Tamil Nadu Polls
-
జయలలితకు కరుణానిధి హామీ
చెన్నై: తమిళనాడులో ప్రధాన రాజకీయ పార్టీలు డీఎంకే, అన్నాడీఎంకే చీఫ్‌లు బద్ధశత్రువుల్లా ఉంటారు. ఒకరు అధికారంలోకి వస్తే మరొకరిని వేధించడం, జైలుకు పంపిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే డీఎంకే చీఫ్ కరుణానిధి మాత్రం తమ పార్టీ అధికారంలోకి వస్తే జయలలిత సహా ఎవరిపైనా ప్రతీకార చర్యలకు పాల్పడబోమని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో డీఎంకే అధికారంలోకి వస్తే అన్నాడీఎంకే అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలితపై ప్రతీకార చర్యలు చేపట్టబోమని కరుణానిధి చెప్పారు. తాను ప్రతీకారం తీర్చుకుంటానని జయలలిత భయపడాల్సిన అవసరంలేదని అన్నారు. అన్నా తనకు ద్వేష రాజకీయాలు నేర్పలేదని చెప్పారు. తమిళనాడు ఎన్నికల ప్రచారానికి ఆఖరి రోజైన శనివారం ఆయన చింటాడ్రిపేట్లో బహిరంగసభలో పాల్గొన్నారు. డీఎంకేకు అవకాశమివ్వాలని ఓటర్లను కోరారు. 2001లో అర్ధరాత్రి తనను అరెస్ట్ చేయడాన్ని గుర్తుచేస్తూ.. ప్రతీకారం తీర్చుకోవడం అన్నాడీఎంకే స్వభావమని విమర్శించారు. డీఎంకే ఎవరికీ శత్రువు కాదని స్పష్టం చేశారు. తమిళనాడులో సోమవారం ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. -
ఆశీర్వదించండి!
ఐదేళ్ల పాలనను గుర్తుచేసుకోండి రెండాకుల చిహ్నంపై ఓటేయండి అఖండ మెజరిటీతో మళ్లీ గెలిపించండి ఓటర్లకు జయ వేడుకోలు సాక్షి ప్రతినిధి, చెన్నై: అఖండ మెజార్టీతో మరోసారి అన్నాడీఎంకే ప్రభుత్వం ఏర్పడేలా ఆశీర్వదించాలని పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి జయలలిత ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈనెల 16వ తేదీన పోలింగ్ సందర్భంగా ప్రజలకు బహిరంగలేఖ రాశారు. ఆ లేఖ లోని అంశాలు ఆమె మాటల్లోనే యథాతథంగా. ‘గత నెల 9వ తేదీన చెన్నైలో ఎన్నికల ప్రచారం ప్రారంభించి ఈనెల 12వ తేదీన తిరునెల్వేలిలో జరిగిన సభతో ముగించాను. తమిళనాడుతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరీలో నిర్వహించిన సభలు, నడిరోడ్లపై ప్రచార కార్యక్రమాలో ్లసైతం పెద్ద ఎత్తున నన్ను ఆదరించారు. అన్నాడీఎంకే అభ్యర్థులను గెలిపించాల్సిందిగా తాను చేసిన విజ్ఞప్తిని లక్షలాదిగా తరలివచ్చి ఆలకించడంతోపాటు మన స్పూర్తిగా స్వీకరించారు. అన్ని ప్రచార సభల్లోనూ మీరు చూపిన ఆదరణను గమనిస్తే అఖండ మెజార్టీతో అన్నాడీఎంకే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమనే నమ్మకం కలుగుతోంది. మీ అభిమానం, ఆదరణకు మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎంజీ రామచంద్రన్ రూపకల్పన రెండాకుల గెలుపు చిహ్నంపై ఓటు వేసి తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో అన్నాడీఎంకేను గెలిపించండి. అలాగే పుదుచ్చేరీలోని 30 నియోజకవర్గాల్లో , కేరళలోని ఏడు నియోజకవర్గాల్లో అపూర్వమైన మెజార్టీని కట్టబెట్టాలని కోరుకుంటున్నాను. అన్ని నియోజకవర్గాల్లోనూ మీ అభిమాన సహోదరి (జయలలిత) పోటీ చేస్తున్నట్లుగా భావించి ఓటువేస్తారనడంలో సందేహం లేదు. 2006 నుండి 2011 వరకు రాష్ట్రాన్ని, కొన్నాళ్లు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండిన ఆ పార్టీ 2జీ కుంభకోణం, కట్టపంచాయతీలతో శాంతి భద్రతల సమస్యను సృష్టించింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సాగిన భూకబ్జా రౌడీరాజ్యాన్ని తలపించడాన్ని ప్రజలు అంత సులభంగా మరిచిపోలేరు. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఉన్న తమ పలుకుబడిని ఉపయోగించి కరుణానిధి ఆయన కుటుంబ సభ్యులు అన్ని శాఖలను తమ వశం చేసుకుని యువతకు దక్కాల్సిన అవకాశాలను తన్నుకుపోయిన సంగతి మీరు మరిచిపోలేదని భావిస్తున్నాను. 