కబేళాలకు జల్లికట్టు ఎద్దులు | Jallikattu bulls for sale | Sakshi
Sakshi News home page

కబేళాలకు జల్లికట్టు ఎద్దులు

Published Mon, May 19 2014 11:36 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM

Jallikattu bulls for sale

చెన్నై, సాక్షి ప్రతినిధి : కన్నబిడ్డలతో సమానంగా గ్రామీణులు పెంచుకున్న జల్లికట్టు ఎద్దులు కబేళాలకు తరలిపోతున్నాయి. జల్లికట్టు క్రీడపై సుప్రీంకోర్టు విధించిన నిషేధంతో ఏర్పడిన ఈ పరిణామం గ్రామస్తులను కన్నీరు పెట్టిస్తోంది. తమిళుల సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకుని నిషేధ ఉత్తర్వులను పునఃపరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్రంలోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో జల్లికట్టు ఎద్దుల యజమానులకు ప్రతిష్ట, గౌరవం ఉండేది. వాటి పోషణకు ఎంతైనా ఖర్చుపెట్టేవారంటే జల్లికట్టు ప్రాధాన్యతను ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
 
 తమిళనాడులో ఈ క్రీడకు అంతటి క్రేజుంది. ప్రతి ఏటా పొంగల్ పండుగలో భాగంగా అనేక గ్రామాల్లో జల్లికట్టు నిర్వహించడం ఆనవాయితీ. మదురై, శివగంగై, తేనీ, దిండుగల్లు, పుదుక్కోట్టై, తంజావూరు జిల్లాల్లో జల్లికట్టు ప్రసిద్ధి చెంది నది. ముఖ్యంగా మదురై జిల్లా అలంగానల్లూరులో ఏడాదికోసారి జరిగే జల్లికట్టు ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందింది. రెచ్చిపోయి పరుగులు తీసే దున్నపోతులను అదుపులోకి తీసుకునే ఈ జల్లికట్టు క్రీడ సుమారు 400 ఏళ్లుగా సాగుతోంది. క్రీడను తిలకించేందుకు విదేశీయులు సైతం గ్రామాలకు చేరుకుంటారు. యువకులు జల్లికట్టుతో తీవ్రగాయాలపాలవడంతోపాటూ ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతున్నారు. ఆ దున్నను అదుపులోకి తీసుకున్న వ్యక్తిని మళ్లీ జల్లికట్టు జరిగేవరకు వీరుడిగా పరిగణిస్తారు. ఇక్కడి యువత ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందింది.
 
 ఇది ఒక రకంగా వంశపారంపర్య సాహసక్రీడగా గ్రామీణుల జీవితంలో మమేకమైందని చెప్పవచ్చు. జల్లికట్టు కోసం కాడెద్దులను ఎంతో ఖర్చుకోర్చి పెంచుతారు. అయితే జల్లికట్టు క్రీడా సమయంలో అవి రె చ్చిపోయి ప్రవర్తించేందుకు కళ్లలో కారంపొడి చల్లుతారనే అపవాదు ఉంది. క్రీడల పేరుతో వాటిని హింసించడం చట్టరీత్యానేరమని, జల్లికట్టుపై నిషేధం విధించాలని మేనకాగాంధీ నేతృత్వంలోని జంతు సంక్షేమ సంఘం 2008లో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో స్టే మంజూరైంది. అయితే ప్రభుత్వం మధ్యంతర ఉత్తర్వులను తెచ్చి కొన్ని నిబంధనలకు లోబడి జల్లికట్టును ఏటా నిర్వహిస్తూ వస్తోంది. వాదోపవాదాలు ముగియడంతో జల్లికట్టు క్రీడపై శాశ్వతంగా నిషేధం విధిస్తున్నట్లు ఈనెల 7న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పొంగల్ పండుగల్లో హైలెట్‌గా నిలిచే జల్లికట్టు ఇక  ఉండదనే సత్యం వారి హృదయాలను కలచివేసింది.
 
