Vaiko
-
Family Man 2: ఫ్యామిలీ మ్యాన్ 2 బ్యాన్?!
సాక్షి, చెన్నై: ఫ్యామిలీమ్యాన్ సిరీస్ విషయంలో అనుకున్నదే జరుగుతోంది. ఈ సిరీస్‌లో రెండో సీజన్‌ను అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కాకుండా బ్యాన్ చేయాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈలం తమిళ్స్‌ను అత్యంత అభ్యంతరకర రీతిలో చిత్రీకరించారని తమిళనాడు ప్రభుత్వం ఆ విజ్ఞప్తిలో పేర్కొంది. గతంలో బ్యాన్ చేసిన డిజిటల్ కంటెంట్‌ను ప్రస్తావిస్తూ.. ‘ది ఫ్యామిలీమ్యాన్ 2’ను బ్యాన్ చేయడంగానీ, అసలు రిలీజ్ కాకుండా తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఫ్యామిలీమ్యాన్ 2లో ‘అభ్యంతరకరం, అవసరం, అప్రస్తుతమైన కంటెంట్ ఉంద’ని తమిళనాడు ఐటీ శాఖ మంత్రి మనో తంగరాజ్ ఇదివరకే కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు తాజాగా కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు తంగరాజ్ ఒక లేఖ రాశాడు. ఇది ఈలం తమిళ్స్ సెంటిమెంట్స్‌తో పాటు తమిళనాడు ప్రజల భావాలను కూడా దెబ్బతీస్తుందని లేఖలో తంగరాజ్ పేర్కొన్నారు. తమిళ నటిని సమంతను టెర్రరిస్టుగా చూపించడం.. తమిళుల ఆత్మగౌరవంపై జరిగే దాడేనని, దీనిని ఎవరూ భరించలేరని తంగరాజ్ అభివర్ణించాడు. ఇలాంటి చర్యలను, తప్పుడుదారి పట్టించే ప్రయత్నాలు ఎవరూ చేసినా భరించలేమని తంగరాజ్ తెలిపాడు. తమిళ సంప్రదాయాన్ని దెబ్బతీసేలా ఉందని, అలాంటి కంటెంట్‌ను అనుమతించకపోవడమే మంచిదని లేఖలో విజ్ఞప్తి చేశాడు. కాగా, ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తామని కేంద్ర సమాచార ప్రసార శాఖ నుంచి బదులు వచ్చింది. కాగా, తమిళ ప్రజల సెంటిమెంట్స్‌ను గుర్తించకుండా ఈ వెబ్ సిరీస్‌ను రిలీజ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎండీఎంకే జనరల్ సెక్రటరీ వైకో కూడా ప్రకాశ్ జవదేరకర్కు ఒక లేఖ రాశారు. రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీలో సమంతతో పాటు మనోజ్ వాజ్‌పాయి, ప్రియమణి తదితరులు నటించారు. స్లీపర్ సెల్స్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఫ్యామిలీమ్యాన్ 2 ట్రైలర్‌తోనే కాంట్రవర్సీని నెత్తినేసుకుంది. లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలంకి ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థతో లింకులు ఉన్నట్లు ఈ సీజన్లో చూపించడమే అసలు అభ్యంతరం. “ఫ్యామిలీ మ్యాన్-2 ఎగైనెస్ట్ తమిళ్” అనే హాష్ ట్యాగ్‌ను కూడా వైరల్ చేశారు. దీంతో రీఎడిట్ చేసిన ట్రైలర్‌ను అమెజాన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆ కాన్సెప్ట్‌తో ముడిపడిన సీన్లకు సెన్సార్ పడే ఛాన్స్ ఉంది. -
స్టాలిన్‌ది ఒబామా స్టైల్!
సాక్షి, చెన్నై : డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌పై ఎండీఎంకే నేత వైగో ప్రశంసలు కురిపించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పోలుస్తూ కొనియాడారు. శుక్రవారం ఆయన స్టాలిన్ నియోజకవర్గమైన కొళత్తూరులో పర్యటించారు. వైగో మాట్లాడుతూ ఒబామా సెనేటర్‌గా ఉన్న సమయంలో తరచూ తాను ప్రాతినిథ్యం వహించే సెనేట్‌లో పర్యటించి ప్రజాసమస్యలు పరిష్కరించేవారన్నారు. అదే తరహాలో స్టాలిన్ సైతం ఎక్కడున్నా కొళత్తూరు ప్రజలతో మమేకమవుతుంటారని గుర్తుచేశారు. దీన్నిబట్టి ప్రజా సంక్షేమంపై వీరిద్దరి చిత్తశుద్ధి అర్థమవుతుందని వెల్లడించారు. అందుకే ఒబామా అమెరికా అధ్యక్షుడు అయ్యారని, ఇదే బాటలో స్టాలిన్ కూడా ముఖ్యమంత్రి కావడం తథ్యమని స్పష్టం చేశారు. చదవండి: సర్వేలన్నీ ఆ పార్టీ వైపే : 161 నుంచి 169 స్థానాలు! కమల్‌కు షాక్: రూ.11 కోట్లు సీజ్ -
తండ్రికి శత్రువు.. కుమారుడికి మిత్రుడు
సాక్షి, చెన్నై : రాజకీయ శత్రువుగా ఉన్నప్పుడు పెట్టిన పరువునష్టం దావా కేసు రాజకీయ మిత్రుడిగా మారిన తరువాత తీర్పు వెలువడిన చిత్రమైన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. అయితే తీర్పు సైతం మిత్రత్వానికి విఘాతం కలగకుండా వెలువడడం మరో విశేషం. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, ఎండీఎంకే అధ్యక్షుడు వైగో నడుమ సాగిన రాజకీయ యుద్ధం, పరువునష్టం దావా కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. డీఎంకేలో కరుణానిధికి సన్నిహితుడిగా మెలిగిన వైగో 1993లో ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఇందుకు డీఎంకే కార్యదర్శులు కొందరు తీవ్రంగా వ్యతిరేకించారు. వైగోకు మద్దతుగా డీఎంకే నుంచి బయటకు వచ్చారు. 1994లో వైగో సొంతంగా ఎండీఎంకేను స్థాపించారు. పార్టీని ప్రారంభించిన కొత్తలో డీఎంకేకు వ్యతిరేకంగా వ్యహరించిన వైగో ఆ తరువాత క్రమంగా దగ్గరయ్యారు. ఆ తరువాత మరోసారి కరుణానిధితో అభిప్రాయభేదాలు రావడంతో దూరంగా ఉంటూ వచ్చారు. కరుణానిధి కన్నుమూశాక డీఎంకే పార్టీ బాధ్యతలను స్టాలిన్ చేపట్టారు. దీంతో వైగో డీఎంకే కూటమిలో చేరారు. డీఎంకే కూటమి అభ్యర్థిగా ఇటీవల రాజ్యసభకు ఎంపికయ్యారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో వైగోపై అనేక కేసులు నమోదయ్యాయి. ఇటీవల వాటిపై వరుసగా తీర్పులు వెలువడుతున్నాయి. 2009లో జరిగిన ఒక సమావేశంలో వైగో ఎల్టీటీఈకి అనుకూలంగా ప్రసంగించడంతో పోలీసులు దేశద్రోహ కేసు పెట్టారు. ఈ కేసులో ఇటీవల ఏడాది జైలు శిక్షపడింది. ఈ తీర్పుపై ఆయన అప్పీలు వెళ్లగా కోర్టు ఆ శిక్షను నిలువరించింది. ఇదిలా ఉండగా 2006లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌కు వైగో ఒక లేఖ రాశారు. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తాను సామర్థ్యం వహిస్తున్న ఎండీఎంకేను చీల్చేందుకు కుట్రపన్నుతున్నారని ఆ ఉత్తరంలో ఆరోపించారు. ఈ ఉత్తరంలోని వివరాలు ఒక ఆంగ్లపత్రికలో ప్రచురితం కావడంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కరుణానిధి వైగోపై పరువునష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి చెన్నై సెషన్స్ కోర్టులో అప్పటి నుంచి విచారణ జరుగుతూ వచ్చింది. ప్రజాప్రతినిధుల కేసుల కోసం చెన్నైలో కొత్తగా వెలిసిన ప్రత్యేక కోర్టుకు ఆ కేసు విచారణ బదిలీ అయింది. 13 ఏళ్లుగా విచారణలో ఉన్న ఈ కేసుపై శుక్రవారం తీర్పు వెలువడింది. వైగోపై పిటిషన్‌దారుడు మోసిన అభియోగాలు సరిగా నిరూపణ కానందున కొట్టివేస్తున్నట్లు న్యాయమూర్తి కరుణానిధి తీర్పుచెప్పారు. పరువునష్టం దావా కేసుపై శుక్రవారం తీర్పు వెలువడుతున్నట్లు తెలిసినా అనారోగ్యకారణాల వల్ల వైగో కోర్టుకు హాజరుకాలేదు. ఆయన తరఫున న్యాయవాది హాజరయ్యారు. ఇదే కేసుపై ఈనెల 26న కేసు విచారణ జరిగిన సమయంలో కూడా వైగో హాజరుకాలేదు. -
రూ.100 ఇస్తేనే సెల్ఫీ.. 53 వేలు వసూలు!
