సాక్షి, చెన్నై: ఫ్యామిలీమ్యాన్ సిరీస్ విషయంలో అనుకున్నదే జరుగుతోంది. ఈ సిరీస్‌లో రెండో సీజన్‌ను అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కాకుండా బ్యాన్ చేయాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈలం తమిళ్స్‌ను అత్యంత అభ్యంతరకర రీతిలో చిత్రీకరించారని తమిళనాడు ప్రభుత్వం ఆ విజ్ఞప్తిలో పేర్కొంది. గతంలో బ్యాన్ చేసిన డిజిటల్ కంటెంట్‌ను ప్రస్తావిస్తూ.. ‘ది ఫ్యామిలీమ్యాన్ 2’ను బ్యాన్ చేయడంగానీ, అసలు రిలీజ్ కాకుండా తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
ఫ్యామిలీమ్యాన్ 2లో ‘అభ్యంతరకరం, అవసరం, అప్రస్తుతమైన కంటెంట్ ఉంద’ని తమిళనాడు ఐటీ శాఖ మంత్రి మనో తంగరాజ్ ఇదివరకే కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు తంగరాజ్ ఒక లేఖ రాశాడు. ఇది ఈలం తమిళ్స్ సెంటిమెంట్స్‌తో పాటు తమిళనాడు ప్రజల భావాలను కూడా దెబ్బతీస్తుందని లేఖలో తంగరాజ్ పేర్కొన్నారు. తమిళ నటిని సమంతను టెర్రరిస్టుగా చూపించడం.. తమిళుల ఆత్మగౌరవంపై జరిగే దాడేనని, దీనిని ఎవరూ భరించలేరని తంగరాజ్ అభివర్ణించాడు. ఇలాంటి చర్యలను, తప్పుడుదారి పట్టించే ప్రయత్నాలు ఎవరూ చేసినా భరించలేమని తంగరాజ్ తెలిపాడు. తమిళ సంప్రదాయాన్ని దెబ్బతీసేలా ఉందని, అలాంటి కంటెంట్‌ను అనుమతించకపోవడమే మంచిదని లేఖలో విజ్ఞప్తి చేశాడు. కాగా, ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తామని కేంద్ర సమాచార ప్రసార శాఖ నుంచి బదులు వచ్చింది.
కాగా, తమిళ ప్రజల సెంటిమెంట్స్‌ను గుర్తించకుండా ఈ వెబ్ సిరీస్‌ను రిలీజ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎండీఎంకే జనరల్ సెక్రటరీ వైకో కూడా ప్రకాశ్ జవదేరకర్‌కు ఒక లేఖ రాశారు. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీలో సమంతతో పాటు మనోజ్ వాజ్‌పాయి, ప్రియమణి తదితరులు నటించారు. స్లీపర్ సెల్స్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఫ్యామిలీమ్యాన్ 2 ట్రైలర్‌తోనే కాంట్రవర్సీని నెత్తినేసుకుంది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలంకి ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు ఈ సీజన్‌లో చూపించడమే అసలు అభ్యంతరం. “ఫ్యామిలీ మ్యాన్-2 ఎగైనెస్ట్ తమిళ్” అనే హాష్ ట్యాగ్‌ను కూడా వైరల్ చేశారు. దీంతో రీఎడిట్ చేసిన ట్రైలర్‌ను అమెజాన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆ కాన్సెప్ట్‌తో ముడిపడిన సీన్లకు సెన్సార్ పడే ఛాన్స్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment