రగిలిపోయిన ప్రభాకరన్.. అప్పుడే రాజీవ్ హత్యకు ప్రణాళిక రచించాడు. ఎంత పకడ్బంధీగా చేసినా నేరస్థులు ఎక్కడో చోట చిన్న తప్పు చేస్తారు. ఆ చిన్న పొరపాటే వారిని పోలీసులకు పట్టిస్తుంది. రాజీవ్ హత్య కేసులోనూ అదే జరిగింది. అత్యంత పకడ్బంధీ ప్లాన్‌తో రాజీవ్ హత్య చేశామని చంకలు గుద్దుకున్న LTTEకి కొన్ని రోజుల్లోనే షాక్ తగిలింది. రోజుల వ్యవధిలోనే టైగర్ల కుట్ర బయటపడింది. ఓ రసీదు.. ఓ కెమెరా.. నేరస్థుల ఆనవాళ్లను పట్టించాయి. ఆ దర్యాప్తు క్రమంలోనే రాజీవ్ హత్యకు LTTE ఎలా ప్లాన్ వేసిందో బయటపడింది. రాజీవ్‌ను హత్య చేసే పనిని ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి పొట్టు అమ్మన్‌కు అప్పగించింది. అసలు పేరు షణ్ముగలింగం శివశంకర్. 1962లో పుట్టిన అమ్మన్ 1981లో LTTEలో చేరాడు. స్వల్ప కాలంలోనే LTTEలో కీలక నేతగా ఎదిగిన అమ్మన్‌కు ఎవరిని ఏ పనికి ఉపయోగించుకోవాలో బాగా తెలుసంటారు. దాంతో.. ప్రభాకరన్‌కు అమ్మన్పై నమ్మకం ఎక్కువ. అందుకే రాజీవ్‌ను హతమార్చే పనిని అమ్మన్‌కు అప్పగించాడు. ఈ క్రమంలో రాజీవ్‌ను హత్య చేసే పథకం ఊపిరి పోసుకుంది. ప్రభాకరన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పొట్టు అమ్మన్.. 1991 ఏప్రిల్ 28న జాఫ్నాలోని మధకల్లో ఓ సమావేశం ఏర్పాటు చేశాడు. అంటే రాజీవ్ హత్యకు దాదాపు మూడు వారాల ముందు ఈ మీటింగ్ జరిగింది. శివరాజన్, ధాను, శుభ, రూసో, కీర్తి, శివరూపన్, విజయానందన్, నెహ్రూ, సుధేంద్రరాజా, అఖిల తదితరులు ఆ మీటింగ్‌లో పాల్గొన్నారు. రాజీవ్‌ను చంపకపోతే లంకలో తమిళులు శాంతంగా ఉండలేరని, రాజీవ్ బతికి ఉంటే తమకు ముప్పు తప్పదంటూ శివరాజన్, ధాను తదితరులకు నూరి పోశాడు. అలా రాజీవ్ హత్యకు హంతకముఠాను ప్రిపేర్ చేశాడు. శివరాజన్.. రాజీవ్ హంతక ముఠాకు లీడర్ ఇతనే. ఇతని అసలు పేరు భాగ్యచంద్రన్. రాజన్, దురై, అరవింద్, శివరాజ్ ఇలా చాలా మారు పేర్లే ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసిన శివరాజన్.. 1983లో అతివాద సంస్థలతో పరిచయం పెంచుకొని పేలుడు పదార్థాల తయారీలో గట్టి శిక్షణ తీసుకున్నాడు. 1984లో LTTEలో చేరాడు. శ్రీలంకలో భారత శాంతి పరిరక్షణదళానికి సహకరిస్తున్న EPRLF నేత పద్మనాభన్‌ను హత్యచేసింది ఇతనే. దాంతో పొట్టుఅమ్మన్కు శివరాజన్పై గట్టి నమ్మకం ఏర్పడింది. పద్మనాభన్‌ను చంపిన ఏడాదికే.. రాజీవ్‌ను హతమార్చే బాధ్యతను శివరాజన్పై పెట్టాడు. ఆ బాధ్యతను తీసుకున్న శివరాజన్ ముందుగా తన జట్టును తయారు చేసుకున్నాడు. పద్మనాభన్ హత్యలో సహకరించిన సుధేంద్ర రాజాను తీసుకున్నాడు. ఇతనికి రాజా, శాంతన్ అనే మారు పేర్లు ఉన్నాయి. అతనితో పాటు శుభ అనే అమ్మాయి వచ్చింది. ఈమె LTTE షాడో బృందం సభ్యురాలు. ఇక మానవబాంబుగా ధాను ఎంపికైంది. 22 ఏళ్ల ధాను అసలు పేరు కళైవాణి. ముద్దు పేరు అన్బు. బట్టికలోవాలో పాఠశాల విద్య పూర్తి చేసిన ఆమె తండ్రి సూచనలతో LTTEలోని మహిళా విభాగం కరుంపులిలో చేరింది. ఇక రూసో, విజయానందన్లు హంతకముఠాతో చేయి కలిపారు. వీరితో పాటు మరో ముఖ్య వ్యక్తి శివ రూపన్. ఇతను పొట్టు అమ్మన్‌కు నమ్మకస్తుడైన వ్యక్తిగత వైర్లెస్ ఆపరేటర్. LTTEలో రహస్యాలు తెలిసిన అతి కీలక వ్యక్తుల్లో శివరూపన్ కూడా ఒకడు. ఇక ముఠాలో మరో ఇద్దరు సభ్యులు నెహ్రూ, తంబి అన్న. ఇలా హతమార్చడానికి శివరాజన్ నేతృత్వంలో 9 మంది సభ్యులతో ముఠా తయారైంది. శివరాసన్ చెప్పిన ప్రకారం నడుచుకోవాలని ధాను, తదితరులకు పొట్టు అమ్మన్ స్పష్టంగా చెప్పాడు. దీంతో శివరాసన్ సూచనల ప్రకారం ఏప్రిల్ 30న హంతక ముఠా శ్రీలంకలోని మధకల్ నుంచి నాటు పడవలో బయల్దేరి మే ఒకటో తేదీన తమిళనాడులోని వేదారణ్యం దగ్గర కొడికరల్ తీరానికి చేరారు. స్మగ్లర్ షణ్ముగం వారిని సురక్షిత స్థావరాలకు తరలించాడు. LTTE రాజకీయ విభాగంలో పని చేస్తూ మద్రాస్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కాంతన్, డిక్సన్‌లు కూడా వారితో చేరిపోయారు. హంతకముఠా వేదారణ్యంలో అడుగుపెట్టేనాటికి LTTE మద్రాస్‌లో పూర్తి స్కెచ్‌తో రెడీ ఐంది. చెన్నైలో LTTE కార్యకలాపాలకు కేంద్రమైన శుభా న్యూస్ అండ్ ఫోటో ఏజెన్సీస్ యజమాని శుభా సుందరం అందుకు తగిన ఏర్పాట్లు చేశాడు. LTTE సిద్ధాంతవేత్తల్లో ముఖ్యుడైన బేబీ సుబ్రమణీయం అలియాస్ బాల సుబ్రమణ్యంతో పాటు శివరాజన్ సహాయకుడు మురుగన్‌లు కలిసి.. కుట్రదారులను తయారు చేశారు. ముత్తు రాజన్ తదితరులు వారికి సహరించారు. శుభా సుందరం, సుబ్రమణ్యం, మురుగన్‌లు కలిసి ఫోటో గ్రాఫర్ హరిబాబు, అరివు పెరారీ వాలన్, నళిని, ఆమె తమ్ముడు భాగ్యనాధన్లను తమ కుట్రలో పావులుగా చేసుకున్నారు. ధాను మానవబాంబు.. ఆమెకు స్టాండ్ బైగా మరో మానవబాంబు శుభ. ఐతే నళినితో ప్రేమలో పడిన మురుగన్.. ఆమెను కూడా మానవబాంబుగా మార్చాలని ప్రయత్నించాడు. అందుకు రంగం కూడా సిద్ధం చేశాడు. ఐతే స్టాండ్ బై మానవ బాంబుగా శుభ రావడంతో ప్లాన్ మార్చేశాడు. ఇక పెరారీ వాలన్ బెల్టు బాంబును తయారు చేశాడు. అలా రాజీవ్ హత్యకు రంగం సిద్ధమైంది. రాజీవ్‌ను హతమార్చాలని కంకణం కట్టుకున్న LTTE.. అందుకు రిహార్సల్స్ చేసుకుంది. ఏప్రిల్ 21న రాజీవ్‌గాంధీ పాల్గొన్న ఎన్నికల ప్రచారంలో రిహార్సల్స్ జరిపి చూసుకున్నారు. ఆ తర్వాత మే 7న వీపీ సింగ్ సభలోనూ రిహార్సల్స్ చేసుకున్నారు. ఓ వీఐపీ వద్దకు వెళ్లి మానవబాంబు ప్రయోగించగలమో లేదో చెక్ చేసుకున్నారు. మే 7 నుంచి 20 వరకు హత్యకు సంబంధించి వివిధ రకాల పనులు పూర్తి చేసుకున్నారు. ఇక అనుకున్న రోజు రానే వచ్చింది. మే 20 తేదీ రాత్రి కుట్రదారులు ఎంజాయ్ చేశారు. 1991 మే 21.. జయకుమార్ ఇంట్లో శివరాజన్ రెడీ అయ్యాడు. మానవబాంబు ధాను, శుభాలతో కలసి నళిని ఇంటికి వెళ్లాడు. ఫోటోగ్రాఫర్ హరిబాబు పారిస్ కార్నర్‌కు వెళ్లి పూంపుహార్ అనే షో రూమ్‌లో ఒక చందనమాల కొన్నాడు. ధాను, శుభ, నళిని, హరిబాబు, మురుగన్‌లను తీసుకొని శివరాజన్ శ్రీ పెరంబుదూర్ బయల్దేరాడు. 21 సాయంత్రం ఏడున్నర గంటలకు.. హంతకముఠా శ్రీ పెరంబుదూర్ చేరింది. మే 20న ఒడిశాలో ప్రచారం చేసిన రాజీవ్ 21న ఉదయం ఒడిశాలోని భద్రక్, అంగుల్, పర్లాఖిమిడి, గుణపూర్, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో పర్యటించాడు. ధాను ధరించిన బెల్ట్బాంబుకు 2 స్విచ్‌లున్నాయి. ఒకటి సేఫ్టీ స్విచ్ కాగా మరొకటి బాంబ్‌ను పేల్చే స్విచ్. రాజీవ్‌కు పాదాభివందనం చేసే నెపంతో కిందికి వంగిన ధాను.. మొదట సేఫ్టీ స్విచ్ నొక్కి శివ రాజన్‌కు సైగ చేసింది. శివరాజన్ తప్పుకోగానే మరో మాట లేకుండా రెండో స్విచ్ నొక్కేసింది. అంతే 10.25 ప్రాంతంలో అక్కడ మారణహోమం జరిగిపోయింది. కన్నుమూసి కన్ను తెరిచేంతలో కనివినీ ఎరుగని దారుణ హత్య జరిగిపోయింది. హంతకముఠాకు లీడర్‌గా వ్యవహరించిన శివరాజన్ సూసైడ్ చేసుకున్నాడు. అతనికి సహకరించిన స్మగ్లర్ షణ్ముగం.. సిట్ విచారణ జరుగుతుండగానే విచిత్ర పరిస్థితుల్లో చనిపోయాడు. మిగత వాళ్లు పోలీసులకు దొరికిపోయారు. -
రాజీవ్ హత్య.. సినిమాను మించే ట్విస్ట్‌లు.. అసలు ఆనాడేం జరిగింది?
నరకం, అవును నిజంగా నరకమే. చేసిన పాపం వెంటాడుతుంటే.. కటకటాల వెనక దశాబ్దాల పాటు ఉంటుంటే.. రేపు అనేది ఏమవుతుందో తెలియకపోతే.. నిజంగా నరకమే. 1991లో అప్పటి సమీకరణాల దృష్ట్యా రాజీవ్‌ను మట్టుపెట్టిన ఎల్టీటీఈ గ్యాంగులో మెజార్టీ దోషులు సెనైడ్ మింగి ఆత్మహత్య చేసుకున్నారు. మిగిలిన కొందరు ఏళ్ల కొద్ది జైల్లో ఉన్నారు. వీరికి ఉరి శిక్ష తృటిలో తప్పినా.. యావజ్జీవం మాత్రం వెంటాడింది. మెజార్టీ తమిళులు మద్దతివ్వడంతో బయటకు వస్తామన్న ఆశలు పెరిగి చివరికి సుప్రీంకోర్టు తీర్పుతో స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే పరిస్థితి కలిగింది. అసలు నాడేమీ జరిగింది.? జైలు పక్షుల సమగ్ర కథనం ఇది.. ఒక నాయకుడు... ఒక నిర్ణయం... ఒక హత్య, తెర వెనక కొన్ని వందలమంది, అరెస్టయింది 26 మంది... శిక్ష పడింది ఏడుగురికి, ఉరి శిక్ష మాత్రం నలుగురికి. సినిమాను మించిన ఎన్నో ట్విస్టులను ఒక్కబిగిన చూపించే ఇలాంటి కేసు బహుశా భారతదేశ చరిత్రలో మరొకటి ఉండదేమో. 1991లో రాజీవ్ హత్య జరిగింది. ఆ కేసు చాలా మలుపులు తిరిగింది. ఎంతో మందిని ఈ కేసులో అరెస్ట్ చేసినా.. చివరికి దోషులుగా తేలింది 26మంది. అయితే వీరిలోనూ నేరుగా ప్రమేయమున్న వాళ్ల సంఖ్య వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు. దాదాపు ఐదేళ్ల పాటు సిట్ విచారణ జరిగింది. ఆ తర్వాత కోర్టులోనూ సుదీర్ఘంగా కేసు నడిచింది. 1999లో ఏడుగురికి మరణశిక్ష పడింది. ఇక తమ జీవితం ముగిసిందనుకున్నారు దోషులు. రాజీవ్‌ను చంపిన పాపానికి నేడో, రేపో ఉరి తీయడం ఖాయమనుకున్నారు. అయితే ఎక్కడో ఆశ మిగిలింది. సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లారు. కేసు మరికొంత కాలం సాగింది. ఈలోగా తమిళనాడులో సీను మారింది. రాజీవ్‌ను హత్య చేయడం సరే కానీ, అరెస్టయిన వాళ్లు అమాయకులు, కేవలం ఓ ఆపరేషన్‌లో భాగమయ్యారన్న ప్రచారం తమిళనాడంతా పాకింది. దీంతో దేశంలో ఎప్పుడూ లేనట్టుగా నేరస్థులపై సానుభూతి వెల్లువెత్తింది. 1999లో నలుగురికి మరణశిక్షను నిర్దారించింది సుప్రీం. అయితే తమిళనాడులో పరిస్థితి మాత్రం మారింది. దోషులకు అనుకూలంగా రాజకీయ పార్టీలు, ప్రముఖులు, ఒకరేంటీ తమిళనాట జనమంతా ఒక్కతాటిపైకి వచ్చారు. ఇటు కేంద్రంలో పరిస్థితి మారింది. కాంగ్రెస్ స్థానంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈలోగా కేంద్రంలో బలమైన ప్రభుత్వాలు లేకపోవడం, తమిళనాడులో ఉన్న డీఎంకే, అన్నాడీఎంకేల్లో ఏదో ఒక పార్టీ అటు ఢిల్లీలో చక్రం తిప్పే అవకాశం రావడంతో శిక్ష అమలులో జాప్యం జరిగింది. అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు లేకున్నా.. అనధికారికంగా నాన్చివేత ధోరణిని ప్రదర్శించారు ఢిల్లీ పెద్దలు. ఈ లోగా 2006లో మరో బాంబు పేల్చింది ఎల్టీటీఈ. 2006లో రాజీవ్ హత్య వెనక అసలు కారణాలను బహిరంగంగా ప్రపంచానికి వెల్లడించింది ఎల్టీటీఈ. తమ పట్ల శాంతి దళాలు అమానుషంగా ప్రవర్తించాయని, అసలు భారత దళాలను రాజీవ్ పంపడం వల్లే తాము కక్ష పెంచుకున్నామని తెలిపాడు ప్రభాకరన్. నిజానికి 1990లలో ప్రభాకరన్ ఢిల్లీకి వచ్చినట్టు చెబుతారు. అప్పట్లో కొందరు తమిళ నేతలు, ఎల్టీటీఈ లీడర్లతో కలిసి ఢిల్లీ వచ్చిన ప్రభాకరన్.. నేరుగా రాజీవ్‌ను కలిసినట్టు చెబుతారు. ఈ చర్చల్లో ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు తలెత్తకపోవడంతో ఎల్టీటీఈ నుంచి ఇక సమస్య ఉండదనుకున్నారు రాజీవ్. రాజీవ్ చేసిన ప్రతిపాదనను ఢిల్లీలో అంగీకరించిన ప్రభాకరన్.. జాఫ్నా వెళ్లిన తర్వాత మాత్రం అందుకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నట్టు తమిళ వర్గాల సమాచారం. ఈ విషయంలోనే రాజీవ్‌కు కాసింత ఆగ్రహం వచ్చిందట. దీన్నే ఆసరాగా తీసుకుని అప్పట్లో ఇంటలిజెన్స్ అధికారులు కొందరు శాంతి దళాలు పంపే విషయంలో రాజీవ్‌తో అంగీకారం తీసుకున్నట్టు ఢిల్లీ వర్గాల బోగట్టా. నిజానికి ఆ సమయంలో ప్రధాని ఎవరున్నా.. నిర్ణయంలో మార్పు ఉండకపోవచ్చన్నది సీనియర్ అధికారులు ఎవరయినా చెబుతారు. ఎవరూ ఊహించనివిధంగా పెరంబూదూర్లో హత్యకు స్కెచ్ వేసిన ఎల్టీటీఈ పకడ్బందీగా దాన్ని నిర్వహించింది. ఆ తర్వాత అంతే వేగంగా సిట్ అధికారులు హత్య కేసును చేధించారు. 2006లో ఈ విషయన్నాంతా వెల్లడించిన ఎల్టీటీఈ.. తప్పు చేశాడు కాబట్టే శిక్షించాం అన్న రీతిలో వ్యవహరించింది. ఎల్టీటీఈ ప్రకటనతో జైల్లో ఉన్న ఖైదీల విషయం మరోసారి తెరపైకి వచ్చింది. అప్పట్లో యూపీఏలో కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకే ఎప్పటికప్పుడు ఉరి విషయానికి బ్రేకులు వేస్తూ వచ్చింది. ఇదే సమయంలో కథ మరో మలుపు తిరిగింది. (రాజీవ్ హత్యకేసుకు సంబంధిత కథనాల కోసం కింద లింక్స్ క్లిక్ చేయండి) (Rajiv Gandhi Case: ఆ ఫొటోగ్రాఫర్ ఇంట్లో దొరికిన రసీదే.. హంతకులను తెరపైకి తెచ్చిందా?!) (రాజీవ్ గాంధీ హత్యకు ఇంత ప్లాన్ చేశారా.. గంధపు దండ వల్లే దారుణం!) (ఇందిర చేసిన తప్పే రాజీవ్‌ను బలి తీసుకుందా?) -
పోలీసు పుత్రిడి నుంచి ఉగ్రవాదిగా అజీజ్... 16 ఏళ్ల జైలు శిక్ష
