Gk Vasan
-
ఇదేంటబ్బా!
సాక్షి, చెన్నై: కాంగ్రెస్‌లోకి మళ్లీ టీఎంసీ విలీనం అయ్యేనా అన్న చర్చ రాష్ట్రంలో బయలు దేరింది. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు తాజాగా చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లేందుకు తగ్గ కారణాలను ఏకరువు పెడుతూ జ్ఞాన దేశికన్ ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసిన నేపథ్యంలో ఢిల్లీలో జీకే వాసన్ తిష్ట వేయడం చర్చకు మరింత బలాన్ని చేకూరుస్తున్నది. తన తండ్రి మూపనార్ స్థాపించిన తమిళ మానిల కాంగ్రెస్‌ను జాతీయ కాంగ్రెస్‌లోకి విలీనం చేసిన ఘనత జీకే వాసన్‌కు చెందుతుంది. ఈ విలీనం తదుపరి ఆయన జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు. రాజ్యసభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా రెండు సార్లు పనిచేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో బలమైన గ్రూపు నేతగా ఎదిగిన వాసన్ ఇటీవలి లోక్‌సభ ఎన్నికల అనంతరం ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తమిళ అసెంబ్లీ ఎన్నికల్ని టార్గెట్ చేసి మళ్లీ తన తండ్రి స్థాపించిన తమిళ మానిల కాంగ్రెస్‌కు పునర్జీవం పోశారు. తండ్రి చరిష్మాతో మద్దతు దారుల్ని తన వైపుకు తిప్పుకున్నా, వాసన్ చరిష్మా ఏ మాత్రం ఎన్నికల్లో పనిచేయ లేదు. ఎన్నికల సమయంలో ప్రజాసంక్షేమ కూటమిలోకి అడుగు పెట్టినప్పడే, ముఖ్యనాయకులు టాటా చెప్పి, మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పతనంతో కేడర్ పెద్ద సంఖ్యలో మళ్లీ మాతృగూటికి వెళ్తుండడంతో తమిళ మానిల కాంగ్రెస్ పరిస్థితి ఏమిటీ..? అన్న చర్చ రాష్ట్రంలో బయలు దేరింది. ఈ సమయంలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు జ్ఞానదేశికన్ ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి ఓ లేఖాస్త్రం సంధించిన సమాచారం చర్చనీయంశంగా మారింది. ఈ చర్చ సద్దుమనగక ముందే, ఢిల్లీలో జీకే వాసన్ తిష్ట వేసి ఉండటంతో మళ్లీ విలీనమా..? అన్న ప్రశ్న బయలు దేరింది. ఢిల్లీలో తిష్ట: వాసన్‌కు నీడ వలే ఉన్న జ్ఞానదేశికన్‌కు గతంలో కాంగ్రెస్‌లో మంచి గుర్తింపు ఉండేది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించిన జ్ఞాన దేశికన్, తాను కాంగ్రెస్ పార్టీని విడటానికి గల పరిస్థితులు ఏమిటంటే..? అంటూ సోనియాకు రాసిన లేఖాస్త్రంలో వివరించి ఉండటం గమనార్హం. అలాగే, కారణాలతో పాటుగా ఆమె ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసి ఉండటం బట్టి చూస్తే, మళ్లీ తనను అక్కున చేర్చుకోండి...అన్నట్టుగా విన్నవించి ఉన్నట్టుందన్న చర్చ బయలు దేరి ఉన్నది. తన నీడ జ్ఞాన దేశికన్ లేఖాస్త్రం సంధించిన తదుపరి జీకే వాసన్ ఢిల్లీకి విమానం ఎక్కి ఉండటంతో చర్చ మరింత బలోపేతంగా సాగుతున్నది. శనివారం కూడా ఢిల్లీలో తిష్ట వేసి ఉన్న వాసన్ అక్కడి కాంగ్రెస్ పాత మిత్రులతో సమావేశం అవుతున్నట్టు సమాచారం. అలాగే, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసేందుకు తగ్గ అనుమతి కోరి ఉన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అలాగే, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీని స్వయంగా ఆసుపత్రికి వెళ్లి పరామర్శించేందుకు తగ్గ కసరత్తుల్ని వాసన్ వేగవంతం చేసి ఉన్నట్టుగా సమాచారాలు వస్తుండటంతో, మళ్లీ విలీనమా..? అన్న చర్చ శర వేగంగా సాగుతున్నది. అయితే, ఈ చర్చలు, ప్రచారాల్ని తమిళ మానిల కాంగ్రెస్ వర్గాలు ఖండించడం లేదు. ఆ పార్టీ వర్గాలు సైతం మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లే విధంగా వాసన్ నిర్ణయం తీసుకుంటే మంచిదన్న సలహా ఇచ్చేపనిలో పడ్డట్టు ప్రచారం బయలుదేరడం ఆలోచించ తగ్గ విషయమే. -
అమ్మ గూటికి..
సాక్షి, చెన్నై: తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్‌కు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు జ్ఞాన శేఖరన్ షాక్ ఇచ్చారు. ఇక, డీఎంకేకు కరుప్పు స్వామి పాండియన్ టాటా చెప్పారు. ఈ ఇద్దరి మద్దతు దారులు మంగళవారం అమ్మ గొడుగు నీడకు చేరారు. తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్‌కు వెన్నంటి ఉంటూ వచ్చిన నాయకుల్లో వేలూరు జ్ఞాన శేఖరన్ కూడా ఉన్నారు. కాంగ్రెస్‌లో గానీయండి, బయటకు వచ్చాక గానీయండి వాసన్ తమ నాయకుడు అని ముందుకు సాగిన అనేక మంది అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాండివ్వక తప్పలేదు. ఇందుకు కారణం వాసన్ అనాలోచిత నిర్ణయమే. ముఖ్య నాయకులు బయటకు వెళ్లినా, కాంగ్రెస్ తరఫున పలు మార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీ ఉపాధ్యక్షుడు జ్ఞాన శేఖరన్ మాత్రం హ్యాండివ్వలేక పోయారు. అసెంబ్లీ ఎన్నికల్లో వాసన్ వెంటే సాగి, ఇక, తాను ఇమడ లేనన్న నిర్ణయానికి ప్రస్తుతం వచ్చేశారు. తనతో పాటుగా, తన మద్దతు దారులకు న్యాయం చేకూరే విధంగా నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు తిరుచ్చి, చెన్నై, తిరువళ్లురు, కాంచీపురం, వేలూరు జిల్లాలోని తన మద్దతు ముఖ్య నాయకులతో కలిసి పోయెస్ గార్డెన్ మెట్లు ఎక్కారు. మంగళవారం ఉదయం తన వెన్నంటి వచ్చిన యాభైకు పైగా ముఖ్య నాయకులతో కలసి అమ్మ జయలలిత సమక్షంలో అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. ఇక, తన పయనం అన్నాడీఎంకేలో కొనసాగుతుందని ప్రకటించిన జ్ఞాన దేశికన్, త్వరలో తమిళ మానిల కాంగ్రెస్ గుడారం సైతం ఖాళీ కాబోతున్నట్టుగా ప్రకటించడం గమనార్హం. తన తదుపరి మరెందరో అన్నాడీఎంకేలోకి క్యూ కట్టేందుకు సిద్ధం అవుతున్నారని, చివరకు వాసన్ ఒక్కరే మిగులుతారేమో అని చమత్కరించడం ఆలోచించ దగ్గ విషయమే. కరుప్పు టాటా...: తిరునల్వేలి జిల్లా డీఎంకేలో ముఖ్యుడిగా ఉన్న కరుప్పు స్వామి పాండియన్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారన్న నెపంతో కరుప్పు స్వామి పాండియన్‌ను డీఎంకే పక్కన పెట్టిన విషయం తెలిసిందే. ఇక, డీఎంకేలో తనకు తలుపులు మూసుకున్నట్టే అన్న నిర్ధారణకు వచ్చిన కరుప్పు స్వామి పాండియన్, ఇక, టాటా..అన్నట్టుగా డిఎంకే నుంచి బయటకు వచ్చి అమ్మ జయలలిత సమక్షంలో అన్నాడీఎంకే గూట్లోకి దూకేశారు. తన మద్దతు వర్గంతో కలిసి అన్నాడీఎంకే సభ్యుత్వాన్ని పొందారు. -
సంక్షేమ కూటమిలో తమాకా
ఎన్నికల పొత్తుపై ఎన్నోపార్టీలతో తర్జన భర్జనలు పడిన తమిళ మానిల కాంగ్రెస్ (తమాకా) ఎట్టకేలకు ప్రజా సంక్షేమ కూటమిలో చేరింది. తమాకా అధ్యక్షుడు జీకే వాసన్ ప్రజా సంక్షేమ కూటమిలో చేరినట్లు ఎండీఎంకే అధినేత వైగో ఆదివారం అధికారికంగా ప్రకటించారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: అన్ని పార్టీలు ఏదో ఒక పంచన చేరిపోగా తమాకా వైఖరి ఏమిటో తెలియక అందరూ తలలు పట్టుకున్నారు. ఎక్కువ శాతం మంది ఊహించినట్లుగానే అన్నాడీఎంకేతో పొత్తు చర్చలు సాగాయి. ఎంతో వేగంగా, గోప్యంగా తెరవెనుక సాగిన చర్చలు అంతే వేగంగా బైటకు వచ్చాయి. తమాకా అధినేత కోరినన్ని సీట్లు దక్కకపోవడం, అదికూడా రెండాకుల గుర్తుపై పోటీచేయాలని జయలలిత విధించిన షరతుకు జీకే వాసన్ తలొగ్గలేదు. సీట్ల సంఖ్యను తగ్గించేందుకైనా సుముఖంగా ఉండిన జీకే వాసన్ తమ పార్టీ ఎన్నికల గుర్తై కొబ్బరితోపుపై కాకుండా రెండాకుల గుర్తుపై పోటీచేయడం తమ పార్టీ ఉనికికే భంగకరమని భావించారు. మరో రెండువారాల్లో నామినేషన్లు ప్రారంభం కానుండగా ఇంతవరకు కూటమి ఖరారు కాలేదని తమాకా శ్రేణులు సైతం అసహనం ప్రకటించాయి. ఇదిగో అదిగో అంటూ దాటవేసిన జీకే వాసన్ శనివారం ఉదయం సైతం మీడియా అడిగిన ప్రశ్నలను దాటవేశారు. మధ్యాహ్నం సమయానికి బహిరంగ ప్రకటన ఖాయమని చెప్పారు. సంక్షేమ కూటమిలో సందడి ః సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జీకే వాసన్ తన అనుచర వర్గంతో ప్రజాసంక్షేమ కూటమి కార్యాలయంగా ఉన్న కోయంబేడులోని డీఎండీకే ఊరేగింపుగా చేరుకోవడం ద్వారా తన నిర్ణయాన్ని చెప్పకనే చెప్పారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చిన జీకే వాసన్‌కు సంక్షేమ కూటమి సారధి, ఎండీఎంకే అధినేత వైగో స్వాగతం పలికారు. పార్టీ కార్యాలయంలో ఎండీఎంకే అధినేత విజయకాంత్, ఇతర మిత్రపక్షాలు జీకేవాసన్ను స్వాగతించారు. కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడుకున నేతలు ఆ తరువాత మీడియా సమావేశం నిర్వహించారు. సంక్షేమ కూటమిలో తమాకా చేరినట్లుగా వైగో ప్రకటించారు. మొత్తం 234 స్థానాలకు గానూ డీఎండీకే 104, ఎండీఎంకే 29, తమాకా 26 సీపీఐ, సీపీఎం, వీసీకే తలా 25 స్థానాల్లో పోటీచేస్తున్నట్లు ప్రకటించారు. సంక్షేమ కూటమిలో చేరినపుడు డీఎండీకేకు 124 సీట్లు కేటాయించగా, తమాకా ప్రవేశంతో ఆ సీట్ల సంఖ్య 104కు తగ్గింది. అన్నాడీఎంకే, డీఎంకేలకు ప్రత్యామ్నాయ ప్రభుత్వం కావాలంటూ తమిళనాడు ప్రజల 50 ఏళ్ల కోర్కె ఈ ఎన్నికల్లో నెరవేరనుందని జీకేవాసన్ పేర్కొన్నారు. సంక్షేమ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రిగా విజయకాంత్ ఖాయమని వైగో అన్నారు. తమాకా కూటమి ఖరారు కావడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సందడి చేశారు. -
కమలమే దిక్కా?