2011లో మీ చలువ వల్ల అధికారం చేపట్టిన నేను డీఎంకే ప్రభుత్వం హయాంలో సాగిన చట్టవిరోధ చర్యలను సమూలంగా నిర్మూలించాను. రాష్ట్రంలో మళ్లీ శాంతి భద్రతలను పునరుద్ధరించాను. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు భరోసా కల్పించాను. విద్యుత్ కోతలతో చీకట్లో మగ్గిపోతున్న రాష్ట్రానికి మిగులు విద్యుత్‌తో వెలుగు తెచ్చాను. అన్నాడీఎంకే ప్రభుత్వ పాలనతో తమిళనాడు ప్రజలందరికీ జీవితంపై ఒక కొత్త నమ్మకాన్ని కలిగించాను. ఎట్టి పరిస్థితుల్లోనూ తమిళనాడు ప్రజల హక్కులను కాపాడటంలో వెనుకాడలేదు. ుళనాడుకు జీవాధారమైన కావేరీ, ముల్లైపెరియార్ నదీజలాల కోసం అలుపెరుగని పోరాటం చేసి సుప్రీం కోర్టు ద్వారా సాధించగలిగాను. మహిళలు అన్నిరంగాల్లో తల ఎత్తుకుని సగర్వంగా నిలిచేలా అనేక పథకాలను ప్రారంభించాను. అంతేగాక స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తున్నాను. పోలీస్తోపాటూ అన్ని ఇతర శాఖల్లో పరుల జోక్యానికి తావులేకుండా పూర్తి స్వాతంత్య్రం కల్పించాను. రాష్ట్రంలోని బడుగు, బలహీనవర్గాల ప్రజలు భద్రతతో కూడిన సుఖవంతమైన జీవనం సాగించేలా చేశాను. 2011 లో అధికారం చేపట్టిన తరువాత ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ప్రతి కుటుంబం లబ్దిపొందింది. గత ఐదేళ్లుగా సాధించిన ప్రగతి కొనసాగేలా మేనిఫోస్టో రూపొందించాను. అన్నాడీఎంకే ప్రభుత్వ విజయాలను దృష్టిలో పెట్టుకుని ఈనెల 16వ తేదీన జరుగనున్న పోలింగ్‌లో రెండాకుల చిహ్నంపై ఓటు వేయాల్సిందిగా అభ్యర్దిస్తున్నాను. అలాగే ఎన్నికల ప్రచారం కోసం అహర్నిశలు శ్రమపడిన పార్టీ నేతలు, కార్యకర్తలు ఓటింగ్ రోజున అప్రమత్తంగా మెలిగి పార్టీ విజయానికి దోహదపడాలని కోరుతున్నాను. అలాగే పుదుచ్చేరిలోని 30 స్థానాల్లో అన్నాడీఎంకే అభ్యర్థులకు రెండాకుల చిహ్నంపైనా, కేరళలో పోటీచేస్తున్న ఏడు మంది అన్నాడీఎంకే అభ్యర్థులకు టోపీ చిహ్నంపైనా ఓటువేసి గెలిపించాలని ఆయా రాష్ట్రాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.’ -
జయమ్మపై కనిమొళి ఫైర్!
చెన్నై: డీఎంకే ఎంపీ, కరుణానిధి తనయురాలు కనిమొళి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 2జీ స్పెక్ట్రం కుంభకోణంలో తన పేరు ఉన్నంతమాత్రాన అది రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలుపుపై ప్రభావం చూపెట్టబోదని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 'అవినీతి గురించి జయలలిత మాట్లాడకూడదు. 2జీ స్పెక్ట్రమ్ విషయంలో మమ్మల్ని విమర్శించడానికి ఆమె ఎవరు? ఆమె చాలా కేసుల్లో దోషిగా తేలారు. తాన్ని కేసులో శిక్ష ఎదుర్కొన్నారు' అని కనిమొళి అన్నారు. ఆమె శుక్రవారం చెన్నైలో డీఎంకే తరఫున సుడిగాలి ప్రచారం నిర్వహించారు. మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టుగా ప్రతి ఇంటికి వంద యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని జయలలిత ప్రభుత్వం నెరవేర్చబోదని కనిమొళి విమర్శించారు. 'ఉచిత విద్యుత్ హామీని ఆమె ఎలా నెరవేరుస్తారు. ఆమె ప్రభుత్వమే గత ఐదేళ్లలో విద్యుత్ చార్జీలను పెంచారు. డీఎంకే మ్యానిఫెస్టోను యథాతథంగా కాపీ చేసి.. దానిపై అన్నాడీఎంకే తమ ముఖ్యమంత్రి స్టిక్కర్ ను అతికించింది. అంతుకుమించి అందులో కొత్తదనమేమీ లేదు' అని కనిమొళి మండిపడ్డారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలపై కనిమొళి కనీసం ఆరు నెలలు జైలులో గడిపిన సంగతి తెలిసిందే. -
అధికారం ఇస్తే..