సాక్షి హైదరాబాద్: పాక్ నిఘా సంస్థ లష్కరే తొయిబా (ఎల్ఈటీ) ఆదేశాల మేరకు హైదరాబాద్‌లో భారీ విధ్వంసాలకు కుట్రపన్నిన కేసులో నిందితుడిగా ఉన్న అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్ దోషిగా తేలాడు. ఇతడికి 16 ఏళ్ల జైలు శిక్ష, రూ.26 వేల జరిమానా విధిస్తూ నాంపల్లి కోర్టు తీర్పు ఇచ్చినట్లు శనివారం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏసీపీ పి.వెంకటేశ్వర్లు వివరించారు. ఈ కేసులో మరో నిందితుడు మహ్మద్ నిస్సార్‌కు న్యా యస్థానం 2011లోనే 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పెట్రోల్ పంపులో మేనేజర్‌గా.. భవానీనగర్‌కు చెందిన గిడ్డా అజీజ్ తండ్రి మెహతబ్ అలీ హెడ్ కానిస్టేబుల్‌గా పని చేశారు. అజీజ్ 1985 నుంచి 87 వరకు పాతబస్తీలోని మదీనా ప్రాంతంలోని ఓ పెట్రోల్ పంపులో మేనేజర్‌గా పని చేశాడు. నల్లగొండ జిల్లా బోనాల్‌పల్లికి చెందిన సిమి ఉగ్రవాది మహ్మద్ ఫసీయుద్దీన్ ద్వారా ఉగ్రవాద బాటపట్టాడు. ఎల్ఈటీకి అనుబంధంగా ఆజం ఘోరీ ఏర్పాటు చేసిన ఇండియన్ ముస్లిం మహమ్మదీ ముజాహిదీన్ సంస్థతో సన్నిహితంగా మెలిగాడు. హత్యలు, దోపిడీలతో పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన ఫసీ అతని అనుచరుడు మీర్ 1993 జూన్ 21న కార్ఖానా పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. 2000లో జగిత్యాలలో జరిగిన ఎన్కౌంటర్లో ఘోరీ చనిపోయాడు. దీంతో సౌదీ అరేబియాకు వెళ్లిపోయిన గిడ్డా అజీజ్ అక్కడే ఇంటర్నేషనల్ ఇస్లామిక్ రిలీఫ్ ఆర్గనైజేషన్ (ఐఐఆర్వో) అనే సంస్థలో చేరాడు. పూర్తి స్థాయి జిహాదీ వలంటీర్లతో కూడి న ఈ సంస్థలో అజీజ్ కీలకపాత్ర పోషించాడు. భారీ విధ్వంసానికి కుట్ర.. ‘బాబ్రీ’ ఉదంతం తర్వాత రెచ్చిపోయిన అజీజ్ అయోధ్యతో పాటు హైదరాబాద్‌లోనూ భారీ స్థాయిలో విధ్వంసానికి కుట్రపన్నాడు. అప్పట్లో బోస్నియా– చెచెన్యాల్లో జరుగుతున్న అంతర్యుద్ధాలకు ఆకర్షితుడైన అజీజ్ 1995లోనే ఆ దేశానికి వెళ్లి వచ్చాడు. ఆ యుద్ధాల్లో కీలక పాత్ర పోషించడంతో పాటు అనేక మంది యువతకు ఉగ్రవాద శిక్షణ కూడా ఇచ్చాడు. 1995 జూలై 17 బోస్నియా నుంచి అసలు పేరుతోనే పాస్‌పోర్ట్ పొందాడు. ఆపై భారత్‌కు వచ్చిన గిడ్డా అజీజ్ 1993 జనవరి 7న సికింద్రాబాద్ ఆర్పీఓ కార్యాలయం నుంచి తన పేరుతోనే మరో పాస్‌పోర్ట్ తీసుకున్నాడు. 2000 అక్టోబర్ 3న అబ్దుల్ కరీం పేరుతో ఇంకో నకిలీ పాస్‌పోర్ట్ పొందాడు. అజీజ్, నిస్సార్ సహా మరొకరిని నగర పోలీసులు 2001 ఆగస్టు 28న హుమాయున్‌నగర్ పరిధిలోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రి వద్ద అరెస్టు చేశారు. అజీజ్ నుంచి ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, బెల్జియంలో తయారైన పిస్టల్, క్యాట్రిడ్జిలు, బోస్నియా పాస్‌పోర్ట్, రెండు నకిలీ పాస్‌పోర్టులు, ఎలక్ట్రిక్ సర్క్యూట్ బోర్డులు, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెయిల్ పొందిన అజీజ్ సౌదీకి పారిపోయాడు. మూడేళ్లే అక్కడే ఉన్న అజీజ్ 2004లో నగరానికి వచ్చాడు. సికింద్రాబాద్‌లో ఉన్న గణేష్ దేవాలయం పేల్చివేతకు కుట్రపన్నాడు. సౌదీలో తలదాచుకుని.. వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పేలుళ్లకు పన్నిన ఈ కుట్రను ఛేదించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు మిగిలిన నిందితుల్ని అరెస్టు చేయగా... గిడ్డా అజీజ్ త్రుటిలో తప్పించుకున్నాడు. బోస్నియా పాస్‌పోర్ట్ వినియోగించి అడ్డదారిలో సౌదీ పారిపోయి అక్కడే తలదాచుకున్నాడు. అజీజ్‌ది నకిలీ పాస్‌పోర్ట్ అని గుర్తించిన సౌదీ అధికారులు 2007లో అరెస్టు చేశారు. ఈ విషయం తెలుసుకున్న నగర పోలీసులు రెండు కేసుల్లో వాంటెడ్‌గా ఉన్న అజీజ్‌పై 2008లో ఇంటర్‌పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయించారు. సౌదీలో నకిలీ పాస్‌పోర్ట్ కేసు విచారణ, శిక్ష పూర్తికావడంతో అక్కడి అధికారులు 2016లో భారత్‌కు బలవంతంగా తిప్పిపంపించారు. దీంతో అప్పటి నుంచి 2001 నాటి విధ్వంసాల కేసు విచారణ సాగి అజీజ్‌కు 16 ఏళ్ల శిక్ష పడింది. (చదవండి: ములుగులో ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు దుర్మరణం) -
తమిళనాడులో మళ్లీ పులుల కదలికలు
సాక్షి, చెన్నై: ప్రత్యేక రాష్ట్రం కోరుతూ శ్రీలంకలో పోరాటాలు సాగించిన విడుదలై పులులు (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్టీటీఈ) తమిళనాడులో మళ్లీ బలం పుంజుకునే ప్రయత్నాలు సాగిస్తున్నాయా? కొత్తగా సభ్యత్వాలు చేర్చుకోవడం ద్వారా ఎల్టీటీఈని పునరుద్ధరించేందుకు పావులు కదుపుతున్నాయా? అందరిలోనూ ఆందోళన కలిగించే ఈ ప్రశ్నలకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) నుంచి అవుననే సమాధానం వస్తోంది. ఎల్టీటీకి మద్దతుగా నిలిచే ముగ్గురు ముఖ్య రాజకీయనేతలపై ఎన్ఐఏ అధికారులు నిఘా పెట్టడం, నిధుల సమీకరణ అనుమానంపై ఐదుగురిపై కేసులు నమోదుచేయడం ఇందుకు తార్కాణంగా భావించవచ్చు. తమిళనాడులోని సానుభూతిపరుల సహకారంతో ఎల్టీటీఈ శ్రీలంకలో సుదీర్ఘకాలం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టింది. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ శ్రీలంకతో శాంతి ఒప్పందం చేసుకుంటారనే అనుమానంతో చెన్నై సమీపం శ్రీపెరంబుదూరులో మానవబాంబు ద్వారా ఆయనను హతమార్చింది. మరికొద్ది కాలానికి ఎల్టీటీఈ ఉద్యమసారధి ప్రభాకరన్‌ను 2009లో అక్కడి ప్రభుత్వం మట్టుబెట్టడంతో ఆందోళనలు చల్లారాయి. తమిళం పోరాటం ముగిసినట్లుగా శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. దీంతో తమిళనాడులో సైతం ఎల్టీటీఈ కనుమరుగైంది. అయితే ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు ఎల్టీటీఈ ఉద్యమం చాపకింది నీరులా మళ్లీ రాజుకుంటోందని ఎన్ఐఏలో అనుమానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా తమిళనాడు కేంద్రంగా ఎల్టీటీఈ కార్యకలాపాలు జరుగుతున్నాయని ఎన్ఐఏ భావిస్తోంది. చదవండి: (నటుడు విజయ్‌కి హైకోర్టులో ఊరట) ఇందుకు రాష్ట్రంలోని ముగ్గురు ప్రముఖ రాజకీయనేతలు దన్నుగా నిలుస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులకు పక్కా సమాచారం అందింది. అనధికారికంగా తమిళనాడులో తలదాచుకుంటున్న లక్ష్మణన్ మేరీ బిరాన్సింఘే అనే 50 సంవత్సరాల శ్రీలంక మహిళను గత ఏడాది అక్టోబరులో తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ యువతికి ఎల్టీటీఈతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు ప్రకటించారు. 