సాక్షి, చెన్నై: డీఎంకే, అన్నాడీఎంకే, డీఎండీకే-ప్రజాసంక్షేమ కూటమి దారులు మూసుకోవడంతో ఇక, బీజేపీ ఒక్కటే తమాకా నేత జీకే వాసన్‌కు దిక్కుగా మారింది. ఇందుకు తగ్గట్టుగా బీజేపీతో కలసి ఎన్నికల పయనానికి తగ్గ సమాలోచనలు సాగుతుండడం గమనార్హం.ఒకప్పుడు తన కంటూ కాంగ్రెస్‌లో ప్రత్యేక బలగాన్ని కల్గిన జీకే వాసన్, సొంత కుంపటి పెట్టే సరికి సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. తమిళ మానిల కాంగ్రెస్ పునరుద్ధరణతో ఎదుర్కొంటున్న తొలి ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవడంలో వెనుకడుగు వేస్తున్నారు. అన్నాడీఎంకేతో పొత్తుకు యత్నించి,అక్కడి తలుపులు మూసుకోవడంతో ఢీలా పడాల్సిన పరిస్థితి. ఇక, డీఎంకేలోకి ఆహ్వానించే ప్రసక్తే లేదని తేల్చారు. డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమిలో సీట్ల సర్దుబాటు గొడవ సాగుతుండటంతో, అక్కడ చాన్స్ కరువైనట్టే. ఇక, మిగిలిందల్లా, జాతీయ పార్టీ బీజేపీ కలసి పనిచేయడమే. ఇంతకన్నా మరో మార్గం జీకే వాసన్‌కు లేదని చెప్పవచ్చు. లేదంటూ ఒంటరిగా బలం ఉన్న స్థానాల్లో బరిలోకి దిగాల్సిందే. అయితే, తన దృష్టిని కమలం వైపుగా వాసన్ మళ్లించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా బీజేపీ వర్గాలు స్పందిస్తుండడంతో కమలంతో కలసి వాసన్ అడుగులు వేస్తారా..? అన్న చర్చ బయలు దేరింది. ద్వితీయ శ్రేణి నాయకులు బీజేపీతో సంప్రదింపుల్లో ఉన్నట్టు, ఒకటి రెండు రోజుల్లో పార్టీ సమావేశంలో చర్చించి, వాసన్ తుది నిర్ణయం తీసుకుంటారన్న ప్రచారం బయలు దేరింది. ఈ సమయంలో శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ స్పందిస్తూ, ప్రస్తుత పరిస్థితుల్లో సోదరుడు వాసన్ బీజేపీతో కలసి ఎన్నికల్ని ఎదుర్కోవడం శ్రేయస్కరంగా పేర్కొన్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు సంప్రదింపుల్లో ఉన్నారని, ఆయన మంచి నిర్ణయం తీసుకుంటారన్న ఆశాభావం వ్యక్తంచేశారు. అవినీతికి వ్యతిరేకంగా తమాకా ఆవిర్భవించి ఉన్నదని, ఈ ఎన్నికల్లో అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ ఉద్యమిస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ, సమష్టిగా అవినీతి పరుల్ని ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బలమైన శక్తిగా అవతరిద్దామని సూచించారు. -
ఇక అమ్మ దర్శనం దక్కినట్టేనా
-15 సీట్లకు వాసన్ అంగీకారం - ఒకటి, రెండు రోజుల్లో పోయెస్ గార్డెన్‌కు చెన్నై తమిళ మానిల కాంగ్రెస్ వర్గాల్లో ఆనందం తాండ వం చేస్తున్నది. అమ్మ దర్శన భాగ్యం తమ అధినేతకు ఒకటి, రెండు రోజుల్లో దక్కనున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నా యి. తమకు పదిహేను సీట్లను సర్దుబాటు చేయడంతో, అందు కు తమ అధినేత అంగీకరించినట్టు చెబుతున్నారు. తమిళ మానిల కాంగ్రెస్(టీఎంసీ) గురించిన చర్చే ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతోంది. ఆ యా పార్టీలు పొత్తులు కుదుర్చుకుని సీట్ల పందేరాలు సాగించే పనిలో పడ్డాయి. అయితే, తన తండ్రి దివంగత నేత మూపనార్ చరిష్మాతో రాజకీయాల్లోకి వచ్చిన టీఎంసీ నేత జీకే వాసన్ నిర్ణయాన్ని నిర్భయంగా తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని చెప్పవచ్చు. వెనుకడుగు వేస్తున్నారా? లేదా, చివరి వరకు వేచి చూసి అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా కీలక నిర్ణయం తీసుకుందామా? అన్న యోచనతో ఆయన ముందుకు సాగుతున్నారన్నది ఆ పార్టీ వర్గాల వాదన. అన్నాడీఎంకేతో కలసి అడుగులు వేయాలన్నదే వాసన్‌కు తొలినాటి నుంచి ఉన్న అభిప్రాయం. అయితే, అక్కడి తలుపులు తెరుచుకున్నా, సీట్ల పందేరం చిక్కుల్ని సృష్టించడంతో డైలమాలో పడ్డారు. అదే సమయంలో అమ్మ తలుపులు ఇక మూసుకున్నట్టేనన్న భావనతో తదుపరి డీఎంకే వైపు, డీఎండీకే - ప్రజా సంక్షేమ కూటమి వైపుగా ఆయన దృష్టి సాగిందని చెప్పవచ్చు. అయితే, వాసన్ తీరుకు డీఎంకే గట్టి సమాధానమే ఇచ్చింది. తమ కూటమిలో చోటు లేదని తేల్చింది. ఇక పదే పదే ఆహ్వానం పలికిన ప్రజా కూటమి తాజాగా మౌనం అనుసరించడం మొదలెట్టడంతో వాసన్ పరిస్థితి ఏమిటో అన్న చర్చ బయలు దేరింది. ఎన్నికల గుర్తుగా తమ నేత వాసన్‌కు కొబ్బరితోట చిక్కినా, ఎన్నికల పొత్తు ఖరారు కాకపోవడంతో మల్లగుల్లాలు పడుతూ వచ్చిన టీఎంసీ వర్గాలు, ప్రస్తుతం ఆనంద తాండవం చేస్తున్నాయి. ఇందుకు కారణం మళ్లీ అన్నాడీఎంకే తలుపులు తెరుచుకుని ఉండడమేనటా. టీఎంసీకి పదిహేను సీట్లు సర్దుబాటు చేయడానికి అన్నాడీఎంకే సిద్ధపడ్డట్టుగా వచ్చిన సంకేతాలతో ఇక, పోయేస్ గార్డెన్ మెట్లు ఎక్కినట్టే అన్న ఆనందాన్ని ఆ పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. తమకు సీట్ల సర్దుబాటుకు అన్నాడీఎంకే నిర్ణయించడంతో ఆ పదిహేనుకు అంగీకారం తెలిపిన జీకే వాసన్, ఇక అమ్మ దర్శనం కోసం ఎదురు చూపుల్లో ఉన్నారని చెబుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో అమ్మ దర్శనం ఖాయం అని, అన్నాడీఎంకేతో కలసి ఎన్నికల్ని ఎదుర్కోబోతున్నామని పేర్కొంటున్నారు. అయితే, అన్నాడీఎంకేలో ఏ చిహ్నం మీద వాసన్ పోటీ చేయాల్సి ఉంటుందో అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కొబ్బరి తోటకు అమ్మ అనుమతి ఇస్తారా, అన్నది వేచి చూడాల్సిందే. ఇందుకు నిదర్శనం ఇప్పటి వరకు అమ్మ గొడుగు నీడన చేరిన వారందరూ అన్నాడీఎంకే రెండాకుల చిహ్నంతో బరిలోకి దిగేందుకు సిద్ధపడ డమే. 2001లో అన్నాడీఎంకేతో కలసి టీఎంసీ ఎన్నికల పయనం సాగించిన విషయం తెలిసిందే. అమ్మ దర్శనం కోసం : ఓ వైపు వాసన్ అమ్మ దర్శనం కోసం సిద్ధం అవుతోంటే, మరో వైపు అమ్మకు మద్దతు అంటూ పోయెస్ గార్డెన్ మెట్లు ఎక్కేందుకు మరెన్నో చిన్నా చితక పార్టీలు, సామాజిక వర్గాలు, ప్రజా సంఘాలు పరుగులు తీస్తున్నాయి. తమ మద్దతు అమ్మకే అంటూ లేఖల్ని పోయెస్ గార్డెన్‌కు పంపించే పనిలో పడ్డాయి. అక్కడి నుంచి పిలుపు వచ్చిన తరువాయి, అమ్మను దర్శించుకునేందుకు ఆయా నేతలు చెన్నైలో తిష్ట వేసి ఉండడం గమనార్హం. ఇక, ఆదివారం సినీ నటుడు, ముక్కళత్తూరు పులి పడై అధ్యక్షుడు కరుణాస్ అమ్మ జయలలితను కలిశారు. తమ మద్దతును ప్రకటించారు. అన్నాడీఎంకే తరఫున 234 స్థానాల్లోనూ తాను ప్రచారం చేయబోతున్నట్టుగా కరుణాస్ పేర్కొన్నారు. ఇక, గత ఎన్నికల్లో ఒక్క సీటుతో సర్దుకున్న ఇండియ కుడియరసు కట్చి నేత, ఎమ్మెల్యే సేకు తమిళరసన్ ఈ సారి అమ్మ ముందు మరిన్ని సీట్ల డిమాండ్‌ను ఉంచారు. -
పొత్తు కసరత్తు
అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత పొత్తు కసరత్తుల్లో ఆదివారం నిమగ్నమయ్యారు. ఆమె ప్రసన్నంతో సీట్లను దక్కించుకునేందుకు పలు పార్టీల నాయకులు పోయెస్ గార్డెన్ బాట పట్టారు. ఏడు పార్టీలకు పోయెస్ గార్డెన్‌లోకి అనుమతి దక్కడంతో, ఇక తనకు పిలుపు ఎప్పుడు వస్తుందో అన్న ఎదురుచూపుల్లో తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్ ఉన్నారు. * నేతల పోయెస్ గార్డెన్ బాట * పిలుపు కోసం వాసన్ ఎదురు చూపు సాక్షి, చెన్నై: మళ్లీ అధికారమే లక్ష్యంగా అన్నాడీఎంకే అధినేత్రి, సీఎం జయలలిత తీవ్ర కసరత్తుల్లో మునిగారు. ఇంటర్వ్యూలు ముగిం చి, అభ్యర్థుల చిట్టాకు మెరుగులు దిద్దే పనిలో పడ్డారు. మేనిఫెస్టో పనుల కసరత్తులు ఓ వైపు సాగుతుంటే, మరో వైపు తమను నమ్ముకుని పార్టీలు నడుపుతున్న వారికి అవకాశం కల్పించే విధంగా పొత్తు కసరత్తులకు చర్యలు చేపట్టారు. పోయెస్ గార్డెన్ నుంచి పిలుపు ఎప్పుడెప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ వచ్చిన కొన్ని సామాజిక వర్గాల పార్టీలు అనుమతి దక్కడం తరువాయి అమ్మ ఎదుట ప్రత్యక్షం అయ్యారని చెప్పవచ్చు. ఆయా పార్టీల నాయకులు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఒకరి తర్వాత మరొకరు అన్నట్టుగా పోయెస్ గార్డెన్ బాట పట్టారు. ఇందులో అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ నేతలు దేవరాజన్, కదిరవన్, కొంగు ఇలంజర్ పేరవై నేత, ఎమ్మెల్యే తనియరసు, ఇండియ కుడియరసు కట్చి నేత, ఎమ్మెల్యే సేకు తమిళరసు, తమిళర్ వాల్వురిమై కట్చి నేత , మాజీ ఎమ్మెల్యే వేల్ మురుగన్, సమత్తువ మక్కల్ కళగం నేత, ఎమ్మెల్యే ఎర్నావూర్ నారాయణన్, తౌఫిక్ జమాత్ వర్గాలు ఉన్నారు. అమ్మ వెంటే : గత అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో అమ్మే దిక్కు అని, అన్నాడీఎంకే వెంట నడిచిన పార్టీల నాయకులకు పోయెస్ గార్డెన్ తలుపులు తెరచుకున్నాయి. అమ్మ ప్రసన్నంతో పొత్తు పదిలం చేసుకుని, సీట్ల హామీతో ఆయా పార్టీల నాయకులు ఆనందంగానే బయటకు అడుగు పెట్టారని చెప్పవచ్చు. గత ఎన్నికల్లో ఓ స్థానాన్ని దక్కిం చుకున్న ఫార్వర్డ్ బ్లాక్ ఈ సారి అదనపు సీట్లు కోరినట్టు సమాచారం. ఇక, తమ సిట్టింగ్ స్థానాల్ని తమిళరసు, తనియరసు, ఎర్నావూర్ నారాయణన్ పదిలం చేసుకోగా, తమిళర్ వాల్వురిమై కట్టికి మూడు స్థానాలు కేటాయించేందుకు అమ్మ అంగీకరించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. అయితే, ఎన్నికల్లో పోటీ చేయాలా, వద్దా? అన్నది తేల్చుకునే పనిలో తౌఫిక్ జమాత్ ఉన్నట్టు సమాచారం. పలు సామాజిక వర్గ పార్టీలకు పోయెస్ గార్డెన్‌లోకి అనుమతి దక్కడంతో, ఇక తమకు పిలుపు ఎప్పుడో అన్న ఎదురు చూపుల్లో టీఎంసీ వర్గాలు ఉన్నాయి. ఎదురు చూపుల్లో : కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జీకే వాసన్ తన తండ్రి మూపనార్ స్థాపించిన తమిళ మానిల కాంగ్రెస్‌ను మళ్లీ తెర మీదకు తెచ్చిన విషయం తెలిసిందే. పొత్తు ప్రయత్నాలకు దూరంగా ఉన్న జీకే వాసన్, అమ్మ పిలిస్తే చాలు చటుక్కున వాలేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పవచ్చు. అన్నాడీఎంకేతో కలసి పయనం సాగించాలన్న ఆశతో జీకే వాసన్‌తో పాటుగా ఆ పార్టీ వర్గాలు ఉన్నట్టు సంకేతాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పొత్తు కసరత్తుల్లో అమ్మ మునగడంతో ఇక, తమకు పోయెస్ గార్డెన్ పిలుపు ఎప్పుడు వస్తుందో అన్న ఎదురు చూపుల్లో ఉన్నారు. ఒక వేళ పోయెస్ గార్డెన్‌లోకి అనుమతి దక్కి, పొత్తు, సీట్లు ఖరారు చేసుకున్నా, ఎన్నికల్లో పార్టీ చిహ్నం ‘సైకిల్’ వాసన్‌కు దక్కేది డౌటే. ఇందుకు కారణం ఉత్తరాదిలో సైకిల్ చిహ్నంకు సొంత దారుడిగా ఉన్న సమాజ్ వాది పార్టీ తరఫున రాష్ర్టంలోని 234 స్థానాల్లో పోటీకి కసరత్తులు సాగుతుండడమే. -