సాక్షి, చెన్నై: రూ. వంద చేతిలో పెడితే గానీ, సెల్ఫీ దిగేందుకు ఎండీఎంకే నేత, ఎంపీ వైగో అనుమతించడం లేదు. పార్టీ కార్యకర్త, నాయకుడు ఎవరైనా సరే రూ.వంద చెల్లించి ఫోటో దిగాల్సిన పరిస్థితి. ఇవ్వకుంటే, కరాఖండిగా ఫొటో దిగే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పేస్తున్నారు. ఆ దిశగా గురువారం ఒక్క రోజు వైగోకు ఈ సెల్ఫీ, ఫోటోల రూపంలో రూ.53 వేలు దక్కడం గమనార్హం. రాజ్యసభ సభ్యుడు ఎండీఎంకే నేత వైగో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తనను రాజ్య సభకు పంపించారని, అందుకు తగ్గట్టుగా తన పయనం ఉంటుందని ఇప్పటికే వైగో ప్రకటించారు. ఆ దిశగా రాజ్యసభలో వైగో ప్రసంగాలు హోరెత్తాయి. అదే సమయంలో ప్రస్తుతం ఎంపీగా మారిన వైగో తన పార్టీకి ఆదాయం సమకూర్చుకునేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. గతంలో ఎండీఎంకేకు భారీగానే నిధులు దక్కినా, కాల క్రమేనా కష్టాలు తప్పలేదు. ముఖ్య నాయకులు పార్టీ వీడడంతో ఖర్చు పెట్టే వాళ్లు కరువయ్యారు. దీంతో నిధులను సమకూర్చుకునేందుకు కొత్త బాట వేశారు. ఇందులో భాగంగా పార్టీ కార్యాలయం ద్వారా గత వారం ఓ ప్రకటన విడుదల చేయించారు. ఇక, మీదట వైగోకు కప్పే శాలువలు, వేసే పూల మాలలు, పుష్పగుచ్ఛాల ఖర్చుకు అయ్యే మొత్తాన్ని పార్టీకి సమర్పించాలని సూచించారు. అలాగే, ఇక మీదట వైగోతో సెల్పీ గానీ, ఫోటోగానీ దిగాలన్నా రూ. వంద చెల్లించాల్సిందేనని ప్రకటించారు. ఈ రకంగా వంద కోట్టు.. ఫొటో పట్టు అంటూ వైగో ముందుకు సాగే పనిలో పడ్డారు. ఒక్క రోజులో రూ. 53 వేలు... గురువారం చెన్నై నుంచి కృష్ణగిరికి వైగో పయనం అయ్యారు. తన పయన మార్గంలో పలు చోట్ల కారు దిగి, కేడర్‌ను, స్థానికంగా ఉన్న నాయకుల్ని కలిసి వెళ్లారు. వైగో రాకతో ఎండీఎంకే వర్గాలు ఉరకలు తీశాయి. ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. అయితే, ముందు రూ.100 చేతిలో పెట్టాలని, ఆ తర్వాతే సెల్ఫీ, ఫొటో అని వైగో తేల్చారు. దీంతో నాయకులు, కార్యకర్తలు తమ అధినేతకు రూ.వంద ఇచ్చి మరీ సెల్ఫీలు తీసుకున్నారు. అయితే, ఆ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు సెల్ఫీలు దిగేందుకు పెద్ద ఎత్తున రాగా వంద ఇస్తేనే అంటూ వైగో తేల్చడంతో వారు వెనుదిరగక తప్పలేదు. వంద ఇవ్వకుంటే, సెల్ఫీ లేదంటూ వైగో అనుమతి నిరాకరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడం గమనార్హం. ఇక, ఈ ఒక్క రోజు చెన్నై నుంచి కృష్ణగిరి వరకు సాగిన పయనంలో వైగోకు రూ. 53 వేలు లభించినట్టు, దీనిని పార్టీ నిధికి ఆయన అప్పగించినట్టుగా ఎండీఎంకే వర్గాలు పేర్కొన్నాయి. -
కశ్మీర్‌పై వైగో సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: జమ్మూ కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుపై ఎండీఎంకే చీఫ్, ఎంపీ వైగో (వి.గోపాలసామి) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశం వందవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకునే నాటికి కశ్మీర్ భారత్‌లో భాగంగా ఉండదని ఆయన జోస్యం చెప్పారు. మంగళవారం ఆయన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. ‘‘భారత్ వందవ స్వాతంత్ర్య దినోత్సవం జరుగుపుకునే సమయానికి భారత్‌లో కశ్మీర్ భాగంగా ఉండదు. బీజేపీ ప్రభుత్వం కశ్మీర్‌పై బురద చల్లింది. గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ కశ్మీర్‌కు 30 శాతం అన్యాయం చేస్తే.. బీజేపీ 70 శాతం చేసింది. కశ్మీర్‌పై గతంలో కూడా నా అభిప్రాయం ఇదే విధంగా చెప్పాను’అని అన్నారు. కాగా కశ్మీర్ విభజన సందర్భంగా పార్లమెంట్లో వైగో మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిందం చేసిందని తీవ్ర స్థాయిలో విమర్శించిన విషయం తెలిసిందే. కాగా డీఎంకే వ్యవస్థాపకుడు, తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి సీఎన్ అన్నాదురై 110 జయంత్యుత్సవాలను తమ పార్టీ నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. వచ్చే నెలలో ఈ వేడుకలను ప్రారంభిస్తామని చెప్పారు. -
రేపే నామినేషన్; ఏడాది జైలు, జరిమానా!
చెన్నై : రాజద్రోహం కేసులో మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం(ఎండీఎంకే) చీఫ్ వైగోనకు చెన్నై కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. అదే విధంగా 10 వేల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. ప్రత్యేక న్యాయస్థానం జడ్జి జె. శాంతి ఈ మేరకు తీర్పు వెలువరించారు. కాగా శనివారం రాజ్యసభ సభ్యత్వానికై నామినేషన్ వేసేందుకు వైగో సిద్ధపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టు తీర్పు ఆయనను ఇరకాటంలో పడేసింది. అయితే ప్రజాప్రతినిధి చట్టం- 1951లో రాజద్రోహాన్ని నేరంగా పరిగణించే సెక్షన్లు లేవు కాబట్టి వైగో నామినేషన్ వేయవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాగా 2009లో ఓ పుస్తకావిష్కరణ సందర్భంగా వైగో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఈలంకు ఏమైంది’ అనే అంశంపై ఆయన మాట్లాడుతూ.. శ్రీలంకలో ఎల్టీటీఈ పోరాటం ఆపకపోయినట్లైతే భారత్ ఒక్కటిగా కలిసి ఉండబోదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో వైగోపై రాజద్రోహం కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో 2017లో అరెస్టైన ఆయన నెలరోజుల పాటు జైలులో ఉన్న తర్వాత బెయిలుపై విడుదలయ్యారు. ఇక 1978 నుంచి 1996 మధ్య కాలంలో వైగో రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు. తమ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ.. దాదాపు 23 ఏళ్ల తర్వాత డీఎంకే మద్దతుతో పెద్దల సభకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జూలై 18న తమిళనాడులో ఇందుకు సంబంధించిన ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం కోర్టు తీర్పు వెలువడటం గమనార్హం. -
చిత్ర నిర్మాణ రంగంలోకి వైగో
సాక్షి, చెన్నై : ప్రముఖ రాజకీయ నాయకుడు, ఎండీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి వైగో చిత్ర నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్నారు. ఆయన కన్నకీ ఫిలింస్ పతాకంపై చారిత్రకారిణి వేలు నాచ్చియార్ జీవిత కథను చిత్రంగా నిర్మించనున్నారు. వేలు నాచ్చియార్ నాటకం తమిళనాటు ప్రసిద్ధి చెందింది. ఈ నాటకాన్ని సోమవారం సాయంత్రం స్ధానిక మైలాపూర్‌లోని నారదగానసభలో ప్రదర్శిం చారు. ఈ నాటక ప్రదర్శనకు వైగో, నడిగర్‌సంఘం కార్యదర్శి, నిర్మాతల మండలి అధక్షుడు విశాల్, నాజర్ పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఎండీఎంకే నేత వైగో మాట్లాడుతూ బ్రిటీష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి పోరాడిన చరిత్రకారిణి వేలు నాచ్చయార్ చరిత్రను చిత్రంగా నిర్మించనున్నానని వెల్ల డించారు. విశాల్ మాట్లాడుతూ తాను ముఖ్యమైన అంశం గురించి ప్రభుత్వంతో చర్చించాల్సి ఉన్నా, ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వైగో కోరడంతో వచ్చానన్నారు. బ్రిటీష్ ప్రభుత్వానికి పన్ను కట్టడాన్ని ఎదిరించి వేలు నాచ్చియార్ పోరాడారని, తాము వినోదపు పన్ను వ్యతిరేకిస్తూ ప్రభుత్వంపై పోరాడుతున్నామన్నారు. పన్ను విషయంలో ప్రభుత్వం నుంచి సాధకమైన నిర్ణయం వస్తుందనే నమ్మకం ఉందని విశాల్ పేర్కొన్నారు. -
క్రిమినల్‌గా ట్రీట్ చేయలేదు కానీ...
చెన్నై : మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లోని విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదుర్కొన్న తమిళ నేత, ఎండీఎంకే అధినేత వైగో శనివారం వేకువ జామున చెన్నై చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనను ఓ క్రిమినల్‌గా ట్రీట్ చేయకపోయినప్పటికీ... సాధారణ మర్యాదలు ఏమీ లేవని, ఇతర దేశాల్లా వ్యవహరించలేదని అన్నారు. తనను భద్రతా ముప్పుగా భావించడం వల్లే మలేషియా ఈ చర్యకు పాల్పడి ఉంటుందని వైగో అన్నారు. కాగా వైగోను శుక్రవారం కౌలాలంపూర్‌లోని విమానాశ్రయంలోనే అధికారులు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఎల్టీటీఈతో సంబంధాలపై అక్కడే చాలాసేపు ప్రశ్నించిన అధికారులు.. ఆయన్ను దేశంలోకి అనుమతించేది లేదని తేల్చిచెప్పారు. ‘మలేసియాకు ప్రమాదకారుల’ జాబితాలో వైగో పేరు ఉండడమే అందుకు కారణమన్నారు. ఎల్‌టీటీఈలకు మద్దతుదారుగా ఉన్న వైగో మీద శ్రీలంకలో అనేక కేసులు ఉన్నాయని, తమిళనాడులో రెండుసార్లు జైలుకు వెళ్లొచ్చినట్టుగా అక్కడి అధికారులు పేర్కొనడంతో ఆయనకు చేదు అనుభవం తప్పలేదు. రోజంతా ఒంటరిగా ఉంచడమే కాకుండా, శుక్రవారం రాత్రి వైగోను మలేసియా ఎయిర్‌లైన్స్ విమానంలో తిరిగి చెన్నైకి పంపించారు. కాగా మలేసియాలోని పెనాంగ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పి.రామస్వామి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు హాజరవడానికి వైగో మలేసియా వెళ్లారు. కౌలాలంపూర్‌లో దిగగానే ఆయనను విమానాశ్రయానికే అధికారులు పరిమితం చేశారు. ఇమ్మిగ్రేషన్ వర్గాల పరిశీలనలో వైగో పాస్‌పోర్టు, వీసా పరిశీలన అనంతరం సీజ్ చేశారు. వైగోను అనుమతించకుండా ఇమ్మిగ్రేషన్ వర్గాలు అడ్డుకున్న సమాచారంతో పినాంగ్ సీఎం లింకు యాంగ్ మంగ్, డిప్యూటీ సీఎం రామస్వామి ఇమిగ్రేషన్, దౌత్య కార్యాలయ వర్గాలకు సమాచారం ఇచ్చారు. అయితే, ఏ ఒక్క అధికారి స్పందించలేదు. మలేషియా ఉప ప్రధాని ఆదేశాలు తమకు ఉన్నాయని, వైగోను వెనక్కు పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సూచించడంతో రామస్వామి వెనక్కు తగ్గాల్సి వచ్చింది. రోజంతా వైగోను ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో ఓ గదిలో ఉంచారు. ఆయన్ను బయటకు ఎక్కడ పంపించలేదు. ఆయన కార్యదర్శి అరుణగిరికి మాత్రం అనుమతించారు. వైగో అక్కడే ఉండడంతో ఆయన కూడా బయటకు వెళ్లడానికి నిరాకరించారు. ఎవ్వరితోనూ మాట్లాడకుండా వైగో మౌనం అనుసరించడంతో రామస్వామి అతికష్టం మీద ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. ఏమైనా వేధింపులకు గురి చేశారా అని ఆయన ప్రశ్నించగా, అందుకు వైగో, ఒంటరిగా ఉన్నానంటూ ఫోన్ కట్ చేయడం గమనార్హం. -
కూటమికి షాకిచ్చిన వైగో
చెన్నై: ఎండీఎంకే చీఫ్ వైగో తాజాగా ప్రజాసంక్షేమ కూటమి (పీడబ్ల్యూఎఫ్)కి షాక్ ఇచ్చారు. కూటమి నుంచి తప్పుకొంటున్నట్టు ఆయన మంగళవారం ప్రకటించారు. కూటమిలోని కొన్ని పార్టీలతో తమ పార్టీకి సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ పార్టీ హైలెవల్ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుందని వైకో తెలిపారు. కూటమి కన్వీనర్ గా ఉన్న వైగోనే ఏకంగా తప్పుకోవడంతో పీడబ్ల్యూఎఫ్ భవిష్యత్తు ఏమిటన్నది అగమ్యగోచరంగా మారింది. మిగతా పార్టీలైనా కూటమిలో కొనసాగుతాయా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. 2016 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిముందే భారీ అంచనాలతో ప్రజాసంక్షేమ కూటమి (పీడబ్ల్యూఎఫ్) ఏర్పడింది. విజయ్ కాంత్ నేతృత్వంలోని డీఎండీకే కూడా కూటమితో జతకలువడంతో అన్నాడీఎంకే, డీఎంకేకు గట్టి ప్రత్నామ్నాయం అన్న అభిప్రాయం ఏర్పడింది. అయితే, ఎన్నికల్లో కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క అసెంబ్లీ స్థానం కూడా కూటమి గెలువలేకపోయింది. -
వైగో ఒంటరేనా?
మిత్రుడ్ని దూరం పెట్టారు వైగోకు ఆహ్వానం కరువు 28న పుదుచ్చేరిలో వీసీకే మహానాడు చెన్నై : నలుగురు మిత్రుల మధ్య పాత నోట్ల రద్దు చిచ్చును రగిల్చింది. మోదీకి జై అని మద్దతు పలికిన మిత్రుడ్ని దూరం పెట్టేందుకు మిగిలిన వారు సిద్ధమయ్యారు. ఇందులో ఓ మిత్రుడు మరో అడుగు ముందుకు వేసి, తమ మహానాడుకు రావద్దన్నట్టుగా ఆహ్వానం పంపించే ప్రసక్తే లేదని బహిరంగంగానే తేల్చారు. ఇది మక్కల్ ఇయక్కంలోని సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకేల నేతల మధ్య కలిగిన మనస్పర్థల ఎపిసోడ్. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తామేనని మక్కల్ ఇయక్కం(ప్రజా సంక్షేమ కూటమి) వర్గాలు జబ్బలు చరిచిన విషయం తెలిసిందే. తాము ఆరుగురం అంటూ అధికార పగ్గాలు చేపట్టేసినట్టుగా సీఎం పదవిలో డీఎండీకే అధినేత విజయకాంత్‌ను కూర్చోబెట్టినట్టుగా, తాము మంత్రులు శాఖల్ని పంచుకున్నట్టుగా ఎన్నికల ప్రచారం సమయంలో వీరి వాగ్ధాటికి హద్దే లేదు. అందుకు తగ్గట్టుగానే ప్రజలు ఆ కూటమి అడ్రస్సును గల్లంతు చేశారు. సీఎం పదవికి ఆశపడి చివరకు డిపాజిట్ కూడా దక్కని దృష్ట్యా, డీఎండీకే అధినేత విజయకాంత్, ఉనికి చాటుకునే ప్రయత్నంలో రాజకీయ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారడంతో తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ తీవ్రంగానే పశ్చాత్తాపం పడక తప్పలేదు. ఈ ఇద్దరు కూటమికో దండం అంటూ బయటకు వచ్చేయడంతో సీపీఎం, సీపీఐ, వీసీకే, ఎండీఎంకేలతో కూడిన నలుగురు మిత్రులు స్నేహ మంటే మాదేరా...అని డ్యూయెట్లు పాడుకుంటూ వచ్చారు. ప్రజల పక్షాన నిలబడి ఉద్యమించేది తామేనని రోడ్డెక్కి గళాన్ని వినిపిస్తున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పాత నోట్ల రద్దు నిర్ణయం మిత్రుల్లో తొలుత ఆగ్రహాన్ని తెప్పించాయి. ముక్త కంఠంతో ఖండించారు. రోజులు గడిచే కొద్దీ ఏమి జరిగిందో ఏమోగానీ, మోదీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన ఎండీఎంకే నేత వైగో ఒక్కసారిగా మద్దతు పలకడమే కాదు, శభాష్ అని భుజం తట్టేంతగా ప్రశంసల్లో ముంచేయడం సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, వీసీకే నేత తిరుమావళవన్లకు మింగుడు పడలేదు. ఇక, ఇయక్కం కనుమరుగైనట్టే అన్నంతంగా వ్యాఖ్యలు తూటాలు పేలాయి. అయితే, తమ మిత్ర బంధం మాత్రం పథిలం అని ఆయా నేతలు స్పందించడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో తాజాగా, వైగో ఇక ఒంటరి అన్నట్టుగా పరిస్థితులు నెలకొంటున్నాయి. మిత్రుడ్ని దూరం పెట్టారు : నోట్ల రద్దు వ్యవహారంలో అభిప్రాయ భేదాలు ఉన్నా, ఏ కార్యక్రమం జరిపినా, జరిగినా, మిత్రులకు ఆయా పార్టీల నుంచి తప్పకుండా ఆహ్వానాలు పలకడం జరుగుతూ వచ్చాయి. అధినేతలు హాజరు కాకున్నా, ఎవరో ఒకరు తప్పకుండా హాజరయ్యే వారు. అయితే, ఈ సారి ఏకంగా మిత్రుడ్ని దూరం పెట్టేందుకు మిగిలిన ముగ్గురు సిద్ధమైనట్టున్నారు. ఇందుకు ఇటీవల కాలంగా వైగో వ్యవహరిస్తున్న తీరు కారణంగా పరిగణించినట్టున్నారు. ఇందుకు అద్దం పట్టే విధంగా వీసీకే నేత తిరుమావళవన్ వ్యాఖ్యలు ఉండడం గమనార్హం. ఈనెల 28వ తేదీన పుదుచ్చేరి వేదికగా వీసీకే మహానాడు జరగనుంది. ఇందులో నోట్లరద్దు, కొత్త నోట్ల కోసం జనం పడుతున్న పాట్లపై కేంద్రం మీద దుమ్మెత్తి పోసే విధంగా నినాదాలతో కూడిన ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. తమ మహానాడుకు హాజరు కావాలని స్వయంగా వీసీకే నేత తిరుమావళవన్ రాజకీయ పక్షాలకు ఆహ్వానం పలికే పనిలో పడ్డారు. తమ మిత్రులు సీపీఎం, సీపీఐలకు ఆహ్వానం ఉందని, అయితే, ఎండీఎంకే నేత వైగోను ఈ మహానాడుకు ఆహ్వానంచడం లేదని ప్రకటించడం చర్చకు దారి తీసింది. వైగోను ఆహ్వానంచడం ఇష్టం లేదన్నట్టుగా తిరుమా స్పందించడం, ఇందుకు మిగిలిన మిత్రులు మౌనం వహించడం బట్టి చూస్తే, ఇక మిత్రుడ్ని దూరం పెట్టినట్టేనా..? అన్నది స్పష్టం కాక తప్పదేమో..! -
కరుణను చూసేందుకు వెళ్తే.. రాళ్లు, చెప్పులతో..
-
కరుణను చూసేందుకు వెళ్తే.. రాళ్లు, చెప్పులతో దాడి
చెన్నై: చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధిని పరామర్శించేందుకు వెళ్లిన ఎండీఎంకే నేత వైకోకు చేదు అనుభవం ఎదురైంది. శనివారం రాత్రి కావేరి ఆస్పత్రి దగ్గరకు వైకో కారు వెళ్లగానే అక్కడున్న డీఎంకే కార్యకర్తలు రాళ్లు, చెప్పులు విసిరారు. డీఎంకే కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కారును ముందుకు కదలనీయకుండా అడ్డుకున్నారు. వైకో ఆస్పత్రిలో వెళ్లేందుకు వీలుగా డీఎంకే కార్యకర్తలను చెదరగొట్టాలని పోలీసులు ప్రయత్నించినా సాధ్యంకాలేదు. దీంతో ఆయన ఆస్పత్రిలోకి వెళ్లకుండానే వెనుదిరిగారు. అనంతరం ఎండీఎంకే కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కరుణానిధి త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తున్నట్టు చెప్పారు. కరుణ ఆరోగ్యం గురించి ఆయన కుమార్తె కనిమొళిని వాకబు చేసినట్టు తెలిపారు. ఇటీవల అస్వస్థతకు గురైన కరుణానిధి కావేరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం మెరుగవుతోందని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు చెప్పారు. కరుణానిధిని పలువురు ప్రముఖులు పరామర్శించారు. శనివారం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చెన్నై వచ్చి కరుణానిధిని పరామర్శించారు. -
ఎట్టకేలకు పెదవి విప్పిన వదినమ్మ...
సాక్షి, చెన్నై: ఎందరు వెళ్లినా, తమ బలం తమదే అని డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత ధీమా వ్యక్తం చేశారు. కెప్టెన్ విజయకాంత్ వెన్నంటి లక్షల్లో అభిమానులు ఉన్నారని, వారి మద్దతుతో పూర్వ వైభవం తప్పనిసరిగా వ్యాఖ్యానించారు. పార్టీని వీడి వెళ్తున్న నాయకులందరూ ద్రోహులే అని మండిపడ్డారు. ఇక, ఎన్నికల సమయంలో ఎండీఎంకే నేత వైగో తమకు తీవ్ర షాక్ ఇచ్చారని అసహనం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు, ఎన్నికల అనంతరం డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలతకు వ్యతిరేకంగా ఆ పార్టీ వర్గాలే పెదవి విప్పడం మొదలెట్టాయి. ఆమె అనాలోచిత నిర్ణయాలతో పార్టీ పాతాళంలోకి నెట్టబడిందని విమర్శలు, ఆగ్రహం ప్రదర్శించే వాళ్లు ఎక్కువే. కొందరు గుడ్‌బై చెప్పి బయటకు వస్తుం టే, మరికొందరు కెప్టెన్ మీదున్న అభిమానంతో ఇంకా అంటి పెట్టుకుని ఉన్నారు. అదే సమయంలో వదినమ్మ ప్రేమలత జోక్యం ఇక పార్టీలో ఉండకూడదంటూ కెప్టెన్‌కు హెచ్చరికలు, సూచనలు చేసేవాళ్లు పెరిగారు. తన మీద పార్టీ వర్గా లు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నా, మౌనంగా ఉంటూ వచ్చిన ప్రేమలత శుక్రవారం పెదవి విప్పారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తానేమిటో, కెప్టెన్ ఏమిటో వివరిస్తూ, పార్టీ వ్యవహా రాల్లో తానెప్పుడూ జోక్యం చేసుకోలేదని స్పష్టం చేశారు. కెప్టెన్ ఏ నిర్ణయాన్నైనా సరే కార్యకర్తలతో చర్చించి తీసుకుంటారని వ్యాఖ్యానించారు. వైగో షాక్ ఇచ్చారు: డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తిగా డీఎండీకే అవతరించాలన్న లక్ష్యంతో ప్రజాసంక్షేమ కూటమితో పయనం సాగించామని ప్రేమలత గుర్తు చేశారు. అవినీతి డీఎంకేను తరిమి కొట్టడం లక్ష్యంగా 2011 ఎన్నికల్లో అన్నాడీఎంకేతో చేతులు కలపాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయితే, అన్నాడీఎంకే తీరు నచ్చక బయటకు వచ్చామని, ప్రజల పక్షాన నిలబడి ఉద్యమించామని వివరించారు. అందుకే ప్రజలతో కలసి ఎన్నికల్ని ఎదుర్కొనే విధంగా ప్రజా కూటమికి నేతృత్వం వహించడం జరిగిందని వ్యాఖ్యానించారు. అయితే, ఎన్నికల చివరి క్షణంలో ఎండీఎంకే నేత వైగో పెద్ద షాక్కే ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అది ఆయన వ్యక్తిగత నిర్ణయమైనా, చివరి క్షణంలో పోటీకి దూరంగా ఉండడం ఆవేదన కల్గించిందని పేర్కొన్నారు. నిర్ణయాన్ని మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చినా, ఆయన ఏ మాత్రం తగ్గలేదని అసహనం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో ఒంటరి పయనమా లేదా..? అన్నది కెప్టెన్ ప్రకటిస్తారని చెప్పారు. ప్రజాసంక్షేమ కూటమి నుంచి బయటకు వచ్చినట్టుగా కెప్టెన్ స్వయంగా ఇంత వరకు ప్రకటించలేదుగా అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మా వల్లే ఓటమి: డీఎంకేకు తమ వల్లే గట్టి దెబ్బ తగిలిందని వివరించారు. తమతో పొత్తుకు డీఎంకే ముందుకు రాని దృష్ట్యా, అధికారం వారి చేతికి చిక్కలేదని ఎద్దేవా చేశారు. డీఎంకే అవినీతి పార్టీ అన్న విషయాన్ని కెప్టెన్ ఎప్పుడో పరిగణించారని, అందుకే వారి వెంట వెళ్లకూడదన్న నిర్ణయంతో ఆది నుంచి ఉంటూ వచ్చినట్టు పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ కూటమితో ఒరిగిందేమిటో అని ఈసందర్భంగా ప్రశ్నించగా, లోక్‌సభ ఎన్నికల్లో 37 సీట్లను గెలుచుకున్న అన్నాడీఎంకేతో ఒరిగిందేమిటో అని పొంతన లేని సమాధానం ఇవ్వడం గమనార్హం. అభిమానులు మా వెంటే: కెప్టెన్‌ను చూస్తే పీఎంకే అధినేత రాందాసు, ఆయన తనయుడు రాందాసులకు భయం అని, అందుకే తమను టార్గెట్ చేసి వ్యాఖ్యల్ని సంధిస్తున్నారని మండిపడ్డారు. డీఎండీకే గురించి వారికి ఏమి తెలుసునని, వాళ్ల పార్టీ గురించి ముందు ఆలోచించుకుంటే మంచిదంటూ మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. డీఎండీకే నుంచి ఎందరు బయటకు వెళ్లినా, కెప్టెన్ బలం...కెప్టన్ దే...మా బలం మాదే...! అని ధీమా వ్యక్తం చేశారు. వెళ్తున్న వాళ్లందరూ ద్రోహులు అని, చంద్రకుమార్ లాంటి వారికి రాజకీయ భవిష్యత్తును ఇచ్చింది కెప్టెన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, వెళ్తూ..వెళ్తూ నిందల్ని వేయడం చూస్తుంటే, ఏ మేరకు కెప్టెన్‌కు ద్రోహం చేస్తున్నారో అర్థం చేసుకోవాలని సూచించారు. ఎందరు నాయకులు బయటకు వెళ్లినా, కెప్టెన్ అభిమానులు లక్షల్లో వెన్నంటి ఉన్నారని, వాళ్లను కదిలించడం అంత సులభం కాదని ధీమా వ్యక్తం చేశారు. జోక్యం లేదు: పార్టీ వ్యవహారాల్లో తానెప్పుడూ జోక్యం చేసుకోలేదని, చేసుకోబోనని స్పష్టం చేశారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్న కెప్టెన్ ముందుగా నాయకులతో చర్చిస్తారని, తదుపరి కార్యకర్తల అభీష్టం మేరకు నడుచుకుంటారని వివరించారు.నిర్ణయం తీసుకున్న తర్వాత చివరకు తనకు సమాచారం ఇస్తారేగానీ, ఎన్నడూ తనకు ముందే ఎలాంటి విషయాలు చెప్పరని వ్యాఖ్యానించారు. 2005లో పార్టీ ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని వ్యవహారాల్లోనూ ప్రతిచోట కార్యకర్తలు కన్పిస్తారని, వారి అభీష్టం మేరకు కెప్టెన్ నిర్ణయం ఉంటుందన్నారు. -
రెండు దశాబ్దాల తరువాత అసెంబ్లీ బరిలో వైగో!
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మే 16 న జరగనున్న ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రజలకు వరాల జల్లును కురిపిస్తున్నాయి. గత రెండు దశాబ్దాలుగా అసెంబ్లీ ఎన్నికల పోటీకి దూరంగా ఉంటూ వస్తున్న ఎండీఎంకే నాయకుడు వైగో.. ఈ సారి ఎన్నికల బరిలో నిలుస్తున్నట్లు శనివారం ఎండీఎంకే అధికారికంగా ప్రకటించింది. కొవిల్‌పట్టి నియోజకవర్గం నుంచి వైగో పోటీ చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైగో చివరిసారిగా 1996 అసెంబ్లీ ఎన్నికల్లో విలత్తికులమ్ నుంచి పోటీ చేసి డీఎంకే అభ్యర్థిపై స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. అనంతరం శివకాశి నియోజకవర్గం నుంచి పోటీచేసి రెండు సార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన.. 2014 లోక్ సభ ఎన్నికల్లో విరుధునగర్ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కెప్టెన్ విజయ్ కాంత్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు సాగుతున్న నాలుగు పార్టీల కూటమి పీడబ్యూఎఫ్ (ప్రజా సంక్షేమ కూటమి)లో భాగస్వామిగా ఎండీఎంకే ఈ దఫా ఎన్నికలకు వెళ్తున్న విషయం తెలిసిందే. పొత్తులో భాగంగా ఎండీఎంకేకు కేటాయించిన 29 స్థానాల్లో 27 స్థానాల నుంచి పార్టీ అభ్యర్థులు బరిలో నిలుస్తున్నారు. మరో రెండు సీట్లను మాత్రం తమకు అనుబంధంగా ఉన్న చిన్న పార్టీల అభ్యర్థులకు ఎండీఎంకే కేటాయించింది. అన్ని పార్టీలు ఎవరికి వారే అధికారం తమదే అనే ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ప్రజా సంక్షేమ కూటమి నేతలైతే మరో అడుగు ముందుకేసి ప్రచార వేదికలోనే ఏ మంత్రి పదవి ఎవరికో తేల్చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. డీఎండీకే యువజన నేత సుదీష్.. ఇటీవల ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ వైగోకు డిప్యూటీ సీఎం అని ప్రకటించిన విషయం తెలిసిందే. -
మిస్టర్ స్టాలిన్ దమ్ముందా?
- స్టాలిన్‌కు వైగో సవాల్ సాక్షి, చెన్నై 'మిస్టర్ స్టాలిన్ దమ్ముందా....' తాను సంధించే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తావో, కేసులే వేసుకుంటావో, అంటూ ఎండీఎంకే నేత వైగో విరుచుకు పడ్డారు. ఎండీఎంకే నేత వైగో, డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ల మధ్య వారం రోజులుగా మాటల సమరం సాగుతున్న విషయం తెలిసిందే. డీఎంకేను టార్గెట్ చేసి వైగో స్పందిస్తున్న తీరుపై దళపతి స్టాలిన్ తీవ్రంగానే ఎ దురు దాడి చేస్తున్నారు. తన మీద ఆధార రహిత ఆరోపణలు చేసినందుకుగాను ఏకంగా లీగల్ నోటీసుల్ని సైతం వైగోకు స్టాలిన్ పంపించి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం వైగో మీడియాతో మాట్లాడుతూ స్టాలిన్‌పై కొత్త ఆరోపణలతో పాటుగా మిస్టర్..మిస్టర్ స్టాలిన్ దమ్ముందా...సవాల్ అంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అన్నాడీఎంకే నోట్లతో ఓట్లను రాబట్టే యత్నం చేస్తున్నదని వైగో విమర్శించారు. సిరుదావూర్ బంగళాలో ఉన్న నగదు ఆంధ్రాకు తరలి వెళ్లినట్టుగా, అధికారుల అండతోనే అన్నాడీఎంకే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదంటూ ఆరోపణలు గుప్పించారు. ఇక, డీఎంకే దళపతి స్టాలిన్ తనను టార్గెట్ చేసి నోటీసులు పంపిస్తాడా.? అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాను సంధించే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేని పరిస్థితుల్లో స్టాలిన్ ఉన్నారని ఎద్దేవా చేశారు. మిథైన్ తవ్వకాల అనుమతి డీఎంకే హయంలో సాగిందని, ఆ సమయంలో స్టాలిన్‌కు ఎన్ని కోట్లు ముట్టిందో బహిర్గతం చేస్తానంటూ వ్యాఖ్యానించారు. కోట్లు దండుకుని అన్నదాతల్ని కడుపు కొట్టిన ఘనత డీఎంకేకు దక్కుతుందని ఆరోపించారు. మిస్టర్ స్టాలిన్ దమ్ముందా..? ఉంటే, మిథైన్ అనుమతుల్లో ఎంత ముట్టిందో ప్రకటిస్తావా, ఆ ఒప్పందాల వెనుక ఉన్న ఆంతర్యానికి సమాధానం ఇస్తావో ఏమోగానీ, కేసులు వేసినా భయ పడను అంటూ తీవ్రంగా వైగో స్పందించారు. -
పదవుల పందేరం!
డిప్యూటీ సీఎంగా వైగో విద్యామంత్రిగా తిరుమా ఆర్థిక మంత్రిగా ముత్తరసన్ రామకృష్ణన్‌కు స్థానిక పరిపాలన శాఖ జాబితా ప్రకటించిన సుదీష్ సాక్షి, చెన్నై: సీట్ల పందేరంతో నియోజకవర్గాల ఎంపిక ప్రక్రియ జరగలేదు...ఇంకా, ఎన్నిక లూ జరగలేదు...అయితే, డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి మాత్రం అధికార పగ్గాలు చేపట్టిన ధీమాతో ముందుకు సాగుతోంది. తన బావ విజయకాంత్‌ను సీఎం అభ్యర్థిగా తెర మీదకు తెచ్చిన కూటమి నేతలకు పదవుల పంపకాల్లో డీఎండీకే యువజన నేత సుదీష్ నిమగ్నమయ్యారు. ప్రచార వేదిక లో కూటమి నేతలకు పదువల్ని కట్టబెట్టేసి అందర్నీ విస్మయంలో పడేశారు. ప్రజా సంక్షేమ కూటమిలోకి డీఎండీకే అధినేత విజయకాంత్ చేరిన విషయం తెలి సిందే. ఆయన రాకతో ఆ కూటమిలోని ఎం డీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, సీపీఎం నేత జి.రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్ ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. విజయకాం త్ను తమ కూటమి సీఎం అభ్యర్థిగా ప్రకటించారు. అయితే, కెప్టెన్ కూటమి గా పేరు మార్పు జరగడం వివాదానికి దా రి తీసింది. చివరకు నేతలందరూ ఏకతా టి పైకి వచ్చి డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి అన్న నినాదాన్ని అందుకున్నా రు. ఇంత వరకు అంతా బాగానే ఉంది. సీట్ల పందేరాల్లో సామరస్య పూర్వకంగానే నాయకులు వెళుతున్నారు. కూటమిలో చీలికకు ఆ స్కారం లేని విధంగా అడుగు లు వేసి, ఒకరి అభిప్రాయాల కు మరొకరు గౌరవం ఇస్తూ, తాము పంచ పాండవులం అని చాటుకునే పనిలో పడ్డారు. తమ బలాన్ని పెంచుకోవడం లక్ష్యంగా ప్రచార సభల్ని విస్తృతం చేశారు. వీసీకేకు ఎన్నికల యంత్రాంగం ఉంగరం చిహ్నం కేటాయించడాన్ని పురస్కరించుకుని ఏకంగా పార్టీ నేత తిరుమావళవన్‌కు మంగళవారం రెండు సవరాలతో కూడిన బంగారం ఉంగరాన్ని తొడిగి తమ స్నేహబంధాన్ని వైగో చాటుకున్నారు. ఈ పరిస్థితుల్లో తన బావను సీఎం చేయడానికి సిద్ధమైన ప్రజా కూటమి నేతల్ని బుధవారం పొగడ్తల పన్నీరుతో ముంచెత్తిన డీఎండీకే యువజన నేత, విజయకాంత్ బావమరిది సుదీష్ పదవుల పంపకాలతో కూడిన జాబితాను ప్రకటించి అందర్నీ విస్మయంలో పడేశారు. డిప్యూటీ సీఎం వైగో: కోవిల్ పట్టి గాంధి మైదానంలో బుధవారం జరిగిన ప్రచార సభలో సుదీష్ తన ప్రసంగం ద్వారా ప్రజా కూటమి నేతల్ని పొగడ్తలతో ముంచెత్తడంతో పాటుగా పదవుల పంపకాల్లో నిమగ్నం అయ్యారు. డీఎండీకే - ప్రజా కూటమి అధికార పగ్గాలు చేపట్టినట్టేనని, విజయకాంత్ సీఎం పగ్గాలు చేపట్టే సమయం ఆసన్నమవుతోందని వ్యాఖ్యానించారు. విజయకాంత్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టగానే, డిప్యూటీ సీఎంగా వైగో బాధ్యతలు స్వీకరిస్తారని ప్రకటించారు. వీసీకే నేత తిరుమావళవన్ విద్యా శాఖ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా సీపీఐ నేత ముత్తరసన్, సీపీఎం నేత రామకృష్ణన్ స్థానిక పరిపాలనా శాఖ మంత్రిగా పగ్గాలు చేపడుతారని ప్రకటించి, అక్కడున్న వారందర్నీ విస్మయంలో పడేశారు. సుదీష్ వ్యాఖ్యానించడంపై అక్కడే గుస..గుసలు అడిన వాళ్లూ ఉండడం గమనార్హం. ఇక, విజయకాంత్ ప్రభుత్వంలో తాను మాత్రం ఏ పదవీ స్వీకరించనని, ఒక సభ్యుడిగా అందరితో కలసి ఉంటానని, కూటమిలోకి వచ్చే వారికి కీలక మంత్రి పదవి గ్యారంటీ అని వ్యాఖ్యానించి పరోక్షంగా టీఎంసీ నేత వాసన్ తమ వైపునకు వస్తారన్న సంకేతాన్ని సుదీష్ ఇవ్వడం గమనార్హం. వాసన్‌కు 24 గ్యారెంటీ: తమతో కలిసి వస్తే 24 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని టీఎంసీ నేత జీకే వాసన్‌కు డీఎండీకే- ప్రజా సంక్షేమ కూటమి సంకేతాన్ని పంపింది. ఇందుకు తగ్గ పొత్తు మంతనాల్లో కెప్టెన్ ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. తనకు ప్రజా సంక్షేమ కూటమి కేటాయించిన 124 సీట్లలో 24 సీట్లను వాసన్‌కు ఇవ్వడానికి విజయకాంత్ నిర్ణయించినట్టు డీఎండీకే వర్గాలు పేర్కొంటున్నాయి. వాసన్ తనకు మంచి మిత్రుడు కావడంతో ఆ దిశలోనే విజయకాంత్ ప్రయత్నాల్లో ఉన్నట్టు, రెండు మూడు రోజుల్లో డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమిలోకి వాసన్ అడుగు పెడుతారని చెబుతున్నారు. -
వైగోకి కోపం.. ఇంటర్వ్యూ నుంచి అవుట్