2019లో శ్రీలంక పాస్‌పోర్టు ద్వారా పర్యాటక వీసాతో ఆమె ఇండియాకు చేరుకోగా 2020 డిసెంబరులో వీసా గడువు ముగిసింది. చెన్నై అన్నానగర్‌లో ఒక ఇంటిని లీజుకు తీసుకుని ఆ పత్రాల ద్వారా వంటగ్యాస్ పొందింది. గ్యాస్ బిల్లు ఆధారంగా ఇండియా పాస్‌పోర్టు సంపాదించింది. బెంగళూరు మీదుగా ముంబయికి ప్రయాణం అవుతుండగా చెన్నై విమానాశ్రయంలో గత ఏడాది ఆమెను అరెస్ట్ చేశారు. ఇండియా పాస్‌పోర్టు పొందేందుకు ఆమెకు సహకరించిన వారెవరని అధికారులు ఆరాతీస్తున్నారు. ఆమె సెల్‌ఫోన్ సంభాషణలను పరిశీలించారు. ఈ సమయంలో ఇండియాలోని లక్షదీవుల సమీపంలో ఎల్టీటీఈలో ఇంటెలిజెన్స్ అధికారిగా ఉండిన సద్గుణం అలియాస్ సెబాస్టియన్‌ను గత ఏడాది మార్చిలో అరెస్ట్ చేశారు. అతడి నుంచి ఏకే 47 రకం తుపాకీలు, తూటాలు, 300 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. ఎల్టీటీఈని పునరుద్ధరించేందుకు ధనార్జన కోసం హెరాయిన్ మాదకద్రవ్యాలను అక్రమరవాణా చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఇదిలాఉండగా కెన్నిసన్ పొర్మాండో, భాస్కరన్, జాన్సన్ సామువేల్, సెల్లముదన్ అనే శ్రీలంకకు చెందిన నలుగురు వ్యక్తులు ముంబయి హార్బర్లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఏటీఎం ద్వారా నగదు డ్రా చేసినట్లు ఎన్ఐఏ కనుగొంది. చెన్నైలో పట్టుబడిన మహిళతోపాటు ఈ నలుగురిపైనే ఎన్ఐఏ కేసులు నమోదు చేసింది. ఈ సంఘటనలతో అప్రమత్తమైన ఎన్ఐఏ అధికారులు తమిళనాడు డీజీపీ శైలేంద్రబాబుతో సమాలోచనలు జరపడం ప్రారంభించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి ఎన్ఐఏ అధికారులు మూడు పేజీల నివేదికను కూడా అందజేశారు. శ్రీలంకకు సరిహద్దు రాష్ట్రం కావడంతో ఎల్టీటీఈని పునరుద్ధరించేందుకు తమిళనాడులో ప్రయత్నాలు సాగుతున్నాయని ఆ నివేదికలో ఎన్ఐఏ స్పష్టం చేసింది. అంతేగాక కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి విచారణ జరిపి 15 రోజుల్లోగా బదులివ్వాలని తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఎన్ఐఏ కోరింది. ఎల్టీటీఈ పునరుద్ధరణకు సహకరిస్తున్న తమిళనాడుకు చెందిన ముగ్గురు రాజకీయనేతలపై కూడా గట్టి నిఘా పెట్టాలని సైతం సూచించింది. తమిళనాడు ప్రభుత్వం 15 రోజుల్లో సమర్పించే నివేదిక అనంతరం ఎన్ఐఏ అధికారులు రాష్ట్రంలో విచారణ చేపట్టవచ్చని అంచనా. -
Family Man 2: ఫ్యామిలీ మ్యాన్ 2 బ్యాన్?!
సాక్షి, చెన్నై: ఫ్యామిలీమ్యాన్ సిరీస్ విషయంలో అనుకున్నదే జరుగుతోంది. ఈ సిరీస్‌లో రెండో సీజన్‌ను అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కాకుండా బ్యాన్ చేయాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈలం తమిళ్స్‌ను అత్యంత అభ్యంతరకర రీతిలో చిత్రీకరించారని తమిళనాడు ప్రభుత్వం ఆ విజ్ఞప్తిలో పేర్కొంది. గతంలో బ్యాన్ చేసిన డిజిటల్ కంటెంట్‌ను ప్రస్తావిస్తూ.. ‘ది ఫ్యామిలీమ్యాన్ 2’ను బ్యాన్ చేయడంగానీ, అసలు రిలీజ్ కాకుండా తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఫ్యామిలీమ్యాన్ 2లో ‘అభ్యంతరకరం, అవసరం, అప్రస్తుతమైన కంటెంట్ ఉంద’ని తమిళనాడు ఐటీ శాఖ మంత్రి మనో తంగరాజ్ ఇదివరకే కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు తంగరాజ్ ఒక లేఖ రాశాడు. ఇది ఈలం తమిళ్స్ సెంటిమెంట్స్‌తో పాటు తమిళనాడు ప్రజల భావాలను కూడా దెబ్బతీస్తుందని లేఖలో తంగరాజ్ పేర్కొన్నారు. తమిళ నటిని సమంతను టెర్రరిస్టుగా చూపించడం.. తమిళుల ఆత్మగౌరవంపై జరిగే దాడేనని, దీనిని ఎవరూ భరించలేరని తంగరాజ్ అభివర్ణించాడు. ఇలాంటి చర్యలను, తప్పుడుదారి పట్టించే ప్రయత్నాలు ఎవరూ చేసినా భరించలేమని తంగరాజ్ తెలిపాడు. తమిళ సంప్రదాయాన్ని దెబ్బతీసేలా ఉందని, అలాంటి కంటెంట్‌ను అనుమతించకపోవడమే మంచిదని లేఖలో విజ్ఞప్తి చేశాడు. కాగా, ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తామని కేంద్ర సమాచార ప్రసార శాఖ నుంచి బదులు వచ్చింది. కాగా, తమిళ ప్రజల సెంటిమెంట్స్‌ను గుర్తించకుండా ఈ వెబ్ సిరీస్‌ను రిలీజ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎండీఎంకే జనరల్ సెక్రటరీ వైకో కూడా ప్రకాశ్ జవదేరకర్కు ఒక లేఖ రాశారు. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీలో సమంతతో పాటు మనోజ్ వాజ్‌పాయి, ప్రియమణి తదితరులు నటించారు. స్లీపర్ సెల్స్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఫ్యామిలీమ్యాన్ 2 ట్రైలర్‌తోనే కాంట్రవర్సీని నెత్తినేసుకుంది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలంకి ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు ఈ సీజన్లో చూపించడమే అసలు అభ్యంతరం. “ఫ్యామిలీ మ్యాన్-2 ఎగైనెస్ట్ తమిళ్” అనే హాష్ ట్యాగ్‌ను కూడా వైరల్ చేశారు. దీంతో రీఎడిట్ చేసిన ట్రైలర్‌ను అమెజాన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆ కాన్సెప్ట్‌తో ముడిపడిన సీన్లకు సెన్సార్ పడే ఛాన్స్ ఉంది. -
‘అప్పటి నుంచి ఏడవని రోజు లేదు’
చెన్నై: భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష ఎదుర్కొంటున్న వారిని విడుదల చేయవద్దని అప్పటి బాంబు పేలుడులో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు కోరారు. ఈ కేసులో పట్టుబడి 27 సంవత్సరాల నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బాధిత కుటుంబసభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పటి సంఘటనలో తల్లిని కోల్పోయిన అబ్బాస్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా తల్లి శవం ముక్కలు ముక్కలుగా నాకు అప్పగించారు. అప్పటి నుంచి ప్రతి రోజూ మా అమ్మను తలచుకుని ఏడవని రోజు లేదు. నా బాధను ఊహించుకోండి. మా అమ్మ చనిపోవడానికి కొద్ది రోజుల ముందే మా నాన్న కూడా చనిపోయాడు. ఇద్దరూ చనిపోవడంతో నేను అనాథ అయ్యాను. దీంతో చదువును పదో తరగతి మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. మా జీవితాలు నాశనం అయ్యాయి. మమ్మల్ని ఆదుకునేందుకు, ఓదార్చడానికి ఎవరూ రాలేదు. బాంబు పేలుడు ఘటనలో చనిపోయన కుటుంబాలతో ఒకరోజు నిందితులను ఉండనీయండి..