* రాష్ట్ర రూపురేఖలు మార్చేస్తా * తమిళనాట మూడో శక్తిగా కమలం * తమిళ అభివృద్ధే లక్ష్యం * అవినీతి పరులకు శిక్ష తప్పదు * హొసూరు, చెన్నైలలో మోదీ ఎన్నికల ప్రచారం సాక్షి, చెన్నై: తమిళనాట బీజేపీ చేతికి అధికార పగ్గాలు అప్పగిస్తే, కేంద్ర పథకాలు ఒక దాని తర్వాత మరొకటి క్షణాల్లో ఇక్కడ అమలు అవుతాయని, గడపగడపకు చేరుతాయని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. డీఎంకే, అన్నాడీఎంకేలకు ఇన్నాళ్లు ఇక్కడ ప్రత్యామ్నాయం లేదని, అయితే, ఆ శక్తిగా ఇప్పుడు తాము అవతరించామని వ్యాఖ్యానించారు. అవినీతి శక్తుల్ని ఉక్కుపాదంతో అణిచి వేస్తున్నామని, హెలికాప్టర్ల కొనుగోళ్లలో అవినీతి పరులకు శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇక, బీజేపీ కూటమి అభ్యర్థులకు మద్దతుగా శుక్రవారం హొసూరు, చెన్నైలలో నరేంద్ర మోదీ బహిరంగ సభల వేదికగా ప్రచారం సాగించారు. చిన్న పార్టీలతో కలిసి బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయం తమ కూటమి మాత్రమే అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ కమలనాథులు ఓట్ల వేట సాగిస్తున్నారు. అధికార పగ్గాలు చేపట్టడం లేదా, ప్రతినిధుల్ని సభలో అడుగు పెట్టించడం లక్ష్యంగా దూసుకెళుతున్నారు. ఈ నేపథ్యంలో తాను సైతం అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రచార పయనం చేపట్టారు. తొలి విడతగా హొసూరు, చెన్నైలలో జరిగిన ప్రచార సభల ద్వారా ప్రజల్ని ఆకర్షించే ప్రసంగాన్ని సాగించారు. యూపీఏ హయాంలో సాగిన అవినీతి చిట్టాను వివరిస్తూ తీవ్రంగా విరుచుకు పడ్డారు. శిక్ష తప్పదు ముందుగా హొసూరు బహిరంగ సభలో ప్రసంగిస్తూ, నేల బొగ్గులో అవినీతి, యూరియాలో అవినీతి, 2జీలో అవినీతి, హెలికాప్టర్ల కొనుగోలులో అవినీతి.. అబ్బో.. అన్నీ అవినీతి అన్నట్టుగా యూపీఏ పాలన సాగిందని ధ్వజమెత్తారు. తాను అధికార పగ్గాలు చేపట్టాక, అవినీతి శక్తుల్ని ఉక్కపాదంతో అణచి వేస్తూ, అవినీతి రహిత పాలనతో ముందుకు సాగుతున్నామన్నారు. అన్ని వర్గాల సంక్షేమం, అభ్యున్నతిని కాంక్షిస్తూ, నిధుల కేటాయింపులు సాగుతున్నాయని వివరించారు. ఇక, 2జీ, 3జీ...అన్ని జీల అవినీతి కిలాడీలు తమిళనాట నుంచి వచ్చిన వాళ్లే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. హెలికాఫ్టర్ కుంభకోణంలో అవినీతి పరులకు శిక్ష తప్పదని ఈసందర్భంగా హెచ్చరించారు. కేంద్రం లో అధికార పగ్గాలు చేపట్టాక స్టార్టప్, స్టాండప్ , మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా నినాదాలతో ముందుకు సాగుతూ, ముద్రా యోజన పథకంతో అన్ని వర్గాల వారికి రుణాల్ని దారి చేరుస్తున్నామన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా తన ప్రభుత్వం ముందుకు సాగుతున్నదన్న విషయాన్ని ప్రజలు పరిగణించాలని సూచించారు. ఇది వరకు బ్యాంకులు కొందరికే అని, ఇప్పుడు అందరికీ అని వ్యాఖ్యానించారు. బ్యాంక్‌ల వద్దకు వెళ్లేందుకు వెనక్కు తగ్గిన వాళ్లు కూడా ఇప్పుడు దర్జాగా అడుగు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇంకా చెప్పాలంటే, బ్యాంకులే ప్రజల వద్దకు వెళ్తున్నాయని పేర్కొన్నారు. అన్నదాతల సంక్షేమాన్ని కాంక్షిస్తూ, ఎలాంటి ఆటంకాలు లేకుండా యూరియాను వారి దరి చేరుస్తున్నామన్నారు. బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేశామని