‘జల్లికట్టు’ చెల్లుతుందా?
న్యూఢిల్లీ: క్రూరమైన జంతు హింస కిందకు వచ్చే ‘జల్లికట్టు’ పోటీలను కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కేవలం ఒక నోటీసుతో అనుమతించడం సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘించడం కాదా? కోర్టు ధిక్కార నేరం కిందకు రాదా? రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, అక్కడి పాలకపక్ష పార్టీ ఏఐఏడిఎంకేతో పెట్టుకోవాలని ఆశిస్తున్న బీజేపీ చేసింది రాజకీయం కాదా? కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజకీయపు రంగు పులుముతారనే కాబోలు! మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్, హర్యానా, కేరళ, గుజరాత్‌లలో కూడా ఎడ్ల పందాలను కూడా అదే నోటీసులో అనుమతించింది.
2011లోనే కేంద్ర పర్యావరణ, అటవి మంత్రిత్వ శాఖ ఎలాంటి ప్రదర్శనకు, పోటీలకు ఉపయోగించకూడదనే జంతువుల జాబితాలో ఎద్దులను కూడా చేరుస్తూ ఓ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ జాబితాలో వున్న జంతువులతో జల్లికట్టు లాంటి పోటీలను నిర్వహిస్తే క్రూరత్వం నుంచి జంతువుల పరిరక్షణ చట్టం కింద శిక్షలు విధిస్తారు. దీన్ని తమిళనాడు హైకోర్టులోనూ, ఆ తర్వాత సుప్రీం కోర్టులోనూ సవాల్ చేసింది. ఫలితంగా 2014, మే నెలలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సబబేనంటూ సుప్రీం కోర్టు తీర్పు చెపింది. జంతువులను క్రూరంగా హింసించే పోటీలను ఎందుకు నిషేధించకూడదని కూడా పిటీషనర్లను ప్రశ్నించింది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు జల్లికట్టు లాంటి సంప్రదాయ పోటీలను అనుమతించాలనుకుంటే సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలి. అలా చేయకుండా 2011లో నోటిఫికేషన్ ద్వారానే పోటీలను నిషేధించారుగదా! ఇప్పుడే అలాంటి నోటిఫికేషన్ ద్వారానే తిరిగి అనుమతిస్తామన్న ధోరణిని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరించింది. 2014లో సుప్రీం కోర్టు తీర్పు వెలువడినందున ప్రస్తుతం ఈ అంశం సుప్రీం కోర్టు పరిధిలోనే ఉందని, ప్రభుత్వ నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ ఎవరు సుప్రీం కోర్టుకు లేదా హైకోర్టుకు వెళ్లిన స్టే ఇవ్వడం ఖాయమని న్యాయనిపుణులు తెలియజేస్తున్నారు. ఇది కచ్చితంగా సుప్రీం కోర్టు తీర్పును కేంద్రం ఉల్లంఘించడమేనని వారంటున్నారు. కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదనుకుంటే పార్లమెంట్‌కు నిర్ణయం తీసుకునే అధికారం ఉంది. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు లేవుకనుక ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడిదంతా జరిగే వ్యవహారం కాదనుకున్న మోదీ ప్రభుత్వం నోటిఫికేషన్ పద్ధతిని ఆశ్రయించింది. దీనిపై స్టే ఉత్తర్వులు కోర్టు జారీచేసే అవకాశాలున్నాయని కూడా కేంద్రానికి తెలుసు. మరెందుకు జారీ చేసినట్లు? జల్లికట్టు పోటీలు తమిళనాడులో సంక్రాంతికి జరుగుతాయి. ఈసారికి అవి జరిగితేచాలు కేంద్రానికి తన రాజకీయ ప్రయోజనం నెరవేరినట్లే. అందుకనే ఈ తొందరపాటు. సుప్రీం కోర్టు చెప్పినట్లే జంతువులను హింసించకుండా తమిళనాడులో ఏనాడు జల్లికట్టు పోటీలు జరిగిన దాఖలాలు లేవు. సాధు జంతువులైన ఎద్దులు ఆగ్రహావేశాలతో రంకెలు వేయాలంటే వాటిని హింసించక తప్పదు. లేకపోతే పోటీలు రక్తికట్టవు. ఎద్దులను కర్రలతో కొడతారని, కత్తులతో పొడుస్తారని, తోకలు విరిచేస్తారని, కొమ్ములను విరిచేందుకు కూడా ప్రయత్నిస్తారని, కొన్నింటికి మద్యం కూడా తాగిస్తారని తమిళనాడులో ఈ పోటీలను నిర్వహించే వారే చెబుతుండడం గమనార్హం.