ఆ తర్వాత వారి క్షమాభిక్ష గురించి ఆలోచిద్దా’మని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అబ్బాస్ వాచ్ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మరో బాధితురాలు శాంతా కుమారి అప్పటి భయంకరమైన ఘటనను గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనలో శాంతాకుమారి సోదరి సరోజాదేవి చనిపోయింది. శాంతాకుమారి కూడా బాంబు దాడిలో గాయపడింది. ఆ గాయాల నుంచి కోలుకోవడానికి శాంతా కుమారికి 10 సంవత్సరాలు పట్టింది. చెన్నైకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూర్ వద్ద రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యారు. రాజీవ్ గాంధీ హత్యకు గురైన చోటే ఆయన స్మారక స్థూపం నిర్మించారు. ఆ ఘటనలో చనిపోయిన వారందరి కుటుంబ సభ్యులను 27 సంవత్సరాల తర్వాత రామలింగ జ్యోతి అనే కవి ఒక దగ్గరికి చేర్చారు. నిందితులందరూ ఇప్పటికే 27 సంవత్సరాల జైలు జీవితం గడిపారని, వారికి రెండో అవకాశం ఇవ్వాలని మానవహక్కుల సంఘాలు కోరుతున్నాయి. రాజీవ్ గాంధీ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న నళిని శ్రీహరన్ జైలులోనే మాస్టర్స్ డిగ్రీ చేసింది. పేరారివాలన్ రచయితగా మారాడు. మురుగన్, శాంతమ్లు ఇద్దరూ జైలులోని దేవాలయంలో పూజారులుగా మారారు. మానవ హక్కుల సంఘం హ్యూమన్ రైట్ గ్రూప్ పీపుల్స్ వాచ్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రీ టిఫాజెన్ మాట్లాడుతూ..జైలు జీవితం అనేది ఒక శిక్ష మాత్రమే కాదని, అది పునరావాసం లాంటిదని అన్నారు. నిందితులు ఇప్పటికే సగం జీవితం జైలులో గడిపారని, జైలు జీవితం అనంతరం వారికి మంచి పౌరులుగా బ్రతికే అవకాశం కల్పించాలని వ్యాఖ్యానించారు. మన రాజకీయాల కోసం వాళ్ల విడుదలను అడ్డుకోవద్దని కోరారు. 1991, మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్‌లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన సమయంలో ఎల్టీటీఈ జరిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాంధీ చనిపోయారు. ఆయనతో పాటు మరో 14 మంది కూడా మృతిచెందారు. ఆ కేసులో నిందితులు అప్పటి నుంచి శిక్ష అనుభవిస్తున్నారు. -
తమిళనాడు: రామేశ్వరం జిల్లాలో కలకలం
-
తవ్వకాల్లో భారీగా బాంబులు, బుల్లెట్లు
సాక్షి, చెన్నై: భారీ ఆయుధాల డంప్ బయటపడటంతో తమిళనాడులో ఒక్కసారిగా కలకలం రేగింది. రామాంతపురం జిల్లా రామేశ్వరం సముద్ర తీరంలో ఓ నిర్మాణం కోసం తవ్వకాలు చేపట్టగా.. భారీ ఎత్తున్న ఆయుధాలు బయటపడ్డాయి. ఏకే-47 తుపాకులు, బుల్లెట్లు, బాంబులు, మందు గుండు సామాగ్రిని భారీ ఎత్తున్న పెట్టెల్లో లభించాయి. ఈ ఆయుధ బాంఢాగారం నిషేధిత ఉగ్రవాద సంస్థ లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ)కు చెందినదిగా అధికారులు భావిస్తున్నారు. తీరంలోని ఓ మత్స్యకారుడి ఇంటి వద్ద ఉన్న కొబ్బరి తోటలో చెత్తను పూడ్చేందుకు ఓ గొయ్యిని తవ్వారు. అయితే ఐదడుగులు తవ్వేసరికి పెట్టెలు బయటపడ్డాయి. అనుమానంతో తెరిచి చూడగా ఆయుధాలు కంటపడ్డాయి. దీంతో కంగారుపడ్డ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రాత్రంత శ్రమించిన పోలీసులు వాటిని వెలికి తీశారు. సుమారు 5000 వేల బుల్లెట్లతోపాటు వందల కేజీల మందు గుండు సామాగ్రి బయటపడింది. ఇవన్నీ తుప్పు పట్టిన స్థితిలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. 1983-90 మధ్య కాలంలో ఎల్టీటీఈ.. ఉగ్ర శిక్షణా కేంద్రంగా ఈ ప్రాంతాన్ని వాడుకుని ఉంటుందని జిల్లా ఎస్పీ ఓంప్రకాశ్ మీనా అభిప్రాయపడుతున్నారు. -
మా వాళ్లను వదిలేయండి!
కొలంబో : అంతర్యుద్ధం ముగిశాక అరెస్ట చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ.. జాఫ్నాలోని తమిళలు శుక్రవారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎల్టీటీఈ, శ్రీలంక మధ్య దశాబ్దాలుగా సాగిన అంతర్యుద్ధం 2009లో ముగిసింది. ఈ సమయంలో కొందరు ఎల్టీటీఈ నేతలను ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చట్టం కింద అదుపులోకి తీసుకుంది. తాజాగా నిందితులపై ఉన్న ఉగ్రవాద నిరోధక చట్టాన్ని తొలంగించి.. వారందరినీ బేషరుతుగా విడుదల చేయాలని జాఫ్నాలోని తమిళులు.. గవర్నర్ కార్యాలయం ముందు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీలంకలోని తమిళ్ నేషనల్ అలయన్స్ నేత సంపనాథన్.. అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనను కలిసి వినతి పత్రం సమర్పించారు. -
సెప్టెంబర్ 8న 'ఒక్కడు మిగిలాడు'
వైవిధ్యమైన కథలను ఎంచుకోంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్న కథానాయకుడు మంచు మనోజ్. తాజాగా ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ పాత్ర పోషించనున్నాడు. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొన్న ఈ సినిమా సెప్టెంబర్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్ లు మాట్లాడుతూ.. "గతంలో ఎన్నడూ భారతదేశ చలనచిత్ర చరిత్రలో చూడని సరికొత్త కథాంశాన్ని 'ఒక్కడు మిగిలాడు' చిత్రంతో ప్రేక్షకులు చూడనున్నారు. మంచు మనోజ్ యాంగ్రీ యంగ్ మేన్ గా ఆశ్చర్యపరుస్తాడు. ఈ చిత్రం ట్రైలర్, పాటలు త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 1990ల కాలం నాటి శ్రీలంక యుద్ధం నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుందన్న నమ్మకం ఉంది. ఇటీవల విడుదల చేసిన మంచు మనోజ్ ఫస్ట్ లుక్ కి విశేషమైన స్పందన వచ్చింది. హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేసిన ఈ చిత్రం సాంకేతికత పరంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ఖాయం. సినిమా నేపధ్య సంగీతాన్ని ప్రాగ్ లో రికార్డ్ చేయనున్నాం.' అన్నారు. మంచు మనోజ్ తో పాటు ఈసినిమాలో అనీషా ఆంబ్రోస్, మిలింద్ గునాజీ, పోసాని, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నిఫర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. -
క్రిమినల్‌గా ట్రీట్ చేయలేదు కానీ...