ప్రజల్లోకి వాసన్
ప్రజల్లోకి చొచ్చుకెళ్లి, టీఎంసీకి మద్దతు కూడగ ట్టుకునేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు జీకే వాసన్ సిద్ధం అయ్యారు. సోమవారం నుంచి రాష్ట్రం లో పర్యటించనున్నారు. వంద రోజుల పాటు పర్యటనకు కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. ప్రధానంగా 120 అసెంబ్లీ నియోజకవర్గాలను దృష్టిలో ఉంచుకుని ఈ పర్యటన సాగబోతున్నది. సాక్షి, చెన్నై :కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జీకే వాసన్ తన తండ్రి మూపనార్ స్థాపించిన తమిళ మానిల కాంగ్రెస్(టీఎంసీ)ని పునరుద్దరించిన విషయం తెలిసిందే. టీఎంసీ పునరుద్ధరణతో కాంగ్రెస్‌లో భారీగా చీలిక ఏర్పడింది. టీఎంసీ బలోపేతం లక్ష్యంగా వాసన్ ముందుకు సాగుతూ వస్తున్నారు. ఇటీవలే పార్టీ జిల్లాల, రాష్ట్ర కమిటీని ప్రకటించారు. ఆయా జిల్లా కమిటీల నేతృత్వంలో కార్యక్రమాల్ని విస్తృతం చేస్తూ ప్రజాకర్షణ దిశగా వాసన్ పయనం సాగుతూ వస్తున్నది. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇక, ప్రజల్లోకి దూసుకెళ్లి బలం చాటడం లక్ష్యంగా వాసన్ కార్యచరణ సిద్ధం చేసి ఉన్నారు. ఇందులో భాగంగా సోమవారం నుంచి వంద రోజుల పాటుగా ఆయన పర్యటన సాగబోతున్నది. ప్రజల్లోకి : తనకు మద్దతు దారులు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలు, తన తండ్రి గతంలో ఎంపిక చేసుకున్న నియోజకవర్గాలు, ఇలా బలం ఉన్న స్థానాల గుండా తన పర్యటన సాగించేందుకు వాసన్ కార్యచరణ సిద్ధం చేశారు. 32 జిల్లాల్లోని 120 అసెంబ్లీ నియోజకవర్గాల్ని ఎంపిక చేసుకుని ఆయా నియోజకవర్గాల్లోని గ్రామాలను కలుపుతూ వంద రోజుల పాటుగా ఈ పర్యటన సాగబోతున్నది. ప్రజా సమస్యలు, తన తండ్రి మూపనార్ ఆశయ సాధన లక్ష్యంగా పయనం సాగించేందుకు సిద్ధ పడ్డ వాసన్, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ నేతలతో సమావేశాలు, సమాలోచనలు జరపనున్నారు. కార్యకర్తలతో సంప్రదింపులు నిర్వహిస్తూ ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే విధంగా డిసెంబరు వరకు తన పర్యటన తేదీని సిద్ధం చేసుకుని ఉండటం విశేషం. -
రాహుల్‌పై విమర్శా!
సాక్షి, చెన్నై : జీకే మూపనార్ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన జీకే వాసన్‌కు కాంగ్రెస్ అధిష్టానం మంచి గుర్తింపునే ఇచ్చిందని చెప్పవచ్చు. రాజ్య సభ సభ్యుడి హోదాతో కేంద్రంలో మంత్రి పదవుల్ని అనుభవించిన వాసన్, రాష్ట్ర పార్టీ అధ్యక్ష ఎంపిక వివాదంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన తండ్రి స్థాపించిన తమిళ మానిల కాంగ్రెస్‌ను మళ్లీ ఆవిర్భవింప చేసి ప్రజల మన్ననల్ని అందుకునేందుకు ఉరకలు పరుగులు తీస్తున్నారు. అయితే, పార్టీ మారినా కాంగ్రెస్ అధిష్టానంపై గౌరవాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తరచూ ఆ పార్టీ అధిష్టానం వర్గాలకు ఏదో ఒక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన పార్టీకి చెందిన నాయకుడు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై తీవ్రంగా స్పందించడాన్ని వాసన్ జీర్నించుకోలేనట్టున్నారు. రాహుల్‌పై విమర్శ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ బర్త్ డే శుక్రవారం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఓ టీవీ చానల్ నిర్వహించిన ప్రత్యేక చర్చా కార్యక్రమంలో కాంగ్రెస్ తరపున మాజీ ఎంపి మాణిక్ ఠాకూర్,తమిళ మానిల కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు జ్ఞాన శేఖరన్ హాజరయ్యారు. చర్చ వాడివేడిగా సాగింది. రాహుల్‌పై జ్ఞాన శేఖరన్ తీవ్రంగా స్పందించారు. విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తూ అందరి మన్నన లు అందుకున్నారు. అలాగే, తామేమి తక్కువ తిన్నామా..? అన్నట్టుగా వాసన్ గుట్టుని రట్టు చేస్తూ ఠాకూర్ స్పందించారు. ఇది బాగానే ఉన్నా చిక్కంతా జ్ఞాన శేఖరన్‌కు ఎదురైంది. రాహుల్‌ను విమర్శిస్తూ శేఖరన్ స్పందించిన తీరు అధినేత వాసన్‌కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించినట్టు సమాచారం. అగ్గి మీద గుగ్గిలంలా మండి పడ్డ ఆయన ఇక మీదట రాహుల్‌ను విమర్శించే పని పెట్టుకోవద్దని పార్టీ వర్గాలకి హెచ్చరికలు చేశారట.! తన అనుమతి లేనిదే ఏ నాయకుడు టీవీ చర్చలకు వెళ్ల కూడదన్న ఆంక్షలు విధించి ఉండడం గమనార్హం. ఇక, వాసన్ ఆంక్షలతో ఆయన నిర్ణయం ఏమిటో, ఆయన తీరు ఏంటో అన్న సందిగ్ధంలో పడాల్సిన వంతు ఆ పార్టీ వర్గాలకు ఏర్పడిందటా..!. ఇదిలా ఉండగా, ఓ వైపు రాహుల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వాసన్ స్పందించిన సమయంలో, అదే నాయకుడిపై పార్టీకి చెందిన జ్ఞాన శేఖరన్ విమర్శలు గుప్పించడం ఎంత వరకు సమంజసం అని తమిళ మానిల కాంగ్రెస్ వర్గాలు పెదవి పిప్పుతున్నాయి. -
ఆంతర్యం ఏమిటో!
వాసన్‌తో సీతారాం ఏచూరి భేటీ సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్ల మధ్య భేటీ సాగడంతో ఆంతర్యాన్ని వెతికే పనిలో రాజకీయ పక్షాలు పడ్డాయి. ఈ ఇద్దరి మధ్య రాజకీయ పరంగా సుదీర్ఘ చర్చ సాగినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. సాక్షి, చెన్నై : కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జీకే వాసన్ తమిళ మానిల కాంగ్రెస్ ద్వారా ప్రజల్లోకి దూసుకు వెళ్లే పనిలో పడ్డారు. పార్టీ సభ్యత్వ నమోదు, బలోపేతం మీద దృష్టి పెట్టి సుడిగాలి పర్యటనలు చేసిన వాసన్, ఇప్పుడు పార్టీ కార్యవర్గం ఎంపిక కసరత్తుల్లో మునిగి ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలన్న కాంక్షతో గతంలో తన తండ్రి, దివంగత మూపనార్ వ్యవహరించినట్టుగానే ఫార్మూలాలను ప్రయోగించేందుకు కార్యచరణను సిద్ధం చేసుకుని ఉన్నారు. కాంగ్రెసేతర పార్టీల్ని తన వైపునకు తిప్పుకోవడం లేదా, బలమైన కూటమి పక్షాన నిలబడి ఎన్నికల్లో సత్తా చాటాలన్న కాంక్షతో ఉరకలు పరుగులు తీస్తున్నారు. అదే సమయంలో తన నేతృత్వంలో బలమైన కూటమికి సైతం వాసన్ చాప కింద నీరులా ప్రయత్నాల్లో ఉన్నట్టుగా ప్రచారం సాగుతున్నది. ప్రధానంగా యువతను ఆకర్షించడం లక్ష్యంగా ముందుకు వెళ్తున్న వాసన్ గత కొద్ది రోజులుగా వామపక్షాలతో సన్నిహితంగా మెలుగుతున్నారని చెప్పవచ్చు. వాసన్ నేతృత్వంలో ఇటీవల జరిగిన ఓ సదస్సుకు వామపక్షాల నాయకులతో పాటుగా వీసీకే, పలువురు మైనారిటీ నాయకులు హాజరయ్యారు. మతత్వానికి వ్యతిరేకంగా ఏకం అవుదామని నాయకులు అందరూ పిలుపునిచ్చారు. దీంతో వాసన్ సారథ్యంలో డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మరో కూటమి ఆవిర్భవించడం ఖాయం అన్న సంకేతాలు బయలు దేరాయి. ఇందుకు అద్దం పట్టే రీతిలోనే వాసన్ ప్రసంగాలు, వ్యాఖ్యలు సైతం ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో సీపీఎం జాతీయ నేత సీతారాం ఏచూరి వాసన్ భేటి కావడంతో ఆంతర్యాన్ని వెతికే పనిలో రాజకీయ వర్గాలు పడ్డాయి. ఆంతర్యమేమిటో వామపక్షాలు ఒకే గూటికి వచ్చి బీజేపీ, కాంగ్రెసేతర కూటమి లక్ష్యంగా జాతీయ స్థాయిలో పావులు కదిపేందుకు కార్యచరణ సిద్ధం అవుతున్న వేళ చెన్నైకు వచ్చిన సీతారాం ఏచూరి మైలాపూర్‌లోని తమిళ మానిల కాంగ్రెస్(టీఎంసీ) కార్యాలయంలో ఆ పార్టీ అధినేతతో భేటీ కావడంతో అందరి దృష్టి వాసన్ తదుపరి అడుగులు ఏమిటోనన్న ఎదురు చూపులు పెరిగాయి. ఈ ఇద్దరు అర గంటకు పైగా రాష్ట్ర రాజకీయ వ్యవహారాలపై సమీక్షించుకుని ఉన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించడం లక్ష్యంగా ఈ ఇద్దరి మధ్య పలు సూచనలు, సలహాలతో కూడిన సంభాషణలు సాగినట్టుగా టీఎంసీ వర్గాలు పేర్కొంటుండటం గమనార్హం. -
కాంగ్రెస్‌లో ముసలం
