- స్టాలిన్‌కు వైగో సవాల్
సాక్షి, చెన్నై
'మిస్టర్ స్టాలిన్ దమ్ముందా....' తాను సంధించే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తావో, కేసులే వేసుకుంటావో, అంటూ ఎండీఎంకే నేత వైగో విరుచుకు పడ్డారు. ఎండీఎంకే నేత వైగో, డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్‌ల మధ్య వారం రోజులుగా మాటల సమరం సాగుతున్న విషయం తెలిసిందే. డీఎంకేను టార్గెట్ చేసి వైగో స్పందిస్తున్న తీరుపై దళపతి స్టాలిన్ తీవ్రంగానే ఎ దురు దాడి చేస్తున్నారు.
తన మీద ఆధార రహిత ఆరోపణలు చేసినందుకుగాను ఏకంగా లీగల్ నోటీసుల్ని సైతం వైగోకు స్టాలిన్ పంపించి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం వైగో మీడియాతో మాట్లాడుతూ స్టాలిన్‌పై కొత్త ఆరోపణలతో పాటుగా మిస్టర్..మిస్టర్ స్టాలిన్ దమ్ముందా...సవాల్ అంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అన్నాడీఎంకే నోట్లతో ఓట్లను రాబట్టే యత్నం చేస్తున్నదని వైగో విమర్శించారు. సిరుదావూర్ బంగళాలో ఉన్న నగదు ఆంధ్రాకు తరలి వెళ్లినట్టుగా, అధికారుల అండతోనే అన్నాడీఎంకే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదంటూ ఆరోపణలు గుప్పించారు. ఇక, డీఎంకే దళపతి స్టాలిన్ తనను టార్గెట్ చేసి నోటీసులు పంపిస్తాడా.? అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాను సంధించే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేని పరిస్థితుల్లో స్టాలిన్ ఉన్నారని ఎద్దేవా చేశారు.
మిథైన్ తవ్వకాల అనుమతి డీఎంకే హయంలో సాగిందని, ఆ సమయంలో స్టాలిన్‌కు ఎన్ని కోట్లు ముట్టిందో బహిర్గతం చేస్తానంటూ వ్యాఖ్యానించారు. కోట్లు దండుకుని అన్నదాతల్ని కడుపు కొట్టిన ఘనత డీఎంకేకు దక్కుతుందని ఆరోపించారు. మిస్టర్ స్టాలిన్ దమ్ముందా..? ఉంటే, మిథైన్ అనుమతుల్లో ఎంత ముట్టిందో ప్రకటిస్తావా, ఆ ఒప్పందాల వెనుక ఉన్న ఆంతర్యానికి సమాధానం ఇస్తావో ఏమోగానీ, కేసులు వేసినా భయ పడను అంటూ తీవ్రంగా వైగో స్పందించారు.