చెప్పారు. భూమినో, తల్లి నగల్లో అమ్మి దళారుల చేతిలో, అవినీతి పరుల చేతిలో పెట్టి ఏ నిరుద్యోగి మోసపోకుండా ఉండాలన్న కాంక్షతో, ఇక, ప్రతిభకు పట్టం అన్నట్టుగా మార్కుల ఆధారంగా ఉద్యోగాల కల్పనకు చర్యలు చేపట్టామని వివరించారు. మూడో శక్తిగా: మామిడి పండు చేతికి ఇచ్చి కడుపు నింపుకోండి.. అని చేతులు దులుపుకోవడం కాదు అని, మామిడి చెట్టు ఇవ్వడమే కాకుండా, దానికి కావాల్సిన వన్నీ సమకూర్చినప్పుడు లభించే ఫలాలే ప్రజలకు నిజమైన ఆనందాన్ని ఇస్తాయన్నారు. అయితే, ఇది తమిళనాట జరగడం లేదు అని, ఇక్కడ ఎలాంటి ఫలాలు లభించక ప్రజలు తీవ్ర ఆవేదనలో ఉన్నారని వ్యాఖ్యానించారు. ఇందుకు కారణం డీఎంకే, అన్నాడీఎంకేలకు మార్చి మార్చి అధికార పగ్గాలు చేపట్టడమే అని పేర్కొన్నారు. అందుకే అవినీతి ఇక్కడ రాజ్యం మేలుతున్నదన్నారు. ఇన్నాళ్లు ఇక్కడ ప్రత్యామ్నాయం అన్నది లేదని, ఇప్పుడు, ఇక్కడ, మూడో శక్తిగా బీజేపీ అవతరించి ఉన్నదని వ్యాఖ్యానించారు. డిఎంకే , అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించిన బీజేపీని ఆదరించాలని, ఆశీర్వదించాలని పిలుపు నిచ్చారు. తమకు అధికార పగ్గాలు అప్పగిస్తే, క్షణాల్లో ఢిల్లీలోని పథకాలన్నీ, ఇక్కడకు వాలుతాయని, ఒక దాని తర్వాత అన్నీ అమలు చేసి తీరుతామని, గడప గడపకు దరి చేరుస్తామని హామీ ఇచ్చారు. కాగా, మోదీ ప్రసంగిస్తున్న సమయంలో వర్షం పడటంతో, వరుణుడే ఆహ్వానిస్తున్నాడని స్పందించారు. ఈ సమయంలో ఈ హోసూరు మీద నుంచి చెబుతున్నా అంటూ, కమలం చేతికి అధికార పగ్గాలు అప్పగిస్తే తమిళనాడు రూపు రేఖల్ని మార్చేస్తామని ప్రకటించారు. తమిళ అభివృద్ధే లక్ష్యం: శ్రీలంకలోని ఈలం తమిళుల సంక్షేమం కోసం, తమిళ జాలర్ల భ ద్రతను కాంక్షిస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెన్నై వైఎంసీఏ మైదానంలో ప్రసంగించే క్రమంలో మోదీ వ్యాఖ్యానించారు. శ్రీలంకలో ఉరి శిక్ష ఎదుర్కొంటున్న తమిళ జాలర్లను సురక్షితంగా ఇక్కడకు తీసుకు వచ్చింది, తాలిబన్ల చెరలో బందీగా ఉన్న ఫాదర్ ప్రేమను ఇక్కడికి రప్పించి తమ ప్రభుత్వమే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఇక్కడ అధికారం కోసం ఎన్నికలు జరగడం లేదని, తమిళనాడు భవిష్యత్తును, భావి తమిళనాడు నిర్మాణంగా ఎన్నికలు జరుగుతున్నాయన్న విషయాన్ని పరిగణించాలన్నారు. అందుకే ఇది మంచి తరుణం అని, ప్రజలు ఆలోచించి మంచి ఫలితాల్ని ఇవ్వాలని పిలుపు నిచ్చారు. ప్రజల కోసం శ్రమించే ప్రభుత్వం కావా లా...? లేదా, కష్టాల కడలిలో ముంచే ప్రభుత్వం కావాలో..? ఆలోచించుకుని ఓట్లు వేయాలని సూచించారు. ఇక్కడ మోస పూరిత ప్రభుత్వాల్ని చూశారని, ఇక నైనా మంచి నిర్ణయంతో ముందుకు సాగాలని, కేంద్రం పథకాలన్నీ గడప గడపకు వెళ్లాలంటే తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, తమిళంలో వనక్కం అంటూ ప్రసంగాాన్ని మొదలెట్టిన మోదీ, చివరగా తమిళ కవి తిరువళ్లూవర్ సూక్తులతో ముంగించడం విశేషం. -
ఆర్కే నగర్లో జయ.. తిరువరూర్లో కరుణ