చెన్నై, సాక్షి ప్రతినిధి : తమిళనాడు కాంగ్రెస్‌లో చిదంబరం రూపంలో కొత్త ముసలం బయలుదేరింది. మాజీ కేంద్ర మంత్రి జీకే వాసన్ కొత్త పార్టీ స్థాపనతో బలహీనపడిన రాష్ట్రశాఖ, పీ చిదంబరం వేరుకుంపటితో మరో చీలిక ఏర్పడనుంది. రాష్ట్ర కాంగ్రెస్‌లో జీకే వాసన్, పీ చిదంబరం, తంగబాలు, కృష్ణస్వామి, ఇళంగోవన్ ఇలా అనేక వర్గాలు ఉన్నాయి. ఎవరి బలాలు వారికున్నాయి. జీకేవీ అనుచురుడైన జ్ఞానదేశికన్ టీఎన్సీసీఅధ్యక్షులుగా ఉన్నపుడు మాజీ ముఖ్యమంత్రి కామరాజనాడార్, సీనియర్ నేత జీకే మూపనార్ బొమ్మలను ప్రచారాల్లో వాడరాదని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. ఈ ఆదేశాలు కామరాజర్, మూపనార్ అభిమానుల్లో ఆగ్రహం తెప్పించారుు. ఇదే అదనుగా మూపనార్ తనయుడు జీకే వాసన్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి ఏకంగా వేరే పార్టీనే పెట్టేశారు. రాష్ట్రంలోని 23 జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే పార్టీలో చేరిపోయారు. జీకే వాసన్ వేరుకుంపటి కారణంగా వలసబాట పట్టిన 23 జిల్లాల్లోని అధ్యక్ష స్థానాలను తనవర్గం వారితో భర్తీ చేయాలని టీఎన్‌సీసీ అధ్యక్షులు ఇళంగోవన్‌ను పీ చిదంబరం కోరారు. అయితే ఇందుకు ఇళంగోవన్‌తోపాటూ ఇతర వర్గ నేతలు సైతం సమ్మతించలేదు. తన మాటను కాదన్నారన్న అక్కసుతో ఇళంగోవన్‌పై అధిష్టానానికి చిదంబరం ఫిర్యాదులు చేశారు. అధిష్టానం చిదంబరం ఫిర్యాదులను లెక్కచేయకపోగా మందలించినట్లు వ్యవహరించింది. రాష్ట్రంలో కామరాజనాడార్ పాలనను తీసుకువస్తామని చేస్తున్న కాంగ్రెస్ ప్రచారాలను కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం తప్పుపట్టారు. పార్టీ సమావేశాల్లోనే విమర్శలు గుప్పించారు. ప్రజాకర్షణ కలిగిన నేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు మనుగడ అని వ్యాఖ్యానించారు. తన అనుచరులతో ఈనెల 22న ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి రాష్ట్ర కాంగ్రెస్ నుంచి షోకాజ్ నోటీసు అందుకున్నారు. కార్తీ వ్యాఖ్యలు, ఇళంగోవన్ షోకాజ్ నోటీసు వెనుక ఇరువర్గాల మధ్య అంతర్యుద్ధం సాగుతున్న విషయం బట్టబయలైంది. తన కుమారుడి ముసుగులో అసంతృప్తిని వెళ్లగక్కిన చిదంబరం కాంగ్రెస్ నుంచి వైదొలిగేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కొత్త పార్టీ పెట్టడమా, గతంలో ఉన్న ప్రజా కమిటీని పునరుద్ధరించడమా అని ఆలోచిస్తున్నట్లు సమాచారం. చిదంబరం కొత్త పార్టీ ఆలోచనల సమాచారం తెలిసినందునే కార్తీకి ఇళంగోవన్ షోకాజ్ నోటీసు జారీచేశారని తెలుస్తోంది. అధిష్టానానికే ఆ హక్కు: కార్తీ తాను ఏఐసీసీ సభ్యుడిగా ఉన్నా అధిష్టానానికి మాత్రమే తాను సంజాయిషీ ఇచ్చుకుంటానని కార్తీ చిదంబరం మంగళవారం వ్యాఖ్యానించారు. పార్టీకి విరుద్ధంగా తానేదైనా తప్పు చేసి ఉంటే ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుంది, తనకు షోకాజ్ నోటీసు ఇచ్చే అధికారం టీఎన్‌సీసీకి లేదని ఆయన వ్యాఖ్యానించారు. చిదంబరానికి ఓట్లు పడవు : ఇళంగోవన్ కార్తీ చిదంబరం ఆశిస్తున్నట్లుగా ఆయన తండ్రి చిదంబరాన్ని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకు నుంచి కూడా ఓట్లు పడవని టీఎన్‌సీసీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్ మంగళవారం ఎద్దేవా చేశారు. కామరాజనాడార్‌ను విమర్శించడమేగాక కాంగ్రెస్ చివరి ముఖ్యమంత్రిగా ఆయన పాలన ముగిసిన అనంతరం పుట్టిన కార్యకర్తలతో జీ 67 (1967) పేరుతో సమావేశం నిర్వహించడం శోచనీయమన్నారు. కామరాజర్ తరువాత సీఎం అభ్యర్థిగా ప్రకటించే స్థాయి గల నాయకుడు రాష్ట్ర కాంగ్రెస్‌లో లేడని ఆయన వ్యాఖ్యానించారు. పీ చిదంబరం పార్టీని వీడిపోయినా నష్టం లేదన్నారు. ఆనాడు రాజాజీ వెళితేనే పార్టీకి ఏమీ కాలేదని చెప్పారు. కాంగ్రెస్‌కు అంటూ రాష్ట్రంలో కొన్ని ఓట్లు ఉన్నాయని, చిదంబరంను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే పడే ఓట్లు కూడా పడవని ఎద్దేవా చేశారు. -
జల్లికట్టుపై ఒత్తిడి
తమిళులకు అత్యంత ప్రీతిపాత్రమైన జల్లికట్టు వేడుకలపై సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలనే ఒత్తిళ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు సైతం జల్లికట్టు ప్రియులకు మద్దతుగా గళం విప్పుతున్నాయి. గతేడాది పొంగల్ పండుగకు ఎంతో ఉత్కంఠగా సాగిన జల్లికట్టు ఈ సారి నిషేధాన్ని ఎదుర్కొంది. చెన్నై, సాక్షి ప్రతినిధి : తమిళనాడు సంప్రదాయాన్ని ప్రతిబింబించే వేడుకల్లో జల్లికట్టు అత్యంత ప్రధానమైనది. తెలుగు ప్రజలకులాగే తమిళనాట పొంగల్ పండుగ ప్రసిద్ధి. కొత్త బట్టలు, పిండివంటలతో సరిపోదు జల్లికట్టు ఆడాల్సిందే. మదించిన దున్నను అదుపుచేయడాన్ని జల్లికట్టు క్రీడగా చెబుతారు. జల్లికట్టు క్రీడలో జయించిన యువకుడు వచ్చే ఏడాది పొంగల్ వరకు వీరుడిగా చలామణి అవుతాడు. మదురై, అలంగానల్లూరు, పుదుక్కోట్టై, కారైక్కుడి, శివగంగై, సేలం, తేనీ తదితర ప్రాంతాల్లో జల్లికట్టు ప్రసిద్ది. ముఖ్యంగా అలంగానల్లూరులో జల్లికట్టును చూసేందుకు దేశ ం నలుమూలల నుంచేగాక విదేశీయులు సైతం వస్తారు. సేలం మ్యూజియంలోని పురాతన శిల దీని ప్రాచుర్యాన్ని చెబుతోంది. ఈ ఏడాది నుంచి నిషేధం అయితే చూసేవారికి జల్లికట్టు ఎంత ఆసక్తిగా ఉంటుందో ఆడేవారికి అంత ప్రమాదకరంగా ఉంటుంది. ఒక్క ఉదుటున వీరులపైకి దూకే దున్న అతివేగంగా పరుగులు తీస్తుంది. అడ్డువచ్చిన వారిని పొడుస్తూ, తొక్కుతూ వెళుతుంది. ఈ సమయంలో ఎందరో యువకులు తీవ్రగాయాలకు గురవుతుంటారు. కొందరు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. 2012లో జల్లికట్టులో రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందగా, 33 మంది తీవ్రగాయాలకు గురయ్యూరు. జల్లికట్టులోకి దించే ముందు దున్న చేత మద్యం తాగిస్తారనే ప్రచారం కూడా ఉంది. ఇది జంతు ప్రేమికులకు తీవ్ర అభ్యంతరమైంది. దీంతో జంతు ప్రేమికుల సంఘం రెండేళ్ల క్రితం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మనుషులు తమ వినోదం కోసం జంతువులను వేధిస్తున్నారని, వాటి స్వేచ్ఛకు విఘాతం కల్పిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు జల్లికట్టును నిషేధిస్తూ ఈ ఏడాది మే 7వ తేదీన తీర్పు చెప్పింది. అయితే అప్పటికే పొంగల్ పండుగ ముగిసి జల్లికట్టు సంబరాలను పూర్తిచేసుకున్నారు. నిషేధంతో అదే ఆఖరు జల్లికట్టుగా మారింది. సుప్రీం కోర్టు తీర్పువెలువడిన వెంటనే పలు సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది. ఈ తీర్పు తమిళుల ఆచార, వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను అడ్డుకోవడమేనని విమర్శించాయిఅరుుతే వచ్చేనెల రెండోవారంలో పొంగల్ పండుగ సమీపిస్తుండగా జల్లికట్టు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నిషేధం విధించిన తరువాత వస్తున్న తొలి పొంగల్ కావడంతో ప్రజాప్రతినిధుల ద్వారా నిషేధాన్ని ఎత్తివేయించాలనే అభిప్రాయానికి పల్లె ప్రజలు వచ్చారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే శరత్‌కుమార్ తొలుత స్పందించారు. జల్లికట్టును కొనసాగించాలని కోరారు. తమిళ మానిల కాంగ్రెస్ అధినేత, కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ శనివారం ఒక ప్రకటనలో జల్లికట్టు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కోరారు. తమిళుల వీరత్వాన్ని చాటుకునే క్రీడగా పేరుగాంచిన జల్లికట్టును నిషేధించడం వారి వీరత్వాన్ని అడ్డుకున్నట్లుగా విమర్శించారు. యువకులకు దెబ్బలు తగులుతాయని భావిస్తే జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చుగానీ జల్లికట్టును అడ్డుకోవడం సరికాదని ఆయన అన్నారు. పొంగల్ పండుగలోగా నిషేధం ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
కార్తీ ‘రచ్చ’
సాక్షి, చెన్నై : దివంగత నేత కామరాజనాడర్కు వ్యతిరేకంగా కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో రచ్చకు దారి తీస్తున్నాయి. సర్వత్రా కార్తీ చిదంబరంపై విమర్శలు గుప్పించే పనిలో పడ్డారు. క్షమాపణకు పట్టు బడుతున్నారు. నాడార్ల సమాఖ్య ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా పరిగణించింది. ఆదివారం నుంగబాక్కంలోని కార్తీ చిదంబరం ఇంటిని ముట్టడించేందుకు యత్నించింది. జీకే వాసన్ పార్టీ నుంచి బయటకు వెళ్లడంతో టీఎన్‌సీసీలో కలవరం మొదలైంది. వాసన్ పార్టీ ఆవిర్భావ వేడుకలో ఎందరు నేతలు ప్రత్యక్షం కాబోతున్నారోనన్న ఉత్కంఠ నెలకొంది. దీంతో పార్టీని రక్షించుకుని, కేడర్‌కు తాను అండగా ఉండానని చాటుకునే పనిలో కొత్త అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ నిమగ్నం అయ్యారు. సత్యమూర్తి భవన్ వేదికగా ప్రతి రోజు ఏదో ఒక సమావేశం ఏర్పాటు చేసి, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే విధంగా ముందుకు సాగుతున్నారు. అయితే, ఈవీకేఎస్ ప్రయత్నాలపై నీళ్లు చల్లే రీతిలో కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం వ్యవహరించారు. రెండు రోజుల క్రితం జరిగిన యువజన సమావేశంలో కార్తీ నోరు జారారు. కామరాజర్ సుపరి పాలనను మళ్లీ తీసుకొస్తాం.. ఆ పాలనే లక్ష్యం..., పూర్వ వైభవం ధ్యేయం అన్న నినాదాల్ని పక్కన పెట్టి, భవిష్యత్తు లక్ష్యంగా ఏం చేద్దాం అన్న అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ర్టంలో కామరాజర్ లేనిదే కాంగ్రెస్ లేదని చెప్పవచ్చు. అలాంటి నేతను అగౌరవ పరిచే విధంగా కార్తీ చిదంబరం అనుచిత వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్‌లో రచ్చకు దారి తీస్తున్నది. కార్తీ వ్యాఖ్యల్ని అదే వేదిక మీదున్న ఈవీకేఎస్ తీవ్రంగానే ఖండించారు. ఇక మీదట ఎవరైనా కామరాజర్‌ను విమర్శించే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, కాంగ్రెస్‌లోని నాడార్ల సామాజిక వర్గ నేతలు మాత్రం జీర్ణించుకోవడం లేదు. కార్తీపై విమర్శనాస్త్రాలు ఎక్కుబెట్టే పనిలో పడ్డారు. కర్పూరం వాసన తెలుసా: తప్పును కప్పి పుచ్చుకునే విధంగా కార్తీ వ్యవహరించ కూడదని, క్షమాపణ చెప్పుకోవాలని పట్టుబట్టే పనిలో పలువురు కాంగ్రెస్‌వాదులు నిమగ్నం అయ్యారు. ఇందుకు కార్తీ సిద్ధంగా లేని దృష్ట్యా, ఈ వ్యాఖ్యల వివాదం చిలికి చిలికి తుపానులా మారే అవకాశాలు కన్పిస్తున్నాయి. వాసన్ రూపంలో ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ బలం, కార్తీ వ్యాఖ్యల రూపంలో ఎలాంటి పరిస్థితుల్ని సృష్టిస్తుందోనన్న బెంగ ఈవీకేఎస్లో మొదలైంది. ఈవీకేఎస్ సైతం తీవ్ర ఆగ్రహంతోనే ఉన్నారని చెబుతున్నారు. అయితే, చిదంబరం మద్దతు తనకు తప్పనిసరి కావడంతో చర్యల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు పేర్కొంటున్నారు. ఇందుకు అద్దం పట్టే విధంగా కార్తీపై ఆదివారం ఈవీకేఎస్ పరోక్షంగా తీవ్రంగానే స్పందించారు. తాంబరంలో జరిగిన పార్టీ వేడుకలో విలేకరులు ఈవీకేఎస్ను చుట్టుముట్టారు. కార్తీపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారని ప్రశ్నించారు. ఇందుకు ఈవీకేఎస్ ఇచ్చిన సమాధానానికి విస్మయం చెందాల్సిన వంతు మీడియాకు తప్పలేదు. కామరాజర్‌కు వ్యతిరేకంగా కార్తీ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదని దాట వేశారు. అదే సమయంలో కామరాజర్ గురించి ఇక మీదట ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే సహించబోనని హెచ్చరించారు. ‘గాడిదకు తెలుసునా... కర్పూర వాసన’ అంటూ పరోక్షంగా కార్తీ చిదంబరంను ఉద్దేశించి మండి పడటం గమనార్హం. ఇంటి ముట్టడి : కార్తీ వ్యాఖ్యలను నాడార్ల సమాఖ్య తీవ్రంగా పరిగణించింది. కార్తీ చిదంబరం క్షమాపణ చెప్పాలని, తన వ్యాఖ్యల్ని ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ, ఆ సమాఖ్య నేతృత్వంలో ఉదయం నిరసన కార్యక్రమం చోటు చేసుకుంది. తమ నాయకుడు కార్తీ చిదంబరం ఇంటిని ముట్టడించేందుకు నాడార్ల సమాఖ్య సిద్ధం కావడాన్ని ఆయన మద్దతుదారులు తీవ్రంగా పరిగణించారు. తమ నేత ఇంటి వద్దకు వచ్చే వాళ్లను అడ్డుకునేందుకు ముందుగానే నుంగబాక్కంలో మకాం వేశారు. అలాగే, పోలీసులు సైతం రం గంలోకి దిగారు. శాస్త్రి భవన్ వద్ద బారికేడ్లను ఏర్పాటు చేశారు. 11 గంటల సమయంలో నాడార్ల సమాఖ్య నాయకులు అటు వైపుగా రాగానే, వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈక్రమంలో తోపులాట, వాగ్యుద్దం చోటు చేసుకుంది. చివరకు ఆందోళనకారుల్ని పోలీసు లు అరెస్టు చేశారు. కార్తీ చిదంబరం ఇంటి పరిసరాల్లో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్తీ క్షమాపణ చెప్పే వరకు విడిచి పెట్టమని, తమ ఆందోళనలు కొనసాగుతాయని నాడార్ల సమాఖ్య స్పష్టం చేసింది. -
కాంగ్రెస్‌కు శని వదిలింది
సాక్షి, చెన్నై: నెల రోజుల క్రితం వరకు భుజాలు రాసుకుని తిరిగిన వాళ్లు ఇప్పుడు రాజకీయ శత్రువులయ్యారు. నిన్న మొన్నటి వరకు జీకే వాసన్‌ను ఉద్దేశించి సున్నిత వ్యాఖ్యలు చేసిన ఈవీకేఎస్ తాజాగా స్వరం పెంచారు. వాసన్ కొత్త పార్టీ ప్రయత్నాలు వేగవంతమయ్యే కొద్దీ ఆయనపై తీవ్ర విమర్శలు ఎక్కుబెట్టే పనిలో ఈవీకేఎస్ పడ్డారు. కాంగ్రెస్‌లో ఉన్నన్నాళ్లు జీకే వాసన్, ఈవీకేఎస్ ఇళంగోవన్లు స్నేహ పూర్వకంగా మెలిగారు. ఇతర గ్రూపుల్ని పక్కన బెడితే, వాసన్, ఈవీకేఎస్ గ్రూపులు కలసికట్టుగానే ఉన్నాయి. అయితే, ఈవీకేఎస్‌కు టీఎన్‌సీసీ పగ్గాలు చిక్కిన నేపథ్యంలో వాసన్ కాంగ్రెస్ గూటి నుంచి బయటకు వచ్చారు. సొంత కుంపటిగా కొత్త పార్టీ పనుల్ని వేగవంతం చేశారు. రాష్ట్రంలో పర్యటిస్తూ, తన మద్దతుదారుల్ని ఏకం చేయడం, కాంగ్రెస్ అసంతృప్తివాదుల్ని తన వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా వాసన్ పరుగులు తీస్తున్నారు. అయితే, వాసన్ వేగం పెరిగే కొద్దీ ఈవీకేఎస్లో ఆక్రోశం రగులుతోంది. కాంగ్రెస్ నుంచి వాసన్ బయటకు వెళ్లిన సమయంలో మర్యాద పూర్వకంగానే ఈవీకేఎస్ స్పందించారు. ఆయన బయటకు వెళ్లకూడదని, తమతోనే ఉండాలని, ఒక వేళ వెళ్లినా.. ఎక్కడున్నా సంతోషంగానే ఉండాలని ఆకాంక్షించారు. అయితే, కాంగ్రెస్వాదుల్ని తన వైపు తిప్పుకోవడంలో వాసన్ వ్యూహాలు సత్ఫలితాల్ని ఇస్తుండడం ఈవీకేఎస్‌కు మింగుడు పడటం లేదు. దీంతో వాసన్‌ను టార్గెట్ చేసి విమర్శల స్వరాన్ని పెంచే పనిలో పడ్డారు. కోయంబత్తూరు వేదికగా జరిగిన పార్టీ సమావేశంలో ఏకంగా శని వదిలిందంటూ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. కోయంబత్తూరులో ఈవీకేఎస్ పర్యటించారు. అక్కడ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగాన్ని అందుకున్న ఆయన జీకే వాసన్ ను టార్గెట్ చేసి విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన స్వరాన్ని పెంచుతూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొంగు మండలంలో కాంగ్రెస్‌ను చీల్చేందుకు అనేక కుట్రలు చేశారని, అయితే, వారి పాచికలు ఇక్కడ పార లేదన్నారు. ఇందుకు కారణం, ఇక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులకు పార్టీ మీదున్న అభిమానమేనన్నారు. కాంగ్రెస్‌ను నామరూపాలు లేకుండా చేయాలని, నిర్వీర్యం చేయాలని కుట్రలు చేస్తున్నార ని ధ్వజమెత్తారు. తాను ఉన్నంత కాలం ఎవరి కుట్రలు కుతంత్రాలు కాంగ్రెస్ నీడను కూడా తాకలేవన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. రాహుకాలం, యమగండం మాదిరిగానే శని వదిలిందని, ఆ వర్గం వెళ్లడంతో కాంగ్రెస్‌కు ఇక పూర్వ వైభవం రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ దయ లేకుండా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. కొత్త పార్టీలతో ఒరిగేది శూన్యమేనని, వాళ్లకు గుణపాఠం తథ్యమని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేతలు ఆర్ ప్రభు, కంద స్వామి, మనోహరన్, మయూరా జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
28న పార్టీ ప్రకటన
28న పార్టీ ప్రకటన మహిళా లోకం ఆదరణ వాసన్‌కు మద్దతు వెల్లువ కొత్త పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు చేశారు జీకే వాసన్. ఈ నెల 28న తిరుచ్చి వేదికగా పార్టీ పేరు, జెండా, సిద్ధాంతాలను ప్రకటించేందుకు రెడీ అయ్యారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వాసన్‌ను ఆ పార్టీ మహిళా లోకం ఆదరించే పనిలో పడింది. తాము సైతం అంటూ కాంగ్రెస్‌వాదుల మద్దతు వాసన్‌కు వెల్లువెత్తుతోంది. సాక్షి, చెన్నై: కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జీకే వాసన్ కొత్త పార్టీ కసరత్తుల్ని వేగవంతం చేశారు. తనకు అండగా నిలిచిన ప్రతి కార్యకర్తను, నాయకుడిని పలకరిస్తూ ముందుకు పరుగులు తీస్తున్నారు. ప్రధానంగా పార్టీ నాయకులు, యువజన నాయకులు, విద్యార్థి నాయకుల్ని ఆకర్షించే విధంగా రోజుకో ప్రకటన చేస్తున్నారు. యువతకు, విద్యార్థికి పెద్దపీట అని ప్రకటించిన వాసన్ తాజాగా 33 శాతం రిజర్వేషన్ అమలు తమ పార్టీ లక్ష్యంలో ప్రధాన అంశంగా మంగళవారం ప్రకటించారు. తనకు అండగా నిలుస్తూ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన మహిళా నేతలకు జీకే వాసన్ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. వారి మద్దతును స్వీకరిస్తూ, మహిళా లోకం దృష్టిని తన వైపు తిప్పుకునేందుకు సిద్ధం అయ్యారు. మహిళల మద్దతు: మైలాపూర్‌లోని కమ్యూనిటీ హాల్లో మహిళా నాయకుల నేతృత్వంలో వాసన్ మద్దతు కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన కోవై మహేశ్వరి, రాణి, కృష్ణమ్మ, అభి తదితర మహిళా నాయకుల నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళలు తరలి వచ్చారు. తనను ఆదరించేందుకు వచ్చిన ప్రతి మహిళకు వాసన్ కృతజ్ఞతలు తెలియజేశారు. వాసన్‌ను నిలువెత్తు పూలమాలతో మహిళా లోకం ముంచెత్తింది. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి వాసన్ ప్రసంగిస్తూ, రానున్నది మహిళ రాజ్యంగా పేర్కొన్నారు. ఇంటినే కాదు, రాజకీయాల్ని సైతం చక్కదిద్దడంలో మహిళా లోకం రాణిస్తున్నదన్నారు. యువతకు, విద్యార్థికీ పెద్దపీట వేయబోతున్న తమ పార్టీ, మహిళల కోసం ప్రధాన అంశంగా అజెండాగా 33 శాతం రిజర్వేషన్ అమలు నినాదంతో ముందుకు రాబోతున్నదన్నారు. ఈ నెల 28న తిరుచ్చిలో బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నామని ఈ సందర్భంగా తాము ఎంపిక చేసిన ముహూర్తాన్ని ప్రకటించారు. తిరుచ్చి జీ కార్నర్ మైదానం ఆవరణలో సాయంత్రం జరిగే ఈ బహిరంగ సభలో పార్టీని, జెండాను, సిద్ధాంతాలు, లక్ష్యాలను ప్రకటించనున్నట్టు వివరించారు. ముందుగా పార్టీ ఆవశ్యకతను వివరిస్తూ ముఖ్య నాయకుల ప్రసంగం ఉంటుందన్నారు. చిట్ట చివరగా పార్టీని తాను ప్రకటిస్తానని, ఈ ప్రకటన రాష్ట్ర, జాతీయ రాజకీయాల్లో పెను చర్చకు దారి తీయడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు జిల్లాల నుంచి కాంగ్రెస్‌ను వీడి వాసన్‌కు మద్దతు తెలియజేస్తూ పెద్ద ఎత్తున మహిళలతోపాటుగా వివిధ జిల్లాల నాయకులు కార్యకర్తలు తరలి రావడం విశేషం. ఈ సమావేశంలో వాసన్ మద్దతు నేతలు జ్ఞానదేశికన్, ఎస్ఆర్ బాల సుబ్రమణ్యన్, పీటర్ అల్ఫోన్స్, జ్ఞాన శేఖరన్, కోవై తంగం తదితరులు పాల్గొన్నారు. -
రజనీకాంత్ మద్దతు ఇస్తే చాలా బాగుంటుంది!