చెన్నై : మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లోని విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదుర్కొన్న తమిళ నేత, ఎండీఎంకే అధినేత వైగో శనివారం వేకువ జామున చెన్నై చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనను ఓ క్రిమినల్‌గా ట్రీట్ చేయకపోయినప్పటికీ... సాధారణ మర్యాదలు ఏమీ లేవని, ఇతర దేశాల్లా వ్యవహరించలేదని అన్నారు. తనను భద్రతా ముప్పుగా భావించడం వల్లే మలేషియా ఈ చర్యకు పాల్పడి ఉంటుందని వైగో అన్నారు. కాగా వైగోను శుక్రవారం కౌలాలంపూర్‌లోని విమానాశ్రయంలోనే అధికారులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఎల్టీటీఈతో సంబంధాలపై అక్కడే చాలాసేపు ప్రశ్నించిన అధికారులు.. ఆయన్ను దేశంలోకి అనుమతించేది లేదని తేల్చిచెప్పారు. ‘మలేసియాకు ప్రమాదకారుల’ జాబితాలో వైగో పేరు ఉండడమే అందుకు కారణమన్నారు. ఎల్‌టీటీఈలకు మద్దతుదారుగా ఉన్న వైగో మీద శ్రీలంకలో అనేక కేసులు ఉన్నాయని, తమిళనాడులో రెండుసార్లు జైలుకు వెళ్లొచ్చినట్టుగా అక్కడి అధికారులు పేర్కొనడంతో ఆయనకు చేదు అనుభవం తప్పలేదు. రోజంతా ఒంటరిగా ఉంచడమే కాకుండా, శుక్రవారం రాత్రి వైగోను మలేసియా ఎయిర్‌లైన్స్ విమానంలో తిరిగి చెన్నైకి పంపించారు. కాగా మలేసియాలోని పెనాంగ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పి.రామస్వామి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరవడానికి వైగో మలేసియా వెళ్లారు. కౌలాలంపూర్‌లో దిగగానే ఆయనను విమానాశ్రయానికే అధికారులు పరిమితం చేశారు. ఇమ్మిగ్రేషన్ వర్గాల పరిశీలనలో వైగో పాస్‌పోర్టు, వీసా పరిశీలన అనంతరం సీజ్ చేశారు. వైగోను అనుమతించకుండా ఇమ్మిగ్రేషన్ వర్గాలు అడ్డుకున్న సమాచారంతో పినాంగ్ సీఎం లింకు యాంగ్ మంగ్, డిప్యూటీ సీఎం రామస్వామి ఇమిగ్రేషన్, దౌత్య కార్యాలయ వర్గాలకు సమాచారం ఇచ్చారు. అయితే, ఏ ఒక్క అధికారి స్పందించలేదు. మలేషియా ఉప ప్రధాని ఆదేశాలు తమకు ఉన్నాయని, వైగోను వెనక్కు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సూచించడంతో రామస్వామి వెనక్కు తగ్గాల్సి వచ్చింది. రోజంతా వైగోను ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో ఓ గదిలో ఉంచారు. ఆయన్ను బయటకు ఎక్కడ పంపించలేదు. ఆయన కార్యదర్శి అరుణగిరికి మాత్రం అనుమతించారు. వైగో అక్కడే ఉండడంతో ఆయన కూడా బయటకు వెళ్లడానికి నిరాకరించారు. ఎవ్వరితోనూ మాట్లాడకుండా వైగో మౌనం అనుసరించడంతో రామస్వామి అతికష్టం మీద ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. ఏమైనా వేధింపులకు గురి చేశారా అని ఆయన ప్రశ్నించగా, అందుకు వైగో, ఒంటరిగా ఉన్నానంటూ ఫోన్ కట్ చేయడం గమనార్హం. -
ఎండీఎంకే చీఫ్ వైగోకు చేదు అనుభవం
కౌలాలంపూర్: ఎండీఎంకే చీఫ్ వైగోకు మలేషియాలో చేదు అనుభవం ఎదురైంది. ఎల్టీటీఈతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో ఆయనను శుక్రవారం కౌలాలంపూర్ విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. కొన్ని గంటల పాటు వైగోను అధికారులు ప్రశ్నించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా 2001లో ఎల్‌టీటీఈలకు మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వేలూరు కేంద్ర కారాగారంలో 19 నెలల పాటుగా జైలు జీవితాన్ని అనుభవించారు. 2009లో శ్రీలంకలో యుద్ధం సాగుతున్న సమయంలో వైగో స్పందించిన తీరు, మాటల తూటాలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. ఆయన మీద దేశద్రోహం కేసు కూడా నమోదు అయింది. తొమ్మిది సంవత్సరాలుగా ఈ కేసు విచారణను వైగో ఎదుర్కొంటూ వస్తున్నారు. ఎగ్మూర్ మేజిస్ట్రేట్ కోర్టులో సాగుతున్న విచారణకు స్వయంగా హాజరై వాదనల్ని వినిపిస్తూ వస్తున్నారు. -
ఎల్టీటీఈ ప్రభాకరన్ బతికే ఉన్నాడా?
కొలంబో: ది లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(ఎల్టీటీఈ) అధినేత వేలుపిళ్లై ప్రభాకరన్ బతికేఉన్నాడా?. శ్రీలంక తమిళ్ నేషనల్ అలయన్స్ నాయకుడు ఎమ్ శివలింగం తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ అంశాన్ని పరికించి చూపిస్తున్నాయి. ఆచూకీ కనిపించకుండా పోయిన వారి కోసం శ్రీలంక ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఆఫీస్ ఆఫ్ మిస్సింగ్ పర్సన్స్(ఓఎమ్ పీ)కు ప్రభాకరన్ పేరును సూచించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రభాకరన్ సోదరుడు లేదా సోదరి కానీ ఓఎమ్ పీలో పేరును నమోదు చేయాలనుకుంటే తాను వారికి అండగా నిలుస్తానని అన్నారు. మే 19, 2009న ప్రభాకరన్(54)ను హతమార్చినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం ప్రకటించిన ఈ విషయాలను శ్రీలంకలోని తమిళులు కొట్టిపారేశారు. యుద్ధప్రాంతం నుంచి ప్రభాకరన్ తప్పించుకున్నారని కొంతమంది వాదించారు కూడా. యూఎన్ మానవహక్కుల పాలక సంస్థ నిబంధనలకు అనుగుణంగా ఓఎమ్ పీని స్థాపించనున్న శ్రీలంక ప్రభుత్వంపై అక్కడి ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఓఎమ్ పీ స్థాపన ఎల్టీటీఈతో పోరాడిన సైనికులను మోసం చేయడమేనని అవి అంటున్నాయి. 2009లో ఎల్టీటీఈతో పోరు ముగిసిన తర్వాతి నుంచి ఇప్పటివరకు దాదాపు 16వేల మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. -
స్విస్ తమిళుల నుంచి ఎల్టీటీఈ వసూళ్లు