 కబేళాలకు తరలిపోతున్న ఎద్దులు
 జల్లికట్టుకోసమే ప్రత్యేకంగా పెంచుకునే కాడెద్దులు కబేళాలకు తరలిపోతున్నాయి. జల్లికట్టే లేనపుడు వీటితో పనేమిటని అమ్మకానికి పెడుతున్నారు. ఖర్చు, కష్టానికోర్చి పెంచుకోవడం వల్ల ఆర్థిక భారం పెరుగుతుందని గ్రామీణులు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ పశువులు పోలీసులు, చెక్‌పోస్టు అధికారుల కళ్లుగప్పి కేరళకు చేరుకుంటున్నాయి. అక్కడ కోతకు గురై వివిధ హోటళ్ల అతిథుల కోసం మాంసంగా మారిపోతున్నాయి. ముద్దు మురిపెంగా పెంచుకున్న కాడెద్దులు కసాయికి అమ్మివేస్తూ కన్నీళ్లు కారుస్తున్నారు. జల్లికట్టు క్రీడలో పాల్గొనే అరుదైన జాతిరకం ఎద్దులు ఒకప్పుడు దేశం మొత్తంమీద 10 లక్షలుండేవి. వివిధ కారణాల వల్ల అవి క్రమేణా అంతరించిపోతూ ప్రస్తుతం అవి లక్షకు చేరుకున్నాయి. కోతకు గురికావడం వల్ల ఈ కొద్ది సంఖ్యకూడా తరిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళనవ్యక్తం చేస్తున్నారు.
 
 నిషేధంతో నాలుగు రకాల నష్టాలు
 జల్లికట్టుపై విధించిన నిషేధం వల్ల నాలుగు రకాల నష్టాలు వెన్నంటి ఉన్నాయని జల్లికట్టు నిర్వాహకులు మురుగేశన్ చెప్పారు. ఏడాదికోసారి జల్లికట్టులో పాల్గొనే ఎద్దులు వ్యవసాయానికి వినియోగిస్తామని, కబేళాలకు తరలిపోవడం వల్ల ప్రాచీన విధానంలో పొలం దున్నడం అంతరించిపోతుందని పేర్కొన్నారు. ఇంకా అనేక గ్రామాలకు బస్సు సౌకర్యం లేక ఎడ్ల బండ్లపైనే ప్రయాణిస్తున్నారు, ఇది కనుమరుగై రవాణా సమస్య ఏర్పడుతుందని చెప్పారు. తద్వారా పల్లెఉత్పత్తులు పట్టణానికి చేరడం ఒక సమస్యగా మారి ధరలు పెరుగుతాయన్నారు. సరుకుల రవాణాకు, ప్రయాణాలకు ఎడ్ల బండ్ల వినియోగం వల్ల ఏటా రూ.20 వేల కోట్ల ఇంధనం ఆదా ఇక అదనపు భారం అవుతుందని చెప్పారు. నగరాల్లో ఉండే ధనికులకు గుర్రపు పందాలు, క్రికెట్, ఫుట్‌బాల్, గోల్ఫ్ వంటి ఎన్నో క్రీడలు ఉన్నాయని, పల్లె ప్రాంత ప్రజలు జల్లికట్టు వంటి సంబరాలతోనే సరిపెట్టుకుంటారని తెలిపారు. నిషేధం వల్ల ఆ సంతోషం కరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. సుప్రీంలో ప్రభుత్వ పిటిషన్‌జల్లికట్టు నిషేధంపై రాష్ట్ర ప్రజల్లో నిరసన వ్యక్తం కావడంతో ప్రభుత్వం స్పందించింది. జల్లికట్టు కేవలం ఒక వినోద ప్రధానమైన క్రీడకాదు, తమిళుల సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నంగా పరిగణించాలని ప్రభుత్వం పేర్కొంటూ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలుచేసింది. జల్లికట్టుపై జారీచేసిన తీర్పును పునఃసమీక్షించి నిషేధాన్ని ఎత్తివేయాలని విజ్ఞప్తి చేసింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement