జల్లికట్టుపై ఒత్తిడి
తమిళులకు అత్యంత ప్రీతిపాత్రమైన జల్లికట్టు వేడుకలపై సుప్రీంకోర్టు విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలనే ఒత్తిళ్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు సైతం జల్లికట్టు ప్రియులకు మద్దతుగా గళం విప్పుతున్నాయి. గతేడాది పొంగల్ పండుగకు ఎంతో ఉత్కంఠగా సాగిన జల్లికట్టు ఈ సారి నిషేధాన్ని ఎదుర్కొంది.
చెన్నై, సాక్షి ప్రతినిధి : తమిళనాడు సంప్రదాయాన్ని ప్రతిబింబించే వేడుకల్లో జల్లికట్టు అత్యంత ప్రధానమైనది. తెలుగు ప్రజలకులాగే తమిళనాట పొంగల్ పండుగ ప్రసిద్ధి. కొత్త బట్టలు, పిండివంటలతో సరిపోదు జల్లికట్టు ఆడాల్సిందే. మదించిన దున్నను అదుపుచేయడాన్ని జల్లికట్టు క్రీడగా చెబుతారు. జల్లికట్టు క్రీడలో జయించిన యువకుడు వచ్చే ఏడాది పొంగల్ వరకు వీరుడిగా చలామణి అవుతాడు. మదురై, అలంగానల్లూరు, పుదుక్కోట్టై, కారైక్కుడి, శివగంగై, సేలం, తేనీ తదితర ప్రాంతాల్లో జల్లికట్టు ప్రసిద్ది. ముఖ్యంగా అలంగానల్లూరులో జల్లికట్టును చూసేందుకు దేశ ం నలుమూలల నుంచేగాక విదేశీయులు సైతం వస్తారు. సేలం మ్యూజియంలోని పురాతన శిల దీని ప్రాచుర్యాన్ని చెబుతోంది.
ఈ ఏడాది నుంచి నిషేధం
అయితే చూసేవారికి జల్లికట్టు ఎంత ఆసక్తిగా ఉంటుందో ఆడేవారికి అంత ప్రమాదకరంగా ఉంటుంది. ఒక్క ఉదుటున వీరులపైకి దూకే దున్న అతివేగంగా పరుగులు తీస్తుంది. అడ్డువచ్చిన వారిని పొడుస్తూ, తొక్కుతూ వెళుతుంది. ఈ సమయంలో ఎందరో యువకులు తీవ్రగాయాలకు గురవుతుంటారు. కొందరు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. 2012లో జల్లికట్టులో రాష్ట్రంలో ముగ్గురు మృతి చెందగా, 33 మంది తీవ్రగాయాలకు గురయ్యూరు. జల్లికట్టులోకి దించే ముందు దున్న చేత మద్యం తాగిస్తారనే ప్రచారం కూడా ఉంది. ఇది జంతు ప్రేమికులకు తీవ్ర అభ్యంతరమైంది. దీంతో జంతు ప్రేమికుల సంఘం రెండేళ్ల క్రితం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. మనుషులు తమ వినోదం కోసం జంతువులను వేధిస్తున్నారని, వాటి స్వేచ్ఛకు విఘాతం కల్పిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు జల్లికట్టును నిషేధిస్తూ ఈ ఏడాది మే 7వ తేదీన తీర్పు చెప్పింది. అయితే అప్పటికే పొంగల్ పండుగ ముగిసి జల్లికట్టు సంబరాలను పూర్తిచేసుకున్నారు. నిషేధంతో అదే ఆఖరు జల్లికట్టుగా మారింది. సుప్రీం కోర్టు తీర్పువెలువడిన వెంటనే పలు సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయింది. ఈ తీర్పు తమిళుల ఆచార, వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను అడ్డుకోవడమేనని విమర్శించాయిఅరుుతే వచ్చేనెల రెండోవారంలో పొంగల్ పండుగ సమీపిస్తుండగా జల్లికట్టు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. నిషేధం విధించిన తరువాత వస్తున్న తొలి పొంగల్ కావడంతో ప్రజాప్రతినిధుల ద్వారా నిషేధాన్ని ఎత్తివేయించాలనే అభిప్రాయానికి పల్లె ప్రజలు వచ్చారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే శరత్‌కుమార్ తొలుత స్పందించారు. జల్లికట్టును కొనసాగించాలని కోరారు.
తమిళ మానిల కాంగ్రెస్ అధినేత, కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ శనివారం ఒక ప్రకటనలో జల్లికట్టు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కోరారు. తమిళుల వీరత్వాన్ని చాటుకునే క్రీడగా పేరుగాంచిన జల్లికట్టును నిషేధించడం వారి వీరత్వాన్ని అడ్డుకున్నట్లుగా విమర్శించారు. యువకులకు దెబ్బలు తగులుతాయని భావిస్తే జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చుగానీ జల్లికట్టును అడ్డుకోవడం సరికాదని ఆయన అన్నారు. పొంగల్ పండుగలోగా నిషేధం ఎత్తివేతకు చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.