సాక్షి, చెన్నై: కొత్త మార్గంలో, సరికొత్తగా ఆవిర్భవించనున్న తమ పార్టీకి మద్దతు ప్రకటించాలని దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీకాంత్‌కు జీకే వాసన్ విజ్ఞప్తి చేశారు. మోదీ సర్కారు చెప్పేది ఒకటి, చేసేది మరొకటిగా ఉందని మండిపడ్డారు. శనివారం రామేశ్వరంలోని జాలర్ల కుటుంబాలను ఆయన పరామర్శించారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జీకే వాసన్ కొత్త పార్టీ పేరు, సిద్ధాంతాల విషయమై తీవ్ర కసరత్తుల్లో ఉన్నారు. తమ పార్టీ ప్రజల్లోకి త్వరితగతిన వెళ్లి చేరాలంటే, రాష్ట్రంలో ప్రముఖంగా ఉన్న వీఐపీల మద్దతును కూడట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. తమ పార్టీకి మద్దతు ఇవ్వాలంటూ సూపర్‌స్టార్ రజనీ కాంత్‌కు ఆహ్వానం పలుకుతూ విజ్ఞప్తి చేశారు. తమ కథానాయకుడిని రాజకీయాల్లోకి రావొద్దంటూ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ వ్యాఖ్యలు చేస్తే, జీకే వాసన్ మద్దతు అభ్యర్థించడం రజనీకాంత్ అభిమానుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. కొత్తగా, సరికొత్త మార్గంలో ఆవిర్భవించబోతున్న వాసన్ పార్టీ వ్యవహారాల మీద రజనీ అభిమానులు దృష్టి సారించే పనిలో పడడం గమనార్హం. మద్దతు ప్లీజ్ : రజనీకాంత్ చాలా మంచి వ్యక్తి అని, ఆయన తమకు మద్దతు ఇస్తే చాలా బాగుటుందని స్వయంగా జీకే వాసన్ శనివారం ఆహ్వానం పలికారు. ఆయన లాంటి వ్యక్తి మద్దతు ఉంటే, తమ పార్టీకి మరింత బలం చేకూరుతుందన్నారు. చెన్నై నుంచి ఉదయాన్నే మదురైకు చేరుకున్న జీకే వాసన్‌కు అభిమాన లోకం బ్రహ్మరథం పట్టింది. మదురైలో ఆయనకు ఘన స్వాగతం లభించడంతో అక్కడి కాంగ్రెస్ వర్గాలు విస్మయంలో పడ్డారుు. బాధితులకు భరోసా : ఉరి శిక్షను ఎదుర్కొంటున్న జాలర్ల కుటుంబాలను స్వయంగా వెళ్లి ఏ ఒక్కరూ ఓదార్చలేదు. వారిని చెన్నైకు ప్రభుత్వం పిలిపించుకుంది. అలాగే, ఆ బాధితులే డీఎంకే అధినేత కరుణానిధిని కలిసి మొర పెట్టుకోవాల్సి వచ్చింది. అయితే, అందరి కన్నా భిన్నంగా వాసన్ వ్యవహరించారు. రామేశ్వరంలో సమ్మెలో ఉన్న జాలర్లను ఆయన స్వయంగా వెళ్లి వారిని పరామర్శించారు. జాలర్లకు తన మద్దతు ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మోడీ సర్కారు చెప్పేది ఒకటి చేసేది మరొకటి అన్న చందంగా వ్యవహరిస్తోందని మండి పడ్డారు. జాలర్లను విడుదల చేయించేందుకు చర్యల్ని వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ ప్రజా సేవకు సరికొత్త మార్గదర్శి కాబోతున్నదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఎవరి బలం ఏమిటో వారం రోజుల వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని, తాను వెళుతున్న చోటల్లా లభిస్తున్న ఆదరణను గుర్తు చేసుకుంటే చాలు అని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తన పార్టీ ప్రజల్లోకి త్వరితగతిన తీసుకెళ్లేందుకు ప్రతి వీఐపీ మద్దతును కోరుతానని ఇంకో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. -
టార్గెట్ ‘కార్యాలయాలు’
సాక్షి, చెన్నై : రాష్ర్టంలోని కాంగ్రెస్ కార్యాలయాలు తమ గుప్పెట్లోకి తెచ్చుకునేందుకు వాసన్ వర్గం సన్నద్ధం అవుతోంది. గురువారం కడలూరు జిల్లా పార్టీ కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీయడంతో జిల్లా కలెక్టర్ రం గంలోకి దిగారు. టీఎన్‌సీసీ ప్రధాన కార్యదర్శి పదవికి కిళ్లియూర్ ఎమ్మెల్యే జాన్ జాకబ్ రాజీనామా చేశారు. తన పార్టీ, గుర్తు, కార్యాచరణ తెలియాలంటే వారం రోజులు వేచి ఉండాల్సిందేనని వాసన్ స్పష్టం చేశారు.రాష్ట్ర కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన జీకే వాసన్ తన మద్దతు బలాన్ని పెంచుకునే పనిలో పడ్డా రు. గతంలో కాంగ్రెస్ నుంచి మూపనార్ బయటకు వచ్చిన సమయంలో ముఖ్య నేతలందరూ ఆయన వెంట నడిచారు. అయితే, ఈ సారి పరిస్థితి భిన్నంగా ఉంది. ముఖ్య నేతలందరూ కాంగ్రెస్ వెంటే ఉన్నా, కింది స్థాయి కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో వాసన్ వెంట నడిచేందుకు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే వాసన్‌కు 30 జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇద్దరు ఎమ్మెల్యేలు, 9 మంది మాజీ ఎమ్మెల్యేలు, పలువురు మాజీ ఎంపీలు మద్దతు ప్రకటించారు. అలాగే, కాంగ్రెస్‌లో కొన్ని గ్రూపులకు చెందిన నాయకుల అనుచర గణాన్ని సైతం తమ వైపు తిప్పుకునేందుకు వాసన్ తీవ్ర ప్రయత్నాల్లో మునిగి ఉన్నారు. గ్రూపు నేతలతో విభేదాలున్న వారందర్నీ తమ వెంట తిప్పుకుని తిరుచ్చి వేదికగా బలాన్ని చాటేందుకు కుస్తీలుపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొన్ని జిల్లాల్లో వాసన్ మద్దతుదారులు జిల్లా పార్టీ కార్యాలయాలను టార్గెట్ చేయ టం చర్చకు దారి తీసింది. రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన ఆస్తులు, అనేక భవనాలు ట్రస్టు రూపంలో ఒకే చోటకు చేర్చారు. ఇందుకు ట్రస్టీగా గతంలో మూపనార్, తాజాగా వాసన్ వ్యవహరిస్తున్నారు. ఆయా జిల్లాల్లో పార్టీ కార్యాలయాల భవనాలు మూపనార్ హయూంలో నిర్మించారు. కాంగ్రెస్ నిధితో కాకుండా విరాళాలు సేకరించి నిర్మించిన జిల్లా పార్టీ కార్యాలయాలు అనేకం ఉన్నట్టు సమాచారం. వాసన్ బలం అధికంగా ఉన్న జిల్లాల్లోను పార్టీ భవనా లు నిర్మించారు. ప్రస్తుతం ఈ భవనాల్ని వాసన్ వర్గం టార్గెట్ చేసింది. వాటిని కాంగ్రెస్ గుప్పెట్లో నుంచి తమ ఆధీనంలోకి తెచ్చుకునే పనిలో పడ్డారు. అనేక మండల కార్యాలయాలు, నగర కార్యాలయాల భవనాలను తమ గుప్పెట్లోకి తెచ్చుని తమాకా జెండాల్ని ఎగుర వేయడం, ఆ కార్యాలయాలకు పేర్లను మార్చ డం వంటి చర్యల్లో మునిగారు. ఈ నేపథ్యంలో గురువారం కడలూరు జిల్లా పార్టీ కార్యాలయం కైవశం ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నా, వారిని తరిమి కొట్టి, తమ గుప్పెట్లోకి తెచ్చుకునే యత్నం చేశారు. ఆ భవనం రూపు రేఖల్ని తమాకా కార్యాలయంగా మార్చేశారు. అయితే, ఈ వ్యవహారం ఉద్రిక్తతకు దారి తీయడంతో ఆ జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. తాత్కాలికంగా ఆ భవనానికి సీల్ వేయడం గమనార్హం. జాకబ్ రాజీనామా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పదవికి కిళ్లియూరు ఎమ్మె ల్యే జాన్ జాకబ్ రాజీనామా చేశారు. ఈ మేరకు గురువారం సోనియా గాంధీకి రాజీనామా లేఖ పంపించా రు. కన్యాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో వాసన్ బలం అధికంగా ఉండడంతో, ఆ బలాన్ని మరింత రెట్టింపు చేయడం లక్ష్యంగా ఆ ప్రాంతానికి చెందిన నేతల్ని ఏకం చేసే పనిలో జాన్‌జాకబ్ నిమగ్నం అయ్యారు. దక్షిణ తమిళనాడులోని అనేక అసెం బ్లీ సెగ్మెంట్లు కాంగ్రెస్‌కు పట్టుకొమ్మలుగా గతంలో ఉండడంతో, అక్కడ పాగా వేయడమే లక్ష్యంగా కొన్ని బృందాలు కార్యాచరణ చేపట్టారుు. వెయిట్ అండ్ సీ ఆళ్వార్‌పేటలోని నివాసంలో వాసన్‌ను మీడియా కదలించింది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తమ వాళ్లు కైవశం చేసుకోవడం లేదని, వారికి చెందిన భవనాలపై ఉన్న హక్కుపై నిలదీస్తున్నారని ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పార్టీ పేరు, జెండా, విధి విధానాలు, అన్నింటిపై కసరత్తులు జరుగుతున్నాయని, వారం రోజుల్లో తిరుచ్చి వేదికగా అన్నీ ప్రకటిస్తామన్నారు. బిజీబిజీగా వున్న వాసన్ అప్పుడప్పుడు ఫోన్లలో మంతనాలలో మునిగి ఉండడం గమనించాల్సిందే. -
కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉంది: జీవిఎల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందనడానికి జీకే వాసన్ ఘటన ఉదాహరణ అని బీజేపీ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహరావు అన్నారు. కాంగ్రెస్ పార్టీపై సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలపై సొంత నేతలే విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. హర్యానా ప్రయోజనాలు కాపాడే విధంగా బీఎస్ హుడా వ్యవహరించలేదని, బీజేపీని ప్రశ్నించడానికి ఆయనకు నైతిక హక్కులేదని నరసింహరావు అభిప్రాయపడ్డారు. భూకేటాయింపుల వ్యవహారంలో రాబర్ట్ వాద్రాకు సంబంధముందనే విషయాన్ని కాగ్ నివేదికలో వెల్లడైందని ఆయన తెలిపారు. కేంద్రమాజీ మంత్రి, దివంగత నేత ముపనార్ కుమారుడు జీకే వాసన్ సోమవారం కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. తిరుచిలో జరిగే సభలో కొత్త పార్టీ పేరును ప్రకటిస్తామని జీకే వాసన్ తెలిపారు. -
కాంగ్రెస్ నుంచి జీకే వాసన్ బహిష్కరణ!
