ఎన్నికల పొత్తుపై ఎన్నోపార్టీలతో తర్జన భర్జనలు పడిన తమిళ మానిల కాంగ్రెస్ (తమాకా) ఎట్టకేలకు ప్రజా సంక్షేమ కూటమిలో చేరింది. తమాకా అధ్యక్షుడు జీకే వాసన్ ప్రజా సంక్షేమ కూటమిలో చేరినట్లు ఎండీఎంకే అధినేత వైగో ఆదివారం అధికారికంగా ప్రకటించారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి:
అన్ని పార్టీలు ఏదో ఒక పంచన చేరిపోగా తమాకా వైఖరి ఏమిటో తెలియక అందరూ తలలు పట్టుకున్నారు. ఎక్కువ శాతం మంది ఊహించినట్లుగానే అన్నాడీఎంకేతో పొత్తు చర్చలు సాగాయి. ఎంతో వేగంగా, గోప్యంగా తెరవెనుక సాగిన చర్చలు అంతే వేగంగా బైటకు వచ్చాయి. తమాకా అధినేత కోరినన్ని సీట్లు దక్కకపోవడం, అదికూడా రెండాకుల గుర్తుపై పోటీచేయాలని జయలలిత విధించిన షరతుకు జీకే వాసన్ తలొగ్గలేదు.
సీట్ల సంఖ్యను తగ్గించేందుకైనా సుముఖంగా ఉండిన జీకే వాసన్ తమ పార్టీ ఎన్నికల గుర్తై కొబ్బరితోపుపై కాకుండా రెండాకుల గుర్తుపై పోటీచేయడం తమ పార్టీ ఉనికికే భంగకరమని భావించారు. మరో రెండువారాల్లో నామినేషన్లు ప్రారంభం కానుండగా ఇంతవరకు కూటమి ఖరారు కాలేదని తమాకా శ్రేణులు సైతం అసహనం ప్రకటించాయి. ఇదిగో అదిగో అంటూ దాటవేసిన జీకే వాసన్ శనివారం ఉదయం సైతం మీడియా అడిగిన ప్రశ్నలను దాటవేశారు. మధ్యాహ్నం సమయానికి బహిరంగ ప్రకటన ఖాయమని చెప్పారు.
సంక్షేమ కూటమిలో సందడి ః
సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జీకే వాసన్ తన అనుచర వర్గంతో ప్రజాసంక్షేమ కూటమి కార్యాలయంగా ఉన్న కోయంబేడులోని డీఎండీకే ఊరేగింపుగా చేరుకోవడం ద్వారా తన నిర్ణయాన్ని చెప్పకనే చెప్పారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చిన జీకే వాసన్‌కు సంక్షేమ కూటమి సారధి, ఎండీఎంకే అధినేత వైగో స్వాగతం పలికారు.
పార్టీ కార్యాలయంలో ఎండీఎంకే అధినేత విజయకాంత్, ఇతర మిత్రపక్షాలు జీకేవాసన్‌ను స్వాగతించారు. కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడుకున నేతలు ఆ తరువాత మీడియా సమావేశం నిర్వహించారు. సంక్షేమ కూటమిలో తమాకా చేరినట్లుగా వైగో ప్రకటించారు. మొత్తం 234 స్థానాలకు గానూ డీఎండీకే 104, ఎండీఎంకే 29, తమాకా 26 సీపీఐ, సీపీఎం, వీసీకే తలా 25 స్థానాల్లో పోటీచేస్తున్నట్లు ప్రకటించారు.
సంక్షేమ కూటమిలో చేరినపుడు డీఎండీకేకు 124 సీట్లు కేటాయించగా, తమాకా ప్రవేశంతో ఆ సీట్ల సంఖ్య 104కు తగ్గింది. అన్నాడీఎంకే, డీఎంకేలకు ప్రత్యామ్నాయ ప్రభుత్వం కావాలంటూ తమిళనాడు ప్రజల 50 ఏళ్ల కోర్కె ఈ ఎన్నికల్లో నెరవేరనుందని జీకేవాసన్ పేర్కొన్నారు. సంక్షేమ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా విజయకాంత్ ఖాయమని వైగో అన్నారు. తమాకా కూటమి ఖరారు కావడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సందడి చేశారు.
సంక్షేమ కూటమిలో తమాకా
Published Sun, Apr 10 2016 2:42 AM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM
Advertisement
Advertisement