చెన్నై: ప్రజా సంక్షేమ కూటమి(పీడబ్ల్యూఎఫ్) సమన్వయకర్త, ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగోకు కోపం వచ్చింది. న్యూస్ చానల్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు కోపం రావడంతో మైక్ తీసేసి బయటకు వెళ్లిపోయారు. పాలిమర్ టీవీ ఛానల్ ప్రతినిధి వైగోతో ఇంటర్వ్యూ చేస్తూ... ప్రజా సంక్షేమ కూటమిని అన్నాడీఎంకే బీ టీమ్ గా పిలవొచ్చా? అధికార పార్టీ నుంచి ఈ కూటమికి రూ.1500 కోట్లు ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది కదా? అని ప్రశ్నించారు. దీంతో కోపం తెచ్చుకున్న ఆయన 'నేను ఈ ఇంటర్వ్యూ రద్దు చేసుకుంటున్నాన'ని కాలర్ మైకును తీసేసి వెళ్లిపోయారు. మైకు తొలగించేముందు తన ప్రశ్న పూర్తిగా వినాలని పాలిమర్ టీవీ ఛానల్ ప్రతినిధి కోరినా ఆయన వినిపించుకోలేదు. కాగా, తమ పార్టీపై నిరాధార ఆరోపణలు చేశారంటూ వైగోకు డీఎంకే అధినేత కరుణానిధి శనివారం నోటీసులు పంపారు. తమ కూటమిలో చేరితే రూ.500 కోట్లు, 80 సీట్లు ఇస్తామని విజయకాంత్‌తో డీఎంకే బేరసారాలు ఆడిందని వైగో ఆరోపించిన నేపథ్యంలో నోటీసులు ఇచ్చారు. డీఎంకే లాగానే బీజేపీ సైతం డీఎండీకేతో బేరసారాలు ఆడిందని వైగో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. వైగో ఆరోపణలు సత్యదూరమని కేంద్ర మంత్రి పొన్‌రాధాకృష్ణన్ కొట్టిపారేశారు. -
ఆ ఆరోపణలు వెనక్కితీసుకో.. లేదు తీసుకోను!!
చెన్నై: తమిళనాడులో ఎన్నికల సమరం హోరాహోరీగా సాగుతోంది. డీఎంకే కురువృద్ధుడు కరుణానిధి, ఎండీఎంకే అధినేత వైగో మధ్య పోటాపోటీ సమరం సాగుతోంది. విజయ్‌కాంత్‌కు చెందిన డీఎండీకేతో పొత్తు కోసం కరుణానిధి డబ్బులు ఎరవేశారని ఆరోపించగా.. లీగల్ నోటీసులతో ఆయనకు కరుణానిధి బదులిచ్చారు. రూ. 500 కోట్లు, సీట్లు ఆశ చూపినప్పటికీ విజయ్‌కాంత్ దానిని తిరస్కరించి తమతో జత కట్టారని వైగో పేర్కొనగా.. ఆయనకు తన లాయర్ ద్వారా కరుణానిధి లీగల్ నోటీసులు పంపారు. తనపై చేసిన ఈ తప్పుడు ఆరోపణలను ఏడు రోజుల్లోగా ఉపసంహరించుకొని.. విచారం వ్యక్తం చేయాలని, లేదంటే తాను తీసుకోబోయే చట్టపరమైన సివిల్, క్రిమినల్ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ వైగోని బెదిరించారు. కరుణానిధి లీగల్ నోటీసులను వైగో తేలికగా తీసుకున్నారు. తన ఆరోపణలను వెనక్కితీసుకోబోనని, లీగల్ నోటీసులను కోర్టులోనే ఎదుర్కొంటానని ఆయన పేర్కొన్నారు. ప్రజాసంక్షేమ ఫ్రంట్ (పీడబ్ల్యూఎఫ్)తో జతకట్టిన విజయ్‌కాంత్‌ను ప్రశంసిస్తూ.. ఆయన కరుణానిధి ఇచ్చిన రూ. 500 కోట్లు, 80 సీట్ల ఆఫర్‌ను, బీజేపీ ఇవ్వజూపిన రాజ్యసభ సీటు, కేంద్రమంత్రి బెర్తును తిరస్కరించి తమతో కలిశారని అన్నారు. -
కరుణకు కోపం వచ్చింది
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డీఎంకే అధినేత కరుణానిధికి కోపం వచ్చింది. తన పరువుకు నష్టం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసిన ఎండీఎంకే అధినేత వైగోకు నోటీసులు పంపించారు. తనపై అసత్య పూర్వకంగా చేసిన ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపించారు. తమతో పొత్తు పెట్టుకుంటే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామంటూ డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్‌కు ఆఫర్ చేశాయని ఎండీఎంకే అధినేత వైగో.. డీఎంకే, బీజేపీలపై సంచలన ఆరోపణలు చేశారు. డీఎంకే.. 500 కోట్ల రూపాయల డబ్బు, 80 అసెంబ్లీ సీట్లు ఆఫర్ చేయగా, బీజేపీ.. ఎన్నికల ఖర్చుకు కావాల్సినంత డబ్బు, కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందని వైగో ఆరోపణల్లో పేర్కొన్నారు. దీనికి వెంటనే స్పందించిన కరుణానిధి అది తమపై చేసిన అసత్య ప్రచారమని అన్నారు. వెంటనే వివరణ ఇవ్వాలంటూ పరువు నష్టం దావా వేశారు. -
'రూ. 500 కోట్లు ఇస్తామన్నా తిరస్కరించారు'
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎండీఎంకే అధినేత వైగో.. డీఎంకే, బీజేపీలపై సంచలన ఆరోపణలు చేశారు. తమతో పొత్తు పెట్టుకుంటే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామంటూ ఈ రెండు పార్టీలు డీఎండీకే అధ్యక్షుడు విజయ్‌కాంత్‌కు ఆఫర్ చేశాయని చెప్పారు. డీఎంకే.. 500 కోట్ల రూపాయల డబ్బు, 80 అసెంబ్లీ సీట్లు ఆఫర్ చేయగా, బీజేపీ.. ఎన్నికల ఖర్చుకు కావాల్సినంత డబ్బు, కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసిందని వైగో ఆరోపించారు. అయినా విజయ్‌కాంత్ వీటిని తిరస్కరించారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అధికార అన్నా డీఎంకేలకు ఓటమి తప్పదని అన్నారు. విజయ్‌కాంత్ నేతృత్వంలోని తమ కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో నాలుగు పార్టీల కూటమి పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్(పీడబ్ల్యూఎఫ్) నాయకులు.. వైగో(ఎండీఎంకే), తోల్ తిరుమవలవన్(వీసీకే), జీ. రామకృష్ణన్(సీపీఎం), ఆర్. ముతరాసన్(సీపీఐ)లు.. కెప్టెన్ ఆధ్వర్యంలోని డీఎండీకేతో పొత్తుపెట్టుకున్న సంగతి తెలిసిందే. డీఎండీకే 124 స్థానాల్లో, పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్ అభ్యర్థులు 110 స్థానాల్లో పోటీ చేయడానికి పొత్తు కుదిరింది. డీఎండీకే-పీడబ్ల్యూఎఫ్ కూటమికి కెప్టెన్ విజయ్‌కాంత్ సీఎం అభ్యర్థిగా ఖరారయ్యారు. -
'ఆ పొత్తుతో మాకేం నష్టం లేదు'
చెన్నై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమిళనాట రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్(పీడబ్ల్యూఎఫ్)తో సినీ నటుడు విజయకాంత్ చేతులు కలిపారు. కలిసి పోటీ చేయాలని పీడబ్ల్యూఎఫ్, డీఎండీకే నిర్ణయించాయి. దీంతో విజయకాంత్ తమతో పొత్తు పెట్టుకుంటాడని ఎదురుచూసిన డీఎంకే, బీజేపీ నిరాశపడ్డాయి. డీఎండీకే, పీడబ్ల్యూఎఫ్ పొత్తుతో తమకు నష్టం లేదని డీఎంకే నాయకుడు ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. పీడబ్ల్యూఎఫ్ తో 'కెప్టెన్'తో చేతులు కలపడం తమను కలవరపరచలేదన్నారు. కెప్టెన్ విజయకాంత్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందున్న విశ్వాసాన్ని పీడబ్ల్యూఎఫ్ లోని ఎండీఎంకే నేత వైగో వ్యక్తం చేశారు. తమ ముఖ్యమంత్రి అభ్యర్థి విజయకాంత్ అని ప్రకటించారు. -
కరుణలో ఓటమి భయం
చెన్నై: డీఎంకే అధినేత ఎం కరుణానిధికి ఘోర పరాజయం భయం పట్టుకుని ఉన్నదని ఎండీఎంకే నేత వైగో ఎద్దేవా చేశారు. అందుకే డీఎండీకే కోసం తీవ్రం గా పాకులాడుతున్నారని విమర్శించారు. తిరుప్పూర్ జిల్లా ఉడుమలైలో ప్రేమి‘కుల’ చిచ్చుకు శంకర్ బలైన విషయం తెలిసిం దే. నడి రోడ్డులో వందలాది మం ది జనం చూస్తుండగా సాగిన ఈ పరువు హత్యపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, శంకర్‌ను హతమార్చిన వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంక్షేమ కూటమి నేతృత్వంలో వళ్లువర్ కోట్టంలో సోమవారం నిరసన కార్యక్రమం జరిగింది. ఇందులో ఎండీఎంకే నేత వైగో, సీపీఎం నేత రామకృష్ణన్, సీపీఐ నేత ముత్తరసన్, వీసీకే నేత తిరుమావళవన్ తదితరులు పాల్గొన్నారు. పరువు హత్యల్ని ఖండిస్తూ నినాదాలతో హోరెత్తించారు. అనంతరం మీడియాతో వైగో మాట్లాడుతూ డీఎంకేలో ఓటమి భయం బయలు దేరి ఉన్నదని ఎద్దేవా చేశారు. ఘోర పరాజయం తమకు తప్పదని గ్రహించిన ఆ పార్టీ అధినేత కరుణానిధి డీఎండీకే జపం చేస్తున్నారని విమర్శించారు. సోదర సమానులైన కరుణానిధి లాంటి రాజకీయ మేధావి పరిహాసానికి గురి కాకూడదన్నదే తన అభిమతంగా పేర్కొన్నారు. అయితే ఆయన తెలిసో, తెలియకనో డీఎండీకే తమ వైపే.. తమ వైపే అంటూ పదే పదే వ్యాఖ్యానిస్తూ గందరగోళాన్ని సృష్టిస్తున్నారని విమర్శించారు. నిన్నటి రోజు కూడా దోపిడీ ముఠాతో పొత్తు ప్రసక్తే లేదని విజయకాంత్ స్పష్టం చేసి ఉంటే, ఇప్పుడేమో ఆయన వస్తారన్న నమ్మకాన్ని కరుణానిధి వల్లించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. -
జయ రాజీనామా చేయాలి
టీనగర్: రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించిందని, అందువల్ల ముఖ్యమంత్రి జయలలిత పదవికి రాజీనామా చేయాలని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో డిమాండ్ చేశారు. అరియలూరులో ఏర్పాటుచేసిన సమావేశంలో వైగో మాట్లాడుతూ చెన్నై వరదలకు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని దీంతో అధిక నష్టం ఏర్పడిందన్నారు. అందువల్ల జయ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. రాష్ట్రంలో 65 శాతం మంది ప్రజలు ఏ పార్టీకి చెందని వారుగా ఉన్నారని, వీరంతా మక్కల్ నలకూట్టనికి మద్దతుగా నిలుస్తారన్న నమ్మకంతో వున్నట్లు తెలిపారు. ప్రధాని మోడీ పాకిస్తాన్ పర్యటన స్వాగతించాల్సిన విషయం అన్నారు. దీనిని రాజకీయం చేయడానికి ఇష్టపడడం లేదన్నారు. తమ పార్టీ అనేక డిమాండ్ల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఖండిస్తూ చెన్నైలో ఈ నెల 31వ తేదీన ఆందోళన జరపనున్నామని, జనవరి 22,23,24 తేదీల్లో మక్కల్ నలకూట్టనికి చెందిన నలుగురు పార్టీల నేతలతో ప్రచారం సాగిస్తామన్నారు. 27న మక్కల్ నలకూట్టని కార్యాచరణ పథకాన్ని వివరిస్తూ మహానాడును మదుైరె లో జరుపనున్నట్లు తెలిపారు. స్తంభించిన పాలన: ఈవీకేఎస్ ఇళంగోవన్ వరదల్లో చిక్కుకుని ప్రజలు అవస్థలు పడుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగా పనిచేయలేదని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఎస్ ఇళంగోవన్ విమర్శించారు. విల్లుపురం జిల్లా, కన్నదాసన్ సేవా సంఘం ధ్వర్యంలో కవి కన్నదాసన్ 13వ వార్షికోత్సవం శనివారం జరిగింది. మనసులో తోచిన విషయాన్ని యథార్థంగా మాట్లాడేవారిలో తందై పెరియార్, తన తండ్రి సంపత్, కన్నదాసన్ ఉన్నారని అన్నారు. ఇటీవల వరదల్లో వేలాది మంది మృతిచెందారని, అనేక మంది నిరాశ్రయులయ్యారని అన్నారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేయకుండా నిర్జీవ స్థితిలో ఉండిపోయిందని విమర్శించారు. వచ్చే ఏడాది కన్నదాసన్ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటామని, ఆ సమయంలో అన్నాడీఎంకే ప్రభుత్వం ఉండదని, వేరొక మంచి పాలన వస్తుందని జోస్యం చెప్పారు. అన్నాడీఎంకే కథ ముగుస్తుంది: రాందాస్ ఆస్తులు కూడబెట్టిన కేసులో తీర్పు వచ్చిన సమయంలో అన్నాడీఎంకే కథ ముగుస్తుందని పీఎంకే వ్యవస్థాపకులు డాక్టర్ రాందాస్ తెలిపారు. తూత్తుకుడిలో వరద బాధిత ప్రాంతాలు రహమత్ నగర్, ముత్తమ్మాల్ కాల నీలను రాందాస్ సందర్శించారు. ఆయన మాట్లాడు తూ వరద బాధితులను అధికార పార్టీ, రాష్ట్ర అధికారు లు ఆదుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. త్వరలో అన్నాడీఎంకే కథ ముగుస్తుందని తెలిపారు. -
మాతృభాషల్లో ఐఐటీ
చెన్నై: తమిళం, తెలుగు, కన్నడం తదితర విద్యార్థులు వారివారి మాతృ భాషల్లో ఐఐటీ ప్రవేశ పరీక్షలు రాసుకునేందుకు అవకాశం కల్పించాలని కేంద్రాన్ని ఎండీఎంకే కార్యవర్గం డిమాండ్ చేసింది. ఈ మేరకు తీర్మానం చేశారు. ఎన్నికల కసరత్తుకు శ్రీకారం చుడుతూ సోమవారం పార్టీ కార్యవర్గం, అనుబంధ విభాగాల కార్యవర్గాలతో వైగో మంతనాల్లో మునిగారు. ప్రజా కూటమికి నేతృత్వం ఎవరన్న అంశంపై, తమకు పట్టున్న స్థానాల ఎంపికపై నేతల అభిప్రాయాల్ని సేకరించారు. ఎగ్మూర్‌లోని తాయగంలో ఎండీఎంకే రాష్ట్ర కార్యవర్గం, అనుబంధ విభాగాల కార్యవర్గాల సమావేశం పార్టీ ప్రిసీడి యం చైర్మన్ తిరుపూర్ దురై స్వామి అధ్యక్షతన జరిగింది. రాష్ర్ట వ్యాప్తంగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులతో కలిసి రానున్న అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు తగ్గ వ్యూహాల్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వైగో రచించారని చెప్పవచ్చు. ప్రజా కూటమికి ఎవరు నేతృత్వం వహించాలన్న అంశంపై పార్టీ వర్గాలతో సమాలోచించడమే కాకుండా, తమకు పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాల మీద దృష్టి పెట్టి ఉన్నారు. ఆయా స్థానాల్ని ప్రజా కూటమిలో సీట్ల పందేరం సమయంలో చేజిక్కించుకోవడంతో పాటుగా, ఆయా ప్రాంతాల్లో పార్టీ తరఫున పోటీకి సిద్ధంగా ఉన్న నాయకులు, ప్రజా బలం, ఆర్థిక బలం కల్గిన వారి వివరాలను ఆరా తీసినట్టు సమాచారం. ఆయా స్థానాల్లో ఇప్పటి నుంచే కార్యక్రమాల్ని విస్తృతం చేయడం కోసం వ్యూహాల్ని రచించి ఇచ్చి ఉన్నారు. ప్రజా కూటమిలోకి డీఎండీకే నేత విజయకాంత్ వచ్చిన పక్షంలో ఆయన్ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే వచ్చే లాభనష్టాల మీద పార్టీ వర్గాల అభిప్రాయాల్ని వైగో స్వీకరించినట్టు తెలిసింది. ఈ సమావేశం అంతా రానున్న ఎన్నికల్ని టార్గెట్ చేసి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజా కూటమికి నేతృత్వం వైపుగా సాగినా, చివరకు తాము తీసుకున్న కొన్ని నిర్ణయాలు, చేసిన తీర్మానాలను మీడియాకు ఆ పార్టీ కార్యాలయం ప్రకటించింది. మాతృభాషల్లో పరీక్ష: ఐఐటీ ప్రవేశ నిమిత్తం తమిళం, తెలుగు, కన్నడం తదితర 22 భాషలకు చెందిన విద్యార్థులు వారి వారి మాతృభాషల్లో పరీక్షలు రాసుకునేందుకు అనుమతి కల్పిస్తూ కేంద్రం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెంబరంబాక్కం నీటి విడుదలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, తమిళనాడులో నెలకొన్న పరిణామాలను జాతీయ విపత్తుగా ప్రకటించి,ప్రజల్ని ఆదుకునేందుకు రూ.50 వేల కోట్లను కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. హైకోర్టు సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నది పరివాహక, చెరువులు తదితర ప్రాంతాల్లోని ఆక్రమణలను ఆగమేఘాలపై తొలగించాలని డిమాండ్ చేశారు. జల్లికట్టుకు త్వరితగతిన అనుమతి మంజూరు చేయాలని, అందుకు తగ్గ చర్యల్ని కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాలు వేగవంతం చేయాలని కోరారు. -
వైగోకు అస్వస్థత
సాక్షి, చెన్నై : ఎండీఎంకే నేత వైగో అస్వస్థతకు లోనయ్యారు. ప్రథమ చికిత్స అనంతరం ఆయన మళ్లీ తన పర్యటనను కొనసాగించే పనిలో పడ్డారు. మంగళవారం వళ్లువర్ కోట్టం వేదికగా భారీ నిరసన కార్యక్రమానికి రెడీ అవుతున్నారు. బీజేపీ కూటమి నుంచి బయటకు వచ్చిన ఎండీఎంకే నేత వైగో ప్రజా మద్దతు సేకరణలో మునిగారు. డెల్టా జిల్లాల్లో అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలను అస్త్రంగా చేసుకున్నారు. కర్ణాటక సరిహద్దుల్లో డ్యాంల నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్ని ఖండిస్తూ, కావేరి నది తీరాల్లో మిథైన్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ ప్రజల్లో చైతన్యం తెచ్చే పనిలో నిమగ్నం అయ్యారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు నినాదంతో ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తున్నారు. పది రోజులకు పైగా ఆయన తంజావూరు, తిరువారూరు, నాగపట్నం జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఆదివారం రాత్రి నాగపట్నంలో జరిగిన సభలో ఏక ధాటిగా రెండు గంటల సేపు ప్రసంగించారు. తనకు సీఎం పదవి మీద ఆశ, వ్యామోహం లేదని, తాను సేవకుడిని మాత్రమేనని, ప్రజల కోసం తాను శ్రమిస్తున్నానని వ్యాఖ్యానించారు. ఈ సభను ముగించుకుని తిరువారూర్‌లోని ఓ గెస్ట్ హౌస్‌లో బస చేశారు. అస్వస్థత : అర్ధరాత్రి సమయంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారు. కడుపు నొప్పి తీవ్రం గా ఉండడంతో అందుకు తగ్గ మాత్రలు వేసుకుని విశ్రాంతి తీసుకున్నారు. సోమవారం వేకువజామున కడుపు నొప్పి తీవ్రత మరింత పెరగడం, మనిషి నీరసించిపోయూరు. ఆస్పత్రికి వెళ్లేదిలేదని ఆయన మారం చేయడంతో అక్కడికే వైద్యుల్ని రప్పించారు. ప్రథమ చికిత్స చేశారు. కాసేపటికి వైగో కోలుకున్నప్పటికీ, విశ్రాంతి తప్పదని వైద్యులు హెచ్చరించారు. అందుకు నిరాకరించిన వైగో తన ప్రచారాన్ని మళ్లీ మొదలెట్టారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూ ల్ మేరకు ఆయా గ్రామాల్లో ప్రజలు తన కోసం ఎదురు చూస్తుంటారని, తాను వెళ్లాల్సిందేని ముందుకు కదిలా రు. ఆయనకు ఎలాంటి ఇబ్బంది కల్గకుండా సాయంగా ఒకరిద్దరు వైద్యులు వెంట వెళ్లారు. రాత్రి పర్యటన ముగిం చుకుని మంగళవారం ఉదయం చెన్నైకు వైగో చేరుకోవాల్సి ఉంది. వళ్లువర్‌కోట్టం వేదికగా జరిగే నిరసన సభకు ఆయన నేతృత్వం వహించనున్నారు. -
ఎన్డీఏ సర్కారు నుంచి వైదొలగిన ఎండీఎంకే
చెన్నై: వైగో నేతృత్వంలోని ఎండీఎంకే పార్టీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వైదొలగింది. సోమవారం జరిగిన పార్టీ సమావేశంలో ఎండీఎంకే ఒక తీర్మానం చేసింది. శ్రీలంకకు అనుకూలంగా మోదీ సర్కారు వ్యవహరిస్తున్న తీరును నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడుతో కేరళ, కర్ణాటక జలవివాదాల్లో కేంద్రం వైఖరిపైనా ఎండీఎంకే గుర్రుగా ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమితో కలసి ఎండీఎంకే పయనం సాగించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీతో జత కట్టిన తొలిపార్టీ ఎండీఎంకే కావడం గమనార్హం. ఎండీఎంకే వైదొలగడం సంతోషించదగ్గ పరిణామం కాదని కేంద్ర మంత్రి రాధాకృష్ణన్ వ్యాఖ్యనించారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. -
నాది ద్రోహమా?