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత, మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ కరుణానిధి సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. జయలలిత సిట్టింగ్ స్థానమైన ఆర్కే నగర్ నుంచి మరోసారి బరిలోకి దిగుతున్నారు. పార్టీ నేతలతో కలసి వచ్చిన జయ నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేశారు. కరుణానిధి సొంతూరు తిరువరూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. కొలతూర్ నుంచి పోటీ చేస్తున్న కరుణానిధి కుమారుడు స్టాలిన్ 27న నామినేషన్ వేస్తారు. డీఎండీకే చీఫ్ విజయ్‌కాంత్, ఎండీఎంకే అధ్యక్షుడు వైకో ఈ వారంలో నామినేషన్లు వేయనున్నారు. -
సంక్షేమ కూటమిలో తమాకా
ఎన్నికల పొత్తుపై ఎన్నోపార్టీలతో తర్జన భర్జనలు పడిన తమిళ మానిల కాంగ్రెస్ (తమాకా) ఎట్టకేలకు ప్రజా సంక్షేమ కూటమిలో చేరింది. తమాకా అధ్యక్షుడు జీకే వాసన్ ప్రజా సంక్షేమ కూటమిలో చేరినట్లు ఎండీఎంకే అధినేత వైగో ఆదివారం అధికారికంగా ప్రకటించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్ని పార్టీలు ఏదో ఒక పంచన చేరిపోగా తమాకా వైఖరి ఏమిటో తెలియక అందరూ తలలు పట్టుకున్నారు. ఎక్కువ శాతం మంది ఊహించినట్లుగానే అన్నాడీఎంకేతో పొత్తు చర్చలు సాగాయి. ఎంతో వేగంగా, గోప్యంగా తెరవెనుక సాగిన చర్చలు అంతే వేగంగా బైటకు వచ్చాయి. తమాకా అధినేత కోరినన్ని సీట్లు దక్కకపోవడం, అదికూడా రెండాకుల గుర్తుపై పోటీచేయాలని జయలలిత విధించిన షరతుకు జీకే వాసన్ తలొగ్గలేదు. సీట్ల సంఖ్యను తగ్గించేందుకైనా సుముఖంగా ఉండిన జీకే వాసన్ తమ పార్టీ ఎన్నికల గుర్తై కొబ్బరితోపుపై కాకుండా రెండాకుల గుర్తుపై పోటీచేయడం తమ పార్టీ ఉనికికే భంగకరమని భావించారు. మరో రెండువారాల్లో నామినేషన్లు ప్రారంభం కానుండగా ఇంతవరకు కూటమి ఖరారు కాలేదని తమాకా శ్రేణులు సైతం అసహనం ప్రకటించాయి. ఇదిగో అదిగో అంటూ దాటవేసిన జీకే వాసన్ శనివారం ఉదయం సైతం మీడియా అడిగిన ప్రశ్నలను దాటవేశారు. మధ్యాహ్నం సమయానికి బహిరంగ ప్రకటన ఖాయమని చెప్పారు. సంక్షేమ కూటమిలో సందడి ః సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జీకే వాసన్ తన అనుచర వర్గంతో ప్రజాసంక్షేమ కూటమి కార్యాలయంగా ఉన్న కోయంబేడులోని డీఎండీకే ఊరేగింపుగా చేరుకోవడం ద్వారా తన నిర్ణయాన్ని చెప్పకనే చెప్పారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చిన జీకే వాసన్‌కు సంక్షేమ కూటమి సారధి, ఎండీఎంకే అధినేత వైగో స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయంలో ఎండీఎంకే అధినేత విజయకాంత్, ఇతర మిత్రపక్షాలు జీకేవాసన్ను స్వాగతించారు. కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడుకున నేతలు ఆ తరువాత మీడియా సమావేశం నిర్వహించారు. సంక్షేమ కూటమిలో తమాకా చేరినట్లుగా వైగో ప్రకటించారు. మొత్తం 234 స్థానాలకు గానూ డీఎండీకే 104, ఎండీఎంకే 29, తమాకా 26 సీపీఐ, సీపీఎం, వీసీకే తలా 25 స్థానాల్లో పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. సంక్షేమ కూటమిలో చేరినపుడు డీఎండీకేకు 124 సీట్లు కేటాయించగా, తమాకా ప్రవేశంతో ఆ సీట్ల సంఖ్య 104కు తగ్గింది. అన్నాడీఎంకే, డీఎంకేలకు ప్రత్యామ్నాయ ప్రభుత్వం కావాలంటూ తమిళనాడు ప్రజల 50 ఏళ్ల కోర్కె ఈ ఎన్నికల్లో నెరవేరనుందని జీకేవాసన్ పేర్కొన్నారు. సంక్షేమ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా విజయకాంత్ ఖాయమని వైగో అన్నారు. తమాకా కూటమి ఖరారు కావడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సందడి చేశారు. -
కసరత్తు!