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. తమిళనాట కొత్త పార్టీని స్థాపిస్తున్నట్లు ప్రకటించిన జీకే వాసన్‌ను తమ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందునే ఈ బహిష్కరణ వేటు వేసినట్లు అధిష్ఠానం చెబుతోంది. అయితే, ఇప్పటికే తనంతట తానుగా బయటకు వెళ్లిపోయి, కొత్త పార్టీ కూడా పెడతానని చెప్పిన వాసన్‌ను ఇప్పుడు కాంగ్రెస్ బహిష్కరించడం ఏంటన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తమ తమిళనాడు శాఖకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వలేదని ముందునుంచే అక్కడి నేతలు రుసరుసలాడుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు వాసన్, రేపు మరికొందరు బయటకు వెళ్లడం ఖాయమని అంటున్నారు. -
కాంగ్రెస్ కు జీకే వాసన్ గుడ్ బై
-
కాంగ్రెస్ కు జీకే వాసన్ గుడ్ బై
చెన్నై: ఊహించిన విధంగానే కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత జీకే వాసన్ షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెపుతున్నట్టు జీకే వాసన్ ప్రకటించారు. తన తండ్రి జీకే ముపనార్ స్థాపించిన తమిళ మనిలా కాంగ్రెస్ ను పునరుద్ధరించే ప్రయత్నంలో వాసన్ ఉన్నట్టు సమాచారం. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలి, విధానాలపై జీకే వాసన్ దుమ్మెత్తి పోశారు. -
తమిళనాడు కాంగ్రెస్‌లో ముసలం
సాక్షి, చెన్నై:తమిళనాడు కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. కాంగ్రెస్ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ తిరుగుబాటు జెండా ఎగరేసేందుకు సిద్ధమవుతున్నట్టు సంకేతాలిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి తన తండ్రి దివంగత నేత జీకే ముపనార్ స్థాపించిన తమిళ మానిల కాంగ్రెస్(టీఎంసీ) పార్టీని పునరుద్ధరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, తమిళనాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీఎన్పీసీసీ) అధ్యక్ష పదవికి పీఎస్ జ్ఞానదేశికన్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానంలో ఈవీకేఎస్ ఇళంగోవన్‌ను నియమిస్తున్నట్టు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. జీకే వాసన్ తన తండ్రి స్థాపించిన తమిళ మానిల కాంగ్రెస్‌ను 2002లో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ప్రస్తుతం జ్ఞానదేశికన్తో కలసి దానిని పునరుద్ధరించడం లేదా కొత్త పార్టీ ఏర్పాటు చేసే పనిలో వాసన్ ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి కొద్ది రోజులుగా తన మద్దతుదారులతో మంతనాలు జరుపుతున్న వాసన్.. తన తదుపరి ప్రణాళికలను మూడో తేదీన వెల్లడిస్తానని శనివారం చెప్పారు. టీఎంసీ నినాదం ‘‘సుసంపన్న తమిళనాడు.. శక్తివంతమైన భారతదేశం’’ నినాదంతోనే ముందుకు వెళ్లాలని వాసన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. తమిళనాడులో ముపనార్, కామరాజనాడార్ల ప్రోద్బలంతోనే కాంగ్రెస్ పార్టీ బలపడిందని, అయితే ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం వీరికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని వాసన్ ఆరోపిస్తున్నారు. పార్టీకి చెందిన అత్యంత కీలకమైన నాయకుల విషయంలో పార్టీ తప్పుడు విధానాలు అవలంబిస్తోందని, వారి ఫొటోలను సభ్యత్వ కార్డులపై నుంచి తొలగించిందని ఆరోపించారు. పార్టీ నాయకత్వం తమిళనాడు ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తమిళనాడు కాంగ్రెస్ కమిటీని ఏఐసీసీ పూర్తిగా విస్మరించిందన్నారు. మొత్తానికి ముపనార్, కామరాజ్ కార్డుతో తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పాలని వాసన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. -
కాంగ్రెస్ అధిష్టానంపై తమిళ కాంగ్రెస్ నేత అసహనం!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధిస్టానంపై తమిళ కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి మొదలైంది. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం, విధానాలపై జీకే ముపనార్ కుమారుడు జీకే వాసన్ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడే యోచనలో వాసన్ ఉన్నట్టు తెలుస్తోంది. మళ్లీ తమిళ మానిల కాంగ్రెస్ (టీఎంసీ) పునరుద్ధరణకు వాసన్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. తండ్రి ముపనార్ పార్టీ టీఎంసీని పునరుద్ధరించి.. తమిళ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి వ్యూహాలు పన్నుతున్నారని మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. -
హస్తంలో సారథి పోరు
జవసత్వాలు కోల్పోయిన త మిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) సారథిగా కొత్త వ్యక్తిని నియమించడం ద్వారా బలోపేతం చేయాలన్న ప్రయత్నాలు ఊపందుకున్నాయి. అధ్యక్షుడిని మార్చదలుచుకుంటే జీకే వాసన్‌కే పట్టం కట్టాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా వెలిసిన పోస్టర్లు చర్చనీయాంశమయ్యూయి. చెన్నై, సాక్షి ప్రతినిధి:ప్రాంతీయ పార్టీల పొత్తులతోనే ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న టీఎన్‌సీసీ ఇటీవల పార్లమెంటు ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగింది. కాంగ్రెస్‌తో పొత్తుకు ఏ చిన్న ప్రాంతీయ పార్టీ కూడా ముందుకు రాకపోవడంతో ఏకాకిగానే పోటీచేసి అనేక స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. పార్టీ పరాజయం పాలుకాగానే ప్రస్తుత టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్‌ను బాధ్యతల నుంచి తొలగించాలనే నినాదాలు మొదలయ్యూయి. కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం వర్గీయులే ఈ నినాదాలకు నేతృత్వం వహించారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్‌లో బలమైన క్యాడర్ కలిగి ఉన్న జీకే వాసన్ మద్దతు ఉండడంతో అధిష్టానం తాత్కాలికంగా మిన్నకుండిపోయింది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఆ తరువాత చూద్దాంలెమ్మని సర్దిచెప్పింది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు ముగిసిపోయి ఆ రెండు రాష్ట్రాల్లో సైతం కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడంతో పార్టీ అధ్యక్షుల మార్పు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. దేశంలో నానాటికీ తరిగిపోతున్న కాంగ్రెస్ ప్రాభవాన్ని కాపాడుకునేందుకు అధ్యక్షుల మార్పు అనివార్యమనే ఆలోచనలో అధిష్టానం పడిపోయింది. జీకే వాసన్ పోస్టర్లు మరో రెండేళ్లలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఇతర రాష్ట్రాల్లోని ఫలితాలే తమిళనాడులో పునరావృతం కాకుండా కాంగ్రెస్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో టీఎన్‌సీసీ అధ్యక్షుని మార్పు అంశం అత్యంత ప్రాధాన్యమైంది. జీకే ముప్పనార్ కాంగ్రెస్‌ను వీడి తమిళ మానిల కాంగ్రెస్ పార్టీ స్థాపించినపుడు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఆయన వెంటనడిచారు. ముప్పనార్ మరణం తరువాత ఆయన కుమారుడు జీకే వాసన్ ఆ పార్టీని జాతీయ కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఈ కారణంగా రాష్ట్రంలో జీకే వాసన్‌కు బలమైన అనుచర వర్గం ఉంది. టీఎన్‌సీసీ అధ్యక్షుని మార్పు అనివార్యమని అధిష్టానం భావించినట్లయితే జీకే వాసన్‌కే అవకాశం ఇవ్వాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల పోస్టర్లు అంటించారు. ‘అయ్యానే కాంగ్రెస్..కాంగ్రెస్సే అయ్యా జీకే వాసన్’ అనే నినాదంతో పోస్టర్లు వెలిశాయి. పనిలోపనిగా ఆ పోస్టర్లలో దీపావళి శుభాకాంక్షలు సైతం పొందుపరిచారు. కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం కూడా తనకు లేదా తన అనుచరునికి టీఎన్‌సీసీ పగ్గాలు అప్పగించాలని కోరుతున్నారు. జీకే వాసన్ నాయకత్వాన్ని తీవ్రంగా విబేధించే పీ చిదంబరం గట్టి పోటీనే ఇచ్చే అవకాశం ఉంది. అయితే జీకే వాసన్‌ను విస్మరిస్తే తమిళ మానిల కాంగ్రెస్ ఎక్కడ మళ్లీ పుట్టుకొస్తుందోననే భయం అధిష్టానంలో ఉంది. టీఎన్‌సీసీ అధ్యక్షునిగా జ్ఞానదేశికన్‌ను కొనసాగించినా లేదా ఆయనను బలపరిచే జీకే వాసన్‌ను నియమించినా కొత్త సీసాలో పాత సారా మాదిరిగా తయరై అసలు ఉద్దేశం నీరుగారిపోతుందని కాంగ్రెస్ యోచిస్తోంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలను పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ స్వయంగా పర్యవేక్షిస్తుండగా ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకోంటారోననే ఆసక్తి నెలకొంది. -
జ్ఞానదేశికన్‌కు పదవీ గండం
టీఎన్‌సీసీ అధ్యక్షుడు జ్ఞానదేశికన్ పదవి ఊడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన్ను తొలగించాలని ఫిర్యాదులు ఏఐసీసీకి వెల్లువెత్తారుు. కొత్త అధ్యక్షుడిగా తిరునావుక్కరసును నియమించే అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. సాక్షి, చెన్నై: రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రధాన గ్రూపు నేతగా ఉన్న కేంద్ర నౌకాయూన శాఖ మంత్రి జీకే వాసన్ మద్దతుదారుడు జ్ఞాన దేశికన్ టీఎన్‌సీసీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. ఈయన్ను ఆ పదవి నుంచి తొలగించడమే లక్ష్యంగా ప్రత్యర్థి గ్రూపులు తీవ్రంగానే గతంలో ప్రయత్నాలు చేశాయి. అయితే, వాసన్ పలుకుబడి ముందు ఆ ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. అయితే, తాజాగా ఆయన్ను పదవి నుంచి తొలగించాలన్న నినాదం మళ్లీ తెర మీదకు వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ కష్టాల మడుగులో మునగడం వెనుక జ్ఞానదేశికన్ పనితీరు కారణం అంటూ ఫిర్యాదులు ఏఐసీసీకి వెల్లువెత్తుతున్నాయి. డీఎంకే మీద ఇది వరకు పదే పదే జ్ఞాన దేశికన్ విమర్శలు గుప్పించడంతోనే ఆ పార్టీ ఎన్నికల వేళ ఛీదరించుకున్నదంటూ మరి కొందరు కాంగ్రెస్‌వాదులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఒంటరి కష్టం: రాష్ర్టంలో ఒంటరిగా కాంగ్రెస్ మనుగడ సాధించడం కష్టతరం అంటూ పలువురు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో సీనియర్లు పోటీ నుంచి తప్పుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఒంటరిగా ఎన్నికల్ని ఎదుర్కొనలేకే వారు దూరంగా ఉండాల్సిన పరిస్థితిని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో పతనం తప్పదని, మళ్లీ పుంజుకోవాలంటూ సరికొత్తగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని వివరించి ఉన్నారు. ప్రధానంగా అధ్యక్షుడిని మార్చాల్సిందేనని, అప్పుడే రాష్ట్రంలో డీఎంకేకు దగ్గర కావచ్చని మరి కొందరు పేర్కొన్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. డీఎంకే అత్యధిక సీట్లు సాధించిన పక్షంలో, కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాలు దొరికిన పక్షంలో, వారి మద్దతు కూడగట్టుకోవాలంటే, అందుకు తగ్గ చర్చలకు సమర్థులు అవసరం అని సూచించారు. ఇక్కడ రాష్ర్ట పార్టీ అధ్యక్షుడిలో ఉత్సాహం, చురుకుదనం లేదని, ఆయన్ను తొలగిస్తేనే రాష్ట్రంలో పార్టీ బాగుపడుతుందని సూచించినట్టు, ఈ ఫిర్యాదులను సోనియా వ్యక్తిగత కార్యదర్శి అహ్మద్ పటేల్ పరిశీలించినట్టు సమాచారం. అధ్యక్షుడిని మార్చాలంటూ రాహుల్ సైతం ఇది వరకు సంకేతం ఇచ్చి ఉండడంతో ఆ పదవిని చేజిక్కించుకునేందుకు ముగ్గురి మధ్య పోటీ నెలకంది. గతంలో కష్ట కాలంలో ఉన్న పార్టీని సమర్థవంతంగా నడిపించి గాడిలో పెట్టిన మాజీ అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి ఈవీకేఎస్ ఇళంగోవన్ సైతం రేసులో ఉన్నట్టు తెలిసింది. గత అనుభవాలతో మళ్లీ పార్టీని గాడిలో ఆయన పెట్టగలరన్న నమ్మకం ఉన్నా, కొత్త వాళ్లకు చోటు ఇచ్చేందుకు రాహుల్ నిర్ణయించినట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ దృష్ట్యా, కేంద్ర సహాయ మంత్రి సుదర్శన నాచ్చియప్పన్ లేదా, జాతీయ కార్యదర్శి తిరునావుక్కరసుకు పదవి దక్కవచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే, రాహుల్‌తో తిరునావుక్కరసుకు వ్యక్తిగతంగా పరిచయం ఉండటం, ఆయన పోటీ చేసిన రామనాధపురానికి స్వయంగా రాహుల్ వచ్చి ప్రచారం నిర్వహించడం తెలిసిందే. ఈ దృష్ట్యా, టీఎన్‌సీసీ పదవిని తిరునావుక్కరసు తన్నుకెళ్లొచ్చంటూ ఆ పార్టీ వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. -
దేశాన్ని పరిపాలించే సత్తా కాంగ్రెస్‌కే
సేలం, న్యూస్‌లైన్ : భారత దేశాన్ని పరిపాలించే సామర్థ్యం కాంగ్రెస్‌కు మాత్రమే ఉందని కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి జీకే వాసన్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం సేలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ బీజేపీ పార్టీ ఇప్పటి వరకు తమ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేయలేదని తెలిపారు. ఆ పార్టీ శ్రేణుల్లో సఖ్యత లేకపోవడమే అందుకు కారణమన్నారు. సఖ్యత లేని పార్టీ దేశాన్ని ఎలా పరిపాలించగలదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఒంటరి పోరు వల్ల కార్యకర్తలు, ప్రజల్లో చైతన్యం వచ్చిందన్నారు. శ్రీలంక తమిళల హక్కుల సాధనకు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అండగా ఉందని జీకే వాసన్ పేర్కొన్నారు -
వామ్మో కాంగ్రెస్ టికెట్టా!