సాక్షి, చెన్నై: పీఎంకే నేత రాందాసు ఇంటి వివాహ వేడుక వేదికగా సాగిన ఆసక్తికర పరిణామాలు డీఎంకే బహిష్కృత నేత అళగిరికి ఆగ్రహాన్ని తెప్పించాయి. తాను కలిస్తే ద్రోహం-వాళ్లు కలిస్తే స్నేహమా అంటూ శుక్రవారం డీఎంకే అధిష్టానంపై అళగిరి విరుచుకు పడ్డారు. డీఎంకే నుంచి ఎంకే అళగిరి బహిష్కరణకు గురైన విషయం తెలిసిందే. తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలతో అళగిరి తెర మీదకు రావడం పరిపాటే. లోక్‌సభ ఎన్నికల సమయంలో అళగిరి, ఎండీఎంకే నేత వైగోలు కలిసిన వేళ డీఎంకే వర్గాలు తీవ్రంగానే స్పందించాయి. అళగిరిని ద్రోహిగా పేర్కొంటూ మండిపడ్డాయి. గతంలో శత్రువుగా ఉన్న వైగోను మిత్రుడిగా మార్చుకునేందుకు డీఎంకే పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. డీఎంకేను రెండుగా చీల్చిన వైగో ఓ మారు ఎన్నికల సమయంలో ఆ పార్టీతో కలిసినా, ఆ బంధం ఎక్కువ రోజులు సాగలేదు. ప్రస్తుతం 2016లో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న డీఎంకే, ఎండీఎంకే బలాన్ని తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో పడింది. అలాగే, పీఎంకేను సైతం తమతో కలిసి నడిపించే రీతిలో కార్యాచరణను సిద్ధం చేసే పనిలో పడింది. నేను ద్రోహి...వాళ్లు మిత్రులు: తన వ్యూహాల అమలు లక్ష్యంగా కరుణ చేస్తున్న ప్రయత్నాలకు పీఎంకే నేత రాందాసు ఇంటి వివాహ వేడుక కలిసి వచ్చింది. ఆ వేడుకలో పొగడ్తల పన్నీరును పాతమిత్రులు చల్లుకున్నారు. ఒకరినొకరు కరచాలనంతో పలకరించుకున్నారు. ఇక, డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్, ఎండీఎంకే నేత వైగోలు చెప్పనక్కర్లేదు. పాత స్నేహాన్ని గుర్తుకు తెచ్చుకున్నట్టుగా వ్యవహరించారు. ఒకే విమానంలో మదురైకు సైతం బయలుదేరి వెళ్లారు. ఇంత వరకు బాగానే ఉన్నా, ఈ పరిణామాలన్నీ బహిష్కృత నేత అళగిరిలో ఆగ్రహాన్ని రేపాయి. తనకో న్యాయం....వారికో న్యాయమా అని విరుచుకు పడ్డారు. శుక్రవారం మదురైలో ఓ మీడియాతో మాట్లాడిన అళగిరి తీవ్రంగానే స్పందించారు. వారికి వద్దనుకుంటే ద్రోహం, కావాలనుకుంటే మిత్ర బంధం అని మండి పడ్డారు. వైగోను తాను కలిస్తే, అదో పెద్ద ద్రోహం అన్నట్టు చిత్రీకరించారని, ఇప్పుడు స్టాలిన్ చేసిందేమిటో మరి అని ప్రశ్నించారు. వైగోను కలిసిన తాను ద్రోహి అయినప్పుడు, ఆయన మాత్రం ఎలా మిత్రుడు అవుతాడోనని వ్యంగ్యాస్త్రం సంధించారు. ఈ పరిణామాలు చూస్తుంటే, రాజకీయాలు ఎటు వెళ్తున్నాయోనన్న విస్మయం కలుగుతోందన్నారు. గోపాలపురానికి వైగో: ఓ వైపు అళగిరి విమర్శలు గుప్పించే పనిలో పడితే, మరో వైపు గోపాలపురం మెట్లు ఎక్కేందుకు వైగో సిద్ధం అవుతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఎండీఎంకే వస్తే ఆహ్వానిస్తామని కరుణానిధి చేసిన వ్యాఖ్యలు వైగోను పులకింతకు గురి చేసినట్టుగా పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. డీఎంకేకు తాను చెడు తలబెట్టినా, తనకు కరుణానిధి మాత్రం మంచే చేశారన్న భావనలో ఉన్న వైగో, త్వరలో పూర్వపు తన అధినేతను కలుసుకునేందకు ఉవ్విళ్లూరుతున్నట్టుగా ఎండీఎంకేలో చర్చ సాగుతోంది. మరికొద్ది రోజుల్లో కరుణానిధి నివాసం గోపాలపురం మెట్లు ఎక్కడం లక్ష్యంగా కార్యాచరణను వైగో సిద్ధం చేసుకుంటున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటుండటం గమనార్హం. -
తమిళనాట కొత్త రాజకీయ సమీకరణాలు
-
నిద్రపోతున్న సింహాన్ని రెచ్చగొట్టద్దు
-
నిద్రపోతున్న సింహాన్ని రెచ్చగొట్టద్దు
'నిద్ర పోతున్న సింహాన్ని అనవసరంగా రెచ్చగొట్టద్దు' అంటూ కేంద్ర ప్రభుత్వానికి ఎండీఎంకే నాయకుడు వైగో తీవ్ర హెచ్చరికలు పంపారు. ప్రభుత్వ సోషల్ మీడియా ఖాతాలలో హిందీని తప్పనిసరిగా వాడాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలపై తమిళనాట బీజేపీ మిత్రపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. బీజేపీకి మిత్రపక్షాలుగా ఉన్న పీఎంకే, ఎండీఎంకే రెండూ కూడా.. బీజేపీ వైఖరిని తప్పుబట్టాయి. అందులో భాగంగానే ఎండీఎంకే నాయకుడు వైగో ఈ వ్యాఖ్యలు చేశారు. హిందీని రుద్దాలన్న నిర్ణయించడాన్ని తమిళనాడు ఎప్పటికీ ఆమోదించదని, గతంలో కూడా రక్తమోడ్చి తాము హిందీపై పోరాడామని, ఇప్పుడు మళ్లీ రెచ్చగొట్టద్దని ఆయన అన్నారు. పీఎంకే నాయకుడు ఎస్ రాందాస్ కూడా హిందీ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు. హిందీ అధికారభాష కాబట్టే దాన్ని అందరిపై రుద్దుతున్నారని, దీనికి పరిష్కారంగా దేశంలోని మొత్తం 22 భాషలనూ అధికార భాషలుగా ప్రకటించాలని ఆయన చెప్పారు. -
పదవులు వద్దు
- నా వారసుడు పార్టీలోకి రాడు - ప్రధాని మోడీకి విధేయులం - స్పష్టం చేసిన వైగో సాక్షి, చెన్నై: తనకు రాజ్యసభ పదవి వద్దే వద్దని, తన వారసుడు రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని ఎండీఎంకే నేత వైగో తేల్చారు. ఆ పార్టీ ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు చర్చలు సాగారుు. ప్రధాని నరేంద్ర మోడీకి విధేయతను చాటుకుని ఈలం తమిళుల సంక్షేమం లక్ష్యంగా మరో ఉద్యమానికి సిద్ధమవుదామని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఒకప్పుడు డీఎంకేలో ఏర్పడ్డ చీలికతో ఆవి ర్భవించిన పార్టీ ఎండీఎంకే. వైగో నేతృత్వంలోని ఈ పార్టీలోకి అప్పుడు డీఎంకే నుంచి పెద్ద సంఖ్యలో వలసలు వచ్చారు. పార్టీలో ఒకప్పుడున్న ముఖ్య నాయకుల్వెరూ ఇప్పుడు లేరు. అయినా డీలా పడకుండా పార్టీని వైగో నెట్టుకొస్తూ ఉన్నారు. అనివార్య కారణాలతో అసెంబ్లీ ఎన్నికలు బహిష్కరించినా, లోక్ సభ ఎన్నికల ద్వారా తన ఉనికి చాటుకునే యత్నం చేశారు. డిపాజిట్లు గల్లంతైనా, తన పయ నం మాత్రం ఆగదంటూ, ప్రజల పక్షాన ఏ విధంగా నిలబడి గతంలో ఉద్యమాలు చేశారో, దాన్ని కొనసాగించేందుకు వైగో సిద్ధం అయ్యారు. ఎన్నికల సమయంలో బీజేపీ తమకు వ్యక్తిగతంగా ఇచ్చిన హామీ లు, కుదుర్చుకున్న ఒప్పందాల అమలుపై పట్టు విడుపుగా ముందుకెళ్లేందుకు వైగో నిర్ణయించారు. అలాగే, ప్రధా ని మోడీకి విధేయతను చాటుకునే పనిలో పడ్డారు. ఉన్నత స్థాయి భేటీ: తాయగంలో గురువారం జిల్లా, డివిజన్, పార్టీ సలహా కమిటీ, రాష్ట్ర కమిటీ సమావేశాన్ని వైగో ఏర్పాటు చేశారు. రాత్రి ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో ప్రధానంగా పార్టీ భవిష్యత్ కార్యాచరణ గురించి మాత్ర మే చర్చించారు. ఎన్నికల వేళ పొత్తు కుదుర్చునే సమయంలో బీజేపీ ఇచ్చిన హామీలపై పట్టుబడదామని కొందరు నేతలు వాదించినా, వాటిని వైగో తిరస్కరించడం విశేషం. ఎన్నికల్లో ఓడిన తనకు రాజ్యసభ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నా, పుచ్చుకునేందుకు తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశారు. ఏదో ఒక రాష్ట్రం తరపున రాజ్యసభకు వెళ్లి, ఆ రాష్ట్రానికి అనుకూలంగా మాట్లాడాల్సిన అవసరం తనకు లేదని తేల్చి చెప్పారు. తనకు ఏ పదవులూ వద్దు అని, ఈలం తమిళుల సంక్షేమం, తమిళుల అభ్యున్నతి కోసం ప్రధాని మోడీతో కలసి పనిచేద్దామని, విధేయతను చాటుకుందామని సూచించారు. అవసరం అయితే, తమిళుల కోసం మరో ఉద్యమాన్ని చేపట్టి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొద్దామని వివరించినట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలాన్ని పుంజుకుని రాష్ట్రంలో సత్తాను చాటుకుందామని, ఇందుకు ప్రతి ఒక్కరూ రెండేళ్లు మరింతగా శ్రమించాలని పిలుపు నిచ్చారు. వారసుడు రాడు: ఎండీఎంకే నేత వైగో కుమారుడు దురై వయ్యాపురి. తండ్రికి సహకారంగా తరచూ కొన్ని కార్యక్రమాల్లో ఈయన కన్పిస్తుంటారేగానీ ప్రత్యక్ష రాజకీయల్లోకి రాలేదు. పార్టీలో ఎలాంటి జోక్యం ఉండదు. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో విరుదునగర్‌లో క్రియాశీలక పాత్రను దురై వయ్యాపురి పోషించారు. దీంతో ఎండీఎంకేలోకి వారసుడొస్తున్నాడంటూ ప్రచారం ఊపందుకుంది. ఎండీఎంకే యువజన పగ్గాలు చేపట్టబోతున్నారని, వైగో తర్వాత ఆ పార్టీకి దురై వయ్యాపురి నేతృత్వం వహిస్తారన్నట్టుగా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీటన్నింటికీ ముగింపు పలికే విధంగా ఉన్నత స్థాయి భేటీలో వైగో స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారు. వయ్యాపురిని రాజకీయాల్లోకి తీసుకురావాలంటూ కొందరు నేతలు ఇచ్చిన సూచనకు స్పందించిన వైగో, వయ్యాపురికి రాజకీయాలపై ఆసక్తి లేదని స్పష్టం చేశారు. విరుదునగర్‌లో తాను పోటీ చేసిన దృష్ట్యా, తనకు మద్దతుగా ప్రజల్లోకి వయ్యాపురి వచ్చాడేగానీ రాజకీయాల్లోకి రావాలన్న తలంపుతో మాత్రం కాదని వివరించారు. తన వారసుడు రాజకీయాల్లోకి వచ్చే ప్రసక్తే లేదని, తన కుటుంబానికి చెందిన వాళ్లెవరూ రారంటూ, ఎండీఎంకే కుటుంబ పార్టీ కాదన్న విషయాన్ని గుర్తుంచుకోండంటూ పరోక్షంగా డీఎంకేను ఎత్తి చూపుతూ వ్యాఖ్యలు చేసినట్టుగా ఆపార్టీ వర్గాలు పేర్కొంటుండటం గమనార్హం. -
శ్రీలంక అధ్యక్షుడికి వ్యతిరేకంగా వైకో నిరసన
న్యూఢిల్లీ: మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సకు నిరసన తెలిపేందుకు యత్నించిన ఎండీఎంకే చీఫ్ వైకోను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఆయన పార్టీకి చెందిన దాదాపు వంద మంది కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఇక్కడి పార్లమెంట్ స్ట్రీట్‌లోకి వచ్చిన ఎండీఎంకే కార్యకర్తలు శ్రీలంక జాతీయ జెండాతో పాటు రాజపక్స ఫొటోలతో కూడిన బ్యానర్లను తగులబెట్టారు. ఎన్డీయే భాగస్వామిగా ఉన్న ఎండీఎంకే.. రాజపక్సకు ఆహ్వానం పలకడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీలంకలో తమిళుల హక్కులను అధ్యక్షుడు కాలరాశాడని వైకో ధ్వజమెత్తారు. రాజపక్స హాజరవడం వల్ల మోడీ ప్రమాణ స్వీకారోత్సవం పవిత్రత దెబ్బతింటుందని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీలంక విషయంలో యూపీఏ బాటలో ఎన్డీయే సాగవద్దని సూచించారు. -
నల్ల జెండాలతో వైగో నిరసన, అరెస్ట్!