అభ్యర్థుల ఎంపికపై స్టాలిన్‌తో కాంగ్రెస్ సమావేశం నేడు కొలిక్కి మేనిఫెస్టోకు తుదిమెరుగులు పొత్తు, సీట్ల పందేరం కొలిక్కి రావడంతో ఇక, నియోజకవర్గాల ఎంపిక కసరత్తుల్లో కాంగ్రెస్ నిమగ్నమైంది. డీఎంకేతో కాంగ్రెస్ కమిటీ మంగళవారం సమావేశమైంది. నియోజకవర్గ ఎంపిక కసరత్తు బుధవారం కొలిక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక, మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దే పనిలో డీఎంకే కమిటీ నిమగ్నమైంది. సాక్షి, చెన్నై: డీఎంకేతో కలసి కాంగ్రెస్ అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. సీట్ల పందేరం కొలిక్కి రావడంలో జాప్యం నెలకొనడంతో కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ బయలు దేరింది. ఎట్టకేలకు సోమవారం సీట్ల పందేరం కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్‌కు 41 సీట్లను డీఎంకే కేటాయించడంతో, ఇక, దానిని పంచుకునేందుకు కాంగ్రెస్‌లోని గ్రూపులు నిమగ్నం అయ్యాయి. ఆయా గ్రూపు నేతలు తొలుత సత్యమూర్తి భవన్లో గసమాలోచించి అందుకు తగ్గ నిర్ణయాలు తీసుకున్నారు. తమ తమ మద్దతు దారులకు సీట్లను ఇప్పించుకునేందుకు తగ్గ కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. కాంగ్రెస్ సీట్ల పందేరం కమిటీలోని గ్రూపు నేతలు తమ పంపకాలు కొలిక్కి రావడంతో, ఇక డీఎంకే నుంచి ఏఏ నియోజకవర్గాలను రాబట్టుకోవాలో అన్న అంశంపై దృష్టి పెట్టారు. దీంతో కాంగ్రెస్ సీట్ల పందేరం కమిటీలోని ఈవీకేఎస్ ఇళంగోవన్, తంగబాలు, కృష్ణస్వామి, యశోధ, తిరునావుక్కరసు తదితరులు స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కమిటీతో బుధవారం సమాలోచించారు. అన్నా అరివాలయంలో ఈ సమాలోచన సాగింది. తమకు కావాల్సిన నియోజకవర్గాల జాబితాను డిఎంకేకు కాంగ్రెస్ కమిటీ అప్పగించింది. దీనిని పరిశీలించిన స్టాలిన్, ఇందులో కొన్ని మార్పులు, చేర్పుల దిశగా సూచనలు సలహాలతో సమాలోచన ముగిసింది. ఈ మార్పులు, చేర్పులతో బుధవారం నియోజకవర్గాల ఎంపిక ప్రక్రియను కొలిక్కి తెచ్చి, కాంగ్రెస్‌కు అప్పగించే నియోజకవర్గాల వివరాల్ని ప్రకటించేందుకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి సిద్ధం అవుతున్నారు. మేనిఫెస్టోకు మెరుగులు : డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దే పనిలో ప్రత్యేక కమిటీ నిమగ్నం అయింది. సీనియర్ నేత టీ ఆర్బాలు, కరుణ గారాల పట్టి, ఎంపీ కనిమొళి, నేతలు సుబ్బలక్ష్మి జగదీశన్, దురై స్వామి, టీకేఎస్ ఇళంగోవన్, తంగం తెన్నరసు తదితరులుతో కూడిన ఈ కమిటీ ఉదయం నుంచి రాత్రి వరకు అన్నా అరివాలయంలో మేనిఫెస్టోకు తుది మెరుగులు దిద్దే పనిలో నిమగ్నం అయింది. మేనిఫెస్టో తయారీ పూర్తికాగానే, అధినేత కరుణానిధికి ఒకటి రెండు రోజుల్లో సమర్పించి, ఆయన ఆమోదంతో తది మేనిఫెస్టోను సిద్ధం చేసి విడుదల కసరత్తుల్లో ఈ కమిటీ నిమగ్నమైంది. -
మిస్టర్ స్టాలిన్ దమ్ముందా?