బెర్న్: స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్న ప్రవాస తమిళుల నుంచి భారీగా విరాళాలు వసూలు చేస్తున్న ఎల్టీటీఈ వర్గాలు వాటిని కొరియర్ల ద్వారా సింగపూర్, దుబాయ్‌లాంటి దేశాలకు తరలిస్తూ ఆయుధాలను కొనుగోలు చేస్తోంది. శ్రీలంకలో 2009లో ఎల్టీటీఈ ఓటమితో నిలిచిపోయిన ఈ ప్రక్రియ మళ్లీ ప్రారంభమైనట్లు స్విడ్జర్లాండ్ అటార్ని జనరల్ కార్యాలయం అభిప్రాయపడింది. స్విడ్జర్లాండ్లోని కొంతమంది తమిళులు ఆధునిక మైక్రో క్రెడిట్ వ్యవస్థ ద్వారా ఎల్టీటీఈకి నిధులు చేరవేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. అలా నిధులు బదిలీ చేసిన 13 మంది తమిళులపైనా స్విడ్జర్లాండ్ అటార్ని జనరల్ కార్యాలయం కేసులు దాఖలు చేసింది. కేసులు దాఖలు చేసినప్పటికీ ఆ 13 మందిని అరెస్టు చేయలేదని, వారు ఎప్పుడంటే అప్పుడు విచారణకు అందుబాటులో ఉండేందుకు అంగీకరించడం వల్ల వారిని అరెస్ట్ చేయలేదని అటార్ని జనరల్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. వీరి నుంచి దాదాపు కోటిన్నర డాలర్లు ఎల్టీటీఈ చేతుల్లోకి తరలిపోయాయని ఆ వర్గాలు చెప్పాయి. విరాళాలు ఇచ్చే తమిళుల నుంచి నిధులు నేరుగా ‘వరల్డ్ తమిళ్ కోఆర్డినేటింగ్ కమిటీ’కి వెళుతున్నాయని, అక్కడి నుంచి ఎల్టీటీఈ చేతుల్లోకి వెళుతున్నాయని ఆ వర్గాలు వివరించాయి. విరాళాలు ఇస్తున్న వారికి, తీసుకుంటున్న వారికి మధ్యన ఎలాంటి వ్యక్తిగత సంబంధాలు లేకపోవడం వల్ల నిధుల తరలింపు వ్యవహారం బయటకు వచ్చిందని ఆ వర్గాలు చెబుతున్నాయి. 2006కు సంవత్సరానికి ముందు స్విడ్జర్లాండ్ తమిళుల నుంచి భారీగా విరాళాలు ఎల్టీటీఈకి తరలిపోయేవని, ఎల్టీటీఈని టైస్టు సంస్థగా బ్రిటన్ ప్రకటించినప్పటి నుంచి విరాళాలు గణనీయంగా తగ్గిపోయాయని చెప్పాయి. 2009 నుంచి దాదాపు పూర్తిగా తగ్గిపోయాయని తెలిపాయి. ఎల్టీటీఈ ప్రవాస తమిళుల నుంచి ఆ వర్గాలు బలవంతంగా కూడా విరాళాలు వసూలు చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, విరాళాలు ఇవ్వకపోతే బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారని అటార్ని వర్గాలు పేర్కొన్నాయి. -
ఎల్టీటీఈ కలకలం
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఎల్టీటీఈ వ్యవస్థాపకులు వేలుపిళ్లై ప్రభాకరన్ నేతృత్వంలో శ్రీలంకలో ప్రత్యేక తమిళ ఈలం కోసం శ్రీలంక ప్రభుత్వంతో పోరు సాగిన సంగతి పాఠకులకు విదితమే. ప్రభాకరన్‌ను మట్టుపెట్టడం ద్వారా శ్రీలంక ప్రభుత్వం 2009లో ఈ పోరుకు ముగింపునకు పలికింది. శ్రీలంక సైన్యం దాడులకు వేలాది మంది ప్రాణాలు కోల్పోగా, లక్షలాది మంది పొరుగు దేశాలకు పారిపోయారు. ఎక్కువశాతం శ్రీలంక తమిళులు తమిళనాడుకు చేరుకుని నేటికీ శరణార్థుల శిబిరంలో తలదాచుకుంటున్నారు. పట్టుబడిన ప్రభాకర్ కార్యదర్శి:ఎల్టీటీఈ ప్రభాకరన్ ప్రాణాలు కోల్పోయాడు. క్యాడర్ అంతా చెల్లాచెదురైంది. ఇక ఎల్టీటీఈ చరిత్ర ముగిసినట్టేనని అందరూ భావిస్తున్న తరుణంలో ముగ్గురు ఎల్టీటీఈ నేతలు పట్టుబడి కలకలం రే పారు. రామనాథపురం సముద్రం నుంచి ముగ్గురు వ్యక్తులు రహస్యంగా శ్రీలంకకు వెళుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు సోమవారం రాత్రి మదురై-రామనాథపురం జాతీయ రోడ్డులో పలు బృందాలుగా ఏర్పడి వాహనాల తనిఖీ చేపట్టారు. రామనాథపురం ఉచ్చిపులి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక రోడ్డులో కారును పక్కన నిలిపి నిలుచుని ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అనుమానించి సమీపించారు. పోలీసుల తమకోసమే వస్తున్నట్లు గ్రహించిన ముగ్గురు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు చాకచక్యంగా వారిని చుట్టుముట్టి అదుపులోకి తీసుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్నారు. కారును శశికుమార్ (30) అనే వ్యక్తి నడుపగా కృష్ణకుమార్ (39), రాజేంద్రన్ (44) వెనుక సీట్లో ప్రయాణం చేశారు. కారుతోపాటు వ్యక్తులను తనిఖీ చేయగా, కృష్ణకుమార్ చేతి సంచిలో 75 సైనైడ్ గుళికలు, 300 గ్రాముల సైనైడ్, 4 జీపీఎస్ పరికరాలు, 8 సెల్ఫోన్లు అందులో ఉన్నాయి. అలాగే *42,200 భారత కరెన్సీ, 19,300 శ్రీలంక కరెన్సీని కనుగొన్నారు. భారీ ఎత్తున సైనైడ్ లభ్యం కావడంతో బిత్తరపోయిన పోలీసులు వెంటనే ఉన్నతాధికారులకు, క్యూబ్రాంచ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఉన్నతాధికారులు కృష్ణకుమార్‌ను రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి విచారణ చేపట్టారు. ఈ విచారణలో కృష్ణకుమార్ ఎల్టీటీఈ ప్రభాకరన్‌కు బంధువు, ముఖ్యకార్యదర్శిగా వ్యవహరించినట్లు తెలుసుకుని ఖంగుతిన్నారు. శ్రీలంక యాళపాళంకు చెందిన కృష్ణకుమార్ 1990లో ఎల్టీటీఈలో క్రియాశీలకంగా పనిచేశాడు. తుది యద్ధం సమయంలో శ్రీలంక నుంచి పారిపోయి 2008లో తమిళనాడుకు చేరుకున్నాడు. అయితే శ్రీలంక తమిళులంతా తలదాచుకున్న శరణార్థుల శిబిరంలో కాక తిరుచ్చిరాపల్లి కేకే నగర్లో వేరుగా అద్దె ఇంటిలో కాపురం దిగాడు. ఇరుగూ పొరుగుకు తాను డ్రైవర్‌నని పరిచయం చేసుకున్నాడు. కొన్నాళ్లు డ్రైవర్ వృత్తిని నిర్వహించాడు. కృష్ణకుమార్ భార్య, ఇద్దరు పిల్లలు తిరుచ్చిలోనే ఉన్నారు. శ్రీలంకకు చెందిన రాజేంద్రన్ తరచూ సముద్ర మార్గంలో గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతుంటాడు. రామనాథపురం నుంచి సముద్ర మార్గంలో శ్రీలంకకు పారిపోయేందుకు పథకం పన్నిన కృష్ణకుమార్, తనకు సహాయకులుగా రాజేంద్రన్, శశికుమార్‌లను సిద్ధం చేసుకున్నాడు. శ్రీలంక ప్రయాణం కోసం ముగ్గురూ కలిసి సోమవారం రాత్రి తిరుచ్చిరాపల్లి నుంచి కారులో బయలుదేరి మదురై దాటుకుని రామనాథపురంలోకి ప్రవేశిస్తుండగా పోలీసుల తనిఖీలో పట్టుపడ్డారు. ఇంత పెద్ద ఎత్తున సెనైడ్‌ను శ్రీలంకకు తరలించడం వెనుక పెద్ద కుట్రదాగి ఉందని పోలీసులు భావిస్తున్నారు. శ్రీలంకలోని తమ సానుభూతి పరులను సమీకరించి మళ్లీ ఆత్మాహుతి దళాలను సిద్ధం చేయడం ద్వారా ఎల్టీటీఈని బలోపేతం చేయనున్నట్లు పోలీసులు నిర్థారణకు వచ్చారు. శశికుమార్, రాజేంద్రన్‌లను అరెస్ట్ చేసిన పోలీసులు, కృష్ణకుమార్‌ను మాత్రం రహస్య ప్రదేశంలో ఉంచి విచారణను కొనసాగిస్తున్నారు. బాలికపై మేనమామ అత్యాచారం హొసూరు : వికలాంగులారైన మేనకోడలిని బెదిరించి ఆరు నెలలుగా అత్యాచారం సాగిస్తున్న కిరాతకుడి వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల మేరకు.. డెంకణీకోట తాలూకా అంచెట్టి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన వికలాంగురాలి(17)ని ఆమె మేనమామ ఆరునెలలుగా బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు. ఈ నేపథ్యంలో ఆమె గర్భవతి అయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను డెంకణీకోట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారు. అక్కడ విషయం స్పష్టంగా తెలియడంతో బాధితురాలు తనపై జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించి బోరుమంది. ఘటనకు సంబంధించి బాధిత కుటుంబసభ్యులు డెంకణీకోట మహిళా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
ఆ తప్పునకు బాధ్యులెవరు?