చెన్నై, సాక్షి ప్రతినిధి :కాంగ్రెస్ టికెట్‌పై పోటీనా వద్దు బాబోయ్ అంటున్నారు కేంద్ర మంత్రులు. కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలదే హవా. కాంగ్రెస్ సైతం ప్రాంతీయ పార్టీల గొడుగు కిందే కొనసాగుతోంది. ఈ సారి కాంగ్రెస్ పరిస్థితి తారుమారైంది. బలహీనంగా ఉన్న బీజేపీ బలమైన కూటమిని ఏర్పరుకుంది. డీఎంకేతో పొత్తుపెట్టుకుని యూపీఏ 1, 2 కాలంలో బలంగా ఉన్న కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడింది. జాతీయ స్థాయిలో అనేక అప్రతిష్టలు మూటగట్టుకున్న ఫలితంగా కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకునేందుకు రాష్ట్ర స్థాయిలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా ముందుకు రాలేదు. ఇక తప్పని సరై కాంగ్రెస్ ఒంటరిపోరుకు సిద్ధమైంది. అనేక ప్రాంతీయ పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడిన బీజేపీ, డీఎంకే, అధికార అన్నాడీఎంకేలు ఢీ అంటే ఢీ అంటూ ముందుకు సాగుతున్నాయి. బలమైన ప్రాంతీయ పార్టీల నడుమ నలిగిపోయే కంటే పోటీకీ దూరంగా ఉంటేనే మేలని నిర్ణయించుకున్న కాంగ్రెస్ బడా నేతలు ముఖం చాటేయడం మొదలుపెట్టారు. అధిష్టానం వద్ద తనకున్న పరపతిని ఉపయోగించిన కేంద్ర మంత్రి చిదంబరం సైతం చల్లగా పోటీ నుంచి తప్పుకుని తన కుమారుడు కార్తీని బరిలో నిలిపారు. సీనియర్ నేతలు పోటీ చేయాల్సిందేనని అధిష్టానం హుకుం జారీచేయడంతోపాటు ఎనిమిది మంది సిట్టింగ్ ఎంపీల్లో ఆరుగురికి టికెట్ ఖరారుచేసి జాబితాలో చేర్చింది. వద్దు వద్దంటున్నా వినిపించుకోని అధిష్టానం వైఖరితో మింగుడు పడని సిట్టింగ్ ఎంపీలు బలవంతంగానే బరిలోకి దిగుతున్నారు. జీకే వాసన్‌కు తప్పని పోరు రాష్ట్ర కాంగ్రెస్‌లో భిన్న ధృవాలైన కేంద్ర మంత్రులు చిదంబరం, జీకే వాసన్ ఇద్దరూ పోటీకి దూరంగా ఉంటామని ముందుగానే ప్రకటించారు. పోటీ విషయంలో సిట్టింగ్ ఎంపీల పట్ల నిఖార్సుగా వ్యవహరించిన అధిష్టానం చిదంబరం పట్ల మెతకవైఖరిని అవలంబించింది.ప్రచారానికే పరిమితం కానున్నట్లు జీకే వాసన్ ప్రకటించుకున్నారు. అధిష్టానం అందుకు ఒప్పుకోనట్లు తెలిసింది. రాజ్యసభ సభ్యుని హోదాలో నౌకాయానశాఖా మంత్రిగా పదవిని అనుభవించిన వాసన్ ఈ సారి ఎన్నికల్లో పోటీ చేయక తప్పదని అధిష్టానం ఆదేశించినట్లు సమాచారం. రాష్టంలో 39 లోక్‌సభ స్థానాలకు గాను 37 చోట్ల అభ్యర్థుల జాబితా వెల్లడైంది. దక్షిణ చెన్నై, విల్లుపురం స్థానాలకు ఇంకా అభ్యర్థులను ఎంపిక చేయలేదు. దక్షిణ చెన్నై నుంచి జీకే వాసన్‌ను బరిలోకి దించాలని అధిష్టానం భావిస్తున్న ట్టు సమాచారం. ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు వాసన్ అంగీకరించని పక్షంలో జాబితాలో మార్పు చేసైనా అతన్ని పోటీలో నిలపాని నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.అధిష్టానం ఆదేశాలకు వాసన్ తలొగ్గుతారా, పార్టీలోని తన ప్రత్యర్థి చిదంబరంను మినహాయించి తనను మాత్రం ఎందుకు ఒత్తిడి చేస్తున్నారని వాదించి తప్పించుకుంటారా అనేది వేచి చూడాల్సిందే. మూడో జాబితాలో నలుగురు రాష్ట్రంలోని 39 స్థానాల్లో అభ్యర్థులను భర్తీ చేసేందుకు తంటాలు పడుతున్న కాంగ్రెస్ ఇప్పటికి రెండు జాబితాలను విడుదల చేసింది. తొలి విడతలో 30 మంది, మలి విడతలో ఇద్దరి పేర్లను ఖరారు చేసింది. తాజాగా బుధవారం విడుదల చేసిన మూడో జాబితాలో నలుగురి పేర్లను వెల్లడించింది.ఉత్తర చెన్నై నుంచి బీజూ సాక్కో, కృష్ణగిరి నుంచి డాక్టర్ సెల్వకుమార్, కరూరు నుంచి జ్యోతిమణి, కన్యాకుమారి నుంచి వసంతకుమార్ పోటీ చేయనున్నారు. మూడో జాబితాతో 37 సీట్లకు అభ్యర్థుల ఎంపిక పూర్తవగా, మరో రెండు స్థానాలు పరిశీలనలో ఉన్నాయి. కాంగ్రెస్ పుస్తకాలు సీజ్ యూపీఏ పాలనలో కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ ముద్రించిన పుస్తకాలను ఫ్లరుుంగ్ స్క్వాడ్ అధికారులు బుధవారం సీజ్ చేశారు. కేరళ రాష్ట్రం కొట్టాయం లోక్‌సభ స్థానం నుంచి జోస్ కే మానిక్ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ విజయాలను వివరిస్తూ తమిళనాడులోని శివకాశిలో ప్రింటింగ్ ప్రెస్ ద్వారా 17 లక్షల పుస్తకాలను ముద్రించారు. కాంగ్రెస్ పుస్తకాలను వేసుకుని కేరళకు వెళుతున్న కారును నెల్లై జిల్లా శివగిరి తాలూకా పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీచేశారు. పుస్తకాలకు సంబంధించి ఆర్డరు, ముద్రణకు చెల్లించిన బిల్లు మరే ఆధారమూ లేకపోవడంతో కారు సహా పుస్తకాలను సీజ్ చేశారు. విరుదునగర్‌కు చెందిన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
యూపీఏదే విజయం
చెన్నై, సాక్షి ప్రతినిధి: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో లౌకికవాద యూపీఏ కూటమికి విజయం త థ్యమని కేంద్ర నౌకాయాన శాఖా మంత్రి జీకే వాసన్ ధీమా వ్యక్తం చేశారు. చెన్నై తండియార్‌పేటలో కొత్తగా ఏర్పాటుచేసిన మాజీ ఉప ప్రధాని బాబూ జగజ్జీవన్‌రామ్ విగ్రహాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, 2004, 2009 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ఎటువంటి వ్యూహంతో ప్రజల్లోకి వెళ్లి గెలిచిందో, అదే వ్యూహంతో నేడు సిద్ధం అవుతోందని పేర్కొన్నారు. యూపీఏ-1, యూపీఏ-2 కాలంలో ప్రభుత్వం అమలుచేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే గెలుపుబాట వేస్తాయని చెప్పారు. దేశంలోని లౌకికపార్టీలు కాంగ్రెస్‌తోనే ఉంటాయని అన్నారు. రాష్ట్రంలోని ద్రవిడ పార్టీలన్నీ కాంగ్రెస్ అండతోనే అధికారంలోకి వచ్చాయని గుర్తుచేశారు. ఈనెల 20వ తేదీన జరగనున్న శ్రీలంక, భారత్ చర్చల్లో తమిళ మత్స్యకారుల సమస్యకు పరిష్కారం లభించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. స్వాతంత్రోద్యమ సమరంలో వీరజవానులా పోరాడిన జగజ్జీవన్‌రాం విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం కలగడం అదృష్టమని వాసన్ పేర్కొన్నారు. -
గ్యాస్ ధర పెంపు పేదలకు భారం
టీనగర్, న్యూస్‌లైన్: సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ల ధర పెంపు పేద ప్రజలకు భారంగా పరిణమిస్తుందని కేంద్ర నౌకాయాన శాఖా మంత్రి జీకే వాసన్ వ్యక్తం చేశారు. చెన్నై పోర్టు ట్రస్ట్ ఆధ్వర్యంలో పోర్టు ట్రస్ట్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఉచిత వైద్య శిబిరం శనివారం జరిగింది. ఈ శిబిరాన్ని జీకే వాసన్ ప్రారంభించారు. పోర్టుట్రస్ట్ చైర్మన్ అతుల్య మిశ్రా, పోర్టుట్రస్ట్ ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ లలితా గణపతి పాల్గొన్నారు. ఈ శిబిరంలో రూ.2వేల మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంతో పాటు మాజీ స్పీకర్ చెల్లపాండియన్ 101 జయంతి వేడుకలు జరిగాయి. చెల్లపాండియన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వికలాంగులు 20 మందికి మంత్రి పరికరాలను అందజేశారు. దీనికి సంబంధిం చిన ఏర్పాట్లను చెల్లపాండియన్ కుమారు డు, ట్రస్ట్ చైర్మన్ ఎ.పిచ్చై చేశారు. విలేకరులతో వాసన్ మాట్లాడుతూ పోర్టు ట్రస్ట్ వైద్య శిబిరం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పోర్టుట్రస్ట్లలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సబ్సిడీ లేని గ్యాస్ సిలిండర్ల ధర పెంపు పేద ప్రజలను తీవ్రంగా బాధిస్తుందన్నారు. ఈ ధర పెంపును పునఃపరిశీలించాలని తెలిపారు. సబ్సిడీ సిలిండర్ల సంఖ్యను తొమ్మిది నుంచి 12కు పెంచాలని పెట్రోలియం శాఖా మంత్రిని కోరుతున్నట్లు తెలి పారు. జాలర్ల సమస్యపై ఇరు దేశాల జాలర్ల సంఘాల ప్రతినిధులతో జనవరి 20వ తేదీన సమావేశం ఏర్పాటుకానుందన్నారు. కాంగ్రెస్ నాయకత్వా న్ని బలపరిచే పార్టీలతోనే పొత్తులు ఉంటాయని తెలి పారు. గెలుపు కూటమిని త్వరలో కాంగ్రెస్ అధిష్టానం ప్రకటిస్తుందని తెలిపారు. -
జాతీయ జలమార్గంగా ‘కాకినాడ-పుదుచ్ఛేరి’
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ జలమార్గాలుగా ప్రకటించినవాటినే కేంద్ర ప్రభుత్వం అభివృద్ధిచేసి, నియంత్రిస్తుందని కేంద్ర నౌకాయాన మంత్రి జీకేవాసన్ తెలిపారు. రాజ్యసభలో శుక్రవారం ఒక ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో మంత్రి ఈ విషయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్ఛేరిలలో చేపట్టిన కాకినాడ- పుదుచ్ఛేరి కాల్వతోపాటు గోదావరి, కృష్ణా నదుల్లో మొత్తంగా 1078 కిలోమీటర్ల దూరాన్ని జాతీయ జలమార్గంగా అభివృద్ధిపరుస్తున్నామన్నారు.