న్యూఢిల్లీ: నరేంద్రమోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవుతున్న శ్రీలంక అధ్యక్షుడు మహీంద్ర రాజపక్స పర్యటనకు నిరసనగా దేశరాజధానిలో ఆందోళన చేపట్టిన ఎండీఎంకే చీఫ్ వైగోను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. జంతర్ మంతర్ లో నల్ల జెండాలతో కార్యక్రమంలో వైగో నిరసన కార్యక్రమాలను నిర్వహించడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళుల ఊచకోతకు కారణమైన రాజపక్సను ఆహ్వానించడాన్ని వైగో వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. రాజపక్సను ఆహ్వనించిన నిర్ణయంపై నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ ను పునఃసమీక్షించుకోవాలని వైగో కోరారు. ఏబీ వాజ్ పేయి ప్రమాణస్వీకార కార్యక్రమానికి శ్రీలంక అధ్యక్షుడిని ఆహ్వానించలేదనే విషయాన్ని వైగో గుర్తు చేశారు. రాజపక్స ను ఆహ్వనించడంపై విచారం వ్యక్తం చేస్తూ మోడీకి వైగో లేఖ రాసిన సంగతి తెలిసిందే. రాజపక్స రావడాన్ని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి, తమిళనాడు ముఖ్యమంత్రి జే. జయలలిత లు కూడా వ్యతిరేకిస్తున్నారు. -
ఎన్ డీఏకు 320, బీజేపీకి 272 సీట్లు ఖాయం: వైగో
ధర్మపురి: రానున్న లోకసభ ఎన్నికల్లో ఎన్ డీఏకు 320 సీట్లు ఖాయమని ఎండీఎంకే నేత వైగో జోస్యం చెప్పారు. తమిళనాడుతోసహా దేశమంతా మార్పును కోరుతున్నారని వైగో తెలిపారు. ప్రజా వ్యతిరేక పార్టీలు కాంగ్రెస్, డీఎంకే, ఏఐఏడీఎంకే పార్టీలను ఓటర్లు పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో మాజీ మంత్రి, పీఎంకే అభ్యర్థి అంబుమణి రాందాస్ విజయానికి ప్రచారం చేపట్టిన ఆయన మాట్లాడుతూ..బీజేపీ ఒంటరిగానే 272 సీట్లు గెలుచుకుంటుంది అని అన్నారు. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా మోడీ హవా కొనసాగుతోందని వైగో అన్నారు. ప్రధాని కావాలని కలలుకంటున్న జయలలిత కలలు కలలుగానే మిగిలిపోతాయని ఆయన ఎద్దేవా చేశారు. -
కూటమి ఖరారు
బీజేపీ జాబితా విడుదల 25 స్థానాలు ఖాయమని పార్టీ ధీమా ఒకే వేదికపై రాజ్‌నాథ్, విజయకాంత్, వైగో, అన్బుమణి రాందాస్ చెన్నై, సాక్షి ప్రతినిధి: భారతీయ జనతా పార్టీలో సీట్ల కేటాయింపులో ఏర్పడిన విభేదాలు తొలగిపోయి ఎట్టకేలకు కూటమి ఖరారైంది. సాక్షాత్తు పార్టీ జాతీయ అధ్యక్షుడు రంగంలోకి దిగడంతో అభ్యర్థుల జాబితా గురువారం విడుదలైంది. రాష్ట్రంలోని ఇతర పార్టీలతో పోల్చుకుంటే ఓటు బ్యాంకు ఉన్న ప్రాంతీయ పార్టీలతో బీజేపీ బలమైన కూటమిగా ఏర్పడింది. అయితే అదే స్థాయిలో తలనొప్పులకు కారణమైంది. ఎవరికి వారు ప్రతిపక్ష పార్టీలుగా చలామణి అవుతున్న డీఎండీకే, ఎండీఎంకే, పీఎంకేలు బీజేపీ కూటమిలో చేరడం ద్వారా మిత్రపక్షాలుగా మారిపోక తప్పలేదు. కూటమి ధర్మం ప్రకారం మిత్రులైనా పాత వైరుధ్యాలను పక్కన పెట్టలేకపోయిన ఆ పార్టీ నేతలంతా సీట్ల కోసం పట్టుపట్టారు. ఒకరు కోరిన స్థానాన్ని మరొకరు కోరడమే కాదు, చివరికి బీజేపీ ఎంచుకున్న స్థానాల కోసం సైతం పట్టుపట్టారు. డీఎండీకే అధినేత విజయకాంత్ కూటమిలో చేరడానికే ముప్పుతిప్పలు పెట్టారు. ఆపై సీట్ల కోసం పట్టుబట్టారు. ఒక దశలో కూటమి చీలిపోతుందని, పీఎంకే,కూటమి ఖరారు డీఎండీకేలు వైదొలగిపోతాయనే ప్రచారం జరిగింది. మిత్రులకు నచ్చజెప్పేందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మురళీధర రావు, జాతీయ నేత ఇల గణేశన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 10 రోజుల క్రితమే వెల్లడి కావాల్సిన జాబితా వాయిదాపడుతూనే వచ్చింది. సారొచ్చారు పోలింగ్‌కు నెల రోజులుండగా బీజేపీ కూటమి జాబితాలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలగకపోవడంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ రంగంలోకి దిగారు. గురువారం ఉదయం చెన్నైకి చేరుకున్న రాజ్‌నాథ్ వచ్చీ రాగానే మిత్రపక్షాలను బుజ్జగించే పనిలో పడ్డారు. విజయకాంత్, వైగో, అన్బుమణి రాందాస్‌లతో వేర్వేరుగా చర్చలు జరిపారు. స్వల్ప వ్యవధిలోనే అందరి మధ్య సఖ్యత సాధ్యమవుతుందని ఆశించిన రాజ్‌నాథ్ సింగ్‌కు కూటమి మిత్రులు చుక్కలు చూపించారు. సీట్ల ఖరారు చేసుకుని 12 గంటలకు ఏర్పాటు చేసుకున్న మీడియా సమావేశంలో వెల్లడి చేయాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. మీడియా వారు అరగంట ముందుగానే అంటే 11.30 గంటలకే చేరుకోగా ప్రతి అరగంటకు ఒకసారి పొడిగిస్తూ వచ్చారు. ఆ తరువాత అందరూ భోజనాలు చేసి రండని ప్రకటించారు. మిత్రులతో చర్చలు కొలిక్కిరాకపోవడమే మీడియా సమావేశం గంటలకొద్దీ వాయిదాకు కారణమని వేరే చెప్పక్కర్లేదు. సాయంత్రం 4 గంటలు దాటుతుండగా రాజ్‌నాథ్ సింగ్ వచ్చి మీడియాతో మాట్లాడారు. 25 స్థానాల్లో గెలుపు ఖాయం బీజేపీ నేతృత్వంలో రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఏర్పడిన బలమైన కూటమి అభ్యర్థులు 25 స్థానాల్లో గెలుపొందడం ఖాయమని రాజ్‌నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ మరో రెండుసార్లు తమిళనాడులో పర్యటిస్తారని చెప్పారు. తమిళనాడు ప్రజల సమస్యలను, ముఖ్యంగా శ్రీలంక, తమిళ జాలర్ల వివాదాన్ని యూపీఏ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు. ఎన్డీఏ అధికారంలోకి రాగానే ఇక్కడి సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తుందని హామీ ఇచ్చారు. బీజేపీ పాలనలో ఒక్క తమిళనాడు మాత్రమే కాదు దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు తీరుతాయని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఒక పెద్ద కూటమిగా ఏర్పడటం వల్ల మిత్రపక్షాల్లో కొన్ని అసంతృప్తులు సహజమని అన్నారు. అయితే అవన్నీ వైదొలిగాయని, కూటమి అభ్యర్థుల గెలుపుకోసం ప్రతి పార్టీ సహకారాన్ని ఇచ్చిపుచ్చుకుంటుందని చెప్పారు. డీఎండీకే 14, బీజేపీ 8, పీఎంకే 8, ఎండీఎంకే 7, ఐజేకే, కేఎండీకే ఒక్కో స్థానం కేటారుుస్తూ జాబితా ఖరారైందని ఆయన తెలిపారు. తమిళనాడు జాబితాను అధికారికంగా ఆయన విడుదల చేశారు. డీఎండీకే అధినేత విజయకాంత్ తన బావమరిది సుదేష్, ఎండీఎంకే అధినేత వైగో, పీఎంకే యువజన విభాగం అధ్యక్షులు అన్బుమణి రాందాస్ రాజ్నాథ్తోపాటూ వేదికకెక్కడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్ కూడా పాల్గొన్నారు.