సాక్షి, చెన్నై : ఎల్‌టీటీఈలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో నివేదిక దాఖలు చేసి, తప్పు చేసిన వ్యవహారానికి బాధ్యత వహించేదెవ్వరు అని డీఎంకే అధినేత ఎం కరుణానిధి అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎంకు తెలియకుండానే కోర్టుకు నివేదిక చేరి ఉండడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ముల్లై పెరియార్ డ్యాంకు ఎల్‌టీటీఈల రూపంలో ముప్పు ఉందంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలై ఉండడం ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై రాష్ట్రంలో రాద్దాంతం బయలు దేరింది.ప్రతి పక్షాలు,తమిళాభిమాన సంఘాలు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండి పడుతున్నాయి. అయితే, తప్పును కప్పి పుచ్చుకునే రీతిలో ఆ నివేదికతో తమకు సంబంధం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్రం జత పరిచిన నివేదికలో ఎల్‌టీటీఈల ప్రస్తావన వచ్చి ఉన్నదని, దీనికి వ్యతిరేకంగా మరో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు ప్రకటించారు. దీనిపై స్పందించిన ఆర్థిక, ప్రజా పనుల శాఖ మంత్రి ఓ పన్నీరు సెల్వం, రాద్దాంతం చేస్తున్న వాళ్లపై విమర్శలు గుప్పిస్తూ, తప్పును కప్పి పుచ్చుకునే యత్నం చేయడాన్ని డిఎంకే అధినేత ఎం కరుణానిధి తీవ్రంగా పరిగణించారు. బాధ్యులెవ్వరు : మంగళవారం కరుణానిధి ఓ ప్రకటన విడుదల చేశారు. తప్పు తాము చేయలేదంటూ దాటవేత దోరణి అనుసరిస్తుండడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమిళనాడు దాఖలు చేసిన పిటిషన్లో కేంద్రం తన నివేదికను జత పరిచిన విషయం ఎలా తెలియకుండా ఉంటుందని ప్రశ్నించారు. సీఎంకు తెలియకుండానే నివేదిక కోర్టుకు ఎలా చేరి ఉంటుందని ప్రశ్నించారు. అయితే, సీఎంకు తెలియకుండా ఆ నివేదికకు ఆమోదం తెలపడంలో తమరి పాత్ర ఉందా..? అని ప్రశ్నించారు. ఎందు కంటే, ప్రజా పనుల శాఖ మంత్రిగా తమరు ఉండటం వల్లే, తమరికి కూడా తెలియకుండా ఆ నివేదిక ఎలా జత పరిచి ఉంటారోనని మండి పడ్డారు. చేసిన తప్పును కప్పి పుచ్చుకునే యత్నం చేయడంతో పాటుగా , ఎల్టీటీలకు వ్యతిరేకంగా జరిగిన తప్పును తాము ఎత్తి చూపితే , అది విమర్శ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత తాను, తదనంతరం రాందాసు, వైగో, ఇలా అన్ని పార్టీల నాయకులు ప్రశ్నించే వరకు , ఎల్‌టీటీఈల గురించి ఆ నివేదికలో ఏమున్నదో తెలియక పోవడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. ఎల్‌టీటీఈలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో నివేదిక ఉన్నట్టుగా వచ్చిన సమాచారంతో సీఎం జయలలిత తనను, అధికారుల్ని ప్రశ్నించి సమాచారం రాబట్టారని ఓ పన్నీరు సెల్వం పేర్కొనడం గమనించాల్సి విషయంగా పేర్కొన్నారు. అలాంటప్పుడు ప్రతి పక్షాలు గళం విప్పే వరకు , జరిగిన తప్పు తమరెందుకు స్పందించ లేదని ప్రశ్నించారు. తప్పు జరిగిన విషయానికి వివరణ ఇవ్వడానికి ఇంత సమయం పట్టిందా..? అని ప్రశ్నించారు. వివరణ ఇచ్చారు సరే, జరిగిన తప్పుకు బాధ్యులెవరు అన్నది స్పష్టం చేయండి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
'ఎల్టీటీఈ నుంచి ఎటువంటి ముప్పు లేదు'
చెన్నై:తమిళనాడు రాష్ట్రంలోని ముల్లా పెరియార్ డ్యామ్ కు ఎల్టీటీఈ నుంచి ముప్పు పొంచి ఉందన్న ఇంటెలిజెన్సీ హెచ్చరికలను అక్కడి ప్రభుత్వం తోసిపుచ్చింది. ఆ డ్యామ్ కు ఎల్టీటీఈ కూల్చివేస్తుందన్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నారు. ముల్లా పెరియార్ డ్యామ్ కు ఎల్టీటీఈ ముప్పు ఉన్న కారణం చేతనే ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఆఫడవిట్ ను దాఖలు చేసిందన్నప్రతిపక్షాల ఆరోపణల్ని ఆర్థికశాఖ మంత్రి పన్నీరు సెల్వం ఖండించారు. ఆ ఆరోపణలు నిజం కాదన్నారు. కాగా, ముల్లా పెరియార్ డ్యామ్ కేసు అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో అడిషనల్ అఫడివిట్ దాఖలు చేయనున్నట్లు మాత్రం పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు కట్టడాలకు లష్కర్ ఏ తోయిబా, మావోయిస్టుల నుంచి మాత్రమే ముప్పు ఉందని కేంద్ర ఇంటెలిజెన్సీ వర్గాలు పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. -
జాఫ్నాను సందర్శించనున్న మోదీ
కొలంబో: వచ్చేవారం శ్రీలంకలో పర్యటించనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ ఎల్టీటీఈకి ఒకప్పటి కంచుకోట, తమిళుల ప్రాబల్య ప్రాంతం అయిన జాఫ్నాను సందర్శించనున్నారు. జాఫ్నాను సందర్శించిన అనంతరం శ్రీలంక పార్లమెంటులో మోదీ ప్రసంగించనున్నారు. ఈ పర్యటనతో జాఫ్నాను సందర్శించనున్న తొలి భారత ప్రధానిగా మోదీ నిలవనున్నారు. బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ తర్వాత జాఫ్నాను సందర్శించనున్న రెండో దేశాధినేత కూడా మోదీయే కానున్నారు. అదేవిధంగా శ్రీలంక పార్లమెంటులో ప్రసంగించనున్న నాలుగో భారత ప్రధానిగా మోదీ నిలవనున్నారు. మార్చి 13న కొలంబోకు చేరుకోనున్న మోదీ బౌద్ధుల పవిత్రనగరం అనురాధాపురను కూడా సందర్శించనున్నారు. -
ఎల్టీటీఈ కీలక మహిళా నేత అరెస్టు
కొలంబో: నిషేధిత సంస్థ ఎల్టీటీఈకి చెందిన కీలక మహిళా నేతను కొలంబో ఎయిర్‌పోర్టులో శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. ఎల్టీటీఈ సీ టైగర్స్ మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలైన బురుగేసు పహిరది పారిస్ వెళ్లేందుకు యత్నించగా టైస్ట్ ఇన్వెస్టిగేషన్స్ డివిజన్(టీడీ) పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. 2005లో ఫ్రాన్స్ వెళ్లిన ఆమె గత ఫిబ్రవరి 9న లంకకు వచ్చారు. -
కుష్భు వ్యాఖ్యలపై రచ్చ
సాక్షి, చెన్నై: కుష్భు ఇటీవల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ నాయకురాలిగా రాష్ట్రంలో సుడిగాలి పర్యటనల్లో కుష్భు బిజీబిజీగా ఉన్నారు. తమ ప్రాంతానికి అంటే తమ ప్రాంతానికి రావాలంటూ కుష్భును ఆహ్వానించే పనిలో కాంగ్రెస్ శ్రేణులు పడ్డారు. ఈ పర్యటనల్లో కుష్భు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై తీవ్రంగానే స్పందిస్తున్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు. ఎల్‌టీటీఈలకు వ్యతిరేకంగా ఆమె వ్యాఖ్యలు చేశారు. ఎల్టీటీఈల్ని తీవ్రవాదులతో పోల్చుతూ ఆమె ఓ సభలో వ్యాఖ్యలు చేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. దీంతో కుష్భు వ్యాఖ్యలు రచ్చకెక్కాయి. ఆమె వ్యాఖ్యల్ని తమిళ సంఘాలు తీవ్రంగా పరిగణించాయి. ఆ వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలన్న డిమాండ్‌తో తమిళర్ మున్నేట్ర పడై పేరిట కొన్ని తమిళ సంఘాలు ఏకం అయ్యాయి. ఆమె ఇంటి ముట్టడికి పిలుపునిచ్చాయి. వివాదం: పట్టినం బాక్కం శాంతోమ్ రోడ్డులో కుష్భు నివాసం వద్ద తమిళ సంఘాలతో ఢీ కొట్టేందుకు కాంగ్రెస్ నాయకులు సిద్ధం అయ్యారు. రాయపురం మనో, మైలై అశోక్‌ల నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం ఉదయాన్నే కుష్భు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆ ఇంటి వైపుగా వచ్చే తమిళ సంఘాలతో తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం అయ్యారు. ఇటీవల ఇదే సంఘం సత్యమూర్తి భవన్ ముట్టడికి యత్నించడం, కాంగ్రెస్ వర్గాలు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయడాన్ని పరిగణనలోకి తీసుకున్న పోలీసులు తాజా పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారు. ఉద్రిక్తత : తమిళర్ మున్నేట్ర పడై నాయకురాలు వరలక్షి నేతృత్వంలో తమిళాభిమాన సంఘాలు ర్యాలీగా పట్టినం బాక్కం సిగ్నల్ వద్దకు చేరుకున్నాయి. అక్కడకు చేరుకున్న పోలీసులు కుష్భు ఇంటి వైపుగా వారిని వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. అదే సమయంలో అసిస్టెంట్ కమిషనర్ రవి శేఖరన్ నేతృత్వంలోని పోలీసు బృందం కుష్భు ఇంటి వద్దకు చేరుకుని కాంగ్రెస్ నాయకుల్ని బుజ్జగించారు. పట్టినం బాక్కం సిగ్నల్ నుంచి కుష్భు ఇంటి వైపుగా చొచ్చుకెళ్లే యత్నం చేసిన తమిళ సంఘాల నాయకుల్ని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. ఈసందర్భంగా పలువురు కుష్భు దిష్టి బొమ్మను దగ్ధం చేస్తూ తీవ్ర వ్యాఖ్యలతో నినదించడం కాంగ్రెస్ నాయకుల్లో ఆగ్రహాన్ని రేపింది. చివరకు ఆందోళన కారుల్ని పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితి చక్క బడింది. ఈ మట్టుడి యత్నం సమయంలో కుష్భు ఆ ఇంట్లో లేరన్నది కొసమెరుపు.