యాక్టర్ స్టాలిన్
డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ మళ్లీ నటుడిగా అవతారం ఎత్తేందుకు సిద్ధం అయ్యారు. 30 ఏళ్ల తర్వాత ముఖానికి మేకప్ వేసుకోనున్నారు. ఎన్నికల ప్రచార నిమిత్తం లఘు చిత్రంలో స్వయంగా నటించేందుకు అన్నాడీఎంకేతో యాక్షన్‌కు దళపతి రెడీ అయ్యారు.
సాక్షి, చెన్నై: రానున్న అసెంబ్లీ ఎన్నికల ద్వారా ఎలాగైనా అధికార పగ్గాలు చేపట్టి తీరాలన్న కాంక్షతో ప్రజాకర్షణ దిశగా డీఎంకే పరుగులు తీస్తోంది. ఓ వైపు డీఎంకే అధినేత ఎం.కరుణానిధి తనదైన శైలిలో ముందుకు సాగుతుంటే, మరోవైపు పార్టీ దళపతి, కోశాధికారి ఎంకే స్టాలిన్ ప్రజల్ని ఆకర్షించడమే లక్ష్యంగా ప్రచారంలో దూసుకెళ్తోన్నారు. నియోజకవర్గాల బాటతో ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే పనిలో పడ్డారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల ప్రచారం, టీవీల్లో ప్రకటనల నిమిత్తం ప్రత్యేకంగా ఓ లఘు చిత్రాన్ని రూపొందించేందుకు ఎంకే స్టాలిన్ నిర్ణయించారు. ఇందులో స్వయంగా తానే నటించేందుకు సిద్ధం అయ్యారు.
ప్రత్యేక ఆకర్షణ
అన్నాడీఎంకే సర్కారు తీరు, ైవె ఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకె ళ్లడం కోసం ప్రత్యేక ఆకర్షణగా ఓ లఘు చిత్రాన్ని రూపొందించేందుకు స్టాలిన్ కసరత్తులు చేసి ఉన్నారు. అధికార పక్షంతో ఢీ కొట్టేందుకు ముఖానికి మేకప్ వేసుకుని మరీ సిద్ధం అవుతున్నారు. నగర శివారులోని ఓ థీమ్ పార్క్‌లో ఈ లఘు చిత్రం రూపొందించబోతున్నారు. ఇందులో ఎంకే స్టాలిన్ కీలక భూమిక పోషిస్తూ, అధికార పక్షాన్ని ఎండగట్టనున్నారు. ఈ లఘు చిత్రాన్ని తొలుత కలైంజర్ టీవీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు. వేదికలు, బహిరంగ సభల్లోనే అధికార పక్షాన్ని కడిగి పారేసే స్టాలిన్, ఇక ఈ లఘు చిత్రంలో తన నటన ద్వారా ప్రజల్ని ఏ మేరకు ఆకట్టుకోబోతున్నారో వేచి చూడాల్సిందే.
అయితే స్టాలిన్‌కు నటన కొత్త కాదన్న విషయం అందరికీ తెలిసిందే. కెమెరా ముందుకు రావడం ఆయనకు అలవాటే. 1987లో కరుణానిధి రూపొందించిన ఒరే రక్తం చిత్రంలో స్టాలిన్ నటించారు. ఇందులో విప్లవ యువకుడి పాత్రలో స్టాలిన్ అందరి మన్ననల్ని దక్కించుకున్నారు. అలాగే దూరదర్శన్‌లో ప్రసారమై ప్రజాదరణ పొందిన కురింజి మలర్ ధారావాహికలో నటించి ప్రశంసలు అందుకోవడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే, ఎన్నికల ప్రచార లఘు చిత్రం ద్వారా ప్రజల్ని ఆకట్టుకునే నటనతో స్టాలిన్ అలరించే అవకాశాలు ఎక్కువే.