సాక్షి, సేలం: తమిళ సాంప్రదాయ క్రీడ జల్లికట్టును సేలంలో బుధవారం వేడుకగా నిర్వహించారు. రంకెలేస్తూ పరుగులు తీసిన ఎద్దులను అణచివేసి యువకులు తమ వీరత్వాన్ని చాటుకున్నారు. సేలం జిల్లా ఆత్తూరు సమీపం కూలమేడులో ఏటా పొంగల్ సందర్భంగా జల్లికట్టు నిర్వహిస్తారు. ఈ ఏడాది బుధవారం జల్లికట్టు వేడుకగా జరిగింది. ఇందుకు జిల్లా నిర్వాహకం అన్ని ఏర్పాట్లు చేసింది.
ముందస్తు చర్యలు:
ముందస్తు చర్యగా జల్లికట్టులో పాల్గొనే యువకులకు శారీరక దృఢత్వ సర్టిఫికేట్‌లను అందజేశారు. పదునుగా ఉన్న జల్లికట్టు ఎద్దుల కొమ్ములను పశువైద్యులు మందంగా తయారు చేశారు. కూలమేడులో జల్లికట్టు జరిగే ప్రాంతంలో అంబులెన్స్, 15 మంది వైద్యులు, సిబ్బందితో వైద్య సేవలను ఏర్పాటు చేశారు. ఎస్పీ రాజన్ అధ్యక్షతన 500 మందికి పైగా పోలీసులు భద్రతా చర్యల్లో పాల్గొన్నారు.
ప్రారంభించిన కలెక్టర్:
జల్లికట్టు సందర్భంగా సుప్రీంకోర్టు సూచనలను తప్పక పాటిస్తామంటూ జల్లికట్టులో పాల్గొన్న యువకులచే కలెక్టర్ రోహిణీ బాజీ బగారే ప్రతిజ్ఞ చేయించారు. తర్వాత ఆమె పచ్చజెండా ఊపి జల్లికట్టును ప్రారంభించారు. ఈ పోటీలో 450ఎద్దులు వాడివాసల్ నుంచి బయటకు దూసుకొని రాగా, 300మంది వీరులు ఎద్దులను ఎదురొడ్డి, కొమ్ములు పట్టి అణచి వేసి తమ వీరత్వాన్ని చాటుకున్నారు. ఈ పోటీలు మూడు విభాగాలుగా నిర్వహించారు. గెలుపొందిన వీరులకు, ఎద్దుల యజమానులకు సర్టిఫికేట్లు, బహుమతులను అందజేశారు. ఈ పోటీలో 40 మంది యువకులు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని సేలం జీహెచ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment