సాక్షి, చెన్నై : జల్లికట్టుకు అడుగడుగునా అడ్డంకులే. ఈ నేపథ్యంలో క్రీడాకారులు, నిర్వాహకుల్లో ఆగ్రహ జ్వాల బయలుదేరిది. ఈ వ్యవహారంలో కేంద్రం చేతులెత్తేయడంతో పాటుగా బంతిని రాష్ట్ర ప్రభుత్వ కోర్టులోకి నెట్టడంతో ఇక, అమ్మ(జయలలిత) నిర్ణయం కోసం సర్వత్రా ఎదురు చూపుల్లో పడ్డారు. అత్యవసర చట్టంతో అనుమతి ఇవ్వాల్సిందేనని పట్టుబడుతూ గురువారం కూడా నిరసనలు సాగాయి. రాష్ట్రంలోనే జల్లికట్టుకు ప్రసిద్ధిచెందిన మదురై జిల్లా అలంగానల్లూరు, పాలమేడుల్లో భోగి పర్వదినాన్ని ప్రజలు బహిష్కరించారు.
దుకాణాలు మూత బడ్డాయి. ప్రజలతో కలిసి నిర్వాహకు లు, క్రీడాకారులు నిరసన ప్రదర్శనలు సాగించారు. నల్ల బ్యాడ్జీలు, నల్ల చొక్కాలు ధరించి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కడంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమ సంప్రదాయాన్ని, మనో భావాల్ని దెబ్బ తీయెద్దంటూ నిరసనకారులు నినాదించారు. జంతుసంరక్షణా సంస్థలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరుచ్చిలోని లాల్లుడిలో చిదంబరం రహదారిపై నిరసన కారులు బైఠాయించడంతో ఎక్కడి వాహనాలు అక్కడే ఆగాయి.
వీరిని బుజ్జగించడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది. చెన్నైలో ఎస్‌ఎంకే నేతృత్వంలో భారీ నిరసనగా రైల్‌రోకోకు ఆ పార్టీ వర్గాలు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఇక, జల్లికట్టుకు అనుమతి ఇవ్వాలని లేని పక్షంలో నిషేధాజ్ఞలు ఉల్లంఘించాల్సి ఉంటుందన్న హెచ్చరికలు బయలుదేరాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం కోసం సర్వత్రా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. శనివారం కనుమ సందర్భంగా అలంగానల్లూరులో జల్లికట్టు నిర్వహించడం ఆనవాయితీ. దీంతో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటిస్తుందన్న ఆశాభావంతో సర్వత్రా ఉన్నారు.
అయితే, వ్యవహారం కోర్టులో ఉన్న దృష్ట్యా, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న ఎదురు చూపుల్లో నిర్వాహకులు ఉన్నారు. అదే సమయంలో మదురైలో బలగాలు మోహరిస్తుండడంతో ఉత్కంఠను రెట్టింపుచేసింది. నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించి జల్లికట్టుకు ప్రయత్నం సాగితే అడ్డుకునే రీతిలో ఈ బలగాలు రంగంలోకి దిగినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా నిర్ణయం వెలువడని పక్షంలో భారీ ఎత్తున ఆగ్రహ జ్వాల ఎక్కడ బయలు దేరుతుందోనన్న ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తగానే బలగాల్ని మోహరించిట్టుగా పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే, రాష్ట్ర ప్రభుత్వ తుది నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ ఓ వైపు ఉంటే, మరో వైపు ఈ వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరిగా తమ అధికారాల్ని ప్రయోగించలేదని డీఎంకే ఎంపీ కనిమొళి, టీఎన్‌సీసీ నేత ఈవీకేఎస్ ఇళంగోవన్, పీఎంకే నేత రాందాసు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక, అఖిల భారత నాడాలుం మక్కల్ కట్చి నేత, సినీ నటుడు కార్తిక్ మదురైలో జరిగిన నిరసనలో మీడియాతో మాట్లాడుతూ, సంస్కృతి సంప్రదాయాల్ని వివరిస్తూ, జంతు సంరక్షణ సంస్థలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ మనో భావాల్ని పట్టించుకోని పార్టీలను, మనం ఎందుకు గౌరవించాలంటూ తీవ్రంగా ధ్వజమెత్తారు.
సంకెళ్లు తెగేనా?
Published Fri, Jan 15 2016 2:42 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM
Advertisement
Advertisement