- స్టాలిన్‌కు వైగో సవాల్ సాక్షి, చెన్నై 'మిస్టర్ స్టాలిన్ దమ్ముందా....' తాను సంధించే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తావో, కేసులే వేసుకుంటావో, అంటూ ఎండీఎంకే నేత వైగో విరుచుకు పడ్డారు. ఎండీఎంకే నేత వైగో, డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ల మధ్య వారం రోజులుగా మాటల సమరం సాగుతున్న విషయం తెలిసిందే. డీఎంకేను టార్గెట్ చేసి వైగో స్పందిస్తున్న తీరుపై దళపతి స్టాలిన్ తీవ్రంగానే ఎ దురు దాడి చేస్తున్నారు. తన మీద ఆధార రహిత ఆరోపణలు చేసినందుకుగాను ఏకంగా లీగల్ నోటీసుల్ని సైతం వైగోకు స్టాలిన్ పంపించి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం వైగో మీడియాతో మాట్లాడుతూ స్టాలిన్‌పై కొత్త ఆరోపణలతో పాటుగా మిస్టర్..మిస్టర్ స్టాలిన్ దమ్ముందా...సవాల్ అంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అన్నాడీఎంకే నోట్లతో ఓట్లను రాబట్టే యత్నం చేస్తున్నదని వైగో విమర్శించారు. సిరుదావూర్ బంగళాలో ఉన్న నగదు ఆంధ్రాకు తరలి వెళ్లినట్టుగా, అధికారుల అండతోనే అన్నాడీఎంకే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదంటూ ఆరోపణలు గుప్పించారు. ఇక, డీఎంకే దళపతి స్టాలిన్ తనను టార్గెట్ చేసి నోటీసులు పంపిస్తాడా.? అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తాను సంధించే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేని పరిస్థితుల్లో స్టాలిన్ ఉన్నారని ఎద్దేవా చేశారు. మిథైన్ తవ్వకాల అనుమతి డీఎంకే హయంలో సాగిందని, ఆ సమయంలో స్టాలిన్‌కు ఎన్ని కోట్లు ముట్టిందో బహిర్గతం చేస్తానంటూ వ్యాఖ్యానించారు. కోట్లు దండుకుని అన్నదాతల్ని కడుపు కొట్టిన ఘనత డీఎంకేకు దక్కుతుందని ఆరోపించారు. మిస్టర్ స్టాలిన్ దమ్ముందా..? ఉంటే, మిథైన్ అనుమతుల్లో ఎంత ముట్టిందో ప్రకటిస్తావా, ఆ ఒప్పందాల వెనుక ఉన్న ఆంతర్యానికి సమాధానం ఇస్తావో ఏమోగానీ, కేసులు వేసినా భయ పడను అంటూ తీవ్రంగా వైగో స్పందించారు. -
జయమ్మ పార్టీకి ఝలక్ ఇచ్చిన తమిళ స్టార్!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి జయలలిత పార్టీకి తమిళ స్టార్ హీరో, రాజకీయ నాయకుడు శరత్ కుమార్ షాక్ ఇచ్చారు. 'అమ్మ' జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకే కూటమికి ఆయన గుడ్ బై చెప్పారు. సమథువా మక్కల్ కచ్చి పార్టీ అధినేత అయిన శరత్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల వేళ తన దారి తాను చూసుకున్నారు. 'నేను కూటమిలో కొనసాగుతానని గతంలో హామీ ఇచ్చాను. ఆ మేరకు ఐదేళ్లు కూటమిలో కొనసాగాను. నా మాట నెరవేరింది. నేను అన్నాడీఎంకేను ఏమీ నిందించను. కానీ ఈ ఐదేళ్ల గురించి సింహావలోకనం చేసుకుంటే మేం చేసిందాని కన్నా చాలా ఎక్కువ చేయాల్సి ఉండేది' అని శరత్ కుమార్ విలేకరులతో పేర్కొన్నారు. శరత్ కుమార్ పార్టీకి తనతోపాటు మరో ఎమ్మెల్యే ఉన్నారు. అయితే అన్నాడీఎంకేతో పొత్తు కటీఫ్ చేసుకోవడంతో ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే ఎన్నావుర్ నారాయణ్ అమ్మ పార్టీకి అండగా నిలిచారు. దీంతో అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి తానొక్కడే అన్నాడీఎంకే కూటమి నుంచి వైదొలిగారు శరత్ కుమార్. దక్షిణ తమిళ జిల్లాల్లో బలంగా ఉన్న నాడర్ వర్గంలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న శరత్ కుమార్ త్వరలోనే ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే విషయాన్ని ప్రకటించనున్నారు. తమిళ సినీ అసోసియేషన్ నడిగర్ ఎన్నికల వివాదంలో శరత్ కుమార్ కు అన్నాడీఎంకే మద్దతు ఇవ్వకపోవడంతోనే ఆ పార్టీ కూటమికి ఆయన గుడ్ బై చెప్పినట్టు భావిస్తున్నారు. అయితే నడిగర్ తో రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని శరత్ కుమార్ కొట్టిపారేస్తున్నారు. -
యాక్టర్ స్టాలిన్
డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ మళ్లీ నటుడిగా అవతారం ఎత్తేందుకు సిద్ధం అయ్యారు. 30 ఏళ్ల తర్వాత ముఖానికి మేకప్ వేసుకోనున్నారు. ఎన్నికల ప్రచార నిమిత్తం లఘు చిత్రంలో స్వయంగా నటించేందుకు అన్నాడీఎంకేతో యాక్షన్‌కు దళపతి రెడీ అయ్యారు. సాక్షి, చెన్నై: రానున్న అసెంబ్లీ ఎన్నికల ద్వారా ఎలాగైనా అధికార పగ్గాలు చేపట్టి తీరాలన్న కాంక్షతో ప్రజాకర్షణ దిశగా డీఎంకే పరుగులు తీస్తోంది. ఓ వైపు డీఎంకే అధినేత ఎం.కరుణానిధి తనదైన శైలిలో ముందుకు సాగుతుంటే, మరోవైపు పార్టీ దళపతి, కోశాధికారి ఎంకే స్టాలిన్ ప్రజల్ని ఆకర్షించడమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తోన్నారు. నియోజకవర్గాల బాటతో ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారం, టీవీల్లో ప్రకటనల నిమిత్తం ప్రత్యేకంగా ఓ లఘు చిత్రాన్ని రూపొందించేందుకు ఎంకే స్టాలిన్ నిర్ణయించారు. ఇందులో స్వయంగా తానే నటించేందుకు సిద్ధం అయ్యారు. ప్రత్యేక ఆకర్షణ అన్నాడీఎంకే సర్కారు తీరు, ైవె ఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకె ళ్లడం కోసం ప్రత్యేక ఆకర్షణగా ఓ లఘు చిత్రాన్ని రూపొందించేందుకు స్టాలిన్ కసరత్తులు చేసి ఉన్నారు. అధికార పక్షంతో ఢీ కొట్టేందుకు ముఖానికి మేకప్ వేసుకుని మరీ సిద్ధం అవుతున్నారు. నగర శివారులోని ఓ థీమ్ పార్క్‌లో ఈ లఘు చిత్రం రూపొందించబోతున్నారు. ఇందులో ఎంకే స్టాలిన్ కీలక భూమిక పోషిస్తూ, అధికార పక్షాన్ని ఎండగట్టనున్నారు. ఈ లఘు చిత్రాన్ని తొలుత కలైంజర్ టీవీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు. వేదికలు, బహిరంగ సభల్లోనే అధికార పక్షాన్ని కడిగి పారేసే స్టాలిన్, ఇక ఈ లఘు చిత్రంలో తన నటన ద్వారా ప్రజల్ని ఏ మేరకు ఆకట్టుకోబోతున్నారో వేచి చూడాల్సిందే. అయితే స్టాలిన్‌కు నటన కొత్త కాదన్న విషయం అందరికీ తెలిసిందే. కెమెరా ముందుకు రావడం ఆయనకు అలవాటే. 1987లో కరుణానిధి రూపొందించిన ఒరే రక్తం చిత్రంలో స్టాలిన్ నటించారు. ఇందులో విప్లవ యువకుడి పాత్రలో స్టాలిన్ అందరి మన్ననల్ని దక్కించుకున్నారు. అలాగే దూరదర్శన్‌లో ప్రసారమై ప్రజాదరణ పొందిన కురింజి మలర్ ధారావాహికలో నటించి ప్రశంసలు అందుకోవడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే, ఎన్నికల ప్రచార లఘు చిత్రం ద్వారా ప్రజల్ని ఆకట్టుకునే నటనతో స్టాలిన్ అలరించే అవకాశాలు